254. రెండువందల యేబది నాలుగవ అధ్యాయము
కర్ణదిగ్విజయము - హస్తినలో సత్కారము.
వైశంపాయన ఉవాచ
తతః కర్ణో మహేష్వాసః బలేన మహతా వృతః ।
ద్రుపదస్య పురం రమ్యం రురోధ భరతర్షభ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
భరతశ్రేష్ఠా! ఆ తరువాత మేటివిలుకాడయిన కర్ణుడు పెద్దసేనను వెంటబెట్టుకొని, రమణీయమైన ద్రుపదనగరాన్ని ముట్టడించాడు. (1)
యుద్ధేన మహతా చైనం చక్రే వీరం వశానుగమ్ ।
సువర్ణం రజతం చాపి రత్నాని వివిధాని చ ॥ 2
కరం చ దాపయామాస ద్రుపదం నృపసత్తమ ।
తం నినిర్జిత్య రాజేంద్ర రాజానస్తస్య యేఽనుగాః ॥ 3
తాన్ సర్వాన్ వశగాంశ్చక్రే కరం చైనానదాపయత్ ।
మహాయుద్ధం చేసి వీరుడైన ద్రుపదుని లోగొని బంగారాన్ని, వెండినీ, వివిధరత్నాలను కప్పంగా కట్టించాడు. రాజోత్తమా! ఈరీతిగా ద్రుపదుని జయించిన కర్ణుడు ద్రుపదుని అనుయాయులయిన రాజులందరినీ కూడా లోబరచుకొని, వారిచేత కూడా కప్పం కట్టించాడు. (2, 3 1/2)
అథోత్తరాం దిశం గత్వా వశే చక్రే నరాధిపాన్ ॥ 4
భగదత్తం చ నిర్జిత్య రాధేయో గిరిమారుహత్ ।
హిమవంతం మహాశైలం యుధ్యమానశ్చ శత్రుభిః ॥ 5
ప్రయయౌ చ దిశః సర్వాన్ నృపతీన్ వశమానయత్ ।
స హైమవతికాన్ జిత్వా కరం సర్వానదాపయత్ ।
స హైమవతికాన్ జిత్వా కరం సర్వానదాపయత్ ॥ 6
ఆ తరువాత ఉత్తరదిక్కుపై దండెత్తి అక్కడున్న రాజులను వశపరచుకొన్నాడు. భగదత్తుని ఓడించి కర్ణుడు రాజులతో యుద్ధం చేస్తూ చేస్తూ మహాపర్వతమైన హిమాలయాన్ని అధిరోహించాడు. అక్కడనుండి సర్వదిక్కులలో పయనించి రాజులను లోబరచుకొన్నాడు. హిమాలయ పర్వతప్రాంతీయుల నందరినీ ఓడించి, కప్పం కట్టించాడు. (4-6)
నేపాలవిషయే యే చ రాజానస్తానవాజయత్ ।
అవతీర్య తతః శైలాత్ పూర్వాం దిశమభిద్రుతః ॥ 7
నేపాలప్రాంతంలో నున్న రాజులనందరినీ ఓడించాడు. ఆపై హిమాలయం నుండి దిగి తూర్పుదిక్కుగా దూసుకొని పోయాడు. (7)
అంగాన్ వంగాన్ కలింగాంశ్చ శుండికాన్ మిథిలానథ ।
మాగధాన్ కర్కఖండాశ్చ నివేశ్య విషయేఽత్మనః ॥ 8
ఆవశీరాంశ్చ యోధ్యాంశ్చ అహిక్షత్రం చ నిర్జయత్ ।
పూర్వాం దిశం వినిర్జిత్య వత్సభూమిం తథాగమత్ ॥ 9
అంగ, వంగ, కళింగ, మిథిల, మాగధ, కర్కఖండ దేశాలను తన రాజ్యంలో కలుపుకొని ఆవశీర, యోధ్య, అహిక్షత్ర దేశాలను కూడా జయించాడు. ఈ రీతిగా తూర్పుదిక్కుపై గెలుపు సాధించి వత్సభూమిలో అడుగుపెట్టాడు. (8,9)
