13. పదమూడవ అధ్యాయము

(సమయపాలన పర్వము)

భీమసేనుడు జీమూతమల్లుని వధించుట.

జనమేజయ ఉవాచ
ఏవం తే మత్స్యనగరే ప్రచ్ఛన్నాః కురునందనాః।
అత ఊర్ధ్వం మహావీర్యాః కిమకుర్వత వై ద్విజ॥ 1
జనమేజయుడు అడిగాడు. విప్రోత్తమా! ఇలా ఆ పాండవులు మత్స్యదేశంలో అజ్ఞాతంగా ఉండి అటు పిమ్మట ఏంచేశారు? (1)
వైశంపాయన ఉవాచ
ఏవం మత్స్యస్య నగరే ప్రచ్ఛన్నాః కురునందనాః।
ఆరాధయంతో రాజానం యదకుర్వత తచ్ఛృణు॥ 2
వైశంపాయనుడు చెప్పాడు. ఇలా మత్స్యరాజు విరాటుని నగరంలో అజ్ఞాతంగా ఉన్న కురువంశజులైన పాండవులు ఆ రాజును సేవిస్తూ ఏంచేశారో చెపుతా విను. (2)
తృణబిందుప్రసాదాచ్చ ధర్మస్య చ మహాత్మనః।
అజ్ఞాతవాసమేవం తు విరాటనగరేఽవసన్॥ 3
యుధిష్ఠిరః సభాస్తారః మత్స్యానామభవత్ ప్రియః।
తథైవ చ విరాటస్య సపుత్రస్య విశాంపతే॥ 4
స హ్యక్షహృదయజ్ఞస్తాన్ క్రీడయామాడ పాండవః।
అక్షవత్యాం యథాకామం సూత్రబద్ధానివ ద్విజాన్॥ 5
రాజర్షి తృణబిందువుయొక్క, మహాత్ముడైన ధర్మదేవతయొక్క అనుగ్రహంవలన విరాటనగరంలో పాండవులు అజ్ఞాతవాసం ఇలా చేశారు. జనమేజయా! సభాస్తారుడైన ధర్మరాజు మత్స్యదేశజనులకూ, విరాటునికీ, అతని కుమారునికీ మిక్కిలి ప్రీతిపాత్రు డయ్యాడు. పాచికలమర్మం తెలిసిన ధర్మరాజు అక్షశాలలో త్రాటికి కట్టిన పక్షులనువలె ఇష్టానుసారంగా పాచికలను వేయసాగాడు. (3-5)
వి॥సం॥ తృణబిందుడు శ్వేతపర్వతనివాసియైన రాజర్షి. వేయిసంవత్సరాలు వ్రతం చేసి వ్రతపారణంగా గడ్డిమీదనున్న నీటిబిందువులను స్వీకరించాడు. కాబట్టి తృణబిందుడనే పేరు. తృణబిందుని గూర్చి పరంపరగా వస్తున్న ఒక శ్లోకం-
తృణబిందోః ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః।
దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతోఽతిధార్మికాః॥
తృణబిందువు అనుగ్రహంవలన విశాలారాజులందరును దీర్ఘాయుష్కులు, మహాత్ములు, పరాక్రమవంతులు, ధార్మికులు కాగలిగారు. (విష)
అజ్ఞాతం చ విరాటస్య విజిత్య వసు ధర్మరాట్।
భ్రాతృభ్యః పురుషవ్యాఘ్రః యథార్హం సంప్రయచ్ఛతి॥ 6
విరాటరాజుకు తెలియకుండా పురుషశ్రేష్ఠుడైన ధర్మరాజు తాను జయించిన ధనాన్ని యోగ్యమైన తీరులలో తన సోదరులకు ఇస్తూ ఉండేవాడు. (6)
భీమసేనోఽపి మాంసాని భక్ష్యాణి వివిధాని చ।
అతిసృస్తాని మత్స్యేన విక్రీణీథే యుధిష్ఠిరే॥ 7
