44. నలుబది నాలుగవ అధ్యాయము
అర్జునుడు ఉత్తరునికి పాండవులను తెలుపుట.
ఉత్తర ఉవాచ
సువర్ణవికృతానీమా న్యాయుధాని మహాత్మనామ్।
రుచిరాణి ప్రకాశంతే పార్థానామాశుకారిణామ్॥ 1
క్వను స్విదర్జునః పార్థః కౌరవ్యో వా యుధిష్ఠిరః।
నకులః సహదేవశ్చ భీమసేనశ్చ పాండవః॥ 2
ఉత్తరుడు అడుగుతున్నాడు. 'యుద్ధంలో చురుకైన మహాత్ములైన కుంతీకుమారుల యీ బంగారు ఆయుధా లెంతో చక్కగా అందంగా ప్రకాశిస్తున్నాయి. అర్జునుడు, యుధిష్ఠిరుడు, నకులసహదేవులు, భీమసేనుడు ఇప్పుడెక్కడున్నారు? (1,2)
సర్వ ఏవ మహాత్మానః సర్వామిత్రవినాశనాః।
రాజ్యమక్షైః పరాకీర్య న శ్రూయంతే కథంచన॥ 3
శత్రునాశకులు, మహాత్ములు అయిన వారంతా పాచికలతో తమరాజ్యాన్ని కోలుపోయి ఎక్కడున్నారో ఏరకంగానూ వినబడటం లేదు. (3)
ద్రౌపదీ క్వచ పాంచాలీ స్త్రీరత్నమితి విశ్రుతా।
జితానక్షైస్తదా కృష్ణా తానేవాన్వగమద్ వనమ్॥ 4
స్త్రీలలో రత్నంలాంటి దని పేరొందిన ద్రౌపది ఎక్కడుందో? అప్పుడు ఆ కృష్ణ పాచికలతో ఓడిన తన భర్తల వెంట అడవికి వెళ్ళింది. (4)
అర్జున ఉవాచ
అహమస్మ్యర్జునః పార్థః సభాస్తారో యుధిష్ఠిరః।
వల్లవో భీమసేనస్తు పితుస్తే రసపాచకః॥ 5
అర్జునుడు అన్నాడు. నేను కుంతికొడుకు అర్జునుణ్ణి. సభాపూజ్యుడైన కంకుడే యుధిష్ఠిరుడు. నీతండ్రి యొక్క వంటవాడు వల్లవుడు భీమసేనుడు. (5)
అశ్వబంధోఽథ నకులః సహదేవస్తు గోకులే।
సైరంధ్రీం ద్రౌపదీం విద్ధి యత్కృతే కీచకా హతాః॥ 6
గుర్రాల్ని కట్టే గ్రంథికుడు నకులుడు. గోశాలాధ్యక్షుడు, తంతిపాలుడు సహదేవుడు. సైరంధ్రి ద్రౌపది ఆమె కోసమే కీచకులు చంపబడ్డారు.' (6)
ఉత్తర ఉవాచ
దశ పార్థస్య నామాని యాని పూర్వం శ్రుతాని మే।
ప్రబ్రూయాస్తాని యది మే శ్రద్దధ్యాం సర్వమేవ తే॥ 7
ఉత్తరుడు అన్నాడు. "లోగడ నేను అర్జునుడి పదిపేర్లు విన్నాను. నాకు అవి నీవు చెప్పగలిగితే నీ మాటలన్నీ నమ్ముతాను.' (7)
అర్జున ఉవాచ
హంత తేఽహం సమాచక్షే దశనామాని యాని మే।
వైరాటే శృణు తాని త్వం యాని పూర్వం శ్రుతాని తే॥ 8
అపుడు అర్జునుడు 'విరాటరాజకుమారా! నీవు మునుపు విన్న నా పదిపేర్లను చెపుతా విను. (8)
ఏకాగ్రమానసో భూత్వా శృణు సర్వం సమాహితః।
అర్జునః ఫాల్గునో జిష్ణుః కిరీటీ శ్వేతవాహనః।
బీభత్సు ర్విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః॥ 9
మనసు నిలిపి సావధానంగా అంతా విను. అర్జున, ఫాల్గున, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయులు అని పది పేర్లు.' (9)
ఉత్తర ఉవాచ
కేనాసి విజయో నామ కేనాసి శ్వేతవాహనః।
కిరీటీ నామ కేనాసి సవ్యసాచీ కథం భవాన్॥ 10
