50. ఏబదియవ అధ్యాయము

దుర్యోధనుడు ధృతరాష్ట్రునకు తన మనోవేదనను తెలుపుట.

జనమేజయ ఉవాచ
జనమేజయ ఉవాచ
కథమ్ సమభవద్ ద్యూతం భ్రాతౄణాం తన్మమాత్యయమ్ ।
యత్ర తద్ వ్యసనం ప్రాప్తం పాండవైర్మే పితామహైః ॥ 1
జనమేజయుడు అడుగుతున్నాడు - మా తాతగార్లయిన పాండవులకు మహాకష్టాన్ని కలిగించిన, ఆ మహావినాశకారకమైన ద్యూతం అన్నదమ్ముల మధ్య ఏ ప్రకారంగా జరిగింది? (1)
కే చ తత్ర సభాస్తారాః రాజానో బ్రహ్మవిత్తమ ।
కే చైనమన్వమోదంత కే చైనం ప్రత్యషేదయన్ ॥ 2
బ్రాహ్మణోత్తమా! అక్కడ ఏయే రాజులు సభాసదులుగా ఉన్నారు? ఎవరు జూదాన్ని ఆమోదించారు? ఎవరు వద్దన్నారు? (2)
విస్తరేణైతదిచ్ఛామి కథ్యమానం త్వయా ద్విజ ।
మూలం హ్యేతద్ వినాశస్య పృథివ్యా ద్విజసత్తమ ॥ 3
ద్విజోత్తమా! ఇది భూమండల వినాశనానికి మూలం. నీవు చెపితే దీనిని సవిస్తరంగా వినాలనుకొంటున్నాను. (3)
సౌతిరువాచ
ఏవముక్తస్తతో రాజ్ఞా వ్యాసశిష్యః ప్రతాపవాన్ ।
ఆచచక్షేఽథ యద్ వృత్తం తత్ సర్వం వేదతత్త్వవిత్ ॥ 4
సౌతి చెప్పసాగాడు - రాజు ఇలా అడగగా, వేదతత్త్వజ్ఞుడై, ప్రతాపవంతుడైన వ్యాసుని శిష్యుడు ఆ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పసాగాడు. (4)
వైశంపాయన ఉవాచ
శృణు మే విస్తరేణేమాం కథాం భారతసత్తమ ।
భూయ ఏవ మహారాజ యది తే శ్రవణే మతిః ॥ 5
వైశంపాయనుడు చెపుతున్నాడు - భారతశ్రేష్ఠుడా! మహారాజా! నీకు వినాలని కుతూహలం ఉంటే నేను తిరిగి విస్తరంగా ఈ కథను చెపుతాను విను. (5)
విదురస్య మతిం జ్ఞాత్వా ధృతరాష్ట్రోఽంబికాసుతః ।
దుర్యోధనమిదం వాక్యమ్ ఉవాచ విజనే పునః ॥ 6
విదురుని ఆలోచనను తెలిసికొని అంబికాసుతుడైన ధృతరాష్ట్రుడు ఏకాంతంగా దుర్యోధనునితో తిరిగి ఇలా అన్నాడు. (6)
అలం ద్యూతేన గాంధారే విదురో న ప్రశంసతి ।
న హ్యసౌ సుమహాబుద్ధిః అహితం నో వదిష్యతి ॥ 7
గాంధారీనందనా! జూదం వద్దు. విదురుడు దీనిని ఇష్టపడడం లేదు. మహాబుద్ధిమంతుడైన అతడు మనకు అహితాన్ని చెప్పడు. (7)
హితం హి పరమం మన్యే విదురో యత్ ప్రభాషతే ।
క్రియతాం పుత్ర తత్ సర్వమ్ ఏతన్మన్యే హితం తవ ॥ 8
విదురుడు చెప్పినదే పరమహితమని నాకు అనిపిస్తోంది. పుత్రా! అలాగే చేయి. ఇదంతా నీమేలుకే అనిపిస్తోంది. (8)
దేవర్షిర్వాసవగురుః దేవరాజాయ ధీమతే ।
యత్ ప్రాహ శాస్త్రం భగవాన్ బృహస్పతిరుదారధీః ।
తద్ వేద విదురః సర్వం సరహస్యం మహాకవిః ॥ 9
స్థితస్తు వచనే తస్య సదాహమపి పుత్రక ।
విదురో వాపి మేధావీ కురూణాం ప్రవరో మతః ॥ 10
ఉద్ధవో వా మహాబుధ్ధిః వృష్ణీనామర్చితో నృప ।
తదలం పుత్ర ద్యూతేన ద్యూతే భేదో హి దృశ్యతే ॥ 11
