49. నలువది తొమ్మిదవ అధ్యాయము
దుర్యోధనుని చింతను విని ధృతరాష్ట్రుడు విదురుని ఇంద్రప్రస్థమునకు పంపదలచుట.
వైశంపాయన ఉవాచ
అనుభూయ తు రాజ్ఞస్తం రాజసూయం మహాక్రతుమ్ ।
యుధిష్ఠిరస్య నృపతేః గాంధారీపుత్రసంయుతః ॥ 1
ప్రియకృన్మతమాజ్ఞాయ పూర్వం దుర్యోధనస్య తత్ ।
ప్రజ్ఞాచక్షుషమాసీనమ్ శకునిః సౌబలస్తదా ॥ 2
దుర్యోధనవచః శ్రుత్వా ధృతరాష్ట్రం జనాధిపమ్ ।
ఉపగమ్య మహాప్రాజ్ఞం శకునిర్వాక్యమబ్రవీత్ ॥ 3
వైశంపాయనుడు చెపుతున్నాడు - గాంధారీపుత్రుడయిన దుర్యోధనునితో కలిసి సుబలసుతుడైన శకుని యుధిష్ఠిర మహారాజు యొక్క రాజసూయ మహాయజ్ఞాన్ని చూచి వచ్చాడు. దుర్యోధనునికి ప్రీతికరమైన అభిప్రాయాన్ని తెలుసుకొన్నాడు. దుర్యోధనుని మాటలను విని, మహాప్రాజ్ఞుడైన ధృతరాష్ట్రుని సమీపించి శకుని ఇలా అన్నాడు. (1-3)
శకుని రువాచ
దుర్యోధనో మహారాజ వివర్ణో హరిణః కృశః ।
దీనశ్చింతాపరశ్చైవ తం విద్ధి మనుజాధిప ॥ 4
శకుని చెపుతున్నాడు - మహారాజా! దుర్యోధనుడు కాంతి తరిగిపోయి ఉన్నాడు. పాలిపోయాడు. చిక్కిపోయాడు. దీనుడై (అహంకారం చచ్చి) చింతాపరవశుడై ఉన్నాడు. అతని మనసులో ఏముందో తెలుసుకో ఱాజా! (4)
న వై పరీక్షసే సమ్యక్ అసహ్యం శత్రుసంభవమ్ ।
జ్యేష్ఠపుత్రస్య హృచ్ఛోకం కిమర్థం నావబుధ్యసే ॥ 5
శత్రువుల వలన కలిగిన సహింపరాని కష్టాన్ని ఎందుకు పరీక్షించి తెలుసుకోవు? నీ పెద్దకొడుకు మనసులోని శోకాన్ని ఎందుకు గుర్తించవు? (5)
ధృతరాష్ట్ర ఉవాచ
దుర్యోధన కుతో మూలం భృశమార్తోఽసి పుత్రక ।
శ్రోతవ్యశ్చేన్మయా సోఽర్థః బ్రూహి మే కురునందన ॥ 6
ధృతరాష్ట్రుడు అంటున్నాడు - నాయనా! దుర్యోధనా! మిక్కిలి దుఃఖంతో ఉన్నావు అని విన్నాను. కారణమేమిటి? కురునందనా! అది నాకు వినదగినది అయితే చెప్పు. (6)
అయం త్వాం శకునిః ప్రాహ వివర్ణం హరిణా కృశమ్ ।
చింతయంశ్చ న పశ్యామి శోకస్య తవ సంభవమ్ ॥ 7
నీవు కాంతిహీనుడవని, పాలిపోయావని, చిక్కిపోయావని, సతతమూ చింతిస్తూ ఉంటావని ఈ శకుని చెప్పాడు. నీకు శోకం కలుగడానికి కారణం కనిపించడమ్ లేదు. (7)
ఐశ్వర్యమ్ హి మహత్ పుత్ర త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ ।
భ్రాతరః సుహృదశ్చైవ నాచరంతి తవాప్రియమ్ ॥ 8
నాయనా! గొప్ప సంపద అంతా నీ అధీనంలోనే ఉంది. నీ తమ్ముళ్లు, స్నేహితులు కూడా నీకు అప్రియం చేయడం లేదు. (8)
