75. డెబ్బది అయిదవ అధ్యాయము
దమయంతి తన పుత్రికను, పుత్రుని బాహుకుని దగ్గరకు పంపుట.
బృహదశ్వ ఉవాచ
దమయంతీ తు తచ్ర్ఛుత్వా భృశం శోకపరాయణా ।
శంకమానా నలం తం వై కేశినీమిదమబ్రవీత్ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు. ఆ విషయాన్నంతా విన్న దమయంతి అత్యంత దుఃఖాన్ని పొందింది. అతడు నలుడే అని అనుమానించి కేశినితో ఇలా పలికింది. (1)
గచ్ఛ కేశిని భూయస్త్వం పరీక్షాం కురు బాహుకే ।
అబ్రువాణా సమీపస్థా చరితాన్యస్య లక్షయ ॥ 2
కేశినీ! నీవు మళ్లీ బాహుకుని దగ్గరకు వెళ్ళు. అతనిని ఇంకా పరీక్షించు. ఏమీ మాట్లాడకుండ ప్రక్కనే ఉండి అతని పనులను గమనించు. (2)
యదా చ కించిత్ కుర్యాత్ స కారణం తత్ర భామిని ।
తత్ర సంచేష్టమానస్య లక్షయంతీ విచేష్టితమ్ ॥ 3
అతడెప్పుడు ఏ చిన్న పనిచేసినా దానికి కారణం ఉంటుంది. అతడు చేసే పనుల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. సరిగా గమనించి. (3)
న చాస్య ప్రతిబంధేన దేయోఽగ్నిరపి కేశిని ।
యాచతే న జలం దేయం సర్వథా త్వరమాణయా ॥ 4
కేశినీ! అతడు పట్టుబట్టినా నిప్పును సమకూర్చవద్దు. అడగుతున్నా సరే తొందరపడు నీటిని కూడా ఇవ్వవద్దు. (4)
ఏతత్ సర్వం సమీక్ష్య త్వం చరితం మే నివేదయ ।
నిమిత్తం యత్ త్వయా దృష్టం బాహుకే దైవమానుషమ్ ॥ 5
యచ్చాన్యదపి పశ్యేథాః తచ్చాఖ్యేయం త్వయా మమ ।
పైన చెప్పిన విషయాలన్నీ గమనించి, అతని ప్రవర్తనను గురించి నాకు తెలియజేయి. అతనిలో దైవమానుష సంబంధమైన చర్యలేమైనా చూస్తే వెంటనే వాటిని నాకు తెలియజేయి. ఇంకా ఏవి చూసినా ఆ విశేషాలన్నీ చెప్పుము. (5 1/2)
దమయంత్యైవముక్తా సా జాగామాథ చ కేశినీ ॥ 6
నిశమ్యాథ హయజ్ఞస్య లింగాని పునరాగమత్ ।
కేశిని దమయంతి చెప్పినవన్నీ విని, బాహుకుని చెంతకు వెళ్ళి అతని విలక్షణమైన పనులన్నీ గ్రహించి తిరిగి వచ్చింది. (6 1/2)
సా తత్ సర్వం యథావృత్తం దమయంత్యై న్యవేదయత్ ।
నిమిత్తం యత్ తయా దృష్టం బాహుకే దైవమానుషమ్ ॥ 7
తిరిగి వచ్చిన కేశిని, బాహుకునిలో తాను చూచిన దైవమానుషనిమిత్తాలను యథాతథంగా దమయంతికి నివేదించింది. (7)
కేశిన్యువాచ
దృఢం శుచ్యుపచారోఽసౌ న మయా మానుషః క్వచిత్ ।
దృష్టపూర్వః శ్రుతో వాపి దమయంతి తథావిధః ॥ 8
కేశిని ఇలా అన్నది.
