57. ఏబదియేడవ అధ్యాయము

కృపాచార్యుడు యుద్ధభూమినుండి తొలగుట.

వైశంపాయన ఉవాచ
దృష్ట్వా వ్యూఢాన్యనీకాని కురూణాం కురునందన।
తత్ర వైరాటి మామంత్ర్య పార్థో వచనమబ్రవీత్॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! మోహరించియున్న కౌరవసేనను చూసి అర్జునుడు ఉత్తరునితో ఇలా అన్నాడు. (1)
జాంబూనదమయీ వేదీ ధ్వజే యస్య ప్రదృశ్యతే।
తస్య దక్షిణతో యాహి కృపః శారద్వతో యతః॥ 2
'ఉత్తరా! కాంచనమయవేదిక ధ్వజపతాకపై ప్రకాశిస్తున్న వాడు శరద్వంతుని కొడుకు కృపుడు. ఆయనకు దక్షిణంగా రథాన్ని నడిపించు.' (2)
వైశంపాయన ఉవాచ
ధనంజయవచః శ్రుత్వా వైరాటి స్త్వరితస్తతః।
హయాన్ రజతసంకాశాన్ హేమభాండానచోదయత్॥ 3
వైశంపాయను డిలా అన్నాడు. అర్జునుని మాటలు విని విరాటరాజకుమారుడు ఉత్తరుడు స్వర్ణాభరణాలు కలిగి వెండిలా ప్రకాశిస్తున్న ఆ గుఱ్ఱాలను అక్కడనుండి కదిలించాడు. (3)
ఆనుపూర్వ్యాత్ తు తత్సర్వమ్ ఆస్థాయ జవముత్తమమ్।
ప్రాహిణీచ్చంద్రసంకాశాన్ కుపితానివ తాన్ హయాన్॥ 4
గుఱ్ఱాలను వేగంగా నడపటంలోని పద్ధతిని మొత్తాన్ని క్రమంగా అనుసరించి ఉత్తరుడు కోపించినట్లు అనిపిస్తూ చంద్రునిలా ప్రకాశిస్తున్న గుఱ్ఱాలను అదిలించాడు. (4)
స గత్వా కురుసేనాయాః సమీపం హయకోవిదః।
పునరావర్తయామాస తాన్ హయాన్ వాతరంహసః॥
ప్రదక్షిణముపావృత్య మండలం సవ్యమేవ చ॥ 5
గుఱ్ఱాలను నడపటంలో నేర్పుగల ఆ ఉత్తరుడు వాయు వేగంతో కురుసేనను సమీపించి మరలా వెనుకకు మరలించాడు. ప్రదక్షిణంగా మండలాకారంగా రథాన్ని త్రిప్పి ఎడమవైపు నుండి చుట్టి వచ్చాడు. (5)
కురూన్ సమ్మోహయామాస మత్స్యో యానేన తత్త్వవిత్॥ 6
కృపస్య రథమాస్థాయ వైరాటిరకుతోభయః।
ప్రదక్షిణముపావృత్య తస్థే తస్యాగ్రతో బలీ॥ 7
అశ్వగమనరహస్యాలు తెలిసిన ఉత్తరకుమారుడు తన రథగమనంతో కౌరవసేనను భ్రమకు లోనుజేశాడు. బలిష్ఠుడైన ఉత్తరుడు నిర్భయంగా కృపుని రథాన్ని సమీపించి, దానికి ప్రదక్షిణం చేసి, కృపున కెదురుగా నిలిచాడు. (6,7)
తతోఽర్జునః శంఖవరం దేవదత్తం మహారవమ్।
ప్రదధ్మౌ బలమాస్థాయ నామ విశ్రావ్య చాత్మనః॥ 8
తరువాత అర్జునుడు భీకరధ్వనితో, శంఖాలలో ఉత్తమమయిన దేవదత్తాన్ని బలమంతా ఉపయోగించి పూరిస్తూ ముందు తనపేరు వినిపించాడు. (8)
