221. రెండువందల ఇరువది ఒకటవ అధ్యాయము
తపుడు - భానువుల సంతతి వర్ణనము.
మార్కండేయ ఉవాచ
గురుభిర్నియమైర్యుక్తః భరతో నామ పావకః ।
అగ్నిః పుష్టిమతిర్నామ తుష్టః పుష్టిం ప్రయచ్ఛతి ।
భరత్యేష ప్రజాః సర్వాః తతో భరత ఉచ్యతే ॥ 1
మార్కండేయుడు చెప్పాడు. ధర్మజా! వెనక చెప్పిన భరతుడు అనే అగ్ని (ఈయన శంయువు పౌత్రుడు, ఊర్జుని పుత్రుడు) చాలా గొప్ప నియమాలతో ఉంటాడు. సంతోషించిన ఆయన పుష్టిని కలిగిస్తాడు. కాబట్టి ఈయనకు పుష్టిమతి అని ఇంకొక పేరు ఉన్నది. సమస్త ప్రజలను భరిస్తాడు కాబట్టి ఆయనను భరతుడు అంటారు. (1)
అగ్నిర్యశ్చ శివో నామ శక్తిపూజాపరశ్చ సః ।
దుఃఖార్తానాం చ సర్వేషాం శివకృత్ సతతం శివః ॥ 2
శివుడనే పేరుతో ప్రసిద్ధుడైన అగ్ని శక్తిపూజాపరుడు. దుఃఖార్తులైన మానవులకు ఎల్లప్పుడు మేలు కలిగిస్తాడు. ఇందువల్ల ఈయనకున్న శివనామం సార్థకమవుతుంది. (2)
తపసస్తు ఫలం దృష్ట్వా సంప్రవృద్ధం తపో మహత్ ।
ఉద్ధర్తుకామో మతిమాన్ పుత్రో జజ్ఞే పురందరః ॥ 3
తపుని (పాంచజన్యుని) తపస్సు వలన కలిగిన ఫలితంగా ఐశ్వర్యం అధికం గావటం చూచి దాన్ని పొందాలని మేధావి అయిన ఇంద్రుడే పురందరుడు అనే పేరుతో ఆయన పుత్రుడై అవతరించాడు. (3)
ఊష్మా చైవోష్మణో జజ్ఞే సోఽగ్నిర్భుతస్య లక్ష్యతే ।
అగ్నిశ్చాపి మనుర్నామ ప్రాజాపత్యమకారయత్ ॥ 4
ఆ పాంచజన్యునికే ఊష్మా అనే పేరు గల అగ్ని కలిగాడు. ఆయన ప్రాణుల శరీరంలో వేడిగా వ్యక్తం అవుతుంటాడు. అలాగే తపునికి కలిగిన మనువు అనే అగ్నిస్వరూపుడైన పుత్రుడు ఊష్మాగ్నిని ప్రజాపతికి సంబంధించినదానినిగా చేశాడు. (4)
శంభుమగ్నిమథ ప్రాహుః బ్రాహ్మణా వేదపారగాః ।
ఆవసథ్యం ద్విజాః ప్రాహుః దీప్తమగ్నిం మహాప్రభమ్ ॥ 5
వేదం తెలిసిన విద్వాంసులు శంభువు అనే అగ్నినే మహాతేజస్సు కలవాడు జ్వలించు స్వభావము కలవాడు అయిన ఆవసధ్యాగ్నిగా చెపుతారు. (5)
ఊర్జస్కరాన్ హవ్యవాహాన్ సువర్ణసదృశప్రభాన్ ।
తతస్తపో హ్యజనయత్ పంచ యజ్ఞసుతానిహ ॥ 6
