76. డెబ్బది ఆరవ అధ్యాయము
నలుడు ప్రకటమగుట - నలదమయంతుల సమాగమము.
బృహదశ్వ ఉవాచ
సర్వం వికారం దృష్ట్వా తు పుణ్యశ్లోకస్య ధీమతః ।
ఆగత్య కేశినీ సర్వం దమయంత్యై న్యవేదయత్ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు -
పుణ్యశ్లోకుడు, ధీమంతుడు అయిన బాహుకుని ముఖకవళికలను, మనోవికారాలను చూచిన కేశిని వెంటనే వచ్చి దమయంతికి అంతా నివేదించింది. (1)
దమయంతీ తతో భూయః ప్రేషయామాస కేశినీమ్ ।
మాతుః సకాశం దుఃఖార్తా నలదర్శనకాంక్షయా ॥ 2
విషయాన్నంతా విన్న దమయంతి, కేశినిని మరల పంపించింది. తర్వాత దుఃఖార్తయైన దమయంతి నలుని చూడాలని తనతల్లితో ఇలా అంది. (2)
పరీక్షితో మే బహుశః బాహుకో నలశంకయా ।
రూపే మే సంశయస్త్వేకః స్వయమిచ్ఛామి వేదితుమ్ ॥ 3
బాహుకుడు నలుడై యుంటాడనే అనుమానంతో అనేక విధాల పరీక్షించాను. రూపాన్ని గురించే సందేహం కలుగుతోంది. నేనే స్వయంగా ఆ సందేహాన్ని తీర్చుకోదలచాను. (3)
స వా ప్రవేశ్యతాం మాతః మాం వానుజ్ఞాతుమర్హసి ।
విదితం వాథవా జ్ఞాతం పితుర్మే సంవిథీయతామ్ ॥ 4
నలమహారాజును మనమందిరలో ప్రవేశపెట్టండి. లేదా నేనచటకు వెళ్ళటానికి సమ్మతించండి. తండ్రిగారికి ఈ విషయం తెలిసినా, తెలియకపోయినా ఈ పని చెయ్యండి. (4)
ఏవముక్తా తు వైదర్భ్యా సా దేవీ భీమమబ్రవీత్ ।
దుహితుస్తమభిప్రాయమ్ అన్వజానాత్ స పార్థివః ॥ 5
ఈవిధంగా దమయంతి తెలియజేసిన అభిప్రాయాన్ని, ఆమె తల్లి వెంటనే భీమమహారాజునకు తెలియజేసింది. (5)
సా వై పిత్రాభ్యనుజ్ఞాతా మాత్రా చ భరతర్షభ ।
నలం ప్రవేశయామాస యత్ర తస్యాః ప్రతిశ్రయః ॥ 6
తాం స్మ దృష్ట్వైవ సహసా దమయంతీం నలో నృపః ।
ఆవిష్టః శోకదుఃఖాభ్యాం బభూవాశ్రుపరిప్లుతః ॥ 7
ధర్మజా! అపుడు దమయంతి తల్లిదండ్రుల అనుజ్ఞ పొందింది. దమయంతి ఉన్న మందిరంలోనికే నలుని
ప్రవేశపెట్టారు. దమయంతిని చూడగానే నలునికి, దుఃఖశోకాలు ఆవరించి కన్నుల నుండి నీరు పెల్లుబికింది. (6,7)
తం తు దృష్ట్వా తథాయుక్తం దమయంతీ నలం తదా ।
తీవ్రశోకసమావిష్టా బభూవ వరవర్ణినీ ॥ 8
కులస్త్రీయైన దమయంతి అప్పుడు ఆస్థితిలో ఉన్న నలుని చూచి తీవ్రమైన శోకాన్ని పొందింది. (8)
తతః కాషాయవసనా జటిలా మలపంకినీ ।
దమయంతీ మహారాజ బాహుకం వాక్యమబ్రవీత్ ॥ 9
