288. రెండువందల ఎనుబది ఎనిమిదవ అధ్యాయము
ఇంద్రజిత్తు మాయాయుద్ధము చేయుట - రామలక్ష్మణులు మూర్ఛిల్లుట.
మార్కండేయ ఉవాచ
తతః శ్రుత్వా హతం సఖ్యే కుంభకర్ణం సహానుగమ్ ।
ప్రహస్తం చ మహేష్వాసం ధూమ్రాక్షం చాతితేజసమ్ ॥
పుత్రమింద్రజితం వీరం రావణః ప్రత్యభాషత ।
జహి రామమమిత్రఘ్న సుగ్రీవం చ సలక్ష్మణమ్ ॥ 2
అనుచరులతో సహా కుంభకర్ణుడు, మహాధనుర్ధారి అయిన ప్రహస్తుడు, మిక్కిలి పరాక్రమవంతుడయిన ధూమ్రాక్షుడు కూడా యుద్ధంలో చనిపోయారని విని రావణుడు వీరుడయిన కొడుకు ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు - "శత్రుదమనా! సుగ్రీవుని, లక్ష్మణ సహితుడైన రాముని చంపు". (1,2)
త్వయా హి మమ సత్పుత్ర యశో దీప్తముపార్జితమ్ ।
జిత్వా వజ్రధరం సంఖ్యే సహస్రాక్షం శచీపతిమ్ ॥ 3
"సుపుత్రా! శచీపతి, సహస్రాక్షుడు, వజ్రాయుధధరుడు అయిన ఇంద్రుని యుద్ధంలో ఓడించిన నీ వల్లనే నేను ఉజ్జ్వలమైన కీర్తిని సంపాదించగలిగాను. (3)
అంతర్హితః ప్రకాశో వా దివ్యైర్దత్తవరైః శరైః ।
జహి శత్రూనమిత్రఘ్న మమ శస్త్రభృతాం వర ॥ 4
నీవు శస్త్రధారులలో మేటివి, శత్రునాశకుడవు, దేవతలు వరంగా ఇచ్చిన దివ్యమైన బాణాలతో నీవు అదృశ్యంగా ఉండిగాని, ప్రకటమై గాని నా శత్రువులను సంహరించు. (4)
రామలక్ష్మణసుగ్రీవాః శరస్పర్శం న తేఽనఘ ।
సమర్థాః ప్రతిసోఢుం చ కుతస్తదనుయాయినః ॥ 5
అనఘా! రామలక్ష్మణ సుగ్రీవులే నీ బాణాల తాకిడిని తట్టుకోవడానికి సమర్థులు కారు. ఇక వారి అనుచరులు ఎక్కడ? (5)
అకృతా యా ప్రహస్తేన కుంభకర్ణేన చానఘ ।
ఖరస్యాపచితిః సంఖ్యే తాం గచ్ఛత్వం మహాభుజ ॥ 6
అనఘా! మహావీరా! ప్రహస్తుడు, కుంభకర్ణుడు కూడా ఖరుని వధకు ప్రతీకారం చేయలేకపోయారు. దానిని తీర్చడానికి యుద్ధానికి వెళ్లు. (6)
త్వమద్యనిశితైర్బాణైః హత్వా శత్రూన్ ససైనికాన్ ।
ప్రతినందయ మాం పుత్ర పురా జిత్వేవ వాసవమ్ ॥ 7
కుమారా! నేను నీవు వాడియైన బాణాలతో సైన్యసహితంగా శత్రువులను వధించి, పూర్వం ఇంద్రుని జయించిన రీతిగా నాకు సంతోషం కలిగించు". (7)
ఇత్యుక్తః స తథేత్యుక్త్వా రథమాస్థాయ దంశితః ।
ప్రయయావింద్రజిత్ రాజన్ తూర్ణమాయోధనం ప్రతి ॥ 8
రాజా! రావణుడు ఈ రీతిగా పలుకగానే ఇంద్రజిత్తు సరే' అని కవచం ధరించి రథం ఎక్కి వెంటనే యుద్ధానికి బయలుదేరాడు. (8)
తతో విశ్రావ్య విస్పష్టం నామ రాక్షసపుంగవః ।
ఆహ్వయామాస సమరే లక్ష్మణం శుభలక్ష్మణమ్ ॥ 9
అనంతరం ఆ రాక్షసశ్రేష్ఠుడు అతిస్పష్టంగా తన పేరును తెలుపుతూ శుభలక్షణుడైన లక్ష్మణుని యుద్ధానికి పిలిచాడు. (9)
