123. నూట ఇరువది మూడవ అధ్యాయము
అశ్వినీదేవతల అనుగ్రహముచే చ్యవనునికి యౌవనము, అందము కల్గుట.
లోమశ ఉవాచ
కస్యచిత్ త్వథ కాలస్య త్రిదశావశ్వినౌ నృప ।
కృతాభిషేకాం వివృతాం సుకన్యాం తామపశ్యతామ్ ॥ 1
తాం దృష్ట్వా దర్శనీయాంగీం దేవరాజసుతామివ ।
ఊచతుః సమభిద్రుత్య నాసత్యావశ్వినావిదమ్ ॥ 2
లోమశుడు పలికాడు.
ఎప్పుడూ మూడు పదుల వయస్సు ఉండే అశ్వినీ దేవతలు ఒకనాడు అపుడే స్నానమాచరించి, నగ్నంగా ఉన్న సుకన్యను చూశారు. ఆమెన్ చూసి, 'ఇంద్రపుత్రి వలె ప్రకాశిస్తోంది' అని అనుకొని, సమీపించి వారు ఇలా పలికారు. (1,2)
కస్య త్వమసి వామోరు వనేఽస్మిన్ కిం కరోషి చ ।
ఇచ్ఛావ భద్రే జ్ఞాతుం త్వాం తత్త్వమాఖ్యాహి శోభనే ॥ 3
నీవ ఎవతెవు? ఈ వనంలో ఏం చేస్తున్నావు? నీ పరిచయం తెలుసుకోవాలి అనుకొంటున్నాం. సరిగ్గా వివరంగా చెప్పు. (3)
తతః సుకన్యా సవ్రీడా తావువాచ సురోత్తమౌ ।
శర్యాతితనయాం విత్తం భార్యాం మాం చ్యవనస్య చ ॥ 4
సుకన్య సిగ్గుపడి అశ్వినీదేవతలతో పలికింది. 'నేను శర్యాతిమహారాజు పుత్రికను. చ్యవనుని భార్యను.' (4)
(నామ్నా చాహం సుకన్యాస్మి నృలోకేఽస్మిన్ ప్రతిష్ఠితా ।
సాహం సర్వాత్మనా నిత్యం పతిం ప్రతి సునిష్ఠితా ॥)
అథాశ్వినౌ ప్రహస్యైతామ్ అబ్రూతాం పునరేవ తు ।
కథం త్వమసి కల్యాణి పిత్రా దత్తా గతాధ్వనే ॥ 5
భ్రాజసేఽస్మిన్ వనే భీరు విద్యుత్సౌదామనీ యథా ।
న దేవేష్వపి తుల్యాం హి త్వయా పశ్యావ భావిని ॥ 6
సుకన్య అనే పేరుతో ఈ లోకంలో ఉన్నాను. నేను ఎల్లప్పుడు పతినే దైవంగా భావిస్తున్నాను అంది. వారు నవ్వి తిరిగి ఆమెతో ఇలా అన్నారు. "ఈ ముసలివానితో నీ తండ్రి ఎలా నీకు వివాహం చేశాడు? ఈ వనంలో మెరుపు తీగలా ప్రకాశిస్తున్నావు. దేవతల్లో కూడ నీవంటి సుందరి లేదు. (5,6)
అనాభరణసంపన్నా పరమాంబరవర్జితా ।
శోభయస్యధికం భద్రే వనమప్యనలంకృతా ॥ 7
నీ అవయవాలకు అలంకారాలు లేవు. మంచి బట్టలు లేవు. శృంగార సంబంధమైన వస్తువులు ధరించలేదు. అలంకారాలు లేకపోయినా నీవు ఈ వనాన్ని ఎక్కువగా ప్రకాశింపచేస్తున్నావు. (7)
సర్వాభరణసంపన్నా పరమాంబరధారిణీ ।
శోభసే త్వనవద్యాంగి న త్వేవం మలపంకినీ ॥ 8
నీకు దోషంలేని అవయవాలు ఉన్నాయి. నీవు సర్వాభరణాలు ధరిస్తే, విలువైన బట్టలు కడితే, ఎంతో ప్రకాశిస్తావు. మలినమైన శరీరంతో శోభను కోల్పోతున్నావు. (8)
