65. అరువది అయిదవ అధ్యాయము

యుధిష్ఠిరుడు తనతోపాటు సర్వస్వమును కోల్పోవుట.

శకుని ఉవాచ
బహువిత్తం పరాజైషీః పాండవానాం యుధిష్ఠిర ।
ఆచక్ష్య విత్తం కౌంతేయ యదితేఽస్త్వపరాజితమ్ ॥ 1
శకుని ఇలా అన్నాడు. యుధిష్ఠిరా! పాండవుల ధనాన్ని ఇప్పటికే చాలా కోల్పోయావు. కౌంతేయా! నీ దగ్గర ఇంకా పోగొట్టుకొనని ధనశేషముంటే చెప్పు. (1)
యుధిష్ఠిర ఉవాచ
మమ విత్తమసంఖ్యేయ యదహం వేద సౌబల ।
అథ త్వం శకునే కస్మాద్ విత్తం సమనుపృచ్ఛసి ॥ 2
యుధిష్ఠిరుడిలా అన్నాడు. శకునీ! నా దగ్గర లెక్కలేనంత ధనమున్నదన్న విషయమ్ నేనెరుగుదును. అసలు నాధనాన్ని గురించి నీవెందుకడుగుతున్నావు. (2)
అయుతమ్ ప్రయుతమ్ చైవ శంకుం పద్మం తథార్బుదమ్ ।
ఖర్వం శంఖం నిఖర్వం చ మహాపద్మం చ కోటయః ॥ 3
మధ్యం చైవ పరార్థం చ సపరం చాత్ర పణ్యతామ్ ।
ఏతన్మమ ధనం రాజంస్తేన దీవ్యామ్యహం త్వయా ॥ 4
రాజా! నా దగ్గర అయుతం, ప్రయుతం, శంకువు, పద్మం, అర్బుదం, ఖర్వం, శంఖం, నిఖర్వం, మహాపద్మం, కోట్లు, మధ్యం, పరార్థం, పరం.... అంత ధనముంది. అదంతా పందెంగా పెట్టి నేను ఆడుతున్నాను. (3,4)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు - అది విని శకుని కైతవాన్ని ఆశ్రయించి పాచికలు వేసి "ఇదంతా కూడా నేను గెలిచేశాను" అని ధర్మరాజుతో అన్నాడు. (5)
యుధిష్ఠిర ఉవాచ
గవాశ్వం బహుధేనూకమ్ అసంఖ్యేయమజావికమ్ ।
యత్ కించిదనుపర్ణాశాంప్రాక్ సింధోరపి సౌబల ।
ఏతన్మమ ధనం సర్వం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 6
అపుడు ధర్మరాజు ఇలా అన్నాడు. సింధునదికి తూర్పు నుండి పర్ణాశా నది వరకూ ఎద్దులు, అశ్వాలు, ఆవులు అన్నీ చాలా ఉన్నాయి. అదంతా నా ధనమే. దానితో ఆడతాను. (6)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 7
వైశంపాయనుడు చెపుతున్నాడు. ఆ మాట విని శకుని మోసంతో పాచికలు విసిరి "నేనే గెలిచాను" అన్నాడు ధర్మరాజుతో. (7)
యుధిష్ఠిర ఉవాచ
పురం జనపదో భూమిః అబ్రాహ్మణధనైః సహ ।
అబ్రాహ్మణాశ్చ పురుషా రాజన్ శిష్టం ధనం మమ ।
ఏతద్ రాజన్ మమ ధన తేన దీవ్యామ్యహం త్వయా ॥
యుధిష్ఠిరుడిలా అన్నాడు - రాజా! బ్రాహ్మణులకు దానం చేసిన భూమితప్ప మిగిలిన నగరగ్రామాలు భూమి, నా అధికారంలో ఉన్న బ్రాహ్మణేతరజనులు అంతా నా ధనమే. మిగిలిన ఈ ధనాన్ని పందెంగా పెట్టి ఆడబోతున్నాను. (8)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 9
