206. రెండువందల ఆరవ అధ్యాయము
కౌశిక పతివ్రతా సంభాషణము - బ్రాహ్మణ ధర్మ వర్ణనము.
మార్కండేయ ఉవాచ
కశ్చిద్ ద్విజాతిప్రవరః వేదాధ్యాయీ తపోధనః ।
తపస్వీ ధర్మశీలశ్చ కౌశికో నామ భారత ॥ 1
భరతవంశీయా! పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాధ్యయనసంపన్నుడు, తపోధనుడు, ముని, ధర్మశీలుడు. (1)
సాంగోపనిషదో వేదాన్ అధీతే ద్విజసత్తమః ।
స వృక్షమూలే కస్మింశ్చిద్ వేదానుచ్చారయన్ స్థితః ॥ 2
ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు ఆరు అంగాలు, ఉపనిషత్తులతో గూడిన వేదాలను అధ్యయనం చేసినవాడు. ఒకసారి ఆయన ఒక చెట్టు కింద కూర్చుని వేదపారాయణం చేస్తున్నాడు. (2)
ఉపరిష్టాచ్చ వృక్షస్య బలాకా సంన్యలీయత ।
తయా పురీషముత్సృష్టం బ్రాహ్మణస్య తదోపరి ॥ 3
ఆ సమయంలో ఆ చెట్టు మీద ఒక కొంగ కనపడకుండా ఉన్నది. అది ఆ బ్రాహ్మణునిమీద రెట్ట వేసింది. (3)
తామవేక్ష్య తతః క్రుద్ధః సమపధ్యాయత ద్విజః ।
భృశం క్రోధాభిభూతేన బలాకా సా నిరీక్షితా ॥ 4
అపధ్యాతా చ విప్రేణ న్యపతద్ ధరణీతలే ।
దాన్ని చూచి ఆ బ్రాహ్మణుడు కోపంతో మంచి చెడులు మరచాడు. తీవ్రకోపపరవశుడై ఆ కొంగను చూశాడు. ఆయన దానికి కీడు కలగాలని భావించటంతో అది నేల గూలింది. (4 1/2)
బలకాం పతితాం దృష్ట్వా గతసత్వామచేతనామ్ ॥ 5
కారుణ్యాదభిసంతప్తః పర్యశోచత తాం ద్విజః ।
అకార్యం కృతవానస్మి రోషరాగబలాత్కృతః ॥ 6
చైతన్యహీనమై, ప్రాణరహితమై పడిన దాన్ని చూసి ఆయన దయార్ర్దహృదయుడై తాను చేసిన చెడ్డపనికి పశ్చాత్తాపం చెందాడు. 'కోపానికి లొంగిపోయి చాలా అనుచితమైనపని చేశాను.' అని బాధపడ్డాడు. (5,6)
మార్కండేయ ఉవాచ
ఇత్యుక్త్వా బహుశో విద్వాన్ గ్రామం భైక్ష్యాయ సంశ్రితః ।
గ్రామే శుచీని ప్రచరన్ కులాని భరతర్షభ ॥ 7
ప్రవిష్టస్తత్ కులం యత్ర పూర్వం చరితవాంస్తు సః ।
దేహీతి యాచమానోఽసౌ తిష్ఠేత్యుక్తః స్త్రియా తతః ॥ 8
మార్కండేయుడు అంటున్నాడు - భరతశ్రేష్ఠా! విద్వాంసుడైన ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చాలాసార్లు చింతించాడు. గ్రామంలో భిక్షాటనానికి బయలుదేరాడు. పవిత్రులు, ఉత్తమ వంశీయులైన వారి ఇండ్లలో భిక్షను అడుగుతూ అంతకుముందు గూడా తాను వెళ్ళివచ్చే ఒక ఇంటికి వెళ్ళి 'భిక్షాందేహి' అన్నాడు. ఆ ఇల్లాలు 'ఇదిగో వస్తున్నా ఉండు' అన్నది. (7,8)
శౌచం తు యావత్ కురుతే భాజనస్య కుటుంబినీ ।
ఏతస్మిన్నంతరే రాజన్ క్షుధాసంపీడితో భృశమ్ ॥ 9