కస్మాదేవంవిధా భూత్వా జరాజర్జరితం పతిమ్ ।
త్వముపాస్సే హ కల్యాణి కామభోగబహిష్కృతమ్ ॥ 9
ఇంతటి సౌందర్యవతివై కామభోగాలు అనుభవించలేని ముదుసలి భర్తను ఎందులకు సేవిస్తున్నావు? (9)
అసమర్థం పరిత్రానే పోషణే తు శుచిస్మితే ।
సా త్వం చ్యవనముత్సృజ్య వరయస్వైకమావయోః ॥ 10
చక్కటి చిరునవ్వు కలిగిన నీవు రక్షణంలో, పోషణంలో అసమర్థుడు అయిన భర్తను భరిస్తున్నావు. ఆ చ్యవనమహర్షిని విడి మాలో ఒకరిని వరించు. (10)
పత్యర్థం దేవగర్భాభే మా వృథా యౌవనం కృథాః ।
ఏవముక్తా సుకన్యాపి సురౌ తావిదమబ్రవీత్ ॥ 11
భర్తకోసం అందంలో దేవవనితలతో సమానం అయిన నీవు యౌవనాన్ని వ్యర్థం చేసుకోకు." అన్నారు. అది విన్న సుకన్య వారిరువురితో ఇలా అంది. (11)
రతాహం చ్యవనే పత్యౌ మైవం మాం పర్యశంకతమ్ ।
తావబ్రూతాం పునస్త్వేనామ్ ఆవాం దేవభిషగ్వరౌ ॥ 12
యువానం రూపసంపన్నాం కరిష్యావః పతిం తవ ।
తతస్తస్యావయోశ్చైవ వృణీస్వాన్యతమం పతిమ్ ॥ 13
ఏతేన సమయేనైనమ్ ఆమంత్రయ పతిం శుభే ।
'నేను నాభర్త చ్యవనునే మనస్సులో ఆరాధిస్తూ అనురాగం కలిగి ఉన్నాను. మీరు నా విషయంలో అనుచితం అయిన సందేహాన్ని లేవదీయకండి" అంది. మళ్లీ వారిలా అన్నారు. మేము దేవ వైద్యులం. నీ భర్తను యౌవనం, రూపం కలిగిన నరునిగా చేస్తాం. మా ముగ్గురిలో ఒకరిని భర్తగా అంగీకరించు. ఇదే నియమంతో నీ భర్తను ఇక్కడకు పిలిపించు.' (12,13 1/2)
సా తయోర్వచనాద్ రాజన్ ఉపసంగమ్య భార్గవమ్ ॥ 14
ఉవాచ వాక్యం యత్ తాభ్యామ్ ఉక్తం భృగుసుతం ప్రతి ।
తచ్ర్ఛుత్వా చ్యవనో భార్యామ్ ఉవాచ క్రియతామితి ॥ 15
ఆమె వారి మాటగా చ్యవనుని చేరి వారు చెప్పినట్లుగా ఆయనతో చెప్పింది. అది విన్న చ్యవనుడు భార్యతో 'అలాగే చేద్దాం' అన్నాడు. (14,15)
(స్ భర్ర్తా సమనుజ్ఞాతా క్రియతామితి చాబ్రవీత్।
శ్రుత్వా తదశ్వినౌ వాక్యం తస్యాస్తత్ క్రియతామితి ॥)
ఊచతూ రాజపుత్రీం తాం పతిస్తవ విశత్వపః ।
తతోఽంభశ్చ్యవనః శీఘ్రం రూపార్థీ ప్రవివేశ హ ॥ 16
ఆమె భర్త అనుమతితో 'అలాగే చేయండి' అంది. అది విన్న అశ్వినీదేవతలు ఆ రాజుపుత్రితో 'నీ భర్తను నీటిలో ప్రవేశించమను' అన్నారు. చ్యవనమహర్షి శీఘ్రంగా సౌందర్యం కోసం నీటిలో ప్రవేశించాడు. (16)
అశ్వినావపి తద్ రాజన్ సరః ప్రావిశతాం తదా ।
తతో ముహూర్తాదుత్తీర్ణాః సర్వే తే సరసస్తదా ॥ 17
