158. నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము

(యక్షయుద్ధ పర్వము)

పాండవులు ఆర్ష్టిషేణుని ఆశ్రమము చేరుట.

వైశంపాయన ఉవాచ
నిహతే రాక్షసే తస్మిన్ పునర్నారాయణాశ్రమమ్ ।
అభ్యేత్య రాజా కౌంతేయో నివాసమకరోత్ ప్రభుః ॥ 1
ఆ రాక్షసుని చంపిన తరువాత మళ్ళీ నారాయణాశ్రమానికి వచ్చి ధర్మరాజు నివసించాడు. (1)
స సమానీయ తాన్ సర్వాన్ భ్రాతౄనిత్యబ్రవీద్ వచః ।
ద్రౌపద్యా సహితాన్ కాలే సంస్మరన్ భ్రాతరం జయమ్ ॥ 2
ద్రౌపదితో సహా సొదరులందరినీ రావించి సోదరుడైన అర్జునుని గుర్తుకు తెచ్చుకుని ఇలా అన్నాడు. (2)
సమాశ్చతస్రోఽభిగతాః శివేన చరతాం వనే ।
కృతోద్దేశః స బీభత్సుః పంచమీమభితః సమామ్ ॥ 3
అడవిలో తిరుగుతున్న మనకు నాలుగేళ్ళు క్షేమంగా గడిచాయి.ఆ అర్జునుడు ఐదవయేట తిరిగివస్తానని సూచించాడు. (3)
ప్రాప్య పర్వతరాజానం శ్వేతం శిఖరిణాం వరమ్।
పుష్పితైర్ర్దుమషండైశ్చ మత్తకోకిలషట్ పదైః ॥ 4
మయూరైశ్హ్చాతకైశ్చాపి నిత్యోత్సవవిభూషితమ్ ।
వ్యాఘ్రైర్వరాహైర్మహిషైః గవయైర్హరిణైస్తథా ॥ 5
శ్వాపదైర్వ్యాలరూపైశ్చ రురుభిస్చ నిషేవితమ్ ।
ఫుల్లైః సహస్రపత్రైశ్చ శతపత్రైస్తథోత్పలైః ॥ 6
ప్రఫుల్లైః కమలైశ్చైవ తథా నీలోత్పలైరపి ।
మహాపుణ్యం పవిత్రం చ సురాసురనిషేవితమ్ ॥ 7
పర్వతశ్రేష్ఠము, పర్వతరాజు అయిన కైలాసానికి చేరాం. కైలాసశిఖరం మీద పుష్పించిన చెట్లవరుసలతో మదించిన కీకిలలతో, తుమ్మెదలతో నెమళ్లతో చాతకపక్షులతో ప్రతిరోజూ పండుగలా ఉంది. పెద్దపులులు, పందులు, దున్నపోతులు, గవయమృగాలు, లేళ్ళు, క్రూరజంతువులు, పాములు, రురుమృగాలతో నిండి ఉంది. వికసించిన వేయిరేకుల పద్మాలు నూరురేకుల పద్మాలు అలాగే కలువలూ ఉన్నాయి. పవిత్రమయిన ఆ పర్వతం దేవతలూ, రాక్షసులూ కూడ ఉన్నారు. (4-7)
తత్రాపి చ కృతోద్దేశః సమాగమదిదృక్షుభిః ।
కృతశ్చ సమయస్తేన పార్థేనామితతేజసా ॥ 8
పంచవర్షాణి వత్స్యామి విద్యార్థీతి పురా మయి ।
అపరిమితమైన తేజస్సు గల అర్జునుడు అతనిరాకను చూడగోరే మనకు సంకేతరూపమైన ప్రతిజ్ఞ చేశాడు. అస్త్రవిద్యను నేర్వటానికి ఐదుసంవత్సరములు దేవలోకంలో ఉంటానని చెప్పాడు. (8 1/2)
అత్ర గండీవధన్వానమ్ అవాప్తాస్త్రమరిందమమ్ ॥ 9
దేవలోకాదిమం లోకం ద్రక్ష్యామః పునరాగతమ్ ।
ఇత్యుక్త్వా బ్రాహ్మణాన్ సర్వానామంత్రయత పాండవః ॥ 10
అస్త్రములను పొంది (అర్జునుని) ఇక్కడ కలుసుకుంటాం. దేవలోకం నుండి ఈ లోకానికి తిరిగివచ్చిన అర్జునుని చూస్తామంటూ ధర్మరాజు బ్రాహ్మణులందరిని పిలిచాడు. (9,10)
కారణం చైవ తత్ తేషామ్ ఆచచక్షే తపస్వినామ్ ।
తానుగ్రతపసః ప్రీతాన్ కృత్వా పార్థాః ప్రదక్షిణామ్ ॥ 11
ఆ తాపసులందరికీ పిలిచిన కారణం చెప్పాడు. గొప్ప తపస్సు చేసిన వారందరికీ పాండవులు ప్రదక్షిణం చేసి సంప్రీతిని కలిగించారు. (11)
బ్రాహ్మణాస్తేఽన్వమోదంత శివేన కుశలేన చ ।
సుఖొదర్కమిమం క్లేశమ్ అచిరాద్ భరతర్షభ ॥ 12
ఆ బ్రాహ్మణులు శుభాన్ని, క్షేమాన్ని ఆశిస్తూ "భరతశ్రేష్ఠా త్వరలో ఈ కష్టం సుఖంగా పరిణమించబోతోంది" అన్నారు. (12)
క్షత్రధర్మేణ ధర్మజ్ఞ తీర్త్వా గాం పాలయిష్యసి ।
