165. నూట అరువది అయిదవ అధ్యాయము

(నివాతకవచ యుద్ధ పర్వము)

అర్జునుడు గంధమాదన పర్వతమున సోదరులను కలియుట.

వైశంపాయన ఉవాచ
తతః కదాచిద్ధరిసంప్రయుక్తం
మహేంద్రవాహం సహసోపయాతమ్ ।
విద్యుత్ర్పభం ప్రేక్ష్య మహారథానాం
హర్షోఽర్జునం చింతయాతాం బభూవ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఒకప్పుడు గుర్రాలతో కూడిన ఇంద్రరథం మెరుపుకాంతితో ఒక్కసారిగా కనబడింది. అర్జునుని తలుచుకుంటున్నవాళ్ళకు దాన్ని చూసి ఎంతో సంతోషం కలిగింది. (1)
స దీప్యమానః సహసాంతరిక్షం
ప్రకాశయన్ మాతలిసంగృహీతః ।
బభౌ మహోల్కేవ ఘనాంతరస్థా
శిఖేవ చాగ్నేర్జ్వలితా విధూమా ॥ 2
మాథలి నడుపుతున్న ఆ రథం ఒక్కసారిగా ఆకాశాన్ని వెలుగుతో ప్రకాశింపచేస్తూ మబ్బులమధ్యలో ఉన్న గొప్పతోకచుక్కలా, పొగ లేని అగ్నిజ్వాలలా ప్రకాశించింది. (2)
తమాస్థితః సందదృశే కిరీటి
స్రగ్వీనవాన్యాభరణాని బిభ్రత్ ।
ధనంజయో వజ్రధరప్రభావః
శ్రియా జ్వలన్ పర్వతమాజగామ ॥ 3
దివ్యమైన కాంతితో వెలిగిపోతూ, ఇంద్రుడితో సమానమైన ప్రభావంతో అర్జునుడు కిరీటం పూలదండలు, ఆభరణాలతో ప్రకాశిస్తూ ఆ రథం మీద పర్వతాన్ని చేరుకున్నాడు. (3)
స శైలమాసాద్య కిరీటమాలీ
మహేంద్రవాహాదవరుహ్య తస్మాత్ ।
ధౌమ్యస్య పాదావభివాద్య ధీమాన్
అజాతశత్రోస్తదనంతరం చ ॥ 4
వృకోదరస్యాపి చ వంద్యపాదౌ
మాద్రీసుతాభ్యామభివాదితశ్చ ।
సమేత్య కృష్ణాం పరిసాంత్వ్య చైనాం
ప్రహ్వోఽభవద్ భ్రాతురుపహ్వరే సః ॥ 5
అర్జునుడు ఆ పర్వతాన్ని చేరుకుని ఆ ఇంద్రరథం మీద నుండి దిగి ధౌమ్యుడికి, తరువాత ధర్మరాజుకు భీముడికి పాదాభివందనం చేశాడు. నకులసహ దేవులు అర్జునునకు నమస్కరించారు. అర్జునుడు ద్రౌపదిని కలిసి ఆమెనోదార్చి సోదరుడైన యుధిష్ఠిరుని చెమ్త వినయంగా నిలచాడు. (4,5)
బభూవ తేషాం పరమః ప్రహర్షః
తేనాప్రమేయేణ సమాగతానామ్ ।
స చాపి తాన్ ప్రేక్ష్య కిరీటమాలీ
ననంద రాజానమభిప్రశంసన్ ॥ 6
అమితమైన ఘనత సంతరించుకొన్న అర్జునుని కలిసిన వాళ్ళకు చాలా సంతోషం కలిగింది. కిరీటధారియైన అతడు కూడా వాళ్ళను చూసి ఆనందించాడు.. రాజైన యుధిష్ఠిరుని ప్రశంసించసాగాడు. (6)
యమాస్థితః సప్త జఘాన పూగాన్
దితేః సుతానాం నముచేర్నిహంతా ।
తమింద్రవాహం సముపేత్య పార్థాః
ప్రదక్షిణం చక్రురదీనసత్త్వాః ॥ 7
ఇంద్రుడు ఎక్కి, దైత్యుల ఏడు యుధాలను, చంపిన ఇంద్రుని రథం దగ్గరకు వెళ్లి పాండవులు ప్రదక్షిణం చేశారు. (7)
తే మాతలేశ్చక్రురతీవ హృష్టాః
సత్కారమగ్ర్యం సురరాజతుల్యమ్ ।
సర్వాన్ యథావచ్చ దువౌకసస్తే
పప్రచ్ఛురేనం కురురాజపుత్రాః ॥ 8
