205. రెండు వందల అయిదవ అధ్యాయము
పతివ్రతా మహత్త్వము.
వైశంపాయన ఉవాచ
తతో యుధిష్ఠిరో రాజా మార్కండేయం మహాద్యుతిమ్ ।
పప్రచ్ఛ భరతశ్రేష్ఠ ధర్మప్రశ్నం సుదుర్విదమ్ ॥ 1
వైశంపాయనుడు అంటున్నాడు - భరతశ్రేష్ఠా! జనమేజయా! తరువాత ధర్మరాజు అర్థం చేసుకోవటానికే కష్టమైన ధర్మవిషయాన్ని గురించి మహతేజస్వి అయిన మార్కండేయుని ప్రశ్నించాడు. (1)
శ్రోతుమిచ్ఛామి భగవన్ స్త్రీణాం మాహాత్మ్యముత్తమమ్ ।
కథ్యమానం త్వయా విప్ర సూక్ష్మం ధర్మ్యం చ తత్త్వతః ॥ 2
మహాత్మా! సూక్ష్మమూ, ధర్మసమ్మతమూ, శ్రేష్ఠమూ, ఉత్తమమూ అయిన పతివ్రతా మాహాత్మ్యాన్ని మీరు చెపుతుంటే వినాలని నా కోరిక. (2)
ప్రత్యక్షమిహ విప్రర్షే దేవా దృశ్యంతి సత్తమ ।
సూర్యాచంద్రమసౌ వాయుః పృథివీ వహ్నిరేవ చ ॥ 3
పితా మాతా చ భగవన్ గురురేవ చ సత్తమ ।
యచ్చాన్యద్ దేవవిహితం తచ్చాపి భృగునందన ॥ 4
బ్రహ్మర్షీ! ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, వాయువు, భూమి, అగ్ని, తండ్రి, తల్లి, గురువు, ప్రత్యక్షదైవాలుగా కన్పిస్తున్నారు. ఇంతేకాక ప్రతిష్ఠితమైన దేవతావిగ్రహాలు కూడా ప్రత్యక్షదేవతలలోని వారే. (3,4)
మాన్యా హి గురవః సర్వే ఏకపత్న్యస్తథా స్త్రియః ।
పతివ్రతానాం శుశ్రూషా దుష్కరా ప్రతిభాతి మే ॥ 5
ఆ గురుజనులందరితోపాటు పతివ్రతలైన స్త్రీలు గూడా పూజింపదగినవారే గదా! ఆ పతివ్రతలు చేసే సేవ తదితర సేవలకంటె చాలా కష్టమైనదని నాకు అనిపిస్తున్నది. (5)
పతివ్రతానాం మాహాత్మ్యం వక్తుమర్హసి నః ప్రభో ।
నిరుధ్య చేంద్రియగ్రామం మనః సంరుధ్య చానఘ ॥ 6
పతిం దైవతవచ్చాపి చింతయంత్యః స్థితా హి యాః ।
భగవన్ దుష్కరం త్వేతత్ ప్రతిభాతి మమ ప్రభో ॥ 7
పుణ్యాత్మా! మాకు పతివ్రతా మాహాత్మ్యాన్ని చెప్పండి. ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును వశం చేసుకొని భర్తను దైవంగా కొలిచే స్త్రీలు పవిత్ర చరిత్రలు. వారి సేవాభావమూ, త్యాగమూ కష్టసాధ్యాలని నేను అనుకొంటాను. (6,7)
మాతాపిత్రోశ్చ శుశ్రూషా స్త్రీణాం భర్తరి చ ద్విజ ।
స్త్రీణాం ధర్మాత్ సుఘోరాద్ది నాన్యం పశ్యామి దుష్కరమ్ ॥ 8
విప్రోత్తమా! పుత్రులకు తల్లిదండ్రుల సేవా, స్త్రీలకు పతిసేవా చాలా శ్రమసాధ్యాలు. స్త్రీలకు ఈ కఠోరధర్మాన్ని మించి ఇంకొక దుష్కరకార్యం నాకు తోచటం లేదు. (8)
సాధ్వాచారాః స్త్రియో బ్రహ్మన్ యత్ కుర్వంతి సదాఽదృతః ।
దుష్కరం ఖలు కుర్వంతి పితరం మాతరం చ వై ॥ 9