తత్ తు రాజా వచస్తేషాం ప్రతిగృహ్య తపస్వినామ్ ॥ 13
ప్రతస్థే సహ విప్రైస్తైః భ్రాతృభిశ్చ పరంతపః ।
రాక్షసైరనుయాతో వై లోమశేనాభిరక్షితః ॥ 14
క్షత్రియధర్మంతో కష్టాలన్నింటిని అధిగమించి భూమిని పాలించగలుగుతావు అన్నారు. రాజు ఆ తాపసుల మాటలను శిరస్సువంచి స్వీకరించాడు. శత్రుతాపనుడయిన ధర్మరాజు ఆ బ్రాహ్మణులతో, సోదరులతో కలసి రాక్షసులు వెంటరాగా, లోమశమహర్షి రక్షణలో ముందుకు సాగాడు. (13,14)
క్వచిత్ పద్భ్యాం తతోఽగచ్ఛద్ రాక్షసైరుహ్యతే క్వచిత్ ।
తత్ర తత్ర మహాతేజా భ్రాతృభిః సహ సువ్రతః ॥ 15
సువ్రతుడూ, తేజస్వి అయిన ధర్మరాజు సోదరులతో కలసి కొంతమేర కాలినడకన వెళ్లాడు. కొన్నిచోట్ల రాక్షసులు ఎత్తుకొని తీసుకువెళ్లారు. (15)
తతో యుధిష్ఠిరో రాజా బహూన్ క్లేశాన్ విచింతయన్ ।
సింహవ్యాఘ్రగజాకీర్ణామ్ ఉదీచీం ప్రయయౌ దిశమ్ ॥ 16
యుధిష్ఠిరమహారాజు కష్టాలను తలుచుకుంటూ, సింహాలు, పులులు, ఏనుగులతో నిండిన ఉత్తరదిక్కు వైపు వెళ్ళాడు. (16)
అవేక్షమాణః కైలాసం మైనాకం చైవ పర్వతమ్ ।
గంధమాదనపాదాంశ్చ శ్వేతం చాపి శిలోచ్చయమ్ ॥ 17
ఉపర్యుపరి శైలస్య బహ్వీశ్చ సరితః శివాః ।
పృష్ఠం హిమవతః పుణ్యం యమౌ సప్తదశేఽహని ॥ 18
కైలాసము, మైనాకపర్వతము, గంధమాదనపర్వతపాదాలు, శ్వేతపర్వతాన్ని చూస్తూ సాగాడు. హిమాలయపర్వతాల వరుస పైభాగంలో ఎన్నో పుణ్యజల ప్రవాహాలను చూస్తూ పదిహేడవనాడు పవిత్రమైన హిమాలయపు వెనుకభాగాన్ని చేరాడు. (17,18)
దదృశుః పాండవ్ రాజన్ గంధమాదనమంతికాత్ ।
పృష్ఠే హిమవతః పుణ్యే నానాద్రుమలతావృతే ॥ 19
రాజా! అనేకరకాలైన చెట్లు, తీగెలతో కూడిన పవిత్రమైన హిమాలయపు వెనుకభాగంలో ఉన్న గంధమాదనపర్వతాన్ని పాండవులు చూశారు. (19)
సలిలావర్తసంజాతైః పుష్పితైశ్చ మహీరుహైః ।
సమావృతం పుణ్యతమమ్ ఆశ్రమం వృషపర్వణః ॥ 20
తముపాగమ్య రాజర్షిం ధర్మాత్మానమరిందమాః ।
పాండవా వృషపర్వాణమ్ అవందంత గతక్లమాః ॥ 21
ఎగసి పడే నీటితుంపురులతో మిలిచి, పూలు పూసిన చెట్లతో నిండిన వృషపర్వుని పవిత్రమైన ఆశ్రమాన్ని చూశారు. ధర్మాత్ములు అయిన పాండవులు ఆ రాజర్షిని సమీపించి సేదదీరి ఆ వృషపర్వునికి నమస్కరించారు. (20,21)
అభ్యనందత్ స రాజర్షిః పుత్రవద్ భరతర్షభాన్ ।
పూజితాశ్చావసంస్తత్ర సప్తరాత్రమరిందమాః ॥ 22
ఆ రాజర్షి భరతవంశశ్రేష్ఠులైన వారిని కన్నకొడుకుల్లాగా ఆదరించాడు. శత్రుమర్దనులైన పాండవులు గౌరవంతో అక్కడ ఏడురాత్రులు నివసించారు. (22)
అష్టమేఽహని సంప్రాప్తే తమృషిం లోకవిశ్రుతమ్ ।
ఆమంత్ర్య వృషపర్వాణం ప్రస్థానం ప్రత్యరోచయన్ ॥ 23
ఎనిమిదవనాడు లోకప్రఖ్యాతుడైన ఆ ఋషి వృషపర్వుని అనుమతితో ప్రయాణం సాగించాలనుకున్నారు. (23)
ఏకైకశశ్చ తాన్ విప్రాన్ నివేద్య వృషపర్వణి ।
న్యాసభూతాన్ యథాకాలం బంధూనివ సుసత్కృతాన్ ॥ 24
పారిబర్హం చ తం శేషం పరిదాయ మహాత్మనే ।
తతస్తే యజ్ఞపాత్రాణి రత్నాన్యాభరణాని చ ॥ 25
న్యదధుః పాండవా రాజన్నాశ్రమే వృషపర్వణః ।
తగిన సమయాలలో బంధువుల్లాగా సత్కరించబడే ఆ బ్రాహ్మణులను ఒక్కొక్కరిని పరిచయం చేసి వృషపర్వుని వద్ద న్యాసంగా ఉంచారు. (తిరిగి పొందుతామని అప్పజెప్పారు.)