పారిశుద్ధ్యాన్ని పాటించే విషయంలో అతనికున్నమ్త పట్టుదల మానవుల్లో ఎక్కడా కనలేదు, వినలేదు. (8)
హ్రస్వమాసాద్య సంచారం నాసౌ వినమతే క్వచిత్ ।
తం తు దృష్ట్వా యథాసంగమ్ ఉత్సర్పతి యథాసుఖమ్ ॥ 9
నలుడెప్పుడునూ పొట్టిగానున్న ద్వారం దగ్గర తల వంచడు. నలుడు దానిని చూచినపుడు, అదియే నలునకు సరిపడేటట్లు పైకిలేస్తుంది. సుఖంగా అతడు ద్వారం దాటుతాడు. (9)
సంకటేఽప్యస్య సుమహాన్ వివరో జాయతేఽధికః ।
ఋతుపర్ణస్య చార్థాయ భోజనీయమనేకశః ॥ 10
సంకటస్థితిలో ఉన్నా ఆ మహాత్ముని చర్యలు చాలగొప్పవిగా ఉన్నాయి. ఋతుపర్ణునికోసం అనేకవిధాలైన భోజనపదార్థాలను తయారుచేస్తున్నాడు. (10)
ప్రేషితం తత్ర రాజ్ఞా తు మాంసం చైవ ప్రభూతవత్ ।
తస్య ప్రక్షాలనార్థాయ కుంభాస్తత్రోపకల్పితాః ॥ 11
వంటశాలకు రాజుగారు పంపించిన మాంసం పెద్దరాశివలె ఉంది. ఆ మాంసాన్ని కడగటం కోసం కడవలు అక్కడ సిద్ధం చేయబడ్డాయి. (11)
తే తేనావేక్షితాః కుంభాః పూర్ణా ఏవాభవంస్తతః ।
తతః ప్రక్షాలనం కృత్వా సమధిశ్రిత్య బాహుకః ॥ 12
తృణముష్టిం సమాదాయ సవితుస్తం సమాదధత్ ।
అథ ప్రజ్వలితస్తత్ర సహసా హవ్యవాహనః ॥ 13
బాహుకుడు కుండలవైపు చూడగానే అవన్నీ నీటితో నిండిపోయాయి. తర్వాత నలుడు ఆ నీటితో మాంసాన్ని శుభ్రంగా కడిగాడు. ఆ తర్వాత ఓ పిడికెడు గడ్డి తీసుకొని దానిని సూర్యుని వైపు చూపగానే అది మండింది. దానితో అగ్నిని సిద్ధం చేశాడు. (12,13)
తదద్భుతతమం దృష్ట్వా విస్మితాహమిహాగతా ।
అన్యచ్చ తస్మిన్ సుమహత్ ఆశ్చర్యం లక్షితం మయా ॥ 14
ఆ అద్భుతాన్ని చూచి ఆశ్చర్యాన్ని పొంది ఇచ్చటకు వచ్చాను. ఇలాంటిదే మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను చూశాను. (14)
యదగ్నిమపి సంస్పృశ్య నైవాసౌ దహ్యతే శుభే ।
ఛందేన చోదకం తస్య వహత్యావర్జితం ద్రుతమ్ ॥ 15
దమయంతీ! అతడు అగ్నిని తాకినప్పటికి అది వానిని దహించటం లేదు. కోరగానే నీరు అతని చెంతకే వస్తోంది. (15)
అతీవ చాన్యత్ సుమహదాశ్చర్యం దృష్టవత్యహమ్ ।
యత్ స పుష్పాణ్యుపాదాయ హస్తాభ్యాం మమృదే శనైః ॥ 16
మృద్యమానాని పాణిభ్యాం తేన పుష్పాణి నాన్యథా ।
భూయ ఏవ సుగంధీని హృషితాని భవంతి హి ।
ఏతాన్యద్భుతలింగాని దృష్ట్వాహం ద్రుతమాగతా ॥ 17
మిక్కిలి ఆశ్చర్యకరమైన మరోవిషయాన్ని కూడ నేను చూశాను. అతడు పువ్వులు తీసుకొని రెండు చేతులతో మెల్లగా నలిపి అక్కడపెట్టాడు. అతనిహస్తస్పర్శతో పుష్పాలు మరింతగ సువాసనలు సంతరించుకొన్నాయి. మరింతగా వికాసం పొందుతున్నాయి.
