255. రెండువందల యేబది అయిదవ అధ్యాయము

దుర్యోధనుని వైష్ణవయాగసమారంభము.

వైశంపాయన ఉవాచ
జిత్వా తు పృథివీం రాజన్ సూతపుత్రో జనాధిప ।
అబ్రవీత్ పరవీరఘ్నః దుర్యోధనమిదం వచః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
మహారాజా! పరవీరహంత అయిన కర్ణుడు పృథివినంతా జయించిన తర్వాత దుర్యోధనునితో ఇలా అన్నాడు. (1)
కర్ణ ఉవాచ
దుర్యోధన నిబోధేదం యత్ త్వాం వక్ష్యామి కౌరవ ।
శ్రుత్వా వాచం తథా సర్వం కర్తుమర్హస్యరిందమ ॥ 2
కర్ణుడిలా అన్నాడు. కౌరవా! దుర్యోధనా! నేను చెప్తున్న మాటను విను. అరిందమా! మాట విన్న తరువాత దాని ననుసరించి అంతా ఆచరించు. (2)
తవాద్య పృథివీ వీర నిఃసపత్నా నృపోత్తమ ।
తాం పాలయ యథా శక్రః హతశత్రుర్మహామనాః ॥ 3
వీరా! రాజశ్రేష్ఠా! ఇప్పుడు భూమండలమంతా నిష్కంటకంగా నీదయినది. మహామనస్వి అయిన ఇంద్రుడు శత్రువులను సంహరించి, రాజ్యపాలన చేసినట్లు నీవు కూడా పరిపాలించు. (3)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు కర్ణేన కర్ణం రాజాబ్రవీత్ పునః ।
న కించిద్ దుర్లభం తస్య యస్య త్వం పురుషర్షభ ॥ 4
సహాయశ్చానురక్తశ్చ మదర్థం చ సముద్యతః ।
అభిప్రాయస్తు మే కశ్చిత్ తం వై శృణు యథాతథమ్ ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు.
కర్ణుడిలా అనగానే దుర్యోధనుడు కర్ణునితో ఇలా అన్నాడు - పురుషోత్తమా! నీవంటి మిత్రుడున్నవానికి దుర్లభమైనది ఏదీ లేదు.
నీవు నాకు సహాయకుడవు. నాపై అనురాగం కలవాడవు. నాకై ఉద్యమించినవాడవు. నాకొక ఆలోచన ఉంది. దాన్ని యథాతథంగా విను. (4,5)
రాజసూయం పాండవస్య దృష్ట్వా క్రతువరం మహత్ ।
మమ స్పృహా సముత్పన్నా తాం సంపాదయ సూతజ ॥ 6
కర్ణా! యాగశ్రేష్ఠమైన రాజసూయాన్ని ధర్మరాజు చేస్తుంటే చూసిన తర్వాత నాకు కూడా రాజసూయం చేయాలని కోరిక కలిగింది. ఆ కోరికను నెరవేర్చాలి. (6)
ఏవముక్తస్తతః కర్ణః రాజానమిదమబ్రవీత్ ।
తవాద్య పృథివీపాల వశ్యాః సర్వే నృపోత్తమ ॥ 7
ఆహూయంతా ద్విజవరాః సంభారాశ్చ యథావిధి ।
సంభ్రియంతాం కురుశ్రేష్ఠ యజ్ఞోపకరణాని చ ॥ 8
ఆ మాటలు విని కర్ణుడు దుర్యోధనునితో ఇలా పలికాడు. "రాజోత్తమా! మహారాజా! ఇప్పుడు రాజులందరూ నీ అదుపులో ఉన్నవారే. బ్రాహ్మణోత్తములను పిలిపించు. కురుశ్రేష్ఠా! యథావిధిగా యజ్ఞసామగ్రిని, ఉపకరణాలను సమకూర్చు. (7,8)
ఋత్విజశ్చ సమాహూతాః యథోక్తా వేదపారగాః ।
క్రియాం కుర్వంతు తే రాజన్ యథాశాస్త్రమరిందమ ॥ 9
