41. నలువది యొకటవ అధ్యాయము

అర్జునుడు చెప్పగా ఉత్తరుడు శమీవృక్షము నుండి ఆయుధములను దింపుట.

ఉత్తర ఉవాచ
అస్మిన వృక్షే కిలోద్బద్ధం శరీరమితి నః శ్రుతమ్।
తదహం రాజపుత్రః సన్ స్పృశేయం పాణినా కథమ్॥ 1
ఉత్తరుడు అన్నాడు. 'ఈ చెట్టుమీద శరీరం కట్టబడి ఉందని వింటున్నాం. కాబట్టి రాజకుమారుడి నైన నేనెలా చేత్తో ముట్టుకోను? (1)
నైవం విధం మయా యుక్తమ్ ఆలబ్ధుం క్షత్రయోనినా।
మహతా రాజపుత్రేణ మంత్రయజ్ఞవిదా సతా॥ 2
క్షత్రియుణ్ణి, రాజకుమారుణ్ణి, మంత్రయజ్ఞ వేత్తను అయిన నేను ఇలాంటి దాన్ని ముట్టుకోవటం తగదు. (2)
స్పృష్టవంతం శరీరం మాం శవవాహమివాశుచిమ్।
కథం వా వ్యవహార్యం వై కుర్వీథాస్త్వం బృహన్నలే॥ 3
బృహన్నలా! శవాల్ని మోసేవాడిలా యీ శరీరాన్ని తాకి అపవిత్రుడినైన నాతో ఎలా వ్యవహరిస్తావు?' (3)
వి॥సం॥ శవాన్ని మోసినవానికి మూడు రాత్రులు ఆశౌచం. కాబట్టి నేను వెంటనే రణరంగంలో దిగి అస్త్రమంత్రాలను జపించటానికి అధికారముండదు గదా ఉత్తరుని ప్రశ్న. (విష)
బృహన్నలోవాచ
వ్యవహార్యశ్చ రాజేంద్ర శుచిశ్చైవ భవిష్యసి।
ధనూంష్యేతాని మా భైస్త్వం శరీరం నాత్ర విద్యతే॥ 4
బృహన్నల చెపుతున్నాడు. 'మహారాజా! నీవు పవిత్రుడివి. వ్యవహరింపదగినవాడివే అవుతావు. ఇవి ధనుస్సులు. భయపడకు. ఇక్కడ ఏ శరీరమూ లేదు. (4)
దాయాదం మత్స్యరాజస్య కులే జాతం మనస్వినామ్।
త్వా కథం నిందితం కర్మ కారయేయం నృపాత్మజ॥ 5
రాజకుమారా! అభిమానవంతుల వంశంలో పుట్టిన వాడివి. మత్స్యరాజు కొడుకువి, నీతో నిందింపబడే పని ఎలా చేయిస్తాను.' (5)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః స పార్థేన రథాత్ ప్రస్కంద్య కుండలీ।
ఆరురోహ శమీవృక్షం వైరాటిరవశస్తదా॥ 6
తమన్వశాసచ్ఛత్రుఘ్నః రథే తిష్ఠన్ ధనంజయః।
అవరోపయ వృక్షాగ్రాద్ ధనూంష్యేతాని మా చిరమ్॥ 7
పరివేష్టనమేతేషాం క్షిప్రం చైవ వ్యపానుద।
వైశంపాయనుడు అన్నాడు. అర్జును డిలా అనగానే కుండలాలు ధరించిన ఉత్తరుడు రథంమీదనుండి దూకి ఏమీచేయలేక జమ్మి చెట్టెక్కాడు. శత్రుసంహారకుడు అర్జునుడు రథం మీదే ఉండి 'చెట్టు మీదనుండి ఈ ధనుస్సుల్ని దింపు. ఆలస్యం చెయ్యకు. వెంటనే వీటికి చుట్టిన ఆకుల్ని తొలగించు' అంటూ అతణ్ణి శాసించాడు. (6,7)
సోఽపహృత్య మహార్హాణి ధనూంషి పృథువక్షసామ్।
పరివేష్టనపత్రాణి విముచ్య సముపానయత్॥ 8
తథా సంనహనాన్యేషాం పరిముచ్య సమంతతః।
అపశ్యద్ గాండివం తత్ర చతుర్భిరపరైః సహ॥ 9
ఉత్తరుడు పాండవుల ధనుస్సులను దింపి వాటికి చుట్టిన ఆకుల్ని తొలగించి తెచ్చాడు. అలాగే వాటి కట్లను విప్పి మిగిలిన నాలుగుధనుస్సులతో కూడిన గాండీవాన్ని చూశాడు. (8,9)
తేషాం విముచ్యమానానాం ధనుషామర్కవర్చసామ్।
వినిశ్చేరుః ప్రభా దివ్యా గ్రహాణాముదయేష్వివ॥ 10
ఉదయించే వేళ గ్రహాల దివ్యకాంతి అంతటా వ్యాపించినట్లు కప్పిన ఆకుల్ని తొలగిస్తుండగా సూర్య కాంతితో వెలుగొందుతున్న ఆ ధనుస్సుల కాంతి అన్ని దిక్కులా వ్యాపించింది. (10)
స తేషాం రూపమాలోక్య భోగినామివ జృంభతామ్।
హృష్టరోమా భయోద్విగ్నః క్షణేవ సమపద్యత॥ 11
సంస్పృశ్య తాని చాపాని భానుమంతి బృహంతి చ।
వైరాటిరర్జునం రాజన్ ఇదం వచనమబ్రవీత్॥ 12
పడగలు విప్పుతూ ఎగసిపడే పాముల్లా కనపడ్డాయి ధనుస్సులు. అపుడు ఉత్తరుడు ఒళ్ళంతా గగుర్పాటుతో భయంతో చలించిపోయాడు. రాజా! చాలా పెద్దవిగా ఉండి వెలుగొందుతున్న ఆ ధనుస్సులను తాకి ఉత్తరుడు అర్జునుడితో ఇలా అన్నాడు. (11,12)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే అస్త్రావరోపణే ఏకచత్వారింశోఽధ్యాయః॥ 41 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహమున ఉత్తరుడు
ఆయుధములను దింపుట అను నలువదియొకటవ అధ్యాయము. (41)