23. ఇరువదిమూడవ అధ్యాయము

ఉపకీచకులు సైరంధ్రిని బంధించి శ్మశానభూమికి తీసుకొని పోవుట.

వైశంపాయన ఉవాచ
తస్మిన్ కాలే సమాగమ్య సర్వే తత్రాస్య బాంధవాః।
రురుదుః కీచకం దృష్ట్వా పరివార్య సమంతతః॥ 1
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! ఆసమయంలో ఈవార్త తెలుసుకొన్న కీచకుని బంధువులంతా అక్కడకు వచ్చి అతనిని చూసి చుట్టూ చేరి ఏడవసాగారు. (1)
సర్వే సంహృష్టరోమాణః సంత్రప్తాః ప్రేక్ష్య కీచకమ్।
తథా సంభిన్నసర్వాంగం కూర్మం స్థల ఇవోద్ధృతమ్॥ 2
అతని అవయావాలన్ని శరీరంలోకి ముడుచుకు పోయి ఉన్నాయి. వాడు నీటిలోంచి బయటకు తీసిపడేసిన తాబేలువలె ఉన్నాడు. అటువంటి కీచకుణ్ణి చూసి అందరూ భయభ్రాంతులయ్యారు. వారికి రోమాలు నిక్క పొడుచుకున్నాయి. (2)
పోథితం భీమసేనేన తమింద్రేణేవ దానవమ్।
సంస్కారయితుమిచ్ఛంతః బహిర్నేతుం ప్రచక్రముః॥ 3
దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి చంపినట్లు భీమసేనుడు కీచకుణ్ణి చంపాడు. అలా చచ్చిన కీచకునికి దహనసంస్కారం చేయాలని బయటకు తీసుకురాసాగారు. (3)
దదృశుస్తే తతః కృష్ణాం సూతపుత్రాః సమాగతాః।
అదూరాచ్చానవద్యాంగీం స్తంభమాలింగ్య తిష్ఠతీమ్॥ 4
ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఉపకీచకులు అక్కడకు దగ్గర్లో స్తంభాన్ని ఆనుకొని నిలబడి ఉన్న ద్రౌపదిని చూశారు. (4)
సమవేతేషు సర్వేషు తామూచురుపకీచకాః।
హన్యతాం శీఘ్రమసతీ యత్కృతే కీచకో హతః॥ 5
ఆ ఉపకీచకులందరు ఒక్కచోట గుమిగూడి ద్రౌపదిని చూసి 'ఈదుష్టురాలివల్లనే కీచకుడు మరణించాడు. కాబట్టి ఈమెను చంపాలి' అని అన్నారు. (5)
అథవా నైవ హంతవ్యా దహ్యతాం కామినా సహ।
మృతస్యాపి ప్రియం కార్యం సూతపుత్రస్య సర్వథా॥ 6
'లేదా ఈమెను చంపకుండా ఈమెను కోరిన కీచకునితో సహా తీసుకుపోయి తగలబెట్టాలి. అలా చేస్తే మరణించిన కీచకుడికి అన్ని విధాల ప్రియం చేసినట్లు అవుతుంది' అనుకొన్నారు. (6)
తతో విరాటమూచుస్తే కీచకోఽస్యాః కృతే హతః।
సహానేనాద్య దహ్యేమ తదనుజ్ఞాతుమర్హసి॥ 7
ఆ తరువాత వారు విరాటరాజువద్దకు వెళ్లి ఆయనతో 'ఈమె వల్ల కీచకుడు చచ్చిపోయాడు. అందుచేత ఈమెను కీచకుడితోబాటు కాల్చి బూడిద చేస్తాం. ఆజ్ఞ ఇవ్వండి'. అని అడిగారు. (7)
పరాక్రమం తు సూతానాం మత్వా రాజాన్వమోదత।
సైరంధ్ర్యాః సూతపుత్రేణ సహదాహం విశాంపతిః॥ 8
రాజైన విరాటుడు ఆ ఉపకీచకుల పరాక్రమం ముందే బాగా తెలిసిన వాడు, కాబట్టి భయపడి సైరంధ్రిని సూతపుత్రుడైన కీచకుడితో పాటుగా తగలబెట్టడానికి అనుమతించాడు. (8)
