289. రెండువందల ఎనుబది తొమ్మిదవ అధ్యాయము
ఇంద్రజిత్తు చనిపోవుట.
మార్కండేయ ఉవాచ
తావుభౌ పతితౌ దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ ।
బబంధ రావణిర్భూయః శరైర్దత్తవరైస్తదా ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - "అన్నదమ్ములైన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ నేలపై వాలిపోవడం చూసి ఇంద్రజిత్తు తనకు దేవతలు వరంగా ప్రసాదించిన బాణాలతో పూర్తిగా బంధించివేశాడు. (1)
తౌ వీరౌ శరబంధేన బద్దావింద్రజితా రణే ।
రేజతుః పురుషవ్యాఘ్రౌ శకుంతావివ పంజరే ॥ 2
ఆ వీరులైన పురుషశ్రేష్ఠులు యుద్ధంలో ఇంద్రజిత్తుయొక్క బాణాలచేత బంధింపబడి పంజరంలోని పక్షులవలె ప్రకాశించారు. (2)
తౌ దృష్ట్వా పతితౌ భూమౌ శతశః సాయకైశ్చితౌ ।
సుగ్రీవః కపిభిః సార్దం పరివార్య తతః స్థితః ॥ 3
వందలకొద్దీ బాణాలచేత ఆవరింపబడి భూమిమీద పడి ఉన్న వారిని చూచి సుగ్రీవుడు వానరులతోకలిసి, వారిచుట్టూ చేరి నిలిచాడు. (3)
సుషేణమైందద్వివిదైః కుముదేనాంగదేన చ ।
హనుమన్నీలతారైశ్చ నలేన చ కపీశ్వరః ॥ 4
సుషేణుడు, మైందుడు, ద్వివిదుడు, కుముదుడు, అంగదుడు, హనుమంతుడు, నీలుడు, తారుడు, నలుడు - వీరందరితో కలిసి సుగ్రీవుడు వారిద్దరిని రక్షించసాగాడు. (4)
తతస్తం దేశమాగమ్య కృతకర్మా విభీషణః ।
బోధయామాస తౌ వీరౌ ప్రజ్ఞాస్త్రేణ ప్రబోధితౌ ॥ 5
అప్పుడు కార్యసాధకుడైన విభీషణుడు అక్కడికి వచ్చి ప్రజ్ఞాస్త్రం ద్వారా ఆ వీరులిద్దరికీ మెలకువ తెప్పించాడు. (5)
విశల్యౌ చాపి సుగ్రీవః క్షణేనైతౌ చకార హ ।
విశల్యయా మహౌషధ్యా దివ్యమంత్రప్రయుక్తయా ॥ 6
సుగ్రీవుడు దివ్యమంత్రాలను ప్రయోగించి విశల్యమనే గొప్ప ఓషధి చేత క్షణంలో వారిద్దరి శరీరాలలోని బాణాలను తొలగించి స్వస్థులుగా చేశాడు. (6)
తౌ లబ్ధసంజ్ఞౌ నృవరౌ విశల్యావుదతిష్ఠతామ్ ।
గతతంద్రీక్లమౌ చాపి క్షణేనైతౌ మహారథౌ ॥ 7
నరశ్రేష్ఠులైన ఆ మహారథులు ఇద్దరూ తెలివి తెచ్చుకొని బాణరహితులై, అలసట - బద్ధకం తొలగిపోయి క్షణకాలంలో లేచి కూర్చున్నారు. (7)
తతో విభీషణః పార్థ రామమిక్ష్వాకునందనమ్ ।
ఉవాచ విజ్వరం దృష్ట్వా కృతాంజలిరిదం వచః ॥ 8
యుధిష్ఠిరా! అప్పుడు ఇక్ష్వాకునందనుడైన రాముడు స్వస్థుడై ఉండడంతో విభీషణుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. (8)
ఇదమంభో గృహీత్వా తు రాజరాజస్య శాసనాత్ ।
