115. నూట పదునైదవ అధ్యాయము
అకృతవ్రణుడు ధర్మరాజునకు పరశురామవృత్తాంతము చెప్పుట.
వైశంపాయన ఉవాచ
స తత్ర తాముషిత్వైకాం రజనీం పృథివీపతిః ।
తాపసానాం పరం చక్రే సత్కారం భ్రాతృభిః సహ ॥ 1
వైశంపాయనుడు పలికాడు - ధర్మజుడు ఒక రోజు రాత్రి మహేంద్రపర్వతంపై గడిపి సోదరులతో కలిసి తాపసులకు, మునులకు సత్కారం చేశాడు. (1)
లోమశస్తస్య తాన్ సర్వాన్ ఆచఖ్యౌ తత్ర తాపవాన్ ।
భృగూనంగిరసశ్చైవ వసిష్ఠానథ కాశ్యపాన్ ॥ 2
లోమశుడు ధర్మజునికి ఆ తాపసులందర్నీ పరిచయం చేశాడు. వారిలో భృగువు, అంగిరసుడు, వసిష్ఠుడు, కశ్యపుడు మొదలైన ఋషుల గోత్రజులు ఉన్నారు. (2)
తాన్ సమేత్య స రాజర్షిః అభివాద్య కృతాంజలిః ।
రామస్యానుచరం వీరమ్ అపృచ్ఛదకృతవ్రణమ్ ॥ 3
కదా తు రామో భగవాన్ తాపసాన్ దర్శయిష్యతి ।
తేనైవాహం ప్రసంగేన ద్రష్టుమిచ్ఛామి భార్గవమ్ ॥ 4
ఆ రాజర్షి వారిని అందరినీ కలిసి, దోసిలి ఘటించి నమస్కరించి, పరశురాముని అనుచరుడు, వీరుడు అయిన అకృతవ్రణుని ఇలా అడిగాడు. 'భగవానుడు పరాశురాముడు ఈ తాపసులకు ఎప్పుడు దర్శనం ఇస్తాడు? ఈ కారణంగా నేను కూడ భార్గవుని చూడాలని అనుకొంటున్నాను.' (3,4)
అకృతవ్రణ ఉవాచ
ఆయానేవాసి విదితః రామస్య విదితాత్మనః ।
ప్రీతిస్త్వయి చ రామస్య క్షిప్రం త్వాం దర్శయిష్యతి ॥ 5
చతుర్దశీమష్టమీం చ రామం పశ్యంతి తాపసాః ।
అస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం భవిత్రీ శ్వశ్చతుర్దశీ ॥ 6
అకృతవ్రణుడు అన్నాడు - ఆత్మజ్ఞాని అయిన పరశురాముడు మీ రాకను ముందే తెలుసుకొన్నాడు. మీ పై పరశురామునికి చాల ప్రేమ. శీఘ్రంగా వారు మీకు దర్శనం ఇస్తారు. ఈ తాపసులు చతుర్దశి, అష్టమిదినాల్లో పరశురాముని దర్శిస్తారు. ఈ రాత్రి గడిస్తే రేపే చతుర్దశి. (5,6)
యుధిష్ఠిర ఉవాచ
భవాననుగతో రామం జామదగ్న్యం మహాబలమ్ ।
ప్రత్యక్షదర్శీ సర్వస్య పూర్వవృత్తస్య కర్మణః ॥ 7
యుధిష్ఠిరుడు అన్నాడు. 'మీరు బలవంతుడయిన పరశురామునిపై గాఢశక్తి కలవారు. ఆయన పూర్వం చేసిన ఘనకార్యాలు అన్నీ మీరు ప్రత్యక్షంగా చూసినవారు. (7)
స భవాన్ కథయత్వద్య యథా రామేణ నిర్జితాః ।
ఆహవే క్షత్రియాః సర్వే కథం కేన చ హేతునా ॥ 8
