161. నూట అరువది ఒకటవ అధ్యాయము

యుధిష్ఠిరుడు గంధమాదనమున కుబేరుని దర్శించుట.

వైశంపాయన ఉవాచ
శ్రుత్వా బహువిధైః శబ్ధైః నాద్యమానాం గిరేర్గుహామ్ ।
అజాతశత్రుః కౌంతేయః మాద్రీపుత్రావుభావసి ॥ 1
ధౌమ్యః కృష్ణా చ విప్రాశ్చ సర్వే చ సుహృదస్తథా ।
భీమసేనమపశ్యంత సర్వే విమనసోఽభవన్ ॥ 2
అనేకరకాలైన శబ్దాలతో కొండగుహ మార్మోగటం విని ధర్మరాజు, మాద్రికొడుకులైన నకులసహదేవిలిద్దరూ - ధౌమ్యమహర్షి, ద్రౌపది, బ్రాహ్మణులందరూ స్నేహితులూ వీరందరికీ భీముని కానక మనసు చెడిపోయింది. (1,2)
ద్రౌపదీమార్ ష్టిషేణాయ సంప్రధార్య మహారథాః ।
సహితాః సాయుధాః శూరాః శైలమారురుహుస్తదా ॥ 3
మహారథులంతా అప్పుడు ద్రౌపదిని ఆర్ ష్టిషేణుడివద్ద ఉంచి, ఆయుధాలతో కొండ ఎక్కారు. (3)
తతః సంప్రాస్య శైలాగ్రం వీక్షమాణా మహారథాః ।
దదృశుస్తే మహేష్వసా భీమసేనమరిందమాః ॥ 4
మహారథులైన ధర్మరాజులు కొండ అంచుకు చేరి భీముణ్ణి చూశారు. (4)
స్ఫురతశ్చ మహాకాయాన్ గతసత్త్వాంశ్చ రాక్షసాన్ ।
మహాబలాన్ మహాసత్త్వాన్ భీమసేనేన పాతితాన్ ॥ 5
భీమసేనుడి చేత పడగొట్టబడినట్టున వారిని చూశారు - వారంతా పెద్దశరీరాలు, ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు, గొప్పబలపరాక్రమాలున్నవాళ్ళు, రాక్షసులు. (5)
శుశుభే స మహాబాహుః గదాఖడ్గధనుర్ధరః ।
విహత్య సమరే సర్వాన్ దానవాన్ మఘవానివ ॥ 6
యుద్ధంలో రాక్షసులందర్నీ చంపిన ఇంద్రుడిలా మహాభుజుడై గద కత్తి, ధనుస్సులను ధరించిన ఆ భీముడు శోభాయమానంగా ఉన్నాడు. (6)
తతస్తే భ్రాతరం దృష్ట్వా పరిష్వజ్య మహారథాః ।
తత్రోపవివిశుః పార్థాః ప్రాప్తా గతిమనుత్తమాన్ ॥ 7
మహారథులైన ఆ పాండవులు తరువాత సోదరుని చూసి కౌగిలించుకొని అక్కడ ఉత్తమమైన చోటును చేరుకొని కూర్చున్నారు. (7)
తైశ్చతిర్భిర్మహేష్వాసైః గిరిశృంగమశోభత ।
లోకపాలైర్మహాభాగైః దివం దేవవరైరివ ॥ 8
మహాత్ములు, దేవశ్రేష్ఠులు అయిన లోకపాలకులతో స్వర్గం శోభించినట్లు గొప్ప విలుకాండ్రయిన ఆ నలుగురితో ఆ కొండశిఖరం శోభించింది. (8)
కుబేరసదనం దృష్ట్వా రాక్షసాంశ్చ నిపాతితాన్ ।
భ్రాతా భ్రాతరమాసీనమ్ అబ్రవీత్ పృథివీపతిః ॥ 9
కుబేరుడిభవనాన్ని, నేలకూల్చబడిన రాక్షసుల్ని చూసి ధర్మరాజు తమ్ముడితో ఇలా అన్నాడు. (9)
