69. అరువది తొమ్మిదవ అధ్యాయము

దమయంతి తండ్రిఇంటికి వెళ్ళుట. నలుని కొఱకు బ్రాహ్మణులను పంపుట.

సుదేవ ఉవాచ
విదర్భరాజో ధర్మాత్మా భీమో నామ మహాద్యుతిః ।
సుతేయం తస్య కల్యాణీ దమయంతీతి విశ్రుతా ॥ 1
సుదేవుడిలా అన్నాడు.
రాజమాతా! విదర్భరాజు ఎంతో ధర్మాత్ముడు. భీముడనే పేరుగల తేజశ్శాలి. ఈ కళ్యాని అతనియొక్క పుత్రిక. పేరు దమయంతి. (1)
రాజా తు నైషధో నామ వ్వీరసేనసుతో నలః ।
భార్యేయం తస్య కల్యాణీ పుణ్యశ్లోకస్య ధీమతః ॥ 2
నిషధదేశాధిపతియైన వీరసేనమహారాజు పుత్రుడుఉ, బుద్ధిమంతుడు, పుణ్యశ్లోకుడు అయిన నలమహారాజునకు ఈ దమయంతి భార్య. (2)
స ద్యూతేన జితో భ్రాత్రా హృతరాజ్యో మహీపతిః ।
దమయంత్యా గతః సార్ధం న ప్రాజ్ఞాయత కస్యచిత్ ॥ 3
ఆ నలమహారాజు జూదంలో తన అన్నచేత ఓడింపబడి రాజ్యాన్ని కోల్పోయి, దమయంతితో కలిసి, ఎవరికీ తెలియకుండా నగరాన్ని విడిచివెళ్ళాడు. (3)
తే వయం దమయంత్యర్థే చరామః పృథివీమిమామ్ ।
సేయమాసాదితా బాలా తవ పుత్రనివేశనే ॥ 4
దమయంతి కోసం, ఈ భూమి అంతటా తిరుగుతున్నాం. మేం వెదకుతున్న ఆ దమయంతి, మీ పుత్రుని మందిరంలో కనబడింది. (4)
అస్యా రూపేణ సదృశీ మానుషీ న హి విద్యతే ।
అస్యా హ్యేష భ్రువోర్మధ్యే సహజః పిప్లురుత్తమః ॥ 5
మనుష్యులలో ఈమెతో సమానమైన రూపలావణ్యం గల స్త్రీ మరొక్కతె లేదు. ఈమెకు కనుబొమల మధ్య ఉత్తమస్త్రీకి ఉండవలసిన సహజసిద్ధమైన పుట్టుమచ్చ ఉంది. (5)
శ్యామాయాః పద్మసంకాశః లక్షితోఽంతర్హితో మయా ।
మలేన సంవృతో హ్యస్యాః ఛన్నోఽభ్రేణేవ చంద్రమాః ॥ 6
యౌవనమధ్యస్థమైన ఈ దమయంతి పుట్టుమచ్చ మాలిన్యంతో కూడిన పద్మంవలెను, మేఘంతో కప్పబడిన చంద్రునివలెను, నాకు కన్పించింది. (6)
చిహ్నభూతో విభుత్యర్థమ్ అయం ధాత్రా వినిర్మతః ।
ప్రతిపత్కలుషస్యేందోః లేఖా నాతివిరాజతే ॥ 7
న చాస్యా నశ్యతే రూపం వపుర్మలసమాచితమ్ ।
అసంస్కృతమభివ్యక్తం భాతి కాంచనసన్నిభమ్ ॥ 8