భీమసేనుడు విరాటునికై వినియోగించగా మిగిలిన మాంసాదులనూ, భక్ష్యాలనూ తన సోదరులైన ధర్మజాదులకు అమ్మేవాడు. (7)
వాసాంసి పరిజీర్ణాని లబ్ధాన్యంతఃపురేఽర్జునః।
విక్రీణానశ్చ సర్వేభ్యః పాండవేభ్యః ప్రయచ్ఛతి॥ 8
అర్జునుడు అంతఃపురంలో లభించిన జీర్ణవస్త్రాలను అందరకు అమ్ముతూ ఉన్నట్లు పాండవులకు ఇచ్చేవాడు. (8)
సహదేవోఽపి గోపాల వేషమాస్థాయ పాండవః।
దధి క్షీరం ఘృతం చైవ పాండవేభ్యః ప్రయచ్ఛతి॥ 9
గోపాలకుని వేషంలో సహదేవుడుకూడా పాలు, పెరుగు, నెయ్యి, పాండవులకిస్తూ ఉండేవాడు. (9)
నకులోఽపి ధనం లబ్ధ్వా కృతే కర్మణి వాజినామ్।
తుష్టే తస్మిన్ నరపతౌ పాండవేభ్యః ప్రయచ్ఛతి॥ 10
నకులుడు కూడ గుఱ్ఱాల పనితో విరాటరాజును సంతోషపేట్టి తాను పొందిన ధనాన్ని పాండవులకు ఇస్తూ ఉండేవాడు. (10)
కృష్ణా తు సర్వాన్ భర్తౄంస్తాన్ నిరీక్షంతే తపస్వినీ।
యథా పునరవిజ్ఞాతా తథా చరతి భామినీ॥ 11
ద్రౌపది మాత్రం దీనురాలై తనభర్తలందరినీ నిరీక్షిస్తూ ఎవరికీ తెలియకుండా సంచరిస్తూ ఉండేది. (11)
ఏవం సంపాదయంతస్తే తదాన్యోన్యం మహారథాః।
విరాటనగరే చేరుః పునర్గర్భధృతా ఇవ॥ 12
ఇలా అన్యోన్యంగా సంపాదిస్తూ మహారథులైన పాండవులు మరల మాతృగర్భంలో ప్రవేశించినట్లు అజ్ఞాతంగా విరాటనగరంలో సంచరించారు. (12)
సాశంకా ధార్తరాష్ట్రస్య భయాత్ పాండుసుతాస్తదా।
ప్రేక్షమాణాస్తదా కృష్ణామ్ ఊషుశ్ఛన్నా నరాధిప॥ 13
రాజా! ధృతరాష్ట్రకుమారుడైన దుర్యోధనుని వల్ల భయంతోనూ, అనుమానంతోనూ ఉన్న పాండవులు ద్రౌపదిని కనిపెట్టుకొంటూ అజ్ఞాతంగా ఉన్నారు. (13)
అథ మాసే చతుర్థే తు బ్రహ్మణః సుమహోత్సవః।
ఆసీత్ సమృద్ధో మత్స్యేషు పురుషాణాం సుసమ్మతః॥ 14
తత్ర మల్లాః సమాపేతుః దిగ్భ్యో రాజన సహస్రశః।
సమాజే బ్రహ్మణో రాజన్ యథా పశుపతేరివ॥ 15
రాజా! నాల్గవనెలలో మత్స్యరాజ్యంలో ప్రజలకిష్టమైన బ్రహ్మోత్సవం జరిగింది. అక్కడకు అన్నిదిక్కులనుండి వేలకొలది మల్లులు వచ్చారు. ఆ బ్రహ్మోత్సవసభ ఈశ్వరునిసభవలె ఉంది. (14,15)
వి॥సం॥ శరత్కాలంలో కొత్తపంట చేతికి వచ్చినపుడు చేసే ఉత్సవం బ్రహ్మోత్సవం. కొన్ని ప్రాంతాలలో ప్రసిద్ధం. (నీల)
మహాకాయా మహావీర్యాః కాలఖంజా ఇవాసురాః।
వీర్యోన్మత్తా బలోదగ్రాః రాజ్ఞా సమభిపూజితాః॥ 16