పరశురామునిచే యుద్ధంలో క్షత్రియులు అందరు ఏ కారణంగా జయింపబడ్డారో ఆ విషయాన్ని ఈనాడు మీరు నాకు చెప్పండి. (8)
అకృతవ్రణ ఉవాచ
హంత తే కథయిష్యామి మహదాఖ్యానముత్తమమ్ ।
భృగూణాం రాజశార్దూల వంశే జాతస్య భారత ॥ 9
అకృతవ్రణుడు పలికాడు. రాజశ్రేష్ఠా! భృగువంశజుడైన పరశురాముని కథను చెబుతాను. విను. ఆ కథ చాలపెద్దది. ఉత్తమమయినది. (9)
రామస్య జామదగ్న్యస్య చరితం దేవసమ్మితమ్ ।
హైహయాధిపతేశ్చైవ కార్తవీర్యస్య భారత ॥ 10
జమదగ్ని కుమారుడైన పరశురాముని చరిత్ర, హైహయరాజు, కార్తవీర్యుని చరిత్ర దేవతల చరిత్రతో సమానమైనవి. (10)
రామేణ చార్జునో నామ హైహయాధిపతిర్హతః ।
తస్య బాహుశతాన్యాసన్ త్రీణి సప్త చ పాండవ ॥ 11
పాండవా! పరశురామునిచే కార్తవీర్యార్జునుడనే పేరు గల హైహయదేశపురాజు చంపబడ్డాడు. అతనికి వేయిభుజాలు ఉన్నాయి. (11)
దత్తాత్రేయప్రసాదేన విమానం కాంచనం తథా ।
ఐశ్వర్యం సర్వభూతేషు పృథివ్యాం పృథివీపతే ॥ 12
రాజా! దత్తాత్రేయుని అనుగ్రహంచే బంగారు విమానాన్ని, భూమి మీద అన్నిప్రాణులపై అధికారాన్ని సంపాదించాడు. (12)
అవ్యాహతగతిశ్చైవ రథస్తస్య మహాత్మనః ।
రథేన తేన తు సదా వరదానేన వీర్యవాన్ ॥ 13
మమర్ద దేవాన్ యక్షాంశ్చ ఋషీంశ్చైవ సమంతతః ।
భూతాంశ్చైవ స సర్వాంస్తు పీడయామాస సర్వతః ॥ 14
కార్యవీర్యార్జునుని రథం ఎవరికిని ఆపశక్యం కానిది. ఆ రథంచేతనూ, వరదానం చేతనూ అతడు బలవంతుడు అయ్యాడు. అన్ని వైపుల తిరుగుతూ దేవతలను, యక్షులను, ఋషులను భూతాలను అన్నింటిని అతడు పీడించసాగాడు. (13,14)
తతో దేవాః సమేత్యాహుః ఋషయశ్చ మహావ్రతాః ।
దేవదేవం సురారిఘ్నం విష్ణుం సత్యపరాక్రమమ్ ॥ 15
భగవన్ భూతరక్షార్థమ్ అర్జునం జహి వై ప్రభో ।
విమానేన చ దివ్యేన హైహయాధిపతిః ప్రభుః ॥ 16
శచీసహాయం క్రీడంతం ధర్షయామాస వాసవమ్ ।
తతస్తు భగవాన్ దేవః శక్రేణ సహితస్తదా ।
కార్తవీర్యవినాశార్థం మంత్రయామాస భారత ॥ 17
దేవేంద్రుడు భూతహితం కోసం ఏం చెయ్యాలో విష్ణువుకు నివేదించాడు. అది విన్న శ్రీమహావిష్ణువు దానికి తగిన ప్రతిజ్ఞ చేశాడు. తరువాత తన నివాసాశ్రమమూ, సుందరమూ అయిన బదరికావనాన్ని చేరాడు. అదే సమయంలో భూమిపై కాన్యకుబ్జదేశాన్ని పాలించే బలవంతుడు అయిన గాధి అనే రాజు తన రాజధానిని విడచి వనవాసానికి వెళ్ళాడు. ఆ వనంలో అతనికి అప్సరసల వలె అందమైన ఒక కన్య పుట్టింది. భారతా! యుక్తవయస్సు రాగానే భృగువంశజుడైన ఋచీకుడు ఆమెను వరించాడు. (18-21)
