28. ఇరువది ఎనిమిదవ అధ్యాయము

ప్రహ్లాద-బలి సంవాదమును ద్రౌపది వర్ణించుట.

ద్రౌపద్యువాచ
అత్రాప్యుదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్ ।
ప్రహ్లాదస్య చ సంవాదం బలేర్వైరోచనస్య చ ॥ 1
ద్రౌపది ఇలా అంది - ఈ విషయంలో పురాతన ఇతిహాసమైన బలి - ప్రహ్లాదుల సంవాదాన్ని ఉదాహరిస్తున్నారు. (1)
అసురేంద్రం మహాప్రాజ్ఞం ధర్మాణామాగతాగమమ్ ।
బలిః పప్రచ్ఛ దైత్యేంద్రం ప్రహ్లాదం పితరం పితుః ॥ 2
దైత్యులకు రాజైన ప్రహ్లాదుడు మిక్కిలి తెలివైనవాడు, ధర్మ రహస్యాలన్నింటిని తెలిసినవాడు. ఒకనాడు బలి తన పితామహుడైన ప్రహ్లాదుని ఇలా అడిగాడు. (2)
బలిరువాచ
క్షమా స్విచ్ఛ్రేయసీ తాత ఉతాహో తేజ ఇత్యుత ।
ఏతన్మే సంశయం తాత యథావద్ బ్రూహి పృచ్ఛతే ॥ 3
బలి ఇలా అన్నాడు - తాతా! పరాక్రమం శ్రేయస్కరమైనదా లేక సహనం శ్రేయస్కరమైనదా? ఈ విషయంలో నాకు సందేహం కలిగింది. ఉన్నదున్నట్లుగా చెప్పు. (3)
శ్రేయో యదత్ర ధర్మజ్ఞ బ్రూహి మే తదసంశయమ్ ।
కరిష్యామి హి తత్ సర్వం యథావదనుశాసనమ్ ॥ 4
ధర్మజ్ఞా! ఈ రెండింటిలో ఏది శ్రేయమో నాకు తప్పక చెప్పు. నీవు చెప్పినది యథాతథంగా ఆచరిస్తాను. ఇందులో సందేహం లేదు. (4)
తస్మై ప్రోవాచ తత్ సర్వమ్ ఏవం పృష్టః పితామహః ।
సర్వనిశ్చయవిత్ ప్రాజ్ఞః సంశయం పరిపృచ్ఛతే ॥ 5
ఈ విధంగా తన సందేహాన్ని అడిగిన బలికి అతని పితామహుడు, ప్రాజ్ఞుడు, అన్నింటిని నిశ్చయంగా తెలిసిన వాడు అయిన ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్పాడు. (5)
ప్రహ్లాద ఉవాచ
న శ్రేయః సతతం తేజః న నిత్యం శ్రేయసీ క్షమా ।
ఇతి తాత విజానీహి ద్వయమేతదసంశయమ్ ॥ 6
ప్రహ్లాదుడిలా చెప్పాడు - నాయనా! ఎల్లపుడూ పరాక్రమమే శ్రేయస్సుకాదు. అదేవిధంగా సహనమూ శ్రేయస్సు కాదు. ఈ రెంటిని గురించి సందేహం లేకుండా తెలిసికో. (6)
యో నిత్యం క్షమతే తాత బహూన్ దోషాన్ స విందతి ।
భృత్యాః పరిభవంత్యేనమ్ ఉదాసీనాస్తథారయః ॥ 7
సర్వభూతాని చాప్యస్య న నమంతి కదాచన ।
తస్మాన్నిత్యం క్షమా తాత పండితైరపి వర్జితా ॥ 8
నాయనా! నిత్యం సహనంతోనే ఉండేవాడు చాలా అనర్థాలను పొందుతాడు. సేవకులు అతణ్ణి అవమానిస్తారు. శత్రువులు ఉపేక్షిస్తారు, లెక్కచేయరు. ప్రాణులన్ని అతనికి ఒకప్పుడు కూడా లొంగి ఉండవు. అందువల్ల నిత్యసహనం పండితులు కూడా విడిచిపెట్టారు. (7,8)
అవజ్ఞాయ హి తం భృత్యాః భజంతే బహుదోషతామ్ ।
ఆదాతుం చాస్య విత్తాని ప్రార్థయంతేఽల్పచేతసః ॥ 9
అటువంటి వానిని సేవకులు తృణీకరించి అనేక దోషాలకు పాల్పడుతారు. సంకుచిత మనస్సు గల మూర్ఖులైన సేవకులు అటువంటివాని సంపదలు అపహరించాలనుకొంటారు. (9)
