29. ఇరువది తొమ్మిదవ అధ్యాయము
యుధిష్ఠిరుడు క్రోధమును నిందించుట - సహనమును ప్రశంసించుట.
యుధిష్ఠిర ఉవాచ
క్రోధో హంతా మనుష్యాణాం క్రోధో భావయితా పునః ।
ఇతి విద్ధి మహాప్రాజ్ఞే క్రోధమూలౌ భవాభవౌ ॥ 1
ధర్మరాజు చెపుతున్నాడు - మహాబుద్ధుమతీ! క్రోధం మనుష్యులను చంపుతుంది. క్రోధం అభ్యుదయాన్నీ కల్గిస్తుంది. గెలుపు ఓటములకూ, ఔన్నత్య వినాశాలకూ మూలం క్రోధమే. (1)
యో హి సంహరతే క్రోధం భవస్తస్య సుశోభనే ।
యః పునః పురుషః క్రోధం నిత్యం న సహతే శుభే ।
తస్యాభావాయ భవతి క్రోధః పరమదారుణః ॥ 2
సుందరీ! క్రోధాన్ని నిగ్రహించినవాడే ఉన్నతిని పొందుతాడు. క్రోధాన్ని నిగ్రహింపలేకపోతే దారుణమైన ఆ క్రోధం అతని వినాశనానికి దారితీస్తుంది. (2)
క్రోధమూలో వినాశో హి ప్రజానామిహ దృశ్యతే ।
తత్ కథం మాదృశః క్రోధమ్ ఉత్సృజేల్లోకనాశనమ్ ॥ 3
ప్రజల యొక్క నాశనానికి కారణం క్రోధం. అటువంటి లోకనాశనమైన క్రోధాన్ని నావంటివాడు ఎలా ప్రయోగిస్తాడు? (3)
క్రుద్ధః పాపం నరః కుర్యాత్ క్రుద్ధో హన్యాద్ గురూనపి ।
క్రుద్ధః పరుషయా వాచా శ్రేయసోఽప్యవమన్యతే ॥ 4
కోపంతో ఉన్నవాడు పాపంచేస్తాడు. క్రుద్ధుడైనవాడు గురువులను కూడా చంపుతాడు. క్రుద్ధుడు పరుషాలైన
మాటలతో శ్రేష్ఠులను అవమానిస్తాడు (తన శ్రేయస్సులను తిరస్కరిస్తాడు). (4)
వాచ్యావాచ్యే హి కుపితః న ప్రజానాతి కర్హిచిత్ ।
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే తథా ॥ 5
కుపితుడైనవాడు వాచ్యావాచ్యాలను తెలియజాలడు. క్రుద్ధునికి చేయకూడనిపని లేదు. అనదగని మాటలేదు. (5)
హింస్యాత్ క్రోధాదవధ్యాంస్తు వధ్యాన్ సంపూజయూత చ ।
ఆత్మానమపి చ క్రుద్ధః ప్రేషయేద్ యమసాదనమ్ ॥ 6
క్రోధం వల్ల హింసింపదగనివారిని హింసిస్తాడు. హింసింప దగినవారిని పూజిస్తాడు. క్రుద్ధుడు ఆత్మహత్య ద్వారా తన్ను తానే యమపురికి పంపుకొంటాడు. (6)
ఏతాన్ దోషాన్ ప్రపశ్యద్భిః జితః క్రోధో మనీషిభిః ।
ఇచ్ఛద్భిః పరమం శ్రేయః ఇహ చాముత్ర చోత్తమమ్ ॥ 7
ఇటువంటి అనర్థాలను చూసే ఇహపరలోకాలలో శ్రేయస్సును కోరుకున్న మనీషులు క్రోధాన్ని జయించారు. (7)
తం క్రోధం వర్జితం ధీరైః కథమస్మద్విధశ్చరేత్ ।
ఏతద్ ద్రౌపది సంధాయ న మే మన్యుః ప్రవర్ధతే ॥ 8
ద్రౌపదీ! ధీరులైన పురుషులచే విడువబడిన క్రోధాన్ని నావంటివాడు ఎలా ప్రయోగిస్తాడు? ఇదంతా ఆలోచిస్తుంటే నాకు కోపం రావటం లేదు. (8)
ఆత్మానం చ పరాంశ్చైవ త్రాయతే మహతో భయాత్ ।