వైశంపాయనుడిలా అన్నాడు - అది విని శకుని కటపత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి "నేనే గెలిచాను" అని యుధిష్ఠిరునితో అన్నాడు. (9)
యుధిష్ఠిర ఉవాచ
రాజపుత్రా ఇమే రాజన్ శోభంతే యైర్విభూషితాః ।
కుండలాని చ నిష్కాశ్చ సర్వం రాజవిభూషణమ్ ।
ఏతన్మమ ధనం రాజన్ తేన దీవ్యామ్యహం త్వయా ॥ 10
యుధిష్ఠిరుడిలా అన్నాడు - ఈ రాజకుమారులు - భీమాదులు - ధరించి ఉన్న కుండలాలు, పతకాలు మొదలగు ఆభరణాలు అన్నీ రాజునకు సంబంధించినవే. ఈ నా ధనాన్ని పందెంగా పెట్టి నీతో ఆడుతున్నాను. (10)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిర మభాషత ॥ 11
వైశంపాయనుడిలా అన్నాడు - అది విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి "నేనే గెలిచాను" అని యుధిష్ఠిరునితో అన్నాడు. (11)
యుధిష్ఠిర ఉవాచ
శ్యామో యువా లోహితాక్షః సింహస్కంధో మహాభుజః ।
నకులో గ్లహ ఏవైకః విద్ధ్యదేతన్మమ తద్ధనమ్ ॥ 12
యుధిష్ఠిరుడిలా అన్నాడు. శ్యామవర్ణం గలవాడు, యువకుడు, ఎఱ్ఱటి కన్నులు గలవాడు, సింహమధ్యముడు, మహాభుజుడు అయిన నకులుడే నా పందెం. ఇతనినే ధనంగా భావించు. (12)
శకుని రువాచ
ప్రియస్తే నకులో రాజన్ రాజపుత్రో యుధిష్ఠిర ।
అస్మాకం వశతాం ప్రాప్తః భూయః కేనేహ దీవ్యసే ॥ 13
శకుని ఇలా అన్నాడు - రాజా యుధిష్ఠిరా! నకులుడు రాజకుమారుడు. నీకు ఇష్టమైన వాడు. మాకు వశమయితే ఇంక దేనితో ఆడుతావు? (13)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తు తానక్షాన్ శకునిః ప్రత్యదీవ్యత ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 14
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ మాట అని శకుని పాచికలు విసిరి "నేనే గెలిచాను" అని యుధిష్ఠిరునితో అన్నారు. (14)
యుధిష్ఠిర ఉవాచ
అయం ధర్మాన్ సహదేవోఽనుశాస్తి
లోకేహ్యస్మిన్ పండితాఖ్యాం గతశ్చ ।
అనర్హతా రాజపుత్రేణ తేన
దీవ్యామ్యహం చాప్రియవత్ ప్రియేణ ॥ 15
యుధిష్ఠిరుడిలా అన్నాడు. ఈ సహదేవుడు ధర్మాన్ని ఉపదేశించగలవాడు. పండితుడని ఈ లోకంలో పేరుపొందినవాడు. నాఖు ప్రియుడైన ఈ రాజకుమారుడు పందెంగా పెట్టదగినవాడు కాదు. అయినా ఇష్టంలేని వస్తువుగా భావించి ఇతనిని పందెంగా పెడుతున్నాను. (15)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముప్రాశితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు - ఆ మాట విని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి "నేనే గెలిచాను" అని శకుని యుధిష్టిరునితో అన్నాడు. (16)
