3. మూడవ అధ్యాయము

నకులసహదేవులు, ద్రౌపది తమ భావి కార్యక్రమమును సూచించుట.

వైశంపాయన ఉవాచ
ఇత్యేవ ముక్త్వా పురుషప్రవీరః
తథార్జునో ధర్మభృతాం వరిష్ఠః।
వాక్యం తథాఽసౌ విరరామ భూయః
నృపోఽపరం భ్రాతరమాబభాషే॥ 1
వైశంపాయను డిట్లు చెప్పాడు. పురుషశ్రేష్ఠుడూ, ధర్మజ్ఞుడూ అయిన అర్జునుడు ఇలా చెప్పి విరమించాడు. మళ్లీ ధర్మరాజు మరో తమ్మునితో ఇలా అన్నాడు. (1)
యుధిష్ఠిర ఉవాచ
కిం త్వం నకుల కుర్వాణః తత్ర తాత చరిష్యసి।
కర్మ తత్ త్వం సమాచక్ష్వ రాజ్యే తస్య మహీపతేః।
సుకుమారశ్చ శూరశ్చ దర్శనీయో సుఖోచితః॥ 2
ధర్మరాజు అన్నాడు. నకులా! నీవు విరాటుని నగరంలో చేసే పనినిగురించి చెప్పు. నీవు సుకుమారుడవు, శూరుడవు, అందమైనవాడవు. సుఖభోగాలు అనుభవింపదగిన వాడవు. (2)
నకుల ఉవాచ
అశ్వబంధో భవిష్యామి విరాటనృపతేరహమ్।
సర్వథా జ్ఞానసంపన్నః కుశలః పరిరక్షణే॥ 3
నకులు డన్నాడు. నేను విరాటమహారాజుకు అశ్వబంధకుడ (గుర్రాలను అదుపు చేసే వాడిని) నవుతాను. గుర్రాల రక్షణలో నేర్పరిని. గుర్రాల గురించి అన్ని విధాలయిన జ్ఞానమూ నాకుంది. (3)
గ్రంథికో నామ నామ్నాహం కర్మైతత్ సుప్రియం మమ।
కుశలోఽస్మ్యశ్వశిక్షాయాం తథైవాశ్వచికిత్సనే।
ప్రియాశ్చ సతతం మేఽశ్వాః కురురాజ! యథా తవ॥ 4
గ్రంథికుడనే పేరుతో వ్యవహరిస్తాను. ఈ పని నాకు చాలా ఇష్టం. అశ్వశిక్షణలో నేను నేర్పరిని. అలాగే అశ్వచికిత్స కూడా బాగా తెలుసు నాకు గుర్రాలంటే నీవలెనే చాల ఇష్టం (4)
వి॥ సం॥ ఆయుర్వేదం, ఆధ్వర్యవం తెలిసినవాడు గ్రంథికుడు. అశ్వినులు వైద్యులు. అధ్వర్యులు కూడా. వారి సంతతి కాబట్టి నకులుడు గ్రంథికుడు. (నీల)
అశ్వపరీక్షాగ్రంథాలు తెలిసినవాడు గ్రంథికుడు. (సర్వ-విరో)
శత్రు విజయంకోసం కౌటిల్యాన్ని ప్రదర్శించగలవాడు. (విష)
వి॥ తెలుగు భారతంలో దామగ్రంథి అని ఉంది.
యే మామామంత్రయిష్యంతి విరాటనగరే జనాః।
తేభ్య ఏవం ప్రవక్ష్యామి విహరిష్యామ్యహం యథా॥ 5
పాండవేన పురా తాత అశ్వేష్వధికృతః పురా।
విరాటనగరే ఛన్నః చరిష్యామి మహీపతే॥ 6
మహారాజా! విరాటనగరంలో జనులు నన్ను అడిగితే వారికి "నేను పూర్వం ధర్మరాజుచేత అశ్వాల అధికారిగా నియమింపబడిన వాడను' అని చెప్పి విరాటనగరంలో ఎవరికీ తెలియకుండా సంచరిస్తాను. (5,6)
యుధిష్ఠిర ఉవాచ
సహదేవ కథం తస్య సమీపే విహరిష్యసి।
కిం వా త్వం కర్మ కుర్వాణః ప్రచ్ఛన్నో విహరిష్యసి॥ 7
ధర్మరాజు ఇలా అన్నాడు. సహదేవా! ఆ విరాటుని దగ్గర నీ వేపని చేస్తూ ప్రచ్ఛన్నంగా (ఇతరులకు తెలియకుండా) సంచరిస్తావు? (7)
సహదేవ ఉవాచ
గోసంఖ్యాతా భవిష్యామి విరాటస్య మహీపతేః।
ప్రతిషేద్ధా చ దోగ్ధా చ సంఖ్యానే కుశలో గవామ్॥ 8
సహదేవుడిలా అన్నాడు. విరాటరాజా దగ్గర గోపరీక్షకుడ నవుతాను. నేను ఆవులను రక్షిస్తాను. పాలు పితుకుతాను. గోవులను పరీక్షించడంలో నేను నేర్పరిని. (8)
తంతిపాల ఇతి ఖ్యాతః నామ్నాహం విదితస్త్వథ।
నిపుణం చ చరిష్యామి వ్యేతు తే మానసో జ్వరః॥ 9
తంతిపాలుడనే పేరుతో ప్రసిద్ధుడనై నేను నేర్పుతో(ఎవరూ గుర్తించకుండా) సంచరిస్తాను. నీ మనోవ్యథ విడువుము. (9)
వి॥తంత్రీపాలుడని తె।భా। ; దా.ప్ర.లు.
