21. ఇరువది యొకటవ అధ్యాయము

మగధరాజధాని ప్రాశస్త్యము, మూడు నగరాలను ఛేదించుట, శ్రీకృష్ణజరాసంధసంవాదము.

వాసుదేవ ఉవాచ
ఏష పార్థ మహాన్ భాతి పశుమాన్ నిత్యమంబుమాన్ ।
నిరామయః సువేశ్మాఢ్యః నివేశో మాగధః శుభః ॥ 1
వాసుదేవుడు అన్నాడు - కుంతీనందనా! చూడు. ఇది మగధదేశపు రాజధాని. నిత్యం జలసమృద్ధితో, పశుసంపదతో, రోగాలకు దూరమై ప్రకాశిస్తోంది. సుందరభవనాలతో నిండి ఈ నగరం మనోహరంగా కనిపిస్తోంది. (1)
వైహారో విపులః శైలః వరాహో వృషభస్తథా ।
తథా ఋషిగిరిస్తాత శుభాశ్చైత్యకపంచమాః ॥ 2
ఏతే పంచమహాశృంగాః పర్వతాః శీతలద్రుమాః ।
రక్షంతీవాభిసంహత్య సంహతాంగా గిరివ్రజమ్ ॥ 3
ఇక్కడ విహారానికి ఉపయోగపడే విపులం, వరాహం, ఋషభం, ఋషిగిరి, చైత్యకం అనే అయిదు పర్వతాలు ఉన్నాయి. పెద్దపెద్ద శిఖరాలు గల ఈ అయిదు సుందర పర్వతాలు చల్లని నీడనిచ్చే చెట్లతో వ్యాపించి ఉన్నాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఈ గిరివ్రజపురాన్ని సంరక్షిస్తున్నాయి. (2,3)
పుష్పవేష్టితశాఖాగ్రైః గంధవద్భిర్మనోహరైః ।
నిగూఢా ఇవ లోధ్రాణాం వనైః కామిజనప్రియైః ॥ 4
ఇక్కడ లొద్దుగుచెట్లతో నిండిన పెద్దమనోహరవనం ఉంది. అయిదు పర్వతాల మధ్య లొద్దుగు చెట్ల మధ్య ఆ నగరం దాగి ఉంది. ఎటుచూసినా పూలతో వ్యాపించి ఉంది. లొద్దుగుపూల సుగంధం కాముకులకు చాలా ఇష్టమైంది. (4)
శూద్రాయాం గౌతమో యత్ర మహాత్మా సంశితవ్రతః ।
ఔశీనర్యామజనయత్ కాక్షీవాద్యాన్ సుతాన్ మునిః ॥ 5
ఇక్కడే మిక్కిలి కఠినవ్రతాన్ని ఆచరించే గొప్పమనస్సు గల గౌతమమహర్షి ఉశీనరదేశపు శూద్రజాతి స్త్రీ, ఆమె కన్యకగా ఉన్న సమయాన కాక్షీవంతుడు మొదలుగా గల పుత్రులను జనింపచేశాడు. (5)
గౌతమః ప్రణయాత్ తస్మాద్ యథాసౌ తత్ర సద్మని ।
భజతే మాగధం వంశం స నృపాణామనుగ్రహాత్ ॥ 6
ఈ కారణంగా గౌతముడు రాజులపై ప్రేమతో అక్కడనే ఆశ్రమాన నివసించసాగాడు. అనుగ్రహంతో మగధ దేశపు రాజులను సేవించసాగాడు. (6)
అంగవంగాదయశ్చైవ రాజానః సుమహాబలాః ।
గౌతమక్షయమభ్యేత్య రమంతే స్మ పురార్జున ॥ 7
అర్జునా! పూర్వకాలంలో బలవంతులై అంగ, వంగ మొదలైన దేశాల రాజులందరు గౌతముని గృహానికి వచ్చి అక్కడ అతనితో ఆనందించసాగారు. (7)
వనరాజీస్తు పశ్యేమాః పిప్పలానాం మనోరమా ।
లోధ్రాణాం చ శుభాః పార్థ గౌతమౌకః సమీపజాః ॥ 8
పార్థా! గౌతముని ఆశ్రమసమీపాన సుందరాలైన పిప్పల, లోధ్రాది శుభవృక్షాల వరుసలు ప్రకాశిస్తున్నాయి. చూడు. (8)
అర్బుదః శక్రవాపీ చ పన్నగౌ శత్రుతాపనౌ ।