గొప్పశరీరమూ బలమూ కలవారును, కాల ఖంజులనే రాక్షసులవంటి వారునూ, శక్తిచే ఉన్మత్తులూ, బలంచే భయంకరులూ అయిన ఆ మల్లులు రాజుచేత చాలా గౌరవింపబడ్డారు. (16)
సింహస్కంధకటిగ్రీవాః స్వబదాతా మనస్వినః।
అసకృల్లబ్ధలక్షాస్తే రంగే పార్థివసంనిధౌ॥ 17
సింహంవంటి భుజాలూ, నడుమూ, మెడ కల్గి స్వచ్ఛమయిన కీర్తిచే ప్రకాశించే ఆ మల్లులు అనేకపర్యాయాలు రాజు ఎదుట యుద్ధరంగంలో విజయాన్ని సాధించిన వారు. (17)
తేషామేకో మహానాసీత్ సర్వమల్లానథాహ్వయత్।
ఆవల్గమానం తం రంగే నోపతిష్ఠతి కశ్చన॥ 18
వారిలో ఒక గొప్పమల్లయోధుడున్నాడు. అతడు మల్లులనందరినీ యుద్ధానికి పిలవసాగాడు. అలా రంగంలో తిరుగుతున్న అతని మీదకు ఒక్కడైనా వెళ్లలేకపోయాడు. (18)
వి॥సం॥ అవల్గమానం = ఎగిరెగిరిపడుతున్న
యదా సర్వే విమనసః తే మల్లా హతచేతసః।
అథ సూదేన తం మల్లం యోధయామాస మత్స్యరాట్॥ 19
అక్కడున్న మల్లులందరూ ఉదాసీనులూ, భీతచిత్తులూ అయ్యారు. అపుడు విరాటరాజు తన పాకశాలలోని వంటవానిని అతనితో పోరాడటానికి పంపాడు. (19)
నోద్యమానస్తదా భీమః దుఃఖేనైవాకరోన్మతిమ్।
న హి శక్నోతొ వివృతే ప్రత్యాఖ్యాతుం నరాధిపమ్॥ 20
అపుడు రాజు ఉత్సాహపరచినా భీముడు అజ్ఞాతవాసభయంతో ఇష్టం లేకపోయినా పోరాడటానికి సిద్ధపడ్డాడు. పైకి రాజు మాటను తిరస్కరింపలేక పోయాడు. (20)
వి॥సం॥ భీముడు దుఃఖపడటానికి కారణం పారతంత్ర్యం లేదా అజ్ఞాతవాసి భంగభయం. అంతేకానీ ఓడిపోతానన్న బాధ భీముడికి లేదు. (నీల, అర్జు, విష)
తతః స పురుషవ్యాఘ్ర శార్దూలశిథిలశ్చరన్।
ప్రవివేశ మహారంగం విరాటమభిపూజయన్॥ 21
తరువాత పురుషశ్రేష్ఠుడైన భీముడు విరాటుని గౌరవిస్తూ పులివలె విలాసంగా నడుస్తూ ఆ మహారంగంలో ప్రవేశించాడు. (21)
బబంధ కక్షాం కౌంతేయః తతః సంహర్షయన్ జనమ్।
తతస్తు వృత్రసంకాశం భీమౌ మల్లం సమాహ్వయత్॥ 22
జీమూతం నామ తం తత్ర మల్లం ప్రఖ్యాతవిక్రమమ్।
భీముడు అచటిజనులను ఆనందపరుస్తూ నడుము బిగించికొని, వృత్రాసురునివలె ఉన్న ప్రఖ్యాత విక్రముడైన ఆ జీమూతమల్లుని ఆహ్వానించాడు. (22 1/2)
తావుభౌ సుమహోత్సాహౌ ఉభౌ భీమపరాక్రమౌ॥ 23
మత్తావివ మహాకాయౌ వారణౌ షష్టిహాయనా।
వారిద్దరూ మిక్కిలి ఉత్సాహవంతులు. ఇద్దరూ భయంకర పరాక్రమంకలవారు. ఇరువురూ పెద్ద శరీరంకల అరవైఏళ్ల మదపుటేనుగుల్లాగా ఉన్నారు. (23 1/2)
