43. నలుబది మూడవ అధ్యాయము

బృహన్నల ఉత్తరునికి పాండవుల ఆయుధములను తెలుపుట.

బృహన్నలోవాచ
యన్మాం పూర్వమిహాపృచ్ఛః శత్రుసేనాపహారిణమ్।
గాండీవమేతత్ పార్థస్య లోకేషు విదితం ధనుః॥ 1
సర్వాయుధమహామాత్రం శాతకుంభపరిష్కృతమ్।
ఏతత్ తదర్జునస్యాసీద్ గాండీవం పరమాయుధమ్॥ 2
బృహన్నల చెపుతున్నాడు. ముందు నీవు అడిగినది అర్జునుని గాండీవం. లోకప్రసిద్ధమైన ధనుస్సు అది. శత్రుసైన్యానికి యముడు లాంటిది. ఈగాండీవం అన్ని ఆయుధాలకన్న అధికమైనది. అన్ని ప్రక్కలా బంగారం తాపడం చేయబడింది. (1,2)
యత్ తచ్ఛతసహస్రేణ సమ్మితం రాష్ట్రవర్ధనమ్।
యేన దేవాన్ మనుష్యాంశ్చ పార్థో విజయతే మృధే॥ 3
చిత్ర ముచ్చావచైర్వర్ణైః శ్లక్ష్ణమాయతమవ్రణమ్।
దేవదానవగంధర్వైః పూజితం శాశ్వతీః సమాః॥ 4
లక్ష ధనుస్సులతో సాటియైనది దేశాభివృద్ధికర మైనది. ఈగాండీవంతో యుద్ధంలో అర్జునుడు దేవదానవులపై విజయం సాధించాడు. రంగురంగులతో చిత్రంగాఉన్నది. సుకుమారమై దీర్ఘమైనది. శత్రువుల ఆయుదాల తాకిడి గుర్తులు లేని యీగాండీవం దేవదానవగంధర్వులచేత ఎన్నో సంవత్సరాలు పూజలందుకొంది. (3,4)
ఏతద్వర్షసహస్రంతు బ్రహ్మా పూర్వమధారయత్।
తతోఽనంతరమేవాథ ప్రజాపతిరధారయత్॥ 5
త్రీణి పంచశతం చైవ శక్రోఽశీతి చ పంచ చ।
సోమః పంచశతం రాజా తథైవ వరుణః శతమ్।
పార్థః పంచ చ షష్టిం చ వర్షాణి శ్వేతవాహనః॥ 6
పూర్వం బ్రహ్మదేవుడు వెయ్యి సంవత్సరాలు దీన్ని ధరించాడు. తరువాత ప్రజాపతి ఐదువందలమూడు సంవత్సరాలు, ఇంద్రుడు ఎనుబది అయిదు సంవత్సరాలు, సోముడు ఐదువందల సంవత్సరాలు, అలాగే రాజైన వరుణుడు నూరు సంవత్సరాలు, శ్వేతవాహనుడైన పార్థుడు(అర్జునుడు) అరవై ఐదు సంవత్సరాలు ధరించారు. (5,6)
వి॥సం॥ పంచ చ షష్టించ వర్షాణి = 32 1/2 సం.
బ్రహ్మాదులు గాండీవాన్ని ధరించిన కాలాన్ని వారి లెక్క ప్రకారమే (దేవమానం) గ్రహించాలి. మన సంవత్సరం వారికి ఒక రోజే అవుతుంది.
అర్జునుడు 65 వర్షాలు గాండీవాన్ని ధరించాడు. అనగా 32 1/2 సంవత్సరాలు అని అర్థం. సంవత్సరానికి రెండు వర్షాలు.
దక్షిణాయన ప్రారంభంనుండి ఒక వర్షం, ఉత్తరాయణ ప్రారంభంనుండి మరొక వర్షం. కాబట్టి 65 వర్షాలు అంటే 32 1/2 సంవత్సరాలు. ఈ అర్థం లెక్కకు దాదాపు సరిపోతుంది.
