157. నూట ఏబది యేడవ అధ్యాయము

(జటాసురవధ పర్వము)

జటాసుర వధ.

వైశంపాయన ఉవాచ
తతస్తాన్ పరివిశ్వస్తాన్ వసతస్తత్ర పాండవాన్ ।
పర్వతేంద్రే ద్విజైః సార్ధం పార్థాగమనకాంక్షయా ॥ 1
గతేషు తేషు రక్షఃసు భీమసేనాత్మజేఽపి చ ।
రహితాన్ భీమసేనేన కదాచిత్ తాన్ యదృచ్ఛయా ॥ 2
జహార ధర్మరాజానం యమౌ కృష్ణాం చ రాక్షసః ।
బ్రాహ్మణో మంత్రకుశలః సర్వశాస్త్రవిదుత్తమః ॥ 3
ఇతి బ్రువన్ పాండవేయాన్ పర్యుపాస్తే స్మ నిత్యదా ।
పరీప్సమానః పార్థానాం కలాపాని ధనూంషి చ ॥ 4
అంతరం సంపరిప్రేప్సుః ద్రౌపద్యా హరణం ప్రతి ।
దుష్టాత్మా పాపబుద్ధిః స నామ్నా ఖ్యాతో జటాసురః ॥ 5
విశంపాయనుడు చెపుతున్నాడు.
గంధమాదనపర్వతం మీద పాండవులంతా బ్రాహ్మణులతో కలిసి అర్జునుని రాకకోసం నిరీక్షిస్తున్నారు. రాక్షసులూ, ఘటోత్కచుడూ వెళ్లిపోయారు. తరువాత ఒక రోజున భీముడు లేకుండా చూసి ఒక రాక్షసుడు బ్రాహ్మణరూపంలో ధర్మరాజును, నకులసహదేవులను, ద్రౌపదిని ఎత్తుకొనిపోయాడు.
ఆ బ్రాహ్మణుడు మంత్రనిపుణడననీ, అన్ని శాస్త్రాలు తెలిసినవాడననీ చెప్పుకొని పాండవులను నిత్యమూ సేవిస్తున్నాడు. వాడు పాండవుల పరికరాలయిన ధనుస్సులూ మొదలయినవానినీ, ద్రౌపదినీ ఎత్తుకొనిపోవాలని సమయంకోసం నిరీక్షిస్తున్నాడు. వాడు దుర్మార్గుడు - పాపాత్ముడు. వాడి అసలు పేరు జటాసురుడు. (వాడే అందరినీ ఎత్తుకుపోయాడు.) (1-5)
పోషణం తస్య రాజేంద్ర చక్రే పాండవనందనః ।
బుబుధే అ చ తం పాపం భస్మచ్ఛన్నమివానలమ్ ॥ 6
ఆ విప్రుని పోషణభారమంతా ధర్మరాజే వహించేవాడు. వాడు పాపాత్ముడనీ, నివురుగప్పిన నిప్పు అనీ ధర్మరాజుకు తెలియదు. (6)
స భీమసేనే నిష్ర్కాంతే మృగయార్థమరిందమ ।
ఘటోత్కచం సానుచరం దృష్ట్వా విప్రద్రుతం దిశః ॥ 7
లోమశప్రభృతీంస్తాంస్తు మహర్షీంశ్చ సమాహితాన్ ।
స్నాతుం వినిర్గతాన్ దృష్ట్వా పుష్పార్థం చ తపోధనాన్ ॥ 8
రూపమన్యత్ సమాస్థాయ వికృతం భైరవం మహత్ ।
గృహీత్వా సర్వశస్త్రాణి ద్రౌపదీం పరిగృహ్య చ ॥ 9
ప్రాతిష్ఠత స దుష్టాత్మా త్రీన్ గృహీత్వా చ పాండవాన్ ।
సహదేవస్తు యత్నేన తతోఽపక్రమ్య పాండవః ॥ 10
విక్రమ్య కౌశికం ఖడ్గం మోక్షయిత్వా గ్రహం రిపోః ।
ఆక్రందద్ భీమసేనం వై యేన యాతో మహాబలః ॥ 11
ఒకరోజున భీముడు వేటకు వెళ్లాడు - ఘటోత్కచుడూ అనుచరులూ వెళ్లిపోయారు. లోమశుడు మొదలయిన మహర్షులంతా స్నానాలు చెయ్యడానికీ పూలు కోసుకొనడానికీ వెళ్లారు. ఆ సమయం చూసి ఈ బ్రాహ్మణరూపంలోని వాడు వికృతమైన రాక్షసరూపం దాల్చి, పాండవుల ఆయుధాలనూ, ద్రౌపదినీ, ముగ్గురు పాండవులనూ ఎత్తుకొని పారిపోయాడు.
