48. నలువది ఎనిమిదవ అధ్యాయము

అర్జునుని వృత్తాంతము విన్న ధృతరాష్ట్రుని చింత.

జనమేజయ ఉవాచ
అత్యద్భుతమిదం కర్మ పార్థస్యామితతేజసః ।
ధృతరాష్ట్రో మహాప్రాజ్ఞః శ్రుత్వా విప్ర కిమబ్రవీత్ ॥ 1
జనమేజయుడిలా అన్నాడు. బ్రహ్మర్షీ! అమితతేజస్వి అయిన అర్జునుని ఈ అద్భుతమైన పనిని గురించి మహాప్రాజ్ఞుడైన ధృతరాష్ట్రుడు విని ఏమన్నాడు? (1)
వైశంపాయన ఉవాచ
శక్రలోకగతం పార్థం శ్రుత్వా రాజాంబికాసుతః ।
ద్వైపాయనాదృషిశ్రేష్ఠాత్ సంజయం వాక్యమబ్రవీత్ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! అంబికాసుతుడైన ధృతరాష్ట్రమహారాజు వ్యాసమహర్షి వలల్ అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడన్న సంగతి విని సంజయునితో ఇలా అన్నాడు. (2)
ధృతరాష్ట్ర ఉవాచ
శ్రుతం మే సూత కార్ త్స్న్యేన కర్మ పార్థస్య ధీమతః ।
కచ్చిత్ తవాపి విదితం యాథాతథ్యేన సారథే ॥ 3
ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
సూతా! మిక్కిలి బుద్ధిమంతుడు కుంతీకుమారుడైన అర్జునుని సమస్తవృత్తాంతాన్ని నేను విన్నాను. సారథీ! దీన్ని గురించి యథార్థం నువ్వెరుగుదువా! (3)
ప్రమత్తో గ్రామ్యధర్మేషు మందాత్మా పాపనిశ్చయః ।
మమ పుత్రః సుదుర్బుద్ధిః పృథివీం ఘాతయిష్యతి ॥ 4
నాకొడుకు దుర్యోధనుడు విషయభోగాల్లో ప్రమత్తుడు. బుద్ధిహీనుడు. పాపకర్మల గురించి ఆలోచిస్తాడు. మిక్కిలి దుర్బుద్ధి. వీడు ఎప్పుడో ఒకరోజు ఈ భూమండలాన్నంతా నాశనం చేస్తాడు. (4)
యస్య నిత్యమృతా వాచః స్వైరేష్వపి మహాత్మనః ।
త్రైలోక్యమపి తస్య స్యాద్ యోద్ధా యస్య ధనంజయః ॥ 5
సరదాగా మాట్లాడే సమయాలలో కూడ ఎప్పుడూ నిజమే పలికే మహాత్ముడైన ధనంజయుడు యోధగా ఉండగా, ధర్మరాజు త్రిలోకధిపత్యాన్ని అయినా పొందుతాడు. ఇక కురురాజ్యాధిపత్యం మాట చెప్పవలసిందేముంది! (5)
అస్యతః కర్ణినారాచాన్ తీక్ష్ణాగ్రాంశ్చ శిలాశితాన్ ।
కోఽర్జునస్యాగ్రతస్తిష్ఠేద్ అపి మృత్యుర్జరాతిగః ॥ 6
శిలల వలె కఠినాలై, తీక్ష్ణాలైన అగ్రాలు గల 'కర్ణి' అనే పేరు గల బాణాలను ప్రయోగించే అర్జునుడికి ఎదురుగా సైనికుడెవడు నిలబడగలడు? ముసలితనాన్ని జయించిన మృత్యువు కూడ అతని కెదురుగ నిలబడలేదు. (6)
మమ పుత్రా దురాత్మనః సర్వే మృత్యువశనుగాః ।
యేషాం యుద్ధం దురాధర్షైః పాండవైః ప్రత్యుపస్థితమ్ ॥ 7
ఎదిరింప శక్యంకాని పాండవులతో యుద్ధం చేయవలసిన స్థితిలో ఉన్న దురాత్ములైన నాపుత్రులంతా మృత్యువుకు వశులై ప్రవర్తిస్తున్నారు. (7)
తథైవ చ న పశ్యామి యుధి గాండీవధన్వనః ।
అనిశం చింతయానోఽపి య ఏనముదియాద్ రథీ ॥ 8
రాత్రింబవళ్లు ఆలోచించినప్పటికీ, గాండీవధన్వుడైన అర్జునుడి కెదురుగా యుద్ధంలో నిలబడగల రథికుడెవడున్నాడో తెలుసుకోలేకపోతున్నాను. (8)
ద్రోనకర్ణౌ ప్రతీయాతాం యది భీష్మోఽపి వా రణే ।
మహాన్ స్యాత్ సంశయో లోఖే తత్ర పశ్యామి నో జయమ్ ॥ 9
యుద్ధంలో ద్రోణుడుకాని, కర్ణుడు కాని, భీష్ముడు కాని అర్జునుడికి ఎదురు నిలువగలరు. అయినా నాకు సందేహమే. ఈ లోకంలో మాపక్షంలో విజయాన్ని ఊహించలేకపోతున్నాను. (9)