ఈ అద్భుతాలు చూసి, మీకు చెప్పడానికి అతిశీఘ్రంగా ఇక్కడకు వచ్చాను - అని కేశిని దమయంతికి నివేదించింది. (16,17)
బృహదశ్వ ఉవాచ
దమయంతీ తు తచ్ర్ఛుత్వా పుణ్యశ్లోకస్య చేష్టితమ్ ।
అమన్యత నలం ప్రాప్తం కర్మచేష్టాభిసూచితమ్ ॥ 18
కేశిని చెప్పిన విశేషాలను విన్న పిమ్మట అవన్నీకూడ నలుని పనులను, చరితను సూచిస్తున్నాయి అనుకొని దమయంతి, నలుడు వచ్చినట్లే తలచింది. (18)
సా శంకమానా భర్తారం బాహుకం పునరింగితైః ।
కేశినీం శ్లక్ష్ణయా వాచా రుదతీ పునరబ్రవీత్ ॥ 19
పునర్గచ్ఛ ప్రమత్తస్య బాహుకస్యోపసంస్కృతమ్ ।
మహానసాద్ ద్రుతం మాంసమ్ ఆనయ స్వేహ భావిని ॥ 20
సా గత్వా బాహుకస్యాగ్రే తన్మాంసమపకృష్య చ ।
అత్యుష్ణమేవ త్వరితా తత్క్షణాత్ ప్రియకారిణీ ॥ 21
పనులతీరును, లక్షణాలను గురించి విన్న దమయంతి బాహుకుని తన భర్తయైన నలునిగ అనుమానించి విలపిస్తూ, మృదువాక్కులతో ఇలా పలికింది -
కేశినీ -
నీవు మరోసారి అక్కడకు వెళ్ళి పాకశాలలో బాహుకునిచే వంటచేయబడిన మాంసాణ్ని తెమ్ము. - అని దమయంతి చెప్పగానే, కేశిని వెళ్ళి, పాకశాలలో అపుడే ఉడికి వేడిగానున్న మాంసాన్ని బాహుకుని ఎదుటనే తీసికొని వెంటనే దమయంతి దగ్గరకు వెళ్ళింది. (19-21)
దమయంత్యై తతః ప్రాదాత్ కేశినీ కురునందన ।
సో చితా నలసిద్ధస్య మాంసస్య బహుశః పురా ॥ 22
ధర్మజా! కేశిని ఆ వేడిమాంసాన్ని దమయంతి చేతికిచ్చింది. అందుకు దమయంతి తగినదే! ఎందుకంటే, ఆమె ఇదివరలో అనేక పర్యాయాలు నలుడు వండిన మాంసాన్ని రుచిచూచినదే కదా! (22)
ప్రాశ్య మత్వా నలం సూతం ప్రాక్రోశద్ భృశదుఃఖితా ।
వైక్లవ్యం పరమం గత్వా ప్రక్షాల్య చ ముఖం తతః ॥ 23
మిథునం ప్రేషయామాస కేశిన్యా సహ భారత ।
ఇంద్రసేనాం సహ భ్రాత్రా సమభిజ్ఞాయ బాహుకః ॥ 24
అభీద్రుత్య తతో రాజా పరిష్వజ్యాంకమానయత్ ।
బాహుకస్తు సమాసాద్య సుతౌ సురసుతోపమౌ ॥ 25
భృశం దుఃఖపరీతాత్మా సుస్వరం ప్రరురోద హ ।
నైషధో దర్శయిత్వా తు వికారమసకృత్ తదా ।
ఉత్సృజ్య సహసా పుత్రౌ కేశినీమిదమబ్రవీత్ ॥ 26
దమయంతి ఆ మాంసాన్ని తిని, సూతుడుగానున్న బాహుకుని నలునిగా దలచి, అతనిస్థితికి ఎంతగానో బాధపడింది. మిక్కిలి వైక్లబ్యాన్ని పొందింది. అక్కడ నుండి వెళ్ళి ముఖాన్ని బాగా కడుక్కొన్నది. తన పుత్రుని, పుత్రికను కేశినితో బాహుకుని దగ్గరకు పంపించింది.
బాహుకుడు వారిని చూచి, ఎదురేగి, ఆ బిడ్డలను కౌగిలించుకొని, తన తొడలపై కూర్చోబెట్టుకొన్నాడు. దేవతల బిడ్డలవలెనున్న ఆ పిల్లలను చూసి, చెప్పలేనంత దుఃఖం పొంది, ఆపుకోలేక పెద్దగా ఏడ్చాడు. అంతలోనే ముఖ కవళికలను మార్చి వెంటనే కేశినితో ఇలా పలికాడు. (23,26)
ఇదం చ సదృశం భద్రే మిథునం మమ పుత్రయోః ।
అతో దృష్ట్వైవ సహసా బాష్పముత్సృష్టవానహమ్ ॥ 27
కేశినీ! నా బిడ్డలు కూడ వీరివలె ఉండేవారు. ఆ కారణం చేతనే ఈ బిడ్డలను చూడగానే నేను కన్నీరు పెట్టుకొన్నాను. (27)
బహుశః సంపతంతీం త్వాం జనః సంకేతదోషతః ।
వయం చ దేశాతిథయః గచ్ఛ భద్రే యథాసుఖమ్ ॥ 28
మేం ఈ రాజ్యానికి అతిథులుగా వచ్చాం! నీవు మాటిమాటికి ఇక్కడికి ఇలా రావటం వల్ల జనులు ఏమైనా అనుకొంటారు. అందుకే, నీవు వెంటనే ఇక్కడ నుండి వెళ్లు. (28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి కన్యాపుత్రదర్శనే పంచసప్తతితమోఽధ్యాయః ॥ 75 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలదమయంతుల సంతానమును కన్యాపుత్రదర్శనమను డెబ్బది అయిదవ అధ్యాయము. (75)