యుధిష్ఠిర ఉవాచ
సాహసాద్ యది వా మోహాద్ భీమ పాపమిదం కృతమ్ ।
నైతత్ తే సదృశం వీర మునేరివ మృషా వధః ॥ 10
యుధిష్ఠిరుడంటున్నాడు - సాహసం చేతనో, మోహం చేతనో భీమా! పాపం చేశావు. వీరా! మునిలా ఉన్న నీకు అకారణంగా ఇలా చంపటం తగదు. (10)
రాజద్విష్టం న కర్తవ్యమితి ధర్మవిదో విదుః ।
త్రిదశానామిదం ద్విష్టం భీమసేన త్వయా కృతమ్ ॥ 11
రాజద్రోహం చెయ్యకూడదని ధర్మవేత్తలంటారు. భీమసేనా! నీవు ఈ దేవతాద్రోహం చేశావు. (11)
అర్థధర్మావనాదృత్య యః పాపే కురుతే మనః ।
కర్మణాం పార్థ పాపానాం స ఫలం విందతే ధ్రువమ్ ।
పునరేఽఅం న కర్తవ్యం మమ చేదిచ్ఛాసి ప్రియమ్ ॥ 12
అర్థ, ధర్మాలు విడిచి పాపకార్యంలో మనసుపడేవాడు తప్పకుండా పాపపుపనులకు ఫలాన్ననుభవిస్తాడు. నాకు ప్రియం చెయ్యాలనుకుంటే మళ్ళీ ఇలాంటి పని చెయ్యకు. (12)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా స ధర్మాత్మా భ్రాతా భ్రాతరమచ్యుతమ్ ।
అర్థతత్త్వవిభాగజ్ఞః కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 13
విరరామ మహాతేజాః తమేవార్థం విచింతయన్ ।
వైశంపాయనుడు చెప్తున్నాడు. అర్థతత్వం తెలుసుకోగల ధర్మరాజు ధర్మం నుండి జారని సోదరుడితో ఇలా అని - ఆ విషయాన్నే తలచుకుంటూ ఊరకున్నాడు. (13 1/2)
తతస్తే హతశిష్టా యే భీమసేనేన రాక్షసాః ॥ 14
సహితాః ప్రత్యపద్యంత కుబేరసదనం ప్రతి ।
తరువాత భీమసేనుడిచేతిలో చావగా మిగిలిన రాక్షసులు అంతా కలిసి కుబేరుడి భవనాన్ని చేరుకున్నారు. (14 1/2)
తే జవేన మహావేగాః ప్రాప్య వైశ్రవణాలయమ్ ॥ 15
భీమమార్తస్వరం చక్రుః భీమసేనభయార్దితాః ।
న్యస్తశస్త్రాయుధాః క్లాంతాః శోణితాక్తతనుచ్ఛదాః ॥ 16
చాలావేగం గల వారు త్వరగా కుబేరుడి నివాసానికి చేరుకొని - భీమసేనుడి భయంతో భయంకరంగా ఆర్తనాదం చేశారు. శస్త్రాలను, ఆయుధాలను విడచారు. అలసిపోయారు. వారికవచాలు రక్తంతో తడిసిపోయాయి. (15,16)
ప్రకీర్ణమూర్ధజా రాజన్ యక్షాధిపతిమబ్రువన్ ।
గదాపరిఘనిస్త్రింశతోమరప్రాసయోధినః ॥ 17
రాక్షసా నిహతాః సర్వే తవ దేవ పురఃసరాః ।
రాజా! వెదజల్లబడినట్లున్న వెంట్రుకలతో యక్షులు రాజుతో ఇలా అన్నారు. దేవా! గద, ఇనుపకట్లగుదియ, పెద్దకత్తి, చిల్లకోల, ఈటెలతో యుద్ధం చెయ్యగల ఈ నీ ముందుండే రాక్షసులంతా చంపబడ్డారు. (17 1/2)
