245. రెండువందల నలువది అయిదవ అధ్యాయము
పాండవుల చేతిలో గంధర్వులు ఓడిపోవుట.
వైశంపాయన ఉవాచ
తతో దివ్యాస్త్రసంపన్నాః గంధర్వా హేమమాలినః ।
విసృజంతః శరాన్ దీప్తాన్ సమంతాత్ పర్యవారయన్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు సువర్ణహారాలు ధరించి, దివ్యాస్త్రసంపన్నులైన గంధర్వులు కాంతిమంతమయిన బాణాలను వదలుతూ పాండవులను చుట్టుముట్టారు. (1)
అప్పుడు సువర్ణహారాలు ధరించి, దివ్యాస్త్రసంపన్నులైన గంధర్వులు కాంతిమంతమయిన బాణాలను వదలుతూ పాండవులను చుట్టుముట్టారు. (1)
చత్వారః పాండవా వీరాః గంధర్వాశ్చ సహస్రశః ।
రణే సంన్యపతన్ రాజన్ తదద్భుతమివాభవత్ ॥ 2
వీరపాండవులు నలుగురే. గంధర్వులు వేలకువేలు. వీరందరూ పాండవులపై పడ్డారు. అది అద్భుతంగా కనిపించింది. (2)
యథా కర్ణస్య చ రథః ధార్తరాష్ట్రస్య చోభయోః ।
గంధర్వైః శతశశ్ఛిన్నౌ తథా తేషాం ప్రచక్రిరే ॥ 3
కర్ణుని రథాన్ని, సుయోధనుని రథాన్ని వందల ముక్కలుగా విరిచినట్లు గంధర్వులు పాండవుల రథాలను కూడా ముక్కలు చేయబూనారు. (3)
తాన్ సమాపతతో రాజన్ గంధర్వాన్ శతశో రణే ।
ప్రత్యగృహ్ణన్ నరవ్యాఘ్రాః శరవర్షైరనేకశః ॥ 4
రాజా! వందలకొలదిగ గంధర్వులు మీద పడుతుంటే
నరశ్రేష్ఠులైన పాండవులు శరవర్షంతో చాలామందిని నిరోధించారు. (4)
తే కీర్యమాణాః ఖగమాః శరవర్షైః సమంతతః ।
న శేకుః పాండుపుత్రాణాం సమీపే పరివారితుమ్ ॥ 5
అన్నివైపుల నుండి బాణాలు వచ్చి మీదపడుతుంటే గంధర్వులు పాండవుల సమీపానికి కూడా రాలేకపోయారు. (5)
అభిక్రుద్ధానభిక్రుద్ధః గంధార్వనర్జునస్తదా ।
లక్షయిత్వాథ దివ్యాని మహాస్త్రాణ్యుపచక్రమే ॥ 6
గంధర్వులు కోపోద్రిక్తులై ఉండటం చూసి అర్జునుడు కూడా కోపంతో గొప్పగొప్ప దివ్యాస్త్రాలను వారిపై ప్రయోగింపసాగాడు. (6)
సహస్రాణాం సహస్రాణి ప్రాహిణోద్ యమసాదనమ్ ।
ఆగ్నేయేనార్జునః సంఖ్యే గంధర్వాణాం బలోత్కటః ॥ 7
బలిష్ఠుడైన అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి లక్షమంది గంధర్వులను యమలోకానికి పంపించాడు. (7)
తథా భీమో మహేష్వాసః సంయుగే బలినాం వరః ।
గంధర్వాన్ శతశో రాజన్ జఘాన నిశితైః శరైః ॥ 8
అదేరీతిగా బలవంతులలో శ్రేష్ఠుడు, మహాధానుష్కుడు అయిన భీమసేనుడు కూడా వాడిబాణాలతో వందల కొద్దీ గంధర్వులను చంపాడు. (8)
మాద్రీపుత్రావపి తథా యుధ్యమానౌ బలోత్కటౌ ।
పరిగృహ్యాగ్రతో రాజన్ జఘ్నతుః శతశః పరాన్ ॥ 9
రాజా! బలోన్మత్తులయిన నకులసహదేవులు కూడా అదేవిధంగా యుద్ధంచేస్తూ, వందలకొలది శత్రువులను ముందునుంచి పట్టుకొని, చంపారు. (9)
తే వధ్యమానా గంధర్వాః దివ్యైరస్త్రైర్మహారథైః ।
ఉత్పేతుః ఖముపాదాయ ధృతరాష్ట్రసుతాంస్తతః ॥ 10
మహారథుల దివ్యాస్త్రాల తాకిడికి తట్టుకొనలేక గంధర్వులు ధార్తరాష్ట్రులను తీసికొని ఆకాశానికి ఎగిరిపోయారు. (10)
