9. తొమ్మిదవ అధ్యాయము

ఇంద్రుడు త్రిశిరుని వధించుట, వృత్రాసురుని ఉత్పత్తి.

యుధిష్ఠిర ఉవాచ
కథమింద్రేణ రాజేంద్ర సభార్యేణ మహాత్మనా।
దుఃఖం ప్రాప్తం పరం ఘోరమ్ ఏతదిచ్ఛామి వేదితుమ్॥ 1
యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు.
శల్యరాజా! ఇంద్రుడు భార్యతో సహా గొప్ప దుఃఖాన్ని ఎలా పొందాడు? ఇది తెలుసుకోవాలనుకొంటున్నాను. (1)
శల్య ఉవాచ
శృణు రాజన్ పురావృత్తమ్ ఇతిహాసం పురాతనమ్।
సభార్యేణ యథా ప్రాప్తం దుఃఖమింద్రేణ భారత॥ 2
శల్యుడు ఇలా అన్నాడు. యుధిష్ఠిరా! ఇంద్రుడు భార్యతో సహా దుఃఖాన్ని పొందిన వృత్తాంతం - పూర్వం ఎప్పుడో జరిగిన పురాతనమైన ఇతిహాసం విను. (2)
త్వష్టా ప్రజాపతిర్హ్యాసీద్ దేవశ్రేష్ఠో మహాతపాః।
స పుత్రం వై త్రిశిరమ్ ఇంద్రద్రోహాత్ కిలాసృజత్॥ 3
దేవశ్రేష్ఠుడు, మహాతపస్వి అయిన త్వష్ట ప్రజాపతి అయినాడు. అతడు ఇంద్రుని మీద ఉన్న ద్రోహబుద్ధితో మూడుతలలున్న కొడుకును సృష్టించాడు. (3)
ఐంద్రం స ప్రార్థయత్ స్థానం విశ్వరూపో మహాద్యుతి।
తైస్త్రిభిర్వదనైర్ఘోరైః సూర్యేందుజ్వలనోపమైః॥ 4
భయంకరమైన మూడు ముఖాలతో సూర్య, చంద్ర, అగ్ని తేజస్సులతో వెలుగొందుతున్న విశ్వరూపుడు అనే పేరుగల ఆ కుర్రవాడు ఇంద్రపదవి కావాలని కోరాడు. (4)
వేదానేకేన సోఽధీతే సురామేకేన చాపిబత్।
ఏకేన చ దిశః సర్వాః పిబన్నివ నిరీక్షతే॥ 5
వాడు ఒక ముఖంతో వేదాలు చదివాడు. మరొక ముఖంతో సురాపానం చేశాడు. ఇంకొక ముఖంతో దశదిశలనూ జుఋకుంటున్నట్టుగా చూస్తున్నాడు. (5)
స తపస్వీ మృదుర్దాంతః ధర్మే తపసి చోద్యతః।
తపస్తస్య మహత్ తీవ్రం సుదుశ్చరమరిందమ॥ 6
మహావీరా! ఆ విశ్వరూపుడు ధర్మ, తపస్సులయందు దీక్షపూని, మృదుస్వభావుడై ఇంద్రియనిగ్రహంతో కష్టసాధ్యమూ, తీవ్రమూ అయిన తపస్సు చేశాడు. (6)
తస్య దృష్ట్వా తపోవీర్యం సత్యం చామితతేజసః।
విషాదమగమచ్చక్రః ఇంద్రోఽయం మా భవేదితి॥ 7
మహాతేజస్వి అయిన విశ్వరూపుని తపశ్శక్తిని చూచి ఇతడు ఇంద్రుడు కాకూడ దని ఇంద్రుడు దుఃఖపడ్డాడు. (7)
కథం సజ్జేచ్చ భోగేషు న చ తప్యేన్మహత్ తపః।
వివర్ధమానస్త్రిశిరాః సర్వం హి భువనం గ్రసేత్॥ 8
