14. పదునాల్గవ అధ్యాయము

(కీచక పర్వము)

కీచకుడు ద్రౌపదిని మోహించుట, ఆమె తిరస్కరించుట.

వైశంపాయన ఉవాచ
వసమానేషు పార్థేషు మత్స్యస్య నగరే తదా।
మహారథేషు ఛన్నేషు మాసా దశ సమాయయుః॥ 1
యాజ్ఞసేనీ సుదేష్ణాం తు శుశ్రూషంతీ విశాంపతే।
ఆవసత్ పరిచారార్హా సుదుఃఖం జనమేజయ॥ 2
వైశంపాయనుడన్నాడు. - జనమేజయా! మహా రథులైన కుంతీపుత్రులు మత్స్యరాజు నగరంలో ప్రచ్ఛన్నులై ఉంటూండగా అప్పటికి పదిమాసాలు గడిచిపోయాయి. రాజా! ద్రుపదుని కూతురు, స్వయంగా రాణివలె సేవలు పొందడానికి అర్హురాలూ అయిన ద్రౌపది సుదేష్ణకు సేవలు చేస్తూ మిక్కిలి కష్టంగా కాలం వెళ్లబుచ్చుతోంది. (1,2)
వి॥ 1. ద్రుపదునికి యజ్ఞసేనుడనే పేరుంది. యజ్ఞసేనుని కూతురు యాజ్ఞసేని.
2. మాసాదశ సమాయయుః అన్నదానికి తెలుగులో తిక్కన "కతిపయ దినంబులు గొఱంతగా నేడు కాలంబు గడపిన" అని తెనిగించాడు. ఈ తెనిగింపుతో పూర్వాపర వైరుధ్ధ్యం లేకుండా చేశాడు. 24వ అధ్యాయం - 29వశ్లోకంలో మాలిని మరో 13 రోజులు మాత్రం అంతఃపురంలో ఉండ నియ్యమని సుదేష్ణను అభ్యర్థించింది. ఇక్కడ ఇంకా రెండు మాసాలు అజ్ఞాతవాసం ఉంది అని సూచించి అక్కడ 13రోజులే అని అడగడం పూర్వాపరవైరుధ్ధ్యం. అది తొలగించాడు తిక్కన తెలుగులో.
తథా చరంతీ పాంచాలో సుదేష్ణాయా నివేశనే।
తాం దేవీం తోషయామాస తథా చాంతఃపురస్త్రియః॥ 3
సుదేష్ణ భవనంలో అలా సేవ చేస్తున్న పాంచాలి మహారాణి సుదేష్ణను, అంతఃపురస్త్రీలను సంతృప్తి పరిచింది. (3)
తస్మిన్ వర్షే గతప్రాయే కీచకస్తు మహాబలః।
సేనాపతి ర్విరాటస్య దదర్శ ద్రుపదాత్మజామ్॥ 4
ఆ సంవత్సరం చివరకు వచ్చాక ఒకరోజు విరాటరాజు సేనాపతి, మహాబలవంతుడు అయిన కీచకుడు ద్రౌపదిని చూశాడు. (4)
వి॥తె॥ తిక్కన ఈసందర్భంలో కీచకుని ఇలా వర్ణించారు.
"మత్స్యపతి మరందియు, దండనాథుండును, గీచకాగ్రజుండును రూపాభిమానియు, నానాభరణధరణ శీలుండును, దుర్విదగ్ధుండును, బలగర్వితుండును నగు సింహబలుండు తన యప్ప సుదేష్ణకు మ్రొక్కంజనువాఁడద్దేవి కనతిదూరంబున నున్న ద్రుపద రాజనందనం గనుకొని"
ఈ విశేషణాలన్నీ కీచకుని ప్రాధాన్యాన్ని, స్వభావాన్ని వివరిస్తూ ద్రౌపదికి కలగబోయే ఆపద ఎంత బలమైనదో తెలియచేస్తున్నాయి. పైగా అతడు అంతఃపురంలోకి రావడానికి కారణాన్ని సైతం తిక్కన కల్పించాడు. రసదృష్టితో చేసిన పెంపు ఇది.
తాం దృష్ట్వా దేవగర్భాభాం చరంతీం దేవతామివ।
కీచకః కామయామాస కామబాణప్రపీడితః॥ 5
రాజమందిరంలో దేవతామూర్తిలా తిరుగుతీ, దేవకన్యలా మెరిసిపోతున్న ద్రౌపదిని చూసి కీచకుడు మన్మథ బాణపీడితుడై ఆమెను పొందాలనుకొన్నాడు. (5)
వి॥తె॥ ద్రౌపదిని చూడగానే కీచకుని మనసులో కలిగిన భావావేశాన్ని తిక్క 15 పద్యాల్లో కావ్యధోరణిలో వర్ణించాడు.
తే.గీ: ద్రౌపదీరూప మను నురిఁ దగిలి తనదు
హృదయమను మృగమత్తఱి నుదిలకొనుచుఁ
గాముఁడను బల్లిదపువేటకాని బారిఁ
బడుట కెంతయు నా సింహబలుఁడు దలరి.
అనే పద్యం ద్వారా కీచకుని అవస్థతోపాటు భావ్యర్థాన్ని సైతం తిక్కన సూచించాడు.
