70. డెబ్బదియవ అధ్యాయము

తనకు ద్వితీయ స్వయంవరమని దమయంతి ఋతుపర్ణునకు సందేశము పంపుట.

బృహదశ్వ ఉవాచ
అథ దీర్ఘస్య కాలస్య పర్ణాదో నామ వై ద్విజః ।
ప్రత్యేత్య నగరం భైమీమ్ ఇదం వచనమబ్రవ్రీత్ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
చాలాకాలం గడచిన తర్వాత పర్ణాదుడనే బ్రాహ్మణుడు విదర్భకు వచ్చి, దమయంతితో ఈ విధంగా అన్నాడు. (1)
నైషధం మృగయానేన దమయంతి మయా నలమ్ ।
అయోధ్యాం నగరీం గత్వా భాంగాసురిముపస్థితః ॥ 2
దమయంతీ! నలమహారాజు జాడతెలిసికొనుటకు వెళ్ళిన నేను అయోధ్యానగరంలో ఋతుపర్ణుని దగ్గరకు వెళ్లాను. (2)
శ్రావితశ్చ మయా వాక్యం త్వదీయం స మహాజనే ।
ఋతుపర్ణో మహాభాగః యథోక్తం వరవర్ణిని ॥ 3
తచ్ర్ఛుత్వా నాబ్రవీత్ కించిద్ ఋతుపర్ణో నరాధిపః ।
న చ పారిషధః కశ్చిద్ భాష్యమాణో మయాసకృత్ ॥ 4
ఋతుపర్ణమహారాజుగారి సభలో మీరు చెప్పిన విషయాన్నంతా యథాతథంగా వినిపించాను. అంతా విని ఋతుపర్ణుడు ఏమీ మాట్లాడలేదు. నేను ఎన్నో సార్లు ప్రస్తావించినా ఆతని సభాసదుల్లో ఒక్కడు కూడ నాతో మాట్లాడనే లేదు. (3,4)
అనుజ్ఞాతం తు మాం రాజ్ఞా విజనే కశ్చిదబ్రవీత్ ।
ఋతుపర్ణస్య పురుషో బాహుకో నామ నామతః ॥ 5
రాజుగారి పరివారంలో ఒకడైన బాహుకుడు మహారాజుగారి అనుమతి పొందిన నాతో రహస్యప్రదేశంలో మాట్లాడాడు. (5)
సూతస్తస్య నరేంద్రస్య విరూపో హ్రస్వబాహుకః ।
శీఘ్రయానేషు కుశలః మృష్టకర్తా చ భోజనే ॥ 6
ఆతడు రాజుగారి పరివారంలో ఒకడైన బాహుకుడు మహారాజుగారి అనుమతి పొందిన నాతో రహస్యప్రదేశంలో మాట్లాడాడు. (5)
సూతస్తస్య నరేంద్రస్య విరూపో హ్రస్వబాహుకః ।
శీఘ్రయానేషు కుశలః మృష్టకర్తా చ భోజనే ॥ 6
ఆతడు రాజుగారి రథసారథి కురూపి. పొట్టిచేతులు కల్గి ఉన్నాడు. రథాలను అతివేగంగా నడపటంలో అతడు దిట్ట. రుచికరంగా భోజనపదార్థాలను తయారు చేయటంలో నేర్పరి. (6)
స వినిఃశ్వస్య బహుశః రుదిత్వా చ పునః పునః ।
కుశలం చైవ మాం పృష్ట్వా పశ్చాదిదమభాషత ॥ 7
ఆ బాహుకుడు అనేకసార్లు నిట్టూర్చాడు. మాటిమాటికి ఏడ్చాడు. చివరికి, చాలా క్షేమ సమాచారాలను అడిగి, నాతో ఇలా పలికాడు. (7)
వైషమ్యమపి సంప్రాప్తాః గోపాయంతి కులస్త్రియః ।
ఆత్మానమాత్మనా సత్యః జితః స్వర్గో న సంశయః ॥ 8
కులస్త్రీలు ఎన్నికష్టాలు సంభవించినా, వాటిని రహస్యంగా ఉంచుతారు. తన్ను తాను జయించినవాడు, స్వర్గాన్ని జయించిన వాడనటంలో సందేహం లేదు. (8)
రహితా భర్తృభిశ్చైవ న కుప్యంతి కదాచన ।
ప్రాణాంశ్చారిత్రకవచాన్ ధారయంతి వరస్త్రియః ॥ 9
ఉత్తమ స్త్రీలు భర్తృవియోగం పొందినా ఎన్నడూ కోపాన్ని పొందరు. తమప్రాణాలకు కవచంగా తమ సత్ర్పవర్తనను ధరిస్తారు. (9)