గుహ్యకోఽభ్యాగతః శ్వేతాత్ త్వత్సకాశమరిందమ ॥ 9
"శత్రుదమనుడా! రాజరాజు కుబేరుని ఆజ్ఞపై గుహ్యకుడు ఈ నీటిని తీసికొని శ్వేతపర్వతం నుండి నీసన్నిధికి వచ్చాడు. (9)
ఇదమంభః కుబేరస్తే మహారాజః ప్రయచ్ఛతి ।
అంతర్హితానాం భూతానాం దర్శనార్థం పరంతపః ॥ 10
పరంతపా! అంతర్హితులైన ప్రాణులను దర్శించడానికి మహారాజు కుబేరుడు నీకు ఈ నీటిని ఇచ్చాడు. (10)
అనేన మృష్టనయనః భూతాన్యంతర్హితాన్యుత ।
భవాన్ ద్రక్ష్యతి యస్మై చ ప్రదాస్యతి నరః స తు ॥ 11
దీనితో కన్నులు తుడుచుకొని అదృశ్యంగా ఉన్న ప్రాణులను నీవు చూడగలవు. అంతేకాక ఎవరికి దీనిని ఇచ్చినా అతడు కూడా చూడగలడు. (11)
తథైతి రామస్తద్ వారి ప్రతిగృహ్యాభిసంస్కృతమ్ ।
చకార నేత్రయోః శౌచం లక్ష్మణశ్చ మహామనాః ॥ 12
'సరే' అని రాముడు అభిమంత్రించిన ఆ జలాన్ని తీసుకొని కన్నులను కడుగుకొన్నాడు. మహామతియైన లక్ష్మణుడు కూడా అలాగే చేశాడు. (12)
సుగ్రీవజాంబవంతౌ చ హనుమానంగదస్తథా ।
మైందద్వివిదనీలాశ్చ ప్రాయః ప్లవగసత్తమాః ॥ 13
ఇంకా సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, మైందుడు, ద్వివిదుడు, నీలుడు మొదలైన వానరప్రముఖులు ఇంచుమించు అందరూ ఆ నీటితో తమ కన్నులను కడుగుకొన్నారు. (13)
తథా సమభవచ్చాపి యదువాచ విభీషణః ।
క్షణేనాతీంద్రియాణ్యేషాం చక్షూంష్యాసన్ యుధిష్ఠిర ॥ 14
యుధిష్ఠిరా! అప్పుడు విభీషణుడు చెప్పినట్లుగానే జరిగింది. క్షణకాలంలోనే వారి కన్నులకు అతీంద్రియత్వం కలిగింది. (14)
ఇంద్రజిత్ కృతకర్మా చ పిత్రే కర్మ తదాఽఽత్మనః ।
నివేద్య పునరాగచ్ఛత్ త్వరయాఽజిశిరః ప్రతి ॥ 15
కార్యసాధకుడైన ఇంద్రజిత్తు తాను సాధించిన పనిని గూర్చి అప్పుడు తండ్రికి తెలిపి, త్వరితంగా సంగ్రామతలానికి తిరిగివచ్చాడు. (15)
తమాపతంతం సంక్రుద్ధం పునరేవ యుయుత్సయా ।
అభిదుద్రావ సౌమిత్రిః విభీషణమతే స్థితః ॥ 16
సంక్రుద్ధుడై యుద్ధం చేయాలనే ఉత్సుకతతో తిరిగి వస్తున్న ఇంద్రజిత్తును, విభీషణుని అభిప్రాయాన్ని అనుసరించి లక్ష్మణుడు ఎదుర్కొన్నాడు. (16)
అకృతాహ్నికమేవైనం జిఘాంసుర్జితకాశినమ్ ।
శరైర్జఘాన సంక్రుద్ధః కృతసంజ్ఞోఽథ లక్ష్మణః ॥ 17
నిత్యకర్మలు కూడా నెరవేర్చకుండా విజయోల్లాసంతో తిరిగివచ్చిన ఇంద్రజిత్తును స్మృతిలోకి వచ్చిన లక్ష్మణుడు మహాకోపంతో చంపాలనే కోరికతో బాణాలు వేశాడు. (17)
