234. రెండువందల ముప్పది నాలుగవ అధ్యాయము

భర్తను అనుకూలుని చేసికొను ఉపాయము.

ద్రౌపద్యువాచ
ఇమం తు తే మార్గమపేతమోహం
వక్ష్యామి చిత్తగ్రహణాయ భర్తుః ।
అస్మిన్ యథావత్ సఖి వర్తమానా
భర్తారమాచ్ఛేత్స్యసి కామినీభ్యః ॥ 1
ద్రౌపది ఇలా అన్నది.
భర్త మనస్సును లోబరచుకొనేందుకు నీకొక ఉపాయం చెప్తాను. దానిలో భ్రాంతికి అవకాశం లేదు. ఈ మార్గంలో యథాతథంగా నడిస్తే నీభర్తను ఇతరసపత్నుల నుండి నీవైపునకు లాగవచ్చు. (1)
నైతాదృశం దైవతమస్తి సత్యే
సర్వేషు లోకేషు సదేవకేషు ।
యథా పతిస్తస్య తు సర్వకామా
లభ్యాః ప్రసాదాత్ కుపితశ్చ హన్యాత్ ॥ 2
సత్యభామా! దేవలోకంతో సహా ఏ లోకంలో కూడా భార్యకు భర్తవంటి దైవం మరొకరు లేరు. భర్త ప్రసన్నుడైతే స్త్రీలకోరికలన్నీ తీరుతాయి. భర్త కోపిస్తే కోరికలు నశిస్తాయి. (2)
తస్మాదపత్యం వివిధాశ్చ భోగాః
శయ్యాసనాన్యుత్తమదర్శనాని ।
వస్త్రాణి మాల్యాని తథైవ గంధాః
స్వర్గశ్చ లోకో విపులా చ కీర్తిః ॥ 3
భర్తృసేవవలననే స్త్రీకి సంతానం, వివిధ భోగాలు, శయ్య, ఆసనం, అందమైన వస్త్రాలు, మాలలు, సుగంధాలు, స్వర్గలోకం, మహాకీర్తి - అన్నీ లభిస్తాయి. (3)
సుఖం సుఖేనేహ న జాతు లభ్యం
దుఃఖేన సాధ్వీ లభతే సుఖాని ।
సా కృష్ణమారాధయ సౌహృదేన
ప్రేమ్ణా చ నిత్యం ప్రతికర్మణా చ ॥ 4
తథాఽఽసనైశ్చారుభిరగ్రమాల్యైః
దాక్షిణ్యయోగైర్వివిధైశ్చ గంధైః ।
అస్యాః ప్రియోఽస్మీతి యథా విదిత్వా
త్వామేవ సంశ్లిష్యతి తద్ విధత్స్వ ॥ 5
ఈ లోకంలో ఎప్పుడూ సుఖం ద్వారా సుఖం కలుగదు. పతివ్రత అయిన స్త్రీ దుఃఖం ద్వారానే సుఖాలు పొందగలదు. నీవు నిత్యమూ సౌహృదంతో, ప్రేమతో, వ్యవహారకౌశలంతో, ఆసనసమర్పణతో, మనోహరపుష్పమాలలతో, ఔదార్యంతో, వివిధగంధాలతో శ్రీకృష్ణుని ఆరాధించు. దానితో "సత్యకు నేనంటే చాలా ఇష్టం" అని భావించి నిన్నే మనస్సులో నిలుపుకొనేటట్లు ప్రవర్తించు. (4,5)
శ్రుత్వా స్వరం ద్వారగతస్య భర్తుః
ప్రత్యుత్థితా తిష్ఠ గృహస్య మధ్యే ।
దృష్ట్వా ప్రవిష్టం త్వరితాఽఽసనేన
పాద్యేన చైనం ప్రతిపూజయస్వ ॥ 6
ద్వారం దగ్గరకు వచ్చిన భర్తకంఠస్వరాన్ని విని, లేచి, ఇంటిమధ్యలో నిలు. లోనికి ప్రవేశించగానే త్వరగా ఆసనపాద్యాల నిచ్చి, పూజించు. (6)
సంప్రేషితాయామథ చైవ దాస్యా
ముత్థాయ సర్వం స్వయమేవ కార్యమ్ ।
జానాతు కృష్ణస్తవ భావమేతం
సర్వాత్మనా మాం భజతీతి సత్యే ॥ 7