అనేన వపుషా బాలా పిప్లునానేన సూచితా ।
లక్షితేయం మయా దేవీ నిభృతోఽగ్నిరివోష్మణా ॥ 9
సంపదలకు చిహ్నమైన ఈ పుట్టుమచ్చ విధాతచే సృజింపబడింది. శుక్లపక్షపాడ్యమి రోజున రేఖామాత్రంగా నున్న చంద్రునివలె మాలిన్యంతో కూడిన ఈమె దేహం మీద దాని సహజరూపం కన్పించటం లేదు. పుటం పెట్టని ముడిబంగారంలా ఈమె ప్రకాశిస్తోంది. శరీరం మాలిన్యంతో ఉన్నప్పటికీ, ఆమె భ్రూమధ్యంలో ఉన్న పుట్టుమచ్చయే ఆమె ఔన్నత్యాన్ని సూచిస్తోంది. (7-9)
తచ్ర్ఛుత్వా వచనం తస్య సుదేవస్య విశాంపతే ।
సునందా శోధయామాస పిప్లుప్రచ్ఛాదనం మలమ్ ॥ 10
సుదేవుని మాటలు విన్న సునంద, ఆమె భ్రూమధ్యంలో ఉన్న పుట్టుమచ్చపై కప్పబడియున్న మాలిన్యాన్ని తొలగించి శుభ్రపరచింది. (10)
స మలేనాపకృష్టేన పిప్లుస్తస్యా వ్యరోచత ।
దమయన్త్యా యథా వ్యభ్రే నభసీవ నిశాకరః ॥ 11
మాలిన్యాన్ని తొలగించటంతో, ఆకాశంలో మబ్బులు తొలగిన తర్వాత స్పష్టంగా భాసించే చంద్రునివలె, దమయంతి పుట్టుమచ్చ సుస్పష్టంగా ప్రకాశించింది. (11)
పిప్లుం దృష్ట్వా సునందా చ రాజమాతా చ భారత ।
రుదత్యౌ తాం పరిష్వజ్య ముహూర్తమివ తస్థతుః ॥ 12
ధర్మజా! రాజమాత, సునంద, ఆ పుట్టుమచ్చను చూచి ఏడుస్తూ, ఆమెను ఆలింగనం చేసికొని క్షణకాలం అలాగే ఉన్నారు. (12)
ఉత్సృజ్య బాష్పం శనకైః రాజమాతేదమబ్రవీత్ ।
భగిన్యా దుహితా మేఽసి పిప్లునానేన సూచితా ॥ 13
రాజమాత కన్నీటిని తుడుచుకొని మెల్లిగా ఇలా పల్కింది. "నీవు నా చెల్లిలి కుమార్తెవని ఈ పుట్టుమచ్చవల్లనే గుర్తించగలిగాను. (13)
అహం చ తవ మాతా చ రాజ్ఞస్తస్య మహాత్మనః ।
సుతే దశార్ణాధిపతేః సుదామ్నశ్చారుదర్శనే ॥ 14
చూడముచ్చటైన దమయంతీ! నీ తల్లిగారు, నేనును దశార్ణదేశాధిపతియైన సుదాముని కుమార్తెలము. (14)
భీమస్య రాజ్ఞః సా దత్తా వీరబాహోరహం పునః ।
త్వం తు జాతా మయా దృష్టా దశార్ణేషు పితుర్గృహే ॥ 15
ఆమెను (మీ తల్లిగారిని) నిషధేశ్వరుడైన భీమరాజునకిచ్చి వివాహం చేశారు.
