233. రెండువందల ముప్పది మూడవ అధ్యాయము
(ద్రౌపదీ సత్యభామా సంవాదపర్వము)
ద్రౌపదీ సత్యభామా సంవాదము.
వైశంపాయన ఉవాచ
ఉపాసీనేషు విప్రేషు పాండవేషు మాహాత్మసు ।
ద్రౌపదీ సత్యభామా చ వివిశాతే తదా సమమ్ ॥ 1
జాహస్యమానే సుప్రీతే సుఖం తత్ర నిషీదతుః ।
చిరస్య దృష్ట్వా రాజేంద్ర తేఽన్యోన్యస్య ప్రియంవదే ॥ 2
వైశంపాయనుడు చెపుతున్నాడు. మహాత్ములైన విప్రులూ పాండవులూ ఆసీనులయ్యారు. అలాగే ద్రౌపదీసత్యభామలిద్దరూ ప్రక్కనే కూర్చున్నారు.
ఒకరినొకరు చూసికొని చాలాకాలమవడంతో ఇద్దరూ పరిహాసాలు చేసుకొంటూ సుఖంగా కూర్చున్నారు. (1,2)
కథయామాసతుశ్చిత్రాః కథాః కురుయదూత్థితాః ।
అథాబ్రవీత్ సత్యభామా కృష్ణస్య మహిషీ ప్రియా ॥ 3
సాత్రాజితీ యాజ్ఞసేనీం రహసీదం సుమధ్యమా ।
కేన ద్రౌపది వృత్తేన పాండవానధితిష్ఠసి ॥ 4
లోకపాలోపమాన్ వీరాన్ పునః పరమసంహతాన్ ।
కథం చ వశగాస్తుభ్యం న కుప్యంతి చ తే శుభే ॥ 5
కురువంశంలోనూ, యాదవవంశంలోనూ జరిగిన విశేషాలన్నీ చెప్పుకొంటున్నారు. అపుడు సత్యభామ రహస్యంగా ద్రౌపదితో
ఇలా అంది. 'ద్రౌపదీ! నీవు దిక్పాలురవంటి పాండవులను ఎలా వశం చేసుకొంటున్నావు? పైగా వారంతా కలిసి కట్టుగా ఉండే వీరులు కదా! వారంతా నీకు ఎలా వశులయ్యారు? వారు నీమీద ఎన్నడూ, ఏమాత్రమూ కోపపడకుండా ఉన్నారే! (3-5)
తవ వశ్యా హి సతతం పాండవాః ప్రియదర్శనే ।
ముఖప్రేక్షాశ్చ తే సర్వే తత్త్వమేతద్ బ్రవీహి మే ॥ 6
పాండవులు నీకు తదా వశ్యులై ఉంటారు. నీ ముఖదర్శనం కోసం తహతహలాడుతారు. ద్రౌపదీ! ఇందులోని రహస్యమేమిటో చెప్పవమ్మా! (6)
వ్రతచర్యా తపో వాపి స్నానమంత్రౌషధాని వా ।
విద్యావీర్యం మూలవీర్యం జపహోమాగదాస్తథా ॥ 7
మమాద్యాచక్ష్వ పాంచాలి యశస్యం భగదైవతమ్ ।
యేన కృష్ణే భవేన్నిత్యం మమ కృష్నో వశానుగః ॥ 8
వ్రతాచారం కాని, తపస్సు కాని, స్నానమంత్రాలు కాని, ఔషధాలు కాని, విద్యాశక్తి కాని, మూలశక్తి కాని, జపహోమాలు కాని, అంజనాలు కాని ఏవైనా ఉన్నాయా? ద్రౌపదీ! నాకు ఇపుడు చెప్పు - సౌభాగ్యం వృద్ధి చేసే చక్కని మార్గాలు ఏవైనా ఉన్నాయా, చెప్పు - వాటితో నాకు సదా కృష్ణుడు వశవర్తియై ఉంటాను.' (7,8)
ఏవముక్త్వా సత్యభామా విరరామ యశస్వినీ ।
పతివ్రతా మహాభాగా ద్రౌపదీ ప్రత్యువాచ తామ్ ॥ 9
ఇలా సత్యభామ అనగానే పతివ్రతయైన ద్రౌపది ఇలా సమాధానం చెప్పింది. (9)