ప్రమృద్య తరసా శైలం మానుషేణ ధనేశ్వర ॥ 18
ఏకేన సహితాః సంఖ్యే రణే క్రోధవశాః గణాః ।
ధనేశ్వరా! ప్రభూ! ఒక మానవుడి చేత కొండ అంతా మర్దించబడింది. క్రోధవశులనే రాక్షసరాజులు మర్దింపబడ్డారు. (18 1/2)
ప్రవరా రాక్షసేంద్రాణాం యక్షాణాం చ నరాధిప ॥ 19
శేరతే నిహతా దేవ గతసత్త్వాః పరాసవః ।
లబ్ధశేషా వయం ముక్తా మణిమాంస్తే సఖా హతః ॥ 20
యక్షులలో శ్రేష్ఠులైనవారు, యుద్ధంలో ఉత్సాహం, ప్రాణాలు కోల్పోయి, చంపబడి నిద్రిస్తున్నారు. అతడిదయవల్ల మేము విడువబడ్డాము. నీ స్నేహితుడైన మణిమంతుడు చంపబడ్డాడు. (19,20)
మాణుషేన కృతం కర్మ విధత్స్వ యదనంతరమ్ ।
స తచ్ర్ఛుత్వా తు సంక్రుద్ధః సర్వయక్షగణాధిపః ॥ 21
కోపసంరక్తనయనః కథమిత్యబ్రవీద్ వచః ।
ఈపని ఒక మానవుని వల్ల జరిగింది. తరువాత ఏం చెయ్యాలో చెయ్యి. (అన్నారు.) యక్షగణాలన్నింటికీ ప్రభువైన ఆ కుబేరుడది విని బాగా కోపించాడు. కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో "ఎలా"? అని అడిగాడు. (21 1/2)
ద్వితీయమపరాధ్యంతం భీమం శ్రుత్వా ధనేశ్వరః ॥ 22
చుక్రోధ యక్షాధిపతిః యుజ్యతామితి చాబ్రవీత్ ।
రెండవ తప్పు చేశాడు భీముడని విని ధనేశ్వరుడూ, యక్షులకు రాజు అయిన అతడు కోపగించాడు. రథం సిద్ధం చెయ్యమన్నాడు. (22 1/2)
అథాభ్రఘనసంకాశం గిరిశృంగమివోచ్ర్ఛితమ్ ॥ 23
రథం సంయోజయామాసుః గంధర్వై ర్హేమమాలిభిః ।
తస్య సర్వగుణోపేతాః విమలక్షా హయోత్తమాః ॥ 24
తేజోబలగుణోపేతాః నానారత్నవిభూషితాః ।
శోభమానా రథే యుక్తాః తరిష్యంత ఇవాశుగాః ॥ 25
అటుపిమ్మట దట్టమైన మబ్బుల్లా ఉండి కొండశిఖరం వలె ఎత్తైన రథానికి బంగారుదండలతోనున్న గంధర్వదేశపు గుర్రాలను అమర్చారు. అవి అన్ని మంచి గుణాలు కలిగి ఉన్నాయి. వాటికళ్ళు విశాలంగా ఉన్నాయి. అవి మేలుజాతి గుర్రాలు, తేజస్సు, బలము కలవి, అనేక రకాలైన రత్నాలతో అలంకరించబడ్డాయి. వేగంగా వెళ్ళే ఆ గుర్రాలు రథానికి అమర్చబడి ప్రకాశిస్తున్నాయి. (23-25)
హ్రేషయామాసురన్యోన్యం హ్రేషితైర్విజయావహైః ।
స తమాస్థాయ భగవాన్ రాజరాజో మహారథమ్ ॥ 26
ప్రయయౌ దేవగంధర్వైః స్తూయమానో మహాద్యుతిః ।
