32. ముప్పదిరెండవ అధ్యాయము
మత్స్య త్రిగర్త సేనలమధ్య యుద్ధము.
వైశంపాయన ఉవాచ
నిర్యాయ నగరాత్ శూరా వ్యూఢానీకాః ప్రహారిణః।
త్రిగర్తానస్పృశన్ మత్స్యాః సూర్యే పరిణతే సతి॥ 1
వైశంపాయనుడు చెప్పాడు. రాజా! శత్రువులను కొట్టడంలో నిపుణులయిన మత్స్యదేశవీరులు నగరం నుండి బయలుదేరి తమ సైన్యాన్ని వ్యూహంగా చేసి ప్రొద్దువాలే సమయానికి త్రిగర్తులను ఢీకొన్నారు. (1)
తే త్రిగర్తాశ్చ మత్స్యాశ్చ సంరబ్ధా యుద్ధదుర్మదాః।
అన్యోన్యమభిగర్జంతః గోషు గృద్ధా మహాబలాః॥ 2
క్రోధంతో నిండి యుద్ధంకోసం ఉన్మత్తులుగా ఉన్న మహాబలవంతులయిన ఆ త్రిగర్త మత్స్యదేశ వీరులు గోవులను వశం చేసుకోవాలనే కోరికతో ఎదుటి పక్షం లక్ష్యం చేసుకొని గర్జిస్తున్నారు. (2)
భీమాశ్చ మత్తమాతంగాః తోమరాంకుశనోదితాః।
గ్రామణీయైః సమారూఢాః కుశలై ర్హస్తిసాదిభిః॥ 3
తేషాం సమాగమో ఘోరః తుములో లోమహర్షణః।
ఘ్నతాం పరస్పరం రాజన్ యమరాష్ట్రవివర్ధనః॥ 4
ఏనుగులపై ఎక్కిన మావటివారు వాటిని నడపడంలో నిపుణులు. వారు తోమరాలతో, అంకుశాలతో పొడుస్తూ మదించిన ఏనుగులను ముందుకు నడిపారు. అవి రెండువైపులనుండి ఎదుటిపక్షాన్ని డీకొన్నాయి. పరస్పరం ఆయుధాలతో ఆగజవాహనులు చేసేయుద్ధం కోలాహలంగా, భయంకరంగా, సంకులంగా, ఒడలు జల్లుమనే విధంగా మహాసంహారం చేసేదిగా ఉంది. (3,4)
దేవాసురసమో రాజన్ ఆసీత్ సూర్యేఽవలంబతి।
పదాతిరథనాగేంద్ర హయారోహబలౌఘవాన్॥ 5
రాజా! సూర్యుడు పశ్చిమం వైపు దిగుతున్నాడు. ఆ సమయంలో పదాహులు, రథికులు, గజవాహనులు, గుఱ్ఱపురౌతులతో నిండిన ఆ సైన్యాలు చేసేయుద్ధం దేవాసురయుద్ధంతో సమానంగా ఉంది. (5)
అన్యోన్యమభ్యాపతతాం నిఘ్నతాం చేతరేతరమ్।
ఉదతిష్ఠద్ రజో భౌమం న ప్రాజ్ఞాయత కించన॥ 6
ఒకరినొకరు ఎదురుకొంటూ, పరస్పరం కొట్టుకొంటూ యుద్ధంచేసే ఆసైనికుల పాదాల త్రొక్కిడిచేత దుమ్ము పైకి లేచి ఏమీ కనబడటం లేదు. (6)
పక్షిణశ్చాపతన్ భూమౌ సైన్యేన రజసాఽనృతాః।
ఇషుభిర్వ్యతిసర్పద్భిః ఆదిత్యోఽంతరధీయత॥ 7
సైన్యం దుమ్ముచే కప్పబడి ఎగిరే పక్షులు నేలపై పడ్డాయి. రెండు వైపులనుండి వచ్చే బాణాలవల్ల ఆకాశం దట్టంగా నిండిపోవడంతో సూర్యుడు కనబడడంలేదు. (7)
ఖద్యోతైరివ సంయుక్తమ్ అంతరిక్షం వ్యరాజత।
రుక్మపృష్ఠాన్ని చాపాని వ్యతిషక్తాని ధన్వినామ్॥ 8
పతతాం లోకవీరాణాం సవ్యదక్షిణమాస్యతామ్।
రథారథైః సమాజగ్ముః పాదాతైశ్చ పదాతయః॥ 9
బాణాలవల్ల అంతరిక్షం మిణుగురుపురుగులతో నిండినట్లు ప్రకాశించింది. విశ్వవిఖ్యాత ధనుర్ధర వీరులు కుడివైపునుంచి, ఎడమవైపునుంచి బాణాలు వేస్తున్నారు. వారు గాయాలు తగిలి పడిపోతుంటే బంగారు పీఠభాగం కల వారి ధనుస్సులు మరొకరి చేతుల్లోకి వెళ్ళి పోతున్నాయి. రథికులు రథికులతోను, పదాతులు పదాతులతోను డీకొంటున్నారు. (8,9)
