124. నూట ఇరువది నాలుగవ అధ్యాయము

శర్యాతి ఇంద్రుని చంపుటకు రాక్షసుని సృష్టించుట.

లోమశ ఉవాచ
తతః శుశ్రావ శర్యాతిః వయస్థం చ్యవనం కృతమ్ ।
సుహృష్టః సేనయా సార్ధమ్ ఉపాయాద్ భార్గవాశ్రమమ్ ॥ 1
లోమశుడు అన్నాడు.
పిమ్మట శర్యాతి మహారాజు 'చ్యవనుడు యౌవనవంతుడు అయ్యాడు' అని విన్నాడు. ఆనందంగా సేనతో కలిసి చ్యవనుని ఆశ్రమాన్ని సమీపించాడు. (1)
వి॥సం॥ "యువం చ్యవాన మశ్వినా జరంతం పునర్యువానం చరథాయ చక్రథు" అనే మంత్రాన్ని బట్టి ధర్మాచరణం కోసమే పునర్యౌవన ప్రాప్తి. (నీల)
చ్యవనం చ సుకన్యాం చ దృష్ట్వా దేవసుతావివ ।
రేమే సభార్యః శర్యాతిః కృత్స్నాం ప్రాప్య మహీమివ ॥ 2
ఋషిణా సత్కృతస్తేన సభార్యః పృథివీపతిః ।
ఉపోపవిష్టః కల్యాణీః కథాశ్చక్రే మనోరమాః ॥ 3
దేవతల వలె ఉన్న చ్యవనుని, సుకన్యను చూసి సంపూర్ణభూమండలానికి రాజైనట్లుగా తలచి భార్యతో సహా ఆనందంలో మునిగితేలాడు. చ్యవనునిచే సత్కరింపబడి భార్యతో కూడిన శర్యాతి ఆశ్రమంలో విశ్రాంతిగా కూర్చుని మనస్సుకు సంతోషాన్ని కలిగించే కథలు వినిపించాడు. (2,3)
అథైనం భార్గవో రాజన్ ఉవాచ పరిసాంత్వయన్ ।
యాజయిష్యామి రాజంస్త్వాం సంబారానవకల్పయ ॥ 4
శర్యాతిని చ్యవనుడు సాంత్వనపరుస్తూ ఇలా అన్నాడు . "రాజా! నీ కొరకు యజ్ఞాన్ని నిర్వహిస్తాను, ద్రవ్యాలను సమకూర్చుకో." (4)
తతః పరమసంహృష్టః శర్యాతిరవనీపతిః ।
చ్యవనస్య మహారాజ తద్ వాక్యం ప్రత్యపూజయత్ ॥ 5
మిక్కిలి ఆనందించిన ప్రభువైన శర్యాతి చ్యవనుని మాటలు విని, ప్రసన్నతతో అతనిని గౌరవించాడు. (5)
ప్రశస్తేఽహని యజ్ఞీయే సర్వకామసమృద్ధిమత్ ।
కారయామాస శర్యాతిః యజ్ఞాయతనముత్తమమ్ ॥ 6
యజ్ఞానికి అనువైన పవిత్రమైన రోజున ఒక యజ్ఞమండపాన్ని తయారు చేయించాడు. అది మనస్సులోని కోరిక లన్నింటిని తీర్చేది. (6)
తత్రైనం చ్యవనో రాజన్ యాజయామాస భార్గవః ।
అద్భుతాని చ తత్రాసన్ యాని తాని నిబోధ మే ॥ 7
రాజా! ఆ యజ్ఞమండపంలో భృగువంశజుడైన చ్యవనుడు రాజుచే యజ్ఞం చేయించాడు. "ఆ యజ్ఞంలో జరిగిన అద్భుతాలను నాద్వారా విను" అన్నాడు లోమశుడు. (7)
అగృహ్ణాచ్చ్యవనః సోమమ్ అశ్వినోర్దేవయోస్తదా ।
తమింద్రో వారయామాస గృహ్ణానం స తయోర్ర్గహమ్ ॥ 8
చ్యవన మహర్షి అశ్వినీదేవతలకు ఇవ్వదలచిన సోమరసాన్ని చేతిలోకి తీసుకొన్నాడు. వారు ఇరువరి కోసం సోమాన్ని గ్రహించే సమయంలో ఇంద్రుడు అడ్డుకొన్నాడు. (8)
ఇంద్ర ఉవాచ
ఉభావేతౌ న సోమార్హౌ నాసత్యావితి మే మతిః ।