స్వస్తికస్యాలయశ్చాత్ర మణినాగస్య చోత్తమః ॥ 9
ఇక్కడ అర్బుదం, శక్రవాపి అనే పేర్లుగల శత్రు పీడాకరాలైన రెండు ఏనుగులు ఉన్నాయి. స్వస్తికం, మణినాగమనే పేర్లు గల ఏనుగులకు కూడ ఉత్తమగృహాలు ఉన్నాయి. (9)
అపరిహార్యా మేఘానాం మాగధా మనునా కృతాః ।
కౌశికో మణిమాంశ్చైవ చక్రాతే చాప్యనుగ్రహమ్ ॥ 10
మనువు ఆజ్ఞానుసారం ఈ మగధదేశం మేఘాలకు విడువరానిది అయింది. ఇక్కడ ఎల్లప్పుడూ సమయానుకూలమైన వర్షం పడుతుంది. చండకౌశికుడనే ముని, మణిమంతుడనే ఏనుగు దీన్ను అనుగ్రహదృష్ఠితో చూస్తూ ఉంటాయి. (10)
(పాండరే విపులే చైవ తథా వారాహకేఽపి చ ।
చైత్యకే చ గిరిశ్రేష్ఠే మాతంగే చ శిలోచ్చయే ॥
ఏతేషు పర్వతేంద్రేషు సర్వసిద్ధమహాలయాః ।
యతీనామాశ్రమాచ్చైవ మునీనాం చ మహాత్మనామ్ ॥
శ్వేతవర్ణం గల వృషభగిరి, విపులం, వారాహకం, శిలలతో వ్యాప్తం అయిన మాతంగం, పర్వతశ్రేష్ఠం అయిన చైత్యకం, ఈ పర్వతాలపై సిద్ధులకు మణిమందిరాలు ఏర్పడ్డాయి. యతులు, మహాత్ములైన మునుల ఆశ్రమాలిక్కడ ఎక్కువగా ఉన్నాయి.
వృషభస్య తమాలస్య మహావీర్యస్య వై తథా ।
గంధర్వరక్షసాం చైవ నాగానాం చ తథాఽలయః ॥)
వృషభుడు, మహాపరాక్రమశలి తమాలుడు, గంధర్వులు, ఏనుగులు అక్కడ నివసించటం చేత ఆ నగరం అధికశోభ కలిగి ఉంది.
ఏవం ప్రాప్య పురం రమ్యం దురాధర్షం సమంతతః ।
అర్థసిద్ధిం త్వనుపమాం జరాసంధోఽభిమాన్యతే ॥ 11
ఈ విధంగా నాలుగు వైపుల నుంచి ప్రవేశింపశక్యంగాని నగరాన్ని పొంది జరాసంధుడు "నాకు సాటిలేని నగరసంపద సిద్ధించి" దని గర్వించి ఉన్నాడు. (11)
వయమాసాదనే తస్య దర్పమద్య హరేమహి ।
ఈ రోజున మనం వాని ఇంటికిపోయి అతని గర్వాన్ని అంతటిని హరిమ్చివేద్దాం. (11 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తతః సర్వే భ్రాతరో విపులౌజసః ॥ 12
వార్ష్ణేయః పాండవౌ చైవ ప్రతస్థుర్మాగధం పురమ్ ।
హృష్టపుష్టజనోపేతం చాతుర్వర్ణ్యసమాకులమ్ ॥ 13
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! ఈ విధంగా మాట్లాడుకొంటూనే శ్రీకృష్ణుడు, భీమార్జునులు ముగ్గురూ కలిసి మగధపురంలోకి ప్రవేశించారు. ఆ నగరం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రు లనే చాతుర్వర్ణ్యంతో ప్రకాశిస్తోంది. అక్కడి జనమంతా ఆనందం, సంతృప్తి కలిగి ఉన్నారు. (12,13)
స్ఫీతోత్సవమనాధృష్యమ్ ఆసేదుశ్చ గిరివ్రజమ్ ।
తతో ద్వారమనాసాద్య పురస్య గిరిముచ్ఛ్రితమ్ ॥ 14
బార్హద్రథైః పూజ్యమానం తథా నగరవాసిభిః ।