అసత్ స్త్రీణాం సమాచారం సత్యే మామనుపృచ్ఛసి ।
అసదాచరితే మార్గే కథం స్యాదనుకీర్తనమ్ ॥ 10
సత్యా! దుష్టస్త్రీల గురించి నన్ను అడుగుతున్నావు. దుష్టస్త్రీల గురించి ఎలా సమాధానం చెప్పాలి? (10)
అనుప్రశ్నః సంశయో వా నైతత్ త్వయ్యుపపద్యతే ।
తథా హ్యుపేతా బుద్ధ్యా త్వం కృష్ణస్య మహిషీ ప్రియా ॥ 11
ఇటువంటి ప్రశ్న కాని సందేహం కాని నీకు రాకూడదు. ఎందుకంటే బుద్ధిమంతురాలివి. పైగా కృష్ణునికి ఇష్టమయిన రాణివి. (11)
యదైవ భర్తా జానీయాత్ మంత్రమూలపరాం స్త్రియమ్ ।
ఉద్విజేత తదైవాస్యాః సర్పాద్ వేశ్మగతాదివ ॥ 12
మంత్రతంత్రాలు పెట్టే భార్యను గురించి భర్తకు తెలిస్తే అతడు చాలా వ్యాకులపడతాడు. ఇంట్లో పామును పెట్టుకొన్నట్లు మనసు కుదురులేకుండా పోతుంది. (12)
ఉద్విగ్నస్య కుతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ।
న జాతు వశగో భర్తా స్త్రియాః స్యాన్మంత్రకర్మణా ॥ 13
అలా వ్యాకులపడితే శాంతి ఉండదు. శాంతిలేని వానికి సుఖమెక్కడిది? ఈ మంత్రాలతో, తంత్రాలతో భర్త ఎన్నడూ భార్యకు వశం కాడు. (13)
అమిత్రప్రహితాంశ్చాపి గదాన్ పరమదారుణాన్ ।
మూలప్రచారైర్హి విషం ప్రయచ్ఛంతి జిఘాంసవః ॥ 14
మోసంతో శత్రువులు పంపిన ఓషధులను భర్తలకు పెట్టి, ఎందరో స్త్రీలు వారిని తీవ్రవ్యాధులకు గురి చేశారు. శత్రువును చంపదలచిన వారు "భర్తను వశపరచుకొనే గొప్పమూలిక ఇది" అని స్త్రీలను మభ్యపెట్టి వారికి విషమందిస్తారు. (14)
జిహ్వయా యాని పురుషః త్వచా వాప్యుపసేవతే ।
తత్ర చూర్ణాని దత్తాని హన్యుః క్షిప్రమసంశయమ్ ॥ 15
అటువంటి వారిచ్చిన చూర్ణాలు నాలుకకో, చర్మానికో తగిలినంతనే నిస్సంశయంగా మనుషులను చంపగలుగుతాయి. (15)
జలోదరసమాయుక్తాః శ్విత్రిణః పరితాస్తథా ।
అపుమాంసః కృతాః స్త్రీభిః జడాంధబధిరాస్తథా ॥ 16
ఎందరో స్త్రీలు భర్తను వశపరచుకొంటున్నామనుకొంటూ వారిని జలోదర, శ్వేత కుష్ఠవ్యాధులకు గురిచేశారు. అకాలంలో వృద్ధులను చేశారు. నపుంసకులుగా, గ్రుడ్డివారుగా, మూగవారుగా కూడా చేశారు. (16)
పాపానుగాస్తు పాపాస్తాః పతీనుపసృజంత్యుత ।
న జాతు విప్రియం భర్తుః స్త్రియా కార్యం కథంచన ॥ 17
ఈ రీతిగా పాపాత్ములను అనుసరించిన పాపాత్ములయిన స్త్రీలు భర్తలను బాధలకు గురి చేశారు. భార్య ఎప్పుడూ ఏరీతిగానూ భర్తకు అప్రియాన్ని చేయదగదు. (17)