రాజా! అరిందమా! వేదపారంగతులై, తగిన అర్హతలు గలిగి, నీవు పిలువగా వచ్చిన ఋత్విక్కులు యథాశాస్త్రంగా పని ముగిస్తారు. (9)
బహ్వన్నపానసంయుక్తః సుసమృద్ధగుణాన్వితః ।
ప్రవర్తతాం మహాయజ్ఞః తవాపి భరతర్షభ ॥ 10
భరతశ్రేష్ఠా! నీ మహాయాగం కూడా విరివిగా అన్నపానీయాలతో, సర్వసమృద్ధగుణాలతో సంపన్నమవుతుంది.' (10)
ఏవముక్తస్తు కర్ణేన ధార్తరాష్ట్రో విశాంపతే ।
పురోహితం సమానాయ్య వచనం చేదబ్రవీత్ ॥ 11
రాజసూయం క్రతుశ్రేష్ఠం సమాప్తవరదక్షిణమ్ ।
ఆహర త్వం మమ కృతే యతాన్యాయం యథాక్రమమ్ ॥ 12
రాజా! కర్ణుడిలా అనగానే దుర్యోధనుడు పురోహితుని పిలిపించి ఇలా చెప్పాడు - "ఉత్తమదక్షిణలతో కూడిన క్రతుశ్రేష్ఠమైన రాజసూయాన్ని యథాక్రమంగా, యథాశాస్త్రంగా నాచేత జరిపించాలి.' (11,12)
స ఏవముక్తో నృపతిమ్ ఉవాచ ద్విజసత్తమః ।
(బ్రాహ్మణైః సహితో రాజన్ యే తత్రాసన్ సమాగతాః ।)
న స శక్యః క్రతుశ్రేష్ఠః జీవమానే యుధిష్ఠిరే ॥ 13
ఆహర్తుం కౌరవశ్రేష్ఠ కులే తవ నృపోత్తమ ।
దీర్ఘాయుర్జీవతి చ తే ధృతరాష్ట్రః పితా నృప ॥ 14
అతశ్చాపి విరుద్ధస్తే క్రతురేష నృపోత్తమ ।
రాజా! దుర్యోధనుడు ఆ రీతిగా ఆదేశించగా పురోహితుడు అక్కడున్న మిగిలిన బ్రాహ్మణులతో కలిసి దుర్యోధనునితో ఇలా అన్నాడు.
'కౌరవశ్రేష్ఠా! ధర్మరాజు జీవించి ఉండగా మీ వంశంలో రాజసూయాన్ని చేయటం వీలుకాదు. రాజశ్రేష్ఠా! ఇప్పుడు దీర్ఘాయువు అయిన నీ తండ్రి - ధృతరాష్ట్రుడు కూడా సజీవుడే. రాజా! ఆ కారణంగా నీవు రాజసూయం చేయటం శాస్త్ర విరుద్ధం. (13,14 1/2)
వి॥సం॥ రాజసూయం చేయని తండ్రి జీవించి ఉండగా తనయుడు రాజసూయం చేయరాదు. ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి, రాజసూయధికారం లేనివాడు కాబట్టి ఆయన ఉండటం దుర్యోధనుడు రాజసూయం చేయటానికి అడ్డంకి కాకపోయినా ధర్మరాజును గెలవలేకపోవటమే ప్రతిబంధకం కావచ్చు. (నీల)
అస్తి త్వన్యన్మహత్ సత్రం రాజసూయసమం ప్రభో ॥ 15
ప్రభూ! రాజసూయంతో సమానమైన మరో మహాక్రతువు ఉన్నది. (15)
తేన త్వం యజ రాజేంద్ర శృణు చేదం వచో మమ ।
య ఇమే పృథివీపాలాః కరదాస్తవ పార్థివ ॥ 16
తే కరాన్ సంప్రయచ్ఛంతు సువర్ణం చ కృతాకృతమ్ ।
తేన తే క్రియతామద్య లాంగలం నృపసత్తమ ॥ 17
రాజేంద్రా! నీవు ఆ యాగాన్ని చేయి. ఈ నా మాట విను. రాజా! ఇప్పుడు నీకు కప్పం చెల్లిస్తున్న ఈ రాజులందరూ బంగారాన్నీ, బంగారు నగలను నీకు కప్పంగా చెల్లించాలని ఆదేశించు. నృపశ్రేష్ఠా! ఆ బంగారంతో ఒక నాగలిని చేయించు. (16,17)
యజ్ఞవాటస్య తే భూమిః కృష్యతాం తేన భారత ।
