35. ముప్పదిఐదవ అధ్యాయము

కౌరవులు ఉత్తరగోగ్రహణము చేయుట.

వైశంపాయన ఉవాచ
యాతే త్రిగర్తాన్ మత్స్యే తు పశూంస్తాన్ వై పరీప్సతి*.
దుర్యోధనః సహామాత్యః విరాటముపయాదథ॥ 1
వైశంపాయనుడు అన్నాడు. తనగోవులను విడిపించుకొని రాదలచి విరాటరాజు త్రిగర్తులపై యుద్ధం చేయటానికి వెళ్ళినపుడు, దుర్యోధనుడు తన మంత్రులతో కలిసి విరాటదేశంమీద దండెత్తాడు. (1)
భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ కృపశ్చ పరమాస్త్రవిత్।
ద్రౌణిశ్చ సౌబలశ్చైవ తథా దుఃశాసనః ప్రభో॥ 2
వివింశతిర్వికర్ణశ్చ చిత్రసేనశ్చ వీర్యవాన్।
దుర్ముఖో దుఃశలశ్చైవ యే చైవాన్యే మహారథాః॥ 3
జనమేజయ మహారాజా! భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, (అస్త్రముల నెరిగిన) కృపాచార్యుడు, అశ్వత్థామ, శకుని, దుశ్శాసనుడు, వివింశతి, వికర్ణుడు, (పరాక్రమ వంతుడైన) చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుశ్శలుడు, మహారథులైన ఇతరవీరులు దుర్యోధనుని వెంట ఉన్నారు. (2,3)
ఏతే మత్స్యానుపాగమ్య విరాటస్య మహీపతేః।
ఘోషాన్ విద్రావ్య తరసా గోధనం జహ్రురోజసా॥ 4
వీరంతా విరాటమహారాజు యొక్క మత్స్యదేశానికి వచ్చి గొల్లపల్లెలను కల్లోలపరచి, చాలావేగంగా బల ప్రయోగంతో గోసంపదను అపహరించటం మొదలు పెట్టారు. (4)
షష్టిం గవాం సహస్రాణి కురవః కాలయంతి చ।
మహతా రథవంశేన పరివార్య సమంతతః॥ 5
కౌరవవీరులు రథసమూహాలతో చుట్టుముట్టి విరాటునికి చెందిన అరవైవేల గోవులను తోలుకొనిపోతున్నారు. (5)
గోపాలానాం తు ఘోషస్య హన్యతాం తైర్మహారథైః।
ఆరావః సుమహానాసీత్ సంప్రహారే భయంకరే॥ 6
భయంకరమైన ఆ కొట్లాటలో మహారథులైన వీరులచే చావగొట్టబడుతూ గొల్లపల్లెలోని గోపాలురు చేసిన ఆర్తనాదం పెద్దగా చాలాదూరం వినబడింది. (6)
వి॥ గోపాలురనుకొట్టిన వారిలో భీష్మద్రోణుల పేర్లు తొలగించాడు తిక్కన, చుట్టుముట్టిన వారిలో మాత్రం అంతా ఉన్నారు (విరా-4-4)
గోపాధ్యక్షో భయత్రస్తః రథమాస్థాయ సత్వరః।
జగామ నగరాయైవ పరిక్రోశం స్తదాఽఽర్తవత్॥ 7
భయభ్రాంతుడైన గోపాలుర నాయకుడు వెంటనే రథం ఎక్కి దీనునివలె బిగ్గరగా ఏడుస్తూ నగరానికి వెళ్ళాడు. (7)
స ప్రవిశ్య పురం రాజ్ఞః నృపవేశ్మాభ్యయాత్ తతః।
అవతీర్య రథాత్ తూర్ణమ్ ఆఖ్యాతుం ప్రవివేశ హ॥ 8
అతడు విరాటుని నగరంలో ప్రవేశించి రాజభవనం చేరుకొన్నాడు. వెంటనే రథం దిగి విషయం చెప్పటానికి లోపలకు ప్రవేశించాడు. (8)
దృష్ట్వా భూమిం జయం నామ పుత్రం మత్స్యస్య మానినమ్।
తస్మై తత్ సర్వమాచష్ట రాష్ట్రస్య పశుకర్షణమ్॥ 9
షష్టిం గవాం సహస్రాణి కురవః కాలయంతి తే।
తద్ విజేతుం సముత్తిష్ఠ గోధనం రాష్ట్రవర్ధన॥ 10
మత్స్యరాజు కుమారుడూ, అభిమానవంతుడూ అయిన భూమింజయుని(ఉత్తరుడు) చూసి అతని రాజ్యానికి చెందిన గోసంపద అపహరింపబడుతున్న వృత్తాంతమంతా గోపాధ్యక్షుడు తెలియజెప్పాడు.