సహదేవుడు ప్రయత్నంతో ఎలాగో తప్పించుకొని బయటపడ్డాడు. వెంటనే అతడి దగ్గరున్న ఆయుధాల్లోంచి ఒక కత్తిని లాగి, బీముడు వెళ్ళినవైపు చూసి కేకలు పెడుతూ పరుగెత్తాడు. (7-11)
తమబ్రవీద్ ధర్మరాజో హ్రియమాణో యుధిష్ఠిరః ।
ధర్మస్తే హీయతే మూఢ న తత్త్వం సమవేక్షసే ॥ 12
ధర్మరాజు జటాసురునితో మూర్ఖుడా! నీధర్మం తరిగిపోతుంది. దానిపై నీవు దృష్టిసారించటం లేదు అన్నాడు. (12)
యేఽన్యే క్వచిన్మనుష్యేషు తిర్యగ్యోనిగతాశ్చ యే ।
ధర్మం తే సమవేక్షంతే రక్షాంసి చ విశేషతః ॥ 13
మనుష్యులు, పశుపక్ష్యాది ఇతర ప్రాణులన్నీ ధర్మంపై దృష్టి నిలుపుతాయి. విశేషించి రాక్షసులు ధర్మంపై మరింత దృష్టి నిలుపుతారు. (13)
ధర్మస్య రాక్షసా మూలం ధర్మం తే విదురుత్తమమ్ ।
ఏతత్ పరీక్ష్య సర్వం త్వం సమీపే స్థాతుమర్హసి ॥ 14
దేవాశ్చ ఋషయః సిద్ధాః పితరశ్చాపి రాక్షస ।
గంధర్వోరగరక్షాంసి వయాంసి పశవస్తథా ॥ 15
తిర్యగ్యోనిగతాశ్చైవ అపి కీటపిపీలికాః ।
మనుష్యానుపజీవంతి తతస్త్వమపి జీవసి ॥ 16
రాక్షసులు ధర్మానికి మూలం. ఉత్తమమైన ధర్మం వారికి తెలుసు. ఇదంతా పరిశీలించి నివు మా దగ్గర నిలు. రాక్షసా! దేవతలు, ఋషులు, సిద్ధులు, పితృదేవతలు, గంధర్వులు, ఉరగులు, రాక్షసులు, పక్షులు, జంతువులు అలాగే పురుగులు, చీమలు మొదలైనవి మనుష్యులపై ఆధారపడి బ్రతుకుతున్నాయి. నీవు కూడ మనుష్యుల వల్లే బ్రతుకుతున్నావు. (14-16)
సమృద్ధ్యా హ్యస్య లోకస్య లోకో యుష్మాకమృధ్యతి ।
ఇమం చ లోకం శోచంతమ్ అనుశోచంతి దేవతాః ॥ 17
ఈ మనుష్యలోకం సమృద్ధిగా ఉంటే (లోటు లేనిదై ఉంటే) మీ అందరి లోకాలకు లోటుండదు. ఈ లోకం స్థితి బాధాకరమైతే దేవతలు కూడ శోకంలో మునుగుతారు. (17)
పూజ్యమానాశ్చ వర్ధంతే హవ్యకవ్యైర్యథావిధి ।
వయం రాష్ట్రస్య గోప్తారః రక్షితారశ్చ రాక్షస ॥ 18
మనుష్యుల చేత యథావిధిగా హవ్యకవ్యాలతో పూజింపబడితే దేవతలకూ వృద్ధి కలుగుతుంది. రాక్షసా! మేము రాష్ట్రపాలకులం, సంరక్షకులం కూడా. (18)
రాష్ట్రస్యారక్షమాణస్య కుతో భూతిః కుతః సుఖమ్ ।
న చ రాజావమంతవ్యో రక్షసా జాత్వనాగసి ॥ 19
రాష్ట్రం రక్షించబడకపోతే ఐశ్వర్యమెక్కడినుండి వస్తుంది? సుఖమెలా కలుగుతుంది? నిరపరాధియైన రాజును అవమానించటం రాక్షసుడికైనా తగనిపని. (19)
అణురప్యపచారశ్చ నాస్త్యస్మాకం నరాశన ।
విఘసాశాన్ యథాశక్త్యా కుర్మహే దేవతాదిషు ॥ 20
