160. నూట అరువదియవ అధ్యాయము
పాండవులు అర్ష్టిషేణుని ఆశ్రమమున వసించుట - మణిమంతుని వధ.
జనమేజయ ఉవాచ
ఆర్ ష్టిషేణాశ్రమే తస్మిన్ మమ పూర్వపితామహాః ।
పాండోః పుత్రా మహాత్మానః సర్వే దివ్యపరాక్రమాః ॥ 1
కియంతం కాలమవసన్ పర్వతే గంధమాదనే ।
కిం చ చక్రుర్మహావీర్యాః సర్వేఽతిబలపౌరుషాః ॥ 2
మహాత్ములు, దివ్యాపరాక్రమం గల నా ముత్తాతలైన పాండవులందరూ ఆ ఆర్ ష్టిషేణుని ఆశ్రమంలో ఎంతకాలమున్నారు? వారంతా చాలా బలపౌరుషాలు కలవారు. గంధమాదన పర్వతం మీద ఏం చేశారు? (1,2)
కాని చాభ్యవహార్యాణి తత్ర తేషాం మహాత్మనామ్ ।
వసతాం లోకవీరాణామ్ ఆసంస్తద్ బ్రూహి సత్తమ ॥ 3
లోకైకవీరులయిన ఆ మహాత్ములకక్కడ నివసించేటప్పుడు ఆహారమేమిటో చెప్పు. (3)
విస్తరేణ చ మే శంస భీమసేనపరాక్రమమ్ ।
యద్ యచ్చక్రే మహాబాహుస్తస్మిన్ హైమవతే గిరౌ ॥ 4
ఆ హిమాలయపర్వతం మీద మహాబాహువైన భీమసేనుడు తన పరాక్రమంతో ఏమేం చేశాడో నాకు విపులంగా చెప్పు. (4)
న ఖల్వాసీత్ పునర్యుద్ధం తస్య యక్షైర్ద్విజోత్తమ ।
కచ్చిత్ సమాగమస్తేషామ్ ఆసీద్ వైశ్రవణస్య చ ॥ 5
ద్విజశ్రేష్ఠా! అతనికి యక్షులతో మళ్ళి యుద్ధం జరిగిందా? ఆ పాండవులు కుబేరుని కలిశారా? (5)
తత్ర హ్యాయాతి ధనదః ఆర్ ష్టిషేణో యథాబ్రవీత్ ।
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ తపోధన ॥ 6
ఆర్ ష్టిషేణుడు చెప్పినట్లు కుబేరుడక్కడికి వస్తూంటాడు గద. తపోధనా! ఇదంతా వివరంగా నాకు వినాలనుకుంది. (6)
న హి మే శృణ్వతస్తృప్తిః అస్తి తేషాం విచేష్టితమ్ ।
ఆ పాండవుల చరిత్ర వింటున్న నాకు తృప్తి కలగటం లేదు. (6 1/2)
వైశంపాయన ఉవాచ
ఏతదాత్మహితం శ్రుత్వా తస్యాప్రతిమతేజసః ॥ 7
శాసనం సతతం చక్రుస్తథైవ భరతర్షభాః ।
వైశంపాయనుడు చెపుతున్నాడు.
