244. రెండు వందల నలువది నాలుగవ అధ్యాయము

పాండవ గంధర్వ సంగ్రామము.

వైశంపాయన ఉవాచ
యుధిష్ఠిరవచః శ్రుత్వా భీమసేనపురోగమాః ।
ప్రహృష్టవదనాః సర్వే సముత్తస్థుర్నరర్షభాః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
యుధిష్ఠిరుని మాట విని భీమసేనుడు మొదలుగా గల వరశ్రేష్ఠులైన పాండవులందరూ తృప్తినిండిన ముఖాలతో యుద్ధానికి సన్నద్ధులయ్యారు. (1)
అభేద్యాని తతః సర్వే సమనహ్యంత భారత ।
జాంబూవదవిచిత్రాణి కవచాని మహారథాః ॥ 2
భారతా! అప్పుడు ఆ మహారథులందరూ స్వర్ణమయమై విచిత్రశోభాకర మయిన అభేద్యకవచాలను ధరించారు. (2)
అయుధాని చ దివ్యాని వివిధాని సమాదధుః ।
తే దంశితా రథైః సర్వే ధ్వజినః సశరాసనాః ॥ 3
పాండవాః ప్రత్యదృశ్యంత జ్వలితా ఇవ పావకాః ।
నానాదివ్యాయుధాలనూ కవచాలను ధరించి, రథాలనెక్కి ధ్వజాలతో, ధనుస్సులతో ప్రకాశిస్తున్న పాండవులు ప్రజ్వరిల్లే అగ్నిలా కనిపించారు. (3 1/2)
తాన్ రథాన్ సాధుసంపన్నాన్ సంయుక్తాన్ జవనైర్హయైః ॥ 4
ఆస్థాయ రథిశార్దూలాః శీఘ్రమేవ యయుస్తతః ।
రథాలకు వేగంగా దౌడుతీసే గుర్రాలన్య్ పూన్చారు. అవసరమైన సామగ్రితో రథాలు నిండుగా ఉన్నాయి. అటువంటి రథాలనెక్కి రథికశ్రేష్ఠులయిన పాండవులు త్వరగా వెళ్ళిపోయారు. (4 1/2)
తతః కౌరవసైన్యానాం ప్రాదురాస్మీన్మహాస్వనః ॥ 5
ప్రయతాన్ సహితాన్ దృష్ట్వా పాండుపుత్రాన్ మహారథాన్ ।
జితకాశినశ్చ ఖచరాః త్వరితాశ్చ మహారథాః ॥ 6
క్షణేనైవ వనే తస్మిన్ సమాజగ్మురభీతవత్ ।
న్యవర్తంత తతః సర్వే గంధర్వా జితకాశినః ॥ 7
అప్పుడు కరవసేనలు పెద్దగా గర్జించాయి. మహారథులైన పాండుపుత్రులు సన్నద్ధులై ఒక్కటిగా రావటం చూసి మహారథులు, విజయశోభావంతులు అయిన గంధర్వులు తీవ్రవేగంతో, క్షణకాలంలో నిర్భయంగా వనంలో గుమిగూడారు. విజయకాంక్షతో ప్రకాశిస్తున్న ఆ గంధర్వులందరూ శత్రువుల నెదిరించటానికి వెనుదిరిగి నిలిచారు. (5-7)
దృష్ట్వా రథాగతాన్ వీరాన్ పాండవాంశ్చతురో రణే ।
తాంస్తు విరాజితాన్ దృష్ట్వా లోకపాలానివోద్యతాన్ ॥ 8
వ్యూఢానీకా వ్యతిష్ఠంత గంధమాదనవాసినః ।
రథాల నెక్కి యుద్ధానికి వచ్చిన నలుగురు పాండవులను చూశారు. వారు లోకపాలకుల వలె ప్రకాశిస్తున్నారు వారిని చూసి గంధమాదననివాసులైన గంధర్వులు వ్యూహాత్మకంగా నిలిచారు. (8 1/2)
రాజ్ఞస్తు వచనం స్మృత్వా ధర్మపుత్రస్య ధీమతః ॥ 9
క్రమేణ మృదునా యుద్ధమ్ ఉపక్రాంతం చ భారత ।
భారతా! యమసుతుడూ, ధీమంతుడూ అయిన ధర్మరాజు మాటను స్మరించి పాండవులు మృదువుగా యుద్ధానికి ఉపక్రమించారు. (9 1/2)
న తు గంధర్వరాజస్య సైనికా మందచేతసః ॥ 10
శక్యంతే మృదునా శ్రేయః ప్రతిపాదయితుం తదా ।
కాని బుద్ధిహీనులయిన గంధర్వరాజసేనలు సున్నితంగా యుద్ధం జరిగితే లొంగివచ్చేటట్లు కనిపించలేదు. (10 1/2)
తతస్తాన్ యుధి దుర్ధర్షాన్ సవ్యసాచీ పరంతపః ॥ 11
సాంత్వపూర్వమిదం వాక్యమ్ ఉవాచ ఖచరాన్ రణే ।
విసర్జయత రాజానం భ్రాతరం మే సుయోధనమ్ ॥ 12