అరణ్యాజ్ఞాతవాసాలు పదమూడు సంవత్సరాలు. అంతకు ముందు పాండవుల నియమంమేరకు ధర్మరాజు కేళిగృహం లోనికి ప్రవేశించినందులకు తీర్థయాత్రలు 12 సంవత్సరాలు. అంతకుముందు దిగ్విజయయాత్ర, రాజసూయ, రాజ్యపాలనాదులు మొదటి 7 1/2 సంవత్సరాలు. (నీల, సర్వ)
65 సంవత్సరాలు అనునది అప్పటికి కాదు. అర్జునుని జీవితాంతంవరకు అని గ్రహించాలి. ప్రస్తుతం అర్జునుని వయస్సు 29 సంవత్సరాలు. అర్జునుని ఆయువు 65 సంవత్సరాలు. ఇక మిగిలినవి 36 సంవత్సరాలు. (దుర్ఘ)
మహావీర్యం మహాదివ్యమ్ ఏతత్ తద్ ధనురుత్తమమ్।
ఏతత్ పార్థమనుప్రాప్తం వరుణాచ్చారుదర్శనమ్॥ 7
అన్నింటికన్న ఉత్తమమైన యీ ధనుస్సు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ ధనుస్సు ద్వారా పరాక్రమం ప్రకటింపబడుతుంది. దివ్యమైన యీ ధనుస్సు అర్జునునికి వరుణుడినుండి సంక్రమించింది. (7)
పూజితం సురమర్త్యేషు బిభర్తి పరమం వపుః।
సుపార్శ్వం భీమసేనస్య జాతరూపగ్రహం ధనుః।
యేన పార్థోఽజయత్ కృత్స్నాం దిశం ప్రాచీం పరంతపః॥ 8
దేవమానవుల పూజలందుకొని, ఉత్కృష్టమైన ఆకారం కలిగి చక్కనైన పార్శ్వాలూ, బంగారు మధ్య భాగము ఉన్న యీ ధనుస్సుతో, కుంతీకుమారుడైన భీమసేనుడు, శత్రుసంహారకారకుడై, తూర్పుదిక్కు నంతా జయించాడు. (8)
ఇంద్రగోపకచిత్రం చ యదేతచ్చారుదర్శనమ్।
రాజ్ఞో యుధిష్ఠిరస్యైతద్ వైరాటే ధనురుత్తమమ్॥ 9
ఉత్తరా! 'ఇంద్రగోపకములు' చిత్రించి సుందరంగా కనపడే ఉత్తమ ధనుస్సు యుధిష్ఠిర మహారాజుది. (9)
సూర్యా యస్మింస్తు సౌవర్ణాః ప్రకాశంతే ప్రకాశినః।
తేజసా ప్రజ్వలంతో వై నకులస్యైతదాయుధమ్॥ 10
మెరిసే బంగారు సూర్యప్రతిమల తేజస్సుతో వెలిగి పోతున్న యీ ఆయుధం నకులుడిది. (10)
శలభా యత్ర సౌవర్ణాః తపనీయవిచిత్రితాః।
ఏతన్మాద్రీసుతస్యాపి సహదేవస్య కార్ముకమ్॥ 11
బంగారు మిడుతలు చిత్రించిన యీ ధనుస్సు మాద్రిపిన్నకొడుకు సహదేవుడిది. (11)
యే త్విమే క్షురసంకాశాః సహస్రా లోమవాహినః।
ఏతేఽర్జునస్య వైరాటే శరాః సర్పవిషోపమాః॥ 12
ఉత్తరా! చురకత్తుల్లా దృఢమైన పదునైన ములుకులతో (కొనలతో) పాము విషంలాంటి యీ బాణాలు అర్జునుడివి. (12)
ఏతే జ్వలంతః సంగ్రామే తేజసా శీఘ్రగామినః।
భవంతి వీరస్యాక్షయ్యాః వ్యూహతః సమరే రిపూన్॥ 13
ఇవి యుద్ధంలో తమతేజస్సుతో మంటలు కక్కుతీ వేగంగా శత్రువుని దెబ్బతీస్తాయి. వ్యూహం ప్రకారం యుద్ధంలో శత్రువులపై బాణవర్షం కురిపించే వీరుడికి కూడా యీబాణాన్ని ఖండించడం అసంభవం. (13)
యే చేమే పృథవో దీర్ఘాః చంద్రబింబార్ధదర్శనాః।
ఏతే భీమస్య నిశితాః రిపుక్షయకరాః శరాః॥ 14