ఏకపత్న్యశ్చ యా నార్యః యాశ్చ సత్యం వదంత్యుత ।
ఎల్లప్పుడూ సమాజంలో ఆదరం పొందే మంచినడవడి గల స్త్రీలు చేసే మహత్మార్యం కష్టతరం. తల్లిదండ్రుల సేవ చేయటం కూడా సామాన్యం కాదు. పతివ్రతలూ, సత్యాన్ని చెప్పే స్త్రీలూ చాలా కఠినధర్మాన్నే ఆచరిస్తున్నారు. (9 1/2)
కుక్షిణా దశ మాసాంశ్చ గర్భం సంధారయంతి యాః ॥ 10
నార్యః కాలేన సంభూయ కిమద్భుతతరం తతః ।
స్త్రీలు పదిమాసాలు కుక్షిలో గర్భం ధరించి సరైన సమయంలో సంతానం కంటున్నారు. ఇంత పరమాశ్చర్య కార్యాన్ని మించినది ఏమున్నది? (10 1/2)
సంశయః పరమం ప్రాప్య వేదనామతులామపి ॥ 11
ప్రజాయంతే సుతాన్ నార్యః దుఃఖేన మహతా విభో ।
పుష్టంతి చాపి మహతా స్నేహేన ద్విజపుంగవ ॥ 12
ద్విజపుంగవా! నారీమణులు ప్రసవసమయంలో ప్రాణాపాయస్థితిని, సాటిలేని బాధను పొంది చాలాకష్టపడి పిల్లలను కంటారు. ఆ సంతానాన్ని ఎంతో మమకారంతో పెంచుతారు గదా! (11,12)
యే చ క్రూరేషు సర్వేషు వర్తమానా జుగుప్సితాః ।
స్వకర్మ కుర్వంతి సదా దుష్కరం తచ్చ మే మతమ్ ॥ 13
ఆ పతివ్రతామతల్లులు క్రూరస్వభావం గల భర్త, అత్తమామల మద్య ఉంటూ వారి సేవ చేస్తూ, వాళ్ళు ఎంత నీచంగా చూసినా సహిస్తూ ఎల్లప్పుడూ తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తుంటారు. ఇది అతికష్టమైన పని అని నా అభిప్రాయం. (13)
క్షత్రధర్మసమాచారతత్త్వం వ్యాఖ్యాహి మే ద్విజ ।
ధర్మః సుదుర్లభో విప్ర నృశంసేన మహాత్మనామ్ ॥ 14
ఇంతేకాక క్షత్రియ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించటంలో గల తత్త్వాన్ని వివరించి చెప్పండి. విప్రవరా! క్రూరస్వభావులకు మహాత్ముల ధర్మం ఆచరించటం చాలాకష్టం. (14)
ఏతదిచ్ఛామి భగవన్ ప్రశ్నం ప్రశ్నవిదాం వర ।
శ్రోతుం భృగుకులశ్రేష్ఠ శశ్రూషే తవ సువ్రత ॥ 15
భృగువంశాలంకారా! అడిగేవారి ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పటంలోనూ, ఉత్తమనియమాలు పాటించటంలోనూ శ్రేష్ఠులైన మీరు నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను. (15)
మార్కండేయ ఉవాచ
హంత తేఽహం సమాఖ్యాస్యే ప్రశ్నమేతం సుదుర్వచమ్ ।
తత్త్వేన భరతశ్రేష్ఠ గదతస్తన్నిబోధ మే ॥ 16
మార్కండేయుడు చెపుతున్నాడు. భరతవంశశ్రేష్ఠా నీవు వేసిన ప్రశ్నలను వివరించి
చెప్పటం చాలా కష్టమే. అయినా వీటికి సరైన సమాధానం చెపుతాను జాగ్రత్తగా విను. (16)
మాతౄస్తు గౌరవాదన్యే పితౄనన్యే తు మేనిరే ।