క్రుధ్యంతమప్రతిక్రుధ్యన్ ద్వయోరేష చికిత్సకః ॥ 9
క్రోధంతో ఉన్నవానిపట్ల కోపం వహింపక సహనంతో వ్యవహరించేవాడు తన్ను, ఇతరులనూ కూడ మహాభయం నుండి రక్షిస్తున్నాడు. ఇరువరి దోషాలను పోగొట్టే చికిత్సకుడవుతున్నాడు. (9)
మూఢో యది క్లిశ్యమానః క్రుధ్యతేఽశక్తిమాన్ నరః ।
బలీయసాం మనుష్యాణాం త్యజత్యాత్మానమాత్మనా ॥ 10
మూఢుడు, అసమర్థుడూ అయిన మానవుడు బలవంతులలో క్రుద్ధుడై ప్రవర్తించి తన్ను తానే వినాశం చేసి కొంటున్నాడు. (10)
తస్యాత్మానం సంత్యజతః లోకా నశ్యంత్యనాత్మనః ।
తస్మాద్ ద్రౌపద్యశక్తస్య మన్యోర్నియమనం స్మృతమ్ ॥ 11
ద్రౌపదీ! క్రోధవశుడై నిగ్రహం లేక దేహత్యాగం చేసేవాడు, ఇహలోకపరలోకాలు రెంటికీ చెడిపోతాడు. అందువల్ల అశక్తుడైనవాడు క్రోధాన్ని నియంత్రించడమే మంచిది. (11)
విద్వాంస్తథైవ యః శక్తః క్లిశ్యమానో న కుప్యతి ।
అనాశయిత్వా క్లేష్టారం పరలోకే చ నందతి ॥ 12
విద్వాంసుడు సమర్థుడు అయినవాడు ఇతరులచే కష్టాలు పడుతున్నా, వారిపై కోపించక, తన్ను కష్టపెట్టిన వారిని నాశనం చేయకుండా ఉంటే పరలోకంలో కూడా ఆనందిస్తాడు. (12)
తస్మాద్ బలవతా చైవ దుర్బలేన చ నిత్యదా ।
క్షంతవ్యం పురుషేణాహుః ఆపత్స్వపి విజానతా ॥ 13
అందువల్ల బలవంతుడైనా, దుర్బలుడైనా విజ్ఞుడైన మానవుడు ఆపదలయందు కూడ సహనం వహించాలి. (13)
మన్యోర్హి విజయం కృష్ణే ప్రశంసంతీహ సాధవః ।
క్షమావతో జయో నిత్యం సాధీరిహ సతాం మతమ్ ॥ 14
ద్రౌపదీ! కోపాన్ని జయించడాన్ని సత్పురుషులు ప్రశంసిస్తున్నారు. లోకంలో సహనశీలుడే ఎల్లపుడూ జయం పొందుతాడని సత్పురుషుల అభిప్రాయం. (14)
సత్యం చానృతతః శ్రేయః నృశంస్యాచ్చానృశంసతా ।
తమేవం బహుదోషం తు క్రోధం సాధువివర్జితమ్ ॥ 15
మాదృశః ప్రసృజేత్ కస్మాత్ సుయోధనవధాదపి ।
అసత్యం కంటె సత్యం శ్రేష్ఠమైనది. క్రూరత్వం కంటె దయాలుత్వం శ్రేష్ఠమైంధి. సత్పురుదులందరూ విడిచిపెట్టిన, ఎన్నోదోషాలు గల క్రోధాన్ని - సుయోధనుడు నన్ను చంపినాసరే-నావంటివాడు ఎలా ప్రయోగిస్తాడు? (15 1/2)
తేజస్వీతి యమాహుర్వై పండితా దీర్ఘదర్శినః ॥ 16
న క్రోధోఽభ్యంతరస్తస్య భవతీతి వినిశ్చితమ్ ।
దూరదృష్టిగల పండితులు 'తేజస్వి' అని ఎవరిని చెపుతున్నారో వారి అంతరంగంలో క్రోధం ఉండదు. ఇది నిశ్చయం. (16 1/2)
యస్తు క్రోధం సముత్పన్నం ప్రజ్ఞయా ప్రతిబాధతే ॥ 17
తేజస్వినం తం విద్వాంసః మన్యంతే తత్త్వదర్శినః ।
మనస్సులో పుట్టిన క్రోధాన్ని ప్రజ్ఞచేత నిగ్రహించిన వాడిని 'తేజస్వి' అని తత్త్వదర్శులైన విద్వాంసులు భావిస్తున్నారు. (17 1/2)