తతస్తౌ నరశార్దూలౌ బాహుయుద్ధం సమీయతుః॥ 24
వీరౌ పరమసంహృష్టౌ అన్యోన్యజయకాంక్షిణౌ।
ఆసీత్ సుభీమః సంపాతః వజ్రపర్వతయోరివ॥ 25
ఆ నరశ్రేష్ఠులిద్దరూ బాహుయుద్ధం ప్రారంభించారు. వీరులు ఇద్దరూ మిక్కిలి ఆనందంలో ఉన్నారు. పరస్పరం విజయం కాంక్షించే వారిపోరు వజ్రాయుధమ్Y, పర్వతమూ తలపడినట్లు భయంకరంగా ఉంది. (24,25)
ఉభౌ పరమసంహృష్టౌ బలేనాతిబలావుభౌ।
అన్యోన్యస్యాంతరం ప్రేప్సుః పరస్పరజయైషిణౌ॥ 26
వారిరువురూ మిక్కిలిప్రసన్నులై ఉన్నారు. ఇద్దరూ మిక్కిలి బలవంతులే. పరస్పరం జయం కాంక్షిస్తూ ఒకరిపై వేరొకరు అవకాశం కోసం చూస్తున్నారు. (26)
ఉభౌ పరమసంహృష్టౌ మత్తావివ మహాగజౌ।
కృతప్రతికృతైశ్చిత్రైః బాహుభిశ్చ సుసంకటైః॥
సంనిపాతావధూతైశ్చ ప్రమాథోన్మథనైస్తథా॥ 27
ఇరువురూ మదించిన ఏనుగుల్లాగా మిక్కిలి ఉత్సాహంతో ఉన్నారు. చేతులతో పట్టినొక్కడం, వదలడం, పిడికిలితో చేతులు పట్టి బలహీనపరచటం, పడగొట్టడం, విసిరివేయటం, క్రింద పడవేసి పిండి చేయడం, పైకిలేపి శరీరం నుగ్గుచేయడం ఇలా విచిత్రంగా పోరాడుతున్నారు. (27)
వి॥సం॥ ప్రమాథ-ఉన్మథనాలు:- మల్లయుద్ధ శాస్త్రంలోని నిర్వచనం.
నిపాత్య పేషణం భూమౌ ప్రమాథ ఇతి కథ్యతే।
యత్తూత్థాయాంగమథనం తదున్మథనముచ్యతే॥
నేలపై పడద్రోసి త్రొక్కడం ప్రమాథం. పైకి లేపి (చి) శరీరరాన్ని మర్దించడం ఉన్మథనం. (నీల, సర్వ.)
క్షేపణైః ముష్టిభిశ్చైవ వరాహోద్ధూతనిఃస్వనైః।
తలైర్వజ్రనిపాతైశ్చ ప్రసృష్టాభిస్తథైవ చ॥ 28
నిలుచున్నచోటనుండి నెట్టివేసి పిడికిలి పోట్లతో రొమ్ముపై కొట్టడం, తలక్రిందులుగ త్రిప్పి పడవేయడం వల్ల పందియొక్కఘుర్ఘురధ్వనులు పుట్టడం, చూపుడువ్రేలు బొటనవ్రేలు కలిపి కొట్టడం, చేతివ్రేళ్లను చాచికొట్టడం-ఈవిధంగా వారు పోరాడుతున్నారు. (28)
శలాకానఖపాతైశ్చ పాదోద్ధూతైశ్చ దారుణైః।
జానుభిశ్చాశ్మనిర్ఘోషైః శిరోభిశ్చావఘట్టనైః॥ 29
సూదుల్లాంటి గోళ్లతో గీరుకొంటూ, దారుణమైన కాలితన్నులతో, దిబ్బల్లాంటి మోకాళ్ల దెబ్బలతో, తలలతో కొట్టు కొంటున్నారు. (29)
తద్యుద్ధమభవద్ ఘోరమ్ అశస్త్రం బాహుతేజసా।
బలప్రాణేన శూరాణాం సమాజోత్సవ సంనిధౌ॥ 30
అరజ్యత జనః సర్వః సోత్కృష్టనినదోత్థితః।
బలినోః సంయుగే రాజన్ వృత్రవాసనయోరివ॥ 31
ప్రకర్షిణాకర్షణయోః అభ్యాకర్షవికర్షణైః।