తస్య శబ్దో మహానాసీద్ ధమ్యమానస్య జిష్ణునా।
తథా వీర్యవతా సంఖ్యే పర్వతస్యేవ దీర్యతః॥ 9
ఆ రణభూమిలో జయశీలి, పరాక్రమశాలి అయిన అర్జునుడు పూరించిన దేవదత్తధ్వని బ్రద్దలవుతున్న పర్వతధ్వని వలె భీకరంగా వినిపించింది. (9)
పూజయాంచక్రిరే శంఖం కురవః సహసైనికాః।
అర్జునేన తథా ధ్మాతః శతధా యన్నదీర్యతే॥ 10
అర్జునుడు అంతగా పూరించినా నూరుముక్కలు కాకుండా నిలిచిన ఆ శంఖం గొప్పతనాన్ని కౌరవులు వారిసైనికులు కూడా ప్రశంసించారు. (10)
దివమావృత్య శబ్దస్తు నివృత్తః శుశ్రువే పునః।
సృష్టో మఘవతా వజ్రః ప్రపతన్నివ పర్వతే॥ 11
స్వర్గలోకం దాకా వ్యాపించి తిరిగివచ్చి వినిపించిన ఆ శంఖధ్వని ఇంద్రుడు వదిలిన వజ్రాయుధం పర్వతం మీద పడినప్పుడు వినిపించే శబ్దంలా అనిపించింది. (11)
ఏతస్మిన్నంతరే వీరః బలవీర్యసమన్వితః।
అర్జునం ప్రతి సంరబ్ధః కృపః పరమదుర్జయః॥ 12
అమృష్యమాణస్తం శబ్దం కృపః శారద్వతస్తథా।
అర్జునం ప్రతి సంరబ్ధః యుద్ధార్థీ స మహారథః।
మహోదధిజమాదాయ దధ్మౌ వేగేన వీర్యవాన్॥ 13
కృపాచార్యుడు వీరుడు, బలపరాక్రమ సమన్వితుడు. ఆయనను ఓడించడం చాలా కష్టం. అర్జునుడు శంఖం పూరించిన తర్వాత కుపితుడయిన శరద్వత్సుతుడైన ఆ కృపాచార్యుడు అర్జునుని శంఖనాదాన్ని సహించలేకపోయాడు. అందుకే ఆ మహారథుడు యుద్ధం చేయాలన్న అభిలాషతో తన శంఖాన్ని వేగంగా పూరించాడు. (12,13)
స తు శబ్దేన లోకాంస్త్రీన్ ఆవృత్య రథినాం వరః।
ధనురాదాయ సుమహత్ జ్యాశబ్దమకరోత్తదా॥ 14
రథిశ్రేష్ఠుడైన ఆ కృపాచార్యుడు తన శంఖనాదంతో మూడు లోకాలను చుట్టి వచ్చి, వింటిని తీసికొని అల్లెత్రాటిని మీటి గొప్పగా టంకారధ్వని చేశాడు. (14)
తౌ రథౌ సూర్యసంకాశౌ యోత్స్యమానౌ మహాబలౌ।
శారదావివ జీమూతౌ వ్యరోచేతాం వ్యవస్థితౌ॥ 15
ఆ మహారథులిద్దరూ - అర్జునకృపాచార్యులు - మహాబలులు, సూర్యతేజస్సుగలవారు. యుద్ధసన్నద్ధులై ఇద్దరూ శరత్కాల మేఘాలవలె ప్రకాశించారు. (15)
తతః శారద్వతస్తూర్ణం పార్థం దశభిరాశుగైః।
వివ్యాధ పరవీరఘ్నం నిశితైర్మర్మభేదిభిః॥ 16
అపుడు కృపాచార్యుడు మర్మభేదకాలైన పది వాడి బాణాలతో శత్రుసంహారకుడైన అర్జునుని తీవ్రంగా కొట్టాడు. (16)
పార్థోఽపి విశ్రుతం లోకే గాండీవం పరమాయుధమ్।