చాపం వస్త్రాణ్యలంకారాన్ శయనాన్యాసనాని చ ।
భోజనాన్యథ పానాని సర్వోపకరణాని చ ॥ 10
ఆదదీరన్నధికృతాః యథాకామమచేతసః ।
ప్రదిష్టాని చ దేయాని న దద్యుర్భర్తృశాసనాత్ ॥ 11
నిత్యం సహనం వహించే యజమానియొక్క సేవకులు మూర్ఖులై అతని రథ, వస్త్ర, అలంకార, శయన, ఆసన, భోజన, పానీయాలను, సమస్త సామగ్రిని ఉపయోగించుకొంటారు. యజమాని ఆజ్ఞాపించినా ఇతరులకు ఇవ్వవలసినవాటిని ఇయ్యరు. (10,11)
న చైనం భర్తృపూజాభిః పూజయంతి కథంచన ।
అవజ్ఞానం హి లోకేఽస్మిన్ మరణాదపి గర్హితమ్ ॥ 12
నిత్యం క్షమాశీలుడైన యజమానికి సేవకులు ఉచితమైన గౌరవాన్ని కూడ ఇయ్యరు. ఈ లోకంలో సేవకులచే అవమానింపబడటం మరణం కంటే మరణం కంటే కూడ నీచమైంది. (12)
క్షమిణం తాదృశం తాత బ్రువంతి కటుకాన్యపి ।
ప్రేష్యాః పుత్రాశ్చ భృత్యాశ్చ తథోదానీనవృత్తయః ॥ 13
నాయనా! ఆ విధంగా క్షమాశీలుడైన వానిని సేవకులు, పుత్రులు, భృత్యులు, తటస్థులు కూడ పరుషంగా మాట్లాడుతారు. (13)
అథాస్య దారానిచ్ఛంతి పరిభూయ క్షమావతః ।
దారాశ్చాస్య ప్రవర్తంతే యథాకామమచేతసః ॥ 14
నిత్యక్షమాశీలుడైన వాని భార్యను అవమానించి లోబరుచుకోవాలని ఇతరులు భావిస్తారు. అతని భార్య కూడ స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంది. (14)
తథా చ నిత్యముదితా యది నాల్పమపీశ్వరాత్ ।
దండమర్హంతి ద్యుష్యంతి దుష్టాశ్చాప్యపకుర్వతే ॥ 15
సహనశీలుడై యజమాని కొంచెం కూడ దండించకపోతే సేవకులు దుష్టాచారపరులౌతారు. అలా దుష్టులైనవారు యజమానికి అపకారం చేస్తారు. (15)
ఏతే చాన్యే చ బహవః నిత్యం దోషాః క్షమావతామ్ ।
అథ వైరోచనే దోషాన్ ఇమాన్ విద్ధ్యక్షమావతామ్ ॥ 16
విరోచనకుమారా! బలీ! నిత్యం క్షమాశీలుడైనవానికి ఇవీ, ఇంకా ఇతర అనర్థాలూ కలుగుతాయి. ఇక సహనం లేనటువంటి వారికి కలిగే దోషాలను చెపుతాను. తెలిసికో. (16)
అస్థానే యది వా స్థానే సతతం రజసాఽఽవృతః ।
క్రుద్ధో దండాన్ ప్రణయతి వివిధాన్ స్వేన తేజసా ॥ 17
నిత్యం రజోగుణంతో కోపంగా ఉండేవాడు యోగ్యాయోగ్యాలు విచారించకుండానే తనపరాక్రమంతో అందరినీ అనేకవిధాలుగా దండిస్తూ ఉంటాడు. (17)
మిత్రైః సహ విరోధం చ ప్రాప్నుతే తేజసాఽఽవృతః ।
ఆప్నోతి ద్వేష్యతాం చైవ లోకాత్ స్వజనతస్తథా ॥ 18
క్రోధ స్వభావం కలవాడు స్నేహితులతో విరోధిస్తాడు. స్వజనులచే ద్వేషింపబడతాడు. (18)
సోఽవమానాదర్థహానిమ్ ఉపాలంభమనాదరమ్ ।
సంతాపద్వేషమోహాంశ్చ శత్రూంశ్చ లభతే నరః ॥ 19
క్రోధ స్వభావం కలవాడు ఇతరులను అవమానించడం వల్ల ధనాన్ని కోల్పోతాడు. నిందలను, తిరస్కారాన్ని, సంతాపాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, శత్రువులను పొందుతాడు. (19)