ఆచ్ఛాదయసి ప్రావారాన్ అశ్నాసి విశదౌదనమ్ ।
ఆజానేయా వహంత్యశ్వాః కేనాసి హరిణః కృశః ॥ 9
అమూల్యమైన వస్త్రాలను ధరిస్తున్నావు. శుచి అయిన అన్నాన్ని తింటున్నావు. ఉత్తమజాతి గుఱ్ఱాలను ఎక్కి తిరుగుతున్నావు. ఇక పాలిపోవడానికి, చిక్కిపోవడానికి కారణమేమిటి? (9)
శయనాని మహార్హాణి యోషితశ్చ మనోరమాః ।
గుణవంతి చ వేశ్మాని విహారాశ్చ యథాసుఖమ్ ॥ 10
దేవానామివ తే సర్వం వాచి బద్ధం న సంశయః ।
స దీన ఇవ దుర్ధర్ష కస్మాచ్ఛోచసి పుత్రక ॥ 11
అమూల్యమైన శయ్యలు, మనసును రంజింపచేసే యువతులు, అన్ని ఋతువులలోను అనుకూలంగా ఉండే భవనాలు, కోరినట్లుగా సుఖాన్ని కలిగిమ్చే క్రీడాస్థానాలు; దేవతలకు వలె అన్నీ మాటమాత్రంగానే ఏర్పాటవుతాయి. సందేహం లేదు. పుత్రకా! అట్టి దుర్ధర్షుడవైన నీవు ఎందుకు శోకిస్తున్నావు? (10,11)
(ఉపస్థితః సర్వకామైః త్రిదివే వాసవో యథా ।
వివిధైరన్నపానైశ్చ ప్రవరైః కిం ను శోచసి ॥
స్వర్గంలో ఉన్న ఇంద్రుని వలె అన్నికోరికలు అనుభవిస్తూ, శ్రేష్ఠమైన అన్నపానీయాలు పొందుతూ ఉన్న నీవు ఎందుకు శోకిస్తున్నావు?
నిరుక్తం నిగమం ఛందః సషడంగార్థశాస్త్రవాన్ ।
అధీతః కృతవిద్యస్త్వమ్ అష్టవ్యాకరణైః కృపాత్ ॥
నీవు కృపాచార్యునివద్ద నిరుక్తం, నిగమం, ఛందస్సు, షడంగసహితంగా అర్థశాస్త్రాన్ని, అష్టవ్యాకరణాలను చదువుకొని పండితుడవయ్యావు.
హలాయుధాత్ కృపాద్ ద్రోణాత్ అస్త్రవిద్యామధీతవాన్ ।
ప్రభుస్త్వం భుంజసే పుత్ర సంస్తుతః సూతమాగధైః ॥
తస్య తే విదితప్రజ్ఞ శోకమూలమిదం కథమ్ ।
లోకేఽస్మిన్ జ్యేష్ఠభాగే త్వం తన్మమాచక్ష్వ పుత్రక ॥
నాయనా! బలరాముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు - వీరి వద్ద నీవు అస్త్రవిద్యను నేర్చుకొన్నావు. ప్రభువుగా అన్ని అనుభవిస్తున్నావు. సూత మాగధులు కొనియాడుతున్నారు. చక్కని ప్రజ్ఞ కలవాడవు. ఈ లోకంలో జ్యేష్ఠుడవై భోగాలు పొందుతున్నావు. అటువంటి నీకు ఈ శోకం కలుగడానికి మూలమేమిటి? అది నాకు చెప్పు తండ్రీ!
వైశంపాయన ఉవాచ
తస్య తద్ వచనం శ్రుత్వా మందః క్రోధవశానుగః ।
పితరం ప్రత్యువాచేదం స్వమితిం సంప్రకాశయన్ ॥)
వైశంపాయనుడు చెపుతున్నాడు - ధృతరాష్ట్రుని మాటలను విని మూఢుడై క్రోధానికి చిక్కి దుర్యోధనుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తండ్రికి ఇలా బదులిచ్చాడు.