వికృష్య చిక్షేప బహూన్ నారాచాన్ మర్మభేదినః॥ 17
అర్జునుడు కూడా లోకవిఖ్యాతమై తన పరమాయుధమైన గాండీవాన్ని లాగి మర్మభేదకాలైన అనేకశరాలను ప్రయోగించాడు. (17)
తాన్ ప్రాప్తాన్ శితైర్బాణైః నారాచాన్ రక్తభోజనాన్।
కృపశ్ఛిచ్ఛేద పార్థస్య శతశోఽథ సహస్రశః॥ 18
కానీ అర్జునుడు ప్రయోగించిన నెత్తురు త్రాగే ఆ వాడిబాణాలను కృపాచార్యుడు వందలు, వేలు ముక్కలుగా నరికివేశాడు. (18)
తతః పార్థస్తు సంక్రుద్ధః చిత్రాన్ మార్గాన్ ప్రదర్శయన్।
దిశః సంఛాదయన్ బాణైః ప్రదిశశ్చ మహారథః।
ఏకచ్ఛాయమివాకాశమ్ అకరోత్ సర్వతః ప్రభుః॥ 19
అప్పుడు మహారథుడు, సమర్థుడూ అయిన ఆ అర్జునుడు కోపించి బాణప్రయోగంలో చిత్ర పద్ధతులను ప్రదర్శిస్తూ, బాణాలతో దిక్కులనూ, విదిక్కులనూ(మూలలనూ) కప్పుతీ ఆకాశమంతా ఒకే నీడ వ్యాపించినట్లు అంధకారబంధురం చేశాడు. (19)
ప్రాచ్ఛాదయదమేయాత్మా పార్థః శరశతైః కృపమ్।
స శరైరర్దితః క్రుద్ధః శితైరగ్నిశిఖోపమైః॥ 20
లెక్కకందని బుద్ధిబలం కల ఆ అర్జునుడు వందల బాణాలతో కృపాచార్యుని ముంచెత్తాడు. అగ్నిజ్వాలల వంటి వాడిబాణాలతో పీడింపబడి కృపుడు క్రుద్ధుడయ్యాడు. (20)
తూర్ణం దశసహస్రేణ పార్థమప్రతిమౌజసమ్।
అర్దయిత్వా మహాత్మానం ననర్ద సమరే కృపః॥ 21
సాటిలేని పరాక్రమంతో మహాత్ముడైన ఆ అర్జునుని కృపాచార్యుడు పది వేల బాణాలతో యుద్ధంలో పీడించి వెంటనే సింహగర్జనం చేశాడు. (21)
తతః కనకపర్వాగ్రైః వీరః సంనతపర్వభిః।
త్వరన్ గాండీవనిర్ముక్తైః అర్జునస్తస్య వాజినః॥ 22
చతుర్భిశ్చతుర స్తీక్ష్ణైః అవిధ్యత్ పరమేషుభిః।
తే హయా నిశితౌ ర్బాణైః జ్వలద్భిరివ పన్నగైః।
ఉత్పేతుః సహసా సర్వే కృపః స్థానాదథాచ్యవత్॥ 23
అప్పుడు వీరుడైన అర్జునుడు నేర్పుగా, వేగంగా వంగిన కణుపులు, బంగారు పిడులు గల నాలుగుబాణలను గాండీవం నుండి వెలువరించి కృపాచార్యుని నాలుగు గుఱ్ఱాలనూ బాధించాడు. మండిపడుతున్న పాములవలె ఆ వాడి బాణాలు తాకు కృపుని గుఱ్ఱాలు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. కృపుడు తన స్థానం నుండి జారిపోయాడు. (22,23)
చ్యుతం తు గౌతమం స్థానాత్ సమీక్ష్య కురునందనః।
నావిధ్యత్ పరవీరఘ్నః రక్షమాణోఽస్య గౌరవమ్॥ 24