క్రోధాద్ దండాన్మనుష్యేషు వివిధాన్ పురుషోఽనయాత్ ।
భ్రశ్యతే శీఘ్రమైశ్వర్యాత్ ప్రాణేభ్యః స్వజనాదపి ॥ 20
క్రోధవశుడైనవాడు తనకోపం వల్ల అన్యాయంగా ఇతరులను అనేకవిధాలుగా దండిస్తాడు. అందువల్ల అతడు తొందరగా ఐశ్వర్యభ్రష్టుడౌతాడు. తనవారి నుండి దూరమౌతాడు. చివరకు ప్రాణాలను కూడా కోల్పోతాడు. (20)
యోఽపకర్తౄంశ్చ హర్తౄంశ్చ తేజసైవోపగచ్ఛతి ।
తస్మాదుద్విజతే లోకః సర్పాద్ వేశ్మగతాదివ ॥ 21
ఇంటిలో దూరిన సర్పంలా, ఉపకారం చేసినవారిని, అపహరించేవారిని ఒకేవిధంగా కోపంగా మాట్లాడినవాడి వల్ల లోకులు కూడా ఉద్విగ్నులౌతారు. (21)
యస్మాదుద్విజతే లోకః కథం తస్య భవో భవేత్ ।
అంతరం తస్య దృష్ట్వైవ లోకో వికురుతే ధ్రువమ్ ॥ 22
లోకుంలందరికి (లోకానికి) ఉద్వేగం కలిగించే వాడికి విభవం ఎలా సమకూరుతుంది? అతనిలోను ఏదో ఒక లోపాన్ని చూసి, లోకులు కూడా అతనికి చెడును చేస్తారు. (22)
తస్మాన్నాత్యుత్సృజేత్ తేజః న చ నిత్యం మృదుర్భవేత్ ।
కాలే కాలే తు సంప్రాప్తే మృదుస్తీక్ష్ణోఽపి వా భవేత్ ॥ 23
అందువల్ల కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టకూడదు. నిత్యం మృదువుగా క్షమాశీలుడుగా ఉండకూడదు. ఆయా సమయాలు వచ్చినపుడు మృదువుగాను, లేదా క్రోధంతోను ఉండాలి. (23)
కాలే మృదుర్యో భవతి కాలే భవతి దారుణః ।
స వై సుఖమవాప్నోతి లోకేఽముష్మిన్నిహైవ చ ॥ 24
తగిన సమయంలో సహనం కలిగి ఉన్నవాడు, తగిన సమయంలో కఠినంగా, కోపంగా ఉండేవాడు - అతడే ఇహపరలోకాల్లో సుఖాన్ని పొందుతాడు. (24)
క్షమాకాలాంస్తు వక్ష్యామి శృణు మే విస్తరేణ తాన్ ।
యే తే నిత్యమసంత్యాజ్యా యథా ప్రాహుర్మనీషిణః ॥ 25
మహనీయులు చెపినట్లు, ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడని సమయాలను గురించి వివరంగా చెపుతాను. (25)
పూర్వోపకారీ యస్తే స్యాత్ అపరాధే గరీయసి ।
ఉపకారేణ తత్ తస్య క్షంతవ్యమపరాధినః ॥ 26
మునుపు నీకు ఉపకారం చేసినవాడు, ఏదైనా అపరాధం చెసినా, మునుపతడు చేసిన ఉపకారాన్ని స్మరించి అతని అపరాధాన్ని క్షమించాలి. (26)
అబుద్ధిమాశ్రితానాం తు క్షంతవ్యమపరాధినామ్ ।
న హి సర్వత్ర పాండిత్యం సులభం పురుషేణ వై ॥ 27
అజ్ఞానంతో అపరాధం చేసి ఆశ్రయించినవారి యొక్క అపరాధాన్ని క్షమించాలి. ఎవరికీ అన్ని విషయాల్లోనూ పాండిత్యం తేలికగా లభించదు. (27)
అథ చేద్ బుద్ధిజం కృత్వా బ్రూయుస్తే తదబుద్ధిజమ్ ।
పాపాన్ స్వల్పేఽపి తాన్ హన్యాదపరాధే తథానృజూన్ ॥ 28
బుద్ధిపూర్వకంగా అపరాధం చేసి, ఆ పైన తెలియక చేశానని చెప్పే పాపాత్ముడైన, కుటిలులైన వారి చిన్న అపరాధాన్ని కూడా క్షమించకూడదు. వారిని తప్పక దండించాలి. (28)