సాటిలేని తేజస్సు గల ఆ ఆర్ ష్టిషేణుడు తమ మేలుకోరి చెప్పినది విని పాండవులు అలాగే చేశారు. (7 1/2)
భుంజానా మునిభోజ్యాని రసవంతి ఫలాని చ ॥ 8
మేధ్యాని హిమవత్పృష్ఠే మధూని వివిధాని చ ।
ఏవం తే న్యవసంస్తత్ర పాండవా భరతర్షభాః ॥ 9
పాండవులు మునులకాహారమైన రసపూర్ణములైన తియ్యని శుచియైన పండ్లను తింటూ హిమాలయం మీద పాండవులు నివసించారు. (9)
తథా నివసతాం తేషాం పంచమం వర్షమభ్యగాత్ ।
శృణ్వతాం లోమశోక్తాని వాక్యాని వివిధాన్యుత ॥ 10
అలా నివసిస్తూ లోమశమహర్షి చెప్పే అనేకరకాలైన వాక్యాలను వింటూ గడుపుతున్నవారికి అయుదో యేడు గడిచింది. (10)
కృత్యకాల ఉపస్థాస్యే ఇతి చోక్త్వా ఘటోత్కచః ।
రాక్షసైః సహ సర్వైశ్చ పూర్వమేవ గతః ప్రభో ॥ 11
ప్రభూ! నా అవసరమున్న వేళ వస్తాను-అంటూ ఘటోత్కచుడు రాక్షసులందరితో కలిసి ముందే వెళ్ళిపోయాడు. (11)
ఆర్ ష్టిషేణాశ్రమే తేషాం వసతాం వై మహాత్మనామ్ ।
అగచ్ఛన్ బహవో మాసాః పశ్యతాం మహదద్భుతమ్ ॥ 12
ఆర్ ష్టిషేణాశ్రమంలో ఉంటూ గొప్ప అద్భుత దృశ్యాలను చూస్తున్న ఆ మహాత్ములకు చాలా మాసాలు గడిచాయి. (12)
తైస్తత్ర విహరద్భిశ్చ రమమాణైశ్చ పాండవైః ।
ప్రీతిమంతో మహాభాగాః మునయశ్చారణాస్తథా ॥ 13
అక్కడ విహరిస్తూ ఆనందిస్తున్న పాండవుల పట్ల ప్రీతితో మహాత్ములైన మునులు, చారణులు ప్రవర్తించేవారు. (13)
ఆజగ్ముః పాండవాన్ ద్రష్టుం శుద్ధాత్మానో యతవ్రతాః ।
తే తైః సహ కథాం చక్రుః దివ్యాం భరతసత్తమాః ॥ 14
పరిశుద్ధమైన మనసులు, నియమాలు కలవారు. పాండవులను చూశారు. పాండవులు వారితో దివ్యకథాగోష్ఠి చేశారు. (14)
తతః కతిపయాహస్య మహాహ్రదనివాసినమ్ ।
ఋద్ధిమంతం మహానాగం సుపర్ణః సహసాఽఽహరత్ ॥ 15
కొన్నిరోజులు గడిచిన తరువాత ఒక పెద్దనీళ్ళ మడుగులో ఉన్న ఋద్ధిమంతుడనే పెద్దపామును గరుత్మంతుడు చటుక్కున పట్టుకున్నాడు. (15)
ప్రాకంపత మహాశైలః ప్రామృద్యంత మహాద్రుమాః ।
దదృశుః సర్వభూతాని పాండవాశ్చ తదద్భుతమ్ ॥ 16
అపుడు ఆ కొండ కంపించింది. పెద్దపెద్ద చెట్లు నేలకూలాయి. అక్కడి ప్రాణులూ, పాండవులూ అంతా ఆ అద్భుతాన్ని చూశారు. (16)
తతః శైలోత్తమస్యాగ్రాత్ పాండవాన్ ప్రతి మారుతః ।
అవహత్ సర్వమాల్యాని గంధవంతి శుభాని చ ॥ 17
తరువాత ఆ కొండపై భాగం నుండి పవిత్రములు, పరిమళయుక్తములైన పూలసమూహాలను పాండవుల వైపు వాయుదేవుడు మోసుకొచ్చాడు. (17)
తత్ర పుష్పాణి దివ్యాని సుహృద్భిః సహ పాండవాః ।
దదృశుః పంచవర్ణాని ద్రౌపదీ చ యశస్వినీ ॥ 18
స్నేహితులతో కూడిన పాండవులు, యశస్విని అయిన ద్రౌపది అక్కడ ఐదురంగుల దివ్యపుష్పాలను చూశారు. (18)
