34. ముప్పదినాలుగవ అధ్యాయము
విరాటుడు పాండవులను మెచ్చుకొనుట, విరాటనగరములో రాజు విజయమును చాటించుట.
వైశంపాయన ఉవాచ
ఏవ ముక్తే తు సవ్రీడః సుశర్మాఽఽసీదధోముఖః।
స ముక్తోఽభ్యేత్య రాజానమ్ అభివాద్య ప్రతస్థివాన్॥ 1
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! యుధిష్ఠిరుడిలా అన్నాక సుశర్మ సిగ్గుతో తల వంచుకొన్నాడు. బంధనం నుండి విడివడి విరాటరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి తన దేశానికి వెళ్ళాడు. (1)
విసృజ్య తు సుశర్మాణం పాండవాస్తే హతద్విషః।
స్వబాహుబలసంపన్నాః హ్రీనిషేవా యతవ్రతాః॥ 2
సంగ్రామశిరసో మధ్యే తాం రాత్రిం సుఖినోఽవసన్।
సుశర్మను విడిచి, శత్రుసంహారకులూ, బాహుబల సంపన్నులూ, లజ్జాశీలంతో శంయమపూర్వకంగా వ్రతపాలనం చేసే పాండవులు రణరంగ శిరోభాగానికి మధ్య ఆ రాత్రి సుఖంగా నివసించారు. (2 1/2)
తతో విరాటః కౌంతేయాన్ అతిమానుషవిక్రమాన్।
అర్చయామాస విత్తేన మానేన చ మహారథాన్॥ 3
తరువాత విరాటరాజు మానవాతీతపరాక్రమం గల, మహారథికులు అయిన కుంతీపుత్రులకు ధనమూ, గౌరవమూ ఇచ్చి సత్కరించాడు. (3)
విరాట ఉవాచ
యథైవ మమ రత్నాని యుష్మాకం తాని వై తథా।
కార్యం కురుత వై సర్వే యథాకామం యథాసుఖమ్॥ 4
దదామ్యలంకృతాః కన్యాః వసూని వివిధాని చ।
మనసశ్చాప్యభిప్రేతం యుద్ధే శత్రునిబర్హణాః॥ 5
విరాటరాజన్నాడు - 'యుద్ధంలో శత్రువులను సంహరించిన వీరులారా! నాకున్న ధనాలు, రత్నాలు మీవి కూడా అవుతాయి. మీరందరూ ఇక్కడ సుఖంగా ఉండండి. మేకేపని నచ్చితే అదే చేయండి. నేను మీ అందరకు వస్త్రాలంకృతలయిన కన్యలను, రక రకాలయిన రత్నాలను, ధనాన్ని మీరు కోరుకున్న వస్తువులను ఇతాను. (4,5)
యుష్మాకం విక్రమాదద్య ముక్తోఽహం స్వస్తిమానిహ।
తస్మాద్ భవంతో మత్స్యానామ్ ఈశ్వరాః సర్వ ఏవ హి॥ 6
నేడు నేను మీపరాక్రమం చేత శత్రువులనుండి క్షేమంగా విముక్తుడనయి వచ్చాను. కాబట్టి మీరే మత్స్యదేశానికి ప్రభువులు.' (6)
వైశంపాయన ఉవాచ
తథేతి వాదినం మత్స్యం కౌరవేయాః పృథక్ పృథక్।
ఊచుః ప్రాంజలయః సర్వే యుధిష్ఠిరపురోగమాః॥ 7
ఇలా మాట్లాడే మత్స్యరాజుకు యుధిష్ఠిరాది పాండవులు వేరువేరుగా చేతులు జోడించి ఇలా అన్నారు. (7)
ప్రతినందామ తే వాక్యం సర్వం చైవ విశాంపతే।
ఏతే నైవ ప్రతీతాః స్మ యత్ త్వం ముక్తోఽద్య శత్రుభిః॥ 8
మహారాజా! మీదన్నది సరియైనది. మేము మీ మాటలన్నిటిని అభినందిస్తున్నాము. కాని మేము నేడు మీరు శత్రువులనుండి విడువబడడంవల్లనే సంతుష్టులమయ్యాము. (8)
తతోఽబ్రవీత్ ప్రీతమనాః మత్స్యరాజో యుధిష్ఠిరమ్।
పునరేవ మహాబాహుః విరాటో రాజసత్తమః॥ 9
ఏహి త్వా మభిషేక్ష్యామి మత్స్యరాజస్తు నో భవాన్॥ 10