వర్తామ్యహం తు యాం వృత్తిం పాండవేషు మహాత్మసు ।
తాం సర్వాం శృణు మే సత్యాం సత్యభామే యశస్విని ॥ 18
కీర్తిశాలిని వైన సత్యభామా! మహాత్ములైన పండవులతో నేనెలా ప్రవర్తిస్తానో యథార్థంగా చెపుతాను. విను. (18)
అహంకారం విహాయాహం కామక్రోధౌ చ సర్వదా ।
సదారాన్ పాండవాన్ నిత్యం ప్రయతోపచరామ్యహమ్ ॥ 19
నేను అహంకారాన్ని, కామక్రోధాలను ఎప్పుడూ దరిచేరనీయక పూర్తిగా ఏకాగ్రతతో నిత్యమూ పాండవులనూ, వారి ఇతరభార్యలను సేవిస్తుంటాను. (19)
ప్రణయం ప్రతిసంహృత్య నిధాయాత్మానమాత్మని ।
శుశ్రూషుర్నిరహంమానా పతీనాం చిత్తరక్షిణీ ॥ 20
నాకోరికలను నియంత్రించుకొని, ఒళ్ళు మరచిపోకుండా సేవాభావంతోనే భర్తల మనస్సులను కాచుకొంటాను. అహంకారాభిమానాలకు తావివ్వను. (20)
దుర్వ్యాహృతాచ్ఛంకమానా దుఃస్థితాద్ దురవేక్షితాత్ ।
దురాసితాద్ దుర్ర్వజితాదింగితాధ్యాసితాధ్యాసితాదపి ॥ 21
చెడ్డమాటలు, చెడ్డనడత, నిలకడలేని చూపు, తగనిచోట కూర్చొనటం, తగని నడక - వీటికి అవకాశం లేకుండా జాగ్రత్తపడతాను. భర్తల అభిప్రాయాలను గ్రహించి అనుసరిస్తాను. (21)
సూర్యవైశ్వానరసమాన్ సోమకల్పాన్ మహారథాన్ ।
సేవే చక్షుర్హణః పార్థాన్ ఉగ్రవీర్యప్రతాపినః ॥ 22
కౌంతేయులు సూర్యాగ్నిసములు, చంద్రసమానులు, మహారథులు, కంటితోనే శత్రువులను చంపగలవారు, భీకరబలపరాక్రమాలు గలవారు. వారినెప్పుడూ సేవిస్తుంటాను. (22)
దేవో మనుష్యో గంధర్వః యువా చాపి స్వలంకృతః ।
ద్రవ్యవానభిరూపో వా న మేఽన్యః పురుషో మతః ॥ 23
దేవుడయినా, మనుష్యుడైనా, గంధర్వుడైనా, యువకుడైనా, షోకులాడు అయినా, ధనవంతుడయినా, అందగాడైనా సరే నా మనస్సుకు మరొక మగవాడు నచ్చడు. (23)
నాభుక్తవతి నాస్నాతే నాసంవిష్టే చ భర్తరి ।
న సంవిశామి నాశ్నామి సదా కర్మకరేష్వపి ॥ 24
భర్త ఆయన సేవకులు తినకముందు నేను తినను. వారు స్నానం చేయకముందు నేను స్నానం చేయను. భర్త శయనించకముందు నిదురించను. (24)
క్షేత్రాద్ వనాద్ వా గ్రామాద్ వా భర్తారం గృహమాగతమ్ ।
అభ్యుత్థాయాభినందామి ఆసనేనోదకేన చ ॥ 25
పొలం నుండి గానీ, తోట నుండి గానీ, గ్రామాంతరం నుండి గానీ భర్త ఇంటికివస్తే లేచి అభినందిస్తాను. ఆసనోదకాలను సమర్పిస్తాను. (25)
ప్రమృష్టభాండా మృష్టాన్నా కాలే భోజనదాయినీ ।