విజయానికి సంకేతాలయిన సకిలింతలతో ఒకటినొకటి ప్రేరేపిస్తున్నాయి. రాజురాజుగా పేర్కొనబదే కుబేరుడు ఆ రథాన్నెక్కి గొప్పకాంతి గలిగి దేవగంధర్వులచే స్తోత్రం చెయ్యబడుతూ వెళ్ళాడు. (26 1/2)
తం ప్రయాంతం మహాత్మానం సర్వే యక్షా ధనాధిపమ్ ॥ 27
యక్షులంతా వెళ్తున్న ధనాధీశుడైన ఆ మహాత్ముని అనుసరించారు. (27)
రక్తాక్షా హేమసంకాశా మహాకాయా మహాబలాః ।
సాయుధా బద్ధనిస్త్రింశాః యక్షా దశశతావరాః ॥ 28
సుమారు వెయ్యిమంది ఆ యక్షుల కళ్ళు ఎర్రగా బంగారంలా మెరుస్తున్నాయి. శరీరాలు పెద్దవి. గొప్పబలం కలవారు. వారి వద్ద ఆయుధాలున్నాయి. పెద్దకత్తుల్ని పట్టుకున్నారు. (28)
తే జవేన మహావేగాః ప్లవమానా విహాయసా ।
గంధమాదనమాజగ్ముః ప్రకర్షంత ఇవాంబరమ్ ॥ 29
ఎంతో వేగం గల వాళ్ళు వేగంగా ఆకాశంలో తేలుతూ ఆకాశాన్ని లాగుతున్నారా అన్నట్లు గంధమాదనపర్వతానికి వచ్చారు. (29)
తత్ కేసరిమహాజాలం ధనాధిపతిపాలితమ్ ।
కుబేరం చ మహాత్మానం యక్షరక్షో గణావృతమ్ ॥ 30
దదృశుర్హృష్టరోమాణః పాండవాః ప్రియదర్శనమ్ ।
కుబేరస్తు మహాసత్త్వాన్ పాండోఃపుత్రాన్ మహారథాన్ ॥ 31
ఆత్తకార్ముకనిస్త్రింశాన్ దృష్ట్వా ప్రీతోఽభవత్ తదా ।
దేవకార్యం చికీర్షన్ స హృదయేన తుతోష హ ॥ 32
ధనరాజు రక్షించే గుర్రాల పెద్ద గుంపును, యక్షరాక్షస గణాలు చుట్టూ ఉన్న, కుబేరుని గగుర్పాటుతో పాండవులు చూశారు. అప్పుడు కుబేరుడు కూడ మహారథులై ధనస్సులు ఎక్కుపెట్టి, కత్తులు పట్టి ఉన్న పాండుకుమారులను చూసి దేవకార్యం చెయ్యదలచి మనసులో సంతోషించాడు. (30-32)
తే పక్షిణ ఇవాపేతుః గిరిశృంగం మహాజవాః ।
తస్థుస్తేషాం సమభ్యాశే ధనేశ్వరపురఃసరాః ॥ 33
కుబేరుని ముందు పెట్టుకొని వేగంగా పయనించే పక్షుల్లా యక్షులంతా కొండశిఖరాన్ని చేరారు. పాండవుల సమీపంలో నిలచారు. (33)
తతస్తం హృష్టమనసం పాండవాన్ ప్రతి భారత ।
సమీక్ష్య యక్షగంధర్వా నిర్వికారమవస్థితాః ॥ 34
యక్షులు, గంధర్వులు పాండవుల విషయంలో ప్రసన్నమైన మనసు గల కుబేరుని గమనించి నిలచారు. (34)
పాండవాశ్చ మహాత్మానః ప్రణమ్య ధనదం ప్రభుమ్ ।
నకులః సహదేవశ్చ ధర్మపుత్రశ్చ ధర్మవిత్ ॥ 35
అపరాద్ధమివాత్మానం మన్యమానా మహారథాః ।
తస్థుః ప్రాంజలయః సర్వే పరివార్య ధనేశ్వరమ్ ॥ 36