ఈ త్రిశిరుడు ఎలా భోగాసక్తుడు అవుతాడు? తపస్సు ఎలా మానుకుంటాడు? ఇతడు ఇలా వృద్ధిచెందితే ముల్లోకాలనూ మింగేస్తాడు. (8)
ఇతి సంచింత్య బహుధా బుద్ధిమాన్ భరతర్షభ।
ఆజ్ఞాపయత్ సోఽప్సరసః త్వష్టృపుత్రప్రలోభనే॥ 9
భరతశ్రేష్ఠా! బుద్ధిశాలి అయిన ఇంద్రుడు ఇలా ఆలోచించి విశ్వరూపుని ఆకర్షించటానికి అప్సరసలను నియమించాడు. (9)
యథా స సజ్జేత్ త్రిశిరాః కామభోగేషు వై భృశమ్।
క్షిప్రం కురుత గచ్ఛధ్వం ప్రలోభయత మా చిరమ్॥ 10
త్రిశిరుడైన విశ్వరూపుడు కామభోగాలలో త్వరగా పూర్తిగా మునిగేటట్లు చెయ్యండి. అతనిని ఆకర్షించండి. త్వరగా వెళ్లండి. (10)
శృంగారవేషాః సుశ్రోణ్యః హారైర్యుక్తా మనోహరైః।
హావభావసమాయుక్తాః సర్వాః సౌందర్యశోభితాః॥ 11
ప్రలోభయత భద్రం వః శమయధ్వం భయం మమ।
అస్వస్థం హ్యాత్మనాఽత్మానం లక్షయామి వరాంగనాః।
భయం తన్మే మహాఘోరం క్షిప్రం నాశయతాబలాః॥ 12
సుందరీమణులారా! శృంగారవేషాలు, అందమైన హారాలు ధరించి, సౌందర్యశోభితలై చక్కని హావభావాలతో అతనిని లొంగదీసుకోండి. నా భయం పోగొట్టండి. నాకే నేను జబ్బుపడినట్లు అనిపిస్తోంది. మహాఘోరమైన నా భయాన్ని చిటికెలో పోగొట్టండి. (11,12)
వి॥సం॥ హావాః = శృంగార చేష్టలు
భావాః = హర్షాదిచిత్తవికారాలు (నీల)
అప్సరస ఊచుః
తథా యత్నం కరిష్యామః శక్ర తస్య ప్రలోభనే।
యథా నావాప్స్యసి భయం తస్మాద్ బలినిషూదన॥ 13
అప్సరసలు ఇలా అన్నారు.
దేవేంద్రా! నీకు భయం తొలగిపోయేటట్లు మేము విశ్వరూపుడిని వశపరచుకొనే ప్రయత్నం చేస్తాం. (13)
నిర్దహన్నివ చక్షుర్భ్యాం యోఽసావాస్తే తపోనిధిః।
తం ప్రలోభయితుం దేవ గచ్ఛామః సహితా వయమ్॥ 14
యతిష్యామో వశే కర్తుం వ్యపనేతుం చ తే భయమ్।
ఆ తపోనిధి చూపులతోనే బూడిద చేసేటట్లు ఉన్నాడు. మేమందరం అతనిని మోహపెట్టటానికి వెళుతున్నాం. నీ భయం పోగొట్టి అతనిని వశపరచుకొనే ప్రయత్నం చేస్తాం. (14)
శల్య ఉవాచ
ఇంద్రేణ తాస్త్వనుజ్ఞాతాః జగ్ముస్త్రిశిరసోఽంతికమ్।
తత్ర తా వివిధైర్భావైఃలోభయంత్యో వరాంగనాః॥ 15
నిత్యం సందర్శయామాసుఃతథైవాంగేషు సౌష్ఠవమ్।
నాభ్యగచ్ఛత్ ప్రహర్షం తాః స పశ్యన్ సుమహాతపాః॥ 16
ఇంద్రియాణి వశే కృత్వా పూర్వసాగరసంనిభః।