భర్తా ప్రవిష్టః సహసా తస్యా భరతసత్తమ ।
రాజా! ఆమె ఆ ఇంటి యజమానురాలు. అప్పుడు పాత్ర తోముతున్నది. అంతలో ఆమె భర్త త్వరగా ఇంట్లోకి వచ్చాడు. ఆయన బాగా ఆకలిగొని ఉన్నాడు. (9 1/2)
సా తు దృష్ట్వా పతిం సాధ్వీ బ్రాహ్మణం వ్యవహాయ తమ్ ॥ 10
పాద్యమాచమనీయం వై దదౌ భర్తుస్తథాఽఽసనమ్ ।
ప్రహ్వా పర్యచరచ్చాపి భర్తారమసితేక్షణా ॥ 11
నల్లకలువల వంటి కన్నులు గల ఆ పతివ్రత బ్రాహ్మణుని విషయం వదలి, అత్యంతవినయంతో భర్తకు కాళ్ళు కడిగింది. ముఖం చేతులు కడిగించింది. కూర్చుండటానికి ఆసనం చూపింది. (10,11)
ఆహారేణాథ భక్ష్యైశ్చ భోజ్యైః సుమధురైస్తథా ।
ఉచ్ఛిష్టం భావితా భర్తుః భుంక్తే నిత్యం యుధిష్ఠిర ॥ 12
తరువాత మంచి రుచిగల భక్ష్యభోజ్యపదార్థాలను వడ్డించింది. యుధిష్ఠిరా! ప్రతిరోజూ ఆ పతివ్రత భర్త తినగా మిగిలిన వాటిని పవిత్రభావంతో భుజిస్తూ ఉంటుంది. (12)
దైవతం చ పతిం మేనే భర్తుశ్చిత్తానుసారిణీ ।
కర్మణా మనసా వాచా నాన్యచిత్తాభ్యగాత్ పతిమ్ ॥ 13
ఆమె భర్తను దైవంగా భావించి, ఆయన ఇష్టానుసారం నడుచుకొంటుంది. పరపురుషుని ఎప్పుడూ మనస్సులోనైనా తలచేది కాదు. మనస్సుతోగాని, పనులతోగాని, మాటలతో గాని ఆయనను వ్యతిరేకించేది కాదు. (13)
తం సర్వభావోపగతా పతిశుశ్రూషణే రతా ।
సాధ్వాచారా శుచిర్దక్షా కుటుంబస్య హితైషిణీ ॥ 14
అనన్యభావంతో భర్తకు సేవ చేయటంలో ఆసక్తి కలిగి ఉండేది. మంచి ఆచారవ్యవహారాలు గలది. పవిత్రురాలు, సమర్థురాలు. తమ కుటుంబం మేలు కోరుతూ ఉండేది. (14)
భర్తుశ్చాపి హితం యత్ తత్ సతతం సానువర్తతే ।
దేవతాతిథిభృత్యానాం శ్వశ్రూశ్వశురయోస్తథా ॥ 15
శుశ్రూషణపరా నిత్యం సతతం సంయతేంద్రియా ।
ఆమె భర్తకు మేలు చేసే పనులనే ఆచరిస్తుండేది. దేవపూజలు, అతిథిసత్కారాలు, సేవకుల బాగోగులు చక్కగా నిర్వర్తించేది. అత్తమామలసేవలో మునిగి ఉండేది. మనస్సును, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనేది. (15 1/2)
సా బ్రాహ్మణం తదా దృష్ట్వా సంస్థితం భైక్ష్యకాంక్షిణమ్ ।
కుర్వతీ పతిశుశ్రూషాం సస్మారాథ శుభేక్షణా ॥ 16
భర్తసేవ చేస్తున్న పవిత్రదృష్టి గల ఆ పతివ్రతకు భిక్షకోసం ఎదురు చూస్తూ ఉన్న బ్రాహ్మణుడు గుర్తువచ్చాడు. (16)
వ్రీడితా సాభవత్ సాధ్వీ తదా భరతసత్తమ ।
భిక్షా మాదాయ విప్రాయ నిర్జగామ యశస్వినీ ॥ 17
భరతవంశశ్రేష్ఠా! యశస్విని అయిన ఆ పతివ్రత తనపొరపాటు గుర్తువచ్చి సిగ్గుపడి బ్రాహ్మణుని కోసం భిక్ష తీసుకొని బయటికి వచ్చింది. (17)