తత్ర యజ్ఞో నృపశ్రేష్ఠ ప్రభూతాన్నః సుసంస్కృతః ॥ 18
ప్రవర్తతాం యథాన్యాయం సర్వతో హ్యనివారితః ।
భారతా! నీ యజ్ఞమండపభూమిని ఆ నాగలితో దున్నించు. రాజోత్తమా! అక్కడ సుసంస్కృతమై, విరివిగా అన్నపానాలు గల యాగాన్ని నిరాటంకంగా యథాశాస్త్రంగా ప్రారంభించుదాం. (18 1/2)
ఏష తే వైష్ణవో నామ యజ్ఞః సత్పురుషోచితః ॥ 19
ఏతేన నేష్టవాన్ కశ్చిద్ ఋతే విష్ణుం పురాతనమ్ ।
రాజసూయం క్రతుశ్రేష్ఠం స్పర్దత్యేష మహాక్రతుః ॥ 20
నీకు నేను చెప్పిన ఈ యాగం వైష్ణవయాగం. సత్పురుషులకు తగినదిది. పురాతనుడైన విష్ణువు తప్ప మరెవ్వరూ ఈ యాగం చేయలేదు. ఈ మహాక్రతువు యాగశ్రేష్ఠమైన రాజసూయంతో పోటీపడగలది. (19,20)
అస్మాకం రోచతే చైవ శ్రేయశ్చ తవ భారత ।
నిర్విఘ్నశ్చ భవత్యేషః సఫలా స్యాత్ స్పృహా తవ ॥ 21
భారతా! ఇది మాకు నచ్చిన యాగం. నీకు శ్రేయస్కరం. ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది. నీ కోరిక నెరవేరుతుంది. (21)
(తస్మాదేష మహాబాహో తవ యజ్ఞః ప్రవర్తతామ్ ।)
ఏవముక్తస్తు తైర్విప్రైః ధార్తరాష్ట్రో మహీపతిః ।
కర్ణం చ సౌబలం చైవ భ్రాతౄంశ్చైవేదమబ్రవీత్ ॥ 22
కాబట్టి మహాబాహూ! నీవు ఈ యాగాన్ని ఆరంభించు.' బ్రాహ్మణులు అలా అనగానే దుర్యోధనరపతి కర్ణునితో, శకునితో, సోదరులతో ఇలా అన్నాడు. (22)
రోచతే మే వచః కృత్స్నం బ్రాహ్మణానాం న సంశయః ।
రోచతే యది యుష్మాకం తస్మాత్ ప్రబ్రూత మా చిరమ్ ॥ 23
'ఈ బ్రాహ్మణుల మాట నాకు పూర్తిగా నచ్చింది. సందేహం లేదు. మీకు కూడా నచ్చితే ఆలస్యం లేకుండా చెప్పండి. (23)
ఏవముక్తాస్తు తే సర్వే తథేత్యూచుర్నరాధిపమ్ ।
సందిదేశ తతో రాజా వ్యాపారస్థాన్ యథాక్రమమ్ ॥ 24
హలస్య కరణే చాపి వ్యాదిష్టాః సర్వశిల్పినః ।
యథోక్తం చ నృపశ్రేష్ఠ కృతం సర్వం యథాక్రమమ్ ॥ 25
దుర్యోధనుడలా అనగానే వారంతా 'అలాగే' అని దుర్యోధనునితో అన్నారు. అప్పుడు దుర్యోధనుడు పనిచేసుకొంటున్న శిల్పులనందరినీ యథాక్రమంగా నాగలి తయారుచేయటానికి నియమించాడు. రాజోత్తమా! అలా ఆదేశింపబడగానే శిల్పులందరూ క్రమంగా పని అంతా పూర్తిచేశారు. (24,25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనయజ్ఞసమారంభే పంచపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 255 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనయజ్ఞసమారంభమను రెండు వందల యేబది అయిదవ అధ్యాయము. (255)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 26 శ్లోకాలు.)