స తు కామాగ్నిసంతప్తః సుదేష్ణామభిగమ్య వై।
ప్రహసన్నివ సేనానీరిదం వచనమబ్రవీత్॥ 6
కామాగ్నిలో దహించుకుపోతున్న సేనాపతి అయిన ఆ కీచకుడు తన అక్క అయిన సుదేష్ణ దగ్గరకు వెళ్లి నవ్వుతూ అన్నటులుగ ఇలా అన్నాడు. (6)
నేయం మయా జాతు పురేష దృష్టా
రాజ్ఞో విరాటస్య నివేశనే శుభా।
రూపేణ చోన్మాదయతీవ మాం భృశం
గంధేన జాతా మదిరేవ భామినీ॥ 7
'సుదేష్ణా! తన రూపంతో నన్ను మిక్కిలిగ ఉన్మత్తుడిని చేస్తున్న ఈమెను ఇంతకుముందెప్పుడూ విరాటుని అంతః పురంలో నేను చూడనే లేదు. తన దివ్యగంధంతో ఈమె నన్ను మదిరిలా మత్తెక్కిస్తోంది. (7)
కా దేవరూపా హృదయంగమా శుభే
హ్యాచక్ష్వ మే కస్య కుతోఽత్ర శోభనే।
చిత్తం హి నిర్మథ్య కరోతి మాం వశే
న చాన్యదత్రౌషధమస్తి మే మతమ్॥ 8
శుభాంగీ! ఈమె ఎవరు? ఈమె దేవతాస్త్రీవలె అందంగా ఉంది. శోభనాంగీ! ఈమె ఎవరి భార్యయో ఎక్కడనుండి వచ్చిందో నాకు చెప్పు. నాహృదయాన్ని కలచివేస్తూ ఈమె తన వశం చేసుకొంటోంది. ఈ రోగానికి ఈమెను పొందడం కంటె వేరొక మందు ఏదీ లేదు అనిపిస్తోంది నాకు. (8)
అహో తవేయం పరిచారికా శుభా
ప్రత్యగ్రరూపా ప్రతిభాతి మామియమ్।
అయుక్తరూపం హి కరోతి కర్మ తే
ప్రశాస్తు మాం యచ్చ మమాస్తి కించన॥ 9
ఈసుందరి నీ దాసియా! ఆశ్చర్యంగా ఉంది. ఈమె రూపం నిత్యనూతనం అనిపిస్తోంది నాకు. నీ దగ్గర దాసీపని చేయడం ఈమెకు ఎంతమాత్రం తగినది కాదు. నా ఇంటికి యజమానురాలిగా నాకున్నదంతా ఆమె ఏలుకోవాలని నాకోరిక. (9)
ప్రభూతనాగాశ్వరథం మహాజనం
సమృద్ధియుక్తం బహుపానభోజనమ్।
మనోహరం కాంచన చిత్రభూషణం
గృహం మహచ్ఛోభయతామియం మమ॥ 10
నా భవనంలో చాలా గుఱ్ఱాలు, ఏనుగులు, రథాలు ఉన్నాయి. సేవ చేయడానికి ఎంతోమంది పరిజనులు ఉన్నారు. అంతులేని సంపద ఉంది. అనేకవిధాలైన భోజనపానీయాలు ఉన్నాయి. చూడటానికి మనోహరంగా ఉంటుంది. బంగారుచిత్రాలు ఆ అందాన్ని ఇనుమడింప చేస్తున్నాయి. అటువంటి విశాలమైన నాభవనంలో అడుగుపెట్టి ఈసుందరి దానికి మరింత శోభ కలిగించాలి." (10)
తతః సుదేష్ణా మనుమంత్ర్య కీచకః
తతః సమభ్యేత్య నరాధిపాత్మజామ్।
ఉవాచ కృష్ణామభిసాంత్వయం స్తదా
మృగేంద్రకన్యామివ జంబుకో వనే॥ 11
తరువాత కీచకుడు సుదేష్ణ అనుమతి తీసుకొని రాచకూతురయిన ఆ ద్రౌపది దగ్గరకు వచ్చి, అడవిలో నక్క ఆడసింహాన్ని బుజ్జగిస్తున్నట్లుగా ఆమెతో ఇలా అన్నాడు. (11)
వి॥ ఈ ఉపమానం ద్రౌపదీ కీచకుల స్వభావాలలోని అంతరాన్ని సూచిస్తోంది.
కా త్వం కస్యాపి కల్యాణి కుతో వా త్వం వరాననే।
ప్రాప్తా విరాటనగరం తత్త్వమాచక్ష్వ శోభనే॥ 12
'కల్యాణీ! నీ వెవరవు? ఎవ్వరు దానవు? సుముఖీ! నీవు ఎక్కడినుండి ఈ విరాటనగరానికి వచ్చావు? శుభాంగీ! ఉన్నదున్నట్లు చెప్పు. (12)
వి॥ ద్రౌపదిని ఇన్ని రకాలుగా సంబోధించడంలో కీచకునికి ఆమెపై ఉన్న ఆసక్తి వ్యక్త్వమవుతోంది.