భీమసేనం తతః కృష్ణా కాలే వచనమబ్రవీత్ ।
వివిక్తే పర్వతోద్దేశే సుఖాసీనం మహాభుజమ్ ॥ 19
ద్రౌపది సమయం చూసి, పర్వతం మీద ఒంటరిగా సుఖంగా కూర్చున్న మహాభుజుడైన భిమసేనునితో ఇలా అంది. (19)
సుపర్ణానిలవేగేన శ్వసనేన మహాచలాద్ ।
పంచవర్ణాని పాత్యంతే పుష్పాణి భరతర్షభ ॥ 20
ప్రత్యక్షం సర్వభూతానాం నదీమశ్వరథాం ప్రతి ।
ఖాండవే సత్యసంధేన భ్రాత్రా తవ మహాత్మనా ॥ 21
గంధర్వోరగరక్షాంసి వాసవశ్చ నివారితః ।
హతా మాయావినశ్చోగ్రాః ధనుః ప్రాప్తం చ గాండివమ్ ॥ 22
భరతవంశశ్రేష్ఠా! పర్వతం నుండి గరుత్మంతుని రెక్కల గాలిచేత ఐదురంగుల పూలు రాలుతున్నాయి. అశ్వరథానది ఒడ్డున ఖాండవవనంలో ప్రాణులంతా చూస్తుండగా మహాత్ముడు, సత్యసంధుడూ అయిన నీ సోదరుడు గంధర్వులను, ఉరగులను, రాక్షసులను, ఇంద్రుని అడ్డుకున్నాడు. భయంకరులైన మాయావులు చంపబడ్డారు. గాండివధనుస్సు పొందబడింది. (20-22)
తవాపి సుమహత్ తేజో మహద్ బాహుబలం చ తే ।
అవిషహ్యమనాధృష్యం శక్రతుల్యపరాక్రమ ॥ 23
నీవు ఇంద్రునితో సమానమైన పరాక్రమం కలవాడవు. నీ తేజస్సు, భుజబలమూ గొప్పవి. అవి ఇతరులు ఓర్చుకో లేనివి. ఎదుర్కో లేనివి. (23)
త్వద్బాహుబలవేగేన త్రాసితాః సర్వరాక్షసాః ।
హిత్వా శైలం ప్రపద్యంతాం భీమసేన దిశో దశ ॥ 24
భీమసేనా! నీ బాహుబలవేగం చేత బెదిరిన రాక్షసులంతా ఈ పర్వతాన్ని వదలి పదిదిక్కులకూ పోదురుగాక. (24)
తతః శైలోత్తమస్యాగ్రం చిత్రమాల్యధరం శివమ్ ।
వ్యపేతభయసమ్మోహాః పశ్యంతు సుహృదస్తవ ॥ 25
ఏవం ప్రణిహితం భీమ చిరాత్ ప్రభృతి మే మనః ।
ద్రష్టుమిచ్ఛామి శైలాగ్రం త్వద్బాహుబలపాలితా ॥ 26
తరువాత ఎన్నో పూలవరుసలను ధరించి, శివస్వరూపము, ఉత్తమమూ అయిన ఈ కొండపైశిఖరాన్ని భయము, మోహము విడిచి నీ స్నేహితులు చూచుదురుగాక! భీమా! ఎప్పటినుండో నేనిలా మనసు పడుతున్నాను. నీ బాహుబలంచే రక్షించబడుతూ నేను కొండశిఖరాన్ని చూడాలని ఉంది. (25-26)
తతః క్షిప్తమివాత్మానం ద్రౌపద్యా స పరంతపః ।
నామృష్యత మహాబాహుః ప్రహారమివ సద్గవః ॥ 27
తరువాత మంచి ఎద్దు కొరడా దెబ్బను సహించలేనట్లు ద్రౌపది ఆక్షేపణను ఆ భీమసేనుడు సహించ లేకపోయాడు. (27)
సింహర్షభగతిః శ్రీమాన్ ఉదారః కనకప్రభః ।
మనస్వీ బలవాన్ దృప్తః మానీ శూరశ్చ పాండవః ॥ 28
భీముడు శ్రేష్ఠమైన సింహము వంటి నడక గలవాడు. సుందరుడు, ఉదారుడు, బంగారమువంటి కాంతి గలవాడు, అభిమానవంతుడు, బలవంతుడు, గర్వముకలవాడు, గౌరవమును కోరువాడు, శూరుడు. (28)
లోహితాక్షః పృథువ్యంసః మట్తవారణవిక్రమః ।
సింహదంష్ట్రో బృహత్స్కంధః శాలపోత ఇవోద్గతః ॥ 29
