216. రెండువందల పదునారవ అధ్యాయము

కౌశికుని స్వగృహగమనము.

వ్యాధ ఉవాచ
ఏవం శప్తోఽహమృషిణా తదా ద్విజవరోత్తమ ।
అభిప్రసాదయమృషిం గిరా త్రాహీతి మాం తదా ॥ 1
అజానతా మయాకార్యమ్ ఇదమద్య కృతం మునే ।
క్షంతుమర్హసి తత్ సర్వం ప్రసీద భగవన్నితి ॥ 2
ధర్మవ్యాధుడు అన్నాడు.
విప్రోత్తమా! ఇలా ఋషి శాపం ఇస్తే నేను "మహాత్మా! నన్ను రక్షించు. తెలియక ఈ నాడు ఈ తగనిపని చేశాను. నా తప్పులన్నీ క్షమించు. నాపై దయ చూపు" అని ఆయనను ప్రసన్నుని చేసుకొన్నాను. (1,2)
ఋషిరువాచ
నాన్యథా భవితా శాపః ఏవమేతదసంశయమ్ ।
ఆనృశంస్యాత్ త్వహం కించిత్ కర్తానుగ్రహమద్య తే ॥ 3
ఋషి ఇలా అన్నాడు.
'ఈ శాపాన్ని తొలగించటం వీలుకాదు. నిస్సందేహంగా ఇది జరగవలసిందే. నేను సహజంగా క్రూరుడిని కాదు. కాబట్టి ఇవ్వేళ నీమీద అనుగ్రహం చూపిస్తున్నాను. (3)
శూద్రయోన్యాం వర్తమానః ధర్మజ్ఞో హి భవిష్యడి ।
మాతాపిత్రోశ్చ శుశ్రూషాం కరిష్యసి న సంశయః ॥ 4
శూద్రజాతిలో పుట్టినా నీకు ధర్మాలు అన్నీ తెలుస్తాయి. తల్లిదండ్రులను సేవిస్తావు. ఇందులో సందేహం లేదు. (4)
తయా శుశ్రూషయా సిద్దిని, మహత్త్వాన్ని పొందుతావు. పూర్వజన్మ విషయాలను మరచిపోవు. చివరకు స్వర్గానికి వెళ్తావు. (5)
శాపక్షయే తు నిర్వృత్తే భవితాసి పునర్ద్విజః ।
ఏవం శప్తః పురా తేన ఋషిణాస్మ్యుగ్రతేజసా ॥ 6
శాపఫలం పోయిన తరువాత బ్రాహ్మణుడివి అవుతావు.' అని తీవ్రతేజస్వి అయిన ఆ ఋషి పూర్వం శపించాడు. (6)
ప్రసాదశ్చ కృతస్తేన మమైవ ద్విపదాం వర ।
శరం చోద్ధృతవానస్మి తస్య వై ద్విజసత్తమ ॥ 7
ఆశ్రమం చ మయా నీతః న చ ప్రాణైర్వ్యయుజ్యత ।
కౌశికా! అలా ఆయన నన్ను అనుగ్రహించాడు. తరువాత ఆయన శరీరంలో నుంచి బాణాన్ని తీసి మెల్లగా ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాను. ఆయన ప్రాణాలు పోలేదు. (7 1/2)
ఏతత్ తే సర్వమాఖ్యాతం యథా మమ పురాభవత్ ॥ 8
అభితశ్చాపి గంతవ్యం మయా స్వర్గం ద్విజోత్తమ ॥ 9
బ్రాహ్మణశ్రేష్ఠా! పూర్వజన్మలో జరిగిన నా వృత్తాంతాన్ని నీకు అంతా చెప్పాను. ఈ జీవితం అంతం అయిన తరువాత నేను స్వర్గానికి వెళ్తాను. (8,9)
బ్రాహ్మణ ఉవాచ
ఏవమేతాని పురుషాః దుఃఖాని చ సుఖాని చ ।
ఆప్నువంతి మహాబుద్ధే నోత్కంఠాం కర్తుమర్హసి ॥ 10
బ్రాహ్మణుడు అన్నాడు - మహామతీ! మనుష్యులు ఈ విధంగా దుఃఖాలను, సుఖాలను పొందుతారు. కాబట్టి విచారపడకు. (10)
దుష్కరం హి కృతం కర్మ జానతా జాతిమాత్మనః ।
లోకవృత్తాంతతత్త్వజ్ఞ నిత్యం ధర్మపరాయణ ॥ 11
లోక వృత్తాంతం తెలిసిన నిత్య ధర్మపరాయణా! నీవు పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోటానికి కారణమైన
తల్లిదండ్రులసేవ ఇతరులకు దుష్కరం. అలాంటిది నీవు చేయగలిగావు. (11)
కర్మదోషశ్చ వై విద్వన్ ఆత్మజాతికృతేన తే ।