రూపమగ్ర్యం తథా కాంతిః సౌకుమార్యమనుత్తమమ్।
కాంత్యా విభాతి వ్యక్త్రం తే శశాంక ఇవ నిర్మలమ్॥ 13
నీ యీ రూపం శ్రేష్ఠమైనది, కాంతి దివ్యమైనది. సుకుమాంత్వం ఉత్తమమైనది. నీముఖం కాంతితో మచ్చలేని చంద్రుడిలా ప్రకాశిస్తోంది. (13)
నేత్రే సువిపులే సుభ్రు పద్మపత్రనిభే శుభే।
వాక్యం తే చారు సర్వాంగి పరపుష్టరుతోపమమ్॥ 14
చక్కని కనుబొమలు కల సర్వాంగసుందరీ! నీ విశాలమైన కన్నులు తామరరేకులతో సమానాలు. నీమాట కోకిల స్వరం వలె ఇంపుగా ఉంది. (14)
ఏవం రూపా మయా నారీ కాచిదన్యా మహీతలే।
న దృష్టపూర్వా సుశ్రోణి యాదృశీ త్వమనిందితే॥ 15
సలక్షణమైనసుందరీ! నీవంటి మనోహరమైన రూపంగల స్త్రీని ఈ భూలోకంలో ఇంతకు ముందెన్నడూ నేను చూడలేదు. (15)
లక్ష్మీః పద్మాలయా కా త్వమ్ అథ భూతిః సుమధ్యమే।
హ్రీః శ్రీః కీర్తిరథో కాంతిః ఆసాం కా త్వం వరాననే॥ 16
చక్కని నడుము కలదానా! నీవు పద్మంనివాసంగా కల లక్ష్మివా? లేక ఆకృతి దాల్చిన విభూతినా? సుముఖీ! హ్రీ(లజ్జ), శ్రీ, కీర్తి, కాంతి - అనే వారిలో నీవు ఎవరవు? (16)
అతీవ రూపిణీ కిం త్వమ్ అనంగాంగవిహారిణీ।
అతీవ భ్రాజసే సుభ్రు ప్రభేవేందోరనుత్తమా॥ 17
నీవు మన్మథుని శరీరంతో ఆటలాడుకునే అతిశయ రూపవతి అయిన రతీదేవివా? చక్కని కనుబొమలు కలదానా! చంద్రుని అత్యుత్తమ మైన కాంతివలె మిక్కిలిగా ప్రకాశిస్తున్నావు. (17)
అపిచేక్షణపక్ష్మణాం స్మితం జ్యోత్స్నోపమం శుభమ్।
దివ్యాంశురశ్మిర్వృత్తం దివ్యకాంతిమనోహరమ్॥ 18
నిరీక్ష్య వక్త్రచంద్రం తే లక్ష్మ్యానుపమయా యుతమ్।
కృత్స్నే జగతి కో నేహ కామస్య వశగో భవేత్॥ 19
నీ ముఖచంద్రుడు సాటిలేని కాంతితో అలరారుతున్నాడు. అర్ధనిమీలితాలైన నీకనురెప్పలు వెన్నెలవలె ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. దివ్యకిరణాలతో ఆవరింపబడిన నీ ముఖమనే చంద్రుడు దివ్యకాంతితో మనసును లోగొంటున్నాడు. ప్రపంచంలోని ఏ మానవుడయినా నిన్ను చూసి కామపరవశుడు కాకుండా ఉండగలడా! (18,19)
హారాలంకారయోగ్యౌ తు స్తనౌ చోభౌ సుశోభనౌ।
సుజాతౌ సహితౌ లక్ష్మ్యా పీనౌ వృత్తౌ నిరంతరౌ॥ 20
ఎత్తయిన, స్థూలమైన, శోభావహమైన, గుండ్రని, క్రిక్కిరిసిన నీచనుదోయి. హారాదిభూషణాలకు యోగ్యమై మిక్కిలి సుందరంగా ఉన్నది. (20)
కుట్మలాంబురుహాకారౌ తవ సుభ్రు పయోధరౌ।
కామప్రతోదావివ మాం తుదత శ్చారుహాసిని॥ 21
అందమైన కనుబొమలు, మనోహరమైన చిరునవ్వుకల సుందరీ! తామరమొగ్గలవంటి నీకుచములు రెండూ మన్మథుని అంకుశాలవలె నన్ను అమితంగా బాధిస్తున్నాయి. (21)
వలీవిభంగచతురం స్తనభారవినామితమ్।
కరాగ్రసమ్మితం మధ్యం తవేదం తనుమధ్యమే॥ 22
సన్నని నడుము కలదానా! మూడు వళులచే ముడుతలుపడి అందమైన నీ నడుము స్తనభారం చేత కొద్దిగా వంగినట్లు కనబడుతోంది. చేతి వ్రేళ్లకొనల చేత కొలవడానికి వోలయినంత (గుప్పిటలో ఇమిడేంత) సన్నంగా ఉంది నీ నడుము. (22)
దృష్ట్యైవ చారుజఘనం సరిత్పులినసంనిభమ్।
కామవ్యాధిరసాధ్యో మామ్ అప్యాక్రామతి భామిని॥ 23
భామినీ! నదిలోని ఇసుకతిన్నెలవలె మనోహరమైన నీ జఘనభాగం చూడగానే కామ మనే అసాధ్యరోగం నావంటి వీరుని కూడా ఆక్రమిస్తోంది. (23)
జజ్వాల చాగ్నిమదనః దావాగ్నిరివ నిర్దయః।
త్వత్సంగమాభిసంకల్పవివృద్ధో మాం దహత్యయమ్॥ 24
నిర్దయుడైన మన్మథుడు అగ్నిస్వరూపుడై నామనస్సనే అడవిని దావాగ్నివలె దహిస్తున్నాడు. నిన్ను పొందాలనే బలమైన కోరిక నేయివలె దానిని మరింత పెంచుతోంది. దానితో మన్మథుడు తీవ్రంగా నన్ను దహించివేస్తున్నాడు. (24)
ఆత్మప్రదానవర్షేణ సంగమాంభోధరేణ చ।
శమయస్వ వరారోహే జ్వలంతం మన్మథానలమ్॥ 25
ముద్దుగుమ్మా! నీ పొమ్దు అనే మేఘం చేత ఆత్మసమర్పణ మనే వర్షం ద్వారా ఈ మండుతున్న మదనాగ్నిని చల్లార్చు. (25)
వి॥ దావాగ్ని చల్లారాలంటే మేఘం కురిసే వర్షమే తగినది. కామాగ్ని చల్లారాలంటే పొందులోని ఆత్మసమర్పణమే తగినది.
