56. ఏబదియారవ అధ్యాయము
కృపార్జునుల యుద్ధమును చూచుటకు దేవతలు వచ్చుట.
వైశంపాయన ఉవాచ
తాన్యనీకాన్యదృశ్యంత కురూణాముగ్రధన్వినామ్।
సంసర్పంతే యథా మేఘాః ఘర్మాంతే మందమారుతాః॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆ తర్వాత మేటి విలుకాండ్రు గల కౌరవసేనలు వేసవికాలం చివరిలో చల్లనిగాలులతో కూడిన మేఘాలవలె మెల్లమెల్లగా ముందుకుసాగాయి. (1)
అభ్యాశే వాజినస్తస్థుః సమారూఢాః ప్రహారిణః।
భీమరూపాశ్చ మాతంగాః తోమరాంకుశనోదితాః।
మహామాత్రైః సమారూఢాః విచిత్రకవచోజ్జ్వలాః॥ 2
ఆశ్వికసేన సన్నద్ధమై దగ్గరగా వచ్చి నిలిచింది. మావటివాండ్రు తోమరాంకుశాలతో నడుపుతున్న ఏనుగులు విచిత్రమైన కవచాలతో భయంకరంగా ప్రకాశించాయి. (2)
తతః శక్రః సురగణైః సమారుహ్య సుదర్శనమ్।
సహోపాయాత్ తదా రాజన్ విశ్వాశ్విమరుతాం గణైః॥ 3
రాజా! అప్పుడు దేవేంద్రుడు విశ్వేదేవుల, అశ్వినుల, మరుత్తుల సముదాయంతో ఇతరదేవతలతో సహా విమానమెక్కి శత్రుసేనలు మోహరించియున్న ఆ చోటికి వచ్చాడు. (3)
తద్ దేవయక్ష గంధర్వ మహోరగసమాకులమ్।
శుశుభేఽభ్రవినిర్ముక్తం గ్రహాణామివ మండలమ్॥ 4
దేవతలతో, యక్షులతో, గంధర్వులతో గొప్ప గొప్ప నాగులతో గూడిన ఆ సముదాయం గగనం వీడి పడిన గ్రహమండలం వలె ప్రకాశించింది. (4)
అస్త్రాణాం చ బలం మానుషేషు ప్రయుంజతామ్।
తచ్చ భీమం మహద్ యుద్ధం కృపార్జునసమాగమే।
ద్రష్టుమభ్యాగతా దేవాః సవిమానైః పృథక్ పృథక్॥ 5
కృపార్జునులు ఎదురెదురు నిలిచి భయంకరంగా యుద్ధం చేస్తూ సేనలపై ప్రయోగిస్తున్న తమతమ పేరగల అస్త్రాల బలాలను చూడాలన్న కోరికతో దేవతలు తమతమ విమానలతో విడివిడిగా వచ్చారు. (5)
శతం శతసహస్రాణాం యత్ర స్థూణా హిరణ్మయీ।
మణిరత్నమయీ చాన్యా ప్రాసాదం తదధారయత్॥ 6
తతః కామగమం దివ్యం సర్వరత్నవిభూషితమ్।
విమానం దేవరాజస్య శుశుభే ఖేచరం తదా॥ 7
ఆ విమానాలన్నింటిలో దేవేంద్రుని విమానం సర్వోన్నతంగా ప్రకాశిస్తోంది. స్వేచ్ఛానుసారంగా ప్రయాణించే ఆ విమానం సర్వరత్నాలతో విరాజిలుతోంది. ఒకకొటీ, స్తంభాలు ఆ విమానాన్ని మోస్తున్నాయి. వాటిలో కొన్ని సువర్ణమయాలు, మరికొన్ని మణిరత్నమయాలు. (6,7)
తత్ర దేవాస్త్రయస్త్రింశత్ తిష్ఠంతి సహవాసవాః।
గంధర్వా రాక్షసాః సర్పాః పితరశ్చ మహర్షిభిః॥ 8
తథా రాజా వసుమనాః బలాక్షః సుప్రతర్దనః।
అష్టకశ్చ శిబిశ్చైవ యయాతిర్నహుషో గయః॥ 9
మనుః పురూ రఘుర్భానుః కృశాశ్వః సాగరో నలః।
విమానే దేవరాజస్య సమదృశ్యంత సుప్రభాః॥ 10
ఆ విమానంలో ఇంద్రునితో పాటు ముప్పది ముగ్గురు దేవతలు, గంధర్వులు, రాక్షసులు, నాగులు, పితరులు, మహర్షులు తేజస్సంపన్నులయిన రాజులు వసుమనుడు, బలాక్షుడు, సుప్రతర్దనుడు, అష్టకుడు, శిబి, యయాతి, నహుషుడు, గయుడు, మనువు, పురువు, రఘువు, భానుడు, కృశాశ్వుడు, సాగరుడు, నలుడు, కనిపించారు. (8-10)