మహాత్ముడైన ఆ వృషపర్వుని ఆశ్రమంలో మిగిలిన సామగ్రిని, యజ్ఞపాత్రలను, రత్నములను, ఆభరణాలను దాచారు. (24-251/2)
అతీతానాగతే విద్వాన్ కుశలః సర్వధర్మవిత్ ॥ 26
అన్వశాసత్ స ధర్మజ్ఞః పుత్రవద్ భరతర్షభాన్ ।
తేఽనుజ్ఞాతా మహాత్మానః ప్రయయుర్దిశముత్తరామ్ ॥ 27
భూతభవిష్యత్తులు తెలిసి సర్వధర్మవేత్త అయిన వృషపర్వుడు పాండవులకు కన్నబిడ్డలకులాగా ధర్మం ఉపదేశించాడు. మహాత్ములైనవారు అతని అనుమతితో ఉత్తరదిక్కువైపుకు సాగారు. (26,27)
తాన్ ప్రస్థితానభ్యగచ్ఛద్ వృషపర్వా మహీపతిః ।
ఉపన్యస్య మహాతేజాః విప్రేభ్యః పాండవాంస్తదా ॥ 28
అనుసంసార్య కౌంతేయాన్ ఆశీర్భిరభినంద్య చ ।
వృషపర్వా నివవృతే పంథానముపదిశ్య చ ॥ 29
అప్పుడు రాజర్షి వృషపర్వుడు ఆ ప్రాంతాన్నెరిగిన బ్రాహ్మణులకు పాండవులనప్పచెప్పి, బయలుదేరిన వారివెంట తానూ కొంతదూరం వెళ్ళాడు. (28)
పాండవులు కొంతదూరం నడిచి, ఆశీస్సులందజేసి, మార్గాన్ని తెలియజెప్పి వృషపర్వుడు వెనుదిరిగాడు. (28-29)
నానామృగగణైర్జుష్టం కౌంతేయః సత్యవిక్రమః ।
పదాతిర్ర్భాతృభిః సార్ధం ప్రాతిష్ఠత యుధిష్ఠిరః ॥ 30
యుధిష్ఠిరుడు సోదరులతో కలసి అనేకరకాలైన జమ్తువులు గల ఆ మార్గంలో కాలినడకన ముందుకుసాగాడు. (30)
నానాద్రుమనిరోధేషు వసంతః శైలసానుషు ।
పర్వతం వివిశుః శ్వేతం చతుర్థేఽహని పాండవాః ॥ 31
మహాభ్రఘనసంకాశం సలిలోపహితం శుభమ్ ।
మణికాంచనరూప్యస్య శిలానాం చ సముచ్చయమ్ ॥ 32
(రూపం హిమవతః ప్రస్థం బహుకందరనిర్ర్ఘరమ్ ।
శిలావిభంగవికటం లతాపాదపసంకులమ్ ॥)
తే సమసాద్య పంథానం యథోక్తం వృషపర్వణా ।
అనుసస్రుర్యథోద్దేశం పశ్యంతో వివిధాన్నగాన్ ॥ 33
చెట్లతో నిండిన కొండచరియల్లో ఉంటూ పాండవులు నాలుగవనాడు శ్వేత (హిమాలయ) పర్వతాన్ని ప్రవేశించారు. గొప్పమేఘంలా ప్రకాశిస్తూ, శుభప్రదమైన జలంతో నిండిన మణులు, బంగారము, వెండి శిలలగుట్టలుగా నున్న హిమాలయాన్ని చూశారు. హిమాలయంలో ఆ అందమైన చోటు ఎన్నో గుహలతో, ప్రవాహములతో, శోభాయమానమైన రాళ్ళతో, తీగెలతో, చెట్లతో నిండి ఉంది. ఆ పాండవులు వివిధవృక్షాలను చూస్తూ తాము చేరదలచిన చోటుకు వృషపర్వుడు చెప్పిన మార్గాన కదలసాగారు. (31-33)
ఉపర్యుపరి శైలస్య గుహాః పరమదుర్గమాః ।
సుదుర్గమాంస్తే సుబహూన్ సుఖేనైవాభిచక్రముః ॥ 34
ధౌమ్యః కృష్ణా చ పార్థాశ్చ లోమశశ్చ మహానృషిః ।
అగచ్ఛన్ సహితాస్తత్ర న కశ్చిదవహీయతే ॥ 35
కొండపై భాగాన గల గుహలను దాటటం చాలా కష్టం. అలాంటి దాటలేని గుహలను వారు ఎన్నింటినో తేలికగా దాటుకుంటూ సాగారు. ధౌమ్యుడు, ద్రౌపది, పాండవులు, లోమశమహర్షి కలిసి వెనుకంజ వేయకుండా వెళ్లారు. (34-35)
తే మృగద్విజసంఘుష్టం నానాద్రుమలతాయుతమ్ ।
శాఖామృగగణైశ్చైవ సేవితం సుమనోరమమ్ ॥ 36
పుణ్యం పద్మసరోయుక్తం సపల్వలమహావనమ్ ।
ఉపతస్థుర్మహాభాగా మాల్యవంతం మహాగిరిమ్ ॥ 37
జంతువులు పక్షులతో తీగెలతో, కోతులతో నిండి మనోహరంగా ఉన్న పద్మసరస్సులతో, గుంటలతో నిండిన పవిత్రమైన మాల్యవంత మహాపర్వతాన్ని ఆ మహానుభావులు సమీపించారు. (36,37)
తతః కింపురుషావాసం సిద్ధచారణసేవితమ్ ।
దదృశుర్హృష్టరోమాణః పర్వతం గంధమాదనమ్ ॥ 38
అది కింపురుషులకు నివాసము; సిద్ధచారణులచేత సేవించబడే గంధమాదనపర్వతాన్ని గగుర్పాటుతో పాండవులు చూశారు.