దుర్యోధన ఉవాచ
అశ్నామ్యాచ్ఛాదయే చాహం యథా కుపురుషస్తథా ।
అమర్షం ధారయే చోగ్రం నినీషుః కాలపర్యయమ్ ॥ 12
నేను తింటున్నాను, కట్టుకొంటున్నాను కూడా. కాని పిరికివాళ్లవలె చేస్తున్నాను. కాలంలో మార్పును కోరుకొంటూ, తీవ్రమైన ఈర్ష్యను మనసులో దాచుకొంటున్నాను. (12)
అమర్షణః స్వాః ప్రకృతీః అభిభూయ పరం స్థితః ।
క్లేశాన్ ముముక్షుః పరజాన్ స వై పురుష ఉచ్యతే ॥ 13
శత్రువులను సహించలేనివాడు, వారిని పరాభవించి, వారి వలన కలిగిన కష్టాల నుండి ప్రజలను విడిపించగలవాడై ఉండాలి. అతనినే పౌరుషం కలవానిగా చెప్పుకొంటారు. (13)
సంతోషో వై శ్రియం హంతి హ్యభిమానం చ భారత ।
అనుక్రోశభయే చోభే యైర్వృతో నాశ్నుతే మహత్ ॥ 14
భారతా! సంతుష్టి సంపదను, గర్వాన్నీ హరిస్తుంది. దయ, భయం రెండూ కూడా అటువంటివే. ఈ గుణాలు కలిగినవాడు ఉన్నతపదవిని పొందలేడు. (14)
న మాం ప్రీణాతి మద్భుక్తం శ్రియం దృష్ట్వా యుధిష్ఠిరే ।
అతి జ్వలంతీం కౌంతేయే వివర్ణకరణీం మమ ॥ 15
కుంతీనందనుడైన యుధిష్ఠిరుని యొక్క అతి ఉజ్జ్వలమైన సంపదను చూసిన తర్వాత నా భోగాలు నాకు రుచించడం లేదు. అది నన్ను వివర్ణుడిని చేస్తోంది. (15)
సపత్నానృధ్యతోఽఽత్మానం హీయమానం నిశమ్య చ ।
అదృశ్యామపి కౌంతేయ శ్రియం పశ్యన్నివోద్యతామ్ ॥ 16
తస్మాదహం వివర్ణశ్చ దీనశ్చ హరిణః కృశః ।
శత్రువుల వృద్ధిని, తన క్షీణత్వాన్ని తెలుసుకొని, కనబడకపోయినా ఆ కౌంతేయుల సంపదను వృధ్ధిపొందుతున్న దానిగా చూస్తూ (మనసులో ఊహించుకొంటూ) ఉండడం వలన నేను రంగుమారి, దీనుడినై, పాలిపోయి, చిక్కిపోయాను. (16 1/2)
అష్టాశీతిసహస్రాణి స్నాతకా గృహమేధినః ॥ 17
త్రింశద్దాసీక ఏకైక యాన్ బిభర్తి యుధిష్ఠిరః ।
యుధిష్ఠిరుడు తన గృహంలో నివసించే ఎనభై ఎనిమిది వేలమంది స్నాతకులను రక్షించి పోషిస్తున్నాడు. వారికి ఒక్కొక్కరికి ముప్పదిమంది చొప్పున దాసీలు ఉన్నారు. (17 1/2)
దశాన్యాని సహస్రాణి నిత్యం తత్రాన్నముత్తమమ్ ।
భుంజతే రుక్మపాత్రీభిః యుధిష్ఠిరనివేశనే ॥ 18
వీరుకాక ఇతరులు పదివేలమంది యుధిష్ఠిరుని భవనంలో బంగారు పాత్రలలో నిత్యమూ ఉత్తమమైన భోజనం భుజిస్తూ ఉంటారు. (18)
కదళీమృగమోకాని కృష్ణశ్యామారుణాని చ ।
కాంబోజః ప్రాహిణోత్ తస్మై పరార్థ్యానపి కంబలాన్ ।
నలుపు, నీలం, ఎరుపు రంగులు కల కదళీమృగ చర్మాలను, అతివిలువైన కంబళ్లను కాంబోజరాజు అతనికి కానుకగా పంపాడు. (18 1/2)
గజయోషిద్గవాశ్వస్య శతకోఽథ సహస్రశః ॥ 19
త్రిశతం చోష్ట్రవామీనాం శతాని విచరంత్యుత ।