నీవు పుట్టినప్పుడు, దశార్ణదేశంలో మా తండ్రిగారింట్లో నిన్ను నేను చూశాను. (15)
యథైవ తే పితుర్గేహం తథైవ మమ భామిని ।
యథైవ చ మమైశ్వర్యం దమయంతి తథా తవ ॥ 16
దమయంతీ! నీకు నీ తండ్రిగారి ఇల్లు ఎలాంటిదో నాగృహం కూడ అలాంటిదే! ఈ ఐశ్వర్యాన్నంతా నీదిగానే భావించు. (16)
తాం ప్రహృష్టేన మనసా దమయంతీ విశాంపతే ।
ప్రణమ్య మాతుర్భగినీమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 17
ధర్మరాజా! అపుడు దమయంతి సంతోషంతో తనపినతల్లియైన రాజమాతకు నమస్కరించి ఈవిధంగా పలికింది. (17)
అజ్ఞాయమానాపి సతీ సుఖమస్మ్యుషితా త్వయి ।
సర్వకామైః సువిహితా రక్ష్యమాణా సదా త్వయా ॥ 18
నేను ఎవరినో తెలియనప్పటికీ, మీరు నాకు సుఖప్రదమైన ఆశ్రయాన్ని కల్పించారు. సర్వవిధాల నాకోరికను మన్నించారు. నాకు రక్షణ కల్పించారు. (18)
సుఖాత్ సుఖతరో వాసః భవిష్యతి న సంశయః ।
చిరవిప్రోషితాం మాతః మామనుజ్ఞాతుమర్హసి ॥ 19
అమ్మా! ఇక్కడ ఉండటం నాకెంతో సుఖదాయికం. సందేహం లేదు. నేను చాలాకాలం నుండి భర్తృపుత్రవియోగంతో ఉన్నాననే విషయం మీకు తెలిసిందే కదా! (19)
దారకౌ చ హి మే నీతౌ వసతస్తత్ర బాలకౌ ।
పిత్రా విహీనౌ శోకార్తౌ మయా చైవ కథం ను తౌ ॥ 20
నాకుమార్తె, కుమారుడును తాతగారింట విదర్భలో ఉన్నారు. తండ్రి వియోగంతో శోకార్తులైనవారికి, నేను కూడ దూరమవటం ఎందుకు? (20)
యది చాపి ప్రియం కించిత్ మయి కర్తుమిహేచ్ఛసి ।
విదర్భాన్ యాతుమిచ్ఛామి శీఘ్రం మే యానమాదిశ ॥ 21
బాఢమిత్యేవ తాముక్త్వా హృష్టా మాతృష్వసా నృప ।
గుప్తాం బలేన మహతా పుత్రస్యానుమతే తతః । 22
ప్రాస్థాపయద్ రాజమాతా శ్రీమతీం నరవాహినా ।
యానేన భరతశ్రేష్ఠ స్వన్నపానపరిచ్ఛదామ్ ॥ 23
అమ్మా! నాకు ప్రియాన్ని చేయదలచుకొంటే, నన్ను శీఘ్రంగా విదర్భచేర్చటానికి ఆదేశించండి. నేను విదర్భకు వెళ్లాలనుకొంటున్నాను.
దమయంతి మాటలు విన్న పినతల్లి తన పుత్రుని అనుమతితో, సంతోషంగా పంపదలచింది. ఆమెతో వెళ్ళడానికి అసంఖ్యాకపరిజనాన్ని, రక్షకబలాన్ని సిద్ధంచేసింది.