ధర్మవేత్తయైన ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, తమను దోషులుగా తలచుకుంటూ కుబేరుడి చుట్టూ చేరి అందరూ చేతులు జోడించారు. (36)
స హ్యాసనవరం శ్రీమత్ పుష్పకం విశ్వకర్మణా ।
విహితం చిత్రపర్యంతమ్ ఆతిష్ఠత ధనాధిపః ॥ 37
ఆ కుబేరుడు విశ్వకర్మచే నిర్మించబడ్డ శోభాయమానమైన పుష్పకమనబడే శ్రేష్ఠమైన ఆసనాన్ని అధిష్ఠించాడు. దాని నిర్మాణకౌశలం విచిత్రమైనది. (37)
తమాసీనం మహాకాయాః శంకుకర్ణా మహాజవాః ।
ఉపోపవివిశుర్యక్షాః రాక్షసాశ్చ సహస్రశః ॥ 38
శతశశ్చాపి గంధర్వాః తథైవాప్సరసాం గణాః ।
పరివార్యోపతిష్ఠంత యథా దేవాః శతక్రతుమ్ ॥ 39
గొప్పశరీరాలు, చక్కని చెవులు, చాలా వేగమూ గల యక్షులు, రాక్షసులు వేలల్లో కూర్చుని ఉన్న అతడి చుట్టూ కూర్చున్నారు. దేవతలు, ఇంద్రుని చుట్టినట్లు వందల సంఖ్యలో గంధర్వుల, అప్సరసల గుంపులు ఆయన చుట్టూ నిలచారు. (38,39)
కాంచనీం శిరసా బిభ్రద్ భీమసేనః స్రజం శుభామ్ ।
పాశఖడ్గధనుష్పాణిః ఉదైక్షత ధనాధిపమ్ ॥ 40
శుభాన్నీ చేకూర్చే బంగారు దండను తలపై అలంకరించుకున్న భీమసేనుడు త్ఱాడు, కత్తి, ధనుస్సులను చేతబట్టి ధనరాజైన కుబేరుని చూశాడు. (40)
భీమసేనస్య న గ్లానిః విక్షతస్యాపి రాక్షసైః ।
ఆసీత్ తస్యామవస్థాయాం కుబేరమపి పశ్యతః ॥ 41
రాక్షసుల వల్ల, గాయపడి కూడ, ఆ దశలో కుబేరుని చూస్తున్నప్పుడు కూడ భీమసేనుడికి ఎలాంటి బడలిక కలుగలేదు. (41)
ఆదదానం శితాన్ బాణాన్ యోద్ధుకామమవస్థితమ్ ।
దృష్ట్వా భీమం ధర్మసుతమ్ అబ్రవీన్నరవాహనః ॥ 42
కుబేరుడు వాడి బాణాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న భీముడిని చూసి ధర్మరాజుతో అన్నాడు. (42)
విదుస్త్వాం సర్వభూతాని పార్థ భూతహితే రతమ్ ।
నిర్భయశ్చాపి శైలాగ్రే వస త్వం భ్రాతృభిః సహ ॥ 43
కుంతీకుమారా! ప్రాణులన్నీ నిన్ను ప్రాణవిహితపరుడవని తెలుసుకున్నాయి. నీవు సోదరులతో కలిసి భయంలేకుండా ఈ కొండశిఖరంలో నివసించు. (43)
న చ మన్యుస్త్వయా కార్యః భీమసేనస్య పాండవ ।
కాలేనైతే హతాః పూర్వం నిమిత్తమనుజస్తవ ॥ 44
పాండవా! భీమసేనుడి విషయంలో కోపగించకు. పూర్వమే వీళ్ళు మృత్యువు చేత చంపబడ్డారు. నీ తమ్ముడు నిమిత్తమాత్ర్రుడు. (44)
వ్రీడా చాత్ర న కర్తవ్యా సాహసం యదిదం కృతమ్ ।