విషమస్థేన మూఢేన పరిభ్రష్టసుఖేన చ ।
యత్ సా తేన పరిత్యక్తా తత్ర న క్రోద్ధుమర్హతి ॥ 10
సర్వసుఖాలను కోల్పోయి సంకటస్థితిలో ఉన్న ఆ భర్త భార్యను విడిచిపెట్టి ఉండవచ్చు. ఆతని విషయంలో కోపగించటం తగినది కాదు. (10)
ప్రాణయాత్రాం పరిప్రేప్సోః శకునైర్హృతవాససః ।
ఆధిభిర్దహ్యమానస్య శ్యామా న క్రోద్ధుమర్హతి ॥ 11
ప్రాణాలు నిలుపుకోవటానికి ప్రయత్నిస్తూ, పక్షులచే వస్త్రాలు అపహరింపబడి మనోవ్యధతో ఉన్న ఆ భర్తవిషయంలో భార్య కోపగించటం భావ్యం కాదు. (11)
సత్కృతాసత్కృతా వాపి పతిం దృష్ట్వా తథాగతమ్ ।
భ్రష్టరాజ్యం శ్రియా హీనం క్షుధితం వ్యసనాప్లుతమ్ ॥ 12
భర్త తనను గౌరవించినా, గౌరవింపక పోయినా, రాజ్యభ్రష్టుడైనా, దరిద్రుడైనా, ఆర్తుడైనా, వ్యసన పరుడైనా సరే భార్య అతనిపై కోపాన్ని చూపరాదు. (12)
తస్య తద్ వచనం శ్రుత్వా త్వరితోఽహమిహాగతః ।
శ్రుత్వా ప్రమాణం భవతీ రాజ్ఞశ్చైవ నివేదయ ॥ 13
బాహుకుని మాటలు విన్న నేను త్వరితగతిని ఇచ్చటకు వచ్చాను. అతని మాటలే అతడు నలుడనటానికి పరమప్రమాణాలు. ఈ విషయాన్ని మహారాజునకు నివేదించమని దమయంతికి పర్ణాదుడు చెప్పాడు. (13)
ఏతచ్ర్ఛుత్వాశ్రుపూర్ణాక్షీ పర్ణాదస్య విశాంపతే ।
దమయంతీ రహోఽభ్యేత్య మాతరం ప్రత్యభాషత ॥ 14
దమయంతి పర్ణాదుని మాటలు విని, కన్నీరు నింపుకొని తనతల్లితో ఏకాంతంలో ఇలా అంది. (14)
అయమర్థో న సంవేద్యః భీమే మాతః కదాచన ।
త్వత్సన్నిధౌ నియోక్షేఽహం సుదేవం ద్విజసత్తమమ్ ॥ 15
యథా న నృపతిర్భీమః ప్రతిపద్యేత మే మతమ్ ।
తథా త్వయా ప్రకర్తవ్యం మమ చేత్ ప్రియమిచ్ఛసి ॥ 16
అమ్మా! నేను చెప్పే విషయాన్ని నాన్నగారికి ఎన్నడూ చెప్పకు. నీ సమక్షంలోనే సుదేవుని మనపనికై నియోగిస్తాను. నీవు, నామేలు కోరేదానవైతే నా అభిప్రాయాన్ని తండ్రిగారికి తెలియనీయవద్దు - అది చేయటమే నీ కర్తవ్యం. (15,16)
యథా చాహం సమానీతా సుదేవేనాశు బాంధవాన్ ।
తేనైవ మంగలేనాశు సుదేవో యాతు మా చిరమ్ ॥ 17
సమానేతుం నలం మాతః అయోధ్యాం నగరీమితః ।
శుభకరుడైన సుదేవుడు నన్ను బంధుజనాల చెంతకు త్వరితంగా చేర్చాడు. ఆ సుదేవుడే నలునితీసికొని రావటానికి అయోధ్యానగరానికి వెంటనే వెళ్ళాలి. (17)
విశ్రాంతం తు తతః పశ్చాత్ పర్ణాదం ద్విజసత్తమమ్ ॥ 18
అర్చయామాస వైదర్భీ ధనేనాతీవ భావినీ ।
నలే చేహాగతే తత్ర భూయో దాస్యామి తే వసు ॥ 19
ద్విజోత్తముడైన పర్ణాదుడు విశ్రాంతి గొని వచ్చిన తర్వాత, దమయంతి అధికధనాన్నిచ్చి సత్కరించింది. నలమహారాజు ఇక్కడకు వస్తే, మరలా మరింత ధనం ఇస్తానని మాట ఇచ్చింది. (18, 19)
త్వయా హి మే బహు కృతం యదన్యో ను కరిష్యతి ।
యద్ భర్త్రాహం సమేష్యామి శీఘ్రమేవ ద్విజోత్తమ ॥ 20
బ్రాహ్మణోత్తమా!