విద్యాధరానుచరితం కిన్నరీభిస్తథైవ చ ।
గజసంఘసమావాసం సింహవ్యాఘ్రగణాయుతమ్ ॥ 39
విద్యాధరులు, కిన్నరస్త్రీలు సంచరించే పర్వతం అది. ఏనుగుల గుంపు, సింహాలు, పులులతో కూడినది (గంధమాదన పర్వతాన్ని చూశారు.) (39)
శరభోన్నాదసంఘుష్టం నానామృగనిషేవితమ్ ।
తే గంధమాదనవనం తన్నందనవనోపమమ్ ॥ 40
ముదితాః పాండుతనయాః మనోహృదయనందనమ్ ।
వివిశుః క్రమశో వీరాః శరణ్యం శుభకాననమ్ ॥ 41
శరభమృగనాదంతో ధ్వనిస్తూ అనేక జంతువులతో నందనవనం లాంటి ఆ గంధమాదన పర్వతాన్ని చూశారు. మనసును, హృదయాన్ని ఆనందింపచేసి ఆశ్రయాన్నిచ్చే శుభకరమైన అడవిలో వీరులైన పాండవులు సంతోషంతో వరుసగా ప్రవేశించారు. (40,41)
ద్రౌపదీసహితా వీరాః తైశ్చ విప్రైర్మహాత్మభిః ।
శృణ్వంతః ప్రీతిజననాన్ వల్గూన్ మదకలాన్ శుభాన్ ॥ 42
శ్రోత్రరమ్యాన్ సుమధురాన్ శబ్దాన్ ఖగముఖేరితాన్ ।
సర్వర్తుఫలభారాఢ్యాన్ సర్వర్తుకుసుమోజ్జ్వలాన్ ॥ 43
పశ్యంతః పాదపాంశ్చాపి ఫలభారావనామితాన్ ।
ఆమ్రానామ్రాతకాన్ భవ్యాన్ నారికేలాన్ సతిందుకాన్ ॥ 44
ముంజాతకాంస్తథాంజీరాన్ దాడిమాన్ బీజపూరకాన్ ।
పనసాన్ లకుచాన్ మోచాన్ ఖర్జూరానమ్లవేతసాన్ ॥ 45
పారావతాంస్తథా క్షౌద్రాన్ నీపాంశ్చాపి మనోరమాన్ ।
బిల్వాన్ కపిత్థాన్ జంబూంశ్చ కాశ్మరీర్బదరీస్తథా ॥ 46
ప్లక్షానుదుంబరవటాన్ అశ్వత్థాన్ క్షీరికాంస్తథా ।
భల్లాతకానామలకీః హరీతకబిభీతకాన్ ॥ 47
ఇంగుదాన్ కరమర్దాంశ్చ తిందుకాంశ్చ మహాఫలాన్ ।
ఏతానన్యాంశ్చ వివిధాన్ గంధమాదనసానుషు ॥ 48
ఫలైరమృతకల్పైస్తాన్ ఆచితాన్ స్వాదుభిస్తరూన్ ।
తథైవ చంపకాశోకాన్ కేతకాన్ వకులాంస్తథా ॥ 49
పున్నాగాన్ సప్తపర్ణాంశ్చ కర్ణికారాన్ సకేతకాన్ ।
పాటలాన్ కుటజాన్ రమ్యాన్ మందారేందీవరాంస్తథా ॥ 50
పారిజాతాన్ కోవిదారాన్ దేవదారుద్రుమాంస్తథా ।
శాలాంస్తాలాంస్తమాలాంశ్చ పిప్పలాన్ హింగుకాంస్తథా ॥ 51
శాల్మలీః కింశుకాశోకాన్ శింశపాః సరలాంస్తథా ।
ద్రౌపదితో కూడిన ఆ వీరులు మహాత్ములైన ఆ బ్రాహ్మణులతో సంతోషప్రదమైన మంగళా ధ్వనులను వింటూ ప్రవేశించారు. పక్షులు వెలువరించే మధురమైన శబ్దాలను వింటున్నారు. ఆ అడవి అన్ని ఋతువులలో లభించే పండ్లతో నిండుగా ఉన్నది. అన్ని ఋతువుల్లో పూసే పూలతో ప్రకాశిస్తోంది. పండ్లబరువుతో వంగిన మామిడి, అంబాళ, కొబ్బరి, తుమికి చెట్లను చూస్తూ కదిలారు. ముంజాతక, జీర, దానిమ్మ, మాదీఫల, పనస, గజనిమ్మ, మునగ, ఖర్జూర, అమ్ల, ప్రబలి చెట్లను చూస్తూ కదిలారు. పారావత, క్షౌద్ర, కడిమి, మారేడు, నేరేడు, గుమ్మడి రేగు చెట్లను చూస్తూ సాగారు. జువ్వి, మేడి, మర్రి, రావి, పాల, భల్లాతక, ఉసిరి, కరక, విభీతక చెట్లను చూస్తూ సాగారు. గార, కలివె చెట్లను, తుమికి మొదలగునవి ఇతర వృక్షాలను గంధమాదన చరియలందు చూస్తూ సాగారు. అమృతము వంటి రుచికరములైన పండ్లతో అల్లుకొని ఉన్న ఆ చెట్లను చూస్తూ అలాగే సంపంగి, అశోక, మొగలి, కొడిసె, మందార, నల్లకలువ పూలచెట్లను, పారిజాత, ఎర్రకాంచనము, దేవదారుచెట్లను, శాల, మద్ది, చీకటి, పిప్పల, హింగుక చెట్లను చూస్తూ సాగారు. బూరుగ, మోదుగ, అశోక, ఇరుగుడు, సరళచెట్లను చూస్తూ సాగారు. (42-51 1/2)
చకోరైః శతపత్రైశ్చ భృంగరాజైస్తథా శుకైః ॥ 52