దివ్యరూపధరాః సర్వే యువానో మృష్టకుండలాః ।
తుల్యవేషధరాశ్చైవ మనసః ప్రీతివర్ధనాః ॥ 18
అశ్వినీదేవతలు కూడ ఆ సరస్సులో ఆయనతో ప్రవేశించి మునిగారు. క్షణకాలంలో ఆ సరస్సు నుంచి అందరూ బయటకు వచ్చారు. వారు దివ్యరూపాలు దాల్చి ఉన్నారు. మెరిసే కుండలాలు చెవులకు ఉన్నాయి. యువకులై సమాన ఆకార, వేష, భాషలు కలిగి మనస్సుకు ప్రీతికలిగిస్తూ ఉన్నారు. (17,18)
తేఽబ్రువన్ సహితాః సర్వే వృణీష్వాన్యతమం శుబే ।
అస్మాకమీప్సితం భద్రే పతిత్వే వరవర్ణిని ॥ 19
అందరూ ఒక్కసారిగా ఆమెతో అన్నారు. 'మాలో ఒకరిని నీ ఇష్టమైన వానిని భర్తగా స్వీకరించు. (19)
యత్ర వాప్యభికామాసి తం వృణీష్వ సుశోభనే ।
సా సమీక్ష్య తు తాన్ సర్వాన్ తుల్యరూపధరాన్ స్థితాన్ ॥ 20
నిశ్చిత్య మనసా బుద్ధ్వా దేవీ వవ్రే స్వకం పతిమ్ ।
లబ్ధ్వా తు చ్యవనో భార్యాం వయో రూపం చ వాంఛితమ్ ॥ 21
హృష్టోఽబ్రవీన్మహాతేజాః తౌ నాసత్యావిదం వచః ।
యథాహం రూపసంపన్న వయసా చ సమన్వితః ॥ 22
కృతో భవద్భ్యాం వృద్ధః సన్ భార్యాం చ ప్రాప్తవానిమామ్ ।
తస్మాద్ యువాం కరిష్యామి ప్రీత్యాహం సోమపీథినౌ ।
మిషతో దేవరాజస్య సత్యమేతద్ బ్రవీమి వామ్ ॥ 23
ఎవరిపట్ల కోరిక ఉందో వానినే వరించు.' ఆమె సమానరూపధారులైన వారినందరిని పరికించి చూసి మనస్సులో నిశ్చయించి, తన భర్త చ్యవనునే పతిగా కోరింది. చ్యవనుడు యౌవనాన్ని, సౌందర్యాన్ని, అనుకూల భార్యను పొంది సంతసించి అశ్వినీదేవతలతో ఆనందంతో ఇలా అన్నాడు. 'నేను మీచే ముసలివాడనైనా అందగాడుగా, యువకునిగా చేయబడ్డాను. మీ అనుగ్రహంచే యౌవనవతిని భార్యగా పొందాను. కావున మీకు ఆనందంతో ప్రత్యుపకారంగా ఇంద్రుడు చూస్తుండగా మీరు సోమరసం త్రాగేలా చేస్తాను. ఇది సత్యం నమ్మండి. (20-23)
తచ్ర్ఛుత్వా హృష్టమనసౌ దివం తౌ ప్రతిజగ్మతుః ।
చ్యవనశ్చ సుకన్యా చ సురావివ విజహ్రతుః ॥ 24
అది విని అశ్వినీదేవతలు సంతసించి స్వర్గానికి వెళ్ళారు. చ్యవనుడు, సుకన్య దేవదంపతుల వలె విహరించసాగారు. (24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌకన్యే త్రయోవింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 123 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌకన్యమను నూట ఇరువది మూడవ అధ్యాయము. (123)
(దాక్షిణాత్య అధికపాఠము 2 శ్లోకాలతో కలిపి మొత్తము 26 శ్లోకములు)