తమువాచ తతో గాధిః బ్రాహ్మణం సంశితవ్రతమ్ ।
ఉచితం నః కులే కించిత్ పూర్వైర్యత్ సంప్రవర్తితమ్ ॥ 22
ఏకతః శ్యామకర్ణానాం పాండురాణాం తరస్వినామ్ ।
సహస్రం వాజినాం శుల్కమ్ ఇతి విద్ధి ద్విజోత్తమ ॥ 23
ఋచీకునితో గాధి ఇలా అన్నాడు. మా వంశంలో పూర్వీకులు ఏ శుల్కాన్ని వరుని నుంచి గ్రహిస్తున్నారో దాన్ని పాటించటం మా కర్తవ్యం. ఒక వేయి గుఱ్ఱాలు శుల్కంగా ఇవ్వాలి. అవి తెలుపు, ఎఋపు రంగు కలిగి, వేగం కలిగి, ఒక వైపు పూర్తిగా నలుపురంగు చెవులు కలిగి ఉండాలి. (22,23)
న చాపి భగవాన్ వాచ్యః దీయతామితి భార్గవ ।
దేయా మే దిహితా చైవ త్వద్విధాయ మహాత్మనే ॥ 24
భార్గవా! మీరు నిందింపతగినవారు కారు. శుల్కం మాత్రం తప్పక ఇవ్వాలి. అలాంటి మహాత్మునికే నాకన్యను దానం చేస్తాను. (24)
ఋచీక ఉవాచ
ఏకతః శ్యామకర్ణానాం పాండురాణాం తరస్వినామ్ ।
దాస్యామ్యశ్వసహస్రం తే మమ భార్యా సుతాస్తు తే ॥ 25
ఋచీకుడు అన్నాడు - నేను మీ కొరకు ఒక వైపు నల్లని రంగు చెవులు గల వేయి తెలుపు, ఎఱుపు రంగు గల గుఱ్ఱాలు సమర్పిస్తాను. మీ పుత్రిక నా ధర్మపత్ని కావాలి. (25)
అకృతవ్రణ ఉవాచ
స తథేతి ప్రతిజ్ఞాయ రాజన్ వరుణమబ్రవీత్ ।
ఏకతః శ్యామకర్ణానాం పాండురాణాం తరస్వినామ్ ॥ 26
సహస్రం వాజినామేకం శుల్కార్థం మే ప్రదీయతామ్ ।
తస్మై ప్రాదాత్ సహస్రం వై వాజినాం వరుణస్తదా ॥ 27
అకృతవ్రణుడు అన్నాడు - 'రాజా! అట్లే, అని ప్రతిజ్ఞ చేసిన ఋచీకుడు వరుణుని పాండురవర్ణం, వేగం కలిగిన వేయి గుఱ్ఱాలను శుల్కరూపంగా ఇవ్వటానికి నాకు ఇయ్యి.' అని అడిగాడు. వెంటనే వరుణుడు వేయి గుఱ్ఱాలను ఋచీకునికి కానుక ఇచ్చాడు. (26,27)
తదశ్వతీర్థం విఖ్యాతమ్ ఉత్థితా యత్ర తే హయాః ।
గంగాయాం కాన్యకుబ్జే వై దదౌ సత్యవతీం తదా ॥ 28
తతో గాధిః సుతాం చస్మై కన్యాశ్చాసన్ సురాస్తదా ।
లబ్ధ్వా హయసహస్రం తు తాంశ్చ దృష్ట్వా దువౌకసః ॥ 29
ఎక్కడ నుంచి ఆ వేయి గుఱ్ఱాలు బయటకి వచ్చాయో అదియే అశ్వతీర్థం. పిమ్మట గాధి ఆ వేయి గుఱ్ఱాలను