ధర్మరాజా! దమయంతి మలినమైన శరీరంతో, జటిలమై, కాషాయవస్త్రాలను ధరించి ఉంది. ఆమె బాహుకునితో ఇలా పలికింది. (9)
పూర్వం దృష్టస్త్వయా కశ్చిద్ ధర్మజ్ఞో నామ బాహుక ।
సుప్తాముత్సృజ్య విపినే గతో యః పురుషః స్త్రియమ్ ॥ 10
బాహుకా! పూర్వం, అరణ్యంలో నిద్రిస్తున్న భార్యను విడిచివెళ్లిన ఒకానొక ధర్మజ్ఞుడైన పురుషుని నీవు చూచావా? (10)
అనాగసం ప్రియాం భార్యాం విజనే శ్రమమోహితామ్ ।
అపహాయ తు కో గచ్ఛేత్ పుణ్యశ్లోకమృతే నలమ్ ॥ 11
ఏ తప్పూ చేయని భార్యను జనరహితప్రదేశంలో, మార్గాయాసంతో ఒడలు తెలియక నిద్రించే సమయంలో పుణ్యశ్లోకుడైన నలుడు దప్ప మరెవ్వడైనా విడిచివెళ్ళగలడా? (11)
కిము తస్య మయా బాల్యాద్ అపరాద్ధం మహీపతేః ।
యో మాముత్సృజ్య విపినే గతవాన్ నిద్రయార్దితామ్ ॥ 12
ఆ మహారాజునకు నేను బాల్యం నుండి ఏమైనా అపరాధం చేశానా? అరణ్యంలో నిద్రిస్తున్న నన్ను విడిచిపెట్టి వెళ్ళాడుగదా! (12)
సాక్షాద్ దేవానపాహాయ వృతో యః స పురా మయా ।
అనువ్రతాం సాభికామాం పుత్రిణీం త్య క్తవాన్ కథమ్ ॥ 13
ప్రత్యక్షంగా వచ్చిన దేవతలను వదలి, నలునే వరించానే! అతనినే వివాహమాడి అనువ్రతమనైన సంతానవతిని నన్నెట్లు విడిచివెళ్ళినాడో! (13)
అగ్నౌ పాణిం గృహీత్వా తు దేవానామగ్రతస్తథా ।
భవిష్యామీతి సత్యం తు ప్రతిశ్రుత్య క్వ తద్ గతమ్ ॥ 14
అగ్నిసాక్షిగా దేవతలందరిముందు పాణిగ్రహణం చేసి సత్యంగా నీతోనే ఉండగలనని పలికిన నలమహారాజు ఎక్కడకు వెళ్ళినాడు? (14)
దమయంత్యా బ్రువంత్యాస్తు సర్వమేతదరిందమ ।
శోకజం వారి నేత్రాభ్యామ్ అసుఖం ప్రాస్రవద్ బహు ॥ 15
దమయంతి ఇలా మాట్లాడుతున్నప్పుడు నలుడు అతికష్టం మీద ఆపుకొందామన్నా ఆగక, కన్నుల నుండి నీరు స్రవించింది. (15)
అతీవ కృష్ణ సారాభ్యాం రక్తాంతాభ్యాం జలం తు తత్ ।
పరిస్రవన్ నలో దృష్ట్వా శోకార్తామిదమబ్రవీత్ ॥ 16
నలమహారాజు ఎర్రని కనుగొలకుల నుండి కన్నీరు విడుస్తూనే శోకార్తయైన దమయంతి నుద్దేశించి ఇలా పలికాడు. (16)
మమ రాజ్యం ప్రణష్టం యద్ నాహం తత్ కృతవాన్ స్వయమ్ ।
కలినా తత్ కృతం భీరు యచ్చ త్వామహమత్యజమ్ ॥ 17
నాయొక్క రాజ్యం పోయింది. నిన్ను విడిచిపెట్టటం జరిగింది. ఈ సంఘటనలన్నీ నా స్వయంకృతాలు కావు. దమయంతీ! ఇవన్నీ కలిపురుషునిచే చేయబడిన పనులు. (17)