కంచిత్ కాలముష్యతాం వై తతోఽసి భవితా ద్విజః ॥ 12
మాంసం అమ్మటం అనే దోషం నీ పూర్వజన్మ కర్మఫలమేగాని ఈ జన్మలోది కాదు. కొంతకాలం ఈ శరీరంతోనే ఉంటే తరువాత జన్మలో బ్రాహ్మణుడవు అవుతావు. (12)
సాంప్రతం చ మతో మేఽసి బ్రాహ్మణో నాత్ర సంశయః ।
బ్రాహ్మణః పతనీయేషు వర్తమానో వికర్మసు ॥ 13
దాంభికో దుష్కృతః ప్రాయః శూద్రేణ సదృశో భవేత్ ।
అసలు నా అభిప్రాయంలో నీవు ఇప్పుడే బ్రాహ్మణుడివి అయినావు. ఇందులో సందేహం లేదు. బ్రాహ్మణుడయి కూడా పతితకర్మలు చేస్తుండే, డాంబికుడు, పాపకర్మలు చేస్తూ సామాన్యంగా శూద్రునితో సమానుడు అవుతాడు. (13 1/2)
యస్తు శూద్రో దమే సత్యే ధర్మే చ సతతోత్థితః ॥ 14
తం బ్రాహ్మణమహం మన్యే వృత్తేన హి భవేద్ ద్విజః ।
ఇందుకు భిన్నంగా జన్మతో శూద్రుడు అయికూడా, దమం, సత్యభాషణం కలిగి ధర్మాచరణంలో ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండేవానిని బ్రాహ్మణుడనే నేను భావిస్తాను. మానవుడు సదాచారంతోనే ద్విజుడు అవుతాడు. (14 1/2)
కర్మదోషేణ విషమాం గతిమాప్నోతి దారుణామ్ ॥ 15
క్షీణదోషమహం మన్యే చాభితస్త్వాం నరోత్తమ ।
మానవుడు కర్మదోషం వల్ల భయంకరమైన దుర్గతిని పొందుతాడు. మానవోత్తమా! ఇపుడు నీవు సంపూర్ణంగా కర్మదోషం నశించిన వాడవని అనుకొంటాను. (15 1/2)
కర్తుమర్హసి నోత్కంఠాం త్వద్విధా హ్యవిషాదినః ।
లోకవృత్తానువృత్తజ్ఞాః నిత్యం ధర్మపరాయణాః ॥ 16
కాబట్టి నీ స్థితికి చింతించకు. ఎల్లప్పుడు లోకప్రవర్తనను అనుసరించి ధర్మాచరణం చేసే నీవంటివారు ఎన్నడూ విషాదాన్ని పొందరు. (16)
వ్యాధ ఉవాచ
ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచ్ఛారీరమౌషధైః ।
ఏతద్ విజ్ఞానసామర్థ్యం న బాలైః సమతామియాత్ ॥ 17
అపుడు ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు - తత్త్వం తెలిసినవారు శరీరానికి కలిగే వ్యాధులను ఔషధాలతోను మనస్సుకు కలిగే కష్టాలను ప్రజ్ఞ చేతను తొలగిమ్చుకొంటారు.' ఇదే జ్ఞాన సామర్థ్యం. బుద్ధిమంతులు చిన్నపిల్లల వలె దుఃఖించరు. (17)
అనిష్టసంప్రయోగాచ్చ విప్రయోగాత్ ప్రియస్య చ ।
మనుష్యా మానసైర్దుఃఖైః యుజ్యంతే చాల్పబుద్ధయః ॥ 18
మందబుద్ధులైన మానవులు అవసరం లేని వాని ప్రాప్తి వలన, కావలసినవి దూరం కావటం వలన మానసిక దుఃఖాలను పొందుతారు. (18)
గుణైర్భూతాని యుజ్యంతే వియుజ్యంతే తథైవ చ ।
సర్వాణి నైతదేకస్య శోకస్థానం హి విద్యతే ॥ 19
త్రిగుణాలతో ఏర్పడిన విభిన్న వస్తువులతో ఒకమారు సంయోగాన్ని, ఇంకోమారు వియోగాన్ని సమస్తప్రాణులు పొందుతూ ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఏ ఒక్కటీ నిజానికి శోకకారణం కాదు. (19)
అనిష్టం చాన్వితం పశ్యన్ తథా క్షిప్రం విరజ్యతే ।
తతశ్చ ప్రతికుర్వంతి యది పశ్యంత్యుపక్రమాత్ ॥ 20