వత్సభూమిం వినిర్జిత్య కేవలాం మృత్తికావతీమ్ ।
మోహనం పత్తనం చైవ త్రిపురీం కోసలాం తథా ॥ 10
ఏతాన్ సర్వాన్ నినిర్జిత్య కరమాదాయ సర్వశః ।
వత్సభూమిని జయించి కేవల, మృత్తికావతి, మోహన, పత్తన, త్రిపురి, కోసల - ఈ దేశాలను కూడా గెలిచి, అందరి నుండి కప్పం స్వీకరించి, మరల బయలుదేరాడు. (10 1/2)
దక్షిణాం దిశమాస్థాయ కర్ణో జిత్వా మహారథాన్ ॥ 11
రుక్మిణం దాక్షిణాత్యేషు యోధయామాస సూతజః ।
స యుద్ధం తుములం కృత్వా రుక్మీ ప్రోవాచ సూతజమ్ ॥ 12
దక్షిణదిక్కుకు బయలుదేరి మహారథులనెందరినో జయించాడు. దాక్షిణాత్యులలో రుక్మితో యుద్ధం చేశాడు కర్ణుడు. ముందు భీకరయుద్ధం చేసిన రుక్మి ఆ తరువాత కర్ణునితో ఇలా అన్నాడు. (11,12)
ప్రీతోఽస్మి తవ రాజేంద్ర విక్రమేణ బలేన చ ।
న తే విఘ్నం కరిష్యామి ప్రతిజ్ఞాం సమపాలయమ్ ॥ 13
"రాజేంద్రా! నీ పరాక్రమం, నీ శక్తి చూచి ఆనందిస్తున్నాను. నిన్ను ఆటంకపరచను. క్షాత్రధర్మంమేరకు యుద్ధం చేశాను. అంతే. (13)
ప్రీత్యా చాహం ప్రయచ్ఛామి హిరణ్యం యావదిచ్ఛసి ।
సమేత్య రుక్మిణా కర్ణః పాండ్యం శైలం చ సోఽగమత్ ॥ 14
నీకు కావలసినంత బంగారాన్ని ఆనందంగా ఇస్తాను." ఇలా రుక్మితో మైత్రి కుదుర్చుకొని కర్ణుడు పాండ్య, శ్రీశైల దేశాలవైపు పయనించాడు. (14)
స కేరలం రణే చైవ నీలం చాపి మహీపతిమ్ ।
వేణుదారిసుతం చైవ యే చాన్యే నృపసత్తమాః ॥ 15
దక్షిణస్యాం దిశి నృపాన్ కరాన్ సర్వానదాపయత్ ।
మహాబలుడైన కర్ణుడు యుద్ధంలో కేరళరాజును, నీల రాజును, వేణు దారి కుమారుని ఓడించి, దక్షిణదిక్కున ఉన్న ఇతరరాజులను కూడా గెలిచి, వారి నుండి కప్పం గైకొన్నాడు. (15)
శైశుపాలిం తతో గత్వా విజిగ్వే సూతనందనః ॥ 16
పార్శ్వస్థాంశ్చాపి నృపతీన్ వశే చక్రే మహాబలః ।
ఆపై మహాబలుడైన కర్ణుడు శిశుపాలసుతుని ఓడించాడు. చుట్టుప్రక్కల ఉన్న రాజులందరినీ లోబరచుకొన్నాడు. (16 1/2)
ఆవంత్యాంశ్చ వశే కృత్వ సామ్నా చ భరతర్షభ ।
వృష్టిభిః సహ సంగమ్య పశ్చిమామపి నిర్జయత్ ॥ 17
భరతశ్రేష్ఠా! సామోపాయంతో అవంతీరాజును వశంచేసికొని, వృష్టివంశస్థులతో చెలిమిచేసి, పశ్చిమదిక్కును కూడా జయించాడు. (17)
వారుణీం దిశమాగమ్య యవనాన్ బర్బరాంస్తథా ।
నృపాన్ పశ్చిమభూమిస్థాన్ దాపయామాస వై కరాన్ ॥ 18
పశ్చిమదిక్కున పయనించి, పశ్చిమదేశరాజులయిన యవనులను, బర్బరులను ఓడించి వారిచే కప్పం కట్టించాడు. (18)