యత్ త్వయా ధర్మకృచ్ర్ఛే తు శాపేనాభిహతః పురా ।
వనస్థయా దుఃఖితయా శోచంత్యా మాం దివానిశమ్ ॥ 18
స మచ్ఛరీరే త్వచ్ఛాపాద్ దహ్యమానోఽవసత్ కలిః ।
త్వచ్ఛాపదగ్ధః సతతం సోఽగ్నావగ్నిరివాహితః ॥ 19
ధర్మానికి కలిగిన కష్టంలో వనంలో నుండి, దుఃఖించే నన్ను గురించి రాత్రింబవళ్ళు ఆలోచించే నీవు కలిని శపించావు. ఆ కలిపురుషుడు ఆ శాపాగ్నిచే దహింపబడుతూనే నాశరీరంలో చేరి నా శరీరాన్ని కూడ దహింపజేశాడు. (18,19)
మమ చ వ్యవసాయేన తపసా చైవ నిర్జితః ।
దుఃఖస్యాంతేన చానేన భవితవ్యం హి నౌ శుభే ॥ 20
నా ప్రయత్నం చేతను, తపస్సుచేతను కలిపురుషుడు జయింపబడినాడు. మన దుఃఖానికి అంతం కలిగింది! మనకు శుభసమయం ఆసన్నమైంది. (20)
విముచ్య మాం గతః పాపః తతోఽహమిహ చాగతః ।
త్వదర్థం విపులశ్రోణి న హి మేఽన్యత్ ప్రయోజనమ్ ॥ 21
కలిపురుషుడు నా శరీరాన్ని విడిచివెళ్ళిన తర్వాతనే నేనిచ్చటకు వచ్చాను. దమయంతీ! నేను నీకొరకే ఇచ్చటకు వచ్చాను. మరొక ప్రయోజనం ఏమీ లేదు. (21)
కథం ను నారీ భర్తారమ్ అనురక్తమనువ్రతమ్ ।
ఉత్సృజ్య వరయేదన్యం యథా త్వం భీరు కర్హిచిత్ ॥ 22
దమయంతీ! అనురాగం కలిగి తన్ననుసరించే భర్తను వదలి, ఏ స్త్రీ అయినా సరే మరొకనిని నీవలె వరించునా? (22)
దూతాశ్చరంతి పృథివీం కృత్స్నాం నృపతిశాసనాత్ ।
భైమీ కిల స్మ భర్తారం ద్వితీయం వరయిష్యతి ॥ 23
'విదర్భరాజశాసనంతో దూతలు భూమండలమంతా సంచరిస్తున్నారు. "దమయంతి మరొకనిని వరించబోతోంది." (23)
స్వైరవృత్తా యథాకామమ్ అనురూపమివాత్మనః ।
శ్రుత్వైవ చైవం త్వరితః భాంగాసురిరుపస్థితః ॥ 24
ఈవార్తను విని ఆమె స్వేచ్ఛగా తన అభిరుచిని అనుసరించి తగిన వానిని ఎన్నుకొనబోతోంది అని ఋతుపర్ణ మహారాజు అతిత్వరితగతిని ఇచటకు వచ్చాడు. (24)
దమయంతీ తు తచ్ర్ఛుత్వా నలస్య పరిదేవితమ్ ।
ప్రాంజలిర్వేపమానా చ భీతా వచనమబ్రవీత్ ॥ 25
మిక్కిలి దుఃఖంతో పలుకే నలుని మాటలు విని దమయంతి భీతిచెంది అంజలి ఘటించి, వణికిపోతూ ఇలా పలికింది. (25)
దమయంత్యువాచ
న మామర్హసి కల్యాణ దోషేణ పరిశంకితుమ్ ।
మయా హి దేవానుత్సృజ్య వృతస్త్వం నిషధాధిప ॥ 26
దమయంతి ఇలా అన్నది. కళ్యాణా!