రాజన్యా బలిమాదాయ సమేతా హి నృపక్షయే ॥ 20
అతనికి కానుకలుగా సమర్పించబడిన వందలకొద్దీ ఆడ ఏనుగులు, వేలకొద్దీ గోవులు, గుఱ్ఱాలు, ముప్పైవేల ఒంటెలు, ముప్పైవేల ఆడ గుఱ్ఱాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. రాజలోకమంతా కానుకలు తీసుకొని రాజభవనంలో గుమికూడారు. (19,20)
పృథగ్విధాని రత్నాని పార్థివాః పృథివీపతే ।
ఆహరన్ క్రతుముఖ్యేఽస్మిన్ కుంతీపుత్రాయ భూరిశః ॥ 21
భూపతీ! ఈ మహాయజ్ఞంలో రాజులు యుధిష్ఠిరుని కోసం అనేక రకాల రత్నాలను మిక్కిలిగా తెచ్చారు. (21)
న క్వచిద్ధి మయా తాదృగ్ దృష్టపూర్వో న చ శ్రుతః ।
యాదృగ్ ధనాగమో యజ్ఞే పాండుపుత్రస్య ధీమతః ॥ 22
బుద్ధిమంతుడయిన ఆ యుధిష్ఠిరుని యజ్ఞానికి వచ్చినంత ధనం నేను ఇంతకుముందు చూడలేదు. వినను కూడా లేదు. (22)
అపర్యంత ధనౌఘం తం దృష్ట్వా శత్రోరహం నృప ।
శమం నైనాభిగచ్చామి చింతయానో విశాంపతే ॥ 23
మహారాజా! శత్రువు యొక్క అంతులేని ఆ ధనసమూహాన్ని చూచి నేను చింతాకులుడనై సుఖంగా ఉండలేకపోతున్నాను. (23)
బ్రాహ్మణా వాటధానాశ్చ గోమంతః శతసంఘశః ।
త్రిఖర్వం బలిమాదాయ ద్వారి తిష్ఠంతి వారితాః ॥ 24
బ్రాహ్మణులు, పొలాలు పండించే కాపులు, గోవులను రక్షిమ్చే వైశ్యులు వందల మంది గుంపులుగా మూడు ఖర్వాల సంఖ్య గల కానుకలను తీసుకొని వచ్చి, ఆపివేయడంతో ద్వారం వద్దే నిలిచిపోయారు. (24)
కమండలూనుపాదాయ జాతరూపమయాన్ శుభాన్ ।
ఏతద్ ధనమ్ సమాదాయ ప్రవేశం లేభిరే న చ ॥ 25
బంగారుమయమైన అందమైన కమండలాలను తెచ్చినవారికి, ఇంతింత ధనం తెచ్చినవారికి ప్రవేశమే దొరకలేదు. (25)
యథైవ మధు శక్రాయ ధారయంత్యమరస్త్రియః ।
తదస్మై కాంస్యమాహార్షీద్ వారుణం కలశోదధిః ॥ 26
దేవకాంతలు ఇంద్రుని కొరకు అమృతాన్ని నింపి ఉంచినట్లుగా సముద్రుడు వరుణుడిచ్చిన కంచుపాత్రలో యుధిష్ఠిరుని కొరకు మధువు నింపి కానుకగా పంపాడు. (26)
శైక్యం రుక్మసహస్రస్య బహురత్నవిభూషితమ్ ।
శంఖప్రవరమాదాయ వాసుదేవోఽభిషిక్తవాన్ ॥ 27
వేయి బంగారు నాణేలతో చేయబడి, అనేక రత్నాలతో అలంకరింపబడి, కావడిలో పెట్టి తెచ్చిన కలశంలోని నీటిని వాసుదేవుడు ఉత్తమమైన శంఖంతో అభిషేకించాడు. (27)
దృష్ట్వా చ మమ తత్ సర్వం జ్వరరూపమివాభవత్ ।
గృహీత్వా తత్ తు గచ్ఛంతి సముద్రౌ పూర్వదక్షిణౌ ॥ 28
తథైవ పశ్చిమం యాంతి గృహీత్వా భరతర్షభ ।
ఉత్తరం తు న గచ్ఛంతి వినా తాత పతత్రిణః ॥ 29
తత్ర గత్వార్జునో దండమ్ ఆజహారామితం ధనమ్ ।