స తానుత్పతితాన్ దృష్ట్వా కుంతీపుత్రో ధనంజయః ।
మహతా శరజాలేన సమంతాత్ పర్యవారయత్ ॥ 11
పైకెగిరిపోతున్న ఆ గంధర్వులను చూచి కౌంతేయుడైన అర్జునుడు గొప్పబాణసమూహంతో వారిని అన్నివైపులా నిరోధించాడు. (11)
తే బద్ధాః శరజాలేన శకుంతా ఇవ పంజరే ।
వవర్షురర్జునం క్రోధాద్ గదాశక్త్యృష్టివృష్టిభిః ॥ 12
పంజరంలో చిక్కిన పక్షులవలె గంధర్వులు బాణాల మధ్య చిక్కి, కోపంతో అర్జునునిపై గదలను, శక్తులను, ఋష్టులను కురిపించారు. (12)
గదాశక్త్వృష్టివృష్టీస్తా నిహత్య పరమాస్త్రవిత్ ।
గాత్రాణి చాహనద్ భల్లైః గంధర్వాణాం ధనంజయః ॥ 13
పరమాస్త్రవేత్త అయిన అర్జునుడు గద శక్తి, ఋష్టుల ఆ వానను నివారించి, భల్లాలతో గంధర్వుల శరీరాలను గాయపరిచాడు. (13)
శిరోభిః ప్రపతద్భిశ్చ చరణైర్బాహుభిస్తథా ।
అశ్మవృష్టిరివాభాతి పరేషామభవద్ భయమ్ ॥ 14
అప్పుడు రాళ్ళవాన కురుస్తున్నట్లు గంధర్వుల తలలు, చేతులు, కాళ్ళు తెగిపడుతున్నాయి. గంధర్వులకు చాలా భీతి కల్గింది. (14)
తే వధ్యమానా గంధర్వాః పాండవేన మహాత్మనా ।
భూయిష్ఠమంతరిక్షస్థాః శరవర్షైరవాకిరన్ ॥ 15
మహాత్ముడైన అర్జునుడు గంధర్వులను చంపుతుంటే వారు గగనచారులై, నేలపైనున్న అర్జునునిపై బాణవృష్టిని కురిపించారు. (15)
తేషాం తు శరవర్షాణి సవ్యసాచీ పరంతపః ।
అస్త్రైః సంవార్య తేజస్వీ గంధర్వాన్ ప్రత్యవిధ్యత ॥ 16
తేజస్వి, పరంతపుడైన అర్జునుడు వారి బాణవర్షాలను తన అస్త్రాలతో నివారించి, గంధర్వులను గాయపరిచాడు. (16)
స్థూణాకర్ణేంద్రజాలణ్ చ సౌరం చాపి తథార్జునః ।
ఆగ్నేయం చాపి సౌమ్యం చ సనర్జ కురునందనః ॥ 17
కురుకుమారుడయిన అర్జునుడు స్థూణాకర్ణం, ఇంద్రజాలం, సౌరం, ఆగ్నేయం, సౌమ్యం - అనే అస్త్రాలను ప్రయోగించాడు. (17)
తే దహ్యమానా గంధర్వాః కుంతీపుత్రస్య సాయకైః ।
దైతేయా ఇవ శక్రేణ విషాదమగమన్ పరమ్ ॥ 18
ఇంద్రుడు రాక్షసులను దహించినట్లు అర్జునుడు బాణాలతో గంధర్వులను దహిస్తుండగా, వారు తీవ్రవిషాదాన్ని పొందారు. (18)
ఊర్ధ్వమాక్రమమాణాశ్చ శరజాలేన వారితాః ।
విసర్పమాణా భల్లైశ్చ వార్యంతే సవ్యసాచినా ॥ 19
గంధర్వులు పైపైకి వెళ్ళబోతుంటే అర్జునుడు శరసమూహంతో నివారించాడు. వారు అటు ఇటు పరువెత్తబోతే అర్జునుడు భల్లాలతో నివారించాడు. (19)
గంధర్వాంస్త్రాసితాన్ దృష్ట్వా కుంతీపుత్రేణ భారత ।
చిత్రసేనో గదాం గృహ్య సవ్యసాచినమాద్రవత్ ॥ 20
భారతా! అర్జునుడు గంధర్వులను భయపెట్టడం చూసి, చిత్రసేనుడు గదను చేతబట్టి, అర్జునునిపై కురికాడు. (20)
తస్యాభిపతతస్తూర్ణం గదాహస్తస్య సంయుగే ।
గదాం సర్వాయసీం పార్థః శరైశ్చిచ్ఛేద సప్తధా ॥ 21
గదను చేతబట్టి చిత్రసేనుడు రణభూమిలోని కురకగానే అర్జునుడు తన బాణాలతో లోహమయమైన ఆ గదను ఏడుముక్కలుగా విరగగొట్టాడు. (21)
స గదాం బహుధా దృష్ట్వా కృత్తాం బాణైస్తరస్వినా ।