ఆకర్షుతురథాన్యోన్యం జానుభిశ్చాపి జఘ్నతుః॥ 32
శూరుల ఉత్సవంలో భుజబలంతో, మనోబలంతో శస్త్రంలేని ఘోరయుద్ధం జరిగింది. రాజా! వృత్రాసుర దేవేంద్రులవంటి ఆ బలశాలుల యుద్ధంలో పెద్దపెద్ద హర్షధ్వానాలతో జనులందరూ లేచి నిలబడి చూస్తూ ఆనందించారు. ఒక్కసారిగా లాగి ముద్ద చేయడం, ముందువెనుకలకు గుంజడం, వేగంగా వెనక్కి త్రోసి పడగొట్టడం, మోకాళ్ళతో పొడుచుకోవడం ఇలా వివిధరీతులుగా పోరాడారు. (30-32)
వి॥సం॥ అశస్త్రం = నిందింపదగినది
బాహుయుద్ధం హి మల్లానా మశస్త్రం ఋషిభిః స్మృతమ్।
మృతస్య తస్య న స్వర్గో యశో నేహాపి విద్యతే॥
మహర్షులు మల్లుర బాహుయుద్ధాన్ని గర్హిస్తారు. బాహుయుద్ధంలో మరణిస్తే స్వర్గప్రాప్తి లేదు. కీర్తి కూడా లేదు.
తతః శబ్దేన మహతా భర్త్సయంతౌ పరస్పరమ్।
వ్యూఢోరస్కౌ దీర్ఘభుజౌ నియుద్ధకుశలావుభౌ।
బాహుభిః సమసజ్జేతామ్ ఆయసైః పరిఘైరివ॥ 33
చకర్ష దోర్భ్యాముత్పాత్య భీమో మల్లమమిత్రహా।
నినదంతమభిక్రోశన్ శార్దూల ఇవ వారణమ్॥ 34
సముద్యమ్య మహాబాహుః భ్రామయామాస వీర్యవాన్।
తతో మల్లాశ్చ మత్స్యాశ్చ విస్మయం చక్రిరే పరమ్॥ 35
ఎత్తైన వక్షం, పొడవైన బాహువులు కలిగి, మల్లయుద్ధ నిపుణులైన ఆ ఇద్దరూ పరస్పరమూ పెద్దశబ్దంతో బెదిరించుకొంటున్నారు. ఇనుప గడియల వంటి బాహువులతో
ఒకరినొకరు పట్టుకొని పోరాడుతున్నారు. అంతలో శత్రుసంహారకుడైన భీముడు పెద్దపులివలె గర్జిస్తూ, ఏనుగువలె శబ్దంచేసే ఆ మల్లుణ్ణి చేతులతో పైకెత్తి పట్టుకొన్నాడు. పెద్ద భుజాలతో భీముడు అతణ్ణి పైకి పట్టుకొని త్రిప్పసాగాడు. అక్కడ ఉన్న మల్లులూ, మత్స్యదేశస్థులూ ఎంతో ఆశ్చర్య పడ్డారు. (33-35)
భ్రామయిత్వా శతగుణం గతసత్త్వమచేతనమ్।
ప్రత్యపింషన్మహాబాహుః మల్లం భువి వృకోదరః॥ 36
వందసార్లు తిప్పడంతో బలం నశించి, అచేతనమై పోయిన ఆ మల్లుని మహాబాహువైన భీముడు పడవేసి' నేలరాచాడు. (36)
తస్మిన్ వినిహతే వీరే జీమూతే లోకవిశ్రుతే।
విరాటః పరమం హర్షమ్ అగచ్ఛద్ బాంధవైః సహ॥ 37
లోకప్రసిద్ధుడయిన జీమూతమల్లుడు అలా చంపబడగా, బంధువులతో బాటు విరాటరాజు ఎంతో ఆనందించాడు. (37)
ప్రహర్షాత్ ప్రదదౌ విత్తం బహు రాజా మహామనాః।
వల్లవాయ మహారంగే యథా వైశ్రవణస్తథా॥ 38
పెద్దమనసుగల కుబేరుని వంటి విరాటరాజు ఆనందంతో ఆ రంగభూమిపై వల్లవునకు చాలా ధనమిచ్చాడు. (38)