మగధానాం సురుచిరం చైత్యకాంతం సమాద్రవన్ ॥ 15
అక్కడ ఉత్సవాలెన్నో జరుగుతుంటాయి. అంతా గెలువశక్యం కానివారు. గిరివ్రజసమీపానికి వారు ముగ్గురు చేరారు. వారు ముఖద్వారాన్ని విడచి ఉన్నతమైన చైత్యకపర్వతశిఖరం గుండా నగరంలోకి ప్రవేశించారు. ఆ నగరాన నివసించే ప్రజలు, బృహద్రథకుటుంబీకులు ఆ పర్వత పూజను చేస్తున్నారు. మగధదేశీయులకు ఆ పర్వతం ఎంతో ప్రియమైంది. (14,15)
యత్ర మాంసాదమృషభమ్ ఆససాద బృహద్రథః ।
తం హత్వా మాం సతాలాభిః తిస్రో భేరీరకారయత్ ॥ 16
అక్కడ రాజైన బృహద్రథుడు ఋషభుడనే పేరు గల మాంసభక్షకుడగు రాక్షసుని యుద్ధంలో చంపి అతని చర్మంతో మూడు నగరాలు చేయించాడు. వాటిని ఒకసారి మ్రోగిస్తే అవి నెలవరకూ అలా మ్రోగుతూనే ఉంటాయి. (16)
స్వపురే స్థాపయామాస తేన చానహ్య చర్మణా ।
యత్ర తాః ప్రణదన్ భేర్యః దివ్యపుష్పావచూర్ణితాః ॥ 17
రాజు ఆ నగరాలను చర్మంతో బిగించి తన నగరంలో ఉంచాడు. ఎప్పుడు ఆ నగరాలు మ్రోగుతాయో అప్పుడు అక్కడ పుష్పవృష్టి కురుస్తుంది. (17)
భక్త్వా భేరీత్రయం తేఽపి చైత్యప్రాకారమాద్రవన్ ।
ద్వారతోఽభిముఖాః సర్వే యయుర్నానాఽఽయుధాస్తదా ॥ 18
మాగధానాం సురుచిరం చైత్యకం తం సమాద్రవన్ ।
శిరసీవ సమాఘ్నంతః జరాసంధం జిఘాంసవః ॥ 19
వారు ముగ్గురూ అక్కడి భేరీ త్రయాన్ని చీల్చి చైత్యప్రాకారం అధిరోహించారు. వారు ఆయుధాలను తీసికొని మాగధులకు ఇష్టమైన చైత్యకంపై పరుగిడసాగారు. జరాసంధుని చంపాలని భావించి ఆ పర్వతశిఖరంపై కొట్టసాగారు. (18,19)
స్థిరం సువిపులం శృంగం సుమహత్ తత్ పురాతనమ్ ।
అర్చితం గంధమాల్యైశ్చ సతతం సుప్రతిష్ఠితమ్ ॥ 20
విపులైర్బాహుభిర్వీరాః తేఽభిహత్యాభ్యపాతయన్ ।
తతస్తే మాగధం హృష్టాః పురం ప్రవివిశుస్తదా ॥ 21
ఆ చైత్యకపర్వత విశల శిఖరం చాలా పురాతనమైనది కాని, దృఢమైనది. మగధదేశంలో చాలా ప్రతిష్ఠ కలిగినది. ప్రతిదినం గంధమాల్యాదులతో పూజింపబడుతుంది. శ్రీకృష్ణ భీమార్జునులు తమ భుజబలంతో విరగగొట్టి ఆ పర్వతశిఖరాన్ని పడగొట్టారు. పిమ్మట వారు ప్రసన్నులై మగధరాజధాని గిరివ్రజంలో ప్రవేశించారు. (20,21)
ఏతస్మిన్నేవ కాలే తు బ్రాహ్మణా వేదపారగాః ।
దృష్ట్వా తు దుర్నిమిత్తాని జరాసంధమదర్శయన్ ॥ 22
ఇదే సమయాన వేదవిదులైన బ్రాహ్మణులు దుఃశకునాలను చూచి జరాసంధునికి సుచించారు. (22)
పర్యగ్న్యకుర్వంశ్చ నృపం ద్విరదస్థం పురోహితాః ।
తతస్తచ్ఛాంతయే రాజా జరాసంధః ప్రతాపవాన్ ।
దీక్షితో నియమస్థోఽసౌ ఉపవాసపరోఽభవత్ ॥ 23