నరభక్షకా! మావైపు నుండి మీపట్ల అణువంత అపచారమైనా జరుగలేదు. దేవతలకు సమర్పించి మిగిలిన ప్రసాదరూపమైన అన్నాన్ని శక్తిమేరకు గురువులకు, బ్రాహ్మణులకు భోజనంగా అందిస్తాము. (20)
గురూంశ్చ బ్రాహ్మణాంశ్చైవ ప్రణామప్రవణాః సదా ।
ద్రోగ్ధవ్యం న చ మిత్రేషు న విశ్వస్తేషు కర్హిచిత్ ॥ 21
ఎల్లవేళలా గురువులకు, బ్రాహ్మణులకు తలవంచి నమస్కరిస్తాము. ఏ వ్యక్తీ ఎన్నడూ స్నేహితులకూ, నమ్మినవారికీ ద్రోహం చెయ్యకూడదు. (21)
యేషాం చాన్నాని భుంజీత యత్ర చ స్యాత్ ప్రతిశ్రయః ।
స త్వం ప్రతిశ్రయేఽస్మాకం పూజ్యమానః సుఖోషితః ॥ 22
ఎవరి అన్నం తిన్నామో, ఎవరి వల్ల ఆశ్రమం పొందామో వారికి ద్రోహం చెయ్యటం తగదు. నీవు మాచేత గౌరవింపబడుతూ మా ఆశ్రయంలో సుఖమ్గా ఉన్నావు. (22)
భుక్త్వా చాన్నాని దుష్ర్పజ్ఞ కథమస్మాన్ జిహీర్షసి ।
ఏవమేవ వృథాచారః వృథావృద్ధో వృథామతిః ॥ 23
దుర్ర్మార్గుడా! మా అన్నంతిని మమ్మల్నే హరించాలని నీకెట్లా అనిపించింది? బ్రాహ్మణుని వేషంలో ఆచరించినదంతా వృథా. పెద్దరికం వృథా. నీబుద్ధి కూడ వృథాయే. (23)
వృథామరణమర్హశ్చ వృథాద్య న భవిష్యసి ।
అథ చేద్ దుష్టబుద్ధిస్త్వం సర్వైర్ధర్మైర్వివర్జితః ॥ 24
ప్రదాయ శస్త్రాణ్యస్మాకం యుద్ధేన ద్రౌపదీం హర ।
అథ చేత్ త్వమవిజ్ఞానాత్ ఇదం కర్మ కరిష్యసి ॥ 25
అధర్మం చాప్యకీర్తిం చ లోకే ప్రాప్స్యసి కేవలమ్ ।
ఏతామద్య పరామృశ్య స్త్రియం రాక్షస మానుషీమ్ ॥ 26
విషమేతత్ సమాలోడ్య కుంభేన ప్రాశితం త్వయా ।
తతో యుధిష్ఠిరస్తస్య గురుకః సమపద్యత ॥ 27
ఈ పరిస్థితి వల్ల నీవు వ్యర్థంగా చావుకు చిక్కవలసి వచ్చింది. నేడు వృథాగా నీప్రాణం పోగొట్టుకోబోతున్నావు. దుష్టబుద్ధివై అన్నిధర్మాలను విడిచావు. మాకు ఆయుధాలనందించి యుద్ధంలో గెలిచి ద్రౌపదిని పట్టుకెళ్ళు. అజ్ఞానం చేత నమ్మకద్రోహం, ఎత్తుకుపోవటం లాంటివి చేశావో ఈ లోకంలో పాపాన్ని, చెడ్డపేరునూ మూటకట్టుకుంటావు. రాక్షసా! నీవిప్పుడు ఈ మానవజాతిస్త్రీని తాకి చేసిన పాపం భయంకరమైన విషం లాంటిది. కుండ ఎత్తుకుని విషం త్రాగినట్లే అయ్యింది. తరువాత యుధిష్ఠిరుడతనికి బరువెక్కాడు. (24-27)
స తు భారాభిభూతాత్మా న తథా శీఘ్రగోఽభవత్ ।
అథాబ్రవీద్ ద్రౌపదీం చ నకులం చ యుధిష్ఠిరః ॥ 28