క్రుద్ధో హి కార్యం సుశ్రోణి న యథావత్ ప్రపశ్యతి ।
నాకార్యం న చ మర్యాదాం నరః క్రుద్ధోఽనుపశ్యతి ॥ 18
సుందరీ! క్రుద్ధుడైనవాడు ఏ పనినీ సరిగా చూడలేడు. క్రుద్ధుడు మర్యాదను కాని, అకార్యాన్ని కాని తెలియజాలడు. (18)
హంత్యవధ్యానపి క్రుద్ధః గురూన్ క్రుద్ధస్తుదత్యపి ।
తస్మాత్ తేజసి కర్తవ్యః క్రోధో దూరే ప్రతిష్ఠితః ॥ 19
క్రుద్ధుడు అవధ్యులను కూడా వధిస్తాడు. గురువులను కూడా హింసిస్తాడు. అందువల్ల తేజోవంతుడు క్రోధాన్ని దూరం చేయాలి. (19)
దాక్ష్యం హ్యమర్షః శౌర్యం చ శీఘ్రత్వమితి తేజసః ।
గుణాః క్రోధాభిభూతేన న శక్యాః ప్రాప్తుమంజసా ॥ 20
సామర్థ్యం, అమర్షం, శౌర్యం, శీఘ్రత - ఇవి తేజస్సు యొక్క గుణాలు. క్రోధవశుడైనవానికి ఈ గుణాలు సహజంగా పొందశక్యం కావు. (20)
క్రోధం త్వక్త్వా తు పురుషః సమ్యక్ తేజోఽభిపద్యతే ।
కాలయుక్తం మహాప్రాజ్ఞే క్రుద్ధైస్తేజః సుదుఃసహమ్ ॥ 21
మహాప్రాజ్ఞా! క్రోధాన్ని విడిచినవాడు తేజస్సును బాగా పొందగలుగుతాడు. క్రోధంతో ఉన్నవాడు తగిన సమయంలో ఉపయోగించిన తేజస్సు తీవ్రమై సహింపశక్యం కాకుండా ఉంటుంది. (21)
క్రోధస్త్వపండితైః శశ్వత్ తేజ ఇత్యభినిశ్చితమ్ ।
రజస్తు లోకనాశాయ విహితం మానుషం ప్రతి ॥ 22
మూర్ఖులు క్రోధాన్నే తేజస్సుగా భావిస్తారు. కాని రజోగుణం వల్ల పుట్టిన క్రోధాన్ని మనుష్యులపై ప్రయోగిస్తే వినాశం కలుగుతుంది. (22)
తస్మాచ్ఛశ్వత్ త్యజేత్ క్రోధం పురుషః సమ్యగాచరన్ ।
శ్రేయాన్ స్వధర్మానపగః న క్రుద్ధ ఇతి నిశ్చితమ్ ॥ 23
అందువల్ల సదాచారి అయిన పురుషుడు ఎల్లపుడూ క్రోధాన్ని విడిచిపెట్టాలి. క్రుద్ధుడైనవానికంటె స్వధర్మాన్ని తప్పినవాడైనా మేలే. (23)
యది సర్వమబుద్ధీనామ్ అతిక్రాంతమచేతసామ్ ।
అతిక్రమో మద్విధస్వ కథంస్విత్ స్యాదనిందితే ॥ 24
సాధ్వీ! మూర్ఖుడు, అవివేకి క్షమాది సద్గుణాలను ఉల్లంఘించి ప్రవర్తింపవచ్చు. కాని నావంటి విజ్ఞుడు ఎలా ఉల్లంఘించగలుగుతాడు? (24)
యది న స్యుర్మానుషేషు క్షమిణః పృథివీసమాః ।
న స్యాత్ సంధిర్మనుష్యాణాం క్రోధమూలో హి విగ్రహః ॥ 25
భూమితో సమానమైన సహనశీలురు మానవులలో లేకుంటే ఇక మానవులలో సంధికి అవకాశమే లేదు. యుద్ధం క్రోధమూలకమైనది. (25)
అభిషక్తో హ్యభిసజేద్ ఆహాన్యాద్ గురుణా హతః ।
ఏవం వినాశో భూతానామ్ అధర్మః ప్రథితో భవేత్ ॥ 26