నిషధరాజా! దేవతలను విడిచి నిన్నే వరించినదానను నేను. దోషారోపణ చేసి నన్ను అనుమానించటం తగదు. (26)
తవాభిగమనార్థం తు సర్వతో బ్రాహ్మణా గతాః ।
వాక్యాని మమ గాథాభిః గాయమానా దిశో దశ ॥ 27
నీరాకకొరకే అన్నిదిక్కులకు బ్రాహ్మణులను పంపడమూ, నాకథను ఎన్నోచోట్ల చెప్పించటమూ జరిగింది. (27)
తతస్త్వాం బ్రాహ్మణో విద్వాన్ పర్ణాదో నామ పార్థివ ।
అభ్యగచ్ఛత్ కోసలాయామ్ ఋతుపర్ణనివేశనే ॥ 28
ఆ బ్రాహ్మణులలో పర్ణాదుడనే బ్రాహ్మణపండితుడు కోసల రాజ్యానికి వచ్చి, ఋతుపర్ణమహారాజును కలిసినాడు. (28)
తేన వాక్యే కృతే సమ్యక్ ప్రతివాక్యే తథాఽఽహృతే ।
ఉపాయోఽయం మయా దృష్టః నైషధానయనే తవ ॥ 29
నిషిధరాజా! ఆ బ్రాహ్మణుడు మాట్లాడిన మాటలకు సమాధానంగా వచ్చిన మాటలను బట్టియే మిమ్ములను రప్పించుటకై నాకు తోచినదే ఈ ఉపాయం. (29)
త్వామృతే న హి లోకేఽన్యః ఏకాహ్నా పృథివీపతే ।
సమర్థో యోజనశతం గంతుమశ్వైర్నరాధిప ॥ 30
మహారాజా! నీవు తప్ప మరొకరెవ్వరూ ఒక్క రోజులో నూరుయోజనాల దూరం గుర్రాలతో ప్రయాణం చేయగల సమర్థుడు లేడు. (30)
స్పృశేయం తేన సత్యేన పాదావేతౌ మహీపతే ।
యథా నాసత్కృతం కించిత్ మనసాపి చరామ్యహమ్ ॥ 31
భూపతీ! మిమ్ములను అగౌరవపరచాలనే భావం మనస్సులో కూడా లేదని మీపాదాల సాక్షిగా చెప్తున్నాను. (32)
అయం చరతి లోకేఽస్మిన్ భూతసాక్షీ సదాగతిః ।
ఏష మే ముంచతు ప్రాణాన్ యది పాపం చరామ్యహమ్ ॥ 32
అట్టిపాపచింతన నాలో ఉంటే, సర్వదా సర్వప్రాణులకు సాక్షిగా చరించే వాయుదేవుడు నా ప్రాణాలను తీయునుగాక! (32)
యథా చరతి తిగ్మాంశుః పరేణ భువనం సదా ।
న ముంచతు మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహమ్ ॥ 33
నాలో పాపచింతన ఉంటే సకలభువన సంచారియగు సూర్యభగవానుడు నా ప్రాణాలను హరించుగాక! (33)
చంద్రమాః సర్వభూతానామ్ అంతశ్చరతి సాక్షివత్ ।
న ముంచతు మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహమ్ ॥ 34
నాలో పాపచింతన ఉంటె సమస్తప్రాణులలో సాక్షివలె అంతశ్చిరియగు చంద్రుడు నాప్రాణాలను తీయును గాక!. (34)
ఏతే దేవాస్త్రయః కృత్స్నం త్రైలోక్యం ధారయంతి వై ।
విబ్రువంతు యథా సత్యమ్ ఏతద్ దేవాస్త్యజంతు మామ్ ॥ 35
ఈ ముగ్గురు దేవతలు ముల్లోకాలకు ఆధారభుతులై ఉన్నారు. నా మాటలు సత్యాలని ఆ దేవతలే చెప్తారు లేదా విడిచిపెడ్తారు. (35)
ఏవముక్తస్తథా వాయుః అంతరిక్షాదభాషత ।
నైషా కృతవతీ పాపం నల సత్యం బ్రవీమి తే ॥ 36