అగ్నేరీశస్య సోమస్య వరుణస్య ప్రజాపతేః।
తథా ధాతుర్విధాతుశ్చ కుబేరస్య యమస్య చ॥ 11
అలంబుషోగ్రసేనానాం గంధర్వస్య చ తుంబురోః।
యథామానం యథోద్దేశం విమానాని చకాశిరే॥ 12
అగ్ని, ఈశుడు, సోముడు, వరుణుడు, ప్రజాపతి, ధాత, విధాత, కుబేరుడు, యముడు, అలంబుషుడు, ఉగ్రసేనుడు మొదలయిన గంధర్వులు, గంధర్వరాజైన తుంబురుడు వారివారి ప్రమాణాలకు - స్థాయికి - తగినట్లుగా విమానాలలో ఆయా తావులలో ప్రకాశించారు. (11,12)
సర్వదేవనికాయాశ్చ సిద్ధాశ్చ పరమర్షయః।
అర్జునస్య కురూణాం చ ద్రష్టుం యుద్ధముపాగతాః॥ 13
అర్జునునకు కౌరవసేనకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూడాలని సమస్తదేవతలూ, సిద్ధులూ, మహర్షులూ వచ్చి చేరారు. (13)
దివ్యానాం సర్వమాల్యానాం గంధః పుణ్యోఽథ సర్వశః।
ప్రససార వసంతాగ్రే వనానామివ భారత॥ 14
జనమేజయా! వసంతఋతుప్రారంభంలో పూలతోటల పరిమళం అన్ని దిక్కులలో వ్యాపించినట్లు దేవతల పూలమాలల పుణ్యగంధం అన్ని వైపులా ప్రసరించింది. (14)
తత్ర రత్నాని దేవానాం సమదృశ్యంత తిష్ఠతామ్।
ఆతపత్రాణి వాసాంసి స్రజశ్చ వ్యజనాని చ॥ 15
ఆ విమానాలలో కూర్చునియున్న దేవతల రత్నాలు, గొడుగులు, వస్త్రాలు, మాలలు, వింజామరలు చక్కగా కనిపిస్తున్నాయి. (15)
ఉపాశామ్యద్ రజో భౌమం సర్వం వ్యాప్తం మరీచిభిః।
దివ్యగంధానుపాదాయ వాయుర్యోధానసేవత॥ 16
భూమిపై ధూళి అణగిపోయింది. సమస్త వస్తువుల పైనా కాంతి ప్రసరించింది. దివ్యపరిమళాలను కలుపుకొని వాయువు వీరులను సేవించింది. (16)
ప్రభాసిత మివాకాశం చిత్రరూపమలంకృతమ్।
సంపతద్భిః స్థితైశ్చాపి నానారత్నవిభాసితైః॥ 17
విమానైర్వివిధైశ్చిత్రైః ఉపానీతైః సురోత్తమైః।
వజ్రభృచ్ఛుశుభే తత్ర విమానస్థైః సురైర్వృతః॥ 18
బిభ్రన్మాలాం మహాతేజాః పద్మోత్పలసమాయుతామ్।
విప్రేక్ష్యమాణో బహుభిః నాతృప్యత్ సుమహాహవమ్॥ 19
దేవతలను తీసికొని వచ్చిన విమానాలు కొన్ని నిలిచి ఉన్నాయి. మరికొన్ని ఎగురుతున్నాయి. అనేక రత్నాల కాంతులతో ప్రకాశిస్తున్న వాటివలన ఆకాశం విచిత్రంగా అలంకరింపబడినట్లు కనిపించింది. ఆ విమానాలలోని దేవతలతో కూడి మహేంద్రుడు ప్రకాశిస్తున్నాడు. తామరల, కలువల దండలు దాల్చిన ఆ మహేంద్రుడు ఆ మహాసంగ్రామాన్ని ఎన్ని కళ్లతో ఎంత చూచినా తృప్తి పొందటంలేదు. (17-19)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి దేవాగమనే షట్పంచాశత్తమోఽధ్యాయః॥ 56 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
దేవాగమనమను ఏబదియారవ అధ్యాయము. (56)