సాదినః సాదిభిశ్చైవ గజైశ్చాపి మహాగజాః।
అసిభిః పట్టిసైః ప్రాసైః శక్తిభిస్తోమరై రపి॥ 10
సంరబ్ధాః సమరే రాజన్ నిజఘ్నురితరేతరమ్।
నిఘ్నంతః సమరే న్యోన్యం శూరాః పరిఘబాహవః॥ 11
న శేకురభిసంరబ్ధాః శూరాన్ కర్తుం పరాఙ్ముఖాన్।
గుర్రపురౌతులు గుర్రపురౌతులతోను, మావటి వాండ్రు మావటివారితోను యుద్ధం చేస్తున్నారు. రాజా! వారందరూ పరస్పరం కత్తులు, పట్టిసములు ప్రాసములు, తోమరాలు మొదలయిన ఆయుధాలతో క్రోధంతో కొట్టుకొంటున్నారు. పరిఘవంటి బాహువులు కల ఆ శూరులు పరస్పరం కోపంతో కొట్టుకొంటున్నా, శత్రువీరులను పారద్రోల లేకపోతున్నారు. (10,11)
కృత్తోత్తరోష్ఠం సునసం కృత్తకేశమలంకృతమ్॥ 12
అదృశ్యత శిరశ్ఛిన్నం రజోధ్వస్తం సకుండలమ్।
కుండలాలతో కూడిన శిరస్సులు ఎన్నో దుమ్ములో పడుతున్నాయి. ఒక ముఖానికి ముక్కు చాలా అందంగా ఉంది. కాని పైపెదవి తెగిపోయింది. ఒకడు బాగా అలంకరించుకొన్నాడు. కాని వాడిజుట్టు తెగి ఎగిరిపోయింది. (12 1/2)
అదృశ్యంస్తత్ర గాత్రాణి శరైశ్ఛిన్నాని భాగశః॥ 13
వాలస్కంధనికాశాని క్షత్రియాణాం మహామృథే।
ఆ మహాసంగ్రామంలో చాలామంది క్షత్రియ వీరుల శరీరాలు సాలవృక్షాల కొమ్మలవలె విశాలంగా బలిసి ఉన్నాయి. అవి బాణాలచే ముక్కలు ముక్కలయి పడిపోతున్నాయి. (13 1/2)
నాగభోగనికాశైశ్చ బాహుభిశ్చందనోక్షితైః॥ 14
ఆస్తీర్ణా వసుధా భాతి శిరోభిశ్చ సకుండలైః।
సర్పాల పడగల వలె శోభిస్తూ చందనంతో అలంకరింపబడిన భుజాలు, కుండలాలు గల శిరస్సులతో నిండిన రణభూమి అపూర్వంగా శోభిస్తోంది. (14 1/2)
రథినాం రథిభి శ్చాత్ర సంప్రహారోఽభ్యవర్తత॥ 15
సాదిభిః సాదినాం చాపి పదాతీనాం పదాతిభిః।
ఉపాశామ్యద్ రజో భౌమం రుధిరేణ ప్రసర్పతా॥ 16
అక్కడ రథికులు రథికులతో, గుర్రపురౌతులు గుర్రపురౌతులతోను, పదాతియోధులు పదాతి యోధులతోను యుద్ధం చేస్తున్నారు. అన్ని వైపులా రక్తధారలు ప్రవహిస్తున్నాయి. పైకిలేచిన దుమ్ము రక్త ప్రవాహంతో అణగిపోతోంది. (15,16)
కశ్మలం చావిశద్ ఘోరం నిర్మర్యాదమవర్తత।
యుద్ధం చేసే వీరులకు మూర్ఛ వస్తోంది. హద్దులు లేని భయంకర యుద్ధం జరిగింది. (16 1/2)
(యుధిష్ఠిరోఽపి ధర్మాత్మా భ్రాతృభిః సహిత స్తదా।
వ్యూహం కృత్వా విరాటస్య అన్వయుధ్యత పాండవః॥
ఆత్మానం శ్యేనవత్ కృత్వా తుండమాసీద్ యుధిష్ఠిరః।
పక్షౌ యమౌ చ భవతః పుచ్ఛమాసీద్ వృకోదరః॥
సహస్రం న్యహనత్ తత్ర కుంతీపుత్త్రో యుధిష్ఠిరః॥
భీమసేనః సుసంక్రుద్ధః సర్వశస్త్రభృతాం వరః॥
ద్విసహస్రం రథాన్ వీరః పరలోకం ప్రవేశయత్।
నకులస్త్రిశతం జఘ్నే సహదేవశ్చతుశ్శతమ్॥)
పాండునందనుడు, ధర్మాత్ముడు అయిన యుధిష్ఠిరుడు సోదరులతో కూడా వ్యూహాన్ని రచించి విరాటరాజుకోసం త్రిగర్తులతో యుద్ధం ప్రారంభించాడు. అతడు తమసేనను డేగ ఆకారంలో నిలబెట్టి తాను ముక్కుస్థానంలో ఉన్నాడు.