శకుని రువాచ
మాద్రీపుత్రౌ ప్రియౌరాజన్ తవేమౌ విజితౌయయా ।
గరీయాంసౌ తు తే మన్యే భీమసేన ధనంజయౌ ॥ 17
శకుని ఇలా అన్నాడు. రాజా! నీకిష్టులయిన నకుల సహదేవులను నేను గెలిచికొన్నాను. భీమార్జునులు నీకు చాలా విలువైన వారని భావిస్తున్నాను. (17)
యుధిష్ఠిర ఉవాచ
అధర్మం చరసే నూనం యో నావేక్షసి వై నయమ్ ।
యో నః సుమనసాం మూఢ విభేదం కర్తుమిచ్ఛసి ॥ 18
యుధిష్ఠిరుడిలా అన్నాడు - మూఢుడా! అధర్మంగా ప్రవర్తిస్తున్నావు. న్యాయాన్ని పాటించటం లేదు. మంచి మనస్సులు గల మాలో విభేదాలు కల్పించాలని చూస్తున్నావు. (18)
శకుని ఉవాచ
గర్తే మత్తః ప్రపతతే ప్రమత్తః స్థాణుమృచ్ఛతి ।
జ్యేష్ఠో రాజన్ వరిష్ఠోఽసి నమస్తే భరతర్షభ ॥ 19
శకుని ఇలా అన్నాడు. భరతర్షభా! మదించి అధర్మాన్ని ఆశ్రయించే వాడు నరకంలో పడతాడు. బాగా మదించిన వాడు మొద్దుబారి పోతాడు. రాజా! నీవు పెద్దవాడవు, గొప్పవాడవు. నీకు నమస్కారం. (19)
స్వప్నే తాని న దృశ్యంతే జాగ్రతో వా యుధిష్ఠిర ।
కితవా యాని దీవ్యంతః ప్రలపంత్యుత్కటాఇవ ॥ 20
యుధిష్ఠిరా! జూదగాళ్ళు జూదమాడుతూ పిచ్చెత్తిపోయి ఏదేదో వాగుతుంటారు. కానీ ఆ మాటలు కలలో కానీ ఇలలో కాని వాస్తవరూపాన్ని ధరించవుహ. (20)
యూధిష్ఠిర ఉవాచ
యో నః సంఖ్యే నౌరివ పారనేతా
జేతా రిపూణాం రాజపుత్రస్తరస్వీ ।
అనర్హతా లోకవీరేణ తేన
దీవ్యామ్యహం శకునే ఫల్గునేన ॥ 21
యుధిష్ఠిరుడిలా అన్నాడు. శకునీ! అర్జునుడు నావవలె మమ్ము యుధ్ధంలో తరింపజేయగలవాడు. శత్రువులను జయించగలవాడు. లోకైకవీరుడైన అతనిని పందెంగా పెట్టడం తగనిపనే. అయినా సరే ఆ అర్జునుని పందెంగా పెట్టి ఆడుతున్నాను. (21)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 22
వైశంపాయనుడిలా అన్నాడు - ఆ మాట విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి "నేనే గెలిచాను" అని యుధిష్ఠిరునితో అన్నాడు. (22)
శకుని రువాచ
అయం మయా పాండవానాం ధనుర్ధరః
పరాజితః పాండవః సవ్యసాచీ
భీమేన రాజన్ దయితేన దీవ్య
యత్ కైతవం పాండవ తేఽవశిష్టమ్ ॥ 23
శకుని ఇలా అన్నాడు - పాండవులలో మేటివిలుకాడయిన సవ్యసాచిని కూడా నేను గెలుచుకొన్నాను. రాజా! యుధిష్ఠిరా! ఇప్పుడు నీ దగ్గర నీకిష్టమయిన భీమసేనుడే పందెం పెట్టడానికి మిగిలి ఉన్నాడు. అతనిని పందెంగా పెట్టి ఆడు. (23)
యుధిష్ఠిర ఉవాచ
యో నో నేతా యుధి నః ప్రణేతా