(అరోగా బహులాః పుష్టాః క్షీరవత్యో బహుప్రజాః।
నిష్పన్నసత్త్వాః సుభృతాః వ్యపేతజ్వరకిల్బిషాః॥
నష్టచోరభయా నిత్యం వ్యాధివ్యాఘ్రవివర్జితాః।
గావశ్చ సుసుఖా రాజన్ నిరుద్విగ్నా నిరామయాః॥
భవిష్యంతి మయా గుప్తాః విరాటపశవో నృప॥
(రాజా! విరాటుని పశువుల్య్ నాచే రక్షింపబడి రోగరహితాలు అవుతాయి. పుష్టికలిగి అభివృద్ధి చెందుతాయి. చాలా పాలు ఇస్తూ ఎక్కువ సంతానం కలిగి ఉంటాయి. శక్తి కలిగి, జ్వరమనే దోషం చేరకుండా ఉంటాయి. చోరభయం ఉండదు. రోగమనే పులి దరిచేరదు. రాజా! ఉద్వేగం లేకుండా నిరామయంగా/ఆరోగ్యంగా ఉంటాయి ఆవులు.)
అహం హి సతతం గోషు భవతా ప్రహితః పురా।
తత్ర మే కౌశలం సర్వమ్ అవబుద్ధం విశాంపతే॥ 10
పూర్వం గోవిషయంలో నీచేత నేనే నియోగింపబడే వాడిని. అందులో నా నేర్పు నీకు తెలిసినదే కదా!(10)
లక్షణం చరితం చాపి గవాం యచ్చాపి మంగలమ్।
తత్సర్వం మే సువిదితం అన్యచ్చాపి మహీపతే॥ 11
వృషభానపి జానామి రాజన్ పూజితలక్షణాన్।
యేషాం మూత్రముపాఘ్రాయ అపి వంధ్యా ప్రసూయతే॥ 12
ఆవుల లక్షణమూ, సంచారమూ, వాటి మేలు, అంతా నాకు తెలుసును. రాజా! ఇంకా చాలా విషయాలు తెలుసు. మంచి లక్షణాలు గల ఎద్దులను కూడా పసికడతాను. ఏ వృషభాల మూత్రం వాసనచూస్తే గొడ్డుటావులు కూడా చూడి కడతాయో నాకు బాగా తెలుసు. (11,12)
సోఽహ మేవం చరిష్యామి ప్రీతిరత్ర హి మే సదా।
న చ మాం వేత్స్యతే కశ్చిన్ తోషయిష్యే చ పార్థివమ్॥ 13
ఇలా నేను గోసేవ చేస్తూ సంచరిస్తాను. సదా ఇది నాకిష్టమైనది. ప్రీతి కలిగిస్తుంది. నన్ను ఎవరూ కని పెట్టలేరు. ఈవిధంగా విరాటుని సంతోషపెడతాను. (13)
యుధిష్ఠిర ఉవాచ
ఇయం హి నః ప్రియా భార్యా ప్రాణేభ్యోఽపి గరీయసీ।
మాతేవ పరిపాల్యా చ పూజ్యా జ్యేష్ఠేవ చ స్వసా॥ 14
కేన స్మ ద్రౌపదీ కృష్ణా కర్మణా విచరిష్యతి।
న హి కించిత్ విజానాతి కర్మ కర్తుం యథా స్త్రియః॥ 15
ధర్మరాజు ఇలా అన్నాడు. ఈమె మనకు ప్రియమైన భార్య. ప్రాణాలకంటె ప్రియమైనది. తల్లి వలె రక్షింపదగినది. పెద్దక్క గారి వలె పూజ్యురాలు. ద్రుపదమహారాజు కుమార్తె అయిన ఈ ద్రౌపది ఏ పని చేస్తూ సంచరిస్తుంది? ఇతర స్త్రీల వలె ఈమె ఏ చిన్న పనీ చేయడం ఎరగనిది. (14,15)
వి॥సం॥ స్వసా = అంబికా. అని మంత్ర బ్రాహ్మణము. (నీల)
పతిర్భార్యాం సంప్రవిశ్య గర్భో భూత్వేహ జాయతే।
తస్మాద్భార్యాం నరః పశ్యేన్మాతృవత్పుత్రమాతరమ్॥
భర్త భార్యలో ప్రవేశించి బిడ్డగా మారి జన్మిస్తాడు. కాబట్టి సంతానవతియైన భార్యను తల్లిగానే భావించాలి.