బరువు వల్ల క్రుంగిపోతున్న ఆ జటాసురుడు వెనుకటివలె వడివడిగా వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ద్రౌపదితో, నకులునితో ఇలా అన్నాడు. (28)
మా భైష్ట రాక్షసాన్మూఢాద్ గతిరస్య మయా హృతా ।
నాతిదూరే మహాబాహుః భవితా పవనాత్మజః ॥ 29
ఈ మూర్ఖుడైన రాక్షసునికి భయపడకండి. నేను వీడి నడకను అడ్డుకున్నాను. దగ్గర్లో భీముడుండవచ్చు. (29)
అస్మిన్ ముహూర్తే సంప్రాప్తే న భవిష్యతి రాక్షసః ।
సహదేవస్తు తం దృష్ట్వా రాక్షసం మూఢచేతనమ్ ॥ 30
ఉవాచ వచనం రాజన్ కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ।
రాజన్ కిన్నామ సత్కృత్యం క్షత్రియస్యాస్త్యతోఽధికమ్ ॥ 31
యద్ యుద్ధేఽభిముఖః ప్రాణాన్ త్యజేచ్ఛత్రుం జయేత వా ।
ఏష చాస్మాన్ వయం చైనం యుద్ధ్యమానాః పరంతప ॥ 32
సూదయేమ మహాబాహో దేశకాలో హ్యయం నృప ।
క్షత్రధర్మస్య సంప్రాప్తః కాలః సత్యపరాక్రమః ॥ 33
కొద్దిసేపటిలో రాక్షసుడు ప్రాణాలతో మిగలడు. రాజా! బుద్ధి మొద్దుబారిన ఆ రాక్షసుణ్ణి చూసి సహదేవుడు కుంతికుమారుడైన యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. రాజా! క్షత్రియుడికి యుద్ధంలో శత్రువు నెదుర్కొని ప్రాణాలను విడవాలి లేదా జయించాలి. ఇంతకంటె మంచి పని ఏముంది? రాజా! మనం వీడితో యుద్ధం చేసి చంపేద్దాం. క్షత్రియధర్మాన్ని ఆచరించేందుకు అనుకూలమైనచోటు, వేళా లభించాయి. ఈ సమయం యథార్థమైన పరాక్రమాన్ని ప్రకటించుకునేందుకు అందివచ్చింది. (30-33)
జయంతో హన్యమానా వా ప్రాప్తుమర్హామ సద్గతిమ్ ।
రాక్షసే జీవమానేఽద్య రవిరస్తమియాద్ యది ॥ 34
నాహం బ్రూయాం పునర్జాతు క్షత్రియోఽస్మీతి భారత ।
భో భో రాక్షస తిష్ఠస్వ సహదేవోఽస్మి పాండవః ॥ 35
హత్వా వా మాం నయస్వైనాం హతో వాద్యేహ స్వప్స్యసి ।
తదా బ్రువతి మాద్రేయే భీమసేనో యదృచ్ఛయా ॥ 36
ప్రత్యదృశ్యద్ గదాహస్తః సవజ్ర ఇవ వాసవః ।
సోఽపశ్యద్ భ్రాతరౌ తత్ర ద్రౌపదీం చ యశస్వినీమ్ ॥ 37
భరతవంశీయుడా! మనం జయించినా, జయింపబడినా ఉత్తమగతులను పొందుతాము. ఈ రాక్షసుడు బ్రతికుండగా సూర్యుడస్తమిస్తే నేను క్షత్రియుడనని ఎన్నిటికీ అనుకోకు. రాక్షసా! నేను పాండుకుమారుడైన సహదేవుణ్ణి. నన్ను చంపి ఈమెను పట్టుకెళ్ళు. లేదా నాచేతిలో చచ్చి ఇక్కడే నిద్రిస్తావు. అని ఇలా సహదేవుడంటూండగా అనుకోకుండా భీముడు కనిపించాడు - అతడు వజ్రాయుధం దాల్చిన ఇంద్రుడులా గద చేతపట్టుకుని వస్తున్నాడు. అతడు తన సోదరులిద్దర్నీ, ద్రౌపదినీ చూశాడు. (34-37)