హారిద్రవర్ణా యే త్వేతే హేమపుంఖాః శిలాశితాః।
లావుగా, పొడుగ్గా, అర్ధచంద్రాకారంతో కనిపిస్తూ బంగారురెక్కలతో పసుపుపచ్చని, ఆ సానబెట్టిన బాణాలు భీమసేనునివి. శత్రువులను నేలకూల్చగలవి. (14)
నకులస్య కలాపోఽయం పంచశార్దూలలక్షణః॥ 15
యేనాసౌ వ్యజయత్ కృత్స్నాం ప్రతీచీం దిశమాహవే।
కలాపో హ్యేష తస్యాసీత్ మాద్రీపుత్రస్య ధీమతః॥ 16
ఐదు పులుల గుర్తులున్న యీ అమ్ముల పొది బుద్ధిమంతుడు, మాద్రికొడుకు అయిన నకులుడిది. దీనివల్ల అతడు యుద్ధంలో పడమరదిక్కు నంతా జయించాడు. (15,16)
యే త్విమే భాస్కరాకారాః సర్వపారసవాః శరాః।
ఏతే చిత్రక్రియోపేతాః సహదేవస్య ధీమతః॥ 17
సూర్యుని ఆకారాన్ని పోలి, శత్రువులందర్నీ నశింపజేసే విచిత్రమైన క్రియాశక్తితో కూడిన యీ బాణాలు బుద్ధిమంతుడైన సహదేవుడివి. (17)
యే త్విమే నిశితాః పీతాః పృథవో దీర్ఘవాససః।
హేమపుంఖా స్త్రిపర్వాణః రాజ్ఞ ఏతే మహాశరాః॥ 18
పదునై, పచ్చగా లావుగానున్న, పొడవైన బంగారు రెక్కలు, మూడు కణుపులుగల యీపెద్ద బాణాలు మహారాజు యుధిష్ఠిరుడివి. (18)
యస్త్వయం సాయకో దీర్ఘః శిలీపృష్ఠః శిలీముఖః।
అర్జునస్యైష సంగ్రామే గురుభారసహో దృఢః॥ 19
ఆడకప్పలా ఉన్న ముందు వెనుక భాగాలతో పొడవుగా ఉన్న యీ కత్తి అర్జునుడిది. యుద్ధంలో ఎంతో బరువును మోయగలిగి దృఢంగా ఉంటుంది. (19)
వైయాఘ్రకోశః సుమహాన్ భీమసేనస్య సాయకః।
గురుభారసహో దివ్యః శాత్రవాణాం భయంకరః॥ 20
పులితోలు ఒరికల యీ పెద్దకత్తి బీమసేనుడిది. దివ్యమైన యీకత్తి ఎంతో బరువును సహింపగలదు. శత్రువులకు చాలా భయంకరమైనది. (20)
సుఫల శ్చిత్రకోశశ్చ హేమత్సరురనుత్తమఆః।
నిస్త్రింశ్చ కౌరవస్యైషః ధర్మరాజస్య ధీమతః॥ 21
అందమైన ముందుభాగంతో చిత్రవర్ణపు ఒరతో బంగారు పిడితో సాటిలేని. యీకత్తి మేధావి, కౌరవ శ్రేష్ఠుడైన ధర్మరాజుది. (21)
యస్తు పాంచనఖే కోశే నిహితశ్చిత్రయోధనే।
నకులస్యైష నిస్త్రింశ్చ గురుభారసహో దృఢః॥ 22
మేకతోలు ఒరలో ఉన్న, ఎన్నో యుద్ధాల్లో ఆయుధాల్ని దెబ్బతీసిన, బరువు మోయగల దృఢమైన యీ కత్తి నకులుడిది. (22)
యస్త్వయం విపులః ఖడ్గః గవ్యే కోశే సమర్పితః।
సహదేవస్య విద్ధ్యేనం సర్వభారసహం దృఢమ్॥ 23
ఆవుతోలు ఒరలో ఉన్న, ఎంతబరువయినా మోసే, దృఢమై విపులమైన యీ కత్తి సహదేవుడిది." (23)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే ఆయుధవర్ణనం నామ త్రిచత్వారింశోఽధ్యాయః॥ 43 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహమున
ఆయుధవర్ణనమను నలువది మూడవ అధ్యాయము. (43)