సంవృత్వ విద్యయాఽఽత్మానం యోధయామాస పాండవమ్ ॥ 22
వేగశాలి అయిన అర్జునుడు తనగదను ముక్కలు ముక్కలు చేయటం చూసి, చిత్రసేనుడు అదృశ్యరూపుడై యుద్ధాన్ని కుపక్రమించాడు. (22)
అస్త్రాణి తస్య దివ్యాని సంప్రయుక్తాని సర్వశః ।
దివ్యైరస్త్రైస్తదా వీరః పర్యవారయదర్జునః ॥ 23
అప్పుడు చిత్రసేనుడు ప్రయోగించిన దివ్యాస్త్రాల నన్నింటిని వీరుడైన అర్జునుడు తన దివ్యాస్త్రాలతో నివారించాడు. (23)
స వార్యమాణ స్తైరస్త్రైః అర్జునేన మహాత్మనా ।
గంధర్వరాజో బలవాన్ మాయయాంతర్హితస్తదా ॥ 24
మహాత్ముడైన అర్జునుడు తన అస్త్రాలను నిరోధించగా, బలవంతుడైన గంధర్వరాజు (చిత్రసేనుడు) అదృశ్యమయ్యాడు. (24)
అంతర్హితం తమాలక్ష్య ప్రహరంతమథార్జునః ।
తాడయామాస ఖచరైః దివ్యాస్త్రప్రతిమంత్రితైః ॥ 25
చిత్రసేనుడు మాయయై దెబ్బతీస్తుంటే అర్జునుడు ఆకాశంలో సంచరించగల దివ్యాస్త్రాలను అభిమంత్రించి, అతనిపై ప్రయోగించాడు. (25)
అంతర్ధానవధం చాస్య చక్రే క్రుద్ధోఽర్జునస్తదా ।
శబ్దవేధం సమాశ్రిత్య బహురూపో ధనంజయః ॥ 26
అర్జునుడు రణభూమిని మొత్తం ఆక్రమిస్తూ బహురూపుడుగా కనిపించాడు. ఆ ధనంజయుడు కోపించి శబ్దవేధ విద్యను ఆశ్రయించి చిత్రసేనుని అంతర్ధాన విద్యను నశింపజేశాడు. (26)
స వధ్యమానస్తైరస్త్రైః అర్జునేన మహాత్మనా ।
తతోఽస్య దర్శయామాస తదాఽఽత్మానం ప్రియః సఖా ॥ 27
మహాత్ముడైన అర్జునుని బాణాలదెబ్బలు తిని చిత్రసేనుడు తన ప్రియసఖుడైన అర్జునుని ఎదుట నిజరూపంతో నిలిచాడు. (27)
చిత్రసేనస్తథోవాచ సఖాయం యుధి విద్ధి మామ్ ।
చిత్రసేనమథాలక్ష్య సఖాయం యుధి దుర్బలమ్ ॥ 28
సంజహారాస్త్రమథ తత్ ప్రసృష్టం పాండవర్షభః ।
దృష్ట్వా తు పాండవాః సర్వే సంహృతాస్త్రం ధనంజయమ్ ॥ 29
సంజహ్రుః ప్రద్రుతానశ్వాన్ శరవేగాన్ ధనూంషి చ ।
"అర్జునా! ఈ యుద్ధం చేస్తున్న నన్ను నీ మిత్రుడైన చిత్రసేనునిగా గ్రహించు" అన్నాడు చిత్రసేనుడు. అప్పుడు యుద్ధంలో గాయపడి, దుర్బలుడై ఉన్న మిత్రుని చిత్రసేనుని గమనించి, అర్జునుడు ఎక్కుపెట్టిన దివ్యాస్త్రాన్ని ఉపసంహరించాడు. అర్జునుడు ఎక్కుపెట్టిన దివ్యాస్త్రాన్ని ఉపసంహరించాడు. అర్జునుడు అస్త్రాల నుపసంహరించటాన్ని చూసి పాండవులంతా పరుగుపెడుతున్న తమగుర్రాలను నిలువరించి ధనుర్బాణాలను కట్టిపెట్టారు. (28,29 1/2)
చిత్రసేనశ్చ భీమశ్చ సవ్యసాచీ యమావపి ।
పృష్ట్వా కౌశలమన్యోన్యం రథేష్వేవావతస్థిరే ॥ 30
చిత్రసేనుడు, భీముడు, అర్జునుడు, నకులసహదేవులు పరస్పరం కుశల ప్రశ్నలు వేసికొని రథాలపైనే నిలచారు. (30)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి గంధర్వపరాభవే పంచచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 245 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున గంధర్వపరాభవమను రెండు వందల నలువది అయిదవ అధ్యాయము. (245)