క్షితిస్థం సహదేవం చ క్షిపంతం రాక్షసం తదా ।
మార్గాచ్చ రాక్షసం మూఢం కాలోపహతచేతసమ్ ॥ 38
భ్రమంతం తత్ర తత్రైవ దేవేన వినివారితమ్ ।
భ్రాతౄంస్తాన్ హ్రియతో దృష్ట్వా ద్రౌపదీం చ మహాబలః ॥ 39
క్రోధమాహారయద్ భీమో రాక్షసం చేదమబ్రవీత్ ।
విజ్ఞాతోఽసి మయా పూర్వం పాప శస్త్రపరీక్షణే ॥ 40
నేలమీద నిలిచి రాక్షసుని అధిక్షేపిస్తున్న సహదేవుని చూశాడు భీముడు. రాక్షసుడు కాలవశంచేత త్రోవతప్పి అక్కడక్కడే తిరుగుతున్నాడు. అక్కడ అలా దైవం కూడా వాడిని నివారించింది. ఆ పరిస్థితిలో సోదరులనూ, ద్రౌపదినీ తీసుకుపోతున్న రాక్షసుని చూసి కోపంతో "పాపీ! నిన్ను శస్త్ర పరీక్షాసమయంలోనే నేను కనిపెట్టాను". (38-40)
ఆస్థా తు తవ్యి మే నాస్తి యతోఽసి న హతస్తదా ।
బ్రహ్మరూపప్రతిచ్ఛన్నో న నో వదసి చాప్రియమ్ ॥ 41
నీమీద నాకు నమ్మకం లేదు. అప్పుడు నీవు బ్రాహ్మణవేషంలో నీ అసలు రూపాన్ని కప్పిపుచ్చావు. మాకు ఇష్టంకాని మాటలు మాట్లాడలేదు కాబట్టి చంపలేదు. (41)
ప్రియేషు రమమాణం త్వాం న చైవాప్రియకారిణమ్ ।
అతిథిం బ్రహ్మరూపం చ కథం హన్యామనాగసమ్ ॥ 42
రాక్షసం జానమానోఽపి యో హన్యాన్నరకం వ్రజేత్ ।
అపక్వస్య చ కాలేన వధస్తవ న విద్యతే ॥ 43
మాకిష్టమైన పనుల్లో ఆసక్తితో ఉంటూ, మాకిష్టం లేనిపనులు చెయ్యకుండా, బ్రాహ్మణరూపంలో అతిథివై వచ్చి, ఏ అపరాధం చెయ్యని నిన్ను ఎలా చంపగలను? రాక్షసుడని తెలిసినా చంపినవాడు నరకానికి పోతాడు. తగిన సమయం రానందున నీకు చావురాలేదు. (42,43)
నూనమద్యాసి సంపక్వః యథా తే మతిరీదృశీ ।
దత్తా కృష్ణాపహరణే కాలేనాద్భుతకర్మణా ॥ 44
ఇవాళ నీకు చావు మూడింది. అమ్దుకే అద్భుతాలు చేసే కాలం వల్ల ద్రౌపదిని ఎత్తుకుపోవాలనే బుద్ధి నీకు కలిగింది. (44)
ఒడిశోఽయం త్వయా గ్రస్తః కాలసూత్రేణ లంబితః ।
మత్స్యోఽంభసీవ స్యూతాస్యః కథమద్యభవిష్యసి ॥ 45
కాలమనే దారానికి వ్రేలాడే గాలాన్ని మ్రింగావు. నీళ్ళలో చేపలా నీ నోరు కుట్టినట్లైంది. ఇంక ఇపుడు ఎలా బ్రతుకుతావు? (45)
యంచ్ చాసి ప్రస్థితో దేశం మనః పూర్వం గతం చ తే ।
న తం గంతాసి గంతాసి మార్గం బకహిడింబయోః ॥ 46
ముందు నీకిష్టమయినవైపుకు కాని, ఇపుడు వెడుతున్న వైపుకు కాని ఇకవెళ్లలేవు. బకుడు, హిడింబుడు వెళ్ళిన మార్గంలోనే వెళతావు. (46)
ఏవముక్తస్తు భీమేన రాక్షసః కాలచోదితః ।
