220. రెండు వందల ఇరువదవ అధ్యాయము
పాంచజన్యాగ్ని జననము - సంతతి.
మార్కండేయ ఉవాచ
కాశ్యపో హ్యథ వాసిష్ఠఆహ ప్రాణశ్చ ప్రాణపుత్రకః ।
అగ్నిరాంగిరసశ్చైవ చ్యవనస్త్రిషు వర్చకః ॥ 1
మార్కండేయుడన్నాడు - యుధిష్ఠిరా! కశ్యపుత్రుడు కాశ్యపుడు, వసిష్ఠపుత్రుడు వాసిష్ఠుడు, ప్రాణపుత్రుడు ప్రాణకుడు, అంగిరసుని పుత్రుడు చ్యవనుడు, త్రివర్చుడు అనే అయిదుగురు ఐదు అగ్నులు. (1)
అచరంత తపస్త్రీవ్రం పుత్రార్థే బహువార్షికమ్ ।
పుత్రం లభేమ ధర్మిష్ఠం యశసా బ్రహ్మణా సమమ్ ॥ 2
కీర్తిమంతులు, యశస్సులో బ్రహ్మతో సమానులు అయిన కొడుకులు కలుగవలెనని వారు చాలా సంవత్సరాలు తపస్సు చేశారు. (2)
మహావ్యాహృతిభిర్ధ్యాతః పంచభిస్తైస్తదా త్వథ ।
జజ్ఞే తేజో మహార్చిష్మాన్ పంచవర్ణః ప్రభావనః ॥ 3
ఆ ఐదుగురు మహావ్యాహృతులు అనే ఐదు మంత్రాలతో (భూః, భువః, స్వః, మహః, జనః అనే అయిదు మహావ్యాహృతులు) పరమాత్మను ధ్యానం చేశారు. అప్పుడు వారి ముందు ఐదు రంగులతో అలంకృతుడై, మహాతేజస్వి అయిన పురుషుడు జ్వాలలతో వెలిగిపోయే అగ్ని వలె ప్రకాశిస్తున్నాడు. ఆయన సమస్తలోకాలను సృష్టించటంలో సమర్థుడు. (3)
సమిద్ధోఽగ్నిః శిరస్తస్య బాహూ సూర్యనిభౌ తథా ।
త్వఙ్నేత్రే చ సువర్ణాభే కృష్ణే జంఘే చ భారత ॥ 4
ఆయన శిరస్సు ప్రజ్వలించే అగ్నిలాగా ఉన్నది. రెండు చేతులు సూర్యకాంతివలె ఉన్నవి. రెండు కన్నులు, చర్మమూ బంగారం వలె ప్రకాశిస్తున్నవి. పిక్కలు నల్లగా కన్పడుతున్నవి. (4)
పంచవర్ణః స తపసా కృతస్తైః పంచభిర్జనైః ।
పాంచజన్యః శ్రుతో దేవః పంచవంశకరస్తు సః ॥ 5
ఆ మునులు ఐదుగురు తమ తపఃప్రభావంతో అయిదురంగులు గల పురుషుని ఆవిర్భవింపజేశారు. కాబట్టి ఆయన పాంచజన్యుడు అయినాడు. అతడు ఈ ఐదుగురు మహర్షుల వంశానికి మూలం అయినాడు. (5)
దశవర్షసహస్రాణి తపస్తప్త్వా మహాతపాః ।
జనయత్ పావకం ఘోరం పితౄణాం స ప్రజాః సృజన్ ॥ 6
మహాతపస్వి, ప్రజాస్రష్ట అయిన ఆ పాంచజన్యుడు తన పితృవంశాన్ని వృద్ధిచేయటానికి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సుచేసి, దక్షిణాగ్నిని కలిగించాడు. (6)
బృహద్ రథంతరం మూర్ధ్నః వక్ర్తాద్ వా తరసాహరౌ ।
శివం నాభ్యాం బలాదింద్రం వాయ్వగ్నీ ప్రాణతోఽసృజత్ ॥ 7
బృహత్ అనే సామాన్ని శిరస్సునుంచి, రథంతరం అనే సామాన్ని ముఖం నుంచి వ్యక్తం చేశాడు. ఈ రెండూ వేగంగా ఆయువును హరిస్తాయి కాబట్టి వాటికి తరసాహరాలు అనిపేరు. తరువాత ఆయన నాభి నుంచి శివుని, బలం వల్ల ఇంద్రుని, ప్రాణం నుంచి వాయువును, అగ్నిని సృష్టించాడు. (7)
బాహుభ్యామనుదాత్తౌ చ విశ్వే భూతాని చైవ హ ।
ఏతాన్ సృష్ట్వా తతః పంచ పితౄణామసృజత్ సుతాన్ ॥ 8
భుజాల నుంచి ప్రాకృతం, వైకృతం అనే భేదమ్ గల రెండు అనుదాత్తాలను, మనస్సును, ఇంద్రియదేవతలను పంచమహాభూతాలను జన్మింపజేశాడు. ఈ సృష్టిని అంతా
చేసిన తరువాత ఆయన ఐదుగురు పితరుల కోసం ఐదుగురు పుత్రులను సృష్టించాడు. (8)
బృహద్రథస్య ప్రణిధిః కాశ్యపస్య మహత్తరః ।
భానురంగిరసో ధీరః పుత్రో వర్చస్య సౌభరః ॥ 9
వాసిష్ఠుడైన బృహద్రథుని అంశతో ప్రణిధిని, కాశ్యపుని అంశతో మహత్తరుని, అంగిరసుడైన చ్యవనుని అంశతో భానుని, వర్చుని అంశతో సౌభరుడు అనే పుత్రుని జనింపజేశాడు. (9)
ప్రాణస్య చానుదాత్తస్తు వ్యాఖ్యాతాః పంచవింశతిః ।
