10. పదియవ అధ్యాయము

ఇంద్రునికి బ్రహ్మహత్యాదోషము సంక్రమించుట.

ఇంద్ర ఉవాచ
సర్వం వ్యాప్తమిదం దేవాః వృత్రేన జగదవ్యయమ్।
న హ్యస్య సదృశం కించిద్ ప్రతిఘాతాయ యద్భవేత్॥ 1
ఇంద్రుడు ఇలా అన్నాడు.
దేవతలారా! వృత్రాసురుడు మొత్తం జగత్తును ఆక్రమించాడు. అతనిని సంహరించటానికి తగిన అస్త్రశస్త్రాలు లేవు. (1)
సమర్థో హ్యభవం పూర్వమ్ అసమర్థోఽస్మి సాంప్రతమ్।
కథం ను కార్యం భద్రం వః దుర్ధర్షః స హి మే మతః॥ 2
ఇంతకుమునుపు నేను సమర్థుడినే, ఇప్పుడు అసమర్థుడినయ్యాను. వృత్రుడు అజేయుడని నా అభిప్రాయం. మనకు ఎలా క్షేమం కలుగుతుంది? (2)
తేజస్వీ చ మహాత్మా చ యుద్ధే చామితవిక్రమః।
గ్రసేత్ త్రిభువనం సర్వం సదేవాసురమానుషమ్॥ 3
వృత్రుడు తేజస్వి, మహాకాయుడు. యుద్ధంలో అతని పరాక్రమం అంతులేనిది. అతడు దేవతలను, రాక్షసులను, మానవులను, మూడులోకాలను జయించగలడు. (3)
తస్మాద్ వినిశ్చయమిమం శ్రుణుధ్వం త్రిదివౌకసః।
విష్ణోః క్షయముపాగమ్య సమేత్య చ మహాత్మనా।
తేన సమ్మంత్ర్య వేత్స్యామః వధోపాయం దురాత్మనః॥ 4
కనుక దేవతలారా! నా నిశ్చయాన్ని వినండి. మనం శ్రీ మహావిష్ణువు నివాసానికి వెళ్లి ఆయనను కలిసి, మాట్లాడి ఈ దుర్మార్గుని చంపే ఉపాయాన్ని తెలుసుకుందాం. (4)
సం.వి. క్షయం = ఇల్లు(నీల),
శల్య ఉవాచ
ఏవముక్తే మఘవతా దేవాః సర్షిగణాస్తదా।
శరణ్యం శరణం దేవం జగ్ముర్విష్ణుం మహాబలమ్॥ 5
శల్యుడు ఇలా అన్నాడు-
ధర్మరాజా! ఇంద్రుడు ఇలా పలికి దేవతలు, మహర్షులతో కలిసి సమస్తప్రాణులకూ శరణ్యుడు, మహాబలశాలి అయిన శ్రీమహావిష్ణువు నివాసానికి వెళ్లాడు. (5)
ఊచుశ్చ సర్వే దేవేశం విష్ణుం వృత్రభయార్దితాః।
త్రయో లోకాస్త్వయాక్రాంతా త్రిభిర్విక్రమణైః పురా॥ 6
ఇంద్రాదిదేవతలు వృత్రాసురుని వలన భయంతో దేవేశుడైన విష్ణువును చేరి ఇలా అన్నారు. దేవా పూర్వం నీవు మూడు వైపులా పెరిగి త్రివిక్రముడవై మూడులోకాలను ఆక్రమించావు. (6)
అమృతం చాహతం విష్ణో దైత్యాశ్చ నిహతా రణే।