సర్వస్యైకోఽపరాధస్తే క్షంతవ్యః ప్రాణినో భవేత్ ।
ద్వితీయే సతి వధ్యస్తు స్వల్పేఽప్యపకృతే భవేత్ ॥ 29
ప్రాణులెవరైనప్పటికి ఒక్క అపరాధం మాత్రం క్షమించదగింది. రెండవ అపరాధం చేస్తే అతడు దండిపదగినవాడే. అది చిన్నదైనాసరే దండించాలి. (29)
అజానతా భవేత్ కశ్చిద్ అపరాధః కృతో యది ।
క్షంతవ్యమేవ తస్యాహుః సుపరీక్ష్య పరీక్షయా ॥ 30
బాగా పరిశీలనతో పరీక్షించి, అజ్ఞానంతో చేసిన అపరాధమని నిశ్చయమైతే అట్టి అపరాధం క్షమించదగిందే. (30)
మృదునా దారుణం హంతి మృదునా హంత్యదారుణమ్ ।
నాసాధ్యం మృదునా కించిత్ తస్మాత్ తీవ్రతరం మృదు ॥ 31
మృదుస్వభావంతో ఉగ్రస్వభావంకలవాడిని, మృదు స్వభావం కలవాడిని కూడ నాశనం చేయవచ్చు. మృదుస్వభావంతో అసాధ్యమైంది ఏదీ లేదు. అందువలన మృదుత్వంతో కూడిన సామోపాయమే ఉత్తమమైంది. (31)
దేశకాలౌ తు సంప్రేక్ష్య బలాబలమథాత్మనః ।
నాదేశకాలే కించిత్ స్యాద్ దేశకాలౌ ప్రతీక్షతామ్ ॥ 32
దేశకాలాలను బాగా పరిశీలించి, తన యొక్క బలాబలాలను పరిశీలించి మృదుత్వంతో కూడిన సామోపాయాన్ని ప్రయోగించాలి. దేశకాలాలు అనుకూలం కానపుడు ఏమీ సాధించలేం. తగిన దేశకాలాలకోసం నిరీక్షించాలి. (32)
ఏత ఏవంవిధాః కాలాః క్షమాయాః పరికీర్తితాః ।
అతోఽన్యథానువర్తత్సు తేజసః కాల ఉచ్యతే ॥ 33
ఈ విధంగా ఇటువంటి సమయాలు సహనానికి అనుకూలాలైనవిగా చెప్పబడ్డాయి. వీటికంటె ఇతర సందర్భాలు పరాక్రమానికి అననుకూలంకానివిగా చెప్పబడ్డాయి. (33)
తదహం తేజసః కాలం తవ మన్యే నరాధిప ।
ధార్తరాష్ట్రేషు లుబ్ధేషు సతతం చాపకారిషు ॥ 34
నరాధిపా! లోభంతో నీకపకారం చేసిన ధృతరాష్ట్రుని కుమారుల విషయంలో నీకిది పరాక్రమించవలసిన కాలమని నేను భావిస్తున్నాను. (34)
న హి కశ్చిత్ క్షమాకాలో విద్యతేఽద్య కురూన్ ప్రతి ।
తేజసశ్చాగతే కాలే తేజ ఉత్ర్సష్టుమర్హసి ॥ 35
కౌరవుల పట్ల ఓర్పు వహించవలసిన సమయం ఎంత మాత్రమూ లేదు. క్రోధంతో పరాక్రమించవలసిన సమయం వచ్చినపుడు నీవు పరాక్రమించడమే యోగ్యమైనది. (35)
మృదుర్భవత్యవజ్ఞాతః తీక్ష్ణాదుద్విజతే జనః ।
కాలే ప్రాప్తే ద్వయం చైతద్ యో వేద స మహీపతిః ॥ 36
సహనంతో మృదువుగా ఉంటే లోకులు అవమానిస్తారు. కోపంతో ఉండేవాడికి అందరూ భయపడతారు. తగిన సమయాలలో ఈ రెండింటిని ప్రయోగించడం తెలిసినవాడే రాజు. (36)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్రౌపదీవాక్యేఽష్టావింశోఽధ్యాయః ॥ 28 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్రౌపదీవాక్యమను ఇరువది ఎనిమిదవ అధ్యాయము. (28)