సంయతా గుప్తధాన్యా చ సుసమ్మృష్టనివేశనా ॥ 26
నేనే గిన్నెలు శుభ్రం చేస్తాను. మృష్టాన్నాన్ని వండి వేళకు భోజనం పెడతాను. నన్ను నేను అదుపులో ఉంచుకొని ధాన్యాన్ని దాచి ఉంచుతాను. ఇంటిని చక్కగా, శుభ్రంగా ఉంచుతాను. (26)
అతిరస్కృతసంభాషా దుఃస్త్రియో నానుసేవతీ ।
అనుకూలవతీ నిత్యం భవామ్యనలసా సదా ॥ 27
మాటలతో ఎవ్వరినీ తిరస్కరించను. చెడ్డఆడవాళ్ళతో స్నేహం చెయ్యను. ఎప్పుడూ అలసత్వం లేకుండా భర్తలకు అనుకూలంగా నడచుకొంటాను. (27)
అనర్మ చాపి హసితం ద్వారి స్థానమభీక్ష్ణశః ।
అవస్కరే చిరస్థానం నిష్కుటేషు చ వర్జయే ॥ 28
నిష్కల్మషంగా నవ్వుతాను. అదేపనిగా గుమ్మంలో నిలవను. మురికితావులలో కానీ, ఉద్యానవనాల్లో కానీ ఎక్కువసేపు ఉండను. (28)
(అంత్యాలాపమసంతోషం పరవ్యాపారసంకథామ్ ।)
అతిహాసాతిరోషౌ చ క్రోధస్థానం చ వర్జయే ।
నిరతాహం సదా సత్యే భర్తౄణాముపసేవనే ॥ 29
నీచులతో మాటాడను. అసంతుష్టికి అవకాశమివ్వను. ఇతరుల పనులను ప్రస్తావించను. మిక్కిలిగా నవ్వను. ఎక్కువగా కోపించను. కోపానికి అవకాశం కూడా ఇవ్వను. ఎప్పుడూ సత్యమే పలుకుతూ భర్తృసేవలోనే ఆసక్తితో ఉంటాను. (29)
సర్వథా భర్తృరహితం న మమేష్టం కథంచన ।
యదా ప్రవసతే భర్తా కుటుంబార్థేన కేనచిత్ ॥ 30
సుమనోవర్ణకాపేతా భవామి వ్రతచారిణీ ।
భర్తలేని చోటు నాకు ఏరీతిగాను నచ్చదు. కుటుంబం పనిమీద భర్త ఏ ఊరికైనా వెళితే పూవులను అలంకరించుకోవటం కూడా మాని వ్రతాలను ఆచరిస్తుంటాను. (30 1/2)
యచ్చ భర్తా న పిబతి యచ్చ భర్తా న సేవతే ॥ 31
యచ్చ నాశ్నాతి మే భర్తా సర్వం తద్ వర్జయామ్యహమ్ ।
భర్త తినని వాటిని, భర్త త్రాగని వాటిని, భర్త సేవించని వాటిని నేను కూడా విడిచిపెడతాను. (31 1/2)
యథోపదేశం నియతా వర్తమానా వరాంగనే ॥ 32
స్వలంకృతా సుప్రయతా భర్తుః ప్రియహితే రతా ।
యే చ ధర్మాః కుటుంబేషు శ్వశ్ర్వా మే కథితాః పురా ॥ 33
(అనుతిష్ఠామి తత్ సర్వం నిత్యకాలమతంద్రితా ।)
సుందరీ! శాస్త్రోపదేశాలననుసరించి నియమపూర్వకంగా జీవిస్తాను. చక్కగా అలంకరించుకొని ఏకాగ్రతతో భర్తకు నచ్చిన, హితకరమైన పనుల మీదే ఆసక్తి చూపుతాను. మా అత్త గతంలో నాకు చెప్పిన కుటుంబ ధర్మాలను అన్నింటినీ, ఎప్పుడూ ఏమరుపాటులేకుండా పాటిస్తాను. (32,33)
భిక్షా బలిశ్రాద్ధమితి స్థాలీపాకాశ్చ పర్వసు ।