చాలా సంతోషంగా ఉన్న ఆ పాండవులు మాతలికి, ఇంద్రుడితో సమానంగా ఉత్తమమైన రీతిలో సత్కారం చేశారు. తగినవిధంగా దేవతలందరి క్షేమసమాచారాన్ని అడిగారు. (8)
తానప్యసౌ మాతలిరభ్యనందత్
పితేవ పుత్రాననుశిష్య పార్థాన్ ।
యయౌ రతేనాప్రతిమప్రభేణ
పునః సకాశం త్రిదివేశ్వరస్యః ॥ 9
కుమారులకు తండ్రి బోధించినట్లు బోధించి ఆ పాండవులకు అభినంధించి మాతలి మళ్ళీ సాటిలేని కాంతి గల ఆ రథం మీద స్వర్గలోకాధిపతి వద్దకు వెళ్ళాడు. (9)
గతే తు తస్మిన్ నరదేవవర్యః
శక్రాత్మజః శక్రరిపుప్రమాథీ ।
(సాక్షాత్ సహస్రాక్ష ఇవ ప్రతీతః
శ్రీమాన్ స్వదేహాదవముచ్య జిష్ణుః ।)
శక్రేణ దత్తాని దదౌ మహాత్మా
మహాధనాన్యుత్తమరూపవంతి ॥ 10
దివాకరాభాణి విభూషణాని
ప్రియః ప్రియాయై సుతసోమమాత్రే ।
మాతలి వెళ్ళగానే ఇంద్రునికుమారుడు, మానవరాజశ్రేష్ఠుడు, మహాత్ముడు, స్వయంగా వేయికన్నుల వానివలె తోచువాడు, శ్రీమంతుడు, ప్రియుడు అయిన అర్జునుడు తన శరీరం నుండి తీసి ఇంద్రుడిచ్చిన, ఎంతో వెలగల, చక్కని ఆకారంతో, సూర్యునివలె మెరిసే ఆభరణాలను (శు) సుతసోముని తల్లి, తనకు ప్రియురాలూ అయిన ద్రౌపదికి ఇచ్చాడు. (9,10 1/2)
తతః స తేషాం కురుపుంగవానాం
తేషాం చ సూర్యాగ్నిసమప్రభాణామ్ ॥ 11
విప్రర్షభాణాముపవిశ్య మధ్యే
సర్వం యథావత్ కథయాంబభూవ ।
ఏవం మయాస్త్రాణ్యుపశిక్షితాని
శక్రాచ్చ వాతాచ్చ శివాచ్చ సాక్షాత్ ॥ 12
తరువాత ఆ కురువంశశ్రేష్ఠులు, సూర్యాగ్నులతో సమానమైన కాంతి గల బ్రాహ్మణశ్రేష్ఠుల మధ్య కూర్చుని జరిగిందంతా ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. ఇంద్రుడి వల్ల, వాయుదేవుని వల్ల, సాక్షాత్తు శివుని వల్ల అస్త్రాలు పొందానని చెప్పసాగాడు. (11,12)
తథైవ శీలేన సమాధినాథ
ప్రీతాః సురా మే సహితాః సహేంద్రాః ।
సంక్షేపతో వై స విశుద్ధకర్మా
తేభ్యః సమాఖ్యాయ దివి ప్రవాసమ్ ॥ 13
మాద్రీసుతాభ్యాం సహితః కిరీటీ
సుష్వాప తామావసతిం ప్రతీతః ॥ 14
అలాగే నా సత్ర్పవర్తనచేత, ఏకాగ్రతచేత ఇంద్రుడితో సహా దేవతలు నా పట్ల సంతోషించారు. అని పరిశుద్ధమైన ఆచరణ కల్గి కిరీటధారియైన అర్జునుడు క్లుప్తంగా వారికి తను స్వర్గంలో ఉన్న తీరును వివరించి నకులసహదేవులతో కలిసి నిశ్చింతంగా ఆ ఆశ్రమంలో నిద్రించాడు. (13,14)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణ్యర్జునసమాగమే పంచషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 165 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున అర్జునసమాగమమను నూట అరువది అయిదవ అధ్యాయము. (165)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 14 1/2 శ్లోకాలు.)