ఎవడైనా తన్ను బాధిస్తే, తాను కూడా ఎదిటివాడిని బాధిస్తాడు. గురువు తన్ను హింసిస్తే, తానూ గురువులను హింసిస్తాడు. ఈ విధంగా క్రోధం వల్ల ప్రాణుల వినాశం జరుగుతుంది. అధర్మం ప్రబలుతుంది. (26)
ఆక్రుష్టః పురుషః సర్వం ప్రత్యాక్రోశేదనంతరమ్ ।
ప్రతిహన్యాద్ధతశ్చైవ తథా హింస్యాశ్చ హింసితః ॥ 27
మానవులంతా క్రోధవశులైతే ఒకడి వల్ల తాను దెబ్బతింటే, తాను మళ్ళీ అతడిని దెబ్బతీస్తాడు. ఎదుటివాడు తన్ను చంపుతూంటే, తానూ ఎదుటివాడిని చంపుతాడు. ఇతరుడు తన్ను హింసిస్తే, తానూ అతడిని హింసిస్తాడు. (27)
హన్యుర్హి పితరః పుత్రాన్ పుత్రాశ్చాపి తథా పితౄన్ ।
హన్యుశ్చ పతయో భార్యాః పతీన్ భార్యాస్తథైవ చ ॥ 28
క్రోధవశులైతే తండ్రులు పుత్రులను, పుత్రులు తండ్రులను చంపుతారు. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను చంపుతారు. (28)
ఏవం సంకుపితే లోకే శమః కృష్ణే న విద్యతే ।
ప్రజానాం సంధిమూలం హి శమం విద్ధి శుభాననే ॥ 29
ద్రౌపదీ! ఈ విధంగా లోకమంతా క్రోధానికి వశమైతే ప్రపంచంలో ఎక్కడా శాంతి ఉండదు. సుందరీ! ప్రజలలో సంధికి మూలం శాంతి అని గ్రహించు. (29)
తాః క్షిపేరన్ ప్రజాః సర్వాః క్షిప్రం ద్రౌపది తాదృశే ।
తస్మాన్మన్యుర్వినాశాయ ప్రజానామభవాయ చ ॥ 30
ద్రౌపదీ! రాజు క్రోధవశుడైతే ప్రజలందరూ శీఘ్రంగా వినాశాన్ని పొందుతారు. అందువల్ల క్రోధం మానవుల వినాశానికి, అవినీతికి కారణమని తెలుసుకో. (30)
యస్మాత్ తు లోకే దృశ్యంతే క్షమిణః పృథివీసమాః ।
తస్మాజ్జన్మ చ భూతానాం భవశ్చ్ ప్రతిపద్యతే ॥ 31
ఈ లోకంలో భూమితో సమానులైన సహనశీలురు కనబడుతున్నారు కాబట్టే ప్రాణుల పుట్టుక, అభివృద్ధి సాగుతోంది. (31)
క్షంతవ్యం పురుషేణేహ సర్వాపత్సు సుశోభనే ।
క్షమావతో హి భూతానాం జన్మ చైవ ప్రకీర్తితమ్ ॥ 32
సుశోభనా! ఆపదలన్నింటియందు మానవుడు సహనం కలిగి ఉండాలి. క్షమాశీలుల వల్లనే ప్రాణుల మనుగడ సాగుతోంది. (32)
ఆక్రుష్టస్తాడితః క్రుద్ధః క్షమతే యో బలీయసా ।
యశ్చ నిత్యం జితక్రోధః విద్వానుత్తమపూరుషః ॥ 33
బలవంతుడు తన్ను తిట్టినా, కొట్టినా క్రోధాన్ని సహించి నిగ్రహించినవాడే జితక్రోధుడు, విద్వాంసుడు, ఉత్తమపురుషుడు. (33)
ప్రభావవానపి నరః తస్య లోకాః సనాతనాః ।
క్రోధనస్త్వల్పవిజ్ఞానః ప్రేత్య చేహ చ నశ్యతి ॥ 34
అటువంటి మానవుడే ప్రభావవంతుడు. అతడు సనాతనమైన లోకాలను పొందుతాడు. క్రోధం కలవాడు అల్పజ్ఞుడు. అతడు ఇహపరలోకాలు రెంటియందు వినాశాన్ని పొందుతాడు. (34)
అత్రాప్యుదాహరంతీమాః గాథా నిత్యం క్షమావతామ్ ।