తాం సమాసాద్య విత్రస్తాం కృష్ణాం కమలలోచనామ్।
మోముహ్యమానాం తే తత్ర జగృహుః కీచకా భృశమ్॥ 9
ఇంకేముంది? ఉపకీచకులు ఆమెవద్దకు వెళ్లి భయంతో మూర్ఛచెందుతున్నట్లున్న (పద్మాలవంటి కన్నులుగల) ద్రౌపదిని పట్టుకొన్నారు. (9)
తతస్తు తాం సమారోప్య నిబధ్య చ సుమధ్యమామ్।
జగ్మురుద్యమ్య తే సర్వే శ్మశానాభిముఖాస్తదా॥ 10
తరువాత ఆమెను పాడెపై ఎక్కించి శవంతో కలిపి త్రాళ్లతో కట్టి, వారందరు శవాన్ని మోసుకుని శ్మశానం వైపు బయలుదేరారు. (10)
హ్రియమాణా తు సా రాజన్ సూతపుత్రై రనిందితా।
ప్రాక్రోశన్నాథమిచ్ఛంతీ కృష్ణా నాథవతీ సతీ॥ 11
రాజా! పూజ్యురాలైన ద్రౌపదిని సూతపుత్రులు బలవంతంగా తీసుకొని పోతుండగా ఆమె భర్తలుండి కూడా, అనాథ లాగా రక్షణకోసం ఈ విధంగా మొరపెట్టు కోసాగింది. (11)
ద్రౌపద్యువాచ
జయో జయంతో విజయః జయత్సేనో జయద్బలః।
తే మే వాచం విజానంతు సూతపుత్రా నయంతి మామ్॥ 12
ద్రౌపది అంది. 'జయా! జయంతా! విజయా! జయత్సేనా! జయద్బలా! మీరు నామొర వినండి. ఈ సూతపుత్రులు నన్ను తీసుకొనిపోతున్నారు. (12)
వి॥సం॥ జయ - జయంత - విజయ - జయత్సేన - జయద్బల పదాలు పాండవుల రహస్య నామాలు. (సర్వ)
వి॥ పాండవులు రహస్యనామాలు పెట్టుకోవడంలో ద్రౌపదిని విడిచారు. అజ్ఞాతవాసకాలంలో ఈవిధంగా పాండవులను పిలిచే అవసరం ద్రౌపదికి కలిగిందికానీ, ద్రౌపదిని పిలిచే అవసరం పాండవులకు రాలేదు. అందుకే ఆమెకు రహస్యనామం పెట్టలేదేమో.
యేషాం జ్యాతలనిర్ఘోషః విస్ఫూర్జితమివాశనేః।
వ్యశ్రూయత మహాయుద్ధే భీమఘోషస్తరస్వినామ్॥ 13
రథఘోషశ్చ బలవాన్ గంధర్వాణాం తరస్వినామ్॥
తే మే వాచం విజావంతు సూతపుత్రా నయంతి మామ్॥ 14
ఎవరి ధనుష్టంకారం వజ్రాయుధంతో, పిడుగు పాటుతో సమానమో, ఎవరి రథధ్వని శత్రువుల గుండెల్ని పిండి చేస్తుందో అటువంటి మీరుండగానే సూతపుత్రులు నన్ను తీసుకొనిపోతున్నారు. నామొర ఆలకించండి. (13,14)
వైశంపాయన ఉవాచ
తస్యాస్తాః కృపణా వాచః కృష్ణాయాః పరిదేవితమ్।
శ్రుత్వైవాభ్యాపతద్ భీమః శయనాదవిచారయన్॥ 15
వైశంపాయనుడు అన్నాడు. రాజా! భీముడు ఆమె యొక్క దీనమైన ప్రార్థన విని ఏమీ ఆలోచించకుండా వెంటనే శయ్యనుండి లేచాడు. (15)
భీమసేన ఉవాచ
అహం శృణోమి తే వాచం త్వయా సైరంధ్రి భాషితామ్।
తస్మాత్ తే సూతపుత్రేభ్యః భయం భీరు న విద్యతే॥ 16
భీమసేనుడు అన్నాడు. 'సైరంధ్రీ! నీమాటలు నేను వింటున్నాను. అందువల్ల నీకు సూతపుత్రులవల్ల ఎటువంటి భయమూ లేదు.' (16)
వైసంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా స మహాబాహుః విజజృంభే జిఘాంసయా।