శల్యుడు ఇలా అన్నాడు. ఇంద్రుని అనుమతితో అప్సరసలి అందరూ త్రిశిరుడైన విశ్వరూపుని అనేక శృంగారభావాలతో ఆకర్షించటానికి అతనివద్దకు వెళ్లారు. నిరంతరంగా అతనికి తమ శరీరసౌష్ఠవాన్ని చూపించారు. అయినా మహాతపస్వి అయిన త్రిశిరుడు వారిని చూచి ఆకర్షితుడు కాలేదు. సాగరగంభీరుడై ఇంద్రియాలను అదుపులో పెట్టుకొన్నాడు. (15, 16 1/2)
తాస్తు యత్నం పరం కృత్వా పునః శక్రముపస్థితాః॥ 17
కృతాంజలిపుటాః సర్వాః దేవరాజమథాబ్రువన్।
న స శక్యః సుదుర్ధర్షః ధైర్యాచ్చాలయితుం ప్రభో॥ 18
యత్ తే కార్యం మహాభాగ క్రియతాం తదనంతరమ్।
అప్సరసలు చాలా ప్రయత్నం చేసి, ఇంద్రుని వద్దకు తిరిగివచ్చి నమస్కరించి ఇలా అన్నారు. 'ప్రభూ! ధీరుడు, మహాతపస్వి అయిన త్రిశిరుని కదిలించటం మా వల్ల కాలేదు. వేరే మార్గం అనుసరించండి.' (17,18 1/2)
సంపూజ్యాప్సరసః శక్రః విసృజ్య చ మహామతిః॥ 19
చింతయామాస తస్యైవ వధోపాయం యుధిష్ఠిర।
యుధిష్ఠిరా! మేధావి అయిన ఇంద్రుడు అప్సరసలకు వీడ్కోలు పలికి విశ్వరూపుని సంహరించే ఉపాయం ఆలోచించాడు. (19 1/2)
స తూష్ణీం చింతయన్ వీరః దేవరాజః ప్రతాపవాన్॥ 20
వినిశ్చితమతిర్ధీమాన్ వధే త్రిశిరసోఽభవత్।
ఇంద్రుడు కొద్దిసేపు ఆలోచించి, త్రిశిరుని చంపటానికి స్థిరనిశ్చయానికి వచ్చాడు. (20 1/2)
వజ్రమస్య క్షిపామ్యద్య స క్షిప్రం న భవిష్యతి॥ 21
శత్రుః ప్రవృద్ధో నోపేక్ష్యః దుర్బలోఽపి బలీయసా।
ఇప్పుడే వజ్రాయుధాన్ని విసురుతాను. క్షణంలో త్రిశిరుడు మరణిస్తాడు. శత్రువు ఎంత బలహీనుడైనా ఉపేక్షించరాదు. (21 1/2)
శాస్త్రబుద్ధ్యా వినిశ్చిత్య కృత్వా బుద్ధిం వధే దృఢామ్॥ 22
అథ వైశ్చానరనిభం ఘోరరూపం భయావహమ్।
మొమోచ వజ్రం సంక్రుద్ధః శక్రస్త్రిశిరసం ప్రతి॥ 23
స పపాత హతస్తేన వజ్రేణ దృఢమాహతః।
పర్వతస్యేవ శిఖరం ప్రణున్నం మేదినీతలే॥ 24
ఇంద్రుడు(రాజనీతి) శాస్త్రబుద్ధితో త్రిశిరుని చంపటానికి గట్టి నిశ్చయం చేసుకొన్నాడు. ఘోరాకారమూ, భయంకరమూ, అగ్నితుల్యమీ అయిన వజ్రాయుధాన్ని కోపంతో అతనిపైకి విసిరాడు. బలమైన వజ్రాయుధం దెబ్బకు అతడు విరిగిపడిన పర్వతశిఖరంలా నేలకూలాడు. (22,23,24)
తం తు వజ్రహతం దృష్ట్వా శయానమచలోపమమ।