మాన్యానాం మానసత్కారా యే చాన్యే విదితా మమ ॥ 34
తాన్ సర్వాననుఅవర్తేఽహం దివారాత్రమతంద్రితా ।
వినయాన్ నియమాంశ్చైవ సదా సర్వాత్మనా శ్రితా ॥ 35
నేను పగలూ, రేయీ కూడా అలసత్వం లేకుండా, భిక్షపెట్టటం, బలివైశ్వదేవం, శ్రాద్ధం, పర్వకాలాలఓ చేయదగిన స్థాలీపాకం, మాన్యులను సత్కరించటం మొదలయిన పనులనూ, వినయనియమాలను అన్నింటిని సప్రయత్నంగా ఎప్పుడూ పాటిస్తాను. (34,35)
మృదూన్ సతః సత్యశీలాన్ సత్యధర్మానుపాలినః ।
ఆశీవిషానివ క్రుద్ధాన్ పతీన్ పరిచరామ్యహమ్ ॥ 36
నాభర్తలు మృదుస్వభావులు, సజ్జనులు, సత్యశీలులు, సత్యధర్మపరిపాలకులు. అయినా కోపించిన పాములనుగానే వారిని భావించి భయభక్తులతో నేను సేవిస్తాను. (36)
పత్యాశ్రయో హి మే ధర్మః మతః స్త్రీణాం సనాతనః ।
స దేవః సా గతిర్నాన్యా తస్య కా విప్రియం చరేత్ ॥ 37
భర్త ఏలుబడిలో ఉండటమే స్త్రీలకు సనాతనధర్మమని నా అభిప్రాయం. భర్తయే దేవుడు. ఆయనయే గతి. అటువంటి భర్తకు ఇష్టం లేనట్లు ఏ స్త్రీ ప్రవర్తించగలదు? (37)
అహం పతీన్ నాతిశయే నాత్యశ్నే నాతిభూషయే ।
నాపి శ్వశ్రూం పరివదే సర్వదా పరియంత్రితా ॥ 38
నేను భర్తలను మించిపోను. వారికంటే ఎక్కువ తినను. ఎక్కువగా అలంకరించుకొనను. అత్తగారికి ఎదురు చెప్పను. ఎప్పుడూ నన్ను నేను అదుపులో ఉంచుకొంటాను. (38)
అవధానేన సుభగే నిత్యోత్థితతయైవ చ ।
భర్తారో వశగా మహ్యం గురుశుశ్రూషయైవ చ ॥ 39
సౌభాగ్యవతీ! నేను నిత్యమూ ఉదయమే లేచి వారి సేవకు సావధానంగా సన్నద్ధమవుతాను. గురుశుశ్రూష కారణంగానే భర్తలు నాకు అనుకూలురై ఉంటారు. (39)
నిత్యమార్యామహం కుంతీం వీరసూం సత్యవాదినీమ్ ।
స్వయం పరిచరామ్యేతాం పానాచ్ఛాదనభోజనైః ॥ 40
పూజనీయ, వీరమాత, సత్యవాదిని అయిన కుంతిని జలపానం, వస్త్రధారణం, భోజనం వంటి పనులలో నిత్యమూ నేనే పరిచర్యలతో అలరిస్తాను. (40)
నైతామతిశయే జాతు వస్త్రభూషణభోజనైః ।
నాపి పరివదే చాహం తాం పృథాం పృథివీసమామ్ ॥ 41
వస్త్ర భూషణ భోజన విషయంలో ఎప్పుడూ ఆమెను మించిపోను. ఆమె భూదేవి వంటిది. ఆ కుంతికి ఎప్పుడూ ఎదురాడను. (41)
అష్టావగ్రే బ్రాహ్మణానాం సహస్రాణి స్మ నిత్యదా ।
భుంజతే రుక్మపాత్రీషు యుధిష్ఠిరనివేశనే ॥ 42
ఇంతకుముందు యుధిష్ఠిరుని ప్రాసాదంలో ప్రతిరోజూ ఎనిమిదివేలమంది బ్రాహ్మణులు బంగారుపాత్రలలో భుజించేవారు. (42)