అప్పుడు పరంతపుడయిన అర్జునుడు యుద్ధంలో దుర్జయులైన గంధర్వులను చూసి అనునయపూర్వకంగా "మా సోదరుని సుయోధనమహారాజును విడిచిపెట్టండి" అని పలికాడు. (11,12)
త ఏవముక్తా గంధర్వాః పాండవేన యశస్వినా ।
ఉత్స్మయంతస్తదా పార్థమ్ ఇదం వచనమబ్రువన్ ॥ 13
కీర్తిశాలి అయిన అర్జునుడు అలా అనగానే గంధర్వులు నవ్వుతూ అర్జునునితో ఇలా అన్నారు. (13)
ఏకస్యైవ వయం తాత కుర్యామ వచనం భువి ।
యస్య శాసనమాజ్ఞాయ చరామో విగతజ్వరాః ॥ 14
తేనైకేన యథాఽదిష్టం తథా వర్తామ భారత ।
న శాస్తా విద్యతేఽస్మాకమ్ అన్యస్తస్మాత్ సురేశ్వరాత్ ॥ 15
నాయనా! లోకంలో మేము ఒక్కరి మాటనే వింటాము. ఆ ఒక్కరి మాటను శిరసావహించి నిశ్చింతంగా తిరుగుతున్నాం. భారతా! ఆ ఒక్కరు ఎలా ఆదేశిస్తే అలాగే ప్రవర్తిస్తాం. ఆయనే దేవతాశ్రేష్ఠుడైన చిత్రసేనుడు. ఆయన తప్ప మరెవ్వరూ మమ్ము శాసించలేరు. (14,15)
ఏవముక్తః స గంధర్వైః కుంతీపుత్రో ధనంజయః ।
గంధర్వాన్ పునరేవేదం వచనం ప్రత్యభాషత ॥ 16
గంధర్వులు అలా పలుకగానే కుంతీనందనుడైన అర్జునుడు ఆగంధర్వులతో మరలా ఇలా అన్నాడు. (16)
న తద్ గంధర్వరాజస్య యుక్తం కర్మ జుగుప్సితమ్ ।
పరదారాభిమర్శశ్చ మానుషైశ్చ సమాగమః ॥ 17
పరదారలను అపహరించటం, మానవులతో యుద్ధానికి దిగటం ఇటువంటి నీచపుపనులు గంధర్వరాజునకు తగవు. (17)
ఉత్సృజ్యధ్వం మహావీర్యాన్ ధృతరాష్ట్రసుతానిమాన్ ।
దారాంశ్చైషాం విముంచధ్వం ధర్మరాజస్య శాసనాత్ ॥ 18
ధర్మరాజు ఆజ్ఞమేరకు మీరు మహాపరాక్రమశాలులైన ధృతరాష్ట్రకుమారులను, వారి భార్యలను విడిచిపెట్టండి. (18)
యదా సామ్నా న ముంచధ్వం గంధర్వా ధృతరాష్ట్రజాన్ ।
మోక్షయిష్యామి విక్రమ్య స్వయమేవ సుయోధనమ్ ॥ 19
గంధర్వులారా! మంచిమాటలతో ధార్తరాష్ట్రులను మీరు వదలకపోతే నేను స్వయంగా పరాక్రమించి, సుయోధనుని విడిపిస్తాను. (19)
ఏవముక్త్వా తతః పార్థః సవ్యసాచీ ధనంజయః ।
ససర్జ నిశితాన్ బాణాన్ ఖచరాన్ ఖచరాన్ ప్రతి ॥ 20
అని పలికి సవ్యసాచీ, కుంతీనందనుడూ అయిన అర్జునుడు వాడిబాణాలను విడివిడిగా గంధర్వసమూహాలపై ప్రయోగించాడు. (20)
తథైవ శరవర్షేణ గంధర్వాస్తే బలోత్కటాః ।
పాండవానభ్యవర్తంత పాండవాశ్చ దివౌకసః ॥ 21
అదే విధంగా బలోన్మత్తులైన గంధర్వులు బాణాల వాన కురిపిస్తూ పాండవులకు ఎదురు నిలిచారు. పాండవులు కూడా గంధర్వులను ఎదిరించారు. (21)
తతః సుతుములం యుద్ధం గంధర్వాణాం తరస్వినామ్ ।
బభూవ భీమవేగానాం పాండవానాం చ భారత ॥ 22
అప్పుడు బలసంపన్నులైన గంధర్వులకు, తీవ్రవేగం గల పాండవులకు మధ్య భీకరయుద్ధం జరిగింది. (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి పాండవగంధర్వయుద్ధే చతుశ్చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 244 ॥
ఇది శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి పాండవగంధర్వయుద్ధమను రెండు వందల నలుబది నాలుగవ అధ్యాయము. (244)