యథా వజ్రీ దానవశత్రురేకః ।
తిర్యక్ర్పేక్షీ సంనతభ్రూర్మహాత్మా
సింహస్కంధో యశ్చ సదాత్యమర్షీ ॥ 24
బలేన తుల్యో యస్య పుమాన్ న విద్యతే
గదాభృతామగ్ర్య ఇహారిమర్దనః ।
అనర్హతా రాజపుత్రేణ తేన
దీవ్యామ్యహం భీమసేనేన రాజన్ ॥ 25
యుధిష్ఠిరుడిలా అన్నాడు - రాజా! భీముడు యుద్ధంలో మా సేనాపతి. రణరంగంలో వజ్రధారి అయిన ఇంద్రుని వలె ఒంటరిగా మమ్ము నడిపించదలచాడు. అడ్డంగా కూడా చూడగలవాడు. వింటివలె వంగిన కనుబొమలు గలవాడు. మహనీయుడు. సింహస్కంధుడు. సదా అమర్షతో కూడినవాడు. బలంతో అతనికి సాటిరాగలవాడు లేడు. గదాధరులలో అగ్రగణ్యుడు. శత్రుసంహర్త. అటువంటి వానిని పందెంగా శత్రుసంహర్త. అటువంటి వానిని పందెంగా పెట్టరాదు. అయినా ఆ భీముని పందెంగా పెట్టి ఆడుతున్నాను. (24,25)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిర మభాషత ॥ 26
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ మాటవిని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి "నేనే గెలిచాను" అని యుధిష్ఠిరునితో అన్నాడు. (26)
శకుని రువాచ
బహువిత్తం పరాజైషీః భ్రాతౄంశ్చ సహయద్విపాన్ ।
ఆచక్ష్వ విత్తం కౌంతేయ యదితేఽస్త్వపరాజితమ్ ॥ 27
శకుని ఇలా అన్నాడు. కౌంతేయా! ఎంతో సొమ్మును కోలుపోయావు. సోదరులనూ, గుఱ్ఱాలనూ, ఏనుగులనూ కూడా ఓడిపోయావు. నీవు పోగొట్టుకోక మిగిలిన ధనమేదైనా ఉంటే చెప్పు. (27)
యుధిష్ఠిర ఉవాచ
అహం విశిష్టః సర్వేషాం భ్రాతౄణాం దయితస్తథా ।
కుర్యామహం జితః కర్మ స్వయమాత్మన్యుపప్లుతే ॥ 28
యుధిష్ఠిరుడిలా అన్నాడు. నేను సోదరులందరిలో విశిష్టుడను. అందరికీ ఇష్టమయిన వాడిని. నన్ను పందెంగా పెడుతున్నాను. ఓడిపోతే దాసుని వలె సర్వకార్యాలను చేస్తాను. (28)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 29
వైశంపాయనుడిలా అన్నాడు - ఆ మాట విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి "నేనే గెలిచాను" అని యుధిష్ఠిరునితో అన్నాడు. (29)
శకుని ఉవాచ
ఏతత్ పాపిష్ఠమకరోద్ యదాత్మానమహారయః ।
శిష్టే సతి ధనే రాజన్ పాప ఆత్మపరాజయః ॥ 30
శకుని ఇలా అన్నాడు - రాజా! నీవు నిన్నే పందెంగా పెట్టి ఓడిపోయి పెద్దపాపం చేశావు. నీ దగ్గర ఇంకా డబ్బున్నప్పటికీ నిన్నే నీవు ఓడిపోవటం పాపం. (30)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా మతాక్షస్తాన్ గ్లహే సర్వానవస్థితాన్ ।
పరాజయం లోకవీరాన్ ఉక్త్వా రాజ్ఞాం పృథక్ పృథక్ ॥ 31