ఈ రీతిగా తపుడు యజ్ఞంలో ఆహుతులు తీసుకునే అయిదు అగ్నులను జనింపజేశాడు. అయిదూ బంగారు కాంతిగలవి. బలాన్ని, తేజస్సును కలిగించే అవి దేవతలకు హవిస్సును అందించేవి. (6)
ప్రశాంతేఽగ్నిర్మహాభాగ పరిశ్రాంతో గవాం పతిః ।
అసురాన్ జనయన్ ఘోరాన్ మర్త్యాంశ్చైవ పృథగ్విధాన్ ॥ 7
మహాభాగా! అస్తమించే సమయంలో శ్రమించటం వల్ల అలసిపోయిన సూర్యుడు అగ్నిలో ప్రవేశించటం వల్ల అగ్నిస్వరూపుడు అవుతాడు. ఆయన భయంకరమైన అసురులను, మరణస్వభావం గల మనుష్యులను ఉత్పన్నం చేస్తాడు. (వారు కూడా తపుని సంతతిలోని వారే అంటారు.) (7)
తపసశ్చ మనుం పుత్రం భానుం చాప్యంగిరాః సృజత్ ।
బృహద్భానుం తు తం ప్రాహుః బ్రాహ్మణా వేదపారగాః ॥ 8
మను (ప్రజాపతి) స్వరూపుడై తపునికి పుత్రుడైన భానువనే అగ్నికి అంగిరుడు (తన మహత్త్వాన్ని అర్పించి) నూతన జీవితాన్ని ఇస్తాడు. వేదపారంగతులైన విద్వాంసులైన బ్రాహ్మణులు భానువునే బృహద్భానుడు అంటారు. (8)
భానోర్భార్యా సుప్రజా తు బృహద్భాసా తు సూర్యజా ।
అసృజేతాం తు షట్ పుత్రాన్ శృణు తాసాం ప్రజావిధిమ్ ॥ 9
భానువుకు సుప్రజ, బృహద్భాస అనే ఇద్దరు భార్యలయినారు. వీరిలో బృహద్భాస అనే ఆమె సూర్యపుత్రిక. వీరు ఇద్దరు ఆరుగురు పుత్రులను కన్నారు. వీరికి కలిగిన సంతతిని వివరిస్తాను. విను. (9)
దుర్బలానాం తు భూతానామ్ అసూన్ యః సంప్రయచ్ఛతి ।
తమగ్నిం బలదం ప్రాహుః ప్రథమం భానుతః సుతమ్ ॥ 10
బలహీన ప్రాణులకు ప్రాణాన్ని, బలాన్ని ఇచ్చే అగ్నికి బలదుడు అని పేరు. ఈయన భానువుకు మొదటి కొడుకు. (10)
యః ప్రశాంతేషు భూతేషు మన్యుర్భవతి దారుణః ।
అగ్నిః స మన్యుమాన్నామ ద్వితీయో భానుతః సుతః ॥ 11
శాంతంగా ఉండే ప్రాణుల్లో భయంకరమైన కోపరూపంగా వ్యక్తమయ్యే మన్యుమంతుడు అనే అగ్ని భానువుకు రెండవపుత్రుడు. (11)
దర్శే చ పౌర్ణమాసే చ యస్యేహ హవిరుచ్యతే ।
విష్ణుర్నామేహ యోఽగ్నిస్తు ధృతిమాన్నామ సోఽంగిరాః ॥ 12
దర్శ పౌర్ణమాస యాగాలలో హవిస్సును సమర్పించే విధానం ఉంది. దానిలో వ్యక్తమయ్యే అగ్నిపేరు విష్ణువు. ఈయన అంగిరసుని గోత్రుడని చెపుతారు. ఆయన కున్న ఇంకొకపేరు ధృతిమంతుడు. ఈయన భానువుకు మూడవ కుమారుడు.