న శర్మ లేభే దేవేంద్రః దీపితస్తస్య తేజసా॥ 25
వజ్రాయుధం దెబ్బకు కూలిన పర్వతంలా పడిఉన్న త్రిశిరుని చూచి కూడా తేజస్సును గమనించి ఇంద్రుడు శాంతిని పొందలేకపోయాడు. (25)
హతోఽపి దీప్తతేజాః సః జీవన్నివ హి దృశ్యతే।
ఘాతితస్య శిరాంస్యాజౌ జీవంతీవాద్భుతాని వై॥ 26
తేజశ్శాలి యైన విశ్వరూపుడు మరణించినా సజీవంగానే కనబడుతున్నాడు. వజ్రపు దెబ్బ తగిలిన అతని మూడుతలలు అద్భుతంగా బ్రతికిఉన్నట్లు అనిపిస్తున్నాయి. (26)
తతోఽతిభీతగాత్రస్తు శక్ర ఆస్తే విచారయన్।
అథాజగామ పరశుం స్కంధేనాదాయ వర్థకిః॥ 27
దానితో మిక్కిలి భయపడిన ఇంద్రుడు విచార మగ్నుడైనాడు. అప్పుడు గండ్రగొడ్డలి బుజాణ పెట్టుకొని విశ్వకర్మ అక్కడికి వచ్చాడు. (27)
తదరణ్యం మహారాజ యత్రాస్తేఽసౌ నిపాతితః।
స భీతస్తత్ర తక్షాణం ఘటమానం శచీపతిః॥ 28
అపశ్యదబ్రవీచ్చైనం సత్వరం పాకశాసనః।
క్షిప్రం ఛింధి శిరాంస్యస్య కురుష్వ వచనం మమ॥ 29
ధర్మరాజా! త్రిశిరుని చంపిన అడవిలోకి విశ్వకర్మ రావటం చూచి ఇంద్రుడు భయపడ్డాడు. ఇతని తలలి తెగనరుకు, నేను చెప్పినట్లు చెయ్యి! అని ఆజ్ఞాపించాడు. (28,29)
తక్షో వాచ
మహాస్కంధో భృశం హ్యేషః పరశుర్న భవిష్యతి।
కర్తుం చాహం న శక్ష్యామి కర్మ సద్భిర్విగర్హితమ్॥ 30
తక్షుడు ఇలా అన్నాడు. ఇతడు చాలా బలమైనవాడు. ఈ దేహాన్ని నరకటానికి ఈ గొడ్డలి సరిపోదు. సజ్జనులు నిందించే ఈ పనిని నేను చేయలేను. (30)
ఇంద్ర ఉవాచ
మా భైస్త్వం శీఘ్రమేతద్ వై కురుష్వ వచనం మమ।
మత్ప్రసాదాద్ధి తే శస్త్రం వజ్రకల్పం భవిష్యతి॥ 31
ఇంద్రుడు ఇలా అన్నాడు. విశ్వకర్మా! భయపడకు. నా మాటను వెంటనే ఆచరించు. నా అనుగ్రహంవలన నీ ఆయుధం వజ్రసమానం అవుతుంది. (31)
తక్షోవాచ
కం భవంతమహం విద్యాం ఘోరకర్మాణమద్య వై।
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం తత్త్వేన కథయస్వ మే॥ 32
తక్షుడు ఇలా అన్నాడు. ఘోరమైన హత్యచేసిన నీవు ఎవడివో నాకు ఎలా తెలుస్తుంది. నేను ఈ సత్యాన్ని తెలుసుకోవాలను కుంటున్నాను. చెప్పు. (32)
ఇంద్ర ఉవాచ
అహమింద్రో దేవరాజః తక్షన్ విదితమస్తు తే।
కురుష్వైతద్ యథోక్తం మే తక్షన్ మాత్ర విచారయ॥ 33
ఇంద్రుడు ఇలా అన్నాడు.