దేవాన్ యజ్ఞముషశ్చాన్యాన్ సృజన్ పంచదశోత్తరాన్ ॥ 10
సుభీమమతిభీమం చ భీమం భీమబలాబలమ్ ।
ఏతాన్ యజ్ఞముషః పంచ దేవానాం హ్యసృజత్ తపః ॥ 11
ప్రాణుని అంశతో అనుదాత్తుడు జనించాడు. ఇలాగా ఇరవై అయిదుగురు పుత్రులపేర్లను చెప్పారు. తరువాత తపస్సు అనే మరో పేరుగల పాంచజన్యుడు విఘ్నాలను కలిగించే పదిహేనుమంది ఉత్తరదేవులను సృష్టించాడు. సుభీముడు, అతిభీముడు, భీముడు, భీమబలుడు, అబలుడు అనే ఐదుగురు వినాయకులను ఆయన ఉత్పత్తిచేశాడు. వీరు దేవతల యజ్ఞాన్ని నాశనం చేసేవారు. (10,11)
సుమిత్రం మిత్రవంతం చ మిత్రజ్ఞం మిత్రవర్ధనమ్ ।
మిత్రధర్మాణమిత్యేతాన్ దేవానభ్యసృజత్ తపః ॥ 12
ఆ పాంచజన్యుడు సుమిత్రుడు, మిత్రవంతుడు, మిత్రజ్ఞుడు, మిత్రవర్ధనుడు, మిత్రధర్ముడు అనే వినాయకులను సృష్టించాడు. (12)
సురప్రవీరం వీరం చ సురేశం చ సువర్చసమ్ ।
సురాణామపి హంతారం పంచైతానసృజత్ తపః ॥ 13
తరువాత సురప్రవీరుడు, వీరుడు, సురేశుడు, సువర్చుడు, సురహంత అనే అయిదుగురిని పుట్టించాడు. (13)
త్రివిధం సంస్థితా హ్యేతే పంచ పంచ పృథక్ పృథక్ ।
ముష్ణంత్యత్ర స్థితా హ్యేతే స్వర్గతో యజ్ఞయాజినః ॥ 14
ఇలా ఈ పదిహేనుమంది వినాయకులు దేవతలతో సమానమైన ప్రభావం గలవారై విడివిడిగా ఐదుగురు ఐదుగురు వ్యక్తులను మూడు దళాలుగా విభజించారు. వీరు స్వర్గంలో ఉండి భూమి మీద యజ్ఞం చేసేవారి యజ్ఞసామగ్రిని అపహరిస్తారు. (14)
తేషామిష్టం హరంత్యేతే నిఘ్నంతి చ మహద్ధవిః ।
స్పర్ధయా హవ్యవాహానాం నిఘ్నంత్యేతే హరంతి చ ॥ 15
వీరు అగ్నికి ఇష్టమైన గొప్పహవిస్సును అపహరిస్తారు, పాడు చేస్తారు. అగ్నిగుణంతో స్పర్ధ ఉండటం వల్లనే వీరు హవిస్సును అపహరిస్తారు. (15)
బహిర్వేద్యాం తదాదానం కుశలైః సంప్రవర్తితమ్ ।
తదేతే నోపసర్పంతి యత్ర చాగ్నిః స్థితో భవేత్ ॥ 16
కాబట్టి యజ్ఞకర్మలో నిపుణులు యజ్ఞశాలకు బయట ఉండే వేదిక మీద ఈ వినాయకులకు ఇవ్వదగిన భాగాన్ని ఉంచాలి అనే నియమాన్ని ఏర్పరిచారు. అగ్నిస్థాపన అయిన ప్రదేశానికి ఆ విఘ్నకారులు రాలేరు. (16)
చితా గ్నేరుద్వహన్నాజ్యం పక్షాభ్యాం తాన్ ప్రబాధతే ।
మంత్రైః ప్రశమితా హ్యేతే నేష్టం ముష్ణంతి యజ్ఞియమ్ ॥ 17
యజ్ఞంలో హవిర్ధాన శకటములపై హవిస్సుల నుంచి అందులో మంత్రములతో ఈ రాక్షసులను శాంతింప జేసినందున ఆ హవిస్సులను అపహరింపలేదు. (17)
బృహదుక్థస్తపస్యైవ పుత్రో భూమిముపాశ్రితః ।
అగ్నిహోత్రే హుయమానే పృథివ్యాం సద్భిరిజ్యతే ॥ 18
బృహదుక్థుడనే అగ్ని భూమిపై ఉంటాడు. అగ్నిహోత్రము చేసేటప్పుడు ఈ అగ్నికి ఆహుతులు ఇస్తారు. (18)
రథంతరశ్చ తపసః పుత్రోఽగ్నిః పరిపఠ్యతే ।
మిత్రవిందాయ వై తస్య హవిరధ్వర్యవో విదుః ॥ 19
ముముదే పరమప్రీతః సహ పుత్రైర్మహాయశాః ॥ 20
తపస్సు పుత్రుడైన రథంతరుడనే అగ్నికి ఇచ్చే హవిస్సును మిత్రవిందుడు అనే దేవతభాగంగా యజుర్వేద విద్వాంసులు భావిస్తారు. మహాయశస్వి అయిన పాంచజన్యుడు తన ఈ పుత్రులు అందరితో కలిసి చాలా ప్రసన్నుడై ఆనందిస్తుంటాడు. (19,20)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసోపాఖ్యానే వింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 220 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున అంగిరసోపాఖ్యానమను రెండువందల ఇరువదవ అధ్యాయము. (220)