భిషజౌ దివి దేవానాం కర్మణా తేన నార్హతః ॥ 9
ఇంద్రుడు అన్నాడు - ఈ అశ్వినీ దేవతలు యజ్ఞంలో సోమరసం త్రాగటానికి అర్హులు కారు అని నా అభిప్రాయం. దేవలోకంలో ఉండే దేవతల వైద్యులు వీరు. వీరికి యజ్ఞంలో సోమం త్రాగే అధికారం లేదు. (9)
చ్యవన ఉవాచ
మహోత్సాహౌ మహాత్మానౌ రూపద్రవిణవత్తరౌ ।
యౌ చక్రతుర్మాం మఘవన్ బృందారకమివాజరమ్ ॥ 10
ఋతే త్వాం విబుధాంశ్చాన్యాన్ కథం వై నార్హతః సవమ్ ।
అశ్వినావపి దేవేంద్ర దేవౌ విద్ధి పురందర ॥ 11
చ్యవనుడు ఇలా అన్నాడు. 'వీరిరువురూ ఉత్సాహవంతులు. బుద్ధిమంతులు. రూప సంపద కలవారు. వీరే నన్ను దేవతలతో సమానంగా రూపవంతుని, యువకుని చేశారు - 'నీకు, ఇతర దేవతలకు తప్ప సోమరసాన్ని గ్రహించే అధికారం వీరికి లేదా? అశ్వినీదేవతలు కూడా దేవతలే అని తెలుసుకో.' (10,11)
ఇంద్ర ఉవాచ
చికిత్సకౌ కర్మకరౌ కామరూపసమన్వితౌ ।
లోకే చరంతౌ మర్త్యానాం కథం సోమమిహార్హతః ॥ 12
ఇంద్రుడు అన్నాడు - వీరు రోగనివృత్తి చేసేవారు. కామరూపాన్ని పొందగలవారు. లోకంలో సంచరిస్తూ మర్త్యలోకానికి వెడతారు. వీరికి సోమం త్రాగే అధికారం ఎలా ఉంటుంది? (12)
లోమశ ఉవాచ
ఏతదేవ యదా వాక్యమ్ ఆమ్రేడయతి దేవరాట్ ।
అనాదృత్య తతః శక్రం గ్రహం జగ్రాహ భార్గవః ॥ 13
లోమశుడు పలికాడు. - ఇంద్రుడు మాటిమాటికి ఇదే మాట పలుకుతున్నాడు. భార్గవుడైన చ్యవనుడు ఇంద్రుని లెక్కచేయక అశ్వినీదేవతలకు ఇవ్వటానికి సోమ భాగాన్ని మళ్ళీ చేతితో గ్రహించాడు. (13)
గ్రహీష్యంతం తు తం సోమమ్ అశ్వినోరుత్తమం తదా ।
సమీక్ష్య బలభిద్ దేవ ఇదం వచనమబ్రవీత్ ॥ 14
ఆ సమయంలో అశ్వినీదేవతలకు సోమాన్ని ఇవ్వడానికి భాగం గ్రహించిన చ్యవనుని చూసి ఇంద్రుడు ఇలా పలికాడు. (14)
ఆభ్యామర్థాయ సోమం త్వం గ్రహీష్యసి యది స్వయమ్ ।
వజ్రం తే ప్రహరిష్యామి ఘోరరూపమనుత్తమమ్ ॥ 15
నీవు వీరికి సోమాన్ని ఇవ్వాలని సంకల్పిస్తే నీపై నేను ఘోరమై, ఎదురులేని వజ్రాయుధాన్ని విడచిపెడతాను. (15)
ఏవముక్తః స్మయన్నింద్రమ్ అభివీక్ష్య స భార్గవః ।
జగ్రాహ విధివత్ సోమమ్ అశ్విభ్యాముత్తమం గ్రహమ్ ॥ 16
ఇలా ఇంద్రుడు పలుకగా నవ్వుతూ ఇంద్రుని వైపు చూసి, చ్యవనుడు అశ్వినీదేవతల కోసం యథావిధిగా సోమరసభాగాన్ని గ్రహించాడు. (16)
తతోఽస్మై ప్రాహరద్ వజ్రం ఘోరరూపం శచీపతిః ।
తస్య ప్రహరతో బాహుం స్తంభయామాస భార్గవః ॥ 17
అటుపైన శచీపతి ఇంద్రుడు ఘోరరూపం గల వజ్రాయుధాన్ని భార్గవునిపై విడవబోయాడు. ఆ విడచేసమయంలోనే చ్యవనుడు అతని చేతిని స్తంభింపచేశాడు. (17)