భీత ఉత్సృజ్య తాన్ సర్వాన్ యుద్ధాయ సముపస్థితః ॥ 47
ఇలా భీముడనగానే మృత్యుప్రేరణతో భయపడిన రాక్షసుడు వారందర్నీ వదిలి యుద్ధానికి దిగాడు. (47)
అబ్రవీచ్చ పునర్భీమం రోషాత్ ప్రస్ఫురితాధరః ।
న మే మూఢా దిశః పాప త్వదర్థం మే విలంబితమ్ ॥ 48
కోపంతో పెదవులు కదలుతూండగా మళ్ళీ భీముడితో ఓరీపాపీ। నాకు దిక్కులు తోచకపోవటమేమీ కాదు. నీవల్ల ఆలస్యమైంది అన్నాడు. (48)
శ్రుతా మే రాక్షసా యే యే త్వయా వినిహతా రణే ।
తేషామద్య కరిష్యామి తవాస్రేణోదకక్రియామ్ ॥ 49
యుద్ధంలో నీవు చంపిన ఆ రాక్షసులకు నీరక్తంతో ఈ రోజు తర్పణం చేస్తాను. (49)
ఏవముక్తస్తతో భీమః సృక్కిణీ పరిసంలిహన్ ।
స్మయమాన ఇవ క్రోధాత్ సాక్షాత్ కాలాంతకోపమః ॥ 50
(బ్రువన్ వై తిష్ఠ తిష్ఠేతి క్రోధసంరక్తలోచనః ।)
బాహుసంరంభమేవైక్షన్ అభిదుద్రావ రాక్షసమ్ ।
రాక్షసోఽపి తదా భీమం యుద్ధార్థినమవస్థితమ్ ॥ 51
ముహుర్ముహుర్వ్యాదదానః సృక్కిణీ పరిసంలిహన్ ।
అభిదుద్రావ సంరబ్ధః బలిర్వజ్రహరం యథా ॥ 52
ఇలా రాక్షసుడు చెప్పగా కోపంతో సాక్షాత్తు యముడిలా ఉన్న భీముడు పెదవుల కొసలు నాకుతూ, నవ్వుతూన్నట్లు ఉండి, కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో ఆగు ఆగు అంటూ బాహువులకు పని దొరికిందని భావిస్తూ రాక్షసుడివైపు పరుగుతీశాడు. అప్పుడు యుద్ధంకోరుతున్న భీముణ్ణి గమనించి రాక్షసుడు కూడ మాటిమాటికీ నోరు తెరుస్తూ కొసలు నాకుతూ బలి ఇంద్రుణ్ణి ఎదుర్కొన్నట్లు సంసిద్ధుడై పరుగుతీశాడు. (50-52)
(భీమసేనోఽప్యవష్టబ్ధో నియుద్ధాయాభవత్ స్థితః ।)
రాక్షసోఽపి చ విస్రబ్ధో బాహుయుద్ధమకాంక్షత ॥)
వర్తమానే తదా తభ్యాం బాహుయుద్ధే సుదారుణే ।
మాద్రీపుత్రావతిక్రుద్ధౌఉభావప్యభ్యధావతామ్ ॥ 53
భీముడు కూడ నిలకడగా యుద్ధానికి తలపడ్డాడు. రాక్షసుడు కూడ జంకకుండా ముష్టియుద్ధాన్ని కోరాడు. వారిద్దరికీ దారుణంగా బాహుయుద్ధం జరుగుతూ ఉంటే నకుల సహదేవులిద్దరూ పరుగెత్తుకొని వచ్చారు. (53)
న్యవారయత్ తౌ ప్రహసన్ కుంతీపుత్రో వృకోదరః ।
శక్తోఽహం రాక్షసస్యేతి ప్రేక్షధ్వమితి చాబ్రవీత్ ॥ 54
కుంతికుమారుడైన భీముడు నవ్వుతూ వారిద్దర్నీ వారించాడు. ఈ రాక్షసుడికి నేను చాలు. మీరు చూస్తూ ఉండండి అన్నాడు. (54)
ఆత్మనా భ్రాతృభిశ్చైవ ధర్మేణ సుకృతేన చ ।
ఇష్టేన చ శపే రాజన్ సూదయిష్యామి రాక్షసమ్ ॥ 55