పురోహితులు జరాసంధుని ఏనుగుపై కూర్చుండబట్టి చుట్టూ నీరాజనాలతో అగ్నిని ప్రజ్వలింపచేశారు. ప్రతాపవంతుడైన జరాసంధుడు అనిష్టం శాంతించటానికి వ్రతదీక్షను గైకొని నియమాలను ఆచరిస్తూ ఉపవాసం చేశాడు. (23)
స్నాతకవ్రతినస్తే తు బాహుశస్త్రా నిరాయుధాః ।
యుయుత్సవః ప్రవివిశుః జరాసంధేన భారత ॥ 24
ఇటు వైపు నుంచి వారు ముగ్గురు యోధులు స్నాతకవ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణుల వేషాలు ధరించి, బాహువులే ఆయుధాలుగా గలిగి మిగతా ఆయుధాలను విడచి జరాసంధునితో యుద్ధం చేయాలని నగరంలోకి ప్రవేశించారు. (24)
భక్ష్యమాల్యాపణానాం చ దదృశుః శ్రియముత్తమామ్ ।
స్ఫీతాం సర్వగుణోపేతాం సర్వకామసమృద్ధినీమ్ ॥ 25
తాం తు దృష్ట్వా సమృద్ధిం తే వీథ్యాం తస్యాం నరోత్తమాః ।
రాజమార్గేణ గచ్ఛంతః కృష్ణభీమధనంజయాః ।
బలాద్ గృహీత్వా మాల్యాని మాలాకారాన్మహాబలాః ॥ 26
తినుబండారాలు, పూలమాలలు ఇతరవస్తుసామాగ్రి గల దుకాణాలలో సిద్ధపరచిన అపూర్వమైన సంపద గల ప్రదేశాన్ని చూశాడు. ఆ నగరవైభవం సర్వగుణసంపన్నంగా అన్ని కోరికల్ని తీర్చేదిగా ఉంది. ఆ వీథిలోని అద్భుత సంపదలను చూసిన శ్రీకృష్ణభీమార్జునులు ఒక మాలాకారుని నుండి చాలా మాలలు బలవంతంగా తీసికొని నగరంలోని ప్రధానరహదారి గుండా నడువసాగారు. (25,26)
విరాగవసనాః సర్వే స్రగ్విణో మృష్టకుండలాః ।
నివేశనమథాజగ్ముః జరాసంధస్య ధీమతః ॥ 27
రంగుల వస్త్రాలను ధరించి మెడలో హారాలు వేసికొని, చెవులకు మెరిసే కుండలాలు పెట్టుకొని ముగ్గురూ బుద్ధిమంతుడైన జరాసంధుని భవనసమీపానికి చేరారు. (27)
గోవాసమివ వీక్షంతః సింహా హైమవతా యథా ।
శాలస్తంభనిభాస్తేషాం చందనాగురురూషితాః ॥ 28
అశోభంత మహారాజ బాహవో యుద్ధశాలినామ్ ।
హిమాలయాన గోవుల ఉనికిని వెదకే సింహాల వలె వారు మువ్వురు రాజభవనాన్ని వెదకుతూ ముందుకుసాగారు. ఆ సమయాన వారి భుజాలు మద్దిమ్రానులవలె ఉన్నాయి. మంచిగంధం, అగరు ధూపం వేయబడి యుద్ధానికి ఉద్యుక్తులైన వారి బాహువులవలె ఉన్నాయి. (28 1/2)
తాన్ దృష్ట్వా ద్విరదప్రఖ్యామ్ శాలస్కంధానివోద్గతాన్ ।
వ్యూఢోరస్కాన్ మాగధానాం విస్మయం సమపద్యత ॥ 29
సాలవృక్షాల మ్రానుల వలె ఉన్నతాలై విశాలవక్షం గల గజరాజుల వలె ఉన్న వీరులను చూచి మాగధులు అంతా ఆశ్చర్యపడ్డారు. (29)
తే త్వతీత్య జనాకీర్ణాః కక్షాస్తిస్రో నరర్షభాః ।
అహంకారేణ రాజానమ్ ఉపతస్థుర్గతవ్యథాః ॥ 30
ఆ నరశ్రేష్ఠులు జనులచే నిండిన మూడు ద్వారాలను దాటి నిర్భయులై నిశ్చింతతో అభిమానవంతులై రాజైన జరాసంధుని వద్దకు వచ్చారు. (30)