వైశంపాయనుడిలా అన్నాడు. ద్యూతవిద్యలో నిపుణుడయిన శకుని పందెం విషయంలో ఆ విధంగా యుధిష్ఠిరునితో పలికి లోకవీరులు సభాసదులు అయిన రాజులతో పాండవుల పరాజయాన్ని విడివిడిగా చెప్పాడు. (31)
శకుని రువాచ
అస్తి తే వై ప్రియా రాజన్ గ్లహ ఏకోఽపరాజితః ।
పణస్వ కృష్ణాం పాంచాలీం తయాఽఽత్మానం పునర్జయ ॥ 32
శకుని ఇలా అన్నాడు - రాజా! ఇంతవరకు నీవు పోగొట్టుకొనని పందెపు వస్తువు ఒకటున్నది. నీ ప్రియసతి ద్రౌపదియే అది. ఆ ద్రౌపదిని పందెంగా పెట్టి నిన్ను మళ్లీ గెలుచుకో. (32)
యుధిష్ఠిర ఉవాచ
నైవ హ్రస్వా న మహతీ న కృష్ణా నాతిరోహిణీ ।
నీలకుంచిత కేశీ చ తయా దీవ్యామ్యహం త్వయా ॥ 33
యుధిష్ఠిరుడిలా అన్నాడు - ఈ ద్రౌపది మరీ పొట్టికాదు మరీ పొడుగూ కాదు. మరీ నల్లనిదీ కాదు. మరీ తెల్లనిదీ కాదు. ఉంగరాలు తిరిగిన నీలవేణి. ఈమెను పందెంగా పెట్టి నీతో ఆడుతున్నాను. (33)
శారదోత్పలపత్రాక్ష్యా శారదోత్పలగంధయా ।
శారదోత్పలసేవిన్యా రూపేణ శ్రీసమానయా ॥ 34
ఈమె శరత్కాలపు కలువరేకుల వంటి కళ్ళుగలది. శరత్కాలపు కలువల పరిమళం వంటి పరిమళం గలది. శరత్కాలపు కలువలను కలువలను సేవించెడిది. రూపంలో లక్మిని పోలినది. (34)
తథైవ స్యాదానృశంస్యాత్ తథా స్యాద్ రూపసంపదా ।
తథా స్యాచ్ఛీలసంపత్త్యా యామిచ్ఛేత్ పురుషః స్త్రియమ్ ॥ 35
పురుషులలో స్త్రీలలో ఆసించే దయాగుణం, రూపసంపత్తి, శీలసంపత్తి గలది ఈ ద్రౌపది. (35)
సర్వైగుణైర్హి సంపన్నామ్ అనుకూలాం ప్రియంవదామ్ ।
యాదృశీం ధర్మకామార్ధ సిద్ధిమిచ్ఛేన్నరః స్త్రియమ్ ॥ 36
ఈమె సర్వగుణసంపన్న. అనుకూలవతి. ప్రియభాషిణి. ధర్మార్థకామసిద్ధికై మగవాడు భార్యలో కోరుకొనే గుణాలు కలది. (36)
చరమం సంవిశతి యా ప్రథమం ప్రతిబుధ్యతే ।
ఆ గోపాలావిపాలేభ్యః సర్వం వేద కృతాకృతమ్ ॥ 37
ఈమె ఆవులను, గొఱ్ఱెలను మేపే వారందరూ నిదురించిన తరువాత నిదురించేది. అందరికన్న ముందుగా నిదుర లేచేది. అయిన పనులు, కావలసిన పనులు అన్నీ తెలిసినది. (37)
ఆబాతి పద్మవద్ వక్ర్తం సస్వేదం మల్లికేవ చ ।
వేదిమధ్యా దీర్ఘకేశీ తామ్రాస్యా నాతిలోమశా ॥ 38
చెమర్చిన ఈమె ముఖం పద్మంలా ప్రకాశిస్తుంది. మల్లెపూవులా పరిమళిస్తుంది. ఈమె సన్నని నడుము, పొడవైన కురులు, అరుణ వర్ణముఖం గలది. శరీరంపై మిక్కిలిగా రోమాలు లేనిది. (38)
తయైవం విధయా రాజన్ పాంచాల్యాహం సుమధ్యయా ।
గ్లహం దీవ్యామి చార్వంగ్యా ద్రౌపద్యా హంత సౌబల ॥ 39