భరతశ్రేష్ఠా! ధర్మజా! ఈ ప్రకారంగా రాజమాత, వలసిన మంచి భోజ్యపదార్థాలను సిద్ధంచేసి మేనామీద దమయంతిని విదర్భకు పంపించింది. (21-23)
తతః సా న చిరాదేవ విదర్భానగమత్ పునః ।
తాం తు బంధుజనః ప్రహృష్టః సమపూజయత్ ॥ 24
దమయంతి కొద్దికాలంలోనే విదర్భనగరాన్ని చేరింది. ఆ దమయంతిని, అచటి బంధుజనులంతా ఎంతో సంతోషంతో గౌరవించారు. (24)
సర్వాన్ కుశలినో దృష్ట్వా బాంధవాన్ దారకౌ చ తౌ ।
మాతరం పితరం చోభౌ సర్వం చైవ సఖీజనమ్ ॥ 25
దేవతాః పూజయామాస బ్రాహ్మణాంశ్చ యశస్వినీ ।
పరేణ విధినా దేవీ దమయంతీ విశాంపతే ॥ 26
క్షేమంగా ఉన్న తన సంతానాన్ని, తల్లిదండ్రులను, సఖీజనాన్ని చూచిన తర్వాత, దమయంతి విధివిధానంగా దేవతారాధన చేసింది. కీర్తిమంతురాలైన దమయంతి వేదపండితులైన బ్రాహ్మణులను పూజించి, నమస్కరించి దీవెనలు పొందింది. (25,26)
అతర్పయత్ సుదేవం చ గోసహస్రేణ పార్థివః ।
ప్రీతో దృష్ట్వైవ తనయాం గ్రామేణ ద్రవిణేన చ ॥ 27
భీమరాజు పుత్రికను చూచి సంతోషించి తనపుత్రుని తీసికొని వచ్చిన సుదేవునకు వేయిగోవులను, ఒకగ్రామాన్ని, కొంతధనాన్ని ఇచ్చి గౌరవించాడు. (27)
సా వ్యుష్టా రజనీం తత్ర పితుర్వేశ్మని భావినీ ।
విశ్రాంతా మాతరం రాజన్ ఇదం వచనమబ్రవీత్ ॥ 28
దమయంతి తన తండ్రిగారి గృహంలో విశ్రాంతితో రాత్రి గడిపి తన తల్లితో ఇలా పలికింది. (28)
దమయంత్యువాచ
మాం చేదిచ్ఛసి జీవంతీం మాతః సత్యం బ్రవీమి తే ।
నలస్య నరవీరస్య యతస్వానయనే పునః ॥ 29
దమయంతి ఇలా పల్కింది.
అమ్మా! నేను సత్యాన్నే చెప్తున్నాను. నేను జీవించి ఉండాలనే కోరిక నీకు ఉంటే, నలుని మరల తీసికొని రావటానికి ప్రయత్నం చేయి. (29)
దమయంత్యా తథోక్తా తు సా దేవీ భృశదుఃఖితా ।
బాష్పేణాపిహితా రాజ్ఞీ నోత్తరం కించిదబ్రవీత్ ॥ 30
దమయంతి ఆ విధంగా పల్కినప్పుడు, తల్లి చెప్పలేనంతగా దుఃఖించి, కన్నీరు కారుస్తూనే ఏమీ బదులు పలుకలేకపోయింది. (30)
తదవస్థాం తు తాం దృష్ట్వా సర్వమంతఃపురం తదా ।
హాహాభూతమతీవాసీద్ భృశం చ ప్రరురోద హ ॥ 31
అట్టి దుఃస్థితిలోనున్న మహారాణిని చూచిన అంతఃపుర పరివారమంతా దుఃఖంతో హాహాకారాలు చేస్తూ వెక్కివెక్కి ఏడ్చారు. (31)
తతో భీమం మహారాజం భార్యా వచనమబ్రవీత్ ।
దమయంతీ తవ సుతా భర్తారమనుశోచతి ॥ 32
పుత్రికయైన దమయంతి తన భర్తను గురించి దుఃఖిస్తోంది - అంటూ ఈ విషయాన్నంతా మహారాజుకు మహారాణి నివేదించింది. (32)
అపకృష్య చ లజ్జాం సా స్వయముక్తవతీ నృప ।
ప్రయతంతు తవ ప్రేష్యాః పుణ్యశ్లోకస్య మార్గణే ॥ 33