తాన్ పాద్యమధుపర్కార్హాన్ గవార్హాన్ సత్కృతిం గతాన్ ।
ప్రత్యుత్థాయ జరాసంధః ఉపతస్థే యథావిధి ॥ 31
పాద్య, మధుపర్క, గోదానాలకు అర్హులై, సర్వత్ర సత్కారం పొందతగిన వారికి ఎదురేగి జరాసంధుడు విధివిధానంతో అతిథి సత్కారాలు చేశాడు. (31)
ఉవాచ చైతాన్ రాజాసౌ స్వాగతం వోఽస్త్వితి ప్రభుః ।
మౌనమాసీత్ తదా పార్థ భీమయోర్జనమేజయ ॥ 32
తేషాం మధ్యే మహాబుద్ధిః కృష్ణో వచనమబ్రవీత్ ।
వక్తుం నాయాతి రాజేంద్ర ఏతయోర్నియమస్థయోః ॥ 33
అర్వాఙ్ నిశీథాత్ పరతః త్వయా సార్థం వదిష్యతః ।
పిమ్మట శక్తిశాలి జరాసంధుడు వారు మువ్వురికి "స్వాగతం అగుగాక" అని పలికాడు. జనమేజయా! ఆ సమయాన భీమసేనార్జునులు మౌనంగా ఉన్నారు. వారిలో బుద్ధిమంతుడు శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు. రాజా! నియమపరులైన వీరిరువురు నీతో అర్థరాత్రికి ముందు మాటలాడరు. అర్ధరాత్రి సమీపిస్తే వారు నీతో మాటలాడతారు. (32,33 1/2)
యజ్ఞాగారే స్థాపయిత్వా రాజా రాజగృహం గతః ॥ 34
తతోఽర్థరాత్రే సంప్రాప్తే యాతో యత్ర స్థితా ద్విజాః ।
తస్య హ్యేతద్ వ్రతం రాజన్ బభూవ భువి విశ్రుతమ్ ॥ 35
జరాసంధుడు వారిని యాగశాలలో కూర్చుండబెట్టి స్వయంగా రాజభవనంలోకి వెళ్ళాడు. అర్థరాత్రి అయిన పిమ్మట వారు కూర్చున్నచోటికి వచ్చాడు. వారి నియమం భూమండలంలోనే ప్రసిద్ధంగా, ఆశ్చర్యంగా ఉంది. (34,35)
స్నాతకాన్ బ్రాహ్మణాన్ ప్రాప్తాన్ శ్రుత్వా స సమితింజయః ।
అత్యర్ధరాత్రే నృపతిః ప్రత్యుద్గచ్ఛతి భారత ॥ 36
యుద్ధవిజేత జరాసంధుడు స్నాతకులైన బ్రాహ్మణుల రాకను విని అర్ధరాత్రి వేళలో వారి సత్కారానికి వారి సమీపానికి బయలుదేరాడు. (36)
తాం స్త్వపూర్వేణ వేషేణ దృష్ట్వా స నృపసత్తమః ।
ఉపతస్ధే జారాసంధః విస్మితశ్చాభవత్ తదా ॥ 37
వాఱు ముగ్గుర్ని అపూర్వ వేషాలలో చూచి రాజశ్రేష్ఠుడు జరాసంధుడు ఆశ్చర్యంతో వారి సమీపానికి వచ్చాడు. (37)
తే తు దృష్వేవ రాజానం జరాసంధం నరర్షభాః ।
ఇదముచురమిత్రఘ్నాః సర్వే భరతసత్తమ ॥ 38
స్వస్త్యస్తు కుశలం రాజన్ ఇతి తత్ర వ్యవస్థితాః ।
తం నృపం నృపశార్దూల ప్రేక్షమాణాః పరస్పరమ్ ॥ 39
శత్రునాశం చేయగల ముగ్గురూ రాజశ్రేష్ఠుడు జరాసంధునితో "మహారాజా! మీకు కళ్యాణమగుగాక! అని పలికారు. పిమ్మట వారు జరాసంధునివైపు, మధ్యమధ్యలో తమలో తాము చూసుకొంటూ నిలబడ్డారు. (38,39)
తానబ్రవీజ్జరాసంధః తదా పాండవయాదవాన్ ।