తం లక్ష్మణోఽభ్యధావచ్చ ప్రగృహ్య సశరం ధనుః ।
త్రాసయంస్తలఘోషేణ సింహః క్షుద్రమృగాన్ యథా ॥ 10
లక్ష్మణుడు కూడా ధనుర్బాణాలు తీసుకొని, సింహం క్షుద్రమృగాలను భయపెట్టినట్లుగా వింటిధ్వనిచేత రాక్షసులను భయపెడుతూ అతనికి ఎదురునడిచాడు. (10)
తయోః సమభవద్ యుద్ధం సుమహజ్జయగృద్ధినోః ।
దివ్యాస్త్రవిదుషోస్తీవ్రమ్ అన్యోన్యస్పర్ధినోస్తదా ॥ 11
అప్పుడు దివ్యాస్త్రకోవిదులు, జయాభిలాషులు, పరస్పరం స్పర్ధ కలిగిన వారిరువురిమధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. (11)
రావణిస్తు యదా నైనం విశేషయతి సాయకైః ।
తతో గురుతరం యత్నమ్ ఆతిష్ఠద్ బలినాం వరః ॥ 12
బలవంతులలో శ్రేష్ఠుడు అయిన ఇంద్రజిత్తు బాణాలతో లక్ష్మణుని మించలేకపోయాడు. అప్పుడు ఇంద్రజిత్తు అత్యధికమైన ప్రయత్నం ఆరంభించాడు. (12)
తత ఏనం మహావేగైః అర్దయామాస తోమరైః ।
తానాగతాన్ స చిచ్ఛేద సౌమిత్రిర్నిశితైః శరైః ॥ 13
మహావేగం కలిగిన తోమరాలను ప్రయోగించి లక్ష్మణుని నొప్పించడానికి ప్రయత్నించాడు. కాని ఆ వచ్చే తోమరాలను లక్ష్మణుడు వాడి బాణాలతో ఖండించివేశాడు. (13)
తే నికృత్తాః శరైస్తీక్ష్ణైః న్యపతన్ ధరణీతలే ।
తమంగదో వాలిసుతః శ్రీమామద్యమ్య పాదపమ్ ॥ 14
అభిద్రుత్య మహావేగః తాడయామాస మూర్ధని ।
తస్యేంద్రజిదసంభ్రాంతః ప్రాసేనోరసి వీర్యవాన్ ॥ 15
ప్రహర్తుమైచ్ఛత్ తం చాస్య ప్రాసం చిచ్ఛేద లక్ష్మణః ।
లక్ష్మణుని వాడిబాణాలతో తునుకలై ఆ తోమరాలు నేల రాలాయి. వాలిపుత్రుడు అంగదుడు మహావేగంగా ఒకచెట్టుతో పరిగెత్తుకొని వచ్చి ఇంద్రజిత్తు తలపై మోదాడు. బలవంతుడైన ఇంద్రజిత్తు దానికి ఏమాత్రం చలించకుండా ఒక ప్రాసంతో అతని ఛాతిపై కొట్టాలనుకొన్నాడు. కాని లక్ష్మణుడు ఆ ప్రాసాన్ని మధ్యలోనే తుంచివేశాడు. (14,15 1/2)
తమభ్యాశగతం వీరమ్ అంగదం రావణాత్మజః ॥ 16
గదయాతాడయత్ సవ్యే పార్శ్వే వానరపుంగవమ్ ।
రావణపుత్రుడైన ఇంద్రజిత్తు తన సమీపానికి వచ్చిన వీరుడు, వానరశ్రేష్ఠుడు అయిన అంగదుని గదతో ఎడమపక్క కొట్టాడు. (16 1/2)
తమచింత్య ప్రహారం స బలవాన్ వాలినః సుతః ॥ 17
ససపర్జేంద్రజితః క్రోధాత్ శాలస్కంధం తథాంగదః ।
బలవంతుడైన వాలిసుతుడు అంగదుడు ఆ దెబ్బను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా క్రోధంతో ఒక మద్దిమాకును ఇంద్రిజిత్తుపై విసిరాడు. (17 1/2)
సోఽంగదేన రుషోత్సృష్టః వధాయేంద్రజితస్తరుః ॥ 18
జఘానేంద్రజితః పార్థ రథం సాశ్వం ససారథిమ్ ।
యుధిష్ఠిరా! ఇంద్రజిత్తును వధించడానికి కోపంతో అంగదుడు విసిరిన ఆ చెట్టు ఇంద్రజిత్తుయొక్క రథాన్ని గుర్రాలతో, సారథితో సహా మట్టుపెట్టింది. (18)
