217. రెండు వందల పదునేడవ అధ్యాయము.

బృహస్పతి అగ్నికి పుత్రుడగుట-జననము.

వైశంపాయన ఉవాచ
శ్రుత్వేమాం ధర్మసంయుక్తాం ధర్మరాజః కథాం శుభామ్ ।
పునః పప్రచ్ఛ తమృషిం మార్కండేయమిదం తదా ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! ధర్మంతో గూడిన ఈ పవిత్రవృత్తాంతాన్ని విని, ధర్మరాజు మార్కండేయ మహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు. (1)
యుధిష్ఠిర ఉవాచ
కథమగ్నిర్వనం యాతః కథం చాప్యంగిరాః పురా ।
వష్టేఽగ్నౌ హవ్యమవహద్ అగ్నిర్భూత్వా మహాద్యుతిః ॥ 2
ధర్మరాజు అన్నాడు.
మహామునీ! పూర్వం అగ్నిదేవుడు ఎందుకని నీళ్ళల్లోకి వెళ్ళాడు? అగ్ని అదృశ్యం కాగా మహాతేజస్వి అంగిరసుడనే మహర్షి అగ్ని అయి దేవతలకు హవిస్సును ఎలా చేర్చాడు? (2)
అగ్నిర్యదా త్వేక ఏవ బహుత్వం చాస్య కర్మసు ।
దృశ్యతే భగవన్ సర్వమ్ ఏతదిచ్ఛామి వేదితుమ్ ॥ 3
అగ్నిదేవుడు ఒకడే కదా! విభిన్నమైన పనుల్లో ఆయన అనేకరూపాలుగా ఎందుకు కనిపిస్తాడు? ఇదమ్తా నేను తెలుసుకోవాలి అని కోరుతున్నాను. (3)
కుమారశ్చ యథోత్పన్నః యథా చాగ్నేః సుతోఽభవత్ ।
యథా రుద్రాశ్చ సంభూతః గంగాయాం కృత్తికాసు చ ॥ 4
కుమారస్వామి ఎలా జన్మించాడు? అగ్నిపుత్రుడు ఎలా అయినాడు? శివుని వలన గంగకు, కృత్తికలకు ఎలా జన్మించాడు? (4)
ఏతదిచ్ఛామ్యహం త్వత్తః శ్రోతుం భార్గవసత్తమ ।
కౌతూహలసమావిష్టః యాథాతథ్యం మహామునే ॥ 5
భృగువంశశ్రేష్ఠా! ఇదంతా ఉన్నది ఉన్నట్లు మీ వలన వినవలెనని కోరుతున్నాను. (5)
మార్కండేయ ఉవాచ
అత్రాప్యుదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్ ।
యథా క్రుద్ధో హుతవహః తపస్తప్తుం వనం గతః ॥ 6
మార్కండేయ మహర్షి అన్నాడు - ఈ విషయంలో తెలిసినవారు ఈ ప్రాచీనమైన ఇతిహాసాన్ని చెపుతున్నారు. కోపం వచ్చిన అగ్ని తపస్సు చేయటానికి జలప్రవేశం ఎందుకు చేశాడో అందులో ఉంది. (6)
యథా చ భగవానగ్నిః స్వయమేవాంగిరాఽభవత్ ।
సంతాపయంశ్చ ప్రభయా నాశయంస్తిమిరాణి చ ॥ 7
అలాగే అంగిరసుడనే ముని గొప్పకాంతితో లోకాన్ని తపింపజేస్తూ, చీకటిని నాశనం చేస్తూ స్వయంగానే ఎలా అగ్నిదేవుడయినాడో అందులో ఇలా ఉంది. (7)
పురాంగిరా మహాబాహో చచార తప ఉత్తమమ్ ।
ఆశ్రమస్థో మహాభాగో హవ్యవాహం విశేషయన్ ।
తథా స భూత్వా తు తదా జగత్ సర్వం వ్యకాశయత్ ॥ 8
పూర్వకాలంలో మహాత్ముడైన అంగిరసుడు ఆశ్రమంలో ఉండి, మహత్తరమైన తపస్సు చేసి అగ్నిదేవుని కూడా మించిపోయే కాంతితో ప్రకాశిస్తూ సమస్తజగత్తును వెలిగించాడు. (8)
తపశ్చరంస్తు హుతభుక్ సంతప్తస్తస్య తేజసా ।
భృశం గ్లానశ్చ తేజస్వీ న చ కించిత్ ప్రజజ్ఞివాన్ ॥ 9
ఆకాలంలో అగ్నిదేవుడు కూడా తపస్సు చేస్తూ స్వయంగా తేజోవంతుడయిన అంగిరసుని తేజస్సుతో సంతప్తుడై బాగా వాడిపోయాడు. దీనికి కారణం అగ్ని తెలుసుకోలేకపోయాడు. (9)
అథ సంచింతయామాస భగవాన్ హవ్యవాహనః ।
అన్యోఽగ్నిరిహ లోకానాం బ్రహ్మణా సంప్రకల్పితః ॥ 10
అగ్నిదేవుడు ఇలా చింతించాడు - లోకాలకోసం బ్రహ్మదేవుడు ఇంకో అగ్నిని ఇలా కల్పించాడా? (10)
అగ్నిత్వం విప్రణష్టం హి తప్యమానస్య మే తపః ।
కథమగ్నిః పునరహం భవేయమితి చింత్య సః ॥ 11
అపశ్యదగ్నివల్లోకాన్ తాపయంతం మహామునిమ్ ।
