166. నూట అరువది ఆరవ అధ్యాయము

ఇంద్రుడు పాండవులను అనునయించి స్వర్గమున కేగుట.

వైశంపాయన ఉవాచ
తతో రజన్యాం వ్యుష్టాయాం ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
భ్రాతృభిః సహితః సర్వైః అవందత ధనంజయః ॥ 1
వైశంపాయనుడు చెప్తున్నాడు - రాత్రి గడిచిన తరువాత ఉదయకాలంలో సోదరులందరితో కలిసి ధనంజయుడు (అర్జునుడు) ధర్మరాజుకు నమస్కరించాడు. (1)
ఏతస్మిన్నేవ కాలే తు సర్వవాదిత్రనిఃస్వనః ।
బభూవ తుములః శబ్దః త్వంతరిక్షే దివౌకసామ్ ॥ 2
ఇంతలోనే అంతరిక్షంలో స్వర్గవాసులు మ్రోగించిన అన్నివాద్యముల ధ్వని వినపడింది. (2)
రథనేమిస్వనశ్చైవ ఘంటాశబ్దశ్చ భారత ।
పృథగ్వ్యాలమృగాణాం చ పక్షిణామివ సర్వశః ॥ 3
భారతా! అంతటా రథచక్రాలచప్పుడు, గంటల మోత, ఏనుగులు, జంతువులు, పక్షులు చేసిన ధ్వనులూ వేరుగా వినబడ్డాయి. (3)
(రవోన్ముఖాస్తే దదృశుః ప్రీయమాణాః కురూద్వహాః ।
మరుద్భిరన్వితం శక్రమ్ ఆపతంతం విహాయసా ॥)
తే సమంతాదనుయయుః గంధర్వాప్సరసాం గణాః ।
విమానైః సూర్యసంకాశైః దేవరాజమరిందమమ్ ॥ 4
(పాండవులు ప్రసన్నతతో ఆ ధ్వని వచ్చేవైపు చూస్తూ ఆకాశమార్గాన దేవతలతో కలసి వస్తున్న ఇంద్రుని చూశారు.)
సూర్యుని లాంటి విమానాల మీద గంధర్వ అప్సరసల సమూహాలు దేవేంద్రుడికి నాలుగుప్రక్కలా అనుసరిస్తూ వస్తున్నారు. (4)
తతః స హరిభిర్యుక్తం జాంబూనదపరిష్కృతమ్ ।
మేఘనాదినమారుహ్య శ్రియా పరమయా జ్వలన్ ॥ 5
పార్థానభ్యాజగామాథ దేవరాజః పురందరః ।
ఆగత్య చ సహస్రాక్షో రథాదవరురోహ వై ॥ 6
తం దృష్ట్వైవ మహాత్మానం ధర్మరాజో యుధిష్ఠిరః ।
భ్రాతృభిః సహితః శ్రీమాన్ దేవరాజముపాగమత్ ॥ 7
బంగారం తాపడం చేసిన రథానికి గుర్రాలు పూన్చి ఉన్నాయి. ఆ రథం చక్కని కాంతితో మేఘ గర్జన చేస్తోంది. ఆ రథం నుండి ఇంద్రుడు దిగాడు. ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి ఇంద్రుని సమీపించాడు. (5-7)
పూజయామాస చైవాథ విధివద్ భూరిదక్షిణః ।
యథార్హామమితాత్మానం విధిదృష్టేన కర్మణా ॥ 8
యజ్ఞాలలో దక్షిణ ఎక్కువగా ఇచ్చే ధర్మరాజు ఇంద్రుని ఆయనకు తగినట్లుగా శాస్త్రోక్తంగా ఎదురేగి పూజించాడు.(8)
ధనంజయశ్చ తేజస్వీ ప్రణిపత్య పురందరమ్ ।
భృత్యవత్ ప్రణతస్తస్థౌ దేవరాజసమీపతః ॥ 9
తేజోవంతుడైన అర్జునుడు ఇంద్రుడికి ప్రణామం చేసి ఆ దేవరాజుకు దగ్గరగా సేవకుడిలా వినయంగా నిలబడ్డాడు. (9)
ఆప్యాయత మహాతేజాః కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