గీతాః క్షమావతా కృష్ణే కాశ్యపేన మహాత్మనా ॥ 35
ఈ విషయంలో లోకులు క్షమాశీలుల గాథలను ఉదాహరిస్తున్నారు. ద్రౌపదీ! క్షమాశీలుడు, మహాత్ముడు అయిన కాశ్యపుడు ఈ గాథలను చెప్పాడు. (35)
క్షమా ధర్మః క్షమా యజ్ఞః క్షమా వేదాః క్షమా శ్రుతమ్ ।
య ఏతదేవం జానాతి స సర్వం క్షంతుమర్హతి ॥ 36
సహనమే ధర్మం. సహనమే యజ్ఞం, సహనమే వేదాలు, సహనమే శాస్త్రం. దీనినీ విధంగా తెలిసినవాడు అన్నింటినీ క్షమించడానికి యోగ్యుడు. (36)
క్షమా బ్రహ్మ క్షమా సత్యం క్షమా భూతం చ భావి చ ।
క్షమా తపః క్షమా శౌచం క్షమయేదం ధృతం జగత్ ॥ 37
క్షమయే బ్రహ్మం, క్షమయే సత్యం, భూతభవిష్యత్ కాలాలూ క్షమయే, క్షమయే తపస్సు, క్షమయే శౌచం ఈ జగత్తంతా క్షమచేతనే ధరింపబడి ఉంది. (37)
అతి యజ్ఞవిదాం లోకాన్ క్షమిణః ప్రాప్నువంతి చ ।
అతి బ్రహ్మవిదాం లోకానతి చాపి తపస్వినామ్ ॥ 38
యజ్ఞవేత్తలు, బ్రహ్మవేత్తలు, తపస్వులు వీరికంటె క్షమాశీలుడు ఉన్నతాలైన లోకాలను పొందుతాడు. (38)
అన్యే వై యజుషాం లోకాః కర్మిణామపరే తథా ।
క్షమావతాం బ్రహ్మలోకే లోకాః పరమపూజితాః ॥ 39
యజ్ఞకర్మలు అనుష్ఠించే వారి లోకాలు వేరు, వాపీ కూప తటాకాది నిర్మాణం, దానాది కర్మలు చేసేవారి లోకాలు వేరు, కాని క్షమాశీలురైనవారి లోకములు బ్రహ్మ లోకంలో, మిక్కిలి పూజింపబడుతూ ఉన్నాయి. (39)
క్షమా తేజస్వినాం తేజః క్షమా బ్రహ్మ తపస్వినామ్ ।
క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞః క్షమా శమః ॥ 40
తేజోవంతుల తేజస్సు సహనం. తపస్వుల యొక్క తపస్సు సహనం, సత్యవ్రతుల సత్యం సహనం. సహనమే యజ్ఞం, సహనమే శాంతి. (40)
తాం క్షమాం తాదృశీం కృష్ణే కథమస్మద్విధస్త్యజేత్ ।
యస్యాం బ్రహ్మ చ సత్యం చ యజ్ఞా లోకాశ్చ ధిష్ఠితాః ॥ 41
ద్రౌపదీ! బ్రహ్మ, సత్యం, యజ్ఞాలు, లోకాలు ప్రతిష్ఠితాలై ఉన్న మహత్త్వపూర్ణమైన సహనాన్ని నాలాంటివాడు ఎలా వదలగలడు? (41)
క్షంతవ్యమేవ సతతం పురుషేణ విజానతా ।
యదా హి క్షమతే సర్వం బ్రహ్మ సంపద్యతే తదా ॥ 42
విజ్ఞుడైన మానవుడు ఎల్లపుడూ సహనం కలిగి ఉండాలి. అన్నింటిని సహింపగలిగినవాడే బ్రహ్మభావాన్ని పొందుతాడు. (42)
క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతామ్ ।
ఇహ సమ్మానమృచ్ఛంతి పరత్ర చ శుభాం గతిమ్ ॥ 43
ఈ లోకం క్షమాశీలులది. క్షమాశీలులదే పరలోకం కూడ. క్షమాశీలురు ఇహలోకంలో గౌరవింపబడతారు. పరలోకంలో ఉత్తమగతిని పొందుతారు. (43)
యేషాం మన్యుర్మనుష్యాణాం క్షమయాభిహతః సదా ।