ఎర్రనికన్నులు, విశాలమైన మూపురము, మదించిన ఏనుగువంటి పరాక్రమమూ సింహము కోరలవంటి దంతములు కలవాడు, శాలవృక్షమువలె పొడవైనవాడు. (29)
మహాత్మా చారుసర్వాంగః కంబుగ్రీవో మహాభుజః ।
రుక్మపృష్ఠం ధనుః ఖడ్గం తూణాంశ్చాపి పరామృశత్ ॥ 30
గొప్ప హృదయము కలవాడు, అతని అవయవములన్నీ అందమైనవి. శంఖము వంటి మెడ పొడవైన భుజములు కలవాడు, బంగారు విల్లు, కత్తి, బాణములను స్పృశించాడు. (30)
స కేసరీవ చోత్సిక్తః ప్రభిన్న ఇవ వారణః ।
వ్యపేతభయసమ్మోహః శైలమభ్యపతద్ బలీ ॥ 31
బలవంతుడైన ఆ భీముడు మదించిన సింహమువలె, మదధారలుకారే గజరాజు వలె భయము, మోహము తొలగి కొండపైకి దూకాడు. (31)
తం మృగేంద్రమివాయాంతాం ప్రభిన్నమివ వారణమ్ ।
దదృశుః సర్వభూతాని బాణకార్ముకధారిణమ్ ॥ 32
వింటిని, బాణములను ధరించివచ్చే అతనిని మృగరాజులా, మదించిన ఏనుగులా ప్రాణులంతా చూశారు. (32)
ద్రౌపద్యా వర్ధయన్ హర్షం గదామాదాయ పాండవః ।
వ్యపేతభయసమ్మోహః శైలరాజం సమాశ్రితః ॥ 33
భీముడు ద్రౌపదికి సంతోషం పెంచుతూ, గద తీసికొని, భయమూ మోహమూ తొలగి ఆ పర్వతరాజమును చేరుకున్నాడు. (33)
న గ్లానిర్న చ కాతర్యం న వైక్లవ్యం న మత్సరః ।
కదాచిజ్జుషతే పార్థమ్ ఆత్మజం మాతరిశ్వనః ॥ 34
వాయుదేవునికుమారుడైన భీముని ఎన్నటికీ బాధగాని, పిరికితనంగాని, దిగులుకాని అసూయగాని దరిచేరవు. (34)
తదేకాయనమాసాద్య విషమం భీమదర్శనమ్ ।
బహుతాలోచ్ర్ఛయం శృంగమ్ ఆరురోహ మహాబలః ॥ 35
ఎత్తుపల్లాలతో, భయకరంగా కనిపిస్తూ, ఎన్నో తాడిచెట్లంత ఎత్తై, ఒకేదారి గల పర్వతశిఖరాన్ని మహాబలుడైన భీముడు ఎక్కాడు. (35)
సకిన్నరమహానాగమునిగంధర్వరాక్షసాన్ ।
హర్షయన్ పర్వతస్యాగ్రమ్ ఆరుహ్య స మహాబలః ॥ 36
కిన్నర, మహాబాగ, ముని, గంధర్వ, రాక్షసులను సంతోషపరుస్తూ మహాబలుడైన ఆ భీముడు పర్వతం పైభాగాన్ని చేరుకున్నాడు. (36)
తతో వైశ్రవణావాసం దదర్శ భరతర్షభః ।
కాంచనైః స్ఫాటికైశ్చైవ వేశ్మభిః సమలంకృతమ్ ॥ 37
బంగారంతో స్ఫటికాలతో నిర్మించిన భవనాలతో నిండిన కుబేర నివాసస్థానాన్ని భీముడు చూశాడు. (37)
ప్రాకారేణ పరిక్షిప్తం సౌవర్ణేన సమంతతః ।
సర్వరత్నద్యుతిమతా సర్వోద్యానవతా తథా ॥ 38
శైలాదభ్యుచ్ర్ఛయవతా చయాట్టాలకశోభినా ।
ద్వారతోరణనిర్వ్యూహధ్వజసంవాహశోభినా ॥ 39
అది బంగారుప్రాకారంతో చుట్టబడి, అన్ని రత్నాలకాంతులూ గలిగి ఉన్నది. అన్నిరకాల తోటలు గలిగియున్నది. కొండకన్న ఎత్తైన మేడల సమూహంతో
ప్రకాశిస్తోంది. ద్వారాలు, గోపురాలు, బురుజులు, పతాకాలతో శోభిల్లుతున్నది. (38,39)
విలాసినీభిరత్యర్థం నృత్యంతీభిః సమంతతః ।