దృష్టశ్చాపి సురైః ఫూర్వం వినాశో యక్షరక్షసామ్ ॥ 45
నీ తమ్ముడు చేసిన ఈ దుస్సాహసానికి సిగ్గు చెందకు. యక్షరాక్షసుల వినాశనాన్ని దేవతలు ముందే చూశారు. (45)
న భీమసేనే కోపో మే ప్రీతోఽస్మి భరతర్షభ ।
కర్మణా భీమసేనస్య మమ తుష్టిరభుత్ పురా ॥ 46
భరతవంశశ్రేష్ఠుడా! భీమసేనుడి విషయంలో నాకు కోపంలేదు. ప్రసన్నడనయ్యాను. భీమసేనుడి పనికి ఇంతకుముందే నాకు సంతోషం కలిగింది. (46)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వాతు రాజానం భీమసేనమభాషత ।
నైతన్మనసి మే తాత వర్తతే కురుసత్తమ ॥ 47
యదిదం సాహసం భీమ కృష్ణార్థే కృతవానసి ।
మామనాదృత్య దేవాంశ్చ వినాశం యక్షరక్షసామ్ ॥ 48
స్వబాహుబలమాశ్రిత్య తేనాహం ప్రీతిమాంస్త్వయి ।
శాపాదద్య వినిర్ముక్తః ఘోరాదస్మి వృకోదర ॥ 49
వైశంపాయనుడంటున్నాడు - ఇలా రాజుతో పలికి భీమసేనుడితో కురుశ్రేష్ఠా! ఇదంతా నా మనసులో లేదు అన్నాడు. భీముడా! ద్రౌపది కోసం నన్ను, దేవతల్ని లెక్కచెయ్యకుండా నీ బాహుబలంతో యక్షరాక్షసుల్ని నశింపచేసే సాహసమేదైతే చేశావో దానికి నేను నీపట్ల ప్రీతిచెందాను. వృకోదరా! నేటితో ఘోరమైన శాపం నుండి విముక్తుడనయ్యాను. (47-49)
అహం పూర్వమగస్త్యేన క్రుద్ధేన పరమర్షిణా ।
శప్తోఽపరాధే కస్మింశ్చిత్ తస్యైషా నిస్కృతిః కృతా ॥ 50
దృష్టో హి మమ సంక్లేశః పురా పాండవనందన ।
న తవాత్రాపరాధోఽస్తి కథంచిదపి పాండవ ॥ 51
ఒక అపరాధం వల్ల నేను పూర్వం కోపగించిన అగస్త్యునిచేత శపించబడ్డాను. దానికి పరిహారంగా ఇది జరిగింది. పాండవా! పూర్వమే నాకీ కష్టం కనబడింది. ఇందులో నీ అపరాధమెంత మాత్రమూ లేదు. (50,51)
యుధిష్ఠిర ఉవాచ
కథం శప్తోఽసి భగవన్ అగస్త్యేన మహాత్మనా ।
శ్రోతుమిచ్ఛామ్యహం దేవ తవైతచ్ఛాపకారణమ్ ॥ 52
యుధిష్ఠిరుడడిగాడు - భగవన్! మహాత్ముడైన అగస్త్యుడిచేత ఎలా శపించబడ్డావు? ప్రభూ! నీ శాపానికి కారణం నేను వినాలనుకుంటున్నాను. (52)
బుద్ధిమంతుడైన ఆ అగస్త్యుడి కోపానికి నీ సైన్యము, అనుయాయులతో ఆనాడే నీవు తగలబెట్టబడలేదు. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. (53)
ధనేశ్వర ఉవాచ
దేవతానామభూన్మంత్రః కుశవత్యాం నరేశ్వర ।
వృతస్తత్రాహమగమం మహాపద్మశతైస్త్రిభిః ॥ 54
ధనేశ్వరుడు చెప్పాడు.