యుధిష్ఠిరుని ఉద్దేశించి, మహారాజా! నా మీద సోదరుల మీద, ధర్మం మీద, మంచి పనులు మీద, యజ్ఞాదుల మీద, ఒట్టువేసి ఈ రాక్షసుణ్ణి చంపితీరుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. (55)
ఇత్యేవముక్త్వా తౌ వీరౌ స్పర్ధమానౌ పరస్పరమ్ ।
బాహుభ్యాం సమసజ్జేతామ్ ఉభౌ రక్షోవృకోదరౌ ॥ 56
ఇలా పలికి రాక్షసుడూ భీముడూ పరస్పరం పోటీపడి బాహుయుద్ధం చేశారు. (56)
తయోరాసీత్ సంప్రహారః క్రుద్ధమోర్భీమరక్షసోః ।
అమృష్యమాణయోః సంఖ్యే దేవదానవయోరివ ॥ 57
ఆ భీమరాక్షసులిద్దరికి దేవదానవుల యుద్ధంలా పోరుసాగింది. కసి, పగలతో ఇద్దరూ తలపడుతున్నారు. (57)
ఆఱుజ్యారుజ్య తౌ వృక్షాన్ అన్యోన్యమభిజఘ్నతుః ।
జీమూతావివ గర్జంతౌ నినదంతౌ మహాబలౌ ॥ 58
ఉరిమే మేఘాల్లా గర్జిస్తూ, మహాబలవంతులైన వాళ్ళిద్దరూ చెట్లను పెకలించి విసరుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. (58)
బభంజతుర్మహావృక్షాన్ ఊరుభిర్బలినాం వరౌ ।
అన్యోన్యేనాభిసంరబ్ధౌ పరస్పరవధైషిణౌ ॥ 59
బలిష్ఠులయిన వాళ్ళిద్దరూ తొడలతో పెద్దచెట్లను విరగ్గొట్టారు. ఒకరిని మరొకరు కోపంతో చంపెయ్యాలనుకుంటున్నారు. (59)
తద్ వృక్షయుద్ధమభవద్ మహీరుహవినాశనమ్ ।
వాలిసుగ్రీవయోర్ర్భాత్రోః పురా స్త్రీకాంక్షిణోర్యథా ॥ 60
స్త్రీకోసం పూర్వం సోదరులైన వాలిసుగ్రీవులు తలపడినట్లు ఇద్దరూ వృక్షములతో యుద్ధం చేయడం వల్ల, చెట్లు అన్నీ తరిగిపోయాయి. (60)
ఆవిధ్యావిధ్య తౌ వృక్షాన్ ముహూర్తమితరేతరమ్ ।
తాడయామాసతురుభౌ వినదంతౌ ముహుర్ముహుః ॥ 61
మాటి మాటికీ అరుస్తూ వాళ్ళిద్దరూ చెట్లను విసరుకుంటూ కొట్టుకున్నారు. (61)
తస్మిన్ దేశే యదా వృక్షాః సర్వ ఏవ నిపాతితాః ।
పుంజీకృతాశ్చ శతశః పరస్పరవధేప్సయా ॥ 62
తతః శిలాః సమాదాయ ముహూర్తమివ భారత ।
మహాభ్రైరివ శైలేంద్రౌ యుయుధాతే మహాబలౌ ॥ 63
శిలాభిరుగ్రరూపాభిః బృహతీభిః పరస్పరమ్ ।
వజ్రైరివ మహావేగైః ఆజఘ్నతురమర్షణౌ ॥ 64
భారతా! అక్కడ చెట్లన్నింటినీ నేలకూల్చిన తరువాత చెట్లను మెలిపెట్టి ఒకరినొకరు కొట్టుకొన్నారు. ఒకరినొకరు చంపాలని రాళ్ళను తీసుకొని యుద్ధం చేశారు. రెండు మహాపర్వతాలు పెద్దపెద్దమేఘాలతో తలపడ్డట్లు వారిద్దరూ యుద్ధం చేశారు. చాలావేగం కల పిడుగుల్లాంటి పెద్దబండరాళ్ళతో ఒకరినొకరు చావమోదుకొన్నారు. (62-64)