ఆస్యతామితి రాజేంద్ర బ్రాహ్మణచ్ఛద్మసంవృతాన్ ॥ 40
రాజేంద్రా! బ్రాహ్మణవేషాలలో ఉన్న ఆ పాండవ యాదవవీరులను చూచి జరాసంధుడు - "కూర్చోండి." అన్నాడు. (40)
అథోపావివిశుః సర్వే త్రయస్తే పురుషర్షభాః ।
సంప్రదీప్తాస్త్రయో లక్ష్మ్యా మహాధ్వర ఇవాగ్నయః ॥ 41
వారందరూ ఆసీనులయ్యారు. ముగ్గురు పురుషశ్రేష్ఠులు యజ్ఞంలో ప్రజ్వలించే మూడు అగ్నుల వలె ప్రకాశించారు. (41)
తామువాచ జరాసంధః సత్యసంధో నరాధిపః ।
విగర్హమాణః కౌరవ్య వేషగ్రహణవైకృతాన్ ॥ 42
న స్నాతకవ్రతా విప్రా బహిర్మాల్యానులేపనాః ।
భవంతీతి నృలోకేఽస్మిన్ విదితం మమ సర్వశః ।
కే యూయం పుష్పవంతశ్చ భుజైర్జ్యాకృతలక్షణైః ॥ 43
సత్యపాలకుడు జరాసంధుడు వేషభాషల కంటె విపరీత ఆచరణం గల వారిని నిందిస్తూ - బ్రాహ్మణులారా! స్నాతకవ్రతాన్ని పాలించే బ్రాహ్మణులు సమావర్తనాది కర్మలు లేకుండ మాలలు, చందనం ధరించరు అనే ప్రసిద్ధి మానవులలో ఉంది. నా కీ విషయం బాగుగా తెలియును. మీ మెడలో మాలలు ఉన్నాయి. భుజాలపై వింటినారిని ధరించిన చిహ్నాలు కనపడుతున్నాయి. (42,43)
బిభ్రతః క్షాత్రమోజశ్చ బ్రాహ్మణ్యం ప్రతిజానథ ।
ఏవం విరాగవసనా బహిర్మాల్యానులేపనాః ।
సత్యం వదత కే యూయం సత్యం రాజసు శోభతే ॥ 44
మీరందరు క్షత్రియ తేజం కలవారు. బ్రాహ్మణులం అని చెప్పుతున్నారు. రంగురంగుల వస్త్రాలను దాల్చి, వివిధాలైన మాలలు, లేపనాలు పూసుకున్న మీరెవరో నిజం చెప్పండి. రాజులకు నిజమే శోభనిస్తుంది. (44)
చైత్యకస్య గిరేః శృంగం భిత్వా కిమిహ ఛద్మనా ।
అద్వారేణ ప్రవిష్టాః స్థ నిర్భయా రాజకిల్బిషాత్ ॥ 45
చైత్యపర్వతశిఖరాన్ని పగులగొట్టి రహస్యవేషాలతో రాజాపరాధాన్ని పరిగణింపక నిర్భయులై వెనుక వాకిలి గుండా ఏకారణంచే ప్రవేశించారు? (45)
వదధ్వం వాచి వీర్యం చ బ్రాహ్మణస్య విశేషతః ।
కర్మచైతద్ విలింగస్థ కింవోఽద్య ప్రసమీక్షితమ్ ॥ 46
బ్రాహ్మణులకు మాటలలోనే పరాక్రమ ముండి క్రియలలో కన్పించదు. ఈ పర్వతశిఖరాన్ని పగులగొట్టటం మీ లక్షణాలకు విపరీతంగా ఉంది. మీరేవిషయాన్ని ఆలోచించి ఈ పని చేశారు? (46)
ఏవం చ మాముపాస్థాయ కస్మాచ్చ విధినార్హణామ్ ।
ప్రతీతాం నానుగృహ్ణీత కార్యం కిం వాస్మదాగమే ॥ 47
నా సమీపానికి వచ్చి విధి పురస్సరమైన పూజను నానుండి ఏల గ్రహింపరు? నా దగ్గరకు రావడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమిటి? (47)
ఏవముక్తే తతః కృష్ణః ప్రత్యువాచ మహామనాః ।
స్నిగ్ధగమ్భీరయా వాచా వాక్యం వాక్యవిశారదః ॥ 48