విశ్వకర్మా! నేను దేవతల రాజును, ఇంద్రుడిని, తెలుకో. నేను చెప్పినట్లు చెయ్యి, విచారించకు. (33)
తక్షోవాచ
క్రూరేణ నాపత్రపసే కథం శక్రేహ కర్మణా।
ఋషిపుత్రమిమం హత్వా బ్రహ్మహత్యాభయం న తే॥ 34
తక్షుడు ఇలా అన్నాడు. దేవరాజా! ఋషికుమారుని చంపి క్రూరమైన పనిచేసిన నీకు సిగ్గు, బ్రహ్మహత్యాభయం ఎలా లేకుండా పోయాయి? (34)
శక్రోవాచ
పశ్చాద్ ధర్మం చరిష్యామి పావనార్థం సుదుశ్చరమ్।
శత్రురేష మహావీర్యః వజ్రేణ నిహతో మయా॥ 35
ఇంద్రుడు ఇలా అన్నాడు. ముందు బలవంతుడైన శత్రువును వజ్రంతో చంపేశాడు. తరువాత పాపవిముక్తుణ్ణి కావటానికి ఎవరూ చేయలేనంతగా ధర్మానుష్ఠానం చేస్తాను. (35)
అద్యాపి చాహముద్విగ్నః తక్షన్నస్మాద్ బిభేమి వై।
క్షిప్రం ఛింధి శిరాంసి త్వం కరిష్యేఽనుగ్రహం తవ॥ 36
విశ్వకర్మా! ఇతను మరణించినా ఇప్పటికీ నేను భయపడుతూనే ఉన్నాను. త్వరగా ఇతని తలలు నరుకు. నేను నీకు మేలు చేస్తాను. (36)
శిరః పశోస్తే దాస్యంతి భాగం యజ్ఞేషు మానవాః।
ఏష తేఽనుగ్రహస్తక్షన్ క్షిప్రం కురు మమ ప్రియమ్॥ 37
మనుష్యులు చేసే హింసాప్రధానమైన కామయజ్ఞాలలో పశువు తలను నీకు భాగంగా ఇస్తాను. తక్షా! ఇది నేను నీకు ఇస్తున్న వరం. త్వరగా నేను చెప్పిన పని చెయ్యి. (37)
శల్య ఉవాచ
ఏతచ్ఛ్రుత్వాతు తక్షా సః మహేంద్రవచనాత్ తదా।
శిరాంస్యథ త్రిశిరసః కుఠారేణాచ్ఛివత్ తదా॥ 38
శల్యుడు ఇలా అన్నాడు.
మహేంద్రుని మాటలు విన్న విశ్వకర్మ్ అతని ఆజ్ఞననుసరించి త్రిశిరుని మూడుతలలను గండ్రగొడ్డలితో నరికేశాడు. (38)
నికృత్తేషు తతస్తేషు నిష్క్రామన్నండజాస్త్వథ।
కపింజలా స్తిత్తిరాశ్చ కలవింగాశ్చ సర్వశః॥ 39
తెగిన త్రిశిరుని తలలనుండి కపింజలములు, తిత్తిరములు, కలవింగములు అనే పేర్లుగల పక్షులు వెలుపలికి వచ్చి అంతటా వ్యాపించాయి. (39)
వి॥ సం॥ కపింజలములు - నల్లతిత్తిరిపక్షులు (అర్జున)
తిత్తిరములు - బూడిదరంగు తిత్తిరపక్షులు. (సర్వజ్ఞ)
యేన వేదానధీతే స్మ పిబతే సోమమేవ చ।
తస్మాద్వక్త్రాద్వినిశ్చేరుః క్షిప్రం తస్య కపింజలాః॥ 40
విశ్వరూపుడు ఏ ముఖంతో వేదాధ్యయనం, సోమరసపానం చేశాడో ఆ ముఖం నుండి కపింజల పక్షులు తటాలున వెలుపలికి వచ్చాయి. (40)