అదంతా చూసి నాకు జ్వరం తగిలినట్టయింది. (బాధ వలన) ఆ కళాశాలను తీసుకొని పూర్వదక్షిణ సముద్రాలకు వెళ్తున్నారు. భరతశ్రేష్ఠా! అలాగే పశ్చిమ సముద్రానికి కూడా వెళ్లారు. పక్షులు, ఖేచరులు తప్ప ఉత్తరదిక్కుకు వెళ్లలేరు. అక్కడకు కూడా అర్జునుడు వెళ్లి అమితమైన ధనాన్ని కప్పంరూపంలో తెచ్చాడు. (28,29 1/2)
ఇదం చాద్భుతమత్రాసీత్ తన్మే నిగదతః శృణు ॥ 30
ఆ యుధిష్ఠిరుని రాజసూయయాగంలో ఒక అద్భుతం చెప్తాను. విను. (30)
పూర్ణే శతసహస్రే తు విప్రాణాం పరివిష్యతామ్ ।
స్థాపితా తత్ర సంజ్ఞాభూత్ శంఖో ధ్మాయతి నిత్యశః ॥ 31
లక్షమంది బ్రాహ్మణులు భుజించడం పూర్తికాగానే అక్కడ ఒక శంఖం మ్రోగేటట్లు ఏర్పాటు చేశారు. దాని ప్రకారం శంఖం ఎప్పుడూ మ్రోగుతూనే ఉంది. (31)
ముహుర్ముహుః ప్రణదతః తస్య శంఖస్య భారత ।
అనిశం శబ్దమశ్రౌషం తతో రోమాణి మేఽహృషన్ ॥ 32
భారతా! మాటిమాటికి మోగుతున్న ఆశంఖధ్వనిని నిరంతరంగా విన్న నాకు శరీరం గగుర్పొడిచింది. (32)
పార్థివైర్బహుభిః కీర్ణమ్ ఉపస్థానం దిదృక్షుభిః ।
అశోభత మహారాజ నక్షత్రైర్ద్యౌరివామలా ॥ 33
మహారాజా! యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన పెక్కుమంది రాజులచేత క్రిక్కిరిసిపోయిన ఆ సభాభవనం నక్షత్రాలతో నిండిన నిర్మలమైన ఆకాశంలా శోభిల్లింది. (33)
సర్వరత్నాన్యుపాదాయ పార్థివా వై జనేశ్వర ।
యజ్ఞే తస్య మహారాజ పాండుపుత్రస్య ధీమతః ॥ 34
జనాధిపా! బుధ్ధిమంతుడయిన ఆ పాండుకుమారుని యజ్ఞానికి రాజులు సమస్తరత్నాలను తీసుకొనివచ్చారు. (34)
వైశ్యా ఇవ మహీపాలా ద్విజాతిపరివేషకాః ।
న సా శ్రీర్దేవరాజస్య యమస్య వరుణస్య చ ।
గుహ్యకాధిపతేర్వాపి యా శ్రీ రాజన్ యుధిష్ఠిరే ॥ 35
రాజులు వైశ్యుల వలె ద్విజులకు భోజనాలు వడ్డించారు. రాజా! యుధిష్ఠిరుని వద్ద ఉన్న సంపద దేవేంద్రుని వద్ద కాని, యమ, వరుణ, కుబేరుల వద్దగాని లేదు. (35)
తాం దృష్ట్వా పాండుపుత్రస్య శ్రియమ్ పరమికామహమ్ ।
శాంతిం న పరిగచ్ఛామి దహ్యమానేన చేతసా ॥ 36
పాండుపుత్రుని ఆ ఉత్కృష్టమైన సంపదను చూచి దహించుకుపోతున్న మనసుతో నేను శాంతిని పొందలేకపోతున్నాను. (36)
(అప్రాప్య పాండవైశ్యర్యం శమో మమ న విద్యతే ।
అవాప్య్సే వా రణం బాణైః శయిష్యే వా హతః పరైః ॥
ఏతాదృశస్య మే కిం ను జీవితేన పరంతప ।
వర్దంతే పాండవా రాజన్ వయం హి స్థితవృద్ధయః ॥)
పాండవుల ఐశ్వర్యం పొందకపోతే నాకు శాంతిలేదు. యుద్ధాన్ని చేసైనా పొందుతాను. లేదంటే శత్రువుల చేతిలో మరణిస్తాను. ఇటువంటి దశలో ఉన్న నేను జీవించి ఏం ప్రయోజనం? పరంతపా! పాండవులు దినదినాభివృద్ధి పొందుతున్నారు. మనవృద్ధి నిలిచిపోయింది.