జరాసంధుని మాటలు విని మనస్వి అయిన శ్రీకృష్ణుడు స్నిగ్ధగంబీరస్వరంతో ఇలా అన్నాడు. (48)
శ్రీకృష్ణ ఉవాచ
స్నాతకాన్ బ్రాహ్మణాన్ రాజన్ విద్ధ్యస్మాంస్త్వం నరాధిప ।
స్నాతకవ్రతినో రాజన్ బ్రాహ్మణాః క్షత్రియా విశః ॥ 49
శ్రీకృష్ణుడు అన్నాడు - రాజా! నీవు మమ్ములను మావేషంచే స్నాతకవ్రతులైన బ్రాహ్మణులు అనుకొన్నావు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మువ్వురకూ స్నాతకవ్రతం ఉంది కదా! (49)
విశేషనియమాశ్చైషామ్ అవిశేషాశ్చ సంత్యుత ।
విశేషవాంశ్చ సతతం క్షత్రియః శ్రియమృచ్ఛతి ॥ 50
ఈ మూడు వర్ణాలలో కొందరు విశేషనియమాలు పాటిస్తారు. కొందరు సామాన్య నియమాలు పాటిస్తారు. విశేషనియమపాలకులైన క్షత్రియులు ఎల్లప్పుడు లక్ష్మిని పొందుతారు. (50)
పుష్పవత్సు ధ్రువా శ్రీశ్చ పుష్పవంత స్తతో వయమ్ ।
క్షత్రియో బాహువీర్యస్తు న తతా వాక్యవీర్యవాన్ ।
అప్రగల్భం వచస్తస్య తస్మాద్ బార్హద్రథేరితమ్ ॥ 51
ఎవరు పువ్వులను ధరిస్తారో వారు సంపదను పొందగలరు. కావున మేము పువ్వులను ధరించాము. క్షత్రియులు బాహు బలసంపన్నులు, మాటలలో పరాక్రమాన్ని ప్రదర్శింపరు. బృహద్రథకుమారా! అందువలన క్షత్రియులు వచనాలు వినయసహితాలని ప్రసిద్ధి. (51)
స్వవీర్యం క్షత్రియాణాం తు బాహ్వోర్ధాతా న్యవేశయత్ ।
తద్ దిదృక్షసి చేద్ రాజన్ ద్రష్టాస్యద్య న సంశయః ॥ 52
క్షత్రియులబలం బ్రహ్మ వారి భుజాల్లో ఉంచాడు. రాజా! అది నేడు చూడాలనుకొంటే తప్పక చూస్తావు. (52)
అద్వారేణ రిపోర్గేహం ద్వారేణ సుహృదో గృహాన్ ।
ప్రవిశంతి నరా ధీరా ద్వారాణ్యేతాని ధర్మతః ॥ 53
ధీరులు శత్రువుల గృహాల్లోకి గుమ్మాల గుండా ప్రవేశింపరు. మిత్రుల ఇండ్లను గుమ్మాల ద్వారా ప్రవేశిస్తారు. శత్రుమిత్రుల విషయాన ధర్మంగా ఇవియే ద్వారాలుగా చెప్పారు. (53)
కార్యవంతో గృహానేత్య శత్రుతో నార్హణాం వయమ్ ।
ప్రతిగృహ్ణీమ తద్ విద్ధి ఏతన్నః శాశ్వతం వతమ్ ॥ 54
మేము కార్యార్థులమై నీ ఇంటికి వచ్చాం. కావున శత్రువైల నీ నుండి పూజను గ్రహింపము. ఈ విషయాన్ని నీవు బాగా అర్థంచేసుకో. ఇది మాకు చాలాకాలం నుంచి వస్తున్న వ్రతం. (54)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి జరాసంధవధ పర్వణి శ్రీకృష్ణజరాసంధసంవాదే ఏకవింశోఽధ్యాయః ॥ 21 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున జరాసంధవధ పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణజరాసంధసంవాదమను ఇరువది ఒకటవ అధ్యాయము. (21)