మచ్చిత్తోన్మాదనకరాః మన్మథస్య శరోత్కరాః।
త్వత్సంగమాశానిశితాః తీవ్రాః శశినిభాననే।
మహ్యమ్ విదార్య హృదయమ్ ఇదం నిర్దయవేగితాః॥ 26
ప్రవిష్టా హ్యసితాపాంగి ప్రచండాశ్చంగదారుణాః।
అత్యున్మాదసమారంభాః ప్రీత్యున్మాదకరా మమ।
ఆత్మప్రదానసంభోగైః మా ముద్ధర్తుమిహార్హసి॥ 27
చంద్రముఖీ! నామనసుకు ఉన్మత్తత కలిగించే మన్మథుని బాణసమూహాలు నీ సమాగమం అనే ఆశచేత ఒరపిడిపోంది మరింత పదునెక్కాయి. కాటుక కన్నులదానా! మిక్కిలి కోపంతో మన్మథుడు వేస్తున్న ఆ భయంకరమైన తీవ్రబాణాలు దయలేనివై వేగంగా నామనసును చీల్చి అందులో ప్రవేశిస్తున్నాయి. అవి నాకు ప్రేమోన్మాదాన్ని పుట్టిస్తున్నాయి. స్వయంగా నీవు ఇచ్చే సంభోగరూపమైన ఔషధంచేత నన్ను నీవే ఉద్ధరించగలవు. (26,27)
చిత్రమాల్యాంబరధరా సర్వాభరణభూషితా।
కామం ప్రకామం సేవ త్వం మయా సహ విలాసిని॥ 28
విలాసినీ! చిత్రాలైన మాలలు, సుందరమైన వస్త్రాలు ధరించి సర్వాభరణభూషితురాలవై నాతో కలిసి కామభోగాలు ఇచ్చవచ్చినట్లు అనుభవించు. (28)
నార్హసీహాసుఖం వస్తుం సుఖార్హా సుఖవర్జితా।
ప్రాప్నుహ్యనుత్తమం సౌఖ్యం మత్తస్త్వం మత్తగామిని॥ 29
నీవు సుఖం లేని ఇటువంటి చోట్ల ఉండతగవు. నీవు సుఖాలు అనుభవించడానికి యోగ్యమైనదానవు. కానీ సుఖాలకు దూరమైనావు. ఠీవిగా నడిచేదానా! నా వలన సర్వోత్తమసౌఖ్యాలు పొందు. (29)
స్వాదూన్యమృతకల్పాని పేయాని వివిధాని చ।
పిబమానా మనోజ్ఞాని రమమాణా యథాసుఖమ్॥ 30
అమృతం వలె రుచికరమై, మనోహరమైన రకరకాల పానీయాలను త్రాగుతూ నీకు సుఖం కలిగేలా రమించు. (30)
భోగోపచారాన్ వివిధాన్ సౌభాగ్యం చాప్యనుత్తమమ్।
పానం పిబ మహాభాగే భోగైశ్చానుత్తమైః శుభైః॥ 31
ఇదం హి రూపం ప్రథమం తవానఘే
నిరర్థకం కేవలమద్య భామిని।
అధార్యమాణా స్రగివోత్తమా శుభా
న శోభసే సుందరి శోభనా సతీ॥ 32
అదృష్టవంతులారా! అనేక విధాలైన భోగసామగ్రిని, సర్వోత్తమ సౌభాగ్యాన్ని పొంది, ఆ ఉత్తమోత్తమ శుభ భోగాలతోపాటు త్రాగడానికి యోగ్యమైన పానీయాలనూ ఆస్వాదించు. పాపరహితా! నీ ఈ సర్వోత్కృష్ట సౌందర్యం ఇక్కడ వ్యర్థమై పోతోంది. భామినీ! ఉత్తమమైన హారాన్ని ఎవరూ మెడలో ధరించకపోతే శోభావిహీనమవుతుంది. అలాగే అందగత్తెవు అయినప్పటికీ నీ యీ సౌందర్యం ఎవరికీ చెందని కారణంగా శోభించడం లేదు. (31,32)
త్యజామి దారాన్ మమ యే పురాతనా
భవంతు దాస్యస్తవ చారుహాసిని।
అహం చ తే సుందరి దాసవత్ స్థితః
సదా భవిష్యే వశగో వరాసనే॥ 33
చారుహాసినీ! (నీవు కోరితే) ఇంతకుముందున్న నా భార్యలందరిని వదిలివేస్తాను. లేదా వారు నీకి దాసీలు అవుతారు. సుందరీ! సుముఖీ! నేను కూడా దాసుడిలా ఎప్పుడూ నీకు వశమై ఉంటాను.' (33)
ద్రౌపద్యువాచ
అప్రార్థనీయామిహ మాం సూతపుత్రాభిమన్యసే।
విహీనవర్ణాం సైరంధ్రీం బీభత్సాం కేశకారిణీమ్॥ 34
ద్రౌపది అంది -' సూతపుత్రా! నీవు కోరదగని నన్ను కోరుతున్నావు. నేను హీనజాతి దానను. పైగా సైరంధ్రిని. వెగటు కలిగించే వస్త్రాలను ధరించినదానను. ఇతరులకు కేశాలంకారాలు చేశి జీవించే దాసిని. (34)
(స్వేషు దారేషు మేధావీ కురుతే యత్నముత్తమమ్।
స్వదారనిరతో హ్యాశు నరో భద్రాణి పశ్యతి॥
బుద్ధిమంతుడు తన భార్యయందే అనురక్తుడై ఉండటానికి ప్రయత్నిస్తాడు. తన భార్యయందు అనురాగం కల పురుషుడు శీఘ్రంగా శుభాలను పొందగలుగుతాడు.
