40. నలువదియవ అధ్యాయము
ఆయుధములను దింపుమని అర్జునుడు ఉత్తరుని ఆదేశించుట.
వైశంపాయన ఉవాచ
తాం శమీ ముపసంగమ్య పార్థో వైరాటిమబ్రవీత్।
సుకుమారం సమాజ్ఞాయ సంగ్రామే నాతికోవిదమ్॥ 1
అర్జునుడు ఆ జమ్మిచెట్టు దగ్గరకు వెళ్ళి సుకుమారుడై యుద్ధనైపుణ్యం అంతగా లేని ఉత్తరుడితో ఇలా అన్నాడు. (1)
సమాదిష్టో మయా క్షిప్రం ధనూంష్యవహరోత్తర।
నేమాని హి త్వదీయాని సోఢుం శక్ష్యంతి మే బలమ్।
భారంచాపి గురుం వోఢుం కుంజరం వా ప్రమర్దితుమ్॥ 2
మమ వా బాహువిక్షేపం శత్రూనిహ విజేష్యతః।
'ఉత్తరా! నా ఆజ్ఞ పాటించి ఈ ధనుస్సులను వెంటనే దింపు. నీ యీ ధనుస్సులు నాబలాన్ని సహించలేవు. గొప్ప బరువు మోయటానికి, ఏనుగు నణచటానికి, శత్రులపై విజయం కోసం యుద్ధం చేసే నా బాహు విన్యాసానికీ ఇవి తగవు. (2 1/2)
(నైభిః కామమలంకర్తుం కర్మ వైజయికం త్విహ।
అతిసూక్ష్మాణి హ్రస్వాని సర్వాణి చ మృదూని చ।
ఆయుధాని మహాబాహో తవైతాని పరంతప॥)
తస్మాద్ భూమింజయారోహ శమీమేతాం పలాశినీమ్॥ 3
మహాబాహూ! శత్రుసంతాపకారక! ఉత్తరా! నీ యీ ఆయుధాలన్నీ చాలా సూక్ష్మంగా, పొట్టిగా అల్పంగా ఉన్నాయి. వీటితో విజయాన్ని సాధించే కార్యక్రమం కుదరదు. కాబట్టి భూమింజయా! (ఉత్తరా!) ఈ జమ్మిచెట్టు ఎక్కు. (3)
అస్యాం హి పాండుపుత్రాణాం ధనూంషి నిహితాన్యుత।
యుధిష్ఠిరస్య భీమస్య బీభత్సోర్యమయో స్తథా॥ 4
ఈ చెట్టుమీద పాండురాజుకొడుకులైన యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవుల ధనుస్సులు ఉన్నాయి. (4)
ధ్వజాః శరాశ్చ శూరాణాం దివ్యాని కవచాని చ।
అత్ర చైతన్మహావీర్యం ధనుః పార్థస్య గాండివమ్॥ 5
ఏకం శతసహస్రేణ సమ్మితం రాష్ట్రవర్ధనమ్।
వ్యాయామసహమత్యర్థం తృణరాజసమం మహత్॥ 6
ఇక్కడ ఆ శూరుల ధ్వజాలు, బాణాలు, దివ్యకవచాలు ఉన్నాయి. మహాశక్తిమంతమై లక్షధనుస్సులకు సాటియై దేశాభివృద్ధికి దోహదం చేసేది. ఎక్కుపెట్టేటప్పుడు కలిగే పరిశ్రమకు తట్టుకు నిలబడేది, పెద్ద తాటిచెట్టులా పొడవైనది అయిన అర్జునుడి గాండీవం కూడా ఉంది. (5,6)
సర్వాయుధమహామాత్రం శత్రుసంబాధకారకమ్।
సువర్ణవికృతం దివ్యం శ్లక్ష్ణమాయతమవ్రణమ్॥ 7
అలం భారం గురుం వోఢుం దారుణం చారుదర్శనమ్।
తాదృశాన్యేవ సర్వాణి బలవంతి దృఢాని చ।
యుధిష్ఠిరస్య భీమస్య బీభత్సోర్యమయోస్తథా॥ 8
ఆయుధాలన్నింటిలో ప్రధానమైనది. శత్రువులకు చాలా బాధను కలిగించేది. బంగారంతో నిర్మించబడినది, దివ్యము, సుందరము, పొడవైనది, దెబ్బతిననిది(నిత్య నూతనంగా ఉంటుంది), చాలా బరువును మోయగలది, భయంకరమైనది, చూడముచ్చటైనది ఆ గాండీవం. యుధిష్ఠిర భీమార్జున నకులసహదేవుల ఆయుధాలన్నీ అలాగే దృఢంగా, బలంగా ఉంటాయి.' (7,8)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే అర్జునాస్త్రకథనే చత్వారింశోఽధ్యాయః॥ 40 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహమున అర్జునుడు ఉత్తరునికి ఆయుధములను తెలుపుట అను నలువదియవ అధ్యాయము.
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకాలు కలిపి మొత్తం 9 1/2 శ్లోకాలు)