శకుని రువాచ
యా మే తామతులాం లక్ష్మీం దృష్టవానసి పాండవే ।
తస్యాః ప్రాప్తావుపాయం మే శృణు సత్యపరాక్రమ ॥ 37
శకుని అంటున్నాడు - సత్యపరాక్రమా! యుధిష్ఠిరుని వద్ద నీవు చూచిన ఆ సాటిలేని సంపదను పొందే ఉపాయం నేను చెప్తాను విను. (37)
అహమక్షేష్వభిజ్ఞాతః పృథివ్యామపి భారత ।
హృదయజ్ఞః పణజ్ఞశ్చ విశేషజ్ఞశ్చ దేవనే ॥ 38
భారతా! ఈ భూమండలంలో నేను ద్యూతవిద్య బాగా తెలిసినవాడిని. దానిలోని మర్మాలను ఎరిగినవాడను. పందెం ఒడ్డడం తెలిసినవాడిని. పాచికలు విసరడంలో విశేషజ్ఞానం కలవాడిని. (38)
ద్యూతప్రియశ్చ కౌంతేయః న చ జానాతి దేవితుమ్ ।
కుంతీసుతుడైన యుధిష్ఠిరుడు ద్యూతప్రియుడే కాని పాచికలు వేయడం అతనికి తెలియదు. (38 1/2)
ఆహూతశ్చైష్యతి వ్యక్తం ద్యూతాదపి రణాదపి ॥ 39
జూదానికి గాని యుద్ధానికి గాని పిలిస్తే అతడు తప్పక వస్తాడు. (39)
నియతం తం విజేష్యామి కృత్వా తు కపటం విభో ।
ఆనయామి సమృద్ధిం తాం దివ్యాం చోపాహ్వయస్వ తమ్ ॥ 40
ప్రభూ! మోసం చేసి అయినా సరే అతనిని తప్పక గెలుస్తాను. ఆ దివ్యసంపదనంతా తెచ్చిపెడతాను. అతనిని పిలువు. (40)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః శకునినా రాజా దుర్యోధనస్తతః ।
ధృతరాష్ట్రమిదం వాక్యమ్ అపదాంతరమబ్రవీత్ ॥ 41
అయముత్సహతే రాజన్ శ్రియమాహర్తుమక్షవిత్ ।
ద్యూతేన పాండుపుత్రస్య తదనుజ్ఞాతమర్హసి ॥ 42
వైశంపాయనుడు చెపుతున్నాడు.
శకుని ఇలా అనగానే దుర్యోధనమహారాజు వెంటనె (ఆమాట అందిపుచ్చుకొని) ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. 'రాజా! అక్షకోవిదుడు అయిన ఇతడు జూదంతో పాండుపుత్రుని సంపదను తీసికొనిరావడానికి ఉత్సాహ పడుతున్నాడు. కాబట్టి మీరు అనుజ్ఞ ఇవ్వండి.' (41,42)
ధృతరాష్ట్ర ఉవాచ
క్షత్తా మంత్రీ మహాప్రాజ్ఞాః స్థితో యస్యాస్మి శాసనే ।
తేన సంగమ్య వేత్స్యామి కార్యస్యాస్య వినిశ్చయమ్ ॥ 43
ధృతరాష్ట్రుడు అంటున్నాడు - విదురుడు మహాప్రాజ్ఞుడు. మంత్రి. అతని శాసనాన్ని అనుసరించి ఉంటాను నేను. అతనిని కలుసుకొని ఈ కార్యవిషయంలో ఏమి నిశ్చయించాలో తెలుసుకొంటాను. (43)
స హి ధర్మం పురస్కృత్య దీర్ఘదర్శీ పరం హితమ్ ।
ఉభయోః పక్షయోర్యుక్తం వక్ష్యత్యర్థవినిశ్చయమ్ ॥ 44
దీర్ఘదర్శి అయిన అతడు ధర్మాన్ని పురస్కరించుకొని మిక్కిలి హితమై, రెండు పక్షాలనూ తగిన కార్యాన్ని నిశ్చయించి చెప్పుతాడు. (44)