ఇష్టం కానిది సంభవిస్తే వ్యక్తి దాని నుండి త్వరగా విరక్తుడవుతాడు. అనిష్టం ఆరంభంలోనే గమనిస్తే దానికి ప్రతీకారం చేస్తాడు. (20)
శోచతే న భవేత్ కించిత్ కేవలం పరితప్యతే ।
పరిత్యజంతీ యే దుఃఖం సుఖం వాప్యుభయం నరాః ॥ 21
త ఏవ సుఖమేధంతే జ్ఞానతృప్తా మనీషిణః ।
అసంతోషపరా మూఢాః సంతోషం యాంతి పండితాః ॥ 22
బాధపడటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. సంతాపం మాత్రమే మిగులుతుంది. జ్ఞానతృప్తులైన విద్వాంసులు సుఖదుఃఖాలను రెండింటిని వదలి సంతోషంతో వృద్ధిని పొందుతారు. అజ్ఞానులు సంతోషదూరులు అవుతారు. జ్ఞానులు సంతోషం పొందుతారు. (21,22)
అసంతోషస్య నాస్త్వంతః తిష్టిస్తు పరమం సుఖమ్ ।
న శోచంతి గతాధ్వానః పశ్యంతః పరమాం గతిమ్ ॥ 23
అసంతృప్తికి అంతం ఉండదు. సంతృప్తి మహాసుఖమిస్తుంది. జ్ఞానమార్గాంతాన్ని పొంది పరమాత్మ సాక్షాత్కారం పొందినవారు ఏ విషయంలోనూ విచారపడరు. (23)
న విషాదే మనః కార్యం విషాదో విషముత్తమమ్ ।
మారయత్యకృతప్రజ్ఞం బాలం క్రుద్ధ ఇవోరగః ॥ 24
మనస్సును విషాదం వైపు పోనీయకూడదు. విషాదమే అన్నిటినీ మించిన విషం. అది కోపించిన సర్పం వలె వివేకరహితుని చంపేస్తుంది. (24)
యం విషాదోఽభిభవతి విక్రమే సముపస్థితే ।
తేజసా తస్య హీనస్య పురుషార్థో న విద్యతే ॥ 25
ఏ విషయంలోనైనా అడుగు ముందుకు వెయ్యాల్సి వచ్చినపుడు విషాదానికి లోబడరాదు - అలా లొంగిపోయిన తేజోహీనుడికి ఏ పురుషార్థమూ దక్కదు. (25)
అవశ్యం క్రియమాణస్య కర్మణో దృశ్యతే ఫలమ్ ।
న హి నిర్వేదమాగమ్య కించిత్ ప్రాప్నోతి శోభనమ్ ॥ 26
చేసే పనికి ఫలితం తప్పక గోచరిస్తుంది. కేవలం నిర్వేదం పొందితే కొంచెం శుభాన్ని కూడా పొందలేడు. (26)
అథాప్యుపాయం పశ్యేత దుఃఖస్య పరిమోక్షణే ।
అశోచన్నారభేతైవం ముక్తశ్చావ్యసనీ భవేత్ ॥ 27
అందుచేత దుఃఖాన్ని తొలగించుకొనటానికి ఉపాయం చూడాలి. శోకవిషాదాలు పొందకుండా పనికి ఉపక్రమించాలి. అలా ప్రయత్నపరుడయితే దుఃఖం నుండి విముక్తుడవుతాడు. (27)
భూతేష్వభావం సంచింత్య యే తు బుద్ధేః పరం గతాః ।
న శోచంతి కృతప్రజ్ఞాః పశ్యంతః పరమాం గతిమ్ ॥ 28
'ప్రపంచంలోని అన్ని పదార్థాలు అనిత్యాలు' అని భావించి బుద్ధిని దాటి పరబ్రహ్మను తెలుసుకున్న జ్ఞానులు అయిన మహాత్ములు పరమాత్మసాక్షాత్కారాన్ని పొందుతూ విచారపడరు. (28)
న శోచామి చ వై విద్వన్ కాలాకాంక్షీ స్థితో హ్యహమ్ ।
ఏతైర్నిదర్శనైర్ర్బహ్మన్ నావసీదామి సత్తమ ॥ 29
పండితోత్తమా! ఈ జీవితం యొక్క అంతం కోసం ఎదురుచూస్తున్నాను. కాబట్టి శోకించను. సజ్జనశ్రేష్ఠా! ద్విజా! పైన చెప్పిన వానిని మననం చేయటం చేత ఎప్పుడూ క్రుంగిపోను. దుఃఖం కాని, నిరుత్సాహం కాని పొందను. (29)
బ్రాహ్మణ ఉవాచ
కృతప్రజ్ఞోఽసి మేధావీ బుద్ధిర్హి విపులా తవ ।