విజిత్య పృథివీం సర్వాం స పూర్వాపరదక్షిణామ్ ।
సమ్లేచ్ఛాటవికాన్ వీరః సపర్వతనివాసినః ॥ 19
భద్రాన్ రోహితకాంశ్చైవ ఆగ్రేయాన్ మాలవానపి ।
గణాన్ సర్వాన్ వినిర్జిత్య నీతికృత్ ప్రహసన్నివ ॥ 20
శశకాన్ యవనాంశ్చైవ విజిగ్యే సూతనందనః ।
ఇలా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలోని భూమినంతా జయించి ఆ వీరకర్ణుడు మ్లేచ్ఛ - ఆటవిక - గిరిజన - భద్ర- రోహితక - ఆగ్రేయ - మాలవాది సమస్త గణరాజ్యాలను ఓడించడు. ఆపై నీతిమంతుడైన కర్ణుడు అవలీలగా శశక, యవనరాజులను గెలిచాడు. (19-20 1/2)
నగ్నజిత్ర్పముఖాంశ్చైవ గణాన్ జిత్వా మహారథాన్ ॥ 21
ఏవం స పృథివీం సర్వాం వశే కృత్వా మహారథః ।
విజిత్య పురుషవ్యాఘ్రః నాగసాహ్వయమాగమత్ ॥ 22
ఈ రీతిగా నగ్నజిత్తు మొదలైన మహారథులతో కూడిన గణరాజ్యాలను జయించి, సమస్తభూమిని ఓడించి లొంగదీసికొని మహారథి, పురుషశ్రేష్ఠుడైన కర్ణుడు హస్తినకు చేరాడు. (21,22)
తమాగతం మహేష్వాసం ధార్తరాష్ట్రో జనాధిపః ।
ప్రత్యుద్గమ్య మహారాజ సభ్రాతృపితృబాంధవః ॥ 23
అర్చయామాస విధినా కర్ణమాహవశోభినమ్ ।
ఆశ్రావయశ్చ తత్ కర్మ ప్రీయమాణో జనేశ్వరః ॥ 24
మహారాజా! మేటివిలుకాడైన కర్ణుడు మరల వచ్చుట తెలిసి, దుర్యోధన నరపతి పితృభ్రాతృబంధుసహితంగా ఎదురేగి, విధిపూర్వకంగా స్వాగతసత్కారాలు జరిపించాడు. యుద్ధానికే వన్నె తీసికొనిరాగల కర్ణుని దిగ్విజయయాత్రను దుర్యోధనుడు ఆనందంగా అంతటా ప్రకటింపజేశాడు. (23,24)
యన్నభీష్మాన్న చ ద్రోణాన్న కృపాన్న చ బాహ్లికాత్ ।
ప్రాప్తవానస్మి భద్రం తే త్వత్తః ప్రాప్తం మయా హి తత్ ॥ 25
కర్ణునితో ఇలా అన్నాడు - కర్ణా! భీష్మ, ద్రోణ, కృప, బాహ్లికుల ద్వారా కూడా పొందలేనిదాన్ని నీద్వారా నేను పొందాను. నీకు మేలు జరుగుతుంది. (25)
బహునా చ కిముక్తేన శృను కర్ణ వచో మమ ।
సనాథోఽస్మి మహాబాహో త్వయా నాథేన సత్తమ ॥ 26
కర్ణా! ఇన్ని మాటలు ఎందుకు? ఒకటి చెపుతా విను. మహాబాహూ! సజ్జనశ్రేష్ఠా! నీ సహాయంతోనే నేను సనాథుడనైనాను. (26)
న హి తే పాండవాః సర్వే కలామర్హంతి షోడశీమ్ ।
అన్యే వా పురుషవ్యాఘ్ర రాజానోఽభ్యుదితోదితాః ॥ 27
పురుషశ్రేష్ఠా! పాండవులందరూ లేదా శ్రేష్ఠులుగా పరిగణింపబడే ఇతరరాజులు నీలోని పదహారవభాగానికి కూడా సరికారు. (27)
స భవాన్ ధృతరాష్ట్రం తం గాంధారీం చ యశస్వినీమ్ ।
పశ్య కర్ణ మహేష్వాస అదితిం వజ్రభృద్ యథా ॥ 28