బ్రాహ్మణ ఉవాచ
కిమిదం భవతి త్వం మాం తిష్ఠేత్యుక్త్వా వరాంగనే ।
ఉపరోధం కృతవతీ న విసర్జితవత్యసి ॥ 18
ఆమెను చూసి బ్రాహ్మణుడు అన్నాడు. వనితామణీ! ఇది ఏమి పని? ఇంత ఆలస్యం ఉంటే నన్ను "ఉండు" అని ఎందుకు చెప్పావు? వెంటనే ఎందుకు పొమ్మనలేదు? (18)
మార్కండేయ ఉవాచ
బ్రాహ్మణం క్రోధసంతప్తం జ్వలంతమివ తేజసా ।
దృష్ట్వా సాధ్వీ మనుష్యేంద్ర సాంత్వపూర్వం వచోఽబ్రవీత్ ॥ 19
మార్కండేయుడు అన్నాడు - మానవేంద్రా! కోపంతో బాగా తపించిపోతూ, తేజస్సుతో వెలుగుతున్న ఆ బ్రాహ్మణుని చూచి పతివ్రత శాంతంగా నచ్చచెబుతూ ఇలా అన్నది. (19)
స్త్రీ ఉవాచ
క్షంతుమర్హసి మే విద్వన్ భర్తా మే దైవతం మహత్ ।
స చాపి క్షుధితః శ్రాంతః ప్రాప్తః శుశ్రూషితో మయా ॥ 20
స్త్రీ ఇలా అన్నది - విద్వాంసుడా! నా తప్పు క్షమించు. నాకు భర్తే దైవం. ఆయన ఆకలితో అలిసిపోయి ఇంటికి వచ్చాడు. నేను ఇప్పటిదాకా ఆయనసేవలో ఉన్నాను. (20)
బ్రాహ్మణ ఉవాచ
బ్రాహ్మణా న గరీయాంసః గరీయాంస్తే పతిః కృతః ।
గృహస్థధర్మే వర్తంతీ బ్రాహ్మణానవమన్యసే ॥ 21
అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు - ఏమిటీ! బ్రాహ్మణులు గొప్పవారు కాదా? నీవు భర్తనే గొప్పవానినిగా చేస్తున్నావా? గృహస్థ ధర్మలో ఉండి కూడా నీవు బ్రాహ్మణులను అవమానిస్తున్నావా? (21)
ఇంద్రోఽప్యేషాం ప్రణమతే కిం పునర్మానవో భువి ।
అవలిప్తే న జానీషే వృద్ధానాం న శ్రుతం త్వయా ॥ 22
బ్రాహ్మణా హ్యగ్నిసదృశాః దహేయుః పృథువీమపి ।
స్వర్గాధిపతి ఇంద్రుడు కూడా ఈ బ్రాహ్మణుల ఎదుట తలవంచుతాడు. అలాంటిది భూమి మీద ఉండే మానవుల విషయం వేరే చెప్పాలా? అహంకారిణీ! ఇంతమాత్రం నీకు తెలియదా? బ్రాహ్మణుల గొప్పతనాన్ని గురించి పెద్దల వలన వినలేదా? అగ్నివలె తేజోవంతులయిన బ్రాహ్మణులు భూమండలాన్నయినా భస్మం చేయగలరు. (22 1/2)
స్త్రీ ఉవాచ
నాహం బలాకా విప్రర్షే త్యజ క్రోధం తపోధన ॥ 23
అనయా క్రుద్ధయా దృష్ట్యా క్రుద్ధః కిం మాం కరిష్యసి ।
నావజానామ్యహం విప్రాన్ దేవైస్తుల్యాన్ మనస్వినః ॥ 24
స్త్రీ ఇలా అన్నది - తపోధనా! బ్రహ్మర్షీ! కోపించకండి. మీ కోపదృష్టికి మాడిపోవటానికి నేనేమీ కొంగను కాను. దృఢ చిత్తులు, దైవ సమానులూ అయిన బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించను. (23,24)
అపరాధమిమం విప్ర క్షంతుమర్హసి మేఽనఘ ।
జానామి తేజో విప్రాణాం మహాభాగ్యం చ ధీమతామ్ ॥ 25