కీకిలైః కలవింకైశ్చ హారితైర్జీవజీవికైః ।
ప్రియకైశ్చాతకైశ్చైవ తథాన్యైర్వివిధైః ఖగైః ॥ 53
శ్రోత్రరమ్యం సుమధురం కూజద్భిశ్చాత్యధిష్ఠితాన్ ।
సరాంసి చ మనోజ్ఞాని సమంతాజ్జలచారిభిః ॥ 54
కుముదైః పుండరీకైశ్చ తథా కోకనదోత్పలైః ।
కహ్లారైః కమలైశ్చైవ ఆచితాని సమంతతః ॥ 55
కాదంబైశ్చక్రవాకైశ్చ కురరైర్జలకుక్కుటైః ।
కారండవైః ప్లవైర్హంసైః బకైర్మద్గుభిరేవ చ ॥ 56
ఏతైశ్చాన్యైశ్చ కీర్ణాని సమంతాజ్జలచారిభిః ।
హృష్టైస్తథా తామరసరసాసవమదాలసైః ॥ 57
వెన్నెమపులుగులు, బెగ్గురు పులుగు, భృంగరాజ, శుక కోకిల, పిచ్చుక, పచ్చపిట్ట, వన్నెపులుగు, ప్రియక, చాతకపక్షులు అలాగే అనేకరకాలైన పక్షుల వీనుల విందైన తియ్యని కూతలతోనున్న చెట్లను, చేపలతో నిండి మనోహరమైన సరస్సులను చూశారు. ఆ సరస్సులలో కలువలు, తెల్లతామరలు, ఎర్ర తామరలు, నల్ల కలువలు, ఎర్రకలువలు అల్లుకొన్నాయి. ధూమ్రవర్ణములయిన ముక్కు, కాళ్ళు గల హంసలు, కొంగలు, మద్గువులు అందులో ఉన్నాయి. ఇంకా ఇతరములైన నీటిపక్షులు తామరలందలి మకరందం త్రాగి మత్తెక్కి సంతోషంతో ఉన్నాయి. (52-57)
పద్మోదరచ్యుతరజః కింజల్కారుణరంజితైః ।
మంజుస్వరైర్మధుకరైః విరుతాన్ కమలాకరాన్ ॥ 58
పద్మములలోపలి భాగముల నుండి జారిన పుప్పొడి, కేసరముల ఎర్రదనముచే ఎర్రబారిన; శ్రావ్యమైన ధ్వనులు చేసే తిమ్మెదలతోకూడిన సరస్సులను చూశారు. (58)
అపశ్యంస్తే నరవ్యాఘ్రాః గంధమాదనసానుషు ।
తథైవ పద్మషండైశ్చ మండితాంశ్చ సమంతతః ॥ 59
పద్మసమూహములతో అంతటా అలంకరింపబడిన కొలనులను గంధమాదనపర్వత సానువులందు ఆ నరశ్రేష్ఠులు చూశారు. (59)
శిఖండినీభిః సహితాన్ లతామండలకేషు చ ।
మేఘతూర్యరవోద్దామమదనాకులితాన్ భృశమ్ ॥ 60
కృత్వైవ కేకామధురం సంగీతం మధురస్వరమ్ ।
చిత్రాన్ కలాపాన్ విస్తీర్య సవిలాసాన్ మదాలసాన్ ॥ 61
మయూరాన్ దదృశుర్హృష్టాన్ నృత్యతో వనలాలసాన్ ।
కాంశ్చిత ప్రియాభిః సహితాన్ రమమాణాన్ కలాపినః ॥ 62
వల్లీలతాసంకటేషు కుటజేషు స్థితాంస్తథా ।
కాంశ్చిచ్చ కుటజానాం తు విటపేఘాత్కటానివ ॥ 63
కలాపరుచిరాటోపనిచితాన్ ముకుటానివ ।
వివరేషు తరూణాం చ రుచిరాన్ దదృశుశ్చ తే ॥ 64
ఆ పొదరిళ్లతో నెమళ్లు విహరిస్తున్నాయి. అవిక్రీడిస్తున్నపుడు మేఘగర్జనం వినపడింది. దానితో అవి ఎంతో వ్యాకులములయ్యాయి. చిత్రములైన ఫింఛాలు విప్పుకొని మధురంగా కేకారవాలు చేస్తున్నాయి. అలా నాట్యం చేసే నెమళ్లను చూశారు పాండవులు. కొన్ని నెమళ్లు తమ ప్రియసఖులతో క్రీడిస్తున్నాయి. కొన్ని చిగురుటాకుల పొదరిళ్లలోను, కొన్ని పైభాగం మీద నృత్యాలు చేస్తున్నాయి. చెట్లమీద కిరీటాల వలె ఉండి కొన్ని - మరికొన్ని చెట్ల తొఱ్ఱలలో ఉండి నాట్యం చేస్తున్నాయి. (60-64)
సింధువారాంస్తథోదారాన్ మన్మథస్యేవ తోమరాన్ ।
సువర్ణవర్ణకుసుమాన్ గిరీణాం శిఖరేషు చ ॥ 65
కొండ శిఖరాల మీద మన్మథబాణాలవలె ప్రకాశించే
బంగారువన్నె సింధువారపుష్పాలను పాండవులు చూశారు. (65)
కర్ణికారాన్ వికసితాన్ కర్ణపూరానివోత్తమాన్ ।
తథాపశ్యన్ కురవకాన్ వనరాజిషు పుష్పితాన్ ॥ 66
కామవశ్యౌత్సుక్యకరాన్ కామస్యేవ శరోత్కరాన్ ।
తథైవ వనరాజీనామ్ ఉదారాన్ రచితానివ ॥ 67
విరాజమానాంస్తేఽపశ్యన్ తిలకాంస్తిలకానివ ।