దేవర్షి, ఇంద్రగురువు, పరమబుద్ధిమంతుడు అయిన బృహస్పతి ధీమంతుడయిన ఇంద్రునికి చెప్పిన నీతిశాస్త్రమంతా రహస్యాలతో సహితంగా మహాజ్ఞాని అయిన విదురునికి తెలుసు. పుత్రకా! నేను కూడా ఎప్పుడూ అతని మాటనే పాటిస్తాను. కురుకులంలో విదురుడు మేధావి, సర్వశ్రేష్ఠుడు అంటారు. వృష్ణివంశీయులు ఉద్ధవుని మహాబుద్ధిమంతునిగా పూజిస్తారు. కాబట్టి నాయనా! జూదం వద్దు. జూదంలో కలహమే కనిపిస్తోంది. (9-11)
భేదే వినాశో రాజ్యస్య తత్ పుత్ర పరివర్జయ ।
పిత్రా మాత్రా చ పుత్రస్య యద్ వై కార్యం పరం స్మృతమ్ ॥ 12
కలహం వలన రాజ్యం నశిస్తుంది. కాబట్టి నాయనా! జూదం విడిచిపెట్టు. పుత్రుడు ఉత్కృష్టకార్యం చేయాలనే తల్లిదండ్రులు కోరుకొంటారు. (12)
ప్రాప్తస్త్వమసి తన్నామ పితృపతామహం పదమ్ ।
అధీతవాన్ కృతీ శాస్త్రే లాలితః సతతం గృహే ॥ 13
నీవు కూడా నీ తాతతండ్రుల స్థానాన్ని పొందావుకదా! వేదాధ్యయనం చేశావు. శాస్త్రాలలో పండితుడవైనావు. ఇంటిలో ఎల్లప్పుడూ అందరిచేత ముద్దు చేయబడుతున్నావు. (13)
భ్రాతృజ్యేష్ఠః స్థితో రాజ్యే విందసే కిం న శోభనమ్ ।
పృథగ్జనైరలభ్యం యద్ భోజనాచ్ఛాదనం పరమ్ ॥ 14
తత్ ప్రాప్తోఽసి మహాబాహో కస్మాచ్ఛోచసి పుత్రక ।
స్ఫీతం రాష్ట్రం మహాబాహో పితృపైతామహం మహత్ ॥ 15
అన్నదమ్ములలో పెద్దవాడివి. రాజ్యాన్ని పొందావు. ఏ శుభాలు పొందలేదు? ఇతర జనులకు అలభ్యమైన ఉత్కృష్టమైన భోజనవస్త్రాలను పొందుతున్నావు. మహాబాహూ! నాయనా! ఇక ఎందుకు దుఃఖిస్తున్నావు? తాతతండ్రుల నుండి వచ్చిన గొప్ప రాజ్యం సమృద్ధమై ఉంది. (14,15)
నిత్యమాజ్ఞాపయన్ భాసి దివి దేవేశ్వరో యథా ।
తస్య తే విదితప్రజ్ఞ శోకమూలమిదం కథమ్ ।
సముత్థితం దుఃఖకరం యన్మే శంసితుమర్హసి ॥ 16
నిత్యమూ శాసిస్తూ స్వర్గంలో ఇంద్రుని వలె వెలుగొందుతున్నావు. నీ ప్రజ్ఞ విదితం. అటువంటి నీకు శోకం ఎలా కలిగింది? మూలం ఏమిటి? దుఃఖదాయకమైన ఈ స్థితి నాకు చెప్పు. (16)
దుర్యోధన ఉవాచ
అశ్నామ్యాచ్ఛాదయామితి ప్రపశ్యన్ పాపపూరుషః ।
నామర్షం కురుతే యస్తు పురుషః సోఽధమః స్మృతః ॥ 17
దుర్యోధనుడు చెపుతున్నాడు - తింటున్నాను, కట్టుకొంటున్నాను అని మాత్రమే చూసుకొనే పాపాత్ముడు శత్రువుల పట్ల అసహనం చూపకపోతే అతనిని అధముడని అంటారు. (17)
న మాం ప్రీణాతి రాజేంద్ర లక్ష్మీః సాధారణీ విభో ।
జ్వలితామేవ కౌంతేయే శ్రియం దృష్ట్వా చ వివ్యథే ॥ 18
రాజేంద్రా! ఈ సాధారణ సంపద నాకు ఆనందం కలిగించడం లేదు. యుధిష్ఠిరుని వద్ద ఉన్న ఉజ్జ్వలమైన సంపదను చూస్తే నాకు వ్యథ కలుగుతోంది. (18)
సర్వాం చ పృథివీం చైవ యుధిష్ఠిరవశానుగామ్ ।