తతః స వ్యాయతం కృత్వా వేషం విపరివర్త్య చ॥ 17
అద్వారేణాభ్యవస్కంద్య నిర్జగామ బహిస్తదా।
స భీమసేనః ప్రాకారాత్ ఆరుహ్య తరసా ద్రుమమ్॥ 18
వైశంపాయనుడు అన్నాడు. రాజా! భీముడు అలా అని ఉపకీచకుల్ని చంపాలనుకొని ఒక్కసారి విజృంభించాడు. తన శరీరాన్ని పెంచాడు. వేషం
మార్చుకున్నాడు. గుమ్మంద్వారా కాకుండా గోడదూకి పాకశాలనుండి బయటపడ్డాడు. అలా దాటి వెంటనే ఒక చెట్టెక్కి (ద్రౌపదినివారు ఎక్కడికి తీసుకొని వెళ్లుతున్నారో) చూశాడు. (17,18)
శ్మశానాభిముఖః ప్రాయాద్ యత్ర తే కీచకా గతాః।
స లంఘయిత్వా ప్రాకారం నిఃసృత్య చ పురోత్తమాత్।
జవేన పతితో భీమః సూతానామగ్రతస్తదా॥ 19
ఉపకీచకులు ఎటువెళ్తున్నారో గమనించి భీముడు గోడదూకి, ఊరుదాటి శ్మశానంవైపు వేగంగా వెళ్ళి ఉపకీచకుల కంటె ముందు ఆ ప్రదేశానికి చేరుకొన్నాడు. (19)
చితాసమీపే గత్వా సః తత్రాపశ్యద్ వనస్పతిమ్।
తాలమాత్రం మహాస్కంధం మూర్ధశుష్కం విశాంపతే॥ 20
రాజా! ఒక చితి దగ్గరకు వెళ్లి సమీపంలో ఉన్న తాడిచెట్టును చూశాడు. పొడుగైన బోదె, ఎండిపోయిన పైభాగమూ ఉంది దానికి. (20)
తం నాగవదుపక్రమ్య బాహుభ్యాం పరిరభ్య చ।
స్కంధమారోపయామాస దశవ్యామం పరంతపః॥ 21
ఆ భీముడు ఏనుగువలె చెట్టుదగ్గరికి చేరి పదిబారలపొడవుగల ఆ చెట్టును చేతులతో పెకలించి శత్రుభయంకరంగా భుజంమీదకెత్తుకొన్నాడు. (21)
స తం వృక్షం దశవ్యామం సస్కంధవిటపం బలీ।
ప్రగృహ్యాభ్యద్రవత్ సూతాన్ దండపాణిరివాంతకః॥ 22
బలవంతుడైన ఆ భీముడు పెద్దమాను కలిగి పదిబారల పొడవైన ఆ చెట్టు పుచ్చుకొని ఉపకీచకుల వైపు దండధరుడైన యముడి వలె పరుగెత్తాడు. (22)
ఊరువేగేన తస్యాథ న్యగ్రోధాశ్వత్థకింశుకాః।
భూమౌ నిపతితా వృక్షాః సంఘశస్తత్ర శేరతే॥ 23
ఆ భీముని తొడలవేగంవల్ల(పిక్కబలంతో) ఆ సమీపంలో ఉన్న మర్రి, రావి, మోదుగ మొదలైన చెట్లు కలిసికట్టుగా క్రింద పడిపోయాయి. (23)
తం సింహమివ సంక్రుద్ధం దృష్ట్వా గంధర్వమాగతమ్।
విత్రేషుః సర్వశః సూతాః విషాదభయకంపితాః॥ 24
సింహంలా కోపంతో అక్కడకు వచ్చిన గంధర్వుణ్ణి చూసి ఉపకీచకులందరూ దుఃఖంతోను, భయంతోను వణికిపోయారు. (24)
వి॥సం॥ కీచకమరణంవలన విషాదం, సైరంధ్రిని తీసుకొని రావడమన్న అకార్యకరణం వలన భయం. (విష)
గంధర్వో బలవానేతి క్రుద్ధ ఉద్యమ్య పాదపమ్।
సైరంధ్రీ ముచ్యతాం శీఘ్రం యతో నో భయమాగతమ్॥ 25
'అరే! చూడండి! బలవంతుడైన గంధర్వుడు కోపంతో చెట్టు పుచ్చుకొని వస్తున్నాడు. ఇతని వల్ల మనకు భయం కల్గుతోంది. వెంటనే సైరంధ్రిని విడిచిపెట్టండి.' (25)