మన కుమార్తె తనకు తానై నోరు విడిచి అడిగింది. (చెప్పడానికి సిగ్గుపడే మన అమ్మాయి, సిగ్గువిడిచి తనకు తానై చెప్పింది.) ఇపుడైనా పుణ్యశ్లోకుడైన నలుని వెదకటానికి మనవారిని పంపి ప్రయత్నించండి. (33)
తయా ప్రదేశితో రాజా బ్రాహ్మణాన్ వశవర్తినః ।
ప్రాస్థాపయద్ దిశః సర్వాః యతధ్వం నలమార్గణే ॥ 34
మహారాణి చెప్పిన మాటల్ని విన్న భీమరాజు "నలమహారాజును వెదకుటకు ప్రయత్నించండి - అని తన అధీనంలో ఉన్న బ్రాహ్మణులను అన్ని దిక్కులకు పంపించాడు. (34)
తతో విదర్భాధిపతేః నియోగాద్ బ్రాహ్మణాస్తదా ।
దమయంతీమథో సృత్వా ప్రస్థితాః స్మేత్యథాబ్రువన్ ॥ 35
విదర్భాధిపతియగు భీమరాజు ఆదేశాన్ని అనుసరించి దమయంతి చెంతకేగి బ్రాహ్మణులు తమప్రస్థానాన్ని గురించి చెప్పారు. (35)
అథ తానబ్రవీద్ భైమీ సర్వరాష్ట్రేష్విదం వచః ।
బ్రువధ్వం జనసంసత్సు తత్ర తత్ర పునః పునః ॥ 36
"మీరు వెళ్ళిన అన్నిరాష్ట్రాలలోనూ, జనసమూహాలున్న ప్రదేశాల్లో అక్కడక్కడ మాటిమాటికి ఈ వాక్యాలను పలకండి" అని దమయంతి బ్రాహ్మణులకు చెప్పింది. (36)
క్వ ను త్వం కితవచ్ఛిత్వా వస్త్రార్ధం ప్రస్థితో మమ ।
ఉత్సృజ్య విపినే సుప్తామ్ అనురక్తాం ప్రియాం ప్రియ ॥ 37
ప్రియుడా! అనురాగవతియైన ప్రేయసిని నిద్రించే సమయంలో అడవిలో విడిచి, సగంచీర చింపుకొని వెళ్ళిన జూదరివి నీవు. నీవు ఎక్కడున్నావు? (37)
సా వై యథా త్వయా దృష్టా తథాఽఽస్తే త్వత్ర్పతీక్షిణీ ।
దహ్యమానా భృశం బాలా వస్త్రార్ధేనాభిసంవృతా ॥ 38
ఆ సగంచీరతోనే శరీరాన్ని కప్పుకొని, మిక్కిలి దుఃఖంతో దహింపబడుతూ ఆమె నీ కోసమే నిరీక్షిస్తోంది. (38)
తస్యా రుదత్యాః సతతం తేన శోకేన పార్థివ ।
ప్రసాదం కురు వై వీర ప్రతివాక్యం దదస్వ చ ॥ 39
మహారాజా! ఎలప్పుడు ఆమె నీ కోసమే శోకిస్తోంది. ఏడుస్తున్న ఆమెపై దయచూపు. వీరా! సమాధానం చెప్పవయ్యా!! (39)
ఏవమన్యచ్చ వక్తవ్యం కృపాం కుర్యాద్ యథా మయి ।
వాయునా ధూయమానో హి వనం దహతి పావకః ॥ 40
నాయందు దయ ఉంటే, మరోవిషయం కూడ చెప్పాలని ఉంది. వాయువుచే విసరబడిన అగ్ని, వనాన్ని సహితం దహిస్తుంది కదా! (40)
భర్తవ్యా రక్షణీయా చ పత్నీ పత్యా హి సర్వదా ।
తన్నష్టముభయం కస్మాద్ ధర్మజ్ఞస్య సతస్తవ ॥ 41
భార్య ఎల్లప్పుడూ భర్తచేత భరింప తగింది, రక్షింపతగినది కూడ. ధర్మజ్ఞుడవైన నీవు ఆ కర్తవ్యాలు రెంటింటిని ఎందుకు విడిచిపెట్టావు? (41)
ఖ్యాతః ప్రాజ్ఞః కులీనశ్చ సానుక్రోశో భవాణ్ సదా ।
సంవృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్యసంక్షయాత్ ॥ 42