నకుల సహదేవులు రెక్కల స్థానంలో నిలబడ్డారు. భీమసేనుడు తోక స్థానంలో ఉన్నాడు. కుంతీ పుత్రుడయిన యుధిష్ఠిరుడు వెయ్యిమంది సైనికులను సంహరించాడు. సంపూర్ణ శస్త్రధారులలో శ్రేష్ఠుడయిన భీమసేనుడు మిక్కిలి కోపగించి రెండువేల మంది రథిలకులను పరలోకానికి పంపాడు. నకులుడు మూడు వందల మందిని, సహదేవుడు నాలుగు వందల సైనికులను చంపారు.
ఉపావిశన్ గరుత్మంతః శరైర్గాఢం ప్రవేజితాః।
అంతరిక్షే గతిర్యేషాం దర్శనం చాప్యరుధ్యత॥ 17
ఆకాశంలో సంచరించే పక్షులు కూడా బాణ సమూహాల వల్ల మిక్కిలి ఉద్వేగాన్ని పొంది అటు ఇటూ కూర్చుంటున్నాయి. అవి ఆకాశంలో ఎగరలేక, దూరం దాకా చూడలేకపోతున్నాయి. (17)
తే ఘ్నంతః సమరేఽన్యోన్యం శూరాః పరిఘబాహవః।
న శేకురభిసంరబ్ధాః శూరాన్ కర్తుం పరాఙ్ముఖాన్॥ 18
పరిఘలవలె దృఢమైన బాహువులు కల ఆ శూరులు కోపంతో పరస్పరం కొట్టుకొంటున్నారు. వారు రణ విముఖులు కాలేకపోతున్నారు. (18)
శతానీకః శతం హత్వా విశాలాక్ష శ్చతుశ్శతమ్।
ప్రవిష్టా మహతీం సేనాం త్రిగర్తానాం మహారథౌ॥ 19
ఇలా యుద్ధం జరుగుతూ ఉంటే శతానీకుడు వందమందిని, విశాలాక్షుడు(మదిరాక్షుడు) నాలుగు వందలమంది త్రిగర్త సైనిక వీరులను చంపారు. ఆ రథికులిద్దరూ త్రిగర్త సైన్యంలోకి దూసుకు పోయారు. (19)
తౌ ప్రవిష్టా మహాసేనాం బలవంతౌ మనస్వినౌ।
ఆర్ఛేతాం బహుసంరబ్ధౌ కేశాకేశి రథారథి॥ 20
శారీరకంగా మానసికంగా బలవంతులైన యిరువురూ కోపంతో సేనాప్రవేశంచేసి త్రిగర్తసైన్యాన్ని తికమక పెట్టారు. వారు త్రిగర్తసైనికులతో కేశాకేశి, రథారథి యుద్ధం చేశారు. (20)
లక్షయిత్వా త్రిగర్తానాం తౌ ప్రవిష్టౌ రథవ్రజమ్।
అగ్రతః సూర్యదత్తశ్చ మదిరాక్షశ్చ పృష్ఠతః॥ 21
సూర్యదత్తుడు ముందు వైపునుండి, మదిరాక్షుడు వెనుకవైపునుండి త్రిగర్తుల రథసైన్యాన్ని లక్ష్యంగా చేసుకొనొ ప్రవేశించారు. (21)
విరాటస్తత్ర సంగ్రామే హత్వా పంచశతాన్ రథాన్।
హయానాం చ శతాన్యష్టౌ హత్వా పంచ మహారథాన్॥ 22
చరన్ స వివిధాన్ మార్గాన్ రథేన రథసత్తమః।
త్రిగర్తానాం సుశర్మాణమ్ ఆర్చ్ఛద్ రుక్మరథం రణే॥ 23
రథికులలో శ్రేష్ఠుడయిన విరాటరాజు రథమెక్కి వివిధవిన్యాసాల్లో వెడుతూ, అనేకవిధాలుగా రణకౌశలం చూపిస్తూ ఆ యుద్ధంలో అయిదు వందలమంది త్రిగర్త రథికులను, ఎనిమిది వందల గుఱ్ఱపు రౌతులను, అయిదువందల మహారథికులను చంపి తరువాత సుశర్మ యొక్క బంగారు రథాన్ని డీకొన్నాడు. (22,23)