అతిత్వరలో నా భర్తను కలిసేటట్లు ఎవ్వరూ చేయలేనంత మేలు మీరు నాకు చేశారు. (20)
స ఏవముక్తోఽథాశ్వాస్య ఆశీర్వాదైః సుమంగలైః ।
గృహానుపయయౌ చాపి కృతార్థః సుమహామనాః ॥ 21
దమయంతి ఈ విధంగా పల్కిన తర్వాత పర్ణాదుడు దమయంతిని మంగళకరమైన ఆశీస్సులతో ఊరడించి తన గృహానికి చేరాడు. (21)
తతః సుదేవమాభాష్య దమయంతీ యుధిష్ఠిర ।
అబ్రవీత్ సన్నిధౌ మాతుః దుఃఖశోకసమన్వితా ॥ 22
ధర్మరాజా! ఆ తర్వాత దుఃఖశోకాలతో ఉన్న దమయంతి తల్లి దగ్గరకు సుదేవుని పిలిపించి ఈవిధంగా పల్కింది. (22)
గత్వా సుదేవ నగరీమ్ అయోధ్యావాసినం నృపమ్ ।
ఋతుపర్ణం వచో బ్రూహి సంపతన్నివ కామగః ॥ 23
సుదేవా! నీవు స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా అతిశీఘ్రంగా అయోధ్యానగరానికి వెళ్ళు. ఋతుపర్ణమహారాజుతో ఈమాటను చెప్పు. (23)
ఆస్థాస్యతి పునర్భైమీ దమయంతీ స్వయంవరమ్ ।
తత్ర గచ్ఛంతి రాజానః రాజపుత్రాశ్చ సర్వశః ॥ 24
దమయంతికి తిరిగి స్వయంవరం జరుగుతోంది - రాజులు, రాజపుత్రులు, అందరూ విదర్భకు వెళ్తున్నారు. (24)
తథా చ గణితః కాలః శ్వోభూతే స భవిష్యతి ।
యది సంభావనీయం తే గచ్ఛ శీఘ్రమరిందమ ॥ 25
సుమూహూర్తకాలం రేపే. మహారాజా! మీరు వెళ్లాలనుకొంటే శీఘ్రంగా బయలుదేరండి. (25)
సూర్యోదయే ద్వితీయం సా భర్తారం వరయిష్యతి ।
న హి స జ్ఞాయతే వీరః నలో జీవతి వా న వా ॥ 26
నలుడు జీవించియున్నదీ, లేనిదీ - దమయంతికి తెలియదు. ఆమె రేపు సుర్యోదయసమయంలో రెండవ భర్తను వరిస్తుంది. (26)
ఏవం తయా యథోక్తో వై గత్వా రాజానమబ్రవీత్ ।
ఋతుపర్ణం మహారాజ సుదేవో బ్రాహ్మణస్తదా ॥ 27
సుదేవుడు అక్కడికి వెళ్ళి - దమయంతి - ఋతుపర్ణమహారాజునకు చెప్పుమన్న మాటలను యథాతథంగా చెప్పాడు. (27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి దమయంతీ పునఃస్వయంవరకథనే సప్తతితమోఽధ్యాయః ॥ 70 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున దమయంతీ పునఃస్వయంవర కథనమను డెబ్బదియవ అధ్యాయము. (70)