వాయునా ధూయమానాభిః పతాకాభిరలంకృతమ్ ॥ 40
ఎక్కడ చూసినా నాట్యం చేస్తున్న విలాసవతులతో, గాలికి రెపరెపలాడే పతాకాలతో అలంకరించబడి యున్నది. (40)
ధనుష్కోటిమవష్టభ్య వక్రభావేన బాహునా ।
పశ్యమానః స ఖేదేన ద్రవిణాధిపతేః పురమ్ ॥ 41
వంకర తిరిగిన బాహువుతో వింటికొనను బిగించి ధనరాజైన కుబేరుని పట్టణము వంల భీముడు ఖేదంతో చూశాడు. (41)
మోదయన్ సర్వభూతాని గంధమాదనసంభవః ।
సర్వగంధవహస్తత్ర మారుతః సుసుఖో వవౌ ॥ 42
అక్కడ అన్నిప్రాణులను సంతోషపరుస్తూ గంధమాదనపర్వతం నుండి పుట్టిన గాలి సుఖంగా సువాసనాభరితమై వీచింది. (42)
చిత్రా వివిధవర్ణాభాః చిత్రమంజరిధారిణః ।
అచింత్యా వివిధాస్తత్ర ద్రుమాః పరమశోభినః ॥ 43
రత్నజాలపరిక్షిప్తం చిత్రమాల్యవిభూషితమ్ ।
రాక్షసాధిపతేః స్థానం దదృశే భరతర్షభః ॥ 44
అక్కడి చెట్లు అనేకరకాలుగా ఉన్నాయి. చాలా రంగులతో ప్రకశిస్తున్నాయి. అనేక విధాలైన పూజగుత్తులను కలిగి ఉన్నాయి. ఊహకందనంత శోభను కలిగి ఉన్నాయి. భరతవంశశ్రేష్ఠుడైన భీముడు రత్నాల సమూహంతో పొదగబడిన, అనేక విధాలైన పూలవరుసలతో అలంకరించబడిన రాక్షసరాజు నివాసాన్ని చూశాడు. (43,44)
గదాఖడ్గధనుష్పాణిః సమభిత్యక్తజీవితః ।
భీమసేనో మహాబాహుః తస్థౌ గిరిరివాచలః ॥ 45
తతః శంఖముపాధ్మాసీద్ ద్విషతాం లోమహర్షణమ్ ।
జ్యాఘోషతలశబ్దం చ కృత్వా భూతాన్యమోహయత్ ॥ 46
గదను, కత్తిని, వింటిని పట్టుకొని జీవితం కూడా త్యజించేటంత సాహసంతో మహాబాహువైన భీమసేనుడు కొండలా నిశ్చలంగా నిలబడ్డాడు. వెంటనే శత్రువులకు గగుర్పాటు కలిగేటట్లు శంఖాన్ని పూరించాడు. అల్లెత్రాటి శబ్దంతో ప్రాణులన్నీ మూర్ఛపోయేటట్లు చేశాడు. (45,46)
తతః ప్రహృష్టరోమాణః తం శబ్దమభిదుద్రువుః ।
యక్షరాక్షసగంధర్వాః పాండవస్య సమీపతః ॥ 47
మిక్కిలి గగుర్పాటును పొందిన యక్షులు, రాక్షసులు, గంధర్వులు భీముని వద్ద నుండి వచ్చిన ఆ శబ్దం వైపు పరుగుతీశారు. (47)
గదాపరిఘనిస్త్రింశశూలశక్తిపరశ్వధాః ।
ప్రగృహీతా వ్యరోచంత యక్షరాక్షసబాహుభిః ॥ 48
యక్షరాక్షసుల చేతులలో గదలు, ఇనుపకట్ల గుదియ, పెద్దకత్తి, శూలము, శక్తి, గండ్ర గొడ్డలి పరశ్వధాలు మెరిశాయి. (48)
తతః ప్రవవృతే యుద్ధం తేషాం తస్య చ భారత ।
తైః ప్రయుక్తాన్ మహామాయైః శూలశక్తిపరశ్వధాన్ ॥ 49
భల్లైర్భీమః ప్రచిచ్ఛేద భీమవేగతరైస్తతః ।
అంతరిక్షగతానాం చ భూమిష్ఠానాం చ గర్జతామ్ ॥ 50
శరైర్వివ్యాధ గాత్రాణి రాక్షసానాం మహాబలః ।
సా లోహితమహావృష్టిః అభ్యవర్షన్మహాబలమ్ ॥ 51
గదాపరిఘపాణీనాం రక్షసాం కాయసంభవాః ।
కాయేభ్యః ప్రచ్యుతా ధారా రాక్షసానాం సమంతతః ॥ 52