దుష్కరం కురుతే మాతా వివర్ధయతి యా ప్రజాః ॥ 17
గౌరవించవలసిన వారిలో తల్లులే ముఖ్యులని కొందరూ, తండ్రులే ముఖ్యులని కొందరూ భావించారు. కాని తల్లి తనసంతానాన్ని పెంచి, పోషించి, పెద్ద చేస్తుంది. ఇది ఆమె చేసే పనులలో కఠినమైనది. (17)
తపసా దేవతేజ్యాభివందనేన తితిక్షయా ।
సుప్రశస్తైరుపాయైశ్చాపీహంతే పితరః సుతాన్ ॥ 18
తల్లిదండ్రులు తపస్సు, దేవపూజ, దేవతా నమస్కారం, శీతోష్ణాదులను సహించుట.... ఇంకా ఇతరమైన చాలా ఉపాయాల ననుసరించి సంతానం పొందాలని కోరుకొంటారు. (18)
ఏవం కృచ్ఛ్రేణ మహతా పుత్రం ప్రాప్య సుదుర్లభమ్ ।
చింతయంతి సదా వీర కీదృశోఽయం భవిష్యతి ॥ 19
ఈవిధంగా మహత్తరమైన కష్టాలను సహించి దుర్లభుడైన పుత్రుని కంటారు. ఆ తరువాత పుట్టిన పిల్లవాడు ముందుముందు ఎలాంటివాడు అవుతాడో అని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. (19)
ఆశంసతే హి పుత్రేషు పితా మాతా చ భారత ।
యశః కీర్తిమథైశ్వర్యం ప్రజా ధర్మం తథైవ చ ॥ 20
తల్లిదండ్రులు తమ పుత్రులకు లోకంలో ప్రసిద్ధి, కీర్తి, ఐశ్వర్యం, మంచిసంతానం, ధర్మబుద్ధి కలగాలని కోరుకొంటారు. (20)
తయోరాశాం తు సఫలాం యః కరోతి స ధర్మవిత్ ।
పితా మాతా చ రాజేంద్ర తుష్యతో యస్య నిత్యశః ॥ 21
ఇహ ప్రేత్య చ తస్యాథ కీర్తిర్ధర్మశ్చ శాశ్వతః ।
ఆ తల్లిదండ్రుల ఆశను సఫలం చేసినవాడే సరైన ధర్మం తెలిసిన పుత్రుడవుతాడు. తల్లిదండ్రులను ఎల్లప్పుడూ అన్నివిధాలా సంతోషపెట్టే పుత్రుడికి ఈ లోకంలోను పరలోకంలోనూ శాశ్వతమైన కీర్తి, ధర్మమూ లభిస్తాయి. (21 1/2)
నైవ యజ్ఞక్రియాః కాశ్చిత్ నశ్రాద్ధం నోపవాసకమ్ ॥ 22
యా తు భర్తరి శశ్రూషా తయా స్వర్గం జయత్యుత ।
స్త్రీకి ఎలాంటి యజ్ఞాలు కాని, శ్రాద్ధాదులు గాని, ఉపవాసాదులు కాని చేయవలసిన పనిలేదు. పతిసేవ చక్కగా చేస్తే స్వర్గంపైన గూడా విజయం సాధిస్తుంది. (22 1/2)
ఏతత్ ప్రకరణం రాజన్ అధికృత్య యుధిష్ఠిర ॥ 23
పతివ్రతానాం నియతం ధర్మం చావహితః శృణు ॥ 24
ధర్మరాజా! ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పతివ్రతలకు నిశ్చితమైన ధర్మాన్ని వివరిస్తాను. శ్రద్ధగా విను. (23,24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి పతివ్రతోపాఖ్యానే పంచాధికశతతమోఽధ్యాయః ॥ 205 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున పతివ్రతోపాఖ్యానమను రెండువందల అయిదవ అధ్యాయము. (205)