తథానంగశరాకారాన్ సహకారాన్ మనోరమాన్ ॥ 68
అపశ్యన్ భ్రమరారావాన్ మంజరీభిర్విరాజితాన్ ।
హిరణ్యసదృశైః పుష్పైః దావాగ్నిసదృశైరపి ॥ 69
లోహితైరంజనాభైశ్చ వైదూర్యసదృశైరపి ।
అతీవ వృక్షా రాజంతే పుష్పితాః శైలసానుషు ॥ 70
ఆ వనాల్లో పాండవులు చక్కన్లి చెవికమ్మలవలె ఉన్న కొండగోగుపూలను, ఎర్రని ముళ్లగోరింటపూలను దర్శించారు. ఆ చెట్లు బారులు తీరి ఉన్నాయి. అవి కామోత్సాహాన్ని కలిగించే మన్మథ బాణాల వలె ఉన్నాయి. తిలకం దిద్దినట్లున్న తిలకవృక్షాలను, మన్మథబాణాలవంటి గున్నమామిడి చెట్లనూ చూశారు. దావాగ్నిలా ప్రకాశించే పుష్పాల మీద కూడ తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ వ్రాలుతున్నాయి. ఆ కొండ చరియల్లో కొన్నివృక్షాలు ఎఱ్ఱగా ఉన్నాయి. కొన్ని కాటుకలా నల్లగా ఉన్నాయి. కొన్ని వైడూర్యాల వలె పుష్పాలతో శోభిస్తున్నాయి. (66-70)
తథా శాలాంస్తమాలాంశ్చ పాటలాన్ వకులానపి ।
మాలా ఇవ సమాసక్తాః శైలానాం శికరేషు చ ॥ 71
ఆ కొండశిఖరాల మీద మద్దిచెట్లు, కానుగచెట్లు, పాటలాలు, పొగడలు, బారులుగా తీర్చిదిద్దినట్లు ఉన్నాయి. (71)
విమలస్ఫాటికాభాని పాండురచ్ఛదనైర్ద్విజైః ।
కలహంసైరుపేతాని సారసాభిరుతాని చ ॥ 72
సరాంసి బహుశః పార్థాః పశ్యంతః శైలసానుషు ।
పద్మోత్పలవిమిశ్రాణి సుఖశీతజలాని చ ॥ 73
స్వచ్ఛమైన స్ఫటికాల్లాగా తెల్లని రెక్కలు గల పక్షులతో, కలహంసలతో కూడి బెగ్గురు పక్షుల ధ్వనులతోనున్న తామరలు, కలువల కలబోతగా నుండి, సుఖానిచ్చే చల్లని నీళ్ళు గల సరస్సులను కొండచరియలందంతటా పాండవులు చూస్తూ సాగారు. (72,73)
ఏవం క్రమేణ తే వీరా వీక్షమాణాః సమంతతః ।
గంధవంత్యథ మాల్యాని రసవంతి ఫలాని చ ॥ 74
సరాంసి చ మనోజ్ఞాని వృక్షాంశ్చాతిమనోరమాన్ ।
వివిశుః పాండవాః సర్వే విస్మయోత్ఫుల్లలోచనాః ॥ 75
క్రమంగా ఇలా ఆ వీరులు చుట్టూ చూస్తూ సుగంధం వెదజల్లే పూలవరుసలను, రసముతో నిండుగానున్న పండ్లును, మనసుకు హత్తుకొనే కొలనులను మనోహరమైన చెట్లను ఆశ్చర్యంతో పెద్దపెద్ద కళ్ళతో చూస్తూ పాండవులంతా ప్రవేశించారు. (74,75)
కమలోత్పలకహ్లారపుండరీకసుగంధినా ।
సేవ్యమానా వనే తస్మిన్ సుఖస్పర్శేన వాయునా ॥ 76
తామర, కలువ, ఎర్రకలువ, తెల్లతామరల పరిమళంతో, హాయినిస్తూ గాలి తాకుతోంది. (76)
తతో యుధిష్ఠిరో భీమమాహేదం ప్రీతిమద్ వచః ।
అహో శ్రీమదిదం భీమ గంధమాదనకాననమ్ ॥ 77
తరువాత యుధిష్ఠిరుడు భీమసేనా! ఈ గంధమాదనపర్వతపుటడవి శోభాయమానంగా ఉంది అని ప్రీతిపూర్ర్వకంగా భీమునితో పలికాడు. (77)
వనే హ్యస్మిన్ మనోరమ్యే దివ్యాః కాననజా ద్రుమాః ।
లతాశ్చ వివిధాకారాః పత్రపుష్పఫలోపగాః ॥ 78
మనసుకు ఆనందాన్నిచ్చే ఈ అడవిలో దేవతావృక్షములు, అనేకరకాలుగా ఉన్న తీగెలు, ఆకులు, పూలు, పండ్లు ఉన్నాయి. (78)
భాంత్యేతే పుష్పవికచాః పుంస్కోకిలకులాకులాః ।
నాత్ర కంటకినః కేచిన్న చ విద్యంత్యపుష్పితాః ॥ 79
ఈ చెట్లు పూలతో నిండి ఉన్నాయి. కోయిలగుంపులతో కిక్కిరిసి ఉన్నాయి. ముళ్ళచెట్లే లేవు. పూలు పూయనివే లేవు. (79)
స్నిగ్ధపత్రఫలా వృక్షాః గంధమాదనసానుషు ।
భ్రమరారావమధురా నలినీః ఫుల్లపంకజాః ॥ 80
గంధమాదనచరియలందున్న చెట్లు నిగారింపుగల ఆకులు, పండ్లతో ఉన్నాయి. మధురంగా తుమ్మెదలు రొదచేస్తున్నాయి. కొలనుల్లో తామరలు బాగా వికసించాయి. (80)