సత్యా! కృష్ణుడు ఏ పనిమీదనైనా దాసిని పంపబోతే నీవే లేచి స్వయంగా ఆ పనిచేయాలి. నీభావాని కృష్ణుడు గ్రహించి "సత్య నిండు మనస్సుతో నన్ను సేవిస్తోంది" అనుకోవాలి. (7)
త్వత్సంనిధౌ యత్ కథయేత్ పతిస్తే
యద్యప్యగుహ్యం పరిరక్షితవ్యమ్ ।
కాచిత్ సపత్నీ తవ వాసుదేవం
ప్రత్యాదిశేత్ తేన భవేద్ విరాగః ॥ 8
భర్త నీదగ్గర చెప్పిన మాటను - అది రహస్యం కాకపోయినా - నీవెవ్వరికీ చెప్పకూడదు. నీద్వారా విషయం గ్రహించిన ఏ సవతి అయినా వాసుదేవుని దగ్గర దానిని ప్రస్తావిస్తే నీపై విరక్తి కలుగవచ్చు. (8)
ప్రియాంశ్చ రక్తాంశ్చ హితాంశ్చ భర్తుః
తాన్ భోజయేథా వివిధైరుపాయైః ।
ద్వైష్యైరుపేక్ష్యైరహితైశ్చ తస్య
భిద్యస్వ నిత్యం కుహకోద్యతైశ్చ ॥ 9
భర్తకు ప్రియులు, అనురక్తులు, హితులు అయిన వారిని వివిధోపాయాలతో ఆరగింపు చేయాలి. భర్తకు ద్వేషింపదగినవారికి, పట్టించుకొనదగనివారికి, అహితులకూ, ఎప్పుడూ కుహకంగా ప్రవర్తించేవారికీ దూరంగా ఉండాలి. (9)
మదం ప్రమాదం పురుషేషు హిత్వా
సంయచ్ఛ భావం ప్రతిగృహ్య మౌనమ్ ।
ప్రద్యుమ్నసాంబావపి తే కుమారౌ
నోపాసితవ్యౌ రహితే కదాచిత్ ॥ 10
పరాయి పురుషుల దగ్గర పొగరును, ఏమరుపాటును వీడి, మౌనంగా నిలవాలి. మనస్సును బయటపడనీయరాదు. ప్రద్యుమ్నుడు, సాంబుడు నీకు పుత్రసమానులే. అయినా వారితో కూడా ఎప్పుడూ ఒంటరిగా ఉండదగదు. (10)
మహాకులీనాభిరపాపికాభిః
స్త్రీభిః సతీభిస్తవ సఖ్యమస్తు ।
చండాశ్చ శౌండాశ్చ మహాశనాశ్చ
చౌరాశ్చ దుష్టాశ్చపలాశ్చ వర్జ్యాః ॥ 11
మంచివంశంలో పుట్టి, పాపపుపనులకు దూరంగా నిలిచి ప్రవర్తించే పతివ్రతలతోనే నీకు మైత్రి ఉండాలి. కోపస్వభావం గలవారిని, మత్తులో మునిగేవారిని, తిండిపోతులను, దొంగలను, చెడ్డవారిని, చాపల్యం గల వారిని వదిలిపెట్టాలి. (11)
ఏతద్ యశస్యం భగదైవతం చ
స్వార్థ్యం తథా శత్రునిబర్హణం చ ।
మహార్హమాల్యాభరణామ్గరాగా
భర్తారమారాధయ పుణ్యగంధా ॥ 12
గొప్ప విలువ గల హారాలను, ఆభరణాలను అంగరాగాన్ని ధరించి దివ్యపరిమళాలతో భర్తను ఆరాధించు. ఇది కీర్తికరం, సౌభాగ్యకరం. దీనితో నీకోరికలు తీరుతాయి. శత్రువులు అణుగుతారు. (12)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీసత్యభామాసంవాదపర్వణి ద్రౌపదీకర్తవ్యకథనే చతుస్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 234 ॥
ఇది శ్రీమహాభారతమున ద్రౌపదీ సత్యభామాసంవాద పర్వమను ఉపపర్వమున ద్రౌపదీ కర్తవ్యకథనమను రెండు వందల ముప్పది నాలుగవ అధ్యాయము. (234)