అభిద్రుత్య చ భూయస్తౌ అన్యోన్యం బలదర్పితౌ ।
భుజాభ్యాం పరిగృహ్యాథ చకర్షాతే గజావివ ॥ 65
ఇద్దరూ బలగర్వంతో తలపడి మళ్ళిచేతుల్తో పట్టుకుని ఏనుగుల్లాగా లాక్కున్నారు. (65)
ముష్టిభిశ్చ మహాఘోరైః అన్యోన్యమభిజఘ్నతుః ।
తతః కటకటాశబ్దో బభూవ సుమహాత్మనోః ॥ 66
భయంకరమైన పిడిగుద్దులతో ఒకరినొకరు కొట్టుకున్నారు. పెద్దపెద్ద ఆకారాలు కల వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న ఆ యుద్ధం వల్ల కటకటాశబ్దం వెలువడింది. (66)
తతః సంహృత్య ముష్టిం తు పంచశీర్షమివోరగమ్ ।
వేగేనాభ్యహనమ్ భీమో రాక్షసస్య శిరోధరామ్ ॥ 67
తరువాత ఐదుతలలపాములా ఉన్న పిడికిలి బిగించి భీముడు రాక్షసుడి తలపై కొట్టాడు. (67)
తతః శ్రాంతం తు తద్ రక్షః భీమసేనభుజాహతమ్ ।
సుపరిశ్రాంతమాలక్ష్య భీమసేనోఽభ్యవర్తత ॥ 68
భీముని పిడికిలి పోట్లతో దెబ్బతిన్న ఆ రాక్షసుణ్ణి చూసి బాగా అలసిపోయాడనుకొన్నాడు భీముడు. (68)
తత ఏనం మహాబాహుః బాహుభ్యామమరోపమః ।
సముత్క్షిప్య బలాద్ భీమః వినిష్పిష్య మహీతలే ॥ 69
గొప్పభుజాలు కల దేవసమానుడయిన భీముడు తనరెండు చేతులతో రాక్షసుని పైకెత్తి బలంగా నేలపైకి కొట్టాడు. (69)
తస్య గాత్రాణి సర్వాణి చూర్ణయామాస పాండవః ।
అరత్నినా చాభిహత్య శిరః కాయాదపాహరత్ ॥ 70
వాడి అవయవాలన్నింటిని భీముడు పొడిపొడి చేశాడు. పిడికిలితో కొట్టి తలను శరీరం నుండి వేరుచేశాడు. (70)
సందష్టౌష్ఠం వివృత్తాక్షం ఫలం వృక్షాదివ చ్యుతమ్ ।
జటాసురస్య తు శిరో భీమసేనబలాద్ధతమ్ ॥ 71
భీమసేనుడు బలంతో జటాసురునితల పళ్లతో కొరుక్కుంటున్న పెదవులతో, తేలవేసిన కళ్ళతో చెట్టు నుండి జారిన పండులా పడింది. (71)
పపాత రుధిరాదిగ్ధం సందష్ట దశనచ్ఛదమ్ ।
తం నిహత్య మహేష్వాసో యుధిష్ఠిరముపాగమత్ ।
స్తూయమానో ద్విజాగ్ర్యైస్తు మరుద్భిరివ వాసవః ॥ 72
పళ్ళతో కొరుక్కుంటున్న పెదవులతో, రక్తంతో తడిసి ముద్దై తల పడిపోయింది. మరుత్తులు ఇంద్రుని స్తుతించినట్లు భీముని బ్రాహ్మణోత్తములు కొనియాడారు. అందరూ యూధిష్ఠిరుని సమీపించారు. (72)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి జటాసురవధపర్వణి సప్తపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 157 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున జటాసురవధపర్వమను ఉపపర్వమున నూట ఏబది ఏడవ అధ్యాయము. (157)