ఉత్తరుడు అడిగాడు. "ఏకారణంచేత విజయుడని నీకు పేరు వచ్చింది? ఎలా శ్వేతవాహనుడ వయ్యావు? కిరీటి అనే పేరు ఎలా వచ్చింది? నీ వెలా సవ్యసాచి వయ్యావు. (10)
అర్జునః ఫాల్గునో జిష్ణుః కృష్ణో బీభత్సు రేవచ।
ధనంజయశ్చ కేనాసి బ్రూహి తన్మమ తత్త్వతః॥ 11
అర్జునుడివి, ఫాల్గునుడివి, జిష్ణుడివి, కృష్ణుడివి, బీభత్సుడివి, ధనంజయుడివి ఎలా అయ్యావో నాకు యథార్థంగా చెప్పు. (11)
శ్రుతా మే తస్య వీరస్య కేవలా నామహేతవః।
తత్ సర్వం యది మే బ్రూయాః శ్రద్దధ్యాం సర్వమేవ తే॥ 12
ఆ వీరుడి పేర్లకు ప్రధానకారణాలు నేను విన్నాను. అదంతా నీవు చెప్పగలిగితే నీవు చెప్పినదంతా నమ్ముతాను.' (12)
అర్జున ఉవాచ
సర్వాన్ జనపదాన్ జిత్వా విత్తమాదాయ కేవలమ్।
మధ్యే ధనస్య తిష్ఠామి తేనాహుర్మాం ధనంజయమ్॥ 13
అర్జునుడు చెప్పాడు. 'దేశాలన్నీ జయించి ధనం పన్నుగా స్వీకరించి తెచ్చి ఆ ధనం మధ్యలో ఉంటాను. అందుకే నన్ను ధనంజయుడంటారు. (13)
అభిప్రయామి సంగ్రామే యదహం యుద్ధదుర్మదాన్।
నాజిత్వా వినివర్తామి తేన మాం విజయం విదుః॥ 14
యుద్ధంలో యుద్ధోన్మత్తులైన వారిని ఎదుర్కొనటానికి వెళ్ళి జయించకుండా తిరిగిరాను. అందుచే వీరులకు నేను విజయుడుగా తెలుసు. (14)
శ్వేతాః కాంచనసంనాహాః రథే యుజ్యంతి మే హయాః।
సంగ్రామే యుద్ధ్యమానస్య తేనాహం శ్వేతవాహనః॥ 15
ఉత్తరాభ్యాం ఫల్గునీభ్యాం నక్షత్రాభ్యామహం డివా।
జాతో హిమవతః పృష్ఠే తేన మాం ఫాల్గునం విదుః॥ 16
యుద్ధానికి సిద్ధమయ్యే నా రథానికి బంగారు కవచాలతో(జీనులవంటివి) తెల్లని గుర్రాలు కట్టబడతాయి. కాబట్టి నేను శ్వేతవాహనుణ్ణి. హిమాలయ శిఖరం మీద ఉత్తర ఫల్గునీ నక్షత్రం రోజున పగటివేళ పుట్టిన నన్ను ఫాలగును డంటారు. (15,16)
పురా శక్రేణ మే దత్తం యుధ్యతో దానవర్షభైః।
కిరీటం మూర్ధ్ని సూర్యాభం తేనాహుర్మాం. కిరీటివమ్॥17
లోగడ నేను రాక్షసవీరులతో తలపడ్డప్పుడు సూర్యకాంతిని విరజిమ్మే కిరీటాన్ని ఇంద్రుడు నా తలపై ఉంచాడు. అందువల్ల నన్ను కిరీటి అన్నారు. (17)
న కుర్యాం కర్మ బీభత్సం యుధ్యమానః కథంచన।
తేన దేవమనుష్యేషు బీభత్సురితి విశ్రుతః॥ 18
యుద్ధంచేసే వేళ ఎట్టిపరిస్థితిలోను, ఏవగింపు కలిగించే పని చేయను కాబట్టి నేను దేవమానవు లందరిలో బీభత్సుడుగా ప్రసిద్ధుడనయ్యాను. (18)
ఉభౌ మే దక్షిణౌ పాణీ గాండీవస్య వికర్షణే।
తేన దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదుః॥ 19
గాండీవాన్ని ఎక్కుపెట్టడానికి నా కుడి ఎడమ చేతులు రెండూ సమర్థత కలిగి ఉన్నాయి కాబట్టి దేవ మానవులలో నన్ను సవ్యసాచి అని పిలుస్తారు. (19)