విలోడ్యమానాః పశ్యేమాః కరిభిః సకరేణుభిః ।
పశ్యేమాం నలినీం చాన్యాం కమలోత్పలమాలినీమ్ ॥ 81
స్రగ్ధరాం విగ్రహవతీం సాక్షాచ్ర్ఛియమివాపరామ్ ।
నానాకుసుమగంధాఢ్యాః తస్యేమాః కాననోత్తమే ॥ 82
ఉపగీయమానా భ్రమరైః రాజంతే వనరాజయః ।
పశ్య భీమ శుభాన్ దేశాన్ దేవాక్రీడాన్ సమంతతః ॥ 83
ఆడ ఏనుగులతో కూడిన ఏనుగులు పద్మాలను లాగుతున్నాయి. చూశావా! తామరలు కలువల వరుసలు గల ఈ సరస్సెలా ఉందో చూడు, పూదండదాల్చి సాకత్తూ ఆకారం దాల్చిన మరియొక లక్ష్మిగా ఉంది. ఈ శ్రేష్ఠమైన అడవిలో ఈ చెట్లు అనేక పూల సువాసనలతో నిండుగా ఉన్నాయి. ఈ చెట్ల వరుసలు తుమ్మెదల గానంతో ప్రకాశిస్తున్నాయి. భీమో! చూడు. చుట్టూ దేవతలు విహరించటానికి తగిన చక్కని చోట్లెగా ఉన్నాయో, భీంఓ! మానవులకు లబీంచని మార్గాన్ని చేరుకున్నాం. (81-83)
అమానుషగతిం ప్రాప్తాః సంసిద్ధాః స్మ వృకోదర ।
లతాభిః పుష్పితాగ్రాభిః పుష్పితాః పాదపోత్తమాః ॥ 84
సంశ్లిష్టాః పార్థ శోభంతే గంధమాదనసానుషు ।
మనమిప్పుడు సిద్ధులమయ్యాం. తీగెల కొనలు పూలతో, శ్రేష్ఠములైన చెట్లు చక్కగా పూసి లతలతో పెనవేసుకుని ఈ గంధమాదనం చరియల్లోని చెట్లు ప్రకాశిస్తున్నాయి. (84 1/2)
శిఖండినీభిశ్చరతాం సహితానాం శిఖండినామ్ ॥ 85
నదతాం శృణు నిర్ఘీషం భీమ పర్వతసానుషు ।
భీమా! ఆడనెమళ్ళతో కలిసి తిరుగుతూ నెమళ్ళు చేస్తున్న ధ్వని ఈ పర్వత చరియల్లో గర్జనలా ఉంది విను. (85 1/2)
చకోరాః శతపత్రాశ్చ మత్తకోకిలసారికాః ॥ 86
పత్రిణః పుష్పితానేతాన్ సంపతంతి మహాద్రుమాన్ ।
చకోరాలు, శతపత్రాలు, మదించిన కోకిలలు, చిలుకలు మొదలైన పక్షులు విరబూసిన ఈ పెద్దచెట్లపై ఎలా వాలుతున్నాయో గదా! (86 1/2)
రక్తపీతారుణాః పార్థ పాదపాగ్రగతాః ఖగాః ॥ 87
పరస్పరముదీక్షంతే బహవో జీవజీవకాః ।
భీమా! చెట్ల పైభాగాన నున్న పక్షులు ఎర్రగా, పచ్చగా లేత ఎరుపురంగులో ఉన ఎన్నో చకోరపక్షులు ఒకదానినొకటి చూసుకుంటున్నాయి. (87 1/2)
హరితారుణవర్ణానాం శాద్వలానం సమీపతః ॥ 88
సారసాః ప్రతిదృశ్యమ్తే శైలప్రస్రవణేష్వపి ।
ఆకుపచ్చని, లేతఎరుపురంగు గల పచ్చికలవద్ద, కొండల నుండి జాలువారే జలపాతాలలో బెగ్గురుపక్షులు కనబడుతున్నాయి. (88 1/2)
వదంతి మధురా వాచః సర్వభుతమనోరమాః ॥ 89
భృంగరాజోపచ్రాశ్చ లోహపృష్ఠాః పతత్రిణః ।
ప్రాణులన్నింటి మనసులనాకర్షించే తియ్యని పలుకులను తుమ్మెదలు, చక్రవాకములు, రాబందులు పలుకుతున్నాయి. (89 1/2)
చతుర్విషాణాః పద్మాభాః కుంజరాః సకరేణవః ॥ 90
ఏతే వైదూర్యవర్ణాభం క్షోభయంతి మహత్ సరః ।
నాలుగు దంతములతో, కమలరంగుతో ప్రకాశించే ఏనుగులు ఆడ ఏనుగులతో కలసి వైడూర్యపురంగు పెద్దకొలనులో క్రీడిస్తూ ఉన్నాయి. (90 1/2)
బహుతాలసముత్సేధాః శైలశృంగపరిచ్యుతాః ॥ 91
నానాప్రస్రవణేభ్యశ్చ వారిధారాః పతంతి చ ।
ఎన్నో తాటిచెట్ల ఎత్తుగల కొండచరియల నుండి నీటిధారలు పడుతున్నాయి. (91 1/2)
భాస్కరాభాఆః ప్రభాభిశ్చ శారదాభ్రఘనోపమాః ॥ 92
శోభయంతి మహాశైలం నానారజతధాతవః ।
క్వచిదంజనవర్ణాభాః క్వచిత్ కామ్చనసన్నిభాః ॥ 93