ఇంద్రేణ సహితం యస్య హవిరాగ్రయణం స్మృతమ్ ।
అగ్నిరాగ్రయణో నామ భానోరేవాన్వయస్తు సః ॥ 13
ఇంద్రునితో గూడ ఆగ్రయణ (కొత్తపంటతో తయారయ్యే హవిస్సుతో జరిగే యజ్ఞ) కర్మలో హవిస్సును సమర్పించే విధానం ఉంది. దాన్ని గ్రహించే అగ్ని ఆగ్రయణుడు అనే అగ్ని. ఈయన భానువుకు నాలుగవ పుత్రుడు. (13)
చాతుర్మాస్యేషు నిత్యానాం హవిషాం యోనిరగ్రహః ।
చతుర్భిః సహితః పుత్రైః భానోరేవాన్వయః స్తుభః ॥ 14
చాతుర్మాస్య యజ్ఞాలలో నిత్యంగా నిశ్చితమైన ఆగ్నేయం మొదలైన ఎనిమిది హవిస్సులకు ఉద్భవస్థాన నామం 'అగ్రహం'. (ఈయనే వైశ్వదేవపర్వంలో ప్రధానమైన విశ్వేదేవుడనే అగ్ని. భానువుకు ఐదవ పుత్రుడు) స్తుభుడు అనే అగ్ని భానువు ఆరవ పుత్రుడు. మొత్తం వీరు ఆరుగురూ భనుపుత్రులు. (14)
(బలదుడు, మన్యుమంతుడు, విష్ణువు అనే అగ్నులు భానువు భార్య సుప్రజకు కలిగారు. ఇలాగే ఆగ్రయణుడు, అగ్రహుడు, స్తుభుడు అనే ముగ్గురు బృహద్భాస సంతానం.)
నిశా త్వజనయత్ కన్యామ్ అగ్నీషోమావుభౌ తథా ।
మనోరేవాభవద్ భార్యా సుషువే పంచ పావకాన్ ॥ 15
మనువు (భానువు) మూడవ భార్యపేరు నిశ. ఆమె రోహిణి అనేకన్యను, ఇద్దరుపుత్రులను కన్నది. సోమాగ్నులు ఆ ఇద్దరుపుత్రులు. వీరినే కాక ఇంకా ఐదుగురు పుత్రులను - అగ్నిస్వరూపులను - కన్నది. (వైశ్వానరుడు, విశ్వపతి, సన్నిహితుడు, కపిలుడు, అగ్రణి అనేవి వారిపేర్లు) (15)
పూజ్యతే హవిషాగ్ర్యేణ చాతుర్మాస్యేషు పావకః ।
పర్జన్యసహితః శ్రీమాన్ అగ్నిర్వైశ్వానరస్తు సః ॥ 16
చాతుర్మాస్య యజ్ఞాలలో ప్రధానహవిస్సుతో పర్జన్యునితో కూడా పూజితుడయ్యే కాంతిమంతుడైన వైశ్వానరాగ్ని మనువు ప్రథమ పుత్రుడు. (16)
అస్య లోకస్య సర్వస్య యః ప్రభుః పరిపఠ్యతే ।
సోఽగ్నిర్విశ్వపతిర్నామ ద్వితీయో వై మనోః సుతః ॥ 17
తతః స్విష్టం భవేదాజ్యం స్విష్టకృత్ పరమస్తు సః ।
'సంపూర్ణమైన జగత్తుకు పతి' అని వేదాలు చెప్పిన విశ్వపతి అనే అగ్ని మనువు ద్వితీయ పుత్రుడు. ఆయన ప్రభావం వల్లనే ఆహుతులు దోషరహితాలౌతాయి. కాబట్టి ఆయయను పరమ స్విష్టకృత్తు (యాగాన్ని నిర్దోషం చేసేవాడు) అని పిలుస్తారు. (17)
కన్యా సా రోహిణీ నామ హిరణ్యకశిపోః సుతా ॥ 18
కర్మణాసౌ బభౌ భార్యా స వహ్నిః స ప్రజాపతిః ।
