49. నలువది తొమ్మిదవ అధ్యాయము

సంజయుడు ధృతరాష్ట్రుని మాటలను అంగీకరించుట, ధృతరాష్ట్రుని సంతాపము.

సంజయ ఉవాచ
యదేతత్ కథితం రాజన్ త్వయా దుర్యోధనం ప్రతి ।
సర్వమేతద్ యథాతత్త్వం నైతన్మిథ్యా మహీపతే ॥ 1
సంజయుడిలా అన్నాడు - రాజా! దుర్యోధనుడి గురించి నీవు చెప్పినదంతా యథార్థమే. ఇందులో అసత్య మేమీ లేదు. (1)
మమ్యనా హి సమావిష్టాః పాండవాస్తే మహౌజసః ।
దృష్టా కృష్టాం సభాం నీతాం ధర్మపత్నీం యశస్వినీమ్ ॥ 2
దుఃశాసనస్య తా వాచః శ్రుత్వా తే దారుణోదయాః ।
కర్ణస్య చ మహారాజ జుగుప్సంతీతి మే మతిః ॥ 3
ధర్మపత్ని, యశస్విని అయిన ద్రౌపదిని సభలోకి ఊడ్చుకురావడం చూసిన మహాతేజస్వులైన పాండవులు కోపంతో ఉన్నారు. మహారాజా! దుఃశాసనుడు, కర్ణుడు అపుడు పలికిన కఠోరవచనాలు విని వారు మిమ్ములనందరినీ అసహ్యించుకొంటున్నారు అని నా అభిప్రాయం. (2,3)
శ్రుతం హి మే మహారాజ యథా పార్థేన సంయుగే ।
ఏకాదశతనుః స్థాణుః ధనుషా పరితోషితః ॥ 4
మహారాజా! అర్జునుడు యుద్ధంలో పదకొండు తనువులు గల (ఏకాదశరుద్రులు) శంకరుని తన ధనుర్విద్య చేత సంతుష్టుని చేశాడని నేను విన్నాను. (4)
కైరాతం వేషమాస్థాయ యోధయామాస ఫాల్గునమ్ ।
జిజ్ఞాసుః సర్వదేవేశః కపర్దీ భగవాన్ స్వయమ్ ॥ 5
దేవదేవుడైన కపర్ది అర్జునుని పరాక్రమాన్ని తెలిసికోవాలని కిరాతునివేషంలో ఫాల్గునునితో యుద్ధం చేశాడు. (5)
తత్రైనం లోకపాలాస్తే దర్శయామాసురర్జునమ్ ।
అస్త్రహేతోః పరాక్రాంతం తపసా కౌరవర్షభమ్ ॥ 6
అస్త్రం కోసం తపస్సుతో పరాక్రమించిన కురుశ్రేష్ఠుడైన అర్జునుడికి అక్కడ లోకపాలురంతా దర్శన మిచ్చారు. (6)
నైతదుత్సహతే చాన్యః లబ్ధుమన్యత్ర ఫాల్గునాత్ ।
సాక్షాద్ దర్శనమేతేషామ్ ఈశ్వరాణాం నరో భువి ॥ 7
ఈ లోకంలో అర్జునుడు తప్ప వేరొకడెవడూ లోకేశ్వరుల సాక్షాద్దర్శనం పొందినవాడు లేడు. (7)
మహేశ్వరేణ యో రాజన్ న జీర్ణో హ్యష్టమూర్తినా ।
కస్తముత్సహతే వీరః యుద్ధే జరయితుం పుమాన్ ॥ 8
రాజా! అష్టమూర్తి అయిన మహేశ్వరుడే యుద్ధంలో అర్జునుని ఓడించలేకపోయాడు. అటువంటి మహావీరుని యుద్ధంలో జయించడానికి ఎవడు సాహసిస్తాడు? (8)
ఆసాదితమిదం ఘోరం తుములం లోమహర్షణమ్ ।
ద్రౌపదీం పరికర్షద్భిః కోపయద్భిశ్చ పాండవాన్ ॥ 9
సభలోకి ద్రౌపదిని బలవంతంగా లాక్కువచ్చి, అవమానించి, పాండవులకు కోపం కలిగించిన నీకుమారులు దుర్యోధనాదులు స్వయంగా రోమహర్షణమైన భయంకరమైన యుద్ధాన్ని ఆహ్వానించారు. (9)
యత్ తు ప్రస్ఫురమాణౌష్ఠః భీమః ప్రాహ వచోఽర్థవత్ ।
దృష్ట్వా దుర్యోధనేనోరూ ద్రౌపద్యా దర్శితావుభౌ ॥ 10
దుర్యోధనుడు తన తొడలను చూపినపుడు, దాన్ని చూసి క్రుద్ధుడైన భీముడు అదురుతున్న పెదవులతో అర్థవంతమైన మాట నిలా చెప్పాడు. (10)
ఊరూ భేత్స్యామి తే పాప గదయా భీమవేగయా ।
త్రయోదశానాం వర్షాణామ్ అంతే దుర్ద్యూతదేవినః ॥ 11
పాపాత్ముడా! కపట జూదమాడిన నీయొక్క ఊరువులను పదమూడు సంవత్సరాలు ముగిసిన తర్వాత భయంకరమైన వేగం గల నాగదతో ముక్క ముక్కలు చేస్తాను. (11)
సర్వే ప్రహరతాం శ్రేష్ఠాః సర్వే చామితతేజసః ।
సర్వే సర్వాస్త్రవిద్వాంసః దేవైరపి సుదుర్జయాః ॥ 12
పాండవులంతా కొట్టడంలో శ్రేష్ఠులు. అంధరూ అమితమైన పరాక్రమం కలవారు. అందరూ అన్నిరకాల అస్త్రాలలోను పండితులు. వారు దేవతలకు కూడా జయింపశక్యంకారు. (12)