నీవు ప్రాజ్ఞుడవని, సత్కులంలో పుట్టావనీ, దయగలవాడవనీ, అందరూ చెప్పుకొంటారు. నా దురదృష్టంవల్లనే నీవిలా దయారహితుడవై ప్రవర్తిస్తున్నావని అనుమానిస్తున్నాను. (42)
తత్ కురుష్వ నరవ్యాఘ్ర దయాం మయి నరర్షభ ।
ఆవృశంస్యం పరో ధర్మః త్వత్త ఏవ హి మే శ్రుతః ॥ 43
పురుషోత్తమా! నాయందు దయచూపు. దయాస్వభావం పరమధర్మమని మీవల్లనే నేను విన్నాను. (43)
ఏవం బ్రువాణాన్ యది వః ప్రతిబ్రూయాత్ కథంచన ।
స నరః సర్వథా జ్ఞేయః కశ్చాసౌ క్వ ను వర్తతే ॥ 44
ఈవిధంగా మీరు అంటే మీమాటలకు సమాధానం చెప్పిన వ్యక్తిని మీరు గుర్తించి, "ఆతడెవడో? ఎక్కడున్నాడో తెలిసికోవాలి" అని దమయంతి బ్రాహ్మణోత్తములకు చెప్పింది. (44)
యశ్చైవం వచనం శ్రుత్వా బ్రూయాత్ ప్రతివచో నరః ।
తదాదాయ వచస్తస్య మమావేద్యం ద్విజోత్తమాః ॥ 45
బ్రాహ్మణోత్తములారా! మీ మాటలకెవరైనా సమాధానమిస్తే అతడన్నమాటలు నాకు తెలియజేయండి. (45)
యథా చ వో న జానీయాద్ బ్రువతో మమ శాసనాత్ ।
పునరాగమనం చైవ తథా కార్యమతంద్రితైః ॥ 46
మీ మాటలకు సమాధానమిచ్చే వ్యక్తికి మీ గురించి తెలియకుండా మీరు ప్రవర్తించి, ఏలాంటి తొట్రుపాటు లేకుండా, తిరిగి రండి! (46)
యథా చ వో న జానీయాద్ బ్రువతో మమ శాసనాత్ ।
యది వాప్యసమర్థః స్యాద్ జ్ఞేయమస్య చికీర్షితమ్ ॥ 47
అతడు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు. అసమర్థుడు కావచ్చు. ఆతడేమి చేయదలచినాడో తెలిసికోవాలి. (47)
ఏవముక్తాస్త్వగచ్ఛంస్తే బ్రాహ్మణాః సర్వతో దిశమ్ ।
నలం మృగయితుం రాజన్ తదా వ్యసనినం తథా ॥ 48
తే పురాణి సరాష్ట్రాణి గ్రామాన్ ఘోషాంస్తథాఽశ్రమాన్ ।
అన్వేషంతో నలం రాజన్ నాధిజగ్ముర్ద్విజాతయః ॥ 49
ఈ విధంగా దమయంతి చెప్పినవన్నీ విని, బ్రాహ్మణులు వ్యసనపరుడైన నలమహారాజును వెదకటానికై నాల్గుదిక్కులకూ వెళ్ళారు. వాళ్ళు ఆయా రాష్ట్రాలలోని పట్టణాలను, గ్రామాలను, పల్లెలను, ఆశ్రమాలను నలునికోసం వెదికారు. కాని వారు నలుని జాడ తెలిసికొనలేకపోయారు. (48,49)
తచ్చ వాక్యం తథా సర్వే తత్ర తత్ర విశాంపతే ।
శ్రావయాంచక్రిరే విప్రాః దమయంత్యా యథేరితమ్ ॥ 50
రాజా! దమయంతి చెప్పిన ఆ వాక్యాలన్ యధాతథంగా ఆ బ్రాహ్మణులందరూ అక్కడక్కడ వినిపించసాగారు. (50)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలాన్వేషణే ఏకోనసప్తతితమోఽధ్యాయః ॥ 69 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలాన్వేషణమను అరువది తొమ్మిదవ అధ్యాయము. (69)