అష్టాశీతిసహస్రాణి స్నాతకా గృహమేధినః ।
త్రింశద్ధాసీక ఏకైకః యాన్ బిభర్తి యుధిష్ఠిరః ॥ 43
ఎనభై ఎనిమిది వేలమంది స్నాతక గృహస్థులు, వారిని సేవించటానికి ఒక్కొక్కరికి ముప్పైమంది దాసులు ఉండేవారు. వారినందరినీ యుధిష్ఠిరుడు భరించేవాడు. (43)
దశాన్యాని సహస్రాణి యేషామన్నం సుసంస్కృతమ్ ।
హ్రియతే రుక్మపాత్రీభిః యతీనామూర్ధ్వరేతసామ్ ॥ 44
మరొక పదివేలమంది ఊర్ధ్వరేతస్కు లయిన యతులు ఉండేవారు. వారికై చక్కగా వండిన అన్నాన్ని బంగారు పాత్రలతో కొనిపోయేవారు. (44)
తాన్ సర్వానగ్రహారేణ బ్రాహ్మణాన్ వేదవాదినః ।
యథార్హం పూజయామి స్మ పానాద్ఛాదనభోజనైః ॥ 45
వేదవాదులయిన ఆ బ్రాహ్మణుల కందరకూ వైశ్వదేవం ముగిసిన వెంటనే ముందుగా సమర్పించి పాన, అచ్ఛాదన, భోజనాలతో తగురీతిగా అర్చించేదాన్ని. (45)
శతం దాసీసహస్రాణి కౌంతేయస్య మహాత్మనః ।
కంబుకేయూరధారిణ్యః నిష్కకంఠ్యః స్వలంకృతాః ॥ 46
మహాత్ముడయిన యుధిష్ఠిరుని దగ్గర లక్షమంది దాసీజన ముండేవారు. వారంతా శంఖుమాలలు, అంగదాలు, కంఠాభరణాలు ధరించి చక్కగా అలంకరించుకొని ఉండేవారు. (46)
మహార్హమాల్యాభరణాః సువర్ణాశ్చందనోక్షితాః ।
మణీన్ హేమ చ బిభ్రత్యః నృత్యగీతవిశారదాః ॥ 47
నృత్యగీతవిశారదులయిన కళాకారులు మాలలు, ఆభరణాలు ధరించి, చందనజలంతో స్నానం చేసి, చందనాన్ని పూసికొని, మణులను, మణులను, సువర్ణాభరణాలను ధరించి అందంగా ఉండేవారు. (47)
తాసాం నామ చ రూపం చ భోజనాచ్ఛాదనాని చ ।
సర్వాసామేవ వేదాహం కర్మ చైవ కృతాకృతమ్ ॥ 48
వారిపేర్లు, రూపం నాకెరుకే. వారి భోజన వస్త్రాలను గమనించటం నా బాధ్యత. ఎవరెవరు ఏమేం చేశారో, చేయలేదో అంతా నాకు తెలిసేది. (48)
శతం దాసీసహస్రాణి కుంతీపుత్రస్య ధీమతః ।
పాత్రీహస్తా దివారాత్రమ్ అతిథీన్ భోజయంత్యుత ॥ 49
ధీమంతుడైన యుధిష్ఠిరుని దాసీజనం లక్షమంది దివారాత్రాలు పాత్రలను చేతబట్టి అతిథులకు భోజనాలు పెట్టేవారు. (49)
శతమశ్వసహస్రాణి దశనాగాయుతాని చ ।
యుధిష్ఠిరస్యామయాత్రమ్ ఇంద్రప్రస్థనివాసినః ॥ 50
ఏతదాసీత్ తదా రాజ్ఞః యన్మహీం పర్యపాలయత్ ।
యేషాం సంఖ్యావిధిం చైవ ప్రదిశామి శృణోమి చ ॥ 51
యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థంలో ఉండి భూమిని పరిపాలిస్తున్నప్పుడు ప్రయాణకాలంలో లక్షగుర్రాలు, లక్ష ఏనుగులు కూడా వెళ్తుండేవి.