తం స్తంభయిత్వా చ్యవనః జుహువే మంత్రతోఽనలమ్ ।
కృత్యార్థీ సుమహాతేజాః దేవం హింసితుముద్యతః ॥ 18
అతని స్తంభింపచేసిన చ్యవనుడు మంత్రోచ్చారణతో ఆహుతులను అగ్నిలో వేశాడు. దేవరాజైన ఇంద్రుని హింసించటానికి కృత్యను పుట్టించబూని ఆయన అలా చేశాడు. (18)
తతః కృత్యాథ సంజజ్ఞే మునేస్తస్య తపోబలాత్ ।
మదో నామ మహావీర్యః బృహత్కాయో మహాసురః ॥ 19
శరీరం యస్య నిర్దేష్టుమ్ అశక్యం తు సురాసురైః ।
తస్యాస్యమభవద్ ఘోరం తీక్ష్ణాగ్రదశనం మహత్ ॥ 20
హనురేకా స్థితా త్వస్య భుమావేకా దివం గతా ।
చతస్రశ్చాయతా దంష్ట్రాః యోజనానాం శతం శతమ్ ॥ 21
చ్యవనుని తపోబలంచే కృత్య ఆవిర్భవించింది. ఆ కృత్యరూపంలో పరాక్రమవంతుడై, పెద్ద శరీరం కల, రాక్షసుడు మదుడనేవాడు పుట్టాడు. అతని శరీరాన్ని వర్ణించటం దేవాసురులకు కూడ సాధ్యం కాదు. ఆ రాక్షసుని ముఖం భయంకరమయినది. ముందు తీక్ష్ణదంతాలు కనిపిస్తాయి. ఆ రాక్షసుని పై దవడ (పెదవి) స్వర్గలోకాన్ని, క్రింది దవడ (పెదవి) భూలోకాన్ని చేరి ఉంది. నాలుగు పొడవైన దంతాలు ఒక్కొక్కటి నూరు యోజనాల వరకు వ్యాపించి ఉన్నాయి. (19-21)
ఇతరే తస్య దశనాః బభూవుర్దశయోజనాః ।
ప్రాసాదశిఖరాకారాః శూలాగ్రసమదర్శనాః ॥ 22
అతని ఇతర దంతాలు పదియోజనాల పొడవు ఉన్నాయి. వాటి ఆకృతి భవన శిఖరాలలాగ, శూలపు కొనల్లాగ కనిపించింది. (22)
బాహూ పర్వతసంకాశౌ ఆయతావయుతం సమౌ ।
నేత్రే రవిశశిప్రఖ్యే వక్త్రం కాలాగ్నిసన్నిభమ్ ॥ 23
లేలిహంహిహ్వయా వక్ర్తం విద్యుచ్చపలలోలయా ।
వ్యాత్తాననో ఘోరదృష్టిః గ్రసన్నివ జగద్ బలాత్ ॥ 24
స భక్షయిష్యన్ సంక్రుద్ధః శతక్రతుముపాద్రవత్ ।
మహతా ఘొరరూపేణ లోకాన్ శబ్దేన నాదయన్ ॥ 25
చేతులు పర్వతాల్లా ఉన్నాయి. రెండు చేతుల పొడుగు పదివేల యోజనాలు. కన్నులు సూర్యచంద్రుల్లా వెలుగుతున్నాయి. ముఖం ప్రళయకాలాగ్నిలా ఉంది. మెరుపు తీగవలె చంచలమైన నాలుకతో ముఖాన్ని నాకుతూ, నోరు బాగా చాచి భయంకరంగా చూస్తూ, లోకాన్ని మింగేలా ఉన్నాడు. అతడు తన ఘోరరూపంతో భయంకర గర్జన చేస్తూ లోకాన్ని భయపెడుతూ ఇంద్రుని తినదలచినట్లు అతని వైపు పరుగుతీశాడు. (23-25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌకన్యే చతుర్వింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 124 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌకన్యమను నూట ఇరువది నాల్గవ అధ్యాయము. (124)