తన స్థానం నుండి జారిన కృపాచార్యుని చూసి, ఆయన గౌరవాన్ని కాపాడే ఉద్దేశ్యంతో శత్రుసంహారకుడయిన అర్జునుడు బాణప్రయోగం చేయలేదు. (24)
స తు లబ్ధ్వా పునః స్థానం గౌతమః సవ్యసాచినమ్।
వివ్యాథ దశభిర్బాణైః త్వరితః కంకపత్రభిః॥ 25
ఆ కృపాచార్యుడు మరల తన స్థానంలో కుదురుకొని పక్షి ఈకలు గల పది బాణాలతో సవ్య సాచిని వేగంగా కొట్టాడు. (25)
తతః పార్థో ధనుస్తస్య భలేఏన నిశితేన హ।
చిచ్ఛేదైకేన భూయశ్చ హస్తావాపమథాహరత్॥ 26
తరువాత అర్జునుడు ఒక వాడి భల్లంతో కృపాచార్యుని ధనుస్సును విరగగొట్టాడు. మరొక బాణంతో కృపుని చేతితొడుగును లాగివేశాడు. (26)
అథాస్య కవచం బాణైః నిశితైర్మర్మభేదిభిః।
వ్యధయన్నచ పార్థోఽస్య శరీరమవపీడయత్॥ 27
ఆపై అర్జునుడు మర్మభేదకాలైన వాడిబాణాలతో కృపాచార్యుని కవచాన్ని చీల్చివేశాడు. కానీ శరీరానికి దెబ్బ తగులనీయ లేదు. (27)
తస్య నిర్ముచ్యమానస్య కవచాత్ కాయ ఆబభౌ।
సమయే ముచ్యమానస్య సర్పస్యేవ తనుర్యథా॥ 28
కవచం నుండి విడివడుతున్న ఆ కృపాచార్యుని శరీరం తగిన కాలంలో కుబుసాన్ని విడుస్తున్న పాము శరీరంలా ప్రకాశించింది. (28)
ఛిన్నే ధనుషి పార్థేన సోఽన్యదాదాయ కార్ముకమ్।
చకార గౌతమః సజ్యం తదద్భుతమివాభవత్॥ 29
అర్జునుడు వింటిని విరిస్తే కృపుడు మరో వింటిని తీసికొని ఎక్కుపెట్టాడు. ఆ దృశ్యం అద్భుతంగా కనిపించింది. (29)
స తదప్యస్య కౌంతేయః చిచ్ఛేద నతపర్వణా।
ఏవ మన్యాని చాపాని బహూని కృపహస్తవత్।
శారద్వతస్య చిచ్ఛేద పాండవః పరవీరహా॥ 30
కౌంతేయుడు ఆ వింటిని కూడా వంగిన కణుపులు గల బాణంతో విరగగొట్టాడు. ఇలా శత్రు సంహారకుడైన అర్జునుడు ఎన్నో చాపాలను కృపాచార్యుడు అందుకొన్నదే తడవుగా విరిచివేశాడు. (30)
సచ్ఛిన్నధనురాదాయ రథశక్తిం ప్రతాపవాన్।
ప్రాహిణోత్ పాండుపుత్రాయ ప్రదీప్తామశనీమివ॥ 31
ఇలా విండ్లన్నీ విరిగిపోగా పరాక్రమశాలి అయిన కృపాచార్యుడు రథశక్తిని చేబట్టి మండుతున్న పిడుగులాగా అర్జునుని పైకి విసిరాడు. (31)
తామర్జున స్తదాఽఽయాంతీం శక్తిం హేమవిభూషితామ్।
వియద్గతాం మహోల్కాభాం చిచ్ఛేద దశభిః శరైః॥ 32
సాపతద్ దశథా ఛిన్నా భూమౌ పార్థేన ధీమతా॥ 33
అంతట అర్జునుడు బంగారు అలంకరణతో పెద్ద ఉల్కలా మీదికి వస్తున్న ఆ శక్తిని పది బాణాలతో ఆకాశమందే నరికివేశాడు.