యదా తదా హి కౌసల్యా దాసీవత్సఖివచ్చ హ।
భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి॥
కౌసల్య దాసిలా, చెలిలా, భార్యలా, సోదరిలా, తల్లికా సేవించేది అని దశరథ వచనం. (విష)
సుకుమారీ చ బాలా చ రాజపుత్రీ యశస్వినీ।
పతివ్రతా మహాభాగా కథం ను విచరిష్యతి॥ 16
ఈమె చాలా సుకుమారి. నిత్యనూతన! చిన్నది. రాజకుమారి. కీర్తిమతి. పతివ్రత. సౌభాగ్యవతి. ఈమె ఎలా సంచరిస్తుందో! ఏమో! (16)
మాల్యగంధానలంకారాన్ వస్త్రాణి వివిధాని చ।
ఏతాన్యేవాభిజానాతి యతో జాతా హి భామినీ॥ 17
పుట్టినప్పటినుండీ ఈమె పలువిధాలయిన పూలమాలలు, సుగంధాలు, అలంకారాలు, ఎన్నోరకాల వస్త్రాలు, ధరించడం మాత్రమే ఎరుగును. (17)
ద్రౌపద్యువాచ
సైరంధ్ర్యో రక్షితాః లోకే భుజిష్యాః సంతి భారత।
నైవమన్యాః స్త్రియో యాంతి ఇతి లోకస్య నిశ్చయః॥
సాహం బ్రువాణా సైరంధ్రీ కుశలా కేశకర్మణి॥ 18
యుధిష్ఠిరస్య గేహే వై ద్రౌపద్యాః పరిచారికా।
ఉషితాస్మీతి వక్ష్యామి పృష్టా రాజ్ఞా చ భారత॥ 19
ద్రౌపది ఇలా అంది. రాజా! లోకంలో చాలామంది సైరంధ్రులుంటారు. వారు రక్షణ కలిగి ఇతరుల ఇళ్లలో ప్రవర్తిస్తారు. గృహిణులు మిగిల్చిపెట్టిన ఎంగిలిలేని భోజనంచేసి వారు జివిస్తారు. ఇలా ఇతరస్త్రీలు ప్రవర్తింపలేరని లోకుల భావన. నేను కేశాలంకరణలో నిపుణురాల నని చెపుతూ విరాటుని అంతఃపురం చేరుతాను. రాజు అడిగితే నేను పూర్వం ధర్మరాజు మందిరంలో ద్రౌపదికి పరిచారికగా ఉండేదాన నని చెపుతాను. (18,19)
వి॥తె॥నన్నా భూరమణు దేవి యెంతయు, గారవమున పిలువనంపగా....' తాను సుదేష్ణచేత పిలిపించుకొని, అంతఃపురంలో చేరుతానని ద్రౌపది చెపుతుంది..చివరకు అలాగే చేరింది.
ఆత్మగుప్తా చరిష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి॥ 20
సుదేష్ణాం ప్రత్యుపస్థాస్యే రాజభార్యాం యశస్వినీమ్।
సా రక్షిష్యతి మాం ప్రాప్తాం మాభూత్ తే దుఃఖమీదృశమ్॥ 21
నన్ను నీవు అడిగినట్లు ఆత్మరక్షణ కలిగి సంచరిస్తాను. యశస్విని అయిన రాణి సుదేష్ణను చేరుతాను. ఆమె నన్ను రక్షిస్తుంది. నీకు ఈవిషయమై బెంగ అవసరంలేదు. (20,21)
యుధిష్ఠిర ఉవాచ
కల్యాణాం భాషసే కృష్ణే కులే జాతాసి భామిని।
న పాపమభిజానాసి సాధ్వీ సాధువ్రతే స్థితా॥ 22
ధర్మరాజు అపు డిలా అన్నాడు. ద్రౌపదీ! నీవు సద్వంశంలో పుట్టిన దానవు. శుభప్రదంగానే మాట్లాడు తావు. పాపం ఏమిటోఎరగవు. పతివ్రతవు. సత్ప్రవర్తనంలో నిలిచేదానవు. (22)
యథా న దుర్హృదః పాపా భవంతి సుఖినః పునః।
కుర్యా స్తత్ త్వం కల్యాణి లక్షయేయు ర్న తే తథా॥ 23
పాపపు పనులు చేసే దుష్టుల బారి పడకుండా నడచుకోవాలి. కల్యాణీ! ఇతరులు నిన్ను గుర్తించకుండా ప్రవర్తించాలి. (23)
వి॥ తె॥ ఈ మాటలకు ద్రౌపది "అనాదరమందస్మితవదనారవింద" అయి, అపుడు మితభాషిత్వం, వ్రతసంభావన, గౌరవం, పాపభీతి ఉంటాయి నాకు.. అంటుంది.
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణీ పాండవ ప్రవేశపర్వణి యుధిష్ఠిరాది మంత్రణే తృతీయోఽధ్యాయః ॥ 3 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవ ప్రవేశ పర్వమను ఉపపర్వమున
యుధిష్ఠిరాదిమంత్రణము అను మూడవ ఆధ్యాయము. (3)
(దాక్షిణాత్య అధికపాఠము 2 1/2 శ్లోకాలతో కలిసి మొత్తం 25 1/2 శ్లోకాలు)