తీసుకొని గంగా తీరంలోని కాన్యకుబ్జదేశంలో తన కుమార్తె నిచ్చి వివాహం చేశాడు. ఆ సమయంలో దేవతలు వరుని పక్షంలో నిలిచారు. దేవతలు ఈ ఘట్టాన్ని చూచి తమ ప్రదేశాలకు తిరిగి వెళ్ళారు. (28,29)
ధర్మేణ లబ్ధ్వా తాం భార్యాం ఋచీకో ద్విజసత్తమః ।
యథాకామం యథాజోషం తయా రేమే సుమధ్యయా ॥ 30
బ్రాహ్మణోత్తముడైన ఋచీకుడు ధర్మబద్ధంగా ఆమెను భార్యగా పొంది సుఖంగా కోరికలతో, ఆమెతో సంసారం చేశాడు. (30)
తం వివాహే కృతే రాజన్ సభార్యమవలోకకః ।
ఆజగామ భృగుః శ్రేష్ఠం పుత్రం దృష్ట్వా ననంద హ ॥ 31
రాజా! వివాహం అయిన తరువాత భార్యతో సహా ఋచీకుని చూడాలని వచ్చిన భృగుమహర్షి తన పుత్రుని చూసి మిక్కిలి ఆనందించాడు. (31)
భార్యాపతీ తమాసీనం గురుం సురగణార్చితమ్ ।
అర్చిత్వా పర్యుపాసీనౌ ప్రాంజలీ తస్థతుస్తదా ॥ 32
ఆ దంపతులు సురగణసేవితుడు అయిన ఆయనను పూజించి, సేవలో లీనమై చేతులు జోడించి, నిలబడ్డారు. (32)
తతః స్నుషాం భగవాన్ ప్రహృష్టో భృగురబ్రవీత్ ।
వరం వృణీష్వ సుభగే దాతా హ్యస్మి తవేప్సితమ్ ॥ 33
భృగుమహర్షి ఆనందభరితుడై కోడలితో అన్నాడు - వరం కోరుకో. నీ కోరిక ఏదైనా తీర్చగలను. (33)
సా వై ప్రసాదయామాస తం గురుం పుత్రకారణాత్ ।
ఆత్మనశ్చైవ మాతుశ్చ్చ ప్రసాదం చ చకార సః ॥ 34
ఆ సత్యవతి తనకు, తన తల్లికి సంతనాన్ని ఇమ్మని ఆయన్ని ప్రార్థించింది. ఆయన అనుగ్రహించాడు. (34)
ఋతౌ త్వం చైవ మాతా చ స్నాతే పుంసవనాయ వై ।
ఆలింగేతాం పృథక్ వృక్షౌ సాశ్వత్థం త్వముదుంబరమ్ ॥ 35
'ఋతస్నాత లైనప్పుడు నీవు, నీ తల్లి పుత్రసంతానానికై నీవు రావిచెట్టును, నీ తల్లి మేడి చెట్టును వేరువేరుగా కౌగిలించుకోవాలి. (35)
చరుద్వయమిదం భద్రం జనన్యాశ్చ తవైవ చ ।
విశ్వమావర్తయిత్వా తు మయా యత్నేన సాధితమ్ ॥ 36
నేను పరమపురుషుడైన పరమాత్మను ప్రార్థించి నీకోసం, నీ తల్లి కోసం ప్రయత్నంతో రెండు చరుద్రవ్యాల్ని సాధించాను. (36)
ప్రాశితవ్యం ప్రయత్నేన చేత్యుక్త్వాదర్శనం గతః ।
ఆలింగనే చరౌ చైవ చక్రతుస్తే విపర్యయమ్ ॥ 37
'మీరిరువురు శ్రద్ధతో ఆ చరు ద్వయాన్ని తినండి' అని ఆయన అంతర్ధానం అయ్యాడు. ఆలింగనం విషయంలో, చరువును తినటంలో వారు తారుమారు చేశారు. (37)
తతః పునః స భగవాన్ కాలే బహుతిథే గతే ।