బలిం బద్ధ్వా మహాదైత్యం శక్రో దైవాధిపః కృతః॥ 7
విష్ణూ! నీవు మోహినీరూపాన్ని ధరించి రాక్షసులనుండి అమృతాన్ని కాపాడావు. యుద్ధంలో రాక్షసులను సంహరించావు. రాక్షసశ్రేష్ఠుడైన బలిని బంధించి ఇంద్రుని దేవతల రాజుగా చేశావు. (7)
త్వం ప్రభుః సర్వదేవానాం త్వయా సర్వమిదం తతమ్।
త్వం హి దేవో మహాదేవ సర్వలోకనమస్కృతః॥ 8
దేవతలందరికి నీవే ప్రభువువు. నీవే అంతటా వ్యాపించి ఉన్నావు. మహాదేవా! అన్నిలోకాలూ నమస్కరించే దేవుడివి నీవేకదా! (8)
గతిర్భవ త్వం దేవానాం సేంద్రాణామమరోత్తమ।
జగద్ వ్యాప్తమిదం సర్వం వృత్రేణాసురసూదన॥ 9
అమరోత్తమా! ఇంద్రాదిదేవతలందరికీ నీవే దిక్కు. అసురసంహారకా! వృత్రాసురుడు జగత్తు అంతా వ్యాపించి ఉన్నాడు. (9)
విష్ణు రువాచ
అవశ్యం కరణీయం మే భవతాం హితముత్తమమ్।
తస్మాదుపాయం వక్ష్యామి యథాసౌ న భవిష్యతి॥ 10
విష్ణువు ఇలా అన్నాడు-
దేవతలారా! మీ అందరికీ గొప్ప మేలు తప్పక చెయ్యాలి. దానికి వృత్రాసురుడు నశించే ఉపాయం చెపుతాను. (10)
గచ్ఛధ్వం సర్షిగంధర్వాః యత్రాసౌ విశ్వరూపపధృక్।
సామ తస్య ప్రయుంజధ్వం తత ఏవం విజేష్యథ॥ 11
మీరు అందరు ఋషులు, గంధర్వులతో సహా విశ్వరూపధారి అయిన ఆ వృత్రుడు ఉన్నచోటికి వెళ్లండి. సంధి చేసుకొనే ఉపాయాన్ని ప్రయోగించండి. తరువాత వానిని గెలుద్దాం. (11)
భవిష్యతి జయో దేవాః శక్రస్య మమ తేజసా।
అదృశ్యశ్చ ప్రవేక్ష్యామి వజ్రే హ్యస్యాయుధోత్తమే॥ 12
దేవతలాలా! నా తేజస్సుతో ఇంద్రునికి జయం లభిస్తుంది. నేను వజ్రాయుధంలోనికి అదృశ్యరూపంలో ప్రవేశిస్తాను. (12)
గచ్ఛధ్వమృషిభిః సార్ధం గంధర్వైశ్చ సురోత్తమాః।
వృత్రస్య సహ శక్రేణ సంధిం కురుత మా చిరమ్॥ 13
సురోత్తములారా! ఋషులు, గంధర్వులతో కలిసి త్వరగా వృత్రుని దగ్గరకు వెళ్లండి. ఇంద్రునితో సంధి కుదర్చండి. (13)
శల్య ఉవాచ
ఏవముక్తే తు దేవేన ఋషయస్త్రిదశాస్తథా।
యయుః సమేత్య సహితాః శక్రం కృత్వా పురస్సరమ్॥ 14
శల్యుడు ఇలా అన్నాడు.