ఘృణీ కర్ణః ప్రమాదీ చ ఆచార్యః స్థవిరో గురుః ।
అమర్షీ బలవాన్ పార్థః సంరంభీ దృఢవిక్రమః ॥ 10
సంభవేత్ తుములం యుద్ధం సర్వశోఽప్యపరాజితమ్ ।
సర్వే హ్యస్త్రవిదః శూరాః సర్వే ప్రాప్తా మహద్ యశః ॥ 11
కర్ణుడు దయాళువు, తొందరపాటుకల ద్రోణాచార్యుడు ముసలివాడు. పైగా అర్జునుడికి గురువు. ఆ పక్షంలో అర్జునుడు అసహనంతో ఉన్నవాడు, బలవంతుడు, ఉద్యమించేవాడు, దృఢపరాక్రమం కలవాడు. సంకులసమరం జరుగుతుంది. కాని పాండవులకు పరాజయం ఉండదు. వారంతా అస్త్రవిద్యలో ఆరితేరిన శూరులు. అందరూ మహాయశస్వులు. (10,11)
అపి సర్వేశ్వరత్వం హి తే వాంఛంత్యపరాజితాః ।
వధే నూనం భవేచ్ఛాంతిః ఏతేషాం ఫాల్గునస్య వా ॥ 12
యుద్ధంలో పరాజయంలేని ఆ పాండవులు సామ్రాజ్యాధిపత్యాన్ని కోరుకొంటారు. అర్జునుని కాని, కర్ణాదులను కాని వఢిస్తేనే ఈ వివాదం శాంతిస్తుంది. (12)
న తు హంతార్జునస్యాస్తి జేతా వాస్య న విద్యతే ।
మన్యుస్తస్య కథం శామ్యేద్ మందాన్ ప్రతి సముత్థితః ॥ 13
అర్జునుని చంపేవాడుకాని, జయించేవాడు కాని లేడు. ఇక మూర్ఖులైన నాపుత్రులపట్ల అతనికి కలిగిన కోపం ఎలా చల్లారుతుంది? (13)
త్రిదశేశసమో వీరః ఖాండవేఽగ్నిమతర్పయత్ ।
జిగాయ పార్థివాన్ సర్వాన్ రాజసూయే మహాక్రతౌ ॥ 14
అర్జునుడు ఇంద్రునితో సమానమైన వీరుడు. అతడు ఖాండవవనంలో అగ్నికి తృప్తి కలిగించినవాడు. రాజసూయ మహాయజ్ఞంలో రాజులందరిని జయించినవాడు. (14)
శేషం కుర్యాద్ గిరేర్వజ్రః నిపతన్ మూర్ధ్ని సంజయ ।
న తు కుర్యుః శరాః శేషం క్షిప్తాస్తాత కిరీటినా ॥ 15
సంజయా! పర్వతశిఖరంపై పడిన వజ్రాయుధం కొంతైనా విడిచిపెడుతుంది. కాని నాయనా! అర్జునుడు వదిలిన బాణాలు ఎవరినీ మిగల్చవు. అందరినీ తుడిచిపెడతాయి. (15)
యథా హి కిరణా భానోః తపంతీహ చరాచరమ్ ।
తథా పార్థభుజోత్సృష్టాః శరాస్తప్యంతి మత్సుతాన్ ॥ 16
సూర్యునికిరణాలు చరాచరజగత్తునంతా తపింపచేసినట్లుగా అర్జునుని చేతి నుండి విడువడిన బాణాలు నాకుమారుల నందరిని దహిస్తాయి. (16)
అపి తద్రథఘోషేణ భయార్తా సవ్యసాచినః ।
ప్రతిభాతి విదీర్ణేవ సర్వతో భారతీ చమూః ॥ 17
సవ్యసాచి అయిన అర్జునుని రథఘోషచేత భయార్తులైన కౌరవసేనలు ఛిన్నాభిన్నాలైనట్లుగా నాకు అనిపిస్తోంది. (17)
యదోద్వహన్ ప్రవపంశ్చైవ బాణాన్
స్థాతాఽతతాయీ సమరే కిరీటీ ।
సృష్టోఽంతకః సర్వహరో విధాత్రా
భవేద్ యతా తద్వదపారణీయః ॥ 18
కిరీటి అయిన అర్జునుడు యుద్ధంలో అస్త్రశస్త్రాలతో నిలబడితే, బ్రహ్మ సృష్టించిన సర్వసంహారకుడైన మరొక యమధర్మరాజులా ఉంటాడు. అతనిని జయింపగలవాడు లేడు. (18)
వి॥సం॥ ఆతతాయి = శస్త్రపాణి
అగ్నిదోగరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహః ।
క్షేత్రదారాపహారీ చ షడేతే ఆతతాయినః ॥ (నీల)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి ధృతరాష్ట్రవిలాపేఽష్ట చత్వారింశోఽధ్యాయః ॥ 48 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమన పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర విలాపమను నలువది ఎనిమిదవ అధ్యాయము. (48)