రాజా! కుశవతి అనే ప్రదేశంలో దేవతలకు సమాలోచన కార్యక్రమం జరిగింది. వారి కోరికను మన్నించి నేను మూడువందల మహాపద్మ (యక్షులతో) నిధులతో వెళ్ళాను. (54)
యక్షాణాం ఘోరరూపాణాం వివిధాయుధదారిణామ్ ।
అధ్వన్యహమథాపశ్యమ్ అగస్త్యమృషిసత్తమమ్ ॥ 55
ఉగ్రం తపస్తప్యమానం యమునాతీరమాశ్రితమ్ ।
నానాపక్షిగణాకీర్ణం పుష్పితద్రుమశోభితమ్ ॥ 56
భయంకరమైన ఆకారాలతో, అనేకరకాలైన ఆయుధాలను ధరించిన యక్షుల మార్గంలో నేను ఋషిశ్రేష్ఠుడైన అగస్త్యుని చూశాను. అనేకరకాల పక్షుల సమూహాలతో పూసిన చెట్లతో అలరారే యమునానది ఒడ్డున చేరి కఠినమైన తపస్సు చేస్తున్నాడు అగస్త్యుడు. (55,56)
తమూర్ధ్వబాహుం దృష్ట్వైవ సుర్యస్యాభిముఖే స్థితమ్ ।
తేజోరాశిం దీప్యమానం హుతాశనమివైధితమ్ ॥ 57
వ్రేల్చబడిన అగ్నిలా వెలుగిందుతున్న కాంతిముద్ద అతడు, సూర్యుడికెదురుగా చేతులెత్తి నిలుచున్న అతణ్ణి చూస్తూనే... (57)
రాక్షసాధిపతిః శ్రీమాన్ మణిమాన్నామ మే సఖా ।
మౌర్ఖ్యాదజ్ఞానభావాచ్చ దర్పాన్మోహాచ్చ పార్థివ ॥ 58
న్యష్ఠీవదాకాశగతో మహర్షేస్తస్య మూర్థని ।
స కోపాన్మామువాచేదం దిశః సర్వా దహన్నివ ॥ 59
శ్రీమంతుడు, రాక్షసరాజు, నా స్నేహితుడు అయిన మణిమంతుడు, మూర్ఖత్వం, అజ్ఞానం, గర్వం, మోహములచేత ఆకాశంలో ఉండి ఆ మహర్షి తలపై ఉమ్మివేశాడు. ఆ మహర్షి కోపగించి పది దిక్కులూ తగులబెడుతున్నట్లుండి నాతో ఇలా అన్నాడు. (58,59)
మామవజ్ఞాయ దుష్టాత్మా యస్మాదేష సఖా తవ ।
ధర్షణాం కృతవానేతం పశ్యతస్తే ధనేశ్వర ॥ 60
తస్మాత్ సహైభిః సైన్యైస్తే వధం ప్రాప్స్యతి మానుషాత్ ।
త్వం చాప్యేభిర్హతైః సైన్యైః క్లేశం ప్రాప్యేహ దుర్మతిః ।
తమేవ మానుషం దృష్ట్వా కిల్బిషాద్ విప్రమోక్ష్యసే ॥ 61
ధనేశ్వరా! నీవు చూస్తుండగానే నీమిత్రుడైన దుష్టబుద్ధి నన్నవమానించి తిరస్కారాన్ని ప్రదర్శించాడు. కాబట్టి ఈ సైన్యాలన్నింటితో మానవుడి నుండి చావును పొందుతాడు. నీవు కూడా చంపబడ్డ ఈ సైన్యాలవల్ల మనసు వికలమై ఆ మానవుని చూసి పాపవిముక్తుడవుతాడు. (60,61)
సైన్యానాం తు తవైతేషాం పుత్రపౌత్రబలాన్వితమ్ ।
న శాపం ప్రాప్యతే ఘోరం తత్ తవాజ్ఞం కరిష్యతి ॥ 62
నీ ఆజ్ఞను పాలించే ఈ సైన్యాల పుత్రపౌత్రబలగాలకు ఈ ఘోరమైన శాపం తగులదు. (62)
వి॥సం॥ ఒకరి తప్పువలన పుత్రపౌత్రులు, బలం, సైన్యం అందరూ శపింపబడటం వలన ఇది ఘోరశాపం. (నీల)
ఏష శాపో మయా ప్రాప్తః ప్రాక్ తస్మాదృషిసత్తమాత్ ।
స భీమేన మహారాజ భ్రాత్రా తవ విమోక్షితః ॥ 63
ఆ ఋషిశ్రేష్ఠుడివల్ల నాడు ఈశాపం నేను పొందాను. మహారాజా! నీ సోదరుడు భీముడిచేత శాపం నుండి విడుదలయ్యాను. (63)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి యక్షయుద్ధపర్వణి కుబేరదర్శనే ఏకషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 161 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున యక్షయుద్ధపర్వమను ఉపపర్వమున కుబేరదర్శనమను నూట అరువది ఒకటవ అధ్యాయము. (161)