తౌ వ్యవాహరతాం తత్ర మహాత్మానౌ మహాబలౌ।
అన్యోన్యమభిగర్జంతౌ గోష్ఠేషు వృషభావివ॥ 24
మహాత్ములు, బలవంతులు మహామనస్వులు అయిన వారిద్దరు గర్జిస్తూ గోశాలలో ఎద్దులవలె ఒకరు మరొకరితో రణం చేశారు. (24)
తతో రాజా త్రిగర్తానాం సుశర్మా యుద్ధదుర్మదః।
మత్స్యం సమాయాద్ రాజానం ద్వైరథేన నరర్షభః॥ 25
అపుడు యుద్ధోన్మాదం కల త్రిగర్తరాజైన సుశర్మ ద్వంద్వయుద్ధంతో విరాటుని సమీపించాడు. (25)
తతో రథాభ్యాం రథినౌ వ్యతీయతురమర్షణౌ।
శరాన్ వ్యసృజతాం శీఘ్రం తోయధారా ఘనా ఇవ॥ 26
క్రోధంతో నిండిన ఆ రథికులిద్దరూ తమతమ రథాలను ముందుకు పోనిస్తూ దగ్గరకు వచ్చారు. మేఘం వర్షధారలను కురిపించినట్టు ఒకరు మరొకరిపై వేగంగా బాణవర్షం కురిపించారు. (26)
అన్యోన్యం చాపి సంరబ్ధౌ విచేరతురమర్షణౌ।
కృతాస్త్రౌ నిశితైర్బాణైః అసిశక్తిగదాభృతౌ॥ 27
ఒకరిపై మరొకరికి కోపం, అసహనం పెరిగి పోయాయి. ఇద్దరూ అస్త్రవిద్యలో నిపుణులు, ఇరువురికీ కత్తి, శక్తి, గదలు ఉన్నాయి. అపుడు ఇద్దరూ వాడియైన బాణాలతో పరస్పరం కొట్టుకొంటూ రణరంగంలో సంచరించారు. (27)
తతో రాజా సుశర్మాణం వివ్యాధ దశభిశ్శరైః।
పంచభిః పంచభిశ్చాస్య వివ్యాధ చతురో హయాన్॥ 28
ఈ సమయంలో విరాటరాజు సుశర్మను పది బాణాలతో కొట్టాడు. ఐదేసి బాణాలతో నాలుగు గుర్రాలను గాయపరిచాడు. (28)
తథైవ మత్స్యరాజానం సుశర్మా యుద్ధదుర్మదః।
పంచాశతా శితైర్బాణైః వివ్యాధ పరమాస్త్రవిత్॥ 29
అలాగే అస్త్రవేత్త అయిన సుశర్మకూడా యుద్ధో న్మత్తుడయి ఏభయి పదునైన బాణాలతో విరాటుని కొట్టాడు. (29)
తతః సైన్యం మహారాజ మత్స్యరాజసుశర్మణోః।
నాభ్యజానాత్ తదాన్యోన్యం సైన్యేన రజసాఽవృతమ్॥ 30
మహారాజా! తరువాత సైనికుల పాదాల తాకిడిచే దుమ్ము చాలా ఎక్కువగా పైకి రేగింది. ఆ దుమ్ములో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియడంలేదు. (30)
ఇతి శ్రీమహాభారతే, విరాట పర్వణి గోహరణ పర్వణి దక్షిణగోగ్రహే విరాటసుశర్మయుద్ధే ద్వాత్రింశోఽధ్యాయః॥ 32 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోగ్రహణపర్వమను ఉపపర్వమున
విరాటసుశర్మల యుద్ధము అను ముప్పది రెండవ అధ్యాయము. (32)
(దాక్షిణాత్య అధికపాఠము 4 శ్లోకములు కలిపి మొత్తం 34 శ్లోకాలు.)