దుర్యోధన ఉవాచ
నివర్తయిష్యతి త్వాసౌ యది క్షత్తా సమేష్యతి ।
నివృత్తే త్వయి రాజేంద్ర మరిష్యేఽహమసంశయమ్ ॥ 45
దుర్యోధనుడు అంటున్నాడు - విదురుడు నిన్ను కలుసుకొంటే అతడు నిన్ను ఈ కార్యం నుండి మరలించుతాడు. రాజేంద్రా! నీవు అలా మరలితే నేను చనిపోతాను. ఇది నిశ్చయం. (45)
స త్వం మయి మృతే రాజన్ విదురేణ సుఖీ భవ ।
భోక్ష్యసే పృథివీం కృత్స్నాం కిం మయా త్వం కరిష్యసి ॥ 46
రాజా! నేను పోతే అప్పుడు నీవు విదురునితో సుఖంగా ఉండు. ఈ భూమినంతా నీవే అనుభవించు. నాతో నీకు పనేమిటి? (46)
వైశంపాయన ఉవాచ
ఆర్తవాక్యం తు తత్ తస్య ప్రణయోక్తం నిశమ్య సః ।
ధృతరాష్ట్రోఽబ్రవీత్ ప్రేష్యాన్ దుర్యోధనమతే స్థితః ॥ 47
వైశంపాయనుడు చెపుతున్నాడు - దుర్యోధనుని యొక్క ఆర్తితో కూడిన ఆ ప్రణయోక్తిని విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుని ఆలోచనకు మొగ్గు చూపి, సేవకులతో ఇలా అన్నాడు. (47)
స్థూణాసహస్రైర్బృహతీం శతద్వారాం సభాం మమ ।
మనోరమాం దర్శనీయామ్ ఆశు కుర్వంతు శిల్పినః ॥ 48
వేయిస్తంభాలతో, వంద ద్వారాలతో విశాలమైన అందమైన చూడచక్కని ఒక సభాభవనాన్ని త్వరగా శిల్పులు నిర్మించాలి. (48)
తతః సంస్తీర్య రత్నైస్తాం తక్ష్ణ ఆనాయ్య సర్వశః ।
సుకృతాం సుప్రవేశాం చ నివేదయత మే శనైః ॥ 49
ఆ తరువాత అన్నిదేశాల నుండి చెక్కుడుపనివారిని పిలిపించి ఆ భవనంలో రత్నాలను పరిపించాలి. ఆ రీతిగా అమర్చి చక్కగా ప్రవేశయోగ్యమైన తరువాత మెల్లగా నాకు తెలియచేయండి. (49)
దుర్యోధనస్య శాంత్యర్థమ్ ఇతి నిశ్చిత్య భూమిపః ।
ధృతరాష్ట్రో మహారాజ ప్రాహిణోద్ విదురాయ వై ॥ 50
మహారాజా! దుర్యోధనుని శాంతికోసం ఇలా నిశ్చయించి ధృతరాష్ట్రమహారాజు విదురుని కొఱకు సేవకుని పంపాడు. (50)
అపృష్ట్వా విదురం స్వస్య నాసీత్ కశ్చిద్ వినిశ్చయః ।
ద్యూతే దోషాంశ్చ జానన్ స పుత్రస్నేహాదకృష్యత ॥ 51
విదురుని అడుగకుండా అతడు స్వయంగా ఏదీ నిశ్చయించడు. జూదం వలన కలిగే దోషాలను తెలిసి కూడా అతడు పుత్రమమకారానికి లొంగిపోయాడు. (51)
తచ్ఛ్రుత్వా విదురో ధీమానో కలిద్వారముపస్థితమ్ ।
వినాశముఖముత్పన్నం ధృతరాష్ట్రముపాద్రవత్ ॥ 52
బుద్ధిమంతుడయిన విదురుడు కలహానికి ద్వారభూతమయిన, వినాశనాన్ని కలిగించే జూదం జరగనున్నదనే వార్తను విని ధృతరాష్ట్రుని వద్దకు పరుగెత్తుకు వచ్చాడు. (52)