పవిత్ర బ్రాహ్మణోత్తమా! నా తప్పును మన్నించండి. మేధావులైన బ్రాహ్మణుల తేజస్సును, గొప్పతనాన్ని ఎరుగుదును. (25)
అపేయః సాగరః క్రోధాత్ కృతో హి లవణోదకః ।
తథైవ దీప్తతపసాం మునీనాం భావితాత్మనామ్ ॥ 26
యేషాం క్రోధాగ్నిరద్యాపి దండకే నోపశామ్యతి ।
ఒక మహర్షి కోపంతో సముద్రజలాన్ని ఉప్పు నీటితో త్రాగటానికి వీలులేని దాన్ని చేశాడు. అలాగే తపస్సుచేత ప్రజ్వలిస్తూ పరమపవిత్రమైన అంతఃకరణం గల మునుల కోపాగ్ని ఇప్పటికీ దండకారణ్యంలో ఆరిపోకుండా మండుతూనే ఉన్నది. (26 1/2)
బ్రాహ్మణానాం పరిభవాద్ వాతాపిః సుదురాత్మవాన్ ॥ 27
అగస్త్యమృషిమాసాద్య జీర్ణః క్రూరో మహాసురః ।
బ్రాహ్మణులను అవమానించటం వలననే మహాదుర్మార్గుడు, క్రూరుడు, అయిన వాతాపి అనే రాక్షసుడు అగస్త్యమహర్షి కుక్షిలో జీర్ణమయ్యాడు. (27 1/2)
బహుప్రభావాః శ్రూయంతే బ్రాహ్మణానాం మహాత్మనామ్ ॥ 28
క్రోధః సువిపులో బ్రహ్మన్ ప్రసాదశ్చ మహాత్మనామ్ ।
అస్మింస్త్వతిక్రమే బ్రహ్మన్ క్షంతుమర్హసి మేఽనఘ ॥ 29
బ్రాహ్మణా! మహాత్ములైన బ్రాహ్మణుల ప్రభావాన్ని తెలియజేసే అనేకవృత్తాంతాలను వింటున్నాం. ఆ మహానుభావుల కోపమూ, అనుగ్రహమూ అధికమైనవే సుమా, పాపరహితా! నేను చేసిన తప్పును క్షమించు. (28,29)
పతిశుశ్రూషయా ధర్మః యః స యే రోచతే ద్విజ ।
దైవతేష్వసి సర్వేషు భర్తా మే దైవతం పరమ్ ॥ 30
ద్విజవరా! నాకు పతిసేవ చేత లభించే ధర్మమే చాలా ఇష్టమైనది, దేవతలందరికంటే పతియే నాకు పరదేవత. (30)
అవిశేషేణ తస్యాహం కుర్యాం ధర్మం ద్విజోత్తమ ।
శుశ్రూషాయాః ఫలం పశ్య పత్యుర్ర్బాహ్మణ యాదృశమ్ ॥ 31
బ్రాహ్మణోత్తమా! నేను అతిసాధారణంగానే పతి సేవారూపమయిన ధర్మాన్ని నిర్వసిస్తున్నాను. ఈ భర్తృసేవ వలన ఎలాంటి ఫలం కలుగుతుందో చూడు. (31)
బలాకా హి త్వయా దగ్ధా రోషాత్ తద్ విదితం మయా ।
క్రోధః శత్రుః శరీరస్థః మనుష్యాణాం ద్విజోత్తమ ॥ 32
నీవు కోపంతో కొంగను మాడ్చివేసిన విషయం నాకు తెలిసింది గదా! బ్రాహ్మణశ్రేష్ఠా! మానవులకు శరీరంలో ఉండే శత్రువు క్రోధం. (32)
యః క్రోధమోహౌ త్యజతి తం దేవా బ్రాహ్మణం విదుః ।
యో వదేదిహ సత్యాని గురుం సంతోషయేత చ ॥ 33
హింసితశ్చ న హింసేత తం దేవా బ్రాహ్మణం విదుః ।
కోపాన్ని, మోహాన్ని వదిలిపెట్టగలవాడిని దేవతలు బ్రాహ్మణుడని భావిస్తారు. ఈ లోకంలో నిజం చెప్పేవాడిని, గురువును సంతోషపెట్టేవాడిని, ఇతరులు తనను హింసించినా వారిని మళ్ళీ తాను హింసించకుండా ఉండేవాడిని దేవతలు బ్రాహ్మణుడని భావిస్తారు. (33 1/2)