తతో హతాశ్వాత్ ప్రస్కంద్య రథాత్ స హతసారథిః ॥ 19
తత్రైవాంతర్దధే రాజన్ మాయయా రావణాత్మజః ।
రాజా! సారథి చనిపోయి, గుఱ్ఱాలు లేని ఆ రథాన్నుండి రావణుపుత్రుడైన ఇంద్రజిత్తు తన మాయాబలంచేత అక్కడే అదృశ్యుడైపోయాడు. (19 1/2)
అంతర్హితం విదిత్వా తం బహుమాయం చ రాక్షసమ్ ॥ 20
రామస్తం దేశమాగమ్య తత్ సైన్యం పర్యరక్షత ।
అనేకమాయలుగల ఆ రాక్షసుడు అంతర్ధానం అయ్యాడని తెలుసుకొన్న శ్రీరామచంద్రుడు అచ్చటికి వచ్చి తనసైన్యాన్ని అన్నివైపుల నుండి రక్షించసాగాడు. (20 1/2)
స రామముద్దిశ్య శరైః తతో దత్తవరైస్తదా ॥ 21
వివ్యాధ సర్వగాత్రేషు లక్ష్మణం చ మహాబలమ్ ।
ఇంద్రజిత్తు అప్పుడు దేవతలు వరంగా ప్రసాదించిన బాణాలతో శ్రీరాముని, మహాబలి అయిన లక్ష్మణుని కూడా శరీరమంతా తూట్లు పొడిచాడు. (21 1/2)
తమదృశ్యం శరైః శూరౌ మాయయాంతర్హితం తదా ॥ 22
యోధయామాసతురుభౌ రావణిం రామలక్ష్మణౌ ।
మాయతో అంతర్ధానమై అదృశ్యంగా ఉన్న ఇంద్రజిత్తుతో శూరులైన రామలక్ష్మణులు ఇద్దరూ బాణాలతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. (22 1/2)
స రుషా సర్వగాత్రేషు తయోః పురుషసింహయోః ॥ 23
వ్యసృజత్ సాయకాన్ భూయః శతశోఽథ సహస్రశః ।
అతడు కోపంతో ఆ పురుషసింహాల శరీరాల మీద అంతటా వందల, వేల బాణాలను పదే పదే గుప్పించాడు. (23 1/2)
తమదృశ్యం విచిన్వంతః సృజంతమనిశం శరాన్ ॥ 24
హరయో వివిశుర్వ్యోమ ప్రగృహ్య మహతీః శిలాః ।
ఎడతెగకుండా బాణాలను వేస్తున్న అతడు అదృశ్యంగా ఉండడం చూసి వానరులు పెద్ద పెద్ద రాళ్లను తీసుకొని ఆకాశానికి ఎగిరారు. (24 1/2)
తాంశ్చ తౌ చాప్యదృశ్యః స శరైర్వివ్యాధ రాక్షసః ॥ 25
స భృశం తాడయామాస రావణిర్మాయయాఽఽవృతః ।
మాయను ఆశ్రయించి అదృశ్యంగా ఉన్న ఆ ఇంద్రజిత్తు ఆ వానరులను, రామలక్ష్మణులను కూడా బాణాలు కురిపించి మిక్కిలిగా గాయపరిచాడు. (25 1/2)
తౌ శరైరాచితౌ వీరౌ భ్రాతరౌ రామలక్షణౌ ।
పేతతుర్గగనాద్ భూమిం సూర్యాచంద్రమసావివ ॥ 26
అన్నదమ్ములైన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ బాణాలతో పూర్తిగా కప్పబడి సూర్యచంద్రులు ఆకాశాన్నుండి పడినట్లుగా భూమిపై పడిపోయారు. (26)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి ఇంద్రజిద్యుద్ధే అష్టాశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 288 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున ఇంద్రజిత్తుయుద్ధమను రెండువందల ఎనుబది ఎనిమిదవ అధ్యాయము. (288)