శరత్కాలపు మేఘములవంటి సూర్యకాంతులతో అనేకరజత (వెండి) ధాతువులు ఆ కొండను ప్రకాశింపజేస్తున్నాయి. కొన్నిచోట్ల కాటుకరంగుతో, కొన్నిచోట్ల బంగారు రంగుతో ధాతువులు కనబడుతున్నాయి. (92-93)
ధాతవో హరితాలస్య క్వచిద్ధింగులకస్య చ ।
మనః శిలాగుహాశ్చైవ సంధ్యాభ్రనికరోపమాః ॥ 94
హరితాలధాతువులు కొన్నిచోట్ల, కొన్నిచోట్ల ఇంగులక ధాతువులు సంధ్యాకాలపు మేఘసమూహంలాంటి మణిశిలల గుహలు ఉన్నాయి. (94)
శశలోహితవర్ణాభాః క్వచిద్గైరికధాతవః ।
సితాసితాభ్రప్రతిమాః బాలసూర్యసమప్రభాః ॥ 95
ఎర్రకుందేలు రంగువంటి గైరిక ధాతువులు కొన్నిచోట్ల, కొన్నిధాతువులు తెల్ల మేఘాల్లాగా కొన్ని నల్లమేఘాల్లాగా లేత సూర్యునికాంతిగలవి కొన్నీ కనబడుతున్నాయి. (95)
ఏతే బహువిధాః శైలం శోభయంతి మహాప్రభాః ।
గంధర్వాః సహ కాంతాభిః యధోక్తం వృషపర్వణా ॥ 96
దృశ్యంతే శైలశృంగేషు పార్థ కింపురుషైః సహ ।
కాంతులు విరజిమ్మే ఎన్నోరకాల ఈ ధాతువులు ఈ కొండకు శోభనిస్తున్నాయి. వృషపర్వుడు చెప్పినట్లు గంధర్వులు తమ ప్రియురాండ్రతో కింపురుషులతోను కొండపై భాగాల్లో కనబడుతున్నారు. (96 1/2)
గీతానాం సమతాలానాం తథా సామ్నాం చ నిఃస్వనః ॥ 97
శ్రూయతే బహుధా భీమ సర్వభూతమనోహరః ।
మహాగంగాముదీక్షస్వ పుణ్యాం దేవనదీం శుభామ్ ॥ 98
తాళం సమానంగా ఉన్న గీతాల, సామలధ్వని ప్రాణులన్నింటిని మనసుల నాకట్టుకుంటూ తరచూ వినబడుతోంది. పరమపవిత్రము, శుభకరమూ అయిన ఈ దేవనది మహాగంగను దర్శించు. (97-98)
కలహంసగణైర్జుష్టామ్ ఋషికిన్నరసేవితామ్ ।
ధాతుభిశ్చ సరిద్భిశ్చ కిన్నరైర్మృగపక్షిభిః ॥ 99
గంధర్వైరప్సరోభిశ్చ కాననైశ్చ మనోరమైః ।
వ్యాలైశ్చ వివిధాకారైః శతశీర్షైః సమంతతః ॥ 100
ఉపేతం పశ్య కౌంతేయ శైలరాజమరిందమ ।
ఇక్కడ హంశల సమూహం నివసిస్తోంది. ఋషులు, కిన్నరులు సేవిస్తున్నారు. ధాతువులు, నదులు, కిన్నరులు, జంతువులు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, మనోహరమైన అడవులు, నూరుతలలతో ఎన్నో ఆకారాలు గల పాములతో కూడిన ఈ పర్వతరాజును శత్రుమర్దనుడవైన భీమా! చూడవయ్యా! (99-100 1/2)
వైశంపాయన ఉవాచ
తే ప్రీతమనసః శూరాః ప్రాప్తా గతిమనుత్తమామ్ ॥ 101
వైశంపాయనుడు చెపుతున్నాడు.
ఆ శూరులు సంతోషము నిండిన మనసులతో ఉత్తమమైన గమ్యస్థానాన్ని చేరుకున్నారు. (101)
నాతృప్యన్ పర్వతేంద్రస్య దర్శనేన పరంతపాః ।
ఉపేతమథ మాల్యైశ్చ ఫలవద్భిశ్చ పాదపైః ॥ 102
ఆర్ ష్టిషేణస్య రాజర్షేః ఆశ్రమం దదృశుస్తదా ।
పాండవులు ఆ పర్వతరాజ్యాన్ని దర్శించి తృప్తిపడలేదు. మాలలుగా ఉన్న పూలతో, పండ్లతో ఉన్న చెట్లు గల రాజర్షి ఆర్ ష్టిషేణుడి ఆశ్రమాన్ని చూశారు. (102 1/2)
తతస్తే తిగ్మతపసం కృశం ధమనిసంతతమ్ ।
పారగం సర్వధర్మాణామ్ ఆర్ ష్టిషేణముపాగమన్ ॥ 103
తరువాత కఠోర తపస్సుతో కృశించి, నాడులే కనబడుతూ అన్నిధర్మాల్లో పారంగతుడైన ఆర్ ష్టిషేణుని వారు చేరుకున్నారు. (103)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి యక్షయుద్ధపర్వణి గంధమాదనప్రవేశే అష్టపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 158 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున యక్షయుద్ధపర్వమను ఉపపర్వమున గంధమాదనప్రవేశమను నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము. (158)