జితేంద్రియో ధర్మపరః స్వాధ్యాయనిరతః శుచిః ॥ 34
కామక్రోధౌ వశౌ యస్య తం దేవా బ్రాహ్మణం విదుః ।
ఇంద్రియాలను జయించినవాడు, ధర్మపరాయణుడు, వేదాధ్యయన తత్పరుడు, పవిత్రుడు, కామక్రోధాలను వశం చేసుకొన్నవాడు బ్రాహ్మణుడని దేవతలు తలుస్తారు. (34 1/2)
యస్య దాత్మనమో లోకః ధర్మజ్ఞస్య మనస్వినః ॥ 35
సర్వధర్మేషు చ రతః తం దేవా బ్రాహ్మనం విదుః ।
ధర్మాన్ని తెలిసినవాడు, అభిమానవంతుడు, సమస్త జగత్తును ఆత్మసమానంగా దూసేవాడు, అన్ని ధర్మాలయందు సమానమైన ఆసక్తిగలవాడు బ్రాహ్మణుడని దేవతలు భావిస్తారు. (35 1/2)
యోఽధ్యానయేదధీయూత యజేద్ వా యాజయీత వా ॥ 36
దద్యాద్ వాపి యథాశక్తి తం దేవా బ్రాహ్మణం విదుః ।
(వేదాన్ని) అభ్యసించేవాడు, చదివించేవాడు, యజ్ఞాన్ని చేసేవాడు, చేయించేవాడు, శక్తికొలది దనం చేసేవాడు బ్రాహ్మణుడని దేవతలు తలుస్తారు. (36 1/2)
బ్రహ్మచారీ పదాన్యో యోఽధీయీత ద్విజపుంగవః ॥ 37
స్వాధ్యాయవానమత్తో వై తం దేవా బ్రాహ్మణం విదుః ।
బ్రహ్మచర్యాన్ని అనుసరించేవాడు, ఉదారుడు (దాత), వేదాన్ని చదివించేవాడు, ఎల్లప్పుడు సావధానుడై స్వాధ్యాయంలో మగ్నచిత్తుడు బ్రాహ్మణుడని దేవతలు అనుకొంటారు. (37 1/2)
యద్ బ్రాహ్మణానాం కుశలం తదేషాం పరికీర్తయేత్ ॥ 38
సత్యం తథా వ్యాహరతాం నానృతే రమతే మనః ।
బ్రాహ్మణుల సద్గుణాలను మాత్రమే ఇతరుల దగ్గర వివరించి చెప్పాలి. ఎప్పుడూ సత్యం పలికే వారి మనసు అబద్ధాలు చెప్పటంలో ఆసక్తం కాదు. (38 1/2)
ధర్మం తు బ్రాహ్మణస్యాహుః స్వాధ్యాయం దమమార్జవమ్ ॥ 39
ఇంద్రియాణాం నిగ్రహం చ శాశ్వతం ద్విజసత్తమ ।
ద్విజోత్తమా! స్వాధ్యాయం, మనోనిగ్రహం, ఋజుప్రవర్తనం, ఇంద్రియనిగ్రహం బ్రాహ్మణునికి సనాతనధర్మమని చెప్పారు. (39 1/2)
సత్యార్జవే ధర్మమాహుః పరం ధర్మవిదో జనాః ।
దుర్ జ్ఞేయః శాశ్వతో ధర్మః స చ సత్యే ప్రతిష్ఠితః ।
శ్రుతిప్రమాణో ధర్మః స్యాద్ ఇతి వృద్ధానుశాసనమ్ ॥ 41
ధర్మం తెలిసినవారు సత్యమూ, ఋజుస్వభావమూ సర్వోత్తమధర్మాలు అని చెపుతారు. సనాతన ధర్మస్వరూపం తెలుసుకోవటం చాలాకష్టం. కాని అది సత్యమందు ప్రతిష్ఠితమై ఉన్నది. వేదం ప్రమాణంగా ఉన్నదే ధర్మం అని పెద్దల ఉపదేశం. (40,41)
అయంతు పరమో ధర్మోయద్యోగేనాత్మదర్మనమ్ ॥ (నీల)
బహుధా దృశ్యతే ధర్మః సూక్ష్మ ఏవ ద్విజోత్తమ ।
భవానపి చ ధర్మజ్ఞః స్వాధ్యాయనిరతః శుచిః ॥ 42
విప్రోత్తమా! అనేకరీతులుగా ఉండే ధర్మస్వరూపం చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది. నీవూ ధర్మం బాగా తెలిసిన వాడివి. వేదాధ్యయనతత్పరుడవు, పవిత్రుడవు. (42)