న చాధర్మేణ లిప్యేత న చాకీర్తిమవాప్నుయాత్।
స్వదారేషు రతిర్ధర్మః మృతస్యాపి న సంశయః॥
మనుష్యు డెప్పుడూ పాపాత్ముడు కాకూడదు. అపకీర్తి పొందకూడదు. తనభార్యయందే అనురాగం కలిగి ఉండాలి. ఇది పరమధర్మం. చనిపోయాక కూడా అతనికి శుభాన్ని కలిగిస్తుందిది. ఇందులో సంశయం లేదు.
స్వజాతిదారా మర్త్యస్య ఇహలోకే పరత్ర చ।
ప్రేతకార్యాణి కుర్వంతి నివాపై స్తర్పయంతి చ॥
తమకులస్త్రీలు పురుషునికి ఇహపరలోకాలలో కూడా మేలు చేకూరుస్తారు. అపరకర్మలు చేసి తిలోదకాలు ఇవ్వడం ద్వారా చనిపోయిన వ్యక్తికి తృప్తి కలిగిస్తారు.
తదక్షయ్యం చ ధర్మ్యం చ స్వర్గ్యమాహుర్మనీషిణః।
స్వజాతిదారజాః పుత్రాః జాయంతే కులపూజితాః॥
వారి ఈ పనులన్నిటినీ బుద్ధిమంతులైన పురుషులు అక్షయమనీ, ధర్మసంగత మనీ, స్వర్గ ప్రాప్తికారక మనీ చెప్తూ ఉంటారు. తమకుల స్త్రీలవలన పుట్టిన సంతానం కులంలో గౌరవింప బడుతుంది.
ప్రియా హి ప్రాణినాం దారాః తస్మాత్ త్వం ధర్మభాగ్ భవ।
పరదారరతో మర్త్యః న చ భద్రాణి పశ్యతి॥)
సమస్తప్రాణులకు తమతమ భార్యలే ప్రీతిపాత్రం అవుతారు. కాబట్టి నీవుకూడా అలాగే నడుచుకొని ధర్మరతుడవు కమ్ము. పరస్త్రీలంపటుడైన పురుషుడు ఎన్నడూ శుభాలను పొందలేడు.
పరదారాస్మి భద్రం తే న యుక్తం తవ సాంప్రతమ్।
దయితాః ప్రాణినాం దారాః ధర్మం సమమచింతయ॥ 35
అన్నిటినీమించి నేను పరస్త్రీని. నీకు శుభమగు గాక. ఇప్పుడు నాతో ఇలా మాటలాడడం నీకు ఏవిధంగానూ తగినది కాదు. ప్రపంచంలోని అన్ని ప్రాణులకు తమ స్త్రీయే ప్రియమైనది అవుతుంది. నీవు ఈ ధర్మాన్ని గురించి ఆలోచించు. (35)
పరదారే న తే బుద్ధిః జాతు కార్యా కథంచన।
వివర్జనం హ్యకార్యాణామ్ ఏతత్ సుపురుషవ్రతమ్॥ 36
పరస్త్రీయందు నీకు ఎప్పుడూ ఏ కోరికా కలగ కూడదు. చేయకూడని అనుచితకార్యాలు సర్వథా విడువదగినవి. ఇదే సత్పురుషుల వ్రతం. (36)
మిథ్యాభిగృథ్నో హి నరః పాపాత్మా మోహమాస్థితః।
అయశః ప్రాప్నుయాద్ఘోరం మహద్వా ప్రాప్నుయాద్భయమ్॥ 37
అసత్యవిషయాలలో ఆసక్తి కలిగిన పాపాత్ముడైన పురుషుడు మోహంలో పడి ఘోరమైన అపకీర్తిని పొందుతాడు. లేదా పెద్దభయాన్ని (మృత్యువును) ఎదుర్కొనవలసి ఉంటుంది.' (37)
వి॥ తె॥ పరదారాభిగమనం మంచిది కాదని సుదేష్ణ చెపుతుంది. తెలుగులో - కాస్త విస్తృతంగానే చెపుతుంది. తిక్కన చేసినమార్పు ఇది. ముందు ద్రౌపది భయపెట్టి చూస్తుంది. ఆతడు నీచుడు కాబట్టి భయపెట్టడమే సమంజసమని తిక్కన నిష్కర్ష. తన భర్తలు
గంధర్వులనీ, ఎంత వారినయినా సంహరిస్తారని చక్కని శార్దూలపద్యంలో చెపుతుంది.
దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంథ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లోలన్ వెసన్ గిట్టి గం
ధర్వుల్ మానము ప్రాణముం గొనుట తథ్యంబెమ్మెయిం గీచకా! 2-55
ఈ పద్యం ద్రౌపది భీమునితో చెప్పినపుడు కూడా చెపుతుంది. అనగా తిక్కనకు ఈపద్యం ఎంతో ఇష్టమని భావించాలి.
వాడు ఆ మాటలకు లొంగక అక్క సుదేష్ణ దగ్గరకు వెళ్లాడు. సుదేష్ణ పరదారాభిగమనం పనికిరాదని నివారిస్తుంది. నిన్ను కావాలనుకొనే స్త్రీలు చాలామంది ఉండగా నీరసాకారసైరంధ్రిని కోరతావేమిటి? అని మళ్లిస్తుంది. దానికి లొంగడు. అపుడు పరదారాగమనం గురించి
ఆయురైశ్వర్య కీర్తుల నపహరించు
పరసతీసంగమము; ధర్మపథము నందుఁ
బరగు వారలు పరిహరింపంగఁ గనియు
వినియుఁ దెలియవె యిది దుర్వివేకమగుట. (2-69)
జారిణీతో సంగమం హృదయానికి ఇంపుగా ఉండదని వివరించి చెప్పింది. అయినా వినకపోతే దానిపతులు గంధర్వులు, వాళ్ల మాట చెప్పాలంటేనే నాకు భయం కలుగుతోంది అని భయపెడుతుంది. కానిమార్గంలో ప్రవర్తిస్తే బ్రతుకు నిలవదు. ఎంత రుచిగా ఉన్నా వివేకులు అపథ్యములకు మొగ్గుచూపరని హితవు చెప్పింది.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు సైరంధ్ర్యా కీచకః కామమోహితః।
జానన్నపి సుదుర్బుద్ధిః పరదారాభిమర్శనే॥ 38
దోషాన్ బహూన్ ప్రాణహరాన్ సర్వలోకవిగర్హితాన్।
ప్రోవాచేదం సుదుర్బుద్ధిః ద్రౌపదీమజితేంద్రియః॥ 39
వైశంపాయనుడన్నాడు. సైరంధ్రి ఈ రీతిగా హెచ్చరించినా కీచకునకు బుద్ధి రాలేదు. వాడు కామమోహితుడై ఉన్నాడు. పరస్త్రీయొక్క పొందువలన లోకనింద కలుగుతుంది. ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడవచ్చు. ఇన్ని దోషాలు దానివలన కలుగుతాయని తెలిసినా ఇంద్రియనిగ్రహం లేని కీచకుడు ద్రౌపదితో ఇలా అన్నాడు. (38,39)
నార్హస్యేవం వరారోహే ప్రత్యాఖ్యాతుం వరాననే।
మాం మన్మథసమావిష్టం త్వత్కృతే చారుహాసుని॥ 40
'వరారోహా! సుముఖీ! నా ఈ కోరికను తిరస్కరించకు. చారుహాసినీ! నీగురించే నేను మన్మథునిచే పీడింపబడుతున్నాను. (40)
ప్రత్యాఖ్యాయ చ మాం భీరు వశగం ప్రియవాదినమ్।
నూనం త్వమసితాపాంగి పశ్చాత్తాపం కరిష్యసి॥ 41
భీరూ! నేను నీకు అధీనుడను. ప్రియం పలుకుతున్నాను. కాటుక కన్నులదానా! నన్ను తిరస్కరించి నిశ్చయంగా నీవు పశ్చాత్తాపం పొందుతావు. (41)
అహం హి సుభ్రు రాజ్యస్య కృత్స్నస్యాస్య సుమధ్యమే।
ప్రభుర్వాసయితా చైవ వీర్యే చాప్రతిమః క్షితౌ॥ 42
చక్కని కనుబొమలు, సన్నని నడుము కలదానా! నేను ఈ సమస్తరాజ్యానికి అధిపతిని. అంతేకాదు. ఈ రాజ్యాన్ని నిలబెట్టినది నేనే. బలపరాక్రమాలలో ఈ భూమి మీద నాతో సమానులు ఎవరూ లేరు. (42)
పృథివ్యాం మత్సమో నాస్తి కశ్చిదన్యః పుమానిహ।
రూపయౌవన సౌభాగ్యైః భోగైశ్చానుత్తమైః శుభైః॥ 43
రూపయౌవన సౌభాగ్యాలతోను, సర్వోత్తమమైన శుభకరమైన భోగాలతోను నాతో సాటిరాగలవాడు ఈ భూమిమీద మరొకడు లేడు. (43)
సర్వకామసమృద్ధేషు భోగేష్వనుపమేష్విహ।