ఆ విధంగా సర్వాంగసుందరియై, సుమధ్యమ అయిన పాంచాలరాజకుమారి ద్రౌపదిని పందెంగా పెట్టి నాకిది కద్టమయినా - ఆడుతున్నాను. (39)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తే తు వచనే ధర్మరాజేన ధీమతా ।
ధిగ్ధిగిత్యేవ వృద్ధానాం సభ్యానాం నిఃసృతా గిరః ॥ 40
వైశంపాయనుడిలా అన్నాడు. ధీమంతుడైన ధర్మరాజు ఆరీతిగా పలుకగానే అక్కడున్న వృద్ధసభ్యుల నుండి "అయ్యో అయ్యో" అన్న మాటలు వెలువవడ్డాయి. (40)
చుక్షుభే సా సభా రాజన్ రాజ్ఞాం సంజజ్ఞిరే శుచః ।
భీష్మద్రోణకృపాదీనాం స్వేదాశ్చ సమజాయత ॥ 41
రాజా! అప్పుడు ఆ సభ క్షోభకు గురి అయింది. రాజులంతా బాధపడ్డారు. భీష్మద్రోణకృపాదులకు చెమట కూడా పట్టింది. (41)
శిరో గృహీత్వా విదురః గతసత్త్వ ఇవాభవత్ ।
ఆస్తే ధ్యాయన్నధోవక్త్రః నిఃశ్వసన్నివ పన్నగః ॥ 42
విదురుడు శక్తిని కోల్పోయి తలపట్టుకొని కూర్చున్నాడు. బుసకొట్టే పామువలె విశ్వసిస్తూ తలవాల్చి ఆలోచనామగ్నుడయ్యాడు. (42)
(బాహ్లీకః సోమదత్తశ్చ ప్రాతిపేయః ససంజయః ।
ద్రౌణిః భూరిశ్రవాశ్చైవ యుయుత్సుర్ధృతరాష్ట్రజః ॥
హస్తౌ పింషన్నధోవక్ర్తాః నిఃశ్వసంత ఇవోరగాః ॥)
బాహ్లీకుడు, ప్రతీపుని కుమారుడు సోమదత్తుడు, సంజయుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, ధృతరాష్ట్రపుత్రుడు యుయుత్సుడు బుసకొట్టే సర్పాల వలె తలవాల్చి చేతులు నలుపుకొన్నారు.
ధృతరాష్ట్రస్తు తం హృష్టః పర్యపృచ్ఛత్ పునః పునః ।
కిం జితం కిం జితమితి హ్యాకారం నాభ్యరక్షత ॥ 43
ధృతరాష్ట్రుడు ఆనందంతో గెలిచామా? గెలిచామా? అని పదేపదే అడిగాడు. తన ఆకారాన్ని, ముఖకవళికలను దాచుకొనలేకపోయాడు. (43)
జహర్ష కర్ణోఽతిభృశం సహ దుఃశాసనాదిభిః ।
ఇతరేషాం తు సభ్యానాం నేత్రేభ్యః ప్రాపతజ్జలమ్ ॥ 44
దుశ్శాసనాదులతో కలిసి కర్ణుడు ఆనందించాడు. ఇతరసభ్యుల కళ్ళ నుండి నీళ్ళురాలాయి. (44)
సౌబలస్త్వభిధాయైవం జితకాశీ మదోత్కటః ।
జితమిత్యేవ తానక్షాన్ పునరేవాన్వపద్యత ॥ 45
శకుని ఆ రీతిగా పలికి 'ఇది కూడ గెలిచినట్టే' అంటూ మరలా పాచికలు చేతబట్టాడు. ఆ సమయంలో విజయోల్లాసంతో మదించి ఉన్నాడు. (45)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ద్రౌపదీ పరాజయే పంచషష్టితమోఽధ్యాయః ॥ 65 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున ద్రౌపదీ పరాజయమను అరువది అయిదవ అధ్యాయము. (65)
(దాక్షిణాత్య అధికపాఠము 1 1/2 శ్లోకములు కలిపి మొత్తం 46 1/2 శ్లోకములు)