తే తు దృష్ట్వా తదా విద్ధం భీమసేనేన పాదపమ్।
విముచ్య ద్రౌపదీం తత్ర ప్రాద్రవన్నగరం ప్రతి॥ 26
భీముడు చెట్టును గిరగిరా తిప్పడాన్ని చూసి ద్రౌపదిని విడిచి వారు నగరంవైపు పరుగుతీశారు. (26)
ద్రవతస్తాంస్తు సంప్రేక్ష్య స వజ్రీ దానవానివ।
శతం పంచాధికం భీమః ప్రాహిణోద్ యమసాదనమ్॥ 27
వృక్షేణైతేన రాజేంద్ర ప్రభంజనసుతో బలీ।
రాజశ్రేష్ఠుడా! ఇంద్రుడు రాక్షసుల వెంటబడి తరిమినట్లు భీముడు పారిపోయే ఉపకీచకుల వెంటబడి తరిమాడు. వాయుపుత్రుడూ, బలవంతుడూ అయిన భీముడు ఆ చెట్టుతో నూటైదుగురు ఉపకీచకులనూ యమలోకానికి పంపాడు. (27 1/2)
తత అశ్వాసయత్ కృష్ణాం స విముచ్య విశాంపతే॥ 28
రాజా! ఆ భీముడు తరువాత ద్రౌపదిని విడిపించి ఓదార్చాడు. (28)
ఉవాచ చ మహాబాహుః పాంచాలీం తత్ర ద్రౌపదీమ్।
అశ్రుపూర్ణముఖీం దీనాం దుర్ధర్షః స వృకోదరః॥ 29
ఆ సమయంలో ద్రౌపది చాలా దీనంగా ఉంది. ఆమె ముఖం కన్నీటితో నిండి ఉంది. మహావీరుడైన భీముడు ఆమెకు ధైర్యం చెపుతూ ఓదార్చాడు. (29)
ఏవం తే భీరు వధ్యంతే యే త్వాం క్లిశ్యంత్యనాగసమ్।
ప్రైహి త్వం నగరం కృష్ణే న భయం విద్యతే తవ॥ 30
అన్యేనాహం గమిష్యామి విరాటస్య మహానసమ్॥ 31
'భీరూ! ఏపాపం ఎరుగని నిన్ను బాధపెట్టినవాళ్లు ఇలాగే మరణిస్తారు. కృష్ణా(ద్రౌపదీ)! నీవు నగరానికి వెళ్లు. ఇప్పుడు నీకేం భయంలేదు. నేను ఇంకోదారిలో విరాటుని వంటశాలకు చేరుకుంటా. (30,31)
వైశంపాయన ఉవాచ
పంచాధికం శతం తచ్చ నిహతం తేన భారత।
మహావనమివ చ్ఛిన్నం శిశ్యే విగలితద్రుమమ్॥ 32
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! చచ్చిపడి ఉన్న ఆ ఉపకీచకులు నూటైదుగురు అడవిని నరికేస్తే అందులో పడిఉన్న చెట్లవలె ఉన్నారు. (32)
ఏవం తే నిహతా రాజన్ శతం పంచ చ కీచకాః।
స చ సేనాపతిః పూర్వమ్ ఇత్యేతత్ సూతషట్ శతమ్॥ 33
రాజా! ఈ విధంగా ఉపకీచకులు నూటైదుగురు అంతకుముందే చనిపోయిన సేనాపతి కీచకుడు కలిసి మొత్తం నూటారుగురు హతులయ్యారు. (33)
తద్ దృష్ట్వా మహదాశ్చర్యం నరా నార్యశ్చ సంగతాః।
విస్మయం పరమం గత్వా నోచుః కించన భారత॥ 34
భరతశ్రేష్ఠుడా! ఆ సమయంలో అక్కడ చాలామంది స్త్రీలు, పురుషులు పోగయ్యారు. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యంలో ఎవరూ ఏమీ మాట్లాడక మిన్నకుండి పోయారు. (34)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి త్రయోవింశోఽధ్యాయః॥ 23 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున ఉపకీచకవధ అను ఇరువదిమూడవ అధ్యాయము. (23)