భోక్తవ్యేషు చ కల్యాణి కస్మాద్ దాస్యే రతాహ్యసి॥ 44
కల్యాణి! సమస్తమైన మనోరథాలు తీర్చగల అనుపమమైన భోగాలు ఇక్కడ నీకు అనుభవించడానికి అందుబాటులో ఉండగా ఈ దాసిపనిలో నీ కెందుకు ఆసక్తి? (44)
మయా దత్తమిదం రాజ్యం స్వామిన్యసి శుభాననే।
భజస్వ మాం వరారోహే భుంక్ష్వ భోగాననుత్తమాన్॥ 45
శుభముఖీ! నేను ఈ సమస్తరాజ్యాన్నీ నీకు అర్పిస్తున్నాను. నీవు ఇప్పుడు దీనికి మహారాణివి. నన్ను స్వీకరించు. నాతో కూడి ఉత్తమోత్తమభోగాలు అనుభవించు. (45)
ఏవముక్తాతు సా సాధ్వీ కీచకేనాశుభం వచః।
కీచకం ప్రత్యువాచేదం గర్హయంత్యస్య తద్ వచః॥ 46
కీచకుని ఆ పాపపుమాటలు వినక పరమసాధ్వి అయిన ఆ ద్రౌపది అతని మాటలను నిరసిస్తూ ఇలా బదులు చెప్పింది. (46)
సైరంధ్ర్యువాచ
మా సూతపుత్ర ముహ్యస్వ మాద్య త్యక్షస్వ జీవితమ్।
జానీహి పంచభి ర్ఘోరైః నిత్యం మా మభిరక్షతామ్॥ 47
సైరంధ్రి అంటోంది. 'సూతపుత్రా! నీవు ఇలా మోహజాలంలో పడకు. ఇప్పుడే నీ ప్రాణాలు పోగొట్టుకోకు ఐదుగురు భయంకరులైన గంధర్వులు నన్ను నిత్యం రక్షిస్తూ ఉంటారని తెలుసుకో. (47)
న చాప్యహం త్వయా లభ్యా గంధర్వాః పతయో మమ।
తే త్వాం నిహన్యుః కుపితాః సాధ్వలం మావ్యనీనశః॥ 48
గంధర్వులే నాపతులు. నీవు నన్నెప్పటికీ పొందలేవు. వారు ఆగ్రహిస్తే నిన్ను చంపుతారు. కాబట్టి నిన్ను నీవు అదుపులో ఉంచుకో. ఈ పాపబుద్ధిని విడిచిపెట్టు. సర్వనాశనం కాకు సుమా! (48)
అశక్యరూపం పురుషైః అధ్వానం గంతుమిచ్ఛసి।
యథా నిశ్చేతనో బాలః కూలస్థః కూలముత్తరమ్।
తర్తుమిచ్ఛతి మందాత్మా తథాత్వం కర్తు మిచ్ఛసి॥ 49
ఓరీ! ఎవరీ నడవని మార్గంలో నీవు నడవాలనుకొంటున్నావు. మందబుద్ధి అయి ఒడ్డున కూర్చున్న కదలలేని బాలుడు నది అవతలి ఒడ్డుకు చేరాలను కోరుకొన్నట్లుగ నీవు కూడా వినాశకరమైన పని చేయాలని కోరుకొంటున్నావు. (49)
వి॥ ఉపమానం ద్రౌపది దృష్టిలో కీచకుని స్థానాన్ని సూచిస్తోంది.
అంతర్మహీం వా యది వోర్ధ్వముత్పతేః
సముద్రపారం యది వా ప్రధానసి।
తథాపి తేషాం న విమోక్షమర్హసి
ప్రమాథినో దేవసుతా హి ఖేచరాః॥ 50
సూతసుతుడా! నన్ను పాపచింతనతో చూచిన నీవు పాతాళంలో దాగినా, ఆకాశానికి ఎగిరినా, సముద్రపు ఆవలితీరానికి పారిపోయినా నాభర్తల చేతినుండి తప్పించుకోలేవు. ఎందుకంటే వారు దేవపుత్రులు. ఆకాశంలో సంచరించ గలిగినవారు. వారు తమ శత్రువులను మథించగలిగిన శక్తి సంపన్నులు. (50)
(మాం హి త్వమవమన్వానః సూతపుత్ర వినంక్ష్యసి।
ఆశు చాద్యైవ న చిరాత్ సపుత్రః సహబాంధవః॥
సూతపుత్రా! నీవు నన్ను అవమానిస్తున్నావు. కొడుకులతో బంధువులతో కూడా నీకు ఇప్పుడే చేటు మూడుతుంది. నీ వినాశనానికి ఇంక సమయం లేదు.
దుర్లభామభిమన్వానః మాం వీరై రభిరక్షితామ్।
పతిష్యస్యవశస్తూర్ణం వృంతాత్ తాలఫలం యథా॥
వీరులైన గంధర్వులచేత రక్షింపబడే నేను నీకు పొందరానిదానను. ముగ్గిన తాటిపండు తొడిమ నుండి ఎలా రాలిపోతుందో అలాగే నన్ను అవమానించిన నీవు తప్పక పతనమైపోతావు.