సోఽభిగమ్య మహాత్మానం భ్రాతా బ్రాతరమగ్రజమ్ ।
మూర్ధ్నా ప్రణమ్య చరణౌ ఇదం వచనమబ్రవీత్ ॥ 53
ఆ సోదరుడు విదురుడు మహాత్ముడైన పెద్దన్నగారిని సమీపించి, శిరసుతో పాదాభివందనం చేసి ఇలా అన్నాడు. (53)
విదుర ఉవాచ
నాభినందామి తే రాజన్ వ్యవసాయమిమం ప్రభో ।
పుత్రైర్భేదో యథా న స్యాద్ ద్యూతహేతోస్తథా కురు ॥ 54
విదురుడు అంటున్నాడు - రాజా! మీ యొక్క ఈ నిశ్చయాన్ని నేను మెచ్చుకోలేను. జూదం కారణంగా పుత్రుల మధ్య కలహం రాకుండా చేయండి. (54)
ధృతరాష్ట్ర ఉవాచ
క్షత్తః పుత్రేషు పుత్రైర్మే కలహో న భవిష్యతి ।
యది దేవాః ప్రసాదం నః కరిష్యంతి న సంశయః ॥ 55
ధృతరాష్ట్రుడు చెపుతున్నాడు - విదురా! దేవతలు మనలను అనుగ్రహిస్తే నా పుత్రులకు, పాండుపుత్రులకు కలహం రాదు. ఇందులో సందేహం లేదు. (55)
అశుభం వా శుభం వాపి హితం వా యది వా హితమ్ ।
ప్రవర్తతాం సుహృద్ ద్యూతం దిష్టమేతన్న సంశయః ॥ 56
అశుభమైనా, శుభమైనా, హితమైనా, అహితమైనా గానీ సుహృద్ద్యూతం జరిగితీరుతుంది. నిస్సందేహంగా ఇది దైవం వలననే జరిగింది. (56)
మయి సంనిహితే ద్రోణే భీష్మే తవ్యి చ భారత ।
అనయో దేవవిహితః న కథంచిద్ భవిష్యతి ॥ 57
భారతా! నేను, ద్రోణుడు, భీష్ముడు, నీవు దగ్గరలో ఉండగా ఎటువంటి దైవవిహితమైన అన్యాయమూ జరగదు. (57)
గచ్ఛ త్వం రథమాస్థాయ హయైర్వాతసమైర్జవే ।
ఖాండవప్రస్థమద్యైవ సమానయ యుధిష్ఠిరమ్ ॥ 58
వాయుసమానవేగం గల గుఱ్ఱాలను పూన్చిన రథం ఎక్కి ఈ రోజే ఖాండవప్రస్థానికి వెళ్లు. యుధిష్ఠిరుని తీసుకొనిరా. (58)
న వాచ్యో వ్యవసాయో మే విదురైతద్ బ్రవీమి తే ।
దైవమేవ పరం మన్యే యేనైతదుపపద్యతే ॥ 59
విదురా! నా నిర్ణయమ్ గూర్చి చెప్పకు. ఇది నీకు నేను చెపుతున్నాను. ఈ జూదాన్ని ఘటింపచేసిన దైవం బలీయమని అనుకొంటున్నాను. (59)
ఇత్యుక్తో విదురో ధీమాన్ నేదమస్తీతి చింతయన్ ।
ఆపగేయం మహాప్రాజ్ఞమ్ అభ్యగచ్ఛత్ సుదుఃఖితః ॥ 60
ఇలా ఆదేశింపబడిన బుద్ధిమంతుడైన విదురుడు ఇది జరగకూడదు అని ఆలోచిస్తూ, మిక్కిలి దుఃఖంతో మహాప్రాజ్ఞుడైన భీష్ముని వద్దకు వెళ్లాడు. (60)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దుర్యోధనసంతాపే ఏకోనపంచాశాత్తమోఽధ్యాయః ॥ 49 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున దుర్యోధన సంతాపమను నలువది తొమ్మిదవ అధ్యాయము. (49)
(దాక్షిణాత్య అధికపాఠము 7 శ్లోకములు కలిసి మొత్తం 67 శ్లోకములు)