ఏవం స సుబహూన్ మల్లాన్ పురుషాంశ్చ మహాబలాన్।
వినిఘ్నన్ మత్స్యరాజస్య ప్రీతిమాహరదుత్తమామ్॥ 39
ఆ భీముడు అలాగే చాలామంది మల్లులనూ మహాబలవంతులైన పురుషులనూ సంహరిస్తూ మత్స్యరాజుకు మిక్కిలి ప్రీతొ కలిగించాడు. (39)
యదాస్య తుల్యః పురుషో న కశ్చిత్ తత్ర విద్యతే।
తతో వ్యాఘ్రైశ్చ సింహైశ్చ ద్విరదైశ్చాప్యయోధయత్॥ 40
భీమసేనుడు తనతో సమానుడైన పురుషుడు లేకపోవడంతో పులులతోనూ, సింహాలతోనూ, ఏనుగులతోనూ యుద్ధం చేసేవాడు. (40)
పునరంతః పురగతః స్త్రీణాం మధ్యే వృకోదరః।
యోధ్యతే స విరాటేన సింహైర్మత్తైర్మహాబలైః॥ 41
విరాటుడు అంతఃపురస్త్రీల నడుమకూర్చుని బలిష్ఠాలైన సింహాలతో భీమునిచేత యుద్ధం చేయించేవాడు. (41)
బీభత్సురపి గీతేన స్వనృత్యేన చ పాండవః।
విరాటం తోషయామాస సర్వాశ్చాంతఃపురస్త్రియః॥ 42
అర్జునుడు కూడ తన నృత్యగీతాలతో విరాటరాజునూ, అంతఃపురస్త్రీలనూ సంతోషపెట్టేవాడు. (42)
అశ్వైర్వినీతైర్జవనైః తత్ర తత్ర సమాగతైః।
తోషయామాస రాజానం నకులో నృపసత్తమమ్॥ 43
తస్మై ప్రదేయం ప్రాయచ్ఛత్ ప్రీతో రాజా ధనం బహు।
వినీతాన్ వృషభాన్ దృష్ట్వా సహదేవస్య చాభితః।
ధనం దదౌ బహువిధం విరాటః పురుషర్షభః॥ 44
నకులుడు అక్కడక్కడ నుండి తెచ్చి సుశిక్షతములూ, వేగవంతములూ అయిన గుఱ్ఱాలతో ఆ విరాటుని సంతోషపెట్టేవాడు. సంతోషించిన రాజు అతనికి అర్హమైన ధనమిచ్చేవాడు. సహదేవుని చుట్టూ సుశిక్షితాలయిన ఎద్దులను చూసి పురుషశ్రేష్ఠుడైన విరాటరాజు అతనికి ఎంతో ధనమిచ్చేవాడు. (43,44)
ద్రౌపదీ ప్రేక్ష్య తాన్ సర్వాన్ క్లిశ్యమానాన్ మహారథాన్।
నాతిప్రీతమనా రాజన్ నిఃశ్వాసపరమాభవత్॥ 45
రాజాz1 క్లేశాలనుభవిస్తున్న ఆమహారథులను చూసి ద్రౌపది మనసు కష్టపెట్టుకొని నిట్టూరుస్తూ ఉండేది. (45)
ఏవం తే న్యవసంస్తత్ర ప్రచ్ఛన్నాః పురుషర్షభాః।
కర్మాణి తస్య కుర్వాణా విరాటనృపతేస్తదా॥ 46
ఇలా పురుషశ్రేష్ఠులైన పాండవులు విరాటరాజుకు పనులుచేస్తూ అజ్ఞాతంగా నివసించారు. (46)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి సమయపాలన పర్వణి జీమూతవధో నామ త్రయోదశోఽధ్యాయః॥ 13 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున సమయపాలనపర్వమను
ఉపపర్వమున జీమూతవధ అను పదమూడవ అధ్యాయము. (13)