భరతవంశీయుడా! తరువాత అతనికీ వారికీ మధ్య యుద్ధం జరిగింది. గొప్పమాయావులైన వారు శూలము, శక్తి, గండ్రగొడ్డళ్ళను ప్రయోగించారు. భీముడు భయంకరమైన వేగం కల బల్లెములతో వాటిని ఛేదించాడు. మహాబలుడైన భీముడు భూమిమీద, ఆకాశంమీద ఉండి గర్జనలు చేస్తున్న ఆ రాక్షసులశరీరాల్ని బాణాలతో చీల్చాడు. గద, గుదియలు పట్టుకున్న రాక్షసుల శరీరం నుండీ వెలువడీ రక్తపుజడివాన మహాబలుడైన భీముని తడిపేసింది. ఆ ప్రదేశంలో అన్నిప్రక్కలా రాక్షసుల శరీరాల నుండి రక్తధారలు స్రవించాయి. (49-52)
భీమబాహుబలోత్సృష్టైః ఆయుధైర్యక్షరక్షసామ్ ।
వినికృత్తాని దృశ్యంతే శరీరాణి శిరాంసి చ ॥ 53
భీముడు బలంగా విడిచిన ఆయుధాలతో యక్షులు, రాక్షసుల శరీరాలు, తలలు తెగిపోయాయి. (53)
ప్రచ్ఛాద్యమానం రక్షోభిః పాండవం ప్రియదర్శనమ్ ।
దదృశుః సర్వభూతాని సుర్యమభ్రగణైరివ ॥ 54
మబ్బులగుంపు సూర్యుణ్ణిలాగా రాక్షసులు భీముణ్ణి కప్పివేశారు - ఆ దృశ్యం ప్రాణులన్నీ చూశాయి. (54)
స రశ్మిభిరివాదిత్యః శరైరశనిఘాతిభిః ।
సర్వానార్చ్ఛన్మహాబాహుః బలవాన్ సత్యవిక్రమః ॥ 55
మహాబాహులైన ఆ భీముడు శత్రుసంహారం చెయ్యగల బాణాలతో, సూర్యుడు కిరణాలతో కొట్టినట్లుగా అందరినీ అంతటా కొట్టాడు. (55)
అభితర్జయమానాశ్చ రువంతశ్చ మహారవాన్ ।
న మోహం భీమసేనస్య దదృశుః సర్వరాక్షసాః ॥ 56
అన్నిప్రక్కల నుండి బెదిరిస్తూ, భయంకరంగా గర్జిస్తున్న రాక్షసులంతా భీమసేనుడిలో ఎలాంటి తడబాటును చూడలేదు. (56)
యక్షా వికృతసర్వాంగాః భీమసేనభయార్దితాః ।
భీమమార్తస్వరం చక్రుః విప్రకీర్ణమహాయుధాః ॥ 57
అవయవాలన్నీ వికృతంగా ఉన్న యక్షులు భీమసేన భయంతో అటు ఇటు ఆయుధాల్ని వెదజల్లుతూ ఆర్తనాదం చేశారు. (57)
ఉత్సృజ్య తే గదాశూలాన్ అసిశక్తిపరశ్వధాన్ ।
దక్షిణాం దిశమాజగ్ముః త్రాసితా దృఢధన్వనా ॥ 58
ధనస్సు దాల్చిన భీముడికి బెదిరి వారంతా గదశూలం, కత్తి, శక్తి, గొడ్డళ్ళను విడచి దక్షిణం వైపు పారిపోయారు. (58)
తత్ర శూలగదాపాణిః వ్యూఢోరస్కో మహాభుజః ।
సఖా వైశ్రవణస్యాసీద్ మణిమాన్నామ రాక్షసః ॥ 59
అక్కడ శూలం, గదలను చేతపట్టుకుని విశాలమైన, భుజాలు గల మణిమంతుడనే కుబేరమిత్రుడైన రాక్షసుడున్నాడు. (59)
అదర్శయదధీకారం పౌరుషం చ మహాబలః ।
స తాన్ దృష్ట్వా పరావృత్తాన్ స్మయమాన ఇవాబ్రవీత్ ॥ 60
మహాబలుడైన అతడు తన అధికారాల్ని పౌరుషాన్ని చూపాడు. వెనుదిరిగిన వాళ్ళను చూసి నవ్వుతున్నట్లు ఇలా అన్నాడు. (60)
ఏకేన బహవః సంఖ్యే మానుషేణ పరాజితాః ।
ప్రాప్య వైశ్రవణావాసం కిం వక్ష్యథ ధనేశ్వరమ్ ॥ 61