తేషాం పరతరే లోకాః తస్మాత్ క్షాంతిః పరా మతా ॥ 44
తమలో కలిగిన క్రోధాన్ని సహనంతో నిగ్రహించిన వారు సర్వోత్తమలోకాలను పొందుతారు. అందువల్ల సహనం అన్నింటికంటె గొప్పది. (44)
ఇతి గీతాః కాశ్యపేన గాథా నిత్యం క్షమావతామ్ ।
శ్రుత్వా గాథాః క్షమాయాస్త్వం తుష్య ద్రౌపది మా క్రుధః ॥ 45
ఈ విధంగా కాశ్యపుడు నిత్యం క్షమాశీలులైన వారి గాథలను గానం చేశాడు. ద్రౌపదీ! క్షమను గురించి ఈ విశిష్టతలు విని సంతృప్తి నొందు. కోపించవద్దు. (45)
పితామహః శాంతనవః శమం సంపూజయిష్యతి ।
కృష్ణశ్చ దేవకీపుత్రః శమం సంపూజయిష్యతి ॥ 46
పితామహుడు భీష్ముడు, దేవకీపుత్రుడు కృష్ణుడు సహనాన్ని గౌరవిస్తారు. (46)
ఆచార్యో విదురః క్షత్తా శమమేవ వదిష్యతః ।
కృపశ్చ సంజయశ్చైవ శమమేవ వదిష్యతః ॥ 47
ద్రోణాచార్యుడు, విదురుడు, కృపాచార్యుడు, సంజయుడు సహనాన్నే మంచిదని చెపుతారు. (47)
సోమదత్తో యుయుత్సుశ్చ ద్రోణపుత్రస్తథైవ చ ।
పితామహశ్చ నో వ్యాసః శమం వదతి నిత్యశః ॥ 48
సోమదత్తుడు, యుయుత్సుడు, ద్రోణపుత్రుడు అశ్వత్థామ, మా పితామహుడు వ్యాసుడు నిరంతరం శాంతినే ఉపదేశిస్తారు. (48)
ఏతైర్హి రాజా నియతం చోద్యమానః శమం ప్రతి ।
రాజ్యం దాతేతి మే బుద్ధిః న చేల్లోభాన్నశిష్యతి ॥ 49
వీరంతా ధృతరాష్ట్రమహారాజును శాంతికి ప్రేరేపించినట్లయితే ఆయన నాకు తప్పక రాజ్యమిస్తాడు. లేకుంటే లోభం వల్ల నశిస్తాడు. (49)
కాలోఽయం దారుణః ప్రాప్తః భరతానామభుతయే ।
నిశ్చితం మే సదైవైతత్ పురస్తాదపి భావిని ॥ 50
సుయోధనో నార్హతీతి క్షమామేవం న విందతి ।
అర్హస్తత్రాహమిత్యేవం తస్మాన్మాం విందతే క్షమా ॥ 51
భరతవంశీయుల వినాశనానికే ఈ దారుణమైన కాలం ప్రాప్తించింది. భామినీ! ఈ విషయం నేను మునుపే నిశ్చయించుకొన్నాను. ఈ విధంగా సహనాన్ని వహించడానికి సుయోధనుడు యోగ్యుడు కాదు. నేను అందుకు తగినవాడిని. అందుకే సహనం నన్ను ఆశ్రయించింది. (50,51)
ఏతదాత్మవతాం వృత్తమ్ ఏష ధర్మః సనాతనః ।
క్షమా చైవానృశంస్యం చ తత్ కర్తాస్మ్యహమంజసా ॥ 52
క్షమ, దయ, జితేంద్రియుల సదాచారాలు. ఇది సనాతన ధర్మం. అందువలన దయా సహనములను నేను యథార్థరూపంగా సహజంగా అనుసరిస్తున్నాను. (52)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్రౌపదీయుధిష్ఠిర సంవాదే ఏకోనత్రింశోఽధ్యాయః ॥ 29 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్రౌపదీయుధిష్ఠిర సంవాదమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (29)