తపస్సు చేస్తున్న నాలో అగ్నిలక్షణం నశించింది. మళ్ళీ నేను అగ్నిని ఎలా కాగలను? అని ఆలోచిస్తూ ఆయన అగ్నివలె లోకాలను తపింపజేస్తున్న మహామునిని చూశాడు. (11 1/2)
సోపాసర్పచ్ఛనైర్భీతః తమువాచ తదాంగిరాః ॥ 12
శీఘ్రమేవ భవస్వాగ్నిః త్వం పునర్లోకభావనః ।
విజ్ఞాతశ్చాపి లోకేషు త్రిషు సంస్థానచారిషు ॥ 13
భయపడుతూ అగ్ని ఆ ముని వద్దకు వెళ్ళాడు. అంగిరసుడు ఆయనను చూచి ఇలా అన్నాడు - నీవు త్వరగా లోకాలను వృద్ధిచేసే పనికి పూనుకోవాలి. మూడు లోకాలలో, స్థావరజంగమప్రాణులలో బాగా ప్రసిద్ధుడవు. (12,13)
త్వమగ్నిః ప్రథమం సృష్టః బ్రహ్మణా తిమిరాపహః ।
స్వస్థానం ప్రతిపద్యస్వ శీఘ్రమేవ తమోనుద ॥ 14
బ్రహ్మదేవుడు నిన్ను చీకటిని పోగొట్టే అగ్నిగా మొదట సృష్టించాడు. అంధకారం తొలగించే దేవా! నీవు త్వరగా నీ స్థానాన్ని గ్రహించు. (14)
అగ్నిరువాచ
నష్టకీర్తిరహం లోకే భవాన్ జాతో హుతాశనః ।
భవంతమేవ జ్ఞాస్యంతి పావకం న తు మాం జనాః ॥ 15
అగ్ని ఇలా అన్నాడు - లోకంలో నాకీర్తి నశించింది. నీవు అగ్ని వయినావు. లోకం అంతా నిన్నే అగ్నిగా భావిస్తారు కాని నన్ను కాదు. (15)
నిక్షిపామ్యహమగ్నిత్వం త్వమగ్నిః ప్రథమో భవ ।
భవిష్యామి ద్వితీయోఽహం ప్రాజాపత్యక ఏవ చ ॥ 16
నేను నా అగ్నితత్త్వాన్ని నీలో ఉంచుతాను. నీవే మొదటి అగ్నివి కావలసినది. నేను ప్రాజాపత్యం అనే పేరుతో రెండో అగ్నిని అవుతాను. (16)
అంగిరా ఉవాచ
కురు పుణ్యం ప్రజాస్వర్గ్య భవాగ్ని స్తిమిరాపహః ।
మాం చ దేవ కురుష్వాగ్నే ప్రథమం పుత్రమంజసా ॥ 17
అంగిరసుడు అన్నాడు - అగ్నిదేవా! ప్రజలను స్వర్గానికి చేర్చే పుణ్యకార్యాన్ని (దేవతలకు హవిస్సును చేర్చే పుణ్యకార్యాన్ని) నిర్వహించవలసినది, నన్ను కూడా చీకటిని పోగొట్టే అగ్నిపదంలో స్థాపించి నీ మొదటి పుత్రునిగా చేసుకొనవలసింది. (17)
మార్కండేయ ఉవాచ
తచ్ఛ్రుత్వాంగిరసో వాక్యం జాతవేదాస్తథాకరోత్ ।
రాజన్ బృహస్పతిర్నామ తస్యాప్యంగిరసః సుతః ॥ 18
మార్కండేయుడు చెపుతున్నాడు - రాజా! అంగిరసుని మాటలు విన్న అగ్ని అలాగే చేశాడు. తరువాత అంగిరసునికి బృహస్పతి అనే పుత్రుడు కలిగాడు. (18)
జ్ఞాత్వా ప్రథమజం తం తు వహ్నేరాంగిరసం సుతమ్ ।
ఉపేత్య దేవాః పప్రచ్ఛుః కారణం తత్ర భారత ॥ 19
అంగిరసుడు అగ్నిదేవుని మొదటి పుత్రుడని తెలిసి దేవతలు వచ్చి దానికి కారణం ఏమిటి? అని అడిగారు. (19)
స తు పృష్టస్తదా దేవైః తతః కారణమబ్రవీత్ ।
ప్రత్యగృహ్ణంస్తు దేవాశ్చ తద్ వచోఽంగిరసస్తదా ॥ 20
దేవతలు అడిగినదానికి అంగిరసుడు కారణం చెప్పాడు. ఆయన సమాధానం దేవతలు నమ్మారు. (20)
తత్ర నానావిధానగ్నీన్ ప్రవక్ష్యామి మహాప్రభాన్ ।
కర్మభిర్బహుభిః ఖ్యాతాన్ నానార్థాన్ బ్రాహ్మణేష్విహా ॥ 21
ఇప్పుడు నేను బ్రాహ్మణగ్రంథాల్లోని విధివాక్యాల ద్వారా అనేక కర్మలద్వారా అనేక ప్రయోజనాల సిద్ధి కలిగించడంలో ప్రసిద్ధాలైన, మిక్కిలి కాంతిమంతమైన అగ్నులను వివరిస్తాను. (21)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసే సప్తదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 217 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున అంగిరసుని వృత్తాంతమను రెండువందల పదునేడవ అధ్యాయము. (217)