యేన సర్వా దిశో రాజన్ పిబన్నివ నిరీక్షతే।
తస్మాద్ వక్త్రాద్ వినిశ్చేరుః తిత్తిరాస్తస్య పాండవ॥ 41
ధర్మరాజా! త్రిశిరుడు ఏ ముఖంతో దిక్కులన్నిటినీ త్రాగుతున్నట్లు చూశాడో ఆ ముఖం నుండి తిత్తిరిపక్షులు వెలువడ్డాయి. (41)
యత్ సురాపం తు తస్మాసీద్ వక్త్రం త్రిశిరసస్తదా।
కలవింగాః సముత్సేతుః శ్యేనాశ్చ భరతర్షభ॥ 42
సురాపానం చేసిన త్రిశిరుని మూడోముఖం నుండి కలవింగ పక్షులు (పిచ్చుకలు), గ్రద్దలు వెలువడ్డాయి. (42)
వి॥సం॥ ఈ కథ జరిగే నాటికి సురాపానానికి శుక్రశాపం లేదు కనుక బ్రాహ్మణత్వానికి తపస్సుకు, అధ్యయనానికి సురపానం దోషం కాదు. (సర్వజ్ఞ)
తతస్తేషు నికృత్తేషు విజ్వరో మఘవానథ।
జగామ త్రిదివం హృష్టఃతక్షాపి స్వగృహం యయౌ॥ 43
విశ్వరూపుని తలలను విశ్వకర్మ నరుకగానే ఇంద్రుడు చల్లబడ్డాడు. స్వర్గానికి వెళ్లాడు. విశ్వకర్మ కూడా సంతోషంగా తన యింటికి చేరుకున్నాడు. (43)
(తక్షాపి స్వగృహం గత్వా నైవ శంసతి కస్యచిత్।
అథైనం నాభిజానంతి వర్షమేకం తథాగతమ్॥
అథ సంవత్సరే పూర్ణే భూతాః పశుపతేః ప్రభో।
సమాక్రోశంత మఘవాన్ నః ప్రభుర్బ్రహ్మహో ఇతి॥
తత ఇంద్రో వ్రతం ఘోరమ్ అచరత్ పాకశాసనః।
తపసా చ స సంయుక్తః సహ దేవైర్మరుద్గణైః॥
సముద్రేషు పృథివ్యాం చ వనస్పతిషు స్త్రీషు చ।
విభజ్య బ్రహ్మహత్యాం చ తాన్ వరైరప్యయోజయత్॥
వరదస్తు వరం దత్త్వా పృథివ్యై సాగరాయ చ।
వనస్పతిభ్యః స్త్రీభ్యశ్చ బ్రహ్మహత్యాం నునోద తామ్॥
తతస్తు శుద్ధో భగవాన్ దేవైర్లోకైశ్చ పూజితః।
ఇంద్రస్థానముపాతిష్ఠత్ పూజ్యమానో మహర్షిభిః॥)
విశ్వకర్మ ఇంటికి వెళ్లి జరిగిన సంగతి ఎవరికీ చెప్పలేదు. ఎవరికీ తెలియకుండా ఒక సంవత్సరమ్ గడిచింది. అప్పుడు పరమేశ్వరుని భూతగణాలు "మా ప్రభువైన ఇంద్రుడు బ్రహ్మహంత" అని ఆక్రోశించాయి. దానితో ఇంద్రుడు తీవ్రమైన వ్రతం చేశాడు. దేవతలు, మరుద్గణాలతో కలిసి తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మహత్యాదోషాన్ని సముద్రాలకు, భూమికి, వృక్షాలకు, స్త్రీలకు వంచి వారందరికీ వరాలు ఇచ్చాడు. తన బ్రహ్మహత్యాదోషాన్ని పోగొట్టుకొన్నాడు. పరిశుద్ధుడై, దేవతలు, మహర్షులు" లోకాలు అన్నింటి పూజలు అందుకొని సింహాసనాన్ని అధిరోహించాడు.