తయోః సమభవద్ యుద్ధం తదాన్యోన్యం జిగీషతోః ।
అతీవ చిత్రమాశ్చర్యం శక్రప్రహ్లాదయోరివ ॥ 18
అప్పుడు పరస్పర విజయకాంక్షతో ఉన్న వారిద్దరి నడుమ ఇంద్ర ప్రహ్లాదులకు వలె మిక్కిలి చిత్రమైన ఆశ్చర్యమైన యుద్ధం జరిగింది. (18)
అవిధ్యదింద్రజిద్ తీక్ష్ణైః సౌమిత్రిం మర్మభేదిభిః ।
సౌమిత్రిశ్చానలస్పర్శైః అవిధ్యద్ రావణిం శరైః ॥ 19
ఇంద్రజిత్తు మర్మభేదులైన తీక్ష్ణబాణాలతో సౌమిత్రిని గాయపరిచాడు. లక్ష్మణుడు కూడా ఇంద్రజిత్తును అగ్నిలా చురుక్కుమనిపించే బాణాలతో గాయపరిచాడు. (19)
సౌమిత్రిశరసంస్పర్శాద్ రావణిః క్రోధమూర్ఛితః ।
అసృజల్లక్ష్మణాయాష్టౌ శరానాశీవిషోపమాన్ ॥ 20
లక్ష్మణుడు వేసిన బాణాలతాకిడికి క్రోధమూర్ఛితుడై ఇంద్రజిత్తు విషసర్పాల వంటి ఎనిమిది బాణాలను లక్ష్మణునిపై వేశాడు. (20)
తస్యాసూన్ పావకస్పర్శైః సౌమిత్రిః పత్రిభిస్త్రిభిః ।
యథా నిరహరద్ వీర తన్మే నిగదతః శృణు ॥ 21
వీరుడైన లక్ష్మణుడు అగ్నిలా దహించివేసే మూడు బాణాలతో అతని ప్రాణాలను ఎలా హరించాడో అది చెపుతా విను. (21)
ఏకేనాస్య ధనుష్మంతం బాహుం దేహాదసాతయత్ ।
ద్వితీయేన సనారాచం భుజం భూమౌ న్యపాతయత్ ॥ 22
ఒక బాణంతో విల్లు పట్టుకొన్న బాహువును శరీరం నుండి వేరుచేశాడు. రెండవ బాణంతో బాణసహితమైన బాహువును నేలపాలు చేశాడు. (22)
తృతీయేన తు బాణేన పృథుధారేణ భాస్వతా ।
జహార సునసం చాపి శిరో భ్రాజిష్ణుకుండలమ్ ॥ 23
వెడల్పయిన అంచు కలిగి ప్రకాశించే మూడవ బాణంతో చక్కని ముక్కు, మెరిసే కుండలాలు కల అతని శిరస్సును దేహం నుండి వేరుచేశాడు. (23)
వినికృత్తభుజస్కంధం కబంధం భీమదర్శనమ్ ।
తం హత్వా సుతమస్యస్రైః జఘాన బలినాం వరః ॥ 24
ఖండింపబడిన భుజస్కంధాలతో అతని మొండెం మిక్కిలి భయంకరంగా కనిపించింది. బలవంతులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు అతనిని చంపిన తరువాత సూతుని కూడా అస్త్రాలతో సంహరించాడు. (24)
లంకాం ప్రవేశయామాసుః తం రథం వాజినస్తదా ।
దదర్శ రావణస్తం చ రథం పుత్రవినాకృతమ్ ॥ 25
స పుత్రం నిహతం జ్ఞాత్వా త్రాసాత్ సంభ్రాంతమానసః ।
రావణః శోకమోహార్తః వైదేహీం హంతుముద్యతః ॥ 26
గుఱ్ఱాలు ఆ రథాన్ని ఈడ్చుకుంటూ లంకను ప్రవేశించాయి. కొడుకులేని ఆ రథాన్ని చూశాడు రావణుడు. కొడుకు చనిపోయాడని తెలుసుకొని భయంతో అతని మనస్సు దిగ్భ్రాంతి చెందింది. శోకమోహాలతో ఆర్తుడైన రావణాసురుడు వైదేహిని చంపడానికి పూనుకొన్నాడు. (25,26)