రాకుమారా! కౌరవులు మీ అరవైవేల గోవులను తోలుకొనిపోతున్నారు. మీ ఆ గోధనాన్ని తిరిగి జయించి తేవటానికి లెమ్ము. సిద్ధం కమ్ము. (9,10)
రాజపుత్ర హితప్రేప్సుః క్షిప్రం నిర్యాహి చ స్వయమ్।
త్వాం హి మత్స్యో మహీపాలః శూన్యపాలమిహాకరోత్॥ 11
రాజకుమారా! రాజ్యహితం కోరి స్వయంగా యుద్ధానికి బయలుదేరుతీ మత్స్యరాజు విరాటుడు తాను ఇక్కడ లేనప్పుడు నిన్ను రక్షకునిగా ఉంచినాడు కదా! (11)
త్వయా పరిషదో మధ్యే శ్లాఘతే స నరాధిపః।
పుత్రో మమానురూపశ్చ శూరశ్చేతి కులోద్వహః॥ 12
నిన్ను ఆ రాజు సభాసదులమధ్య 'నా కుమారుడు నాకు తగినవాడు, శూరుడు, మా యీ వంశపు బరువు బాధ్యతలను నిర్వహించటంలో సమర్థుడు' అంటూ పొగడుతూ ఉంటాడు. (12)
ఇష్వస్త్రే నిపుణో యోధః సదా వీరశ్చ మే సుతః।
తస్య తత్ సవ్యమేవాస్తు మనుష్యేంద్రస్య భాషితమ్॥ 13
నాకుమారుడు అనేకశస్త్రాలను ప్రయోగించే నిపుణుడు, యుద్ధవీరుడు, అని పలుకుతూ ఉంటాడు. ఆ రాజు మాట నేడు నిజమగుగాక! (13)
ఆవర్తయ కురూం జిత్వా పశూన్ పశుమతాం వర।
నిర్దహైషామనీకాని భీమేన శరతేజసా॥ 14
పశుసంపదగల రాజశ్రేష్ఠా! కౌరవులను జయించి పశువులను మళ్ళింపుము. భయంకరమైన నీబాణాల మంటతో వారిసేనలను తగులబెట్టు. (14)
ధనుశ్చ్యుతైః రుక్మపుంఖైః శరైః సంవతపర్వభిః।
ద్విషతాం భింద్యనీకాని గజానామివ యూథపః॥ 15
గజరాజు ఏనుగులను తాకినట్లు నీ ధనుస్సు నుండి వెలువడిన బంగారుపిడులుగల బాణాలతో శత్రుసమూహాలను ఛిన్నాభిన్నం చెయ్యి. (15)
పాశోపధానాం జ్యాతంత్రీం చాపదండాం మహాస్వనామ్।
శరవర్ణాం ధనుర్వీణాం శత్రుమధ్యే ప్రవాదయ॥ 16
అల్లెత్రాటిని బిగించటానికి ఉపయోగించే వింటి కొనలే ఉపధానాలుగా, అల్లెత్రాడే తీగెలుగా, విల్లే వీణాదండంగా అందుండి వెలువడే బాణాలే స్వరాలుగా గల, మహాధ్వనిసహితమైన నీ ధనుస్సు అనే వీణను శత్రువుల నడుమ వాయించు. (16)
శ్వేతా రజతసంకాశాః రథే యుజ్యంతు తే హయాః।
ధ్వజం చ సింహం సౌవర్ణమ్ ఉచ్ఛ్రయంతు తవ ప్రభో॥ 17
ప్రభూ! వెండిలా మెరుస్తున్న తెల్లని గుర్రాలను రథానికి పూన్చి సింహపు గుర్తు గల నీ బంగారుధ్వజం ఎగురవెయ్యి. (17)
రుక్మపుంఖాః ప్రపన్నాగ్రాః ముక్తా హస్తవతా త్వయా।
ఛాదయంతు శరాః సూర్యం రాజ్ఞాం మార్గనిరోధకాః॥ 18
బంగారు పిడులూ, పదునైన అంచులూ గల బాణాలు దృఢమైన నీచేతులనుండి విడువబడి శత్రురాజుల మార్గాన్ని అడ్డగిస్తూ సూర్యుని క్రమ్మివేయుగాక! (18)
రణే జిత్వా కురూన్ సర్వాన్ వజ్రపాణిరివాసురాన్।
యశో మహదవాప్య త్వం ప్రవిశేదం పురం పునః॥ 19
ఇంద్రుడు రాక్షసులను జయించినట్లు, కౌరవులందరినీ యుద్ధంలో జయించి కీర్తిని పొంది మరల నీవు ఈ నగరంలో ప్రవేశించు. (19)
త్వం హి రాష్ట్రస్య పరమా గతిర్మత్స్యపతేః సుతః।
యథా హి పాండుపుత్రాణామ్ అర్జునో జయతాం వరః॥ 20
ఏవమేవ గతిర్నూనం భవాన్ విషయవాసినామ్।
గతిమంతో వయం త్వద్య సర్వే విషయవాసినః॥ 21
జయశీలులలో శ్రేష్ఠుడైన అర్జునుడు పాండవులలో ఆశ్రయించిన దగినవాడైనట్లుగా, మత్స్యరాజు కుమారుడవైన నీవే ఈరాజ్యానికి (రాజ్యవాసులందరకు) ఆశ్రయించ దగినవాడవు. ఈదేశవాసులకు నీవే నిజంగా దిక్కు.
ఈ దేశ వాసులమందరమూ నేడు నీవలన ఆశ్రయం కల వారమైనాము. (21)
వైశంపాయన ఉవాచ
స్త్రీమధ్య ఉక్తస్తేనాసౌ తద్ వాక్యమభయంకరమ్।
అంతఃపురే శ్లాఘమానః ఇదం వచనమబ్రవీత్॥ 22
వైశంపాయనుడు అన్నాడు. అంతఃపురస్త్రీలమధ్య ఉన్న అతడు గోపాలనాయకుని నిర్భయవాక్యాలు విని తనను తాను పొగడుకొంటూ ఇలా అన్నాడు. (22)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే గోపవాక్యే పంచత్రింశోఽధ్యాయః॥ 35 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణములో గవాధ్యక్షుని వేడికోలు అను ముప్పది ఐదవ అధ్యాయము. (35)