యుద్ధంలో ఒక్క మనిషి చేత చాలా మంది ఓడించబడ్డారు. కుబేరుని నివాసానికి వెళ్ళి మీరు ఆ ధనరాజుతో ఏం చెప్తారు? (61)
ఏవమాభాష్య తాన్ సర్వానభ్యావర్తత రాక్షసః ।
శక్తిశూలగదాపాణిః అభ్యధావత్ స పాండవమ్ ॥ 62
ఆ రాక్షసుడిలా వారందరితో అని మళ్ళేటట్లు చేశాడు. శక్తి, శూలం, గదలను చేతబట్టి భీముడివైపు పరుగుతీశాడు. (62)
తమాపతంతం వేగేన ప్రభిన్నమివ వారణమ్ ।
వత్సదంతైస్త్రిభిః పార్శ్వే భీమసేనః సమార్దయత్ ॥ 63
మదధారలు కారుతున్న గజరాజులా వేగంగా వచ్చిపడుతున్న అతణ్ణి భీమసేనుడు వత్సదంతాలనే మూడుబాణాలతో ఒక ప్రక్క బాగా కొట్టాడు. (63)
మణిమానపి సంక్రుద్ధః ప్రగృహ్య మహతీం గదామ్ ।
ప్రాహిణోద్ భీమసేనాయ పరిగృహ్య మహాబలః ॥ 64
బాగా కోపించిన మణిమంతుడు కూడ పెద్దగద తీసుకుని, గొప్పబలం సమీకరించుకొని భీమసేనుడి పై విసిరాడు. (64)
బాగా కోపించిన మణిమంతుడు కూడ పెద్దగద తీసుకుని, గొప్పబలం సమీకరించుకొని భీమసేనుడి పై విసిరాడు. (64)
విద్యుద్రూపాం మహాఘోరామ్ ఆకాశే మహతీం గదామ్ ।
శరైర్బహుభిరభ్యార్చ్ఛద్ భీమసేనః శిలాశితైః ॥ 65
మెరుపులా ఘోరంగా ఆకాశంలోని ఆ పెద్దగదను రాతి ఒరిపిడితో పదునైన బాణాలతో భీమసేనుడు కొట్టాడు. (65)
ప్రత్యహన్యంత తే సర్వే గదామాసాద్య సాయకాః ।
న వేగం ధారయామాసుః గదావేగస్య వేగితాః ॥ 66
గదను చేరుకున్న ఆ బాణాలన్నీ విరగ్గొట్టబడ్డాయి. వేగం కలవే అయినా ఆ గదా వేగాన్ని తట్టుకోలేక పోయాయి. (66)
గదాయుద్ధసమాచారం బుద్ధ్యమానః స వీర్యవాన్ ।
వ్యంసయామాస తం తస్య ప్రహారం భీమవిక్రమః ॥ 67
బలవంతుడు, భయంకరమైన పరాక్రమం గలవాడు అయిన భీముడు గదాయుద్ధ సమాచారాన్ని తెలుసుకొని శత్రువు యొక్క ఆ దెబ్బను తగలకుండా చూశాడు. (67)
తతః శక్తిం మహాఘోరాం రుక్మదండామయస్మయీమ్ ।
తస్మిన్నేవాంతరే ధీమాన్ ప్రజహారాథ రాక్షసః ॥ 68
అమ్తలోనే తెలివైన ఆ రాక్షసుడు చాలా ఘొరమై, బంగారు పిడి కల ఇనుపశక్తిని విసిరాడు. (68)
సా భుజం భీమనిర్ర్హాదా భిత్త్వా భీమస్య దక్షిణమ్ ।
సాగ్నిజ్వాలా మహారౌద్రౌ పపాత సహసా భువి ॥ 69
మంటలతో భయంకరమైన ఆ గద భయంకర శబ్దం చేస్తూ భీముడి కుడిభుజాన్ని చీల్చుకుని వెంటనే నేలకూలింది. (69)
సోఽతివిద్ధో మహేష్వాసః శక్త్యామితపరాక్రమః ।
గదాం జగ్రాహ కౌంతేయః క్రోధపర్యాకులేక్షణః ॥ 70
రుక్మపట్టపినద్ధాం తాం శత్రూణాం భయవర్ధినీమ్ ।
ప్రగృహ్యాథ నదన్ భీమః శైక్యాం సర్వాయసీం గదామ్ ॥ 71
తరసా చాభిదుద్రావ మణిమంతం మహాబలమ్ ।
పెద్ద ధనుస్సు, అమితపరాక్రమమూ గల భీముడు బాగా గాయపడ్డాడు. కోపంతో అలజడిగా ఉన్న కళ్లతో గదను తీసుకున్నాడు.