పృథివ్యాం చతురంతాయాం వర్ణో మే దుర్లభః సమః।
కరోమి కర్మ శుక్లం చ తస్మాన్మామర్జునం విదుః॥ 20
సముద్రం దాకా నేల నాలుగు చెరగులా నా శరీరకాంతి వేరెవ్వరికీ లేదు. నే నందరి పట్ల సమభావంతో ఉంటాను. పరిశుద్ధమైన పనినే ఆచరిస్తాను. ఈ కారణాలవల్ల నన్ను విజ్ఞులు అర్జునుడుగా ఎరుగుదురు. (20)
అహం దురాసో దుర్ధర్షః దమనః పాకశాసనిః।
తేన దేవమనుష్యేషు జిష్ణు ర్నామాస్మి విశ్రుతః॥ 21
కృష్ణ ఇత్యేవ దశమం నామ చక్రే పితా మమ।
కృష్ణావదాతస్య తతః ప్రియత్వాద్ బాలకస్య వై॥ 22
నన్ను పట్టుకోవటం, ఓడించడం చాలా కష్టం. ఇంద్రుడి కొడుకు నైన నేను శత్రువులను అణచి విజయాన్ని పొందే వీరుణ్ణి కాబట్టి దేవమానవులలో జిష్ణువుగా ప్రసిద్ధుడనయ్యాను. నల్లగా మెరుస్తున్న దేహకాంతి కలిగి పసితనంలో మనసు నాకట్టుకొనే రీతిలో ఉండటం చేత నాతండ్రి కృష్ణః అని పేరు పెట్టాడు. అది నా పదవ పేరు.' (21,22)
వైశంపాయన ఉవాచ
తతః స పార్థం వైరాటిః అభ్యవాదయదంతికాత్।
అహం భూమింజయోనామ నామ్నాహమపి చోత్తరః॥ 23
వైశంపాయనుడు అన్నాడు. తరువాత ఆ విరాట రాజు కొడుకు అర్జునుడి దగ్గరకు వెళ్ళి నేను భూమింజయుడనే పేరు గలిగి ఉత్తరుడిగా పిలువబడే వాణ్ణి అని పేరు చెప్పుకొని నమస్కరించాడు. (అభివాదం చేశాడు.) (23)
దిష్ట్వా త్వాం పార్థ పశ్యామి స్వాగతం తే ధనంజయ।
లోహితాక్ష మహాబాహో నాగరాజకరోపమ॥ 24
'కుంతీకుమారా! నాభాగ్యవశంచేత నిన్ను చూస్తున్నాను. ధనంజయా నీకు స్వాగతం. నీకళ్ళు ఎర్రగా ఉన్నాయి. నీబాహువులు గజరాజు తొండంలాగా పొడుగ్గా ఉన్నాయి. (24)
యదజ్ఞానాదవోచం త్వాం క్షంతు మర్హసి తన్మమ।
యతస్త్వయా కృతం పూర్వం చిత్రం కర్మ సుదుష్కరమ్।
అతోభయం వ్యతీతం మే ప్రీతిశ్చ పరమా త్వయి॥ 25
తెలియక నీతో నేను మాట్లాడినదానికి మన్నించు. పూర్వం నీవు చేసిన అసాధ్యమూ, అద్భుతమూ అయిన పనుల వల్ల నా భయం తొలగింది. నీపట్ల ఎంతో గొప్ప ప్రేమ ఏర్పడింది. (25)
(దాసోఽహం తే భవిష్యామి పశ్య మామనుకంపయా।
యా ప్రతిజ్ఞా కృతా పూర్వం తవ సారథ్యకర్మణి॥)
మనః స్వాస్థ్యం చ మే జాతం జాతం భాగ్యం చ మే మహత్।)
నేను నీదాసుడ నపుతాను. నన్ను దయతో చూడు.
నీ సారథ్యం చెయ్యటానికి మాట ఇచ్చిన నామనసిప్పుడు కుదుటపడింది. నాకు గొప్ప అదృష్టం కలిగింది.')
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే అర్జున పరిచయే చతుశ్చత్వారింశోఽధ్యాయః॥ 44 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున
అర్జునపరిచయ మను నలువది నాలుగవ అధ్యాయము. (44)
(దాక్షిణాత్య అధికపాఠము 1 1/2 శ్లోకములతో కలిపి మొత్తం 26 1/2 శ్లోకములు.)