మేటివిలుకాడా! కర్ణా! ఇప్పుడు నీవు దృతరాష్ట్రునీ, యశస్విని అయిన గాంధారిని ఇంద్రుడు అదితిని కలిసినట్లుగా కలియుము. (28)
తతో హలహలాశబ్దః ప్రాదురాసీద్ విశాంపతే ।
హాహాకారాశ్చ బహవో నగరే నాగసాహ్వయే ॥ 29
రాజా! అప్పుడే హస్తినగరమంతటా గొప్ప కోలాహలశబ్దం వినిపించింది. వివిధహాహాకారాలు వినిపించాయి. (29)
కేచిదేనం ప్రశంసంతి నిందంతి స్మ తథాపరే ।
తూష్ణీమాసంస్తథా చాన్యే నృపాస్తత్ర జనాధిప ॥ 30
రాజా! అక్కడ కొందరు రాజులు కర్ణుని ప్రశంసిస్తున్నారు. మరికొందరు నిందిస్తున్నారు. ఇతరులు మౌనంగా ఉండిపోయారు. (30)
ఏవం విజిత్య రాజేంద్ర కర్ణః శస్త్రభృతాం వరః ।
సపర్వతవనాకాశాం ససముద్రాం సనిష్కుటామ్ ॥ 31
దేశైరుచ్చావచైః పూర్ణాం పత్తనైర్నగరైరపి ।
ద్వీపైశ్చానూపసంపూర్ణైః పృథివీం పృథివీపతే ॥ 32
కాలేన నాతిదీర్ఘేణ వశే కృత్వా తు పార్థివాన్ ।
అక్షయం ధనమాదాయ సూతజో నృపమభ్యయాత్ ॥ 33
రాజేంద్రా! ఈరీతిగా యోధులలో మేటి అయిన కర్ణుడు పర్వతాలు, వనాలు, శూన్యప్రదేశాలు, సముద్రాలు, ఉద్యానాలు, చిన్నపెద్దదేశాలు, పట్టణాలు, నగరాలు, ద్వీపాలు, జలప్రాంతాలు - వీటన్నింటితో నిండిన సమస్తపృథివిని స్వల్పవ్యవధిలోనే జయించి, రాజులను లొంగదీసికొని, అక్షయధనాన్ని సాధించి, ధృతరాష్ట్రసందర్శనకు వెళ్ళాడు. (31-33)
ప్రవిశ్య చ గృహం రాజన్ అభ్యంతరమరిందమ ।
గాంధారీసహితం వీరః ధృతరాష్ట్రం దదర్శ సః ॥ 34
పుత్రవచ్చ నరవ్యాఘ్ర పాదౌ జగ్రాహ ధర్మవిత్ ।
ధృతరాష్ట్రేణ చాశ్లిష్య ప్రేమ్ణా చాపి విసర్జితః ॥ 35
అరిందమా! రాజా! ధర్మవేత్త, వీరుడు అయిన కర్ణుడు అంతఃపురంలో ప్రవేశించి, గాంధారీసహితుడైన ధృతరాష్ట్రుని సందర్శించాడు. కన్నబిడ్డవలె వారిపాదాలకు ప్రణమిల్లాడు. ధృతరాష్ట్రుడు కూడా ప్రేమపూర్వకంగా కర్ణుని కౌగిలించి విడిచాడు. (34,35)
తదా ప్రభృతి రాజా చ శకునిశ్చాపి సౌబలః ।
జానతే నిర్జితాన్ పార్థాన్ కర్ణేన యుధి భారత ॥ 36
భారతా! నాటినుండి దుర్యోధనుడు, సౌబలుడయిన శకుని యుద్ధంలో కర్ణుడు పాండవులను జయించినట్లే భావించారు. (36)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి కర్ణదిగ్విజయే చతుష్పంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 254 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున కర్ణదిగ్విజయమను రెండు వందల యేబది నాలుగవ అధ్యాయము. (254)