నాహం భవంతం శోచామి జ్ఞానతృప్తోఽసి ధర్మవిత్ ॥ 30
బ్రాహ్మణుడు అన్నాడు - ధర్మవ్యాధా! నివు జ్ఞానివి, మేధావిని. నీబుద్ధి చాలా విశాలమైనది. ధర్మాలను చక్కగా తెలిసినవాడివి, జ్ఞానంతో తృప్తిని పొందావు. కాబట్టి నీ విషయంలో నేను విచారపడటం లేదు. (30)
ఆపృచ్ఛే త్వాం స్వస్తి తేఽస్తు ధర్మస్త్వాం పరిరక్షతు ।
అప్రమాదస్తు కర్తవ్యః ధర్మే ధర్మభృతాం వర ॥ 31
ఇంక నేను వెళ్ళివస్తాను. నీకు మేలు కలుగుగాక. ధర్మం నిన్ను రక్షించుగాక. ధర్మాత్ములలో శ్రేష్ఠుడా! ధర్మాచరణంలో ఎప్పుడూ పొరబాటు చేయకు. (31)
మార్కండేయ ఉవాచ
బాఢమిత్యేవ తం వ్యాధః కృతాంజలిరువాచ హ ।
ప్రదక్షిణమథో కృత్వా ప్రస్థితో ద్విజసత్తమః ॥ 32
మార్కండేయ మహర్షి ఇలా అన్నాడు - ధర్మవ్యాధుడు ఆయన మాటలు విని చేతులు జోడించి - దోసిలొగ్గి 'సరే' అన్నాడు. తరువాత బ్రాహ్మణశ్రేష్ఠుడైన కౌశికుడు ధర్మవ్యాధునికి ప్రదక్షిణం చేసి బయలుదేరాడు. (32)
వి॥సం॥ ఉపదేశించినవాడు గురువు అని తలచి ప్రదక్షినం చేశాడు. (నీల)
స తు గత్వా ద్విజః సర్వాం శుశ్రూషాం కృతవాంస్తదా ।
మాతాపితృభ్యాం వృద్ధాభ్యాం యథాన్యాయం సుశంసితః ॥ 33
కౌశికుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు యథావిధిగా అన్ని సేవలూ చేశాడు. వృద్ధులైన ఆ తల్లిదండ్రులు సంతోషంతో కుమారుని మెచ్చుకొన్నారు. (33)
ఏతత్ తే సర్వమాఖ్యాతం నిఖిలేన యుధిష్ఠిర ।
పృష్టవానసి యం తాత ధర్మం ధర్మభృతాం వర ॥ 34
ధర్మాత్ములలో శ్రేష్ఠుడా! యుధిష్ఠిరా! నీవు అడిగిన ధర్మప్రశ్నకు తగిన రీతిగా పూర్తిగా సమాధానం చెప్పాను. (34)
పతివ్రతాయా మాహాత్మ్యం బ్రాహ్మణస్య చ సత్తమ ।
మాతాపిత్రోశ్చ శుశ్రూషా ధర్మవ్యాధేన కీర్తితా ॥ 35
పతివ్రతా మాహాత్మ్యాన్ని, ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్పిన తల్లిదండ్రుల సేవ యొక్క గొప్పతనాన్ని వివరంగా చెప్పాను. (35)
యుధిష్ఠిర ఉవాచ
అత్యద్భుతమిదం బ్రహ్మన్ ధర్మాఖ్యానమనుత్తమమ్ ।
సర్వధర్మవిదాం శ్రేష్ఠ కథితం మునిసత్తమ ॥ 36
ధర్మరాజు అన్నాడు - మహాత్మా మీరు చాలా అద్భుతమైన ధర్మోపాఖ్యానాన్ని చెప్పారు. మీరు సర్వధర్మాలు తెలిసినవారిలో శ్రేష్ఠులు. (36)
సుఖశ్రవ్యతయా విద్వన్ ముహూర్త ఇవ మే గతః ।
న హి తృప్తోఽస్మి భగవన్ శృణ్వానో ధర్మముత్తమమ్ ॥ 37
ఈ వృత్తాంతం వినటానికి చాలా ఇంపుగా ఉండటం చేత చాలా సమయం కూడా ఒక్క క్షణం లాగా గడిచిపోయింది. మహాత్మా! ఉత్తమధర్మం ఎంతవిన్నా నాకు తృప్తి కలుగదు. (37)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణవ్యాధసంవాదే షోడశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 216 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణవ్యాధసంవాదమను రెండువందల పదునారవ అధ్యాయము. (216)