దివ్యజ్ఞానాద్ విదిత్వా తు భగవానాగతః పునః ॥ 38
చాలకాలం గడవగా భృగుమహర్షి తన దివ్యదృష్టిచే ఈ విషయాన్ని గమనించి, తిరిగి వచ్చాడు. (38)
అథోవాచ మహాతేజాః భృగుః సత్యవతీం స్నుషామ్ ।
ఉపయుక్తశ్చరుర్భద్రే వృక్షే చాలింగనం కృతమ్ ॥ 39
విపరీతేన తే సుభ్రూః మాత్రా చైవాసి వంచితా ।
బ్రాహ్మణః క్షత్రవృత్తిర్వై తవ పుత్రో భవిష్యతి ॥ 40
కోడలైన సత్యవతితో తేజోవంతుడైన భృగువు 'చరువు ఉపయోగింపబడింది, ఆలింగనం చేయబడింది. కాని ఈ పని విపరీతంగా మీరు చేయటం వలన బ్రాహ్మణుడై క్షత్రియ కర్మ చేసే పుత్రుడు నీకు కలుగుతాడు. (39,40)
క్షత్రియో బ్రాహ్మణాచారః మాతుస్తవ సుతో మహాన్ ।
భవిష్యతి మహావీర్యః సాధూనాం మార్గమాస్థితః ॥ 41
క్షత్రియుడై బ్రాహ్మణునివలె ఆచరించే కుమారుడు నీ తల్లికి కలుగుతాడు. ఈ బాలుడు పరాక్రమవంతుడై సత్పురుషుల మార్గాన్ని ఆశ్రయిస్తాడు. (41)
తతః ప్రసాదయామాస శ్వశురం సా పునః పునః ।
న మే పుత్రో భవేదీదృక్ కామం పౌత్రో భవేదితి ॥ 42
తన మామను సత్యవతి పదేపదే బ్రతిమాలింది. 'నా పుత్రుడు ఇట్టివాడు కాకూడదు. మనుమడు క్షత్రియస్వభావం కలవాడు అగుగాక' అన్నది. (42)
ఏవమస్త్వితి సా తేన పాండవ ప్రతినందితా ।
జమదగ్నిం తతః పుత్రం జజ్ఞే సా కాల ఆగతే ॥ 43
పాండవా! అలాగే అని భృగువు తన కోడలిని అనుగ్రహించాడు. ప్రసవ సమయంలో ఆమె జమదగ్ని అనే కుమారుని కన్నది. (43)
తేజసా వర్చసా చైవ యుక్తం భార్గవనందనమ్ ।
స వర్ధమానస్తేజస్వీ వేదస్యాధ్యయనేన చ ॥ 44
బహూనృషీన్ మహాతేజాః పాండవేయాత్యవర్తత ।
పాండవా! భృగునందనుడు తేజస్సుతో, వర్చస్సుతో పెరగసాగాడు. తేజస్వియైన జమదగ్ని ఇతర ఋషికుమారుల కంటె వేదాధ్యయనంలో ముందు నిలిచాడు. (44)
తం తు కృత్స్నో ధనుర్వేదః ప్రత్యభాద్ భరతర్షభ ।
చతుర్విధాని చాస్త్రాణి భాస్కరోపమవర్చసమ్ ॥ 45
భరతర్షభా! సూర్యసమతేజస్సు గల అతనిబుద్ధిలో ధనుర్వేదం, నాలుగు విధాలు అయిన అస్త్రాలు పూర్తిగా స్వయంగానే ప్రవేశించాయి. (45)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం కార్తవీర్యోపాఖ్యానే పంచదశాధికశతతమోఽధ్యాయః ॥ 115 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో కార్తవీర్యోపాఖ్యానమను నూట పదునైదవ అధ్యాయము. (115)