ధనంజయమభిప్రేక్ష్య వినీతం స్థితిమంతికే ॥ 10
జటిలం దేవరాజస్య తపోయుక్తమకల్మషమ్ ।
హర్షేణ మహతాఽఽ విష్టః ఫాల్గునస్యాథ దర్శనాత్ ॥ 11
గొప్ప తేజస్సు కల ధర్మరాజు దేవరాజుకు దగ్గరగా జడలతో, తపస్సు చేత పాపరహితుడై వినయంగా నిలుచున్న అర్జునుని చూసి చాలా సంతోషాన్ని పొందాడు (10,11)
బభూవ పరమప్రీతః దేవరాజం చ పూజయన్ ।
తం తథాదీనమనసం రాజానం హర్షసంప్లుతమ్ ॥ 12
ఉవాచ వచనం ధీమాన్ దేవరాజః పురందరః ।
త్వమిమాం పృథివీం రాజన్ ప్రశాసిష్యసి పాండవ ।
స్వస్తి ప్రాప్నుహి కౌంతేయ కామ్యకం పునరాశ్రమమ్ ॥ 13
దేవరాజును పూజిస్తూ ఎంతో ప్రీతిని పొందాడు. సంతోషంతో మునిగిన, ఉదార హృదయుడైన ఆ రాజుతో (తెలివైనవాడూ దేవరాజా అయిన) ఇంద్రుడు రాజా! కుంతీకుమారా! నీవీ భూమిని పాలిస్తావు మళ్ళీ శుభాన్ని చేకూర్చే కామ్యకవనంలో గల ఆశ్రమానికి వెళ్ళు అన్నాడు. (12,13)
అస్త్రాణి లబ్ధాని చ పాండవేన
సర్వాణి మత్తః ప్రయతేన రాజన్ ।
కృతప్రియశ్చాస్మి ధనంజయేన
జేతుం న శక్యస్త్రిభిరేష లోకైః ॥ 14
రాజా! ఏకాగ్రత కల అర్జునుడు నా వల్ల అస్త్రాలను పొందాడు. నాకు ప్రీతి కలిగించాడు. ముల్లోకాలవాళ్ళూ ఇతణ్ణి జయించలేరు. (14)
ఏవముక్త్వా సహస్రాక్షః కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ।
జగామ త్రిదివం హృష్టః స్తూయమానో మహర్షిభిః ॥ 15
ధర్మరాజుకు ఇలా చెప్తూ మహర్షులు స్తోత్రాలు చేస్తూంటే సంతోషించి దేవేంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. (15)
ధనేశ్వరగృహస్థానాం పాండవానాం సమాగమమ్ ।
శక్రేణ య ఇదం విద్వాన్ అధీయీత సమాహితః ॥ 16
సంవత్సరం బ్రహ్మచారీ నియతః సంశితవ్రతః ।
స జీవేద్ధి నిరాబాధః స సుఖీ శరదాం శతమ్ ॥ 17
కుబేరుని నివాసంలో ఉన్న పాండవులకు ఇంద్రునితో ఏర్పడ్డ ఈ కలయికను సంవత్సర కాలం బ్రహ్మచారిగా నియమంగా దీక్షతో చదివేవాడు బాధల్లేకుండా జీవిస్తాడు. నూరేళ్ళూ సుఖంగా ఉంటాడు (16,17)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి ఇంద్రాగమనే షట్ షష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 166 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వౌన నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున ఇంద్రాగమనమను నూట అరువది ఆరవ అధ్యాయము. (166)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 18 శ్లోకాలు.)