ధర్మరాజా! శ్రీ మహావిష్ణువు ఇలా అనగానే ఋషులు, దేవతలు అందరు కలసి దేవేంద్రుని ముందుంచుకొని వృత్రాసురుని వద్దకు వెళ్లారు. (14)
సమీపమేత్య చ యదా సర్వ ఏవ మహౌజసః।
తం తేజసా ప్రజ్వలితం ప్రతపంతం దిశో దశ॥ 15
గ్రసంతమివ లోకాంస్త్రీన్ సూర్యాచంద్రమసౌ యథా।
దదృశుస్తే తతో వృత్రం శక్రేణ సహ దేవతాః॥ 16
మహాకాంతిమంతుడు, తన తేజస్సుతో పది దిక్కులనూ వెలిగిస్తూ, వేడెక్కిస్తూ సూర్యచంద్రులవలె మూడులోకాలను వెలుగులతో నింపుతున్న వృత్రుణ్ణి ఇంద్రునితో సహా దేవతలందరు దగ్గరకు వెళ్లి చూశారు. (15,16)
ఋషయోఽథ తతోఽభ్యేత్య వృత్రమూచుః ప్రియం వచః।
వ్యాప్తం జగదిదం సర్వం తేజసా తవ దుర్జయ॥ 17
అప్పుడు ఋషులు వృత్రుని ముందుకు చేరి 'దుర్జయా!నీ తేజస్సు ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది'. అంటూ ప్రియమైన మాటలు మాట్లాడారు. (17)
న చ శక్నోషి నిర్జేతుం వాసవం బలినాం వర।
యుధ్యతోశ్చాపి వాం కాలః వ్యతీతః సుమహానిహ॥ 18
మహాబలా! ఇప్పటివరకు నీవు ఇంద్రుణ్ణి గెలవలేకపోయావు. మీ ఇద్దరికీ యుద్ధంతో చాలా కాలం గడిచిపోయింది. (18)
పీడ్యంతే చ ప్రజాః సర్వాః సదేవాసురమానుషాః।
సఖ్యం భవతు తే వృత్ర శక్రేణ సహ నిత్యదా॥ 19
దేవతలు, రాక్షసులు, మానవులు మొత్తం ప్రజలు మీ వలన బాధపడుతున్నారు. వృత్రా! ఇంద్రునితో నీకు శాశ్వతమైన సఖ్యం కుదరాలి. (19)
అవాప్స్యసి సుఖం త్వం చ శక్రలోకాంశ్చ శాశ్వతాన్।
ఋషివాక్యం నిశమ్యాథ వృత్రః స తు మహాబలః॥ 20
ఉవాచ తానృషీన్ సర్వాన్ ప్రణమ్య శిరసాసురః।
సర్వే యూయం మహాభాగాః గంధర్వాశ్చైవ సర్వశః॥ 21
యద్ బ్రూథ తచ్ఛ్రుతం సర్వం మమాపి శృణుతానఘాః।
సంధిః కథం వై భవితా మమ శక్రస్య చోభయోః।
తేజసోర్హి ద్వయోర్దేవాః సఖ్యం వై భవితా కథమ్॥ 22
నీవు సుఖాన్ని, శాశ్వతమైన ఇంద్రలోకాలను పొందుతావు. ఋషుల మాటలను విని మహాబలుడైన వృత్రుడు వారందరికీ తలవంచి నమస్కరించి ఇలా అన్నాడు. దేవతలారా! మహర్షులారా1 గంధర్వులారా! మీరు చెప్పినదంతా విన్నాను. పుణ్యాత్ములారా! నా మాట కూడా వినండి. నాకూ, దేవేంద్రునికీ సంధి ఎలా కుదురుతుంది? ఇద్దరు పరాక్రమవంతులకు మైత్రి ఎలా సాధ్యమౌతుంది? (20,21,22)
ఋషయ ఊచుః
సకృత్ సతాం సంగతం లిప్సితవ్యం
తతః పరం భవితా భవ్యమేవ।
నాతిక్రామేత్ సత్పురుషేణ సంగతం
తస్మాత్ సతాం సంగతం లిప్సితవ్యమ్॥ 23
ఋషులు ఇలా అన్నారు.