స్థిరోఽస్మి యోఽహం జీవామి దుఃఖాదేతద్ బ్రవీమి తే ॥ 19
ఈ సమస్త భూమండలం యుధిష్ఠిరునికి వశమైపోయింది. రాయిలా ఇంకా నేను బతికి ఉన్నాను. ఇది దుఃఖంతో అంటున్నాను. (19)
ఆవర్జితా ఇవాభాంతి నీపాశ్చిత్రకకౌకురాః ।
కారస్కారా లోహజంఘా యుధిష్ఠిరనివేశనే ॥ 20
నీప, చిత్రక, కుకుర రాజులు, కారస్కారులు, లోహజంఘులు అనే క్షత్రియులు యుధిష్ఠిరుని ఇంటిలో సేవకుల వలె కనిపిస్తున్నారు. (20)
హిమవత్సాగరానూపాః సర్వే రత్నాకరాస్తథా ।
అంత్యాః సర్వే పర్యుదస్తాః యుధిష్ఠిరనివేశనే ॥ 21
హిమవంతం మీది పార్వతీయులు, సాగరద్వీపవాసులు, రత్నఖనుల వాసులు - ఈమ్లేచ్ఛులందరూ యుధిష్ఠిరుని నివాసంలోనికి నిషేధింపబడినారు. (21)
జ్యేష్ఠోఽయమితి మాం మత్వా శ్రేష్ఠశ్చేతి విశాంపతే ।
యుధిష్ఠిరేణ సత్కృత్య యుక్తో రత్నపరిగ్రహే ॥ 22
రాజా! నన్ను జ్యేష్ఠుడని, శ్రేష్ఠుడని తలచి సత్కరించి యుధిష్ఠిరుడు రత్నాలను స్వికరించడానికి నియోగించాడు. (22)
ఉపస్థితానాం రత్నానాం శ్రేష్ఠానామర్ఘహారిణామ్ ।
నాదృశ్యత పరః పారః నాపరస్తత్ర భారత ॥ 23
భారతా! రాజులు కానుకలు తెచ్చి ఈయగా పోగుపడిన శ్రేష్ఠమైన అనర్ఘమైన రత్నాలకు అంతూ-దరీ కనపడలేదు. (23)
న మే హస్తః సమభవద్ వసు తత్ ప్రతిగృహ్ణతః ।
అతిష్ఠంత మయి శ్రాంతే గృహ్య దూరాహృతం వసు ॥ 24
ఆ బంగారాన్ని (రత్నరాశులను) స్వీకరిస్తున్న నాచేయి తిమ్మిరెక్కి అలసిపోయింది. నేను అలా అలసిపోయినపుడు రాజులు రత్నరాశులు పట్టుకొని చాలా దూరం నిలబడిపోయారు. (24)
కృతాం బిందుసరోరత్నైః మయేన స్ఫాటికచ్ఛదామ్ ।
అపశ్యం నళినీం పూర్ణామ్ ఉదకస్యేవ భారత ॥ 25
వస్త్రముత్కర్షతి మయి ప్రాహసత్ స వృకోదరః ।
శత్రోరృద్ధివిశేషణ విమూఢం రత్నవర్జితమ్ ॥ 26
భారతా! బిందుసరోవరంలోని రత్నాలను తెచ్చి మయుడు స్ఫటికమణిశిలలతో ఆచ్ఛాదించి ఒక పుష్కరిణిని నిర్మించాడు. అది నాకు నీటిలో నిండి ఉన్నట్లుగ కనిపించింది. అందుకని వస్త్రం పైకి పట్టుకొన్న నన్ను చూచి భీమసేనుడు విరగబడి నవ్వాడు. రత్నాలు లేకుండానే శత్రువుల విశిష్టసమృద్ధికి నాకు మూర్ఛవచ్చినట్లయింది. (25,26)
తత్ర స్మ యది శక్తః స్యాం పాతయేఽహం వృకోదరమ్ ।
యది కుర్యాం సమారంభం భీమం హంతుం నరాధిప ॥ 27
శిశుపాల ఇవాస్మాకం గతిః స్యాన్నాత్ర సంశయః ।
సపత్నేనావహాసో మే స మాం దహతి భారత ॥ 28
నేను సమర్థుడినే అయిఉంటే అక్కడే భీమసేనుని చంపిపారవేసేవాడిని. కానీ నరాధిపా! భీముని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటే శిశుపాలుని గతే నాకూ పట్టేది. అందులో సందేహం ఏమీ లేదు. నన్ను శత్రువు పరిహసించాడు. అది నన్ను దహించేస్తోంది. (27,28)