మన్యే మన్యుసముద్ధూతాః పుత్రాణాం తవ సంయుగే ।
అంతం పార్థాః కరిష్యంతి భార్యామర్షసమన్వితాః ॥13
భార్యకు జరిగిన అవమానం వల్ల అసహనంతో ఉన్న పాండవులు కోపంతో ఉద్విగ్నులై యుద్ధంలో నీ కుమారుల నందరిని చంపుతారని నేను భావిస్తున్నాను. (13)
ధృతరాష్ట్ర ఉవాచ
కిం కృతం సూత కర్ణేన వదతా పరుషం వచః ।
పర్యాప్తం వైరమేతావద్ యత్ కృష్ణా సా సభాం గతా ॥ 14
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - సూతా! పరుషంగా మాట్లాడి కర్ణుడు చేసిందేముంది? వైరం పెరిగింది. ద్రౌపదిని జుట్టుపట్టుకొని సభకు లాక్కురావడమే ఇంతటి వైరానికి దారితీసింది. (14)
అపీదానీం మమ సుతాః తిష్ఠేరన్ మందచేతసః ।
యేషాం భ్రాతా గురుర్జ్యేష్ఠః వినయే నావతిష్ఠతే ॥ 15
ఇప్పటికి కూడా మూర్ఖులైన నాపుత్రులు ఊరుకోవటం లేదు. వీరందరికి పెద్దవాడైన దుర్యోధనుడు వినయమార్గంలో నడవటం లేదు. (15)
మమాపి వచనం సూత న శుశ్రూషతి మందభాక్ ।
దృష్ట్వా మాం చక్షుషా హీనం నిర్విచేష్టమచేతసమ్ ॥ 16
సూతా! మందభాగ్యుడైన దుర్యోధనుడు అంధుడనైన నన్ను ఆకర్మణ్యునిగ, అవివేకిగా భావించి నామాట కూడా వినటంలేదు. (16)
యే చాస్య సచివా మందాః కర్ణసౌబలకాదయః ।
తే తస్య భూయసో దోషాన్ వర్ధయంతి విచేతసః ॥ 17
అతనికి మంత్రులుగా ఉన్న కర్ణ శకునులు కూడా మూర్ఖులే. వారు మూర్ఖుడైన దుర్యోధనుడి దుశ్చేష్టలను ఇంకా పెంచుతున్నారు. (17)
స్వైరముక్తా హ్యపి శరాః పార్థేనామితతేజసా ।
నిర్దహేయుర్మమ సుతాన్ కిం పున్మన్యునేరితాః ॥ 18
అమితతేజస్వి అయిన అర్జునుడు స్వేచ్ఛగా అలవోకగా విడిచిన బాణాలే నాపుత్రులను దహిస్తాయి. ఇక కోపంతో విడిచిన బాణాల సంగతి వేరే చెప్పాలా. (18)
పార్థబాహుబలోత్సృష్టాః మహాచాపవినిఃసృతాః ।
దివ్యాస్త్రమంత్రముదితాః సాదయేయుః సురానపి ॥ 19
అర్జునుడి బాహుబలంతో, అతని మహాధనువు నుండి వెలువడి అభిమంత్రితాలైన దివ్యాస్త్రాలు దేవతలను కూడా సంహరింపగలవు. (19)
యస్య మంత్రీ చ గోప్తా చ సుహృచ్చైవ జనార్దనః ।
హరిస్త్రైలోక్యనాథః సః కిం ను తస్య న నిర్జితమ్ ॥ 20
త్రైలోక్యనాథుడు, జనార్దనుడూ ఐన శ్రీహరి మంత్రిగా, రక్షకునిగా, స్నేహితునిగా కలవాడికి (అర్జునుడికి) జయింపశక్యం కాని దేముంటుంది? (20)
ఇదం హి సుమహచ్చిత్రమ్ అర్జునస్యేహ సంజయ ।
మహాదేవేన బాహుభ్యాం యత్ సమేత ఇతి శ్రుతిః ॥ 21
సంజయా! అర్జునుని ఈ పరాక్రమం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అతడు మహాదేవునితో బాహుయుద్ధం కూడా చేశాడని విన్నాను. (21)
ప్రత్యక్షం సర్వలోకస్య ఖాండవే యత్ కృతం పురా ।
ఫాల్గునేన సహాయార్థే వహ్నేర్దామోదరేణ చ ॥ 22
ఇంతకుమునుపు ఖాండవవనంలో అగ్నిదేవునికి సహాయం కోసం శ్రీకృష్ణార్జునులు ఏం చేశారో లోకాలన్నింటికి ప్రత్యక్షంగా తెలుసు. (22)
సర్వథా న హి మే పుత్రాః సహామాత్యాః ససౌబలాః ।
క్రుద్ధే పార్థే చ భీమే చ వాసుదేవే చ సాత్వతే ॥ 23
అర్జునుడు, భీముడు, యదుకులతిలకుడైన శ్రీకృష్ణుడు క్రుద్ధులైతే అమాత్యసౌబల సమేతంగా నాపుత్రులెవరూ ఏవిధంగానూ జీవించలేరు. (23)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి ధృతరాష్ట్రఖేదే ఏకోనపంచాశత్తమోఽధ్యాయః ॥ 49 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రఖేదమను నలువది తొమ్మిదవ అధ్యాయము. (49)