శత్రుభయంకరమై, శత్రునాశకమై, బంగారు కట్టుతో ఉన్న ఇనుప గదను భీముడు చేతబట్టి గర్వించాడు. (70-71 1/2)
దీప్యమానం మహాశూలం ప్రగృహ్య మణిమానపి ॥ 72
ప్రాహిణోద్ భీమసేనాయ వేగేన మహతా నదన్ ।
వేగంగా మహాబలుడైన మణిమంతుడివైపు పరుగుతీశాడు. మణిమంతుడు కూడ కాంతులు చిమ్మే పెద్దశూలాన్ని తీసుకుని గర్జిస్తూ చాలా వేగంగా భీమసేనుడి పైకి వదిలాడు. (72 1/2)
భంక్త్వా శూలం గదాగ్రేణ గదాయుద్ధవిశారదః ॥ 73
అభిదుద్రావ తం హంతుం గరుత్మానివ పన్నగమ్ ।
గదాయుద్ధంలో విశారదుడైన భీముడు గద అంచుతో శూలాన్ని విరగగొట్టి గరుత్మంతుడు పామును వెంటాడినట్లు అతనిని చంపటానికి పరుగుతీశాడు. (73 1/2)
సోఽంతరిక్షమవప్లుత్య విధూయ సహసా గదామ్ ॥ 74
గదను వేగంగా త్రిప్పుతూ ఆకాశంలోకి ఎగిరాడు. (74)
ప్రచిక్షేప మహాబాహుర్వినద్య రణమూర్ధని ।
సేంద్రాశనిరివేంద్రేణ విసృష్టా వాతరంహసా ॥ 75
భీముడు యుద్ధరంగం ముంగిట గర్జించి విసిరాడు. వాయువేగంతో వస్తున్న ఆ గద ఇంద్రుడు వజ్రాయుధాన్ని విడిచినట్లుంది. (75)
హత్వా రక్షః క్షితిం ప్రాప్య కృత్యేవ నిపపాత హ ।
తం రాక్షసం భీమబలం భీమసేనేన పాతితమ్ ॥ 76
దదృశుః సర్వభూతాని సింహేనేవ గవాం పతిమ్ ।
తం ప్రేక్ష్య నిహతం భూమౌ హతశేషా నిశాచరాః ।
భీమమార్తస్వరం కృత్వా జగ్ముః ప్రాచీం దిశం ప్రతి ॥ 77
ఆ గద రాక్షసుని చమ్పి, నేలకూల్చి, కృత్యలాగా పడిపోయింది. భీమసేనుడు పడగొట్టిన ఆ రాక్షసుని - సింహం పడగొట్టిన ఎద్దులా ప్రాణులన్నీ చూశాయి. చచ్చి నేలకూలిన ఆ రాక్షసుణ్ణి చూసి చావక మిగిలిన రాక్షసులు భయంకరంగా దీనస్వరం చేస్తూ తూర్పువైపు మళ్ళారు. (76,77 1/2)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి యక్షయుద్ధపర్వణి మణిమద్వధే షష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 160 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున యక్షయుద్ధపర్వమను ఉపపర్వమున మణిమంతుని వధ అను నూట అరువదియవ అధ్యాయము. (160)