నేను వాటిని గణిస్తూ, అవసరమయినవి అందిస్తూ వాటివిశేషాలు వింటుండేదాన్ని. (50,51)
అంతఃపురాణాం సర్వేషాం భృత్యానాం చైవ సర్వశః ।
ఆగోపాలావిపాలేభ్యః సర్వం వేద కృతాకృతమ్ ॥ 52
అంతఃపురంలోనూ, గోపాలకుల నుండి గొర్రెలకాపరుల వరకు భృత్యులందరి విషయంలోనూ ఏం జరిగిందో, ఏం జరగలేదో అంతా నాకు తెలిసేది. (52)
సర్వం రాజ్ఞః సముదయమ్ ఆయం చ వ్యయమేవ చ ।
ఏకాహం వేద్మి కల్యాణి పాండవానాం యశస్విని ॥ 53
యశస్విని! కళ్యాణి! యుధిష్ఠిరుడు, ఇతరపాండవుల ఆదాయవ్యయాలూ, శ్రేష్ఠధనం అంతా నేనొక్కదాన్నే తెలిసికొనేదాన్ని. (53)
మయి సర్వం సమాసజ్య కుటుంబం భరతర్షభాః ।
ఉపాసనరతాః సర్వే ఘటయంతి వరాననే ॥ 54
భరతశ్రేష్ఠులైన పాండవులు కుటుంబభారమంతా నామీద నిలిపి, ఉపాసనాసక్తులై తదనుగుణంగా ప్రవర్తించేవారు. (54)
తమహం భారమాసక్తమ్ అనాధృష్యం దురాత్మభిః ।
సుఖం సర్వం పరిత్యజ్య రాత్ర్యహాని ఘటామి వై ॥ 55
అందరూ సాధారణంగా మోయలేనంత భారం నామీద పడేది. అయితే నేను సుఖాన్ని వీడి, పగలనకా రాత్రనకా ఆ భారాన్ని మోసేదాన్ని. (55)
అధృష్యం వరుణస్యేవ నిధిపూర్ణమివోదధిమ్ ।
ఏకాహం వేద్మి కోశం వై పతీనాం ధర్మచారిణామ్ ॥ 56
ధర్మాచారులయిన నా భర్తల ఖజానా వరుణుని కోశాగారం వలె, పరిపూర్ణసాగరం వలె అక్షయమై ఉండేది. నాకు మాత్రమే దాని వివరాలు తెలిసిఉండేవి. (56)
అనిశాయాం నిశాయాం చ సహా యా క్షిత్పిపాసయోః ।
ఆరాధయంత్యాః కౌరవ్యాన్ తుల్యా రాత్రిరహశ్చ మే ॥ 57
నేను ఆకలిదప్పులను కూడా సహిస్తూ రాత్రి అయినా, పగలు అయినా పాండవులను ఆరాధించేదాన్ని. నాకు పగలయినా, రాత్రి అయినా ఒక్కటే. (57)
ప్రథమం ప్రతిబుధ్యామి చరమం సంవిశామి చ ।
నిత్యకాలమహం సత్యే ఏతత్ సంవననం మమ ॥ 58
సత్యభామా! అందరికన్న ముందు నిదురలేచేదాన్ని. అందరూ శయనించిన తరువాత నిద్రించేదాన్ని. నిత్యమూ ఇదే పరిస్థితి. ఈ పతిభక్తియే నా వశీకరణమంత్రం. (58)
ఏతజ్జానామ్యహం కర్తుం భర్తృసంవననం మహత్ ।
అసత్ స్త్రీణాం సమాచారం నాహం కుర్యాం న కామయే ॥ 59
భర్తలను వశం చేసికొనేందుకు గొప్పమంత్రం ఇదొక్కటే నాకు తెలుసు. చెడ్డ స్త్రీలు పాటించే పద్ధతులను నేను పాటించను. నాకిష్టం లేదు కూడా. (59)
వైశంపాయన ఉవాచ
తచ్ర్ఛుత్వా ధర్మసహితం వ్యాహృతం కృష్ణయా తదా ।
ఉవాచ సత్యా సత్కృత్య పాంచాలీం ధర్మచారిణీమ్ ॥ 60
అభిపన్నాస్మి పాంచాలి యాజ్ఞసేని క్షమస్వ మే ।
కామకారః సఖీనాం హి సోపహాసం ప్రభాషితమ్ ॥ 61
వైశంపాయనుడిలా అన్నాడు.
ధర్మసమ్మతమైన ఆ ద్రౌపది మాటను విని సత్యభామ ధర్మచారిణి అయిన ద్రౌపదిని సత్కరించి ఇలా అన్నది. పాంచాలి! నేను శరణుగోరుతున్నాను. యాజ్ఞసేని! నన్ను క్షమించు. నెచ్చెలుల మధ్య ఇటువంటి పరిహాసప్రసంగాలు మామూలే. (60,61)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీసత్యభామాసంవాదపర్వణి త్రయస్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 233 ॥
ఇది శ్రీమహాభారతమున ద్రౌపదీ సత్యభామాసంవాదపర్వమను ఉపపర్వమున ద్రౌపదీకర్తవ్యకథనమను రెండు వందల ముప్పది మూడవ అధ్యాయము. (233)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 62 శ్లోకాలు)