యో మామజ్ఞాయ కామార్తః అబద్ధాని ప్రభాషసే।
అశక్తస్తు పుమాంచ్ఫైలం న లంఘయితు మర్హతి॥
నీవు నన్నెరుగక కామాతురుడవై ఇలా వెంగలి మాటలు పలుకుతున్నావు. అశక్తుడైన పురుషుడు ఎంత ప్రయత్నించినా పర్వతాన్ని ఎగిరి దాటలేడు.
దిశః ప్రసన్నో గిరిగహ్వరాణి వా
గుహాం ప్రవిష్టోఽతరితోఽపి వా క్షితేః॥
జుహ్వం జపన్ వా ప్రపతన్ గిరేస్తటా
ద్ధుతాశనాదిత్యగతిం గతోఽపి వా।
భార్యాభిమంతా పురుషో మహాత్మనాం
న జాతు ముచ్యేత కథం చ నాహతః॥
దిక్కులను శరణుచొచ్చి తిరిగినా, కొండగుహలలో దుర్గమ కందరాలలో దాగినా, భూమిలో చొచ్చుకుపోయినా, హోమాలు జపాలు చేసినా, కొండశిఖరాలనుండి దూకినా, ప్రచండకిరణాలు కలిగిన సూర్యాగ్నులను శరణు వేడినా, మహాత్ములైన గంధర్వుల భార్యనైన నన్ను అవమానించిన నీవు వారి చేతులనుండి తప్పించుకుని బ్రతుకలేవు.
మోఘం తవేదం వచనం భవిష్యతి
ప్రతోలనం వా తులయా మహాగిరేః।
హుతాశనం ప్రజ్వలితం మహావనే
నిదాఘమధ్యాహ్న ఇవాతురః స్వయమ్॥
ప్రవేష్టుకామోఽసి వధాయ చాత్మనః
కులస్య సర్వస్య వినాశనాయ చ॥
నీ ఈ మాటలన్నీ వ్యర్థాలే. మహాపర్వతాన్ని త్రాసులో ఉంచి తూచడం అలాగే నన్ను పొండడం కూడా అసాధ్యం. వేసవిలో మిట్టమధ్యాహ్నంవేళ కార్చిచ్చుతో మండుతూ ఉన్న అడవిలోకి ఆతురతతో స్వయంగా ప్రవేశించిన వానివలె నీవు నీ చావు కోరి నీ వంసమంతా నశించడానికే ఇందులో ప్రవేశించాలనుకొంటున్నావు.
సదేవగంధర్వ మహర్షి సంనిధౌ
సనాగలోకాసుర రాక్షసాలయే।
గూఢస్థితాం మా మవమన్య చేతసా
న జీవితార్థీ శరణం త్వ మాప్స్యసి॥)
నేను ఇక్కడ ఎవరికి తెలియకుండా బ్రతుకుతున్నాను. అయినా నీవు తెలిసి తెలిసీ నన్ను అవమాన పరుస్తున్నావు. కాని ఒక్క విషయం గుర్తుంచుకో. నీవు అలాచేసి నీప్రాణాలను దక్కించుకోవడం కోసం గంధర్వుల, మహర్షుల, దేవతల దగ్గరకు పోయినా, నాగలోకం, అసురలోకం, రాక్షసస్థావరాలలో దాగినా నీకు అక్కడ శరణు లభించదు.)
త్వం కాలరాత్రీమివ కశ్చిదాతురః
కిం మాం దృఢం ప్రార్థయసేఽద్య కీచక।
కిం మాతురంకే శయితో యథా శిశుః
చంద్రం జిఘృక్షురివ మన్యసే హి మామ్॥ 51
కీచకా! రోగి కాలరాత్రిని ఆహ్వానించినట్లుగా నీవు ఎందుకు ఇంతగా పట్టుపట్టి ఈ నాడు నన్ను పొందాలని ప్రార్థిస్తున్నావు? నీవు ఒడిలోని బిడ్డ ఆకాశంలోని చందమామను పట్టుకోవాలని కోరుకొన్నట్లుగా నీవు నన్ను పొందాలనుకొంటున్నావు. (51)
వి॥ మొదటి ఉపమానంలో కీచకుని నాశనం, రెండవ పోలికలో అతనికి ద్రౌపదిపొందు అలభ్యమనీ సూచించబడింది.
తేషాం ప్రియాం ప్రార్థయతో న తే భువి
గత్వా దివం వా శరణం భవిష్యతి।
న వర్తతే కీచక తే దృశా శుభం
యా తేన సంజీవనమర్థయేత సా॥ 52
కీచకా! ఆ గంధర్వుల ప్రియపత్నినైన నన్ను అనుచితంగా కోరిన నీకు ఆకాశంలోగాని భూమిమీద గాని శరణు ఇచ్చేవారు లేరు. నీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనే ముందుచూపుగాని, అలోచనగాని చేయలేనంత కామాంధుడవు అయ్యావు.' (52)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధ పర్వణి కీచక కృష్ణా సంవాదే చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమునన కీచకవధ పర్వమను
ఉపపర్వమున ద్రౌపదీకీచక సంవాదమను పదునాల్గవ అధ్యాయము.(14)
(దాక్షిణాత్య ప్రతి అధికపాఠము 12 శ్లోకాలు కలిపి మొత్తం 64 శ్లోకాలు.)