పునశ్చ తాదృశీమేవ వాపీం జలజశాలినీమ్ ।
మత్వా శిలాసమాం తోయే పతితోఽస్మి నరాధిప ॥ 29
రాజా! తిరిగి మళ్లీ అటువంటిదే పద్మాలలో నిండిన ఒక కొలనును చూసి, స్ఫటికశిలలతో చదును చేయబడినది అనుకొని నీటిలో జారిపడ్డాను. (29)
తత్ర మాం ప్రాహసత్ కృష్ణః పార్థేన సహ సుస్వరమ్ ।
ద్రౌపదీ చ సహస్త్రీభిః వ్యథయంతి మనో మమ ॥ 30
అక్కడ నన్ను చూచి అర్జునునితో కలిసి కృష్ణుడు బిగ్గరగా నవ్వాడు. ద్రౌపది కూడా వెంట ఉన్న స్త్రీలతో కలిసి నవ్వి నామనసును వ్యథ పెట్టింది. (30)
క్లిన్నవస్త్రస్య తు జలే కింకరా రాజనోదితాః ।
దదుర్వాసాంసి మేఽన్యాని తచ్చ దుఃఖమ్ పరం మమ ॥ 31
నీటిలో తడిసిపోయిన వస్త్రాలతో ఉన్న నాకు రాజుగారి ఆజ్ఞపై సేవకులు వేరేవస్త్రాలను తెచ్చి ఇచ్చారు. అది ఇంకా నాకు మిక్కిలి దుఃఖాన్ని కలిగించింది. (31)
ప్రలంభం చ శృణుష్వాన్యద్ వదతో మే నరాధిప ।
అద్వారేణ వినిర్గచ్ఛన్ ద్వారసంస్థానరూపిణా ।
అభిహత్య శిలాం భూయో లలాటేనాస్మి విక్షతః ॥ 32
మహారాజా! నాకు జరిగిన ఇంకొక మోసం విను. ద్వారం లేనిచోట ద్వారం ఉన్నట్లుగా నిర్మించడంతో, అందులో నుండి బయటకు వెళ్తున్న నాకు రాయి కొట్టుకొని నుదుటిపై గట్టి దెబ్బ తగిలింది. (32)
తత్ర మాం యమజే దూరాత్ ఆలోక్యాభిహతం తదా ।
బాహుభిః పరిగృహ్ణీతాం శోచంతౌ సహితావుభౌ ॥ 33
అప్పుడక్కడ నకులసహదేవులు దూరం నుండి దెబ్బతగిలిన నన్ను చూశారు. వారు వెంటనే వచ్చి చేతులతో నన్ను పట్టుకొని ఇద్దరూ కలిసి నాకోసం విచారించారు. (33)
ఉవాచ సహదేవస్తు తత్ర మాం విస్మయన్నివ ।
ఇదం ద్వారమితో గచ్ఛ రాజన్నితి పునః పునః ॥ 34
సహదేవుడయితే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ "రాజా! ఇది ద్వారం ఇటు వెళ్లు" అని పదేపదే చెప్పాడు. (34)
భీమసేనేన తత్రోక్తః ధృతరాష్ట్రాత్మజేతి చ ।
సంబోధ్య ప్రహసిత్వా చ ఇతో ద్వారమ్ నరాధిప ॥ 35
మహారాజా! అక్కడ భీమసేనుడు నన్ను "ధృతరాష్ట్రపుత్రా! అని సంబోధించి నవ్వి, "ఇటు ద్వారం" అని చెప్పాడు." (35)
నామధేయాని రత్నానాం పురస్తాన్న శ్రుతాని మే ।
యాని దృష్టాని మే తస్యాం మనస్తపతి తచ్చ మే ॥ 36
అక్కడ చూచిన రత్నాల పేర్లు కూడా అంతకు ముందు నేను విని ఉండలేదు. అది కూడా నా మనసును తపింపచేస్తోంది. (36)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దుర్యోధనసంతాపే పంచాశత్తమోఽధ్యాయః ॥ 50 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున దుర్యోధన సంతాపమను ఏబదియవ అధ్యాయము. (50)