అపుడు రాజులలో శ్రేష్ఠుడు, మహాబాహువు విరాటుడు తన మనస్సులో బాగా సంతోషించి, మళ్ళీ యుధిష్ఠిరునితో అన్నాడు. - రండి! మీకు పట్టాభిషేకం చేస్తాను. మత్స్యదేశానికి మీరే రాజు. (9,10)
మనసశ్చాప్యభిప్రేతం యథేష్టం భువి దుర్లభమ్।
తత్తేహం సంప్రదాస్యామి సర్వమర్హతి నో భవాన్॥ 11
ఈ భూమిపై దుర్లభమూ, ప్రియమూ, మీ మనస్సుకు నచ్చినదీ అయిన పదార్థాన్ని మీకిస్తాను. మీరు మా సర్వాన్నీ పొందడానికి అర్హులు. (11)
రత్నాని గాః సువర్ణం చ మణిముక్తమథాపి చ।
వైయాఘ్రపద్య విప్రేంద్ర సర్వథైవ నమోస్తుఽతే॥ 12
వ్యాఘ్రపాద గోత్రంలో పుట్టిన విప్రశ్రేష్ఠుడా! నా రత్నాలు, గోవులు, బంగారం, మణులు, ముత్యాలు మీకు అర్పణం చేస్తున్నాను. మీకు అన్ని విధాల నమస్కారం. (12)
త్వత్కృతే హ్యద్య పశ్యామి రాజ్యం సంతాన మేవ చ।
యత శ్చ జాతసంరంభః న చ శత్రువశం గతః॥ 13
మీకారణంగా నేను నేడు మారాజ్యాన్ని, సంతానం ముఖాన్ని చూస్తున్నాను. శత్రువు నన్ను పట్టుకొన్నపుడు నేను భయపడ్డాను. కాని మీపరాక్రమం వల్ల శత్రువుకు వశం కాలేదు'. (13)
తతో యుధిష్ఠిరో మత్స్యం పునరేవాభ్యభాషత।
ప్రతినందామి తే వాక్యం మనోజ్ఞం మత్స్య భాషసే॥ 14
ఆనృశంస్యపరో నిత్యం సుసుఖీ సతతం భవ।
ఇది విని యుధిష్ఠిరుడు మత్స్యరాజుతో మళ్ళీ చెప్పాడు - రాజా! మీరు చాలా మనోహరమయిన మాట చెప్పారు. నేను మీమాటల నభినందిస్తున్నాను. మీరు నిరంతరం దయాస్వభావంతో, ఎల్లప్పుడూ పరమసుఖంగా ఉండండి.' (14 1/2)
(వైశంపాయన ఉవాచ
పునరేవ విరాటశ్చ రాజా కంకమభాషత।
అహో సూదస్య కర్మాణి వల్లవస్య ద్విజోత్తమ।
సోఽహం సూదేన సంగ్రామే వల్లవేనాభిరక్షితః॥
త్వత్కృతే సర్వ మేవైతద్ ఉపపన్నం మమానఘ।
వరం వృణీష్వ భద్రం తే బ్రూహి కిం కరవాణి తే॥
దదామి తే మహాప్రీత్యా రత్నాన్యుచ్చావచాని చ।
శయనాసనయానాని కన్యాశ్చ సమలంకృతాః॥
హస్త్యశ్వరథసంఘాశ్చ రాష్ట్రాణి వివిధాని చ।
ఏతాని చ మమ ప్రీత్యా ప్రతిగృహ్ణీష్వ సువ్రత॥
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! కంకునితో విరాటరాజు మళ్ళీ ఇలా అన్నాడు - 'ద్విజశ్రేష్ఠా! వల్లవుడి వంట చాలా అద్భుతంగా ఉంటుంది. అతడు యుద్ధంలో నన్ను రక్షించాడు. పాపబుద్ధి లేని విప్రశ్రేష్ఠుడా! ఇదంతా చేయడం మీకే తగును. మీకు శుభం కలగాలి. మీరు వరం కోరుకోండి. చెప్పండి, నేను మీకు ఏ సేవ చేయను? నేను మీపట్ల బాగా ప్రసన్నుడనయ్యాను. మీకు పలురకాలయిన ఉత్తమోత్తమరత్నాలు, పానుపు, ఆసనం, వాహనం, వస్త్రాభరణాలతో అలంకరించబడిన సుందరకన్యలు, ఏనుగులు, గుర్రాలు, రథాల సమూహాలు, వివిధమయిన జనపదాలు కానుకగా ఇస్తాను. వీటిని నా ప్రీతి కోసం గ్రహించండి.'