మేనే కృతార్థమాత్మానం హత్వా శత్రుం సురారిహా।
త్వష్టా ప్రజాపతిః శ్రుత్వా శక్రేణాథ హతం సుతమ్॥ 44
రాక్షసనాశకుడైన ఇంద్రుడు తన శత్రువైన విశ్వరూపుని చంపి కృతార్థుడ నయ్యానని ఆనందించాడు. త్వష్టప్రజాపతి తనకొడుకు ఇంద్రునిచే చంపబడ్డాడని విని కోపంతో కళ్లెఱ్ఱజేసి ఇలా అన్నాడు. (44)
తప్యమానం తపో నిత్యం క్షాంతం దాంతం జితేంద్రియమ్।
వినాపరాధేన యతః పుత్రం హింసితవాన్ మమ॥ 45
ఓర్పు, నిగ్రహం, కలిగి, ఇంద్రియాలను జయించి, ఎల్లప్పుడూ తపస్సు చేస్తూ ఏ తప్పూ చేయని నా పుత్రుని ఎందుకు హింసించాడు? (45)
తస్మాచ్ఛక్రవినాశాయ వృత్రముత్పాదయామ్యహమ్।
లోకాః పశ్యంతు మే వీర్యం తపసశ్చ బలం మహత్॥ 46
అందువలన ఇంద్రుని నాశనం కొరకు నేను వృత్రుని సృష్టిస్తాను. లోకాలన్నీ నా పరాక్రమాన్నీ, తపస్సు యొక్క మహాబలాన్నీ చూస్తాయి. (46)
స చ పశ్యతు దేవేంద్రః దురాత్మా పాపచేతనః।
ఉపస్పృశ్య తతః క్రుద్ధః తపస్వీ సుమహాయశాః॥ 47
అగ్నౌ హుత్వా సముత్పాద్య ఘోరం వృత్రమువాచ హ।
ఇంద్రశత్రో వివర్ధస్వ ప్రభావాత్ తపసో మమ॥ 48
పాపాత్ముడూ, దురాత్ముడూ అయిన ఇంద్రుడు కూడా చూస్తాడు. అంటూ ఆచమనం చేసి కీర్తిశాలి. తపస్వీ అయిన త్వష్ట క్రోధంతో అగ్నిలో హోమం చేసి ఘోరమైన వృత్రుని సృష్టించి "నా తపః ప్రభావంతో ఇంద్రశత్రువు వర్ధిల్లుగాక" అన్నాడు. (47,48)
సోఽవర్ధత దివం స్తబ్ధ్వా సూర్యవైశ్వానరోపమః।
కిం కరోమీతి చోవాచ కాలసూర్య ఇవోదితః॥ 49
వృత్రుడు సూర్యాగ్నిహోత్రసమానుడై వెలుగొందుతూ ప్రళయకాల సూర్యునివలె ఆకాశాన్ని ఆక్రమించి "నేను ఏం చెయ్యాలి?" అని అడిగాడు. (49)
శక్రం జహీతి చాప్యుక్తః జగామ త్రిదివం తతః।
తతో యుద్ధం సమభవద్ వృత్రవాసవయోర్మహత్॥ 50
"ఇంద్రుని చంపు" అని పలికి త్వష్ట స్వర్గానికి వెళ్లాడు. అప్పుడు వృత్రునికీ, ఇంద్రునికీ పెద్దయుద్ధం జరిగింది. (50)
సంక్రుద్ధయోర్మహాఘోరం ప్రసక్తం కురుసత్తమ।
తతో జగ్రాహ దేవేంద్రం వృత్రో వీరః శతక్రతుమ్॥ 51
అపావృత్యాక్షిపద్ వక్త్రే శక్రం కోపసమన్వితః।
గ్రస్తే వృత్రేణ శక్రే తు సంభ్రాంతాస్త్రిదివేశ్వరాః॥ 52
ధర్మరాజా! కోపంతో ఉన్న వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. నూరు యజ్ఞాలు చేసిన ఇంద్రుని వీరుడైన వృత్రుడు బంధించాడు. తీవ్రమైన కోపంతో దేవేంద్రుని పట్టుకొని నోరుతెరిచి మ్రింగేశాడు. వృత్రుడు ఇంద్రుని మ్రింగగానే దిక్పాలాది ముఖ్యదేవతలు కంగారు పడ్డారు. (51,52)