వృత్రా! సత్పురుషులు ఎప్పుడూ మొదట మైత్రిని కోరుకోవాలి. దాని వలన క్షేమమే జరుగుతుంది. సజ్జనులు ఎన్నడూ మైత్రిని కాదనకూడదు. అందువలన సాధుజనులు మైత్రినే కోరుకోవాలి. (23)
దృఢం సతాం సంగతం చాపి నిత్యం
బ్రూయాచ్చార్థం హ్యర్థకృచ్ఛ్రేషు ధీరః।
మహార్థవత్ సత్పురుషేణ సంగతం
తస్మాత్ సంతం న జిఘాంసేత ధీరః॥ 24
సజ్జనుల మైత్రి దృఢంగా, చిరస్థాయిగా ఉంటుంది. వారు ధీరులై కష్టకాలంలో ప్రయోజనకరమైన కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు. సాధుజనులతో స్నేహం గొప్పలాభాలను సమకూరుస్తుంది. అందువలన ధీరుడు సత్పురుషుని చంపుకో కూడదు. (24)
ఇంద్రః సతాం సమ్మతశ్చ నివాసశ్చ మహాత్మనామ్।
సత్యవాదీ హ్యనింద్యశ్చ ధర్మవిత్ సూక్ష్మనిశ్చయః॥ 25
ఇంద్రుడు సత్పురుషులచే గౌరవింప బడుతున్నాడు. మహాత్ములకు ఆశ్రయమిస్తున్నాడు. సత్యవాది, మెచ్చదగినవాడు. ధర్మజ్ఞుడు, సూక్ష్మంగా ఆలోచించి నిశ్చయించగలవాడు. (25)
తేన తే సహ శక్రేణ సంధిర్భవతు నిత్యదా।
ఏవం విశ్వాసమాగచ్ఛ మా తే ఽభూద్ బుద్ధిరన్యథా॥ 26
అంతటివాడైన ఇంద్రునితో నీకు శాశ్వతమైన సంధి అగుగాక! మా మాటపై విశ్వాసం ఉంచు. దీనికి విరుద్ధమైన ఆలోచన చేయకు. (26)
శల్య ఉవాచ
మహర్షివచనం శ్రుత్వా తానువాచ మహాద్యుతిః।
అవశ్యం భగవంతో మే మాననీయాస్తపస్వినః॥ 27
శల్యుడు ఇలా అన్నాడు.
ధర్మరాజా! మహర్షుల మాటలు విని మహాతేజస్వి అయిన వృత్రుడు వారితో ఇలా అన్నాడు. మహాత్ములారా! తపశ్శక్తిసంపన్నులైన మీరు నాకు పూజనీయులు. (27)
బ్రవీమి యదహం దేవాః తత్ సర్వం క్రియతే యది।
తతః సర్వం కరిష్యామి యదూచుర్మాం ద్విజర్షభాః॥ 28
దేవతలారా! నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు జరిగేటట్లు చేస్తే తరువాత బ్రహ్మర్షులు నాకు చెప్పినదంతా చేస్తాను. (28)
న శుష్కేణ న చార్ద్రేణ నాశ్మనా న చ దారుణా।
న శస్త్రేణ న చాస్త్రేణ న దివా న తథా నిశి॥ 29
వధ్యో భవేయం విప్రేంద్రాః శక్రస్య సహ దైనతైః।
ఏవం మే రోచతే సంధిః శక్రేణ సహ నిత్యదా॥ 30
విప్రోత్తములారా! ఎండినది, తడిసినది, రాతితో, కొయ్యతో చేసినది అయిన ఏ వస్తువుతోనూ, శస్త్రంతో, అస్త్రంతో పగలుకాని, రాత్రికాని ఇంద్రాది దేవతలు నన్ను చంపకూడదు. ఇలా అయితే ఇంద్రునితో శాశ్వతమైన సంధిని నేను కోరుతున్నాను. (29,30)
బాఢమిత్యేవ ఋషయః తమూచుర్భరతర్షభ।
ఏవం వృత్తే తు సంధానే వృత్రః ప్రముదితోఽభవత్॥ 31
భరతశ్రేష్ఠా! అప్పుడు ఋషులు అలాగేనని అతనికి అంగీకారాన్ని తెలిపారు. ఈ విధంగా సంధి కుదిరినందుకు వృత్రుడు చాలా సంతోషించాడు. (31)