మనువు పుత్రికనుగూడ స్విష్టకృత్తు అని భావిస్తారు. ఆమె పేరు రోహిణి. ఆమె ఒకానొక పాపఫలితంగా హిరణ్యకశిపుని భార్య అయింది. నిజానికి రోహిణి అనుపేరుగల ఆ కన్యయే అగ్నిఅనియు, ప్రజాపతి అనియు చెప్పారు. (18 1/2)
ప్రాణానాశ్రిత్య యో దేహం ప్రవర్తయతి దేహినామ్ ।
తస్య సంనిహితో నామ శబ్దరూపస్య సాధనః ॥ 19
దేహధారుల ప్రాణాలను ఆశ్రయించి ఆ వ్యక్తి శరీరాన్ని ఒకపనిలో ప్రవర్తింపజేసే ఆయన పేరు సన్నిహితుడు. ఈయన మనువు మూడవపుత్రుడు. ఈయన శబ్ద రూపాన్ని గ్రహించటంలో సహాయపడతాడు. (19)
శుక్లకృష్ణగతిర్దేవో యో బిభర్తి హుతాశనమ్ ।
అకల్మషః కల్మషాణా కర్తా క్రోధాశ్రితస్తు సః ॥ 20
కపిలం పరమర్షిం చ యం ప్రాహుర్యతయః సదా 7.
అగ్నిః స కపిలో నామ సాంఖ్యయోగప్రవర్తకః ॥ 21
శుక్లగతికి, కృష్ణగతికి ఆధారమైనవాడు, ఎలాంటి మార్పులు లేనివాడు అయినా వికారస్వరూపమైన సృష్టికర్త, సాంఖ్యయోగప్రవర్తకుడై, క్రోధస్వరూపమయిన అగ్నికి ఆశ్రయమైన కపిలాగ్ని కపిలమహర్షి పేరుతో ఉన్నాడు. (ఈయన మనువుకు నాల్గవపుత్రుడు) (20,21)
అగ్రం యచ్ఛంతి భూతానాం యేన భూతాని నిత్యదా ।
కర్మస్విహ విచిత్రేషు సోఽగ్రణీర్వహ్నిరుచ్యతే ॥ 22
మనుష్యాది సమస్తప్రాణులు ఎల్లప్పుడు రకరకాలయిన యాగాలలో సమస్తభూతాలకు ఆహారంలో మొదటిభాగాన్ని అర్పించగా స్వీకరించే అగ్నిపేరు అగ్రణి. (ఈయన మనువుకు ఐదవకుమారుడు.) (22)
ఇమానన్యాన్ సమసృజత్ పావకాన్ ప్రథితాన్ భువి ।
అగ్నిహోత్రస్య దుష్ఠస్య ప్రాయశ్చిత్తార్థముల్బణాన్ ॥ 23
అగ్నికార్యంలో కలిగే దోషాలకు ప్రాయశ్చిత్తంగా లోకప్రసిద్ధమైన, కాంతిమంతాలయిన అగ్నులను మనువు సృష్టించాడు. ఇవి వెనుక చెప్పిన అగ్నులకంటే వేరు. (23)
సంస్పృశేయుర్యదాన్యోన్యం కథంచిద్ వాయునాగ్నయః ।
ఇష్టిరష్టాకపాలేన కార్యా వై శుచయేఽగ్నయే ॥ 24
ఏదైనా గాలి వీస్తే అగ్నులలో ఒకదానితో ఇంకొక దానికి స్పర్శ కలిగితే అష్టాకపాలాల (సంస్కారపూర్వకంగా చేసిన చిన్న కుండపెంకుల) పురోడాశంతో శుచి అనే అగ్నికి ఇష్టి (ఆహుతి) ఇవ్వాలి. (24)
దక్షిణాగ్నిర్యదా ద్వాభ్యాం సంసృజేత తదా కిల ।
ఇష్టిరష్టాకపాలేన కార్యా వై వీతయేఽగ్నయే ॥ 25