న తు తత్త్వేన భగవన్ ధర్మం వేత్సీతి మే మతిః ।
యది విప్ర న జానీషే ధర్మం పరమకం ద్విజ ॥ 43
ధర్మవ్యాధం తతః పృచ్ఛ గత్వా తు మిథిలాం పురీమ్ ।
మహాత్మా! నీకు యతార్థజ్ఞానం లేదని నేను అనుకొంటాను. నీకు పరమధర్మజ్ఞానం తెలియకపోతే మిథిలాపురంలో ఉండే ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళి అడుగు. (43 1/2)
మాతాపితృభ్యాం శుశ్రూషః సత్యవాదీ జితేంద్రియః ॥ 44
మిథిలాయాం వసేద్ వ్యాధః స తే ధర్మాన్ ప్రవక్ష్యతి ।
తత్ర గచ్ఛస్వ భద్రం తే యథాకామం ద్విజోత్తమ ॥ 45
మిథిలలో ఒక వ్యాధుడు ఉన్నాడు. అతడు తల్లిదండ్రులకు సేవకుడు. నిజం చెపుతాడు. ఇంద్రియాలను జయించినవాడు. అతడు నీకు ధర్మాన్ని ఉపదేశిస్తాడు. బ్రాహ్మణోత్తమా! నీ ఇష్టానుసారం అక్కడికి వెళ్ళు. నీకు మేలు కలుగుగాక. (44,45)
అత్యుక్తమపి మే సర్వ క్షంతుమర్హస్యనిందిత ।
స్త్రియో హ్యవధ్యాః సర్వేషాం యే చ ధర్మవిదో జవాః ॥ 46
నిందింపదగని వాడా! నేను ఎక్కువగా మాట్లాడి ఉంటే దాన్ని అంతా క్షమించు. ధర్మజ్ఞులైన వారి దృష్టిలో స్త్రీలు దండించదగని వారు గదా! (46)
బ్రాహ్మణ ఉవాచ
ప్రీతోఽస్మి తవ భద్రం తే గతః క్రోధశ్చ శోభనే ।
ఉపాలంభస్త్వయాత్యుక్తః మమ నిఃశ్రేయసం పరమ్ ।
స్వస్తి తేఽస్తు గమిష్యామి సాధయిష్యామి శోభనే ॥ 47
(ధన్యా త్వమపి కల్యాణి యస్యాస్తే వృత్తమీదృశమ్ ।)
బ్రాహ్మణుడు "కల్యాణీ! నీకు మేలు కలుగుగాక. నాకు చాలా సంతోషమైంది. నాకోపం అంతా పోయింది. నీ నింద - దెప్పిపొడుపు మాటల్లో అనౌచిత్యం లేకపోవటమే కాదు. నాకు మేలు చేశాయి. నీకు శుభం కలుగుతుంది. ఇంక నేను వెళ్ళి నాపని సాధించుకుంటా. అమ్మా! ఇంత ఉత్తమ సదాచారం గల నీవు ధన్యురాలివి." (47)
మార్కండేయ ఉవాచ
తయా విసృష్టో నిర్గమ్య స్వమేవ భవనం యయౌ ।
వినిందన్ స స్వమాత్మానం కౌశికో ద్విజసత్తమః ॥ 48
మార్కండేయుడన్నాడు - ధర్మజా! బ్రాహ్మణశ్రేష్ఠుడైన కౌశికుడు ఆ సాధ్వి దగ్గర సెలవుతీసుకొని తనను తాను నిందించుకొంటూ తన నివాసానికి వెళ్ళాడు. (48)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి పతివ్రతోపాఖ్యానే షడధికద్విశతతమోఽధ్యాయః ॥ 206 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున పతివ్రతోపాఖ్యానమను రెండువందల ఆరవ అధ్యాయము. (206)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 48 1/2 శ్లోకాలు)