యుక్తః సదాభవచ్చాపి శక్రో హర్షసమన్వితః।
వృత్రస్య వధసంయుక్తాన్ ఉపాయానన్వచింతయత్॥ 32
ఇంద్రుడు ఆనందంగా వృత్రునితో కలిసి ఉంటున్నప్పటికీ అతనిని చంపటానికి తగిన ఉపాయాలు ఆలోచిస్తూనే ఉన్నాడు. (32)
ఛిద్రాన్వేషీ సముద్విగ్నః సదా వసతి దేవరాట్।
స కదాచిత్ సముద్రాంతే సమపశ్యన్మహాసురమ్॥ 33
ఇంద్రుడు ఎల్లప్పుడూ వృత్రుని చంపటానికి అవకాశాలను ఆరాటంతో వెతుకుతూనే ఉన్నాడు. ఒకనాడు వృత్రాసురుని సముద్రం ఒడ్డున చూశాడు. (33)
సంధ్యాకాల ఉపావృత్తే ముహూర్తే చాతిదారుణే।
తతః సంచింత్య భగవాన్ వరదానం మహాత్మనః॥ 34
సంధ్యేయం వర్తతే రౌద్రా న రాత్రుర్దివసం న చ।
వృత్రశ్చావశ్యవధ్యోఽయం మమ సర్వహరో రిపుః॥ 35
యది వృత్రం న హన్మ్యద్య వంచయిత్వా మహాసురమ్।
మహాబలం మహాకాయం న మే శ్రేయో భవిష్యతి॥ 36
అప్పుడు దారుణమైన ముహూర్తంతో సంజవేళ అయింది. మహర్షులు వృత్రునికి ఇచ్చిన వరాలను ఇంద్రుడు గుర్తుచేసుకొన్నాడు. ఇది భయంకరమైన సంధ్యాకాలం. పగలూ కాదు. రాత్రీకాదు. నా సర్వస్వాన్ని దొంగిలించిన శత్రువైన ఈ వృత్రుని వెంటనే చంపాలి. మహాబలుడు, మహాకాయుడు అయిన వీణ్ణి, ఇప్పుడు మోసంతో చంపకపోతే నాఖు శ్రేయస్సు కలుగదు. (34,35 36)
ఏవం సంచింతయన్నేవ శక్రో విష్ణుమనుసమరన్।
అథ ఫేనం తదాపశ్యత్ సముద్రే పర్వతోపమమ్॥ 37
ఇలా ఆలోచిస్తూ ఇంద్రుడు విష్ణువును తలుచుకొంటూ ఎదురుగా సముద్రంలో పెద్దకొండలా ఉన్న నురుగును చూశాడు. (37)
నాయం శుష్కో న చార్ద్రోఽయం న చ శస్త్రమిదం తథా।
ఏనం క్షేప్స్యామి వృత్రస్య క్షణాదేవ నశిష్యతి॥ 38
ఈ నురుగు పొడిదికాదు, తడిదికాదు, అలాగే ఆయుధమూ కాదు. దీనిని వృత్రునిపై విసురుతాను. క్షణకాలంలో నశిస్తాడు. (38)
స వజ్రమథ ఫేనం తం క్షిప్రం వృత్రే నిసృష్టవాన్।
ప్రవిశ్య ఫేనం తం విష్ణుః అథ వృత్రం వ్యనాశయత్॥ 39
అలా అనుకొంటూ ఇంద్రుడు వజ్రాయుధంతో కూడిన ఆ నురుగును వృత్రునిపైకి తటాలున విసిరాడు. విష్ణువు దానిలో ప్రవేశించి వానిని చంపేశాడు. (39)
నిహతే తు తతో వృత్రే దిశో వితిమిరాఽభవన్।
ప్రవవౌ చ శివో వాయుః ప్రజాశ్చ జహృషుస్తథా॥ 40
వృత్రుడు చావగానే అన్ని దిక్కుల చీకట్లు తొలగిపోయాయి. చల్లని గాలి వీచింది. ప్రజలందరూ సంతోషించారు. (40)
తతో దేవాః సగంధర్వాః యక్షరక్షోమహోరగాః।
ఋషయశ్చ మహేంద్రం తమ్ అస్తువన్ వివిధైః స్తవైః॥ 41
అప్పుడు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మహాసర్పాలు, మహర్షులు అందరు మహేంద్రుని వివిధస్తోత్రాలతో స్తుతించారు. (41)