తెలివిగల ఆ అర్జునుడు వేసిన బాణాలతో అది పదిముక్కలై నేలకూలింది. (32,33)
యుగపచ్పైవ భల్లైస్తు తతః సజ్యధనుః కృపః।
తమాశు నిశితైః పార్థం బిభేద దశభిః శరైః॥ 34
కృపాచార్యుడు మరల వింటినెక్కు పెట్టి ఒక్క పెట్టుగా పది వాడిబాణాలతో అర్జునుని వేగంగా కొట్టాడు. (34)
తతః పార్థో మహాతేజాః విశిఖానగ్నితేజసః।
చిక్షేప సమరే క్రుద్ధః త్రయోదశ శిలాశితాన్॥ 35
అంతట మహాతేజస్వి అయిన అర్జునుడు రణరంగంలో కపించి ఉలులవలె వాడియై, అగ్నిలా మండుతున్న పదమూడు బాణాలను కృపాచార్యునిపై ప్రయోగించాడు. (35)
అథాస్య యుగమేకేన చతుర్భిశ్చతురో హయాన్।
షష్ఠేన చ శిరః కాయాత్ శరేణ రథసారథేః॥ 36
ఆపై అర్జునుడు ఒక బాణంతో కృపాచార్యుని కాడిని, నాల్గు బాణాలతో నాలుగు గుఱ్ఱాలనూ కొట్టాడు. ఆరవ బాణంతో సారథితలను దేహంనుండి వేరు చేశాడు. (36)
త్రిభిస్త్రివేణుం సమరే ద్వాభ్యామక్షం మహారథః।
ద్వాదశేన తు భల్లేన చకర్తాస్య ధ్వజం తథా॥ 37
తతో వజ్రనికాశేన ఫాల్గునః ప్రహసన్నివ।
త్రయోదశేనేంద్రసమః కృపం వక్షస్యవిధ్యత॥ 38
మూడు బాణాలతో రథంపైనున్న వెదురు బొంగులను, రెండు బాణాలతో ఇరుసును, మరొక బాణంతో కృపాచార్యుని ధ్వజాన్ని మహారథుడైన అర్జునుడు ఖండించాడు. తరువాత దేవేంద్ర సమానుడైన ఆ ఫాల్గునుడు వజ్రంతో సమానమైన పదమూడవ బాణంతో అవలీలగా కృపాచార్యుని రొమ్ముపై కొట్టాడు. (37,38)
సచ్ఛిన్నధన్వా విరథః హతాశ్వో హతసారథిః।
గదాపాణిరవప్లుత్య తూర్ణం చిక్షేప తాం గదామ్॥ 39
ఇలా వింటినీ, రథాన్నీ, గుఱ్ఱాలనూ, సారథిని నష్టపోయిన కృపాచార్యుడు గదను చేపట్టి రథంపై నుండి దుమికి అర్జునునిపైకి గదను విసిరాడు. (39)
సా చ ముక్తా గదా గుద్వీకృపేణ సుపరిష్కృతా।
అర్జునేన శరైర్నున్నా ప్రతిమార్గమథాగమత్॥ 40
చక్కగా అలంకరింపబడిన ఆ పెద్ద గదను కృపాచార్యుడు విసరగా అర్జునుడు దానిని బాణాలతో త్రోసివేశాడు. అది వెనుదిరిగి వెళ్ళింది. (40)
తంతు యోధాః పరీప్సంతః శారద్వతమమర్షణమ్।
సర్వతః సమరే పార్థం శరవర్షైరవాకిరన్॥ 41
కృపుడు క్రోధంతో నిండిపోయాడు. ఆయనను రక్షింపగోరిన కౌరవయోధులు రణభూమిలో అన్నివైపుల నుండి అర్జునునిపై బాణవర్షాన్ని కురిపించారు. (41)
తతో విరాటస్య సుతః సవ్యమావృత్య వాజినః।
యమకం మండలం కృత్వా తాన్ యోధాన్ ప్రత్యవారయత్॥ 42
ఉత్తరుడు గుఱ్ఱాలను అప్రదక్షిణంగా, యమక మండలంతో రథాన్ని నడుపుతూ కౌరవసేనను నిలువరించాడు. (42)
తతః కృపముపాదాయ విరథం తే నరర్షభాః।
అపజహ్రుర్మహావేగాః కుంతీపుత్రాద్ ధనంజయాత్॥ 43
విరథుడైన కృపాచార్యుని ఆ నరవరులంతా ర్జునునినుండి దూరంగా వేగంగా కొనిపోయారు. (43)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే కృపాపయానే సప్తపంచాశత్తమోఽధ్యాయః॥ 57 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
ఉత్తరగోగ్రహణమున కృపుని తొలగించుకొని పోవుట అను ఏబది యేడవ అధ్యాయము. (57)
ద్వావంభసి వినిక్షేప్యౌ గాఢం బద్ధ్వా గళే శిలామ్।
ధనినం చాప్రదాతారం దరిద్రం చాతపస్వినమ్॥