తం తథావాదినం తత్ర కౌరవ్యః ప్రత్యభాషత।
ఏకైవ తు మమ ప్రీతిః యత్ త్వం ముక్తోఽపి శత్రుభిః॥
ప్రతీతశ్చ పురం తుష్టః ప్రవేక్ష్యసి తదానఘ॥
దారైః పుత్రైశ్చ సంశ్లిష్య సా హి ప్రీతి ర్మమాతులా।)
అపుడలా మాట్లాడే విరాటరాజుకు కురుకులనందను డయిన యుధిష్ఠిరుడిలా జవాబు చెప్పాడు- 'మహారాజా! మీరు శత్రువుల చేతినుండి విడువబడ్డారు. ఇది ఒకటే నాకు మిక్కిలి ప్రీతి కలిగించే విషయం. పాపరహితా! మీరు నిర్భయంగా సంతోషంతో మీ నగరంలో ప్రవేశించండి. మీభార్యా పుత్రులను కలిసి సుఖంగా ఉండండి. నాకు సాటిలేనిది ఈ ప్రీతియే.
గచ్ఛంతు దూతా స్త్వరితం నగరం తవ పార్థివ॥ 15
సుహృదాం ప్రియమాఖ్యాతుం ఘోషయంతు చ తే జయమ్।
తత స్తద్వచనా న్మత్స్యః దూతాన్ రాజా సమాదిశత్॥ 16
మహారాజా! ఇపుడు మీనగరంలో స్నేహితులకు ఈ ప్రియ సమాచారం చెప్పడం కోసం తొందరగా దూతలు వెళ్ళాలి. ఆ దూతలక్కడ తమ విజయాన్ని చాటింపు వెయ్యాలి, అన్నాడు. అపుడు ధర్మరాజు చెప్పినట్లు విరాటుడు దూతల నాదేశించాడు. (15,16)
ఆచక్షధ్వం పురం గత్వా సంగ్రామవిజయం మమ।
కుమార్యః సమలంకృత్య పర్యాగచ్ఛంతు మే పురాత్॥ 17
"దూతలారా! మీరు నగరానికి వెళ్ళి యుద్ధంలో నాకు విజయం లభించిందని తెల్పండి. కన్నెపిల్లలు అలంకరించుకొని స్వాగతం చెప్పడం కోసం నగరానికి బయటకు రావాలి. (17)
వాదిత్రాణి చ సర్వాణి గణికాశ్చ స్వలంకృతాః।
ఏతాం చాజ్ఞాం తతః శ్రుత్వా రాజ్ఞా మత్స్యేన నోదితాః।
తామాజ్ఞాం శిరసా కృత్వా ప్రస్థితా హృష్టమానసాః॥ 18
అన్ని ప్రకారాల వాద్యాలు వాయించాలి. అలంకరించుకొని కన్యకలు తయారవ్వాలి." మత్స్యరాజు ఆజ్ఞను తలదాల్చి దూతలు ప్రసన్న మయిన మనస్సుతో వెళ్ళారు. (18)
తే గత్వా తత్ర తాం రాత్రిమ్ అథ సూర్యోదయం ప్రతి।
విరాటస్య పురాభ్యాశే దూతా జయమఘోషయన్॥ 19
అక్కడనుండి రాత్రి బయలుదేరిన దూతలు ప్రయాణం చేసి సూర్యోదయం అవుతూంటే విరాటుని రాజధానిని చేరారు. వారక్కడ అన్ని వైపులా విరాటుని విజయాన్ని చాటింపు వేశారు. (19)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి దక్షిణగోగ్రహే విరాటజయఘోషే చతుస్త్రింశోఽధ్యాయః॥ 34 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున దక్షిణ గోగ్రహమందు విరాటుని విజయమును చాటింపు వేయించుట అను ముప్పది నాల్గవ అధ్యాయము. (34)
(దాక్షిణాత్య ప్రతి అధిక పాఠము 6 1/2 శ్లోకాలు కలుపుకొని మొత్తము 25 1/2 శ్లోకాలు.)