దక్షిణాగ్నికి, గార్హపత్యం, ఆహవనీయం అనే రెండు అగ్నులతో కలయిక జరిగితే ఎనిమిది కపాలాలలో సంస్కరింపబడిన పురోడాశం - చరువుతో వీతి అనే అగ్నికి ఆహుతి ఇవ్వాలి. (25)
యద్యగ్నయో హి స్పృశేయుః నివేశస్థా దవాగ్నినా ।
ఇష్టిరష్టాకపాలేన కార్యా తు శుచయేఽగ్నయే ॥ 26
ఇంటిలో ఉండే అగ్నులకు దావాగ్ని సంసర్గం కలిగితే ఎనిమిది చిన్న కుండపెంకులతో సంస్కృతమైన హవిస్సుతో శుచి అనే అగ్నికి ఆహుతులు ఇవ్వాలి. (26)
అగ్నిం రజస్వలా వై స్త్రీ సంస్పృశేదగ్నిహోత్రికమ్ ।
ఇష్టిరష్టాకపాలేన కార్యా వసుమతేఽగనయే ॥ 27
అగ్నిహోత్రసంబంధమైన అగ్నిని ముట్టైన స్త్రీ స్పృశిస్తే వసుమంతుడు అనే అగ్నికి ఎనిమిది చిన్న కుండపెంకులతో సంస్కరింపబడిన పురోడాశంతో ఆహుతులు ఇవ్వాలి. (27)
మృతః శ్రూయేత యో జీవః పరేయుః పశవో యదా ।
ఇష్టిరష్టాకపాలేన కార్యా సురభిమతేఽగ్నయే ॥ 28
ఒకప్రాణి మృత్యువును సూచించే విలాపాదులు వినపడినా, కుక్క మొదలైన జంతువులు అగ్నిని స్పృశించినా చిన్న మట్టిపిడతలలో సంస్కరించిన చరువుతో సురభిమంతుడు అనే అగ్ని ప్రసన్నం కావటానికి హోమం చేయాలి. (28)
ఆర్తో న జుహుయాదగ్నిం త్రిరాత్రం యస్తు బ్రాహ్మణః ।
ఇష్టిరష్టాకపాలేన కార్యా స్యాదుత్తరాగ్నయే ॥ 29
ఎవరైనా ఒక బ్రాహ్మణుడు అనారోగ్యంతో బాధపడుతూ మూడురాత్రుల వరకు అగ్నికార్యం చేయలేకపోతే ఎనిమిది కుండపెంకులతో సంస్కరింపబడిన పురోడాశంతో ఉత్తరుడు అనే అగ్నికి ఆహుతి ఇవ్వాలి. (29)
దర్శం చ పౌర్ణమాసం చ యస్య తిష్ఠేత్ ప్రతిష్ఠితమ్ ।
ఇష్టిరష్టాకపాలేన కార్యా పథికృతేఽగ్నయే ॥ 30
ప్రారంభించిన దర్శ, పౌర్ణమాస యజ్ఞాలు మధ్యలో ఆగిపోతే ఆ వ్యక్తి పథికృత్తు అనే అగ్నికి ఎనిమిది కపాలాలలో సంస్కృతమైన పురోడాశంతో హోమం చేయాలి. (30)
సూతికాగ్నిర్యదా చాగ్నిం సంస్పృశేదగ్నిహోత్రికమ్ ।
ఇష్టిరష్టాకపాలేన కార్యా చాగ్నిమతేఽగ్నయే ॥ 31
పురిటింటి అగ్ని, అగ్నిహోత్రాగ్నిని స్పృశిస్తే అష్టాకపాలంతో అగ్నిమంతుడు అనే అగ్నికి ఆహుతి ఇవ్వాలి. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఏకవింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 221 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున రెండువందల ఇరువది ఒకటవ అధ్యాయము. (221)