అశోకవనికాస్థాం తాం రామదర్శనలాలసామ్ ।
ఖడ్గమాదాయ దుష్టాత్మా జవేనాభిపపాత హ ॥ 27
అశోకవనంలో రామదర్శనం కోసం ఆసక్తితో ఉన్న ఆమె వద్దకు ఆ దుష్టాత్ముడు కత్తిపట్టుకొని వేగంగా వచ్చిపడ్డాడు. (27)
తం దృష్ట్వా తస్య దుర్బుద్దేః అవింధ్యః పాపనిశ్చయమ్ ।
శమయామాస సంక్రుద్ధం శ్రూయతాం యేన హేతునాః ॥ 28
దుర్బుద్ధి అయిన అతనియొక్క పాపపుటాలోచనను తెలుసుకొని మంత్రి అయిన అవింధ్యుడు క్రోధంతో ఉన్న అతనిని శాంతింపచేశాడు. ఏ యుక్తితో అతనిని శాంతింప చేశాడో విను. (28)
మహారాజ్యే స్థితో దీప్తే న స్త్రియం హంతుమర్హసి ।
హతైవైషా యదా స్త్రీ చ బంధనస్థా చ తే వశే ॥ 29
"రాక్షసరాజా! సముజ్జ్వలమైన లంకా మహారాజ్య పదవి యందున్న మీరు స్త్రీని చంపడానికి తగరు. ఎప్పుడయితే స్త్రీ బంధితురాలై మీ వశమయిందో అప్పుడే ఆమె మరణించింది. (29)
న చైషా దేహభేదేన హతా స్యాదితి మే మతిః ।
జహి భర్తారమేవాస్యాః హతే తస్మిన్ హతా భవేత్ ॥ 30
శరీరాన్ని ముక్కలు చేయడం వల్లనే ఈమె చనిపోదని నా ఉద్దేశ్యం. ఈమె భర్తనే చంపండి, భర్త చనిపోగానే ఈమె కూడా చనిపోతుంది. (30)
న హి తే విక్రమే తుల్యః సాక్షాదపి శతక్రతుః ।
అసకృద్ధి త్వయా సేంద్రాః త్రాసితాస్త్రిదశా యుధి ॥ 31
పరాక్రమంలో సాక్షాత్తు ఆ ఇంద్రుడు కూడా మీకు సాటి రాడు. ఎన్నోసార్లు మీరు యుద్ధంలో ఇంద్రునితో సహితంగా దేవతలనందరినీ భయభ్రాంతులను చేశారు". (31)
ఏవ బహువిధైర్వాక్యైః అవింధ్యో రావణం తదా ।
క్రుద్ధం సంశమయామాస జగృహే చ స తద్వచః ॥ 32
ఈ రీతిగా అవింధ్యుడు క్రుద్ధుడైన రావణాసురుని ఆ సమయంలో అనేకవిధాలుగా చెప్పి శాంతింపచేశాడు. అతడు కూడా ఆ మాటలను ఒప్పుకున్నాడు. (32)
నిర్యాణే స మతిం కృత్వా నిధాయాసిం క్షపాచరః ।
ఆజ్ఞాపయామాస తదా రథో మే కల్ప్యతామితి ॥ 33
ఆ నిశాచరుడు రావణుడు యుద్ధానికి బయలుదేరాలని సంకల్పించుకొని కత్తిని ఒరలో పెట్టి "నా రథం సిద్ధం చేయండి" అని ఆజ్ఞాపించాడు. (33)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి శ్రీరామోపాఖ్యానపర్వణి ఇంద్రజిద్వధే ఏకోననవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 289 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానమను ఉపపర్వమున ఇంద్రజిద్వధ అను రెండువందల ఎనుబది తొమ్మిదవ అధ్యాయము. (289)