అసృజంస్తే మహాసత్త్వాః జృంభికాం వృత్రనాశినీమ్।
విజృంభమాణస్య తతః వృత్రస్యాస్యాదపావృతాత్॥ 53
స్వాన్యంగాన్యభిసంక్షిప్య నిష్క్రాంతో బలనాశనః।
తతః ప్రభృతి లోకస్య జృంభికా ప్రాణసంశ్రితా॥ 54
శక్తిసంపన్నులైన దేవతలు వృత్రాసురుని చంపటానికి జృంభికను సృష్టించారు. ఆవులించటానికి తెరిచిన వృత్రాసురుని నోట్లోనుండి అవయవాల పరిమాణాన్ని తగ్గించుకొని ఇంద్రుడు బయటికి వచ్చేశాడు. ఆ నాటి నుండి ప్రాణుల ఆవులింత ప్రాణాలతో ముడిపడి ఉంది. (53,54)
జహృషుశ్చ సురాః సర్వే శక్రం దృష్ట్వా వినిఃసృతమ్।
తతః ప్రవవృతే యుద్ధం వృత్రవాసవయోః పునః॥ 55
వృత్రాసురుని నోట్లోనుండి బయటపడిన ఇంద్రుని చూచి దేవతలంతా ఆనందించారు. మళ్లీ వృత్రునికీ ఇంద్రునికీ యుద్ధం కొనసాగింది. (55)
సంరబ్ధయోస్తదా ఘోరం సుచిరం భరతర్షభ।
యదా వ్యవర్ధత రణే వృత్రో బలసమన్వితః॥ 56
త్వష్టుస్తేజోబలావిద్ధః తదా శక్రో న్యవర్తత।
నివృత్తే చ తదా దేవాః విషాదమగమన్ పరమ్॥ 57
భరతశ్రేష్ఠా! వృత్రాసుర దేవేంద్రులకు కొనసాగుతున్న భయంకరయుద్ధంలో వృత్రుడు బలసమన్వితుడై వృద్ధిచెందుతున్నాడు. త్వష్టతేజోబలంతో దెబ్బతిన్న ఇంద్రుడు ఓటమితో వెనుదిరిగాడు. అదిచూచి దేవతలందరు చాలా దుఃఖపడ్డారు. (56,57)
సమేత్య సహ శక్రేణ త్వష్టుస్తేజోవిమోహితాః।
ఆమంత్రయంత తే సర్వే మునిభిః సహ భారత॥ 58
కిం కుర్యామితి వై రాజన్ విచింత్య భయమోహితాః।
జగ్ముః సర్వే మహాత్మానం మనోభిర్విష్ణుమవ్యయమ్।
ఉపవిష్టా మందరాగ్ర్యే సర్వే వృత్రవధేప్సవః॥ 59
ధర్మరాజా! త్వష్ట్ఱ్ఱ్య్తేజోరూపమైన వృత్రాసురుని దెబ్బకు కలతచెందిన ఇంద్రుడు, దేవతలు, మహర్షులు అందరూ సమావేశమై ఏం చెయ్యాలో ఆలోచించి, వృత్రాసుర సంహారం కోసం మనోరూపంగా శ్రీమహావిష్ణువును ఆశ్రయించి మందరపర్వత శిఖరంపై కూర్చున్నారు. (58,59)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి ఇంద్రవిజయోనామ నవమోఽధ్యాయః॥ 9 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున, సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున ఇంద్రవిజయమను తొమ్మిదవ అధ్యాయము (9)
(దాక్షిణాత్య అధికపాఠం 6 శ్లోకాలతో కలిపి మొత్తం 65 శ్లోకాలు)