నమస్కృతః సర్వభూతైః సర్వభూతాన్యసాంత్వయత్।
హత్వా శత్రుం ప్రహృష్టాత్మా వాసవః సహ దైవతైః॥ 42
శత్రువును సంహరించి ఇంద్రుడు దేవతలతో సహా సంతోషించాడు. తనకు నమస్కరించిన ప్రాణులన్నిటిని ఆదరించాడు. (42)
విష్ణుం త్రిభువనశ్రేష్ఠం పూజయామాస ధర్మవిత్।
తతో హతే మహావీర్యే వృత్రే దేవభయంకరే॥ 43
అనృతేనాభిభూతోఽభూత్ శక్రః పరమదుర్మనాః।
త్రైశీర్షయాభిభూతశ్చ స పూర్వం బ్రహ్మహత్యయా॥ 44
ధర్మజ్ఞుడైన ఇంద్రుడు మహావీరుడు, దేవ భయంకరుడు అయిన వృత్రుని చంపిన తరువాత త్రిభువన శ్రేష్ఠుడైన విష్ణువును పూజించాడు. అసత్యదోషంతో ఇంద్రుడు మనసులో చాలా క్రుంగిపోయాడు. అతడు పూర్వం ఇలాగే త్రిశీర్షుని చంపి బ్రహ్మహత్యాదోషంతో బాధపడ్డాడు. (43,44)
సోఽంతమాశ్రిత్య లోకానాం నష్టసంజ్ఞో విచేతనః।
న ప్రాజ్ఞాయత దేవేంద్రః త్వభిభూతః స్వకల్మషైః॥ 45
అతడు లోకాల చివరకు వెళ్లి, స్పృహ, కదలిక కోల్పోయాడు. తన పాపాలతో కించపడిన దేవేంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. (45)
ప్రతిచ్ఛన్నోఽవసచ్చాప్సు చేష్టమాన ఇవోరగః।
తతః ప్రణష్టే దేవేంద్రే బ్రహ్మహత్యాభయార్దితే॥ 46
భూమిః ప్రధ్వస్తసంకాశా నిర్వృక్షా శుష్కకాననా।
విచ్ఛిన్నస్రోతసో నద్యః సరాంస్యనుదకాని చ॥ 47
ఇంద్రుడు బురదపాములాగా నీటిలో దాగి ఉన్నాడు. బ్రహ్మహత్యాభయంతో దేవేంద్రుడు కనపడకుండా పోయేసరికి భూమి తేజస్సును కోల్పోయింది. చెట్లులేవు, అడవులు ఎండిపోయాయి. నదుల ప్రవాహాలు ఆగిపోయాయి. చెఱువులలో నీరు లేదు. (46,47)
సంక్షోభశ్చాపి సత్త్వానామ్ అనావృష్టికృతోఽభవత్।
దేవాశ్చాపి భృశం త్రస్తాః తథా సర్వే మహర్షయః॥ 48
ప్రాణులన్నిటికి అనావృష్టి కారణంగా సంక్షోభం ఏర్పడింది. దేవతలు, మహర్షులంతా కూడా అలాగే మిక్కిలి భయపడ్డారు. (48)
అరాజకం జగత్ సర్వమ్ అభిభూతముపద్రవః।
తతో భీతాఽభవన్ దేవాః కో నో రాజా భవేదితి॥ 49
దివి దేవర్షయశ్చాపి దేవరాజవినాకృతాః।
న స్మ కశ్చన దేవానాం రాజ్యే వై కురుతే మతిమ్॥ 50
మొత్తం జగత్తు అరాజకం కావటంతో పెద్ద ఉపద్రవం ఏర్పడింది. దాంతో 'మనకు ఇప్పుడు రాజు ఎవడు అవుతాడు' అని దేవతలు భయపడ్డారు. దేవేంద్రుడు లేనందుకు దేవఋషులు భయపడ్డారు. దేవతల రాజ్యమైన స్వర్గంలో ఏ ఒక్కనికీ బుద్ధి పని చేయడం లేదు. (49,50)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి వృత్రవధే ఇంద్రవిజయోనామ దశమోఽధ్యాయః॥ 10 ॥
శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగపర్వమను ఉపపర్వమున వృత్రవధయందు ఇంద్రవిజయము అను పదవ అధ్యాయము (10)