ఈ విధంగా దమయంతి అనగానే అంతరిక్షం నుండి వాయుదేవుడిలా అన్నాడు. నలమహారాజా! ఈ దమయంతి ఏ పాపమూ చేయలేదు. నీకు సత్యమే చెప్తున్నాను. (36)
రాజన్ శీలనిధిః స్ఫీతః దమయంత్యా సురక్షితః ।
సాక్షిణో రక్షిణశ్చాస్యాః వయం త్రీన్ పరివత్సరాన్ ॥ 37
రాజా! లోకవ్యాప్తమైన దమయంతి సౌశీల్యం సురక్షితంగా ఉంది. మంచినడవడిక కల్గిన దమయంతికి గడచిన మూడు సంవత్సరాల కాలంలో రక్షకులుగా, సాక్షిభూతులుగా మేము ముగ్గురమే ఉన్నాము. (37)
ఉపాయో విహితశ్చాయం త్వదర్థమతులోఽనయా ।
న హ్యేకాహ్నా శతం గంతా త్వామృతేఽన్యః పుమానిహ ॥ 38
ఒక రోజులో నూరు యోజనాలు పయనింపగలవాడు నీవు తప్ప మరొకడు లేడని భావించిన దమయంతి నిన్ను రావించుటకు తగిన ఉపాయాన్ని ఆలోచించింది. (38)
ఉపపన్నా త్వయా భైమీ త్వం చ భైమ్యా మహీపతే ।
నాత్ర శంకా త్వయా కార్యా సంగచ్ఛ సహ భార్యయా ॥ 39
రాజా! నీకు దమయంతి లభించింది. దమయంతికి నీవు లభించావు. ఈ విషయంలో నీవు ఎలాంటి అనుమానాన్ని పెట్టుకోవటం తగదు. భార్యతో కలసి మెలసి సుఖంగా చరించు. (39)
తథా బ్రువతి వాయౌ తు పుష్పవృష్టిః పపాత హ ।
దేవదుందుభయో నేదుః వవౌ చ పవనః శివః ॥ 40
ఈవిధంగా వాయుదేవుడు పలుకుతూంటే పుష్పవర్షం కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. మంగళకరమైన గాలి వీచింది. (40)
తదద్భుతమయం దృష్ట్వా నలో రాజాథ భారత ।
దమయంత్యాం విశంకాం తామ్ ఉపాకర్షదరిందమః ॥ 41
ధర్మరాజా! ఈ అద్భుతాన్ని చూచిన నలమహారాజు దమయంతి విషయంలో నున్న అనుమానాన్ని ఉపసంహరించుకొన్నాడు. (41)
తతస్తద్ వస్త్రమజరం ప్రావృణోద్ వసుధాధిపః ।
సంస్కృత్య నాగరాజం తం తతో లేభే స్వకం వపుః ॥ 42
అంతట నలమహారాజు నూతన వస్త్రాన్ని కప్పుకొని నాగరాజును స్మరించాడు. దాంతో నలుడు తన యథార్థమైన రూపాన్ని పొందాడు. (42)
స్వరూపిణం తు భర్తారం దృష్ట్వా భీమసుతా తదా ।
ప్రాక్రోశదుచ్చైరాలింగ్య పుణ్యశ్లోకమనిందితా ॥ 43
స్వరూపాన్ని పొందిన పుణ్యశ్లోకుడైన తన భర్తను చూచి పతివ్రతాశిరోమణియైన దమయంతి నలుని గాఢాలింగనం చేసికొని బిగ్గరగా విలపించింది. (43)
భైమీమపి నలో రాజా భ్రాజమానో యథా పురా ।
సస్వజే స్వసుతౌ చాపి యథావత్ ప్రత్యనందత ॥ 44
నలమహారాజు కూడ తేజోవంతుడై పూర్వం వలెనే భీమపుత్రి దమయంతితోను, తన పిల్లలతోను ఆనందంగా ఉన్నాడు. (44)
తతః స్వోరసి విన్యస్య వక్ర్తం తస్య శుభాననా ।
పరీతా తేన దుఃఖేన నిశశ్వాసాయతేక్షణా ॥ 45
తర్వాత దమయంతి - నలుని శిరస్సును తన హృదయం మీద పెట్టుకొని పట్టరాని దుఃఖంతో దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది. (45)
తథైవ మలదిగ్ధాంగీం పరిష్వజ్య శుచిస్మితామ్ ।
సుచిరం పురుషవ్యాఘ్రః తస్థౌ శోకపరిప్లుతః ॥ 46
అదే విధంగా మలినదేహంతో ఉన్నప్పటికీ, తెలినవ్వుల దమయంతిని ఆ పురుషశ్రేష్ఠుడైన నలుడు ఆలింగనం చేసికొని, శోకంతో అలాగే నిలిచిపోయాడు. (46)
తతః సర్వం యథావృత్తం దమయంత్యా నలస్య చ ।
భీమాయాకథయత్ ప్రీత్యా వైదర్భ్యా జననీ నృప ॥ 47
ఆ తర్వాత దమయంతి తల్లి భీమమహారాజునకు నలదమయంతుల గురించి జరిగినదంతా ప్రీతితో వివరంగా చెప్పింది. (47)
తతోఽబ్రవీన్మహారాజః కృతశౌచమహం నలమ్ ।
దమయంత్యా సహోపేతం కల్యే ద్రష్టా సుఖోషితమ్ ॥ 48
మర్నాడు ఉదయం మంగళస్నానం ఆచరించి తేజస్సుతో ప్రకాశిస్తూ, దమయంతీ సహితుడై సుఖంగా ఉన్న నలమహారాజును చూస్తానని భీమరాజు పలికాడు. (48)
తతస్తౌ సహితౌ రాత్రిం కథయంతౌ పురాతనమ్ ।
వనే విచరితం సర్వమ్ ఊషతుర్ముదితౌ నృప ॥ 49
రాజా! ఆ రోజు రాత్రి నలదమయంతులు ఇరువురూ కలసి జరిగిపోయిన అరణ్యవాస విశేషాలన్నీ సంతోషంతో చెప్పుకొంటూ గడిపారు. (49)
గృహే భీమస్య నృపతేః పరస్పరసుఖైషిణౌ ।
వసేతాం హృష్టసంకల్పౌ వైదర్భీ చ నలశ్చ హ ॥ 50
భీమరాజు గృహంలో నలదమయంతులిరువురు ఒకరి సుఖాన్ని మరొకరు కోరుతూ, సంతుష్టసంకల్పులై ఉన్నారు. (50)
స చతుర్థే తతో వర్షే సంగమ్య భార్యయా ।
సర్వకామైః సుసిద్ధార్థః లబ్ధవాన్ పరమాం ముదమ్ ॥ 51
ఆ నలమహారాజు మూడు సంవత్సరాల తర్వాత భార్యాసహితుడై సర్వసుఖాలను అనుభవిస్తూ పరమానందాన్ని పొందాడు. (51)
దమయంత్యపి భర్తారమ్ ఆసాద్యాప్యాయితా భృశమ్ ।
అర్ధసంజాతసస్యేవ తోయం ప్రాప్య వసుంధరా ॥ 52
నీటితో సగం మొలిచిన పంట గల భూమి వలె, దమయంతి భర్తను పొంది మిక్కిలి ఆప్యాయతానురాగాలతో సంతృప్తి పొందింది. (52)
సైవం సమేత్య వ్యపనీయ తంద్రాం
శాంతజ్వరా హర్షవివృద్ధపత్త్వా ।
రరాజ భైమీ సమవాప్తకామా
శీతాంశునా రాత్రిరివోదితేన ॥ 53
ఈవిధంగా భర్తను కలిసిన దమయంతి తొట్రుపాటు పోయి, తాపం శమించి, ఎంతో సంతోషంతో, కోరికలన్నీ తీరి చంద్రునితో కూడిన రాత్రి వలె ప్రకాశించింది. (53)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలదమయంతీసమాగమే షట్సప్తతితమోఽధ్యాయః